మానవుడు పేదరికాన్ని అంతం చేయగలడా?
మానవుడు పేదరికాన్ని అంతం చేయగలడా?
కోట్లాదిమంది పేదరికమంటే ఏమిటో తెలియకుండానే పెరిగారు. వాళ్ళు ఆకలితో పడుకోవలసిన అవసరం గాని, చలికి వణుకుతూ నిద్రపోవలసిన అవసరం గాని రాలేదు. అయినప్పటికీ వారిలో చాలామంది పేదవారిని చూసి జాలిపడతారు, వాళ్ళకు సహాయం చేయడానికి అదనపు కృషి చేస్తారు.
అయితే అంతర్యుద్ధాలు, వరదలు, అనావృష్టి, ఇంకా ఇతర సమస్యలతో పీడించబడుతున్న ప్రజలకు పేదరికం ఒక క్రూరమైన వాస్తవంగా ఉంది. ఆఫ్రికాలోని రైతు కూలీలకు పైన పేర్కొనబడినవి పీడకలల్లా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల కారణంగా కొందరు గతిలేక తమ ఇళ్ళు వదిలి పెద్ద నగరాలకు వెళ్ళవలసి వచ్చింది లేదా మరో దేశంలో శరణార్థులుగా జీవించవలసి వచ్చింది. గ్రామాల్లో నివసించే ఇతరులు మెరుగైన జీవితం జీవించవచ్చు అనే ఆశలకులోనై నగరాలకు తరలి వెళతారు.
జనంతో క్రిక్కిరిసిపోయే నగరాలు తరచూ పేదరికం పెరగడానికి అనువైన స్థలాలుగా మారతాయి. పంటలు పండించే స్థలం ఉండదు. ఉద్యోగం దొరకడం కష్టం. నిరాశానిస్పృహలకు లోనైన ప్రజలు నేర జీవితానికి అలవాటుపడతారు. నగరవాసులు సహాయం కోసం వేడుకుంటారు, కానీ మానవ ప్రభుత్వాలు మాత్రం పెరిగిపోతున్న పేదరికపు సమస్యను పరిష్కరించలేకపోతున్నాయి. 2003, నవంబరులో విడుదల చేయబడిన ఐక్యరాజ్య సమితి నివేదికను ఉదాహరిస్తూ లండన్‌కు చెందిన ది ఇండిపెండెంట్ వార్తాపత్రిక ఇలా చెప్పింది: “ప్రపంచపు ఆకలి రోజు రోజుకీ పెరుగుతోంది.” ఆ పత్రిక ఇంకా ఇలా నివేదించింది: “నేడు ప్రపంచవ్యాప్తంగా 84.2 కోట్లమంది కుపోషణతో బాధపడుతున్నారని అంచనా వేయబడింది, ఆ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది, దానికి ప్రతి సంవత్సరం మరో 50 లక్షలమంది తోడవుతున్నారు.”
దక్షిణాఫ్రికాలోని యెహోవాసాక్షుల కార్యాలయానికి కొన్నిసార్లు నిరుపేదలనుండి ఉత్తరాలు వస్తుంటాయి. ఉదాహరణకు, బ్లొయెమ్‌ఫాంటేన్ అనే నగరం నుండి ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు: “నేనొక నిరుద్యోగిని, అవకాశం దొరికినప్పుడల్లా నేను నగరంలో దొంగతనాలు చేస్తుంటాను. నేను అలా దొంగతనం చేయకపోతే, మేము చాలా రోజులపాటు ఆకలితో అలమటించాలి, ఎముకలు కొరికే చలి గురించి ఇంక వేరే చెప్పనక్కర్లేదు. ఇక్కడ అస్సలు పని దొరకడం లేదు. చాలామంది పని కోసం, ఆహారం కోసం వీధులు పట్టుకు తిరుగుతున్నారు. కొందరు చెత్తకుండీల్లో ఆహారం వెతుక్కోవడం నాకు తెలుసు. కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. చాలామంది నాలాగే మానసికంగా కృంగిపోయి, నిరాశానిస్పృహలతో ఉన్నారు. భవిష్యత్తు అగమ్యగోచరంగా అనిపిస్తుంది. ఆహారం తిని, బట్టలు వేసుకోవలసిన అవసరతతో మనల్ని సృష్టించిన దేవునికి ఇవన్నీ పట్టవా?”
ఆ వ్యక్తి చింతలకు ఓదార్పుకరమైన జవాబులు ఉన్నాయి. తర్వాతి ఆర్టికల్ చూపిస్తున్నట్లుగా, ఆ జవాబులు దేవుని వాక్యమైన బైబిల్లో లభిస్తాయి.