కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పేదరికంలేని లోకం త్వరలోనే రానుంది

పేదరికంలేని లోకం త్వరలోనే రానుంది

పేదరికంలేని లోకం త్వరలోనే రానుంది

ఈ పత్రిక ముఖచిత్రంపై ఉన్న పరదైసులాంటి చిత్రాలు పేదరికంలో జీవించే ప్రజలను ఎంతో ఆకర్షిస్తాయి. మొదటి మానవ దంపతులైన ఆదాము హవ్వలు పరదైసులోనే జీవించారు. ఏదెను తోట వారి గృహంగా ఉండేది. (ఆదికాండము 2:7-23) ఆ పరదైసును వాళ్ళు పోగొట్టుకున్నా, భవిష్యత్తులో పరదైసు వస్తుందని, అంటే పేదరికం మచ్చుకైనా కనిపించని నూతనలోకం వస్తుందని నమ్మడం కేవలం ఒక కల కాదు. అది బైబిల్లోని వాగ్దానాలపై బలంగా ఆధారపడి ఉంది.

యేసుక్రీస్తు తన భూజీవితపు ఆఖరి రోజున చేసిన ఒక వాగ్దానాన్ని పరిశీలించండి. యేసుతోపాటు చనిపోయిన ఒక నేరస్థుడు, మానవుల సమస్యలను పరిష్కరించే సామర్థ్యం దేవునికి ఉందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఆయన ఇలా అన్నాడు: “యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము.” ఆ మాటలు, యేసు ఒక రాజుగా పరిపాలిస్తాడని, అప్పుడు ఆయన మృతులను తిరిగి జీవానికి తీసుకువస్తాడని ఆ నేరస్థుడు నమ్ముతున్నట్లు చూపిస్తున్నాయి. యేసు అతనికి ఇలా సమాధానమిచ్చాడు: “నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను.”​—⁠లూకా 23:42, 43.

పరదైసులో జీవించేవారి గురించి మాట్లాడుతూ బైబిలిలా చెబుతోంది: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు.” (యెషయా 65:21) అవును “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును; సైన్యములకధిపతియగు యెహోవామాట యిచ్చియున్నాడు.”​—⁠మీకా 4:⁠4.

అయితే ఇప్పుడు పేదరికం ఎందుకు అనుమతించబడింది? నిరుపేదలైన ప్రజలకు దేవుడు ఎలా సహాయం చేస్తాడు? చివరకు పేదరికం ఎప్పుడు అంతం అవుతుంది?

పేదరికం ఎందుకు అనుమతించబడింది?

దుష్ట ప్రాణి అయిన అపవాదియగు సాతాను రేపిన తిరుగుబాటు కారణంగా ఆదాము హవ్వలు తమ గృహమైన పరదైసును పోగొట్టుకున్నారు. సాతాను ఒక సర్పాన్ని తన సాధనంగా వాడుకొని, ఫలాని చెట్టు పండు తినకూడదు అని దేవుడిచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించేలా హవ్వను మోసగించాడు. దేవుని నుండి స్వతంత్రంగా ఉంటే మెరుగైన జీవితం జీవించవచ్చు అని అతను హవ్వను నమ్మించి తప్పుదోవ పట్టించాడు. నిషేధించబడిన ఆ పండును హవ్వ ఆదాముకు ఇచ్చినప్పుడు, ఆయన కూడా దానిని తిని, తన భార్య పక్షం వహించి దేవుణ్ణి తిరస్కరించాడు.​—⁠ఆదికాండము 3:1-6; 1 తిమోతి 2:14.

అలా తిరుగుబాటు చేసిన ఆ దంపతులను దేవుడు పరదైసునుండి వెళ్ళగొట్టాడు, అప్పటినుండి వాళ్ళు బ్రతకడానికి ఎన్నో బాధలు పడాల్సి వచ్చింది. పాపభరిత మానవులపై పరిపాలించడానికి యెహోవా నేటి వరకు సాతానును అనుమతించాడు, అలా చేయడం ద్వారా ఆయన అవిధేయతవల్ల వచ్చే పరిణామాలను స్పష్టం చేశాడు. మానవులు భూమిని పరదైసుగా చేయలేరని మానవ చరిత్ర నిరూపించింది. (యిర్మీయా 10:23) అలాగే దేవునినుండి స్వతంత్రంగా ఉండడం, పేదరికంతోపాటు ఎన్నో వినాశనకరమైన సమస్యలనూ తెచ్చిపెట్టింది.​—⁠ప్రసంగి 8:⁠9.

అయితే ఈ కష్టభరితమైన లోకంలో పేదవారు నిస్సహాయులుగా వదిలిపెట్టబడలేదు. దేవుని ప్రేరేపిత వాక్యమైన బైబిలులో వారి కోసం ఆధారపడదగిన మార్గనిర్దేశం ఉంది.

“చింతింపకుడి”

ఎంతోమంది పేదవారు కూడా ఉన్న ఒక పెద్ద సమూహంతో మాట్లాడుతూ యేసు ఇలా అన్నాడు: “ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా? . . . కాబట్టి, ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”​—⁠మత్తయి 6:26-33.

ఒక పేదవాడు దొంగిలించవలసిన అవసరం లేదు. (సామెతలు 6:30, 31) అతను తన జీవితంలో దేవునికి మొదటిస్థానమిస్తే అతని అవసరాలను దేవుడే తీరుస్తాడు. దక్షిణాఫ్రికాలోని లెసొతొకు చెందిన టుకిసో అనే వ్యక్తి విషయమే పరిశీలించండి. 1998లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటును అణచివేయడానికి విదేశీ దళాలు లెసొతొకు వచ్చాయి. అప్పుడు జరిగిన యుద్ధం కారణంగా దుకాణాలు దోచుకోబడ్డాయి, ప్రజల ఉద్యోగాలు పోయాయి, తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది.

టుకిసో, రాజధానిలో అత్యంత పేదవారు నివసించే ప్రాంతంలో నివసించేవాడు. ఆయన పొరుగువారిలో చాలామంది బ్రతకడానికి దుకాణాలను దోచుకునేవారు. ఒకరోజు టుకిసో తనుంటున్న చిన్నగదికి తిరిగి వచ్చినప్పుడు, తనతో కలిసి జీవిస్తున్న మసాసో అనే స్త్రీ తాను దోచుకొని వచ్చిన అనేక సరుకులతో కూర్చొని ఉండడాన్ని చూశాడు. “ఈ సరుకులను బయట పడెయ్యి” అని చెప్పి, దొంగిలించడం దేవుని నియమాలకు వ్యతిరేకమని వివరించాడు. మసాసో అతను చెప్పినట్లే చేసింది. పొరుగువారు వాళ్ళను ఎగతాళి చేసి, వాళ్ళు పడేసిన సరుకులను పట్టుకుపోయారు.

టుకిసో యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు నేర్చుకున్న విషయాలనుబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన దేవుని నియమాలకు విధేయత చూపించినందుకు పస్తులు ఉండాల్సి వచ్చిందా? లేదు. కొన్ని రోజుల తర్వాత టుకిసో కూటాలకు హాజరయ్యే సంఘ పెద్దలు ఆయనను కలుసుకొని, ఆయనకు కొంత ఆహారాన్ని తెచ్చి ఇచ్చారు. నిజానికి పొరుగునే ఉన్న దక్షిణాఫ్రికాలోని యెహోవాసాక్షులు లెసొతొలోని తమ క్రైస్తవ సహోదర సహోదరీల కోసం రెండు టన్నులకంటే ఎక్కువ సహాయ సమాగ్రిని పంపించారు. టుకిసో దేవునికి చూపిస్తున్న విధేయత, సంఘం అందించిన ప్రేమపూర్వకమైన సహాయం మసాసోను కదిలించాయి. ఆమె కూడా బైబిలును అధ్యయనం చేయడం ప్రారంభించింది. చివరకు వారిద్దరూ చట్టబద్ధంగా వివాహం చేసుకొని తద్వారా యెహోవాసాక్షులుగా బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులయ్యారు. వారు ఇప్పటికీ దేవునికి నమ్మకంగా సేవ చేస్తున్నారు.

యెహోవా దేవునికి పేదవారిపట్ల శ్రద్ధ ఉంది. (“దేవుడు పేదవారిని ఎలా దృష్టిస్తాడు?” అనే బాక్సు చూడండి.) టుకిసో, మసాసోలాంటి ఇతరులు తన గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి ఆయన ప్రేమతో ఏర్పాట్లు చేశాడు. ప్రతిదిన జీవితంలో సహాయపడే ఆచరణాత్మకమైన సలహాలను ఆయన తన వాక్యంలో అందించాడు.

ఒక చక్కని ఏర్పాటు

దేవునికి పేదవారిపట్ల ఉన్న శ్రద్ధను అనుకరించడానికి యెహోవాసాక్షులు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. (గలతీయులు 2:10) ఏదైనా దేశంలో విపత్తు సంభవించి నిజ క్రైస్తవులు దాని ప్రభావానికి గురైతే, తరచూ వారికి అవసరమైన సహాయం అందించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అన్నింటికంటే ప్రాముఖ్యంగా సాక్షులు పేదవారితోపాటు ప్రజలందరి ఆధ్యాత్మిక అవసరాలపట్ల శ్రద్ధ చూపిస్తారు. (మత్తయి 9:36-38) గత 60 సంవత్సరాల్లో శిక్షణ పొందిన సేవకులు వేలాదిమంది వేర్వేరు దేశాల్లో మిషనరీలుగా సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకువచ్చారు. ఉదాహరణకు, ఫిన్‌లాండ్‌నుండి వచ్చిన ఒక మిషనరీ జంట సెసొథొ భాష నేర్చుకొని టుకిసోకి మసాసోకి యేసు శిష్యులయ్యేందుకు సహాయం చేశారు. (మత్తయి 28:19, 20) అలాంటి మిషనరీ సేవ చేయడానికి ముందుకు వచ్చేవారు తరచూ సంపన్న దేశంలోని సౌకర్యవంతమైన జీవితాన్ని త్యాగం చేసి పేద దేశానికి వెళ్లవలసి ఉంటుంది.

నిజ క్రైస్తవులు దొంగిలించడాన్ని బ్రతుకుతెరువుకు ఒక మార్గంగా ఎంపిక చేసుకోరు. దానికి బదులుగా తమ అవసరాలు తీర్చే సామర్థ్యం యెహోవా దేవునికి ఉందని వారు విశ్వసిస్తారు. (హెబ్రీయులు 13:5, 6) యెహోవా తన ప్రజల అవసరాలను తీర్చడానికి ఉపయోగించే ఒక మార్గం ఆయన ఆరాధకుల ప్రపంచవ్యాప్త సంస్థ. ఆ సంస్థలోనివారు ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ చూపిస్తారు.

యెహోవా పేదవారికి సహాయం చేసే మరో మార్గం, వారి అనుదిన జీవితానికి అవసరమైన ఆచరణాత్మకమైన సలహాలను ఇవ్వడం. ఉదాహరణకు, బైబిలు ఇలా ఆజ్ఞాపిస్తోంది: “దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.” (ఎఫెసీయులు 4:27-28) చాలామంది నిరుద్యోగులు కూరగాయలు పండించడంవంటి పనులను ప్రారంభించి తమకుతామే ఉద్యోగాలను కల్పించుకోగలిగారు. మద్యపానీయాల దుర్వినియోగం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండమని బోధించడం ద్వారా, పేదవారు డబ్బు ఆదా చేసుకోవడానికి కూడా బైబిలు సహాయం చేస్తుంది.​—⁠ఎఫెసీయులు 5:18.

పేదరికంలేని లోకం​—⁠ఎప్పుడు వస్తుంది?

సాతాను పరిపాలన యొక్క “అంత్యదినములలో” మనం జీవిస్తున్నామని బైబిలు సూచిస్తోంది. (2 తిమోతి 3:1) త్వరలోనే యెహోవా మానవాళికి తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తును పంపిస్తాడు. అప్పుడు ఏమి జరుగుతుంది? యేసు తాను చెప్పిన ఒక ఉపమానంలో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఆయన ఇలా చెప్పాడు: “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును.”​—⁠మత్తయి 25:31-33.

ఈ ఉపమానంలోని గొర్రెలు, యేసు రాజ్యాధికారానికి లోబడే ప్రజలు. వారు యేసును తమ కాపరిగా భావించి ఆయనను అనుసరిస్తారు కాబట్టి ఆయన వారిని గొర్రెలతో పోల్చాడు. (యోహాను 10:16) ఈ గొర్రెల్లాంటి ప్రజలు యేసు పరిపూర్ణ పరిపాలన క్రింద జీవం పొందుతారు. అది పేదరికంలేని నూతనలోకంలో గడిపే ఆనందకరమైన జీవితంగా ఉంటుంది. యేసు పరిపాలనను తిరస్కరించే మేకల్లాంటి ప్రజలు శాశ్వతంగా నిర్మూలించబడతారు.​—⁠మత్తయి 25:46.

దేవుని రాజ్యం దుష్టత్వాన్ని అంతం చేస్తుంది. అప్పుడు పేదరికం గతించిన సంగతిగా ఉంటుంది. భూమిపై నివసించే ప్రజలు ఒకరినొకరు ప్రేమించేవారిగా, ఒకరిపట్ల ఒకరు శ్రద్ధ చూపించేవారిగా ఉంటారు. అలాంటి నూతనలోకం సాధ్యమే అనే విషయం యెహోవాసాక్షుల ప్రేమపూర్వక అంతర్జాతీయ సహోదరత్వాన్ని చూస్తే తెలుస్తుంది, ఎందుకంటే యేసు ఇలా చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.”​—⁠యోహాను 13:35.

[6, 7వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

దేవుడు పేదవారిని ఎలా దృష్టిస్తాడు?

బైబిలు మానవాళి సృష్టికర్తను “ఆకలిగొనినవారికి ఆహారము దయచేయు” దేవుడని వర్ణిస్తోంది. (కీర్తన 146:7) పేదవారిపట్ల దేవునికున్న శ్రద్ధను నొక్కి చెప్పే వందకంటే ఎక్కువ వచనాలు దానిలో ఉన్నాయి.

ఉదాహరణకు, యెహోవా ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు, తమ పొలాల ఓరలను పూర్తిగా కోయకూడదని ఇశ్రాయేలీయులైన రైతులకు ఆజ్ఞాపించాడు. అలాగే ఒలీవ చెట్లకు, ద్రాక్షా చెట్లకు విడిచిపెట్టిన పండ్లను తిరిగి ఏరుకోకూడదని కూడా వారికి ఆజ్ఞాపించబడింది. ఆ ఆజ్ఞలు పరదేశులకు, అనాథలకు, విధవరాండ్రకు, కష్టాల్లో ఉన్న ఇతరులకు ఒక ప్రేమపూర్వకమైన ఏర్పాటుగా ఉన్నాయి.​—⁠లేవీయకాండము 19:9, 10; ద్వితీయోపదేశకాండము 24:19-21.

అంతేకాకుండా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు: “విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు. వారు నీచేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱపెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను, మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేనివారగుదురు.” (నిర్గమకాండము 22:22-24) విచారకరంగా చాలామంది సంపన్నులైన ఇశ్రాయేలీయులు ఆ మాటలను పెడచెవిన పెట్టారు. వారలా చేసినందుకు, ఇతర తప్పులు చేసినందుకు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు తన ప్రవక్తల ద్వారా ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు. (యెషయా 10:1, 2; యిర్మీయా 5:28; ఆమోసు 4:1-3) చివరకు, అష్షూరీయులు, ఆ తర్వాత బబులోనీయులు ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకొనేలా దేవుడు అనుమతించాడు. చాలామంది ఇశ్రాయేలీయులు చంపబడ్డారు, మిగిలినవారు వేరే దేశాలకు బంధీలుగా తీసుకెళ్ళబడ్డారు.

దేవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు తన తండ్రికి పేదవారిపట్ల ఉన్న ప్రేమపూర్వకమైన శ్రద్ధను ప్రతిబింబించాడు. ఆయన తన పరిచర్య ఉద్దేశాన్ని వివరిస్తూ ఇలా చెప్పాడు: “ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను.” (లూకా 4:18) అంటే యేసు తన పరిచర్యను కేవలం పేదవారికి మాత్రమే పరిమితం చేశాడని కాదు. ఆయన సంపన్నులకు కూడా ప్రేమపూర్వకంగా సహాయం చేశాడు. అయితే ఆయన సంపన్నులకు సహాయం చేసేటప్పుడు కూడా తరచూ పేదవారి గురించి తనకున్న చింతను వ్యక్తం చేశాడు. ఉదాహరణకు, ఆయన ఒక సంపన్న అధికారికి ఈ సలహా ఇచ్చాడు: “నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుము.”​—⁠లూకా 14:1, 12-14; 18:18, 22; 19:1-10.

యెహోవా దేవునికి, ఆయన కుమారునికి పేదవారి గురించి ప్రగాఢమైన శ్రద్ధ ఉంది. (మార్కు 12:41-44; యాకోబు 2:1-6) యెహోవా పేదవారిపట్ల తనకున్న శ్రద్ధకు నిదర్శనంగా, చనిపోయిన కోట్లాదిమంది పేదవారిని జ్ఞాపకముంచుకున్నాడు. పేదరికంలేని నూతనలోకంలో వారందరూ పునరుత్థానం చేయబడతారు.​—⁠అపొస్తలుల కార్యములు 24:14.

[చిత్రాలు]

నూతనలోకం సాధ్యమేనని యెహోవాసాక్షుల అంతర్జాతీయ సహోదరత్వం చూపిస్తోంది

[5వ పేజీలోని చిత్రం]

టుకిసోతో బైబిలును అధ్యయనం చేసిన మిషనరీతో టుకిసో, మసాసో

[5వ పేజీలోని చిత్రం]

తనతో బైబిలు అధ్యయనం చేసిన మిషనరీతో తన ఇంటిముందు నిలబడిన మసాసో