కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రెండవ సమూయేలు పుస్తకంలోని ముఖ్యాంశాలు

రెండవ సమూయేలు పుస్తకంలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

రెండవ సమూయేలు పుస్తకంలోని ముఖ్యాంశాలు

యెహోవా సర్వాధిపత్యాన్ని గుర్తించడమంటే, మనం ఆయనకు పరిపూర్ణ విధేయత చూపించాలని దానర్థమా? యథార్థత చూపించే వ్యక్తి ఎల్లప్పుడూ దేవుని దృష్టిలో సరైనదే చేస్తాడా? ఎలాంటి వ్యక్తులు దేవుని “చిత్తానుసారమైన మనస్సుగల” వారిగా ఉంటారు? (1 సమూయేలు 13:14) ఈ ప్రశ్నలకు రెండవ సమూయేలు పుస్తకం సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తోంది.

రెండవ సమూయేలు పుస్తకాన్ని గాదు, నాతాను ప్రవక్తలు వ్రాశారు, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదుకు ఆ ఇద్దరూ చాలా సన్నిహితులు. * దావీదు 40 సంవత్సరాల పరిపాలన ముగింపుకొచ్చే కాలంలో అంటే సా.శ.పూ. 1040లో పూర్తిచేయబడిన ఆ పుస్తకం, ప్రాథమికంగా దావీదు గురించి యెహోవాతో ఆయనకున్న సంబంధం గురించి నివేదిస్తోంది. హృదయాన్ని ఉత్తేజపరిచే ఆ వృత్తాంతం, పోరాటాలతో నిండిన జనాంగం ధైర్యశాలియైన ఒక రాజు పరిపాలనలో సుభిక్షమైన ఐక్యతగల రాజ్యంగా ఎలా మారిందో తెలియజేస్తోంది. ఈ ఉత్కంఠభరితమైన కథనం ఎంతో ప్రగాఢంగా వ్యక్తం చేయబడిన మానవ భావోద్వేగాలతో నిండివుంది.

దావీదు “అంతకంతకు వర్ధిల్లెను”

(2 సమూయేలు 1:1-10:19)

సౌలు, యోనాతాను చనిపోయారని తెలిసినప్పుడు దావీదు స్పందించిన విధానం, వారిద్దరిపట్లా యెహోవాపట్లా ఆయనకున్న భావాలను వెల్లడి చేస్తోంది. హెబ్రోనులో యూదా గోత్రానికి దావీదు రాజుగా నియమించబడ్డాడు. మిగతా ఇశ్రాయేలుపై సౌలు కుమారుడైన ఇష్బోషెతు రాజయ్యాడు. అయితే దావీదు ‘అంతకంతకు వర్ధిల్లాడు.’ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఆయన ఇశ్రాయేలంతటిపై రాజుగా నియమించబడ్డాడు.​—⁠2 సమూయేలు 5:10.

దావీదు యెరూషలేమును యెబూసీయులనుండి స్వాధీనపర్చుకొని దానిని తన రాజ్యానికి రాజధానిగా చేసుకున్నాడు. నిబంధనా మందసాన్ని యెరూషలేముకు తెప్పించడానికి ఆయన చేసిన మొదటి ప్రయత్నం విపత్తుకు కారణమయ్యింది. అయితే, ఆయన చేసిన రెండవ ప్రయత్నం సఫలమయ్యింది, దానితో దావీదు ఆనందంతో నాట్యం చేశాడు. యెహోవా దావీదుతో ఒక రాజ్య నిబంధన చేశాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్న కారణంగా ఆయన తన శత్రువులను జయిస్తూ ముందుకు సాగాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:​18​—⁠యోవాబు, ఆయన ఇద్దరు సహోదరులు తమ తల్లియైన సెరూయా ముగ్గురు కుమారులుగా ఎందుకు పిలువబడ్డారు? హీబ్రూ లేఖనాల్లో వంశానుక్రమాలు సాధారణంగా తండ్రి వైపునుండి లెక్కించబడేవి. సెరూయా భర్త అకాలంగా మరణించి ఉండవచ్చు, లేదా పరిశుద్ధ లేఖనాల్లో చేర్చబడేందుకు తగనివాడిగా పరిగణించబడి ఉండవచ్చు. సెరూయా దావీదు తోబుట్టువు లేదా సవతి చెల్లి కాబట్టి ఆమె పేరు నమోదు చేయబడి ఉండవచ్చు. (1 దినవృత్తాంతములు 2:15, 16) ఆ ముగ్గురు సహోదరుల తండ్రి గురించి కేవలం బేత్లెహేములోవున్న అతని సమాధికి సంబంధించి మాత్రమే ప్రస్తావించబడింది.​—⁠2 సమూయేలు 2:32.

3:​29​—⁠“కఱ్ఱపట్టుకొని నడుచువాడు” అనే మాటలకు భావమేమిటి? ఆదిమ గ్రీకు భాషలో ఆ మాటలు “నూలు వడికే కుదురు పట్టుకొని నడిచేవాడు” అని ఉన్నాయి. సాధారణంగా స్త్రీలే నేతపని చేసేవారు. కాబట్టి ఆ మాటలు, యుద్ధం చేయడంలాంటి పనులకు పనికిరానందువల్ల సాధారణంగా స్త్రీలు చేసే పనులు చేయవలసి వచ్చే పురుషులను సూచిస్తుండవచ్చు.

5:​1, 2​—⁠ఇష్బోషెతు చంపబడిన తర్వాత ఎంతకాలానికి దావీదు ఇశ్రాయేలంతటిపై రాజుగా చేయబడ్డాడు? ఇష్బోషెతు తన రెండేళ్ళ పరిపాలనను సౌలు మరణించిన వెంటనే ప్రారంభించి ఉంటాడు అని అంచనా వేయడం సహేతుకంగా ఉన్నట్లనిపిస్తుంది. అదే సమయానికి దావీదు కూడా హెబ్రోనులో తన పరిపాలనను ప్రారంభించాడు. దావీదు హెబ్రోనునుండి యూదాను ఏడున్నర సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన ఇశ్రాయేలంతటిపై రాజైన వెంటనే తన రాజధానిని యెరూషలేముకు మార్చుకున్నాడు. కాబట్టి ఇష్బోషెతు మరణించాక ఇశ్రాయేలంతటిపై దావీదు రాజు కావడానికి ముందు ఐదు సంవత్సరాలు గడిచాయి.​—⁠2 సమూయేలు 2:3, 4, 8-11; 5:4, 5.

8:​9​—⁠ఇశ్రాయేలుతో యుద్ధం ముగిసిన తర్వాత ఎంతమంది మోయాబీయులు హతమార్చబడ్డారు? ఆ సంఖ్య లెక్కించడం ద్వారా కాక కొలవడం ద్వారా నిర్ధారించబడి ఉండవచ్చు. దావీదు ఓడిపోయిన మోయాబీయులను నేలపై ఒకరి పక్కన ఒకరు వరుసగా పడుకొమ్మని చెప్పినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన ఆ వరుసను ఒక తాడుతో కొలిపించాడు. రెండు తాడుల పొడవు వరకూ ఉన్నవారిని హతమార్చి, ఒక తాడు పొడవు వరకు ఉన్నవారిని అంటే మూడింట ఒక వంతు మోయాబీయులను విడిచిపెట్టాడు.

మనకు పాఠాలు:

2:⁠1; 5:19, 23. దావీదు హెబ్రోనులో నివాసమేర్పరచుకోవడానికి ముందు, తన శత్రువులతో యుద్ధం చేయడానికి ముందు యెహోవాయొద్ద విచారణ చేశాడు. మనం కూడా మన ఆధ్యాత్మికతపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునేటప్పుడు యెహోవా మార్గనిర్దేశం కోసం చూడాలి.

3:​26-30. పగ తీర్చుకోవాలనుకోవడం విచారకరమైన పరిణామాలకు నడిపిస్తుంది.​—⁠రోమీయులు 12:17-19.

3:​31-34; 4:​9-12. దావీదు పగ తీర్చుకోవాలనుకోకుండా ఉండడం, ప్రతికూలంగా ప్రవర్తించకుండా ఉండడం మాదిరికరమైనవి.

5:​12. యెహోవా తన మార్గాల గురించి మనకు నేర్పించాడని, తనతో మంచి సంబంధం కలిగివుండడాన్ని సాధ్యం చేశాడని మనం ఎన్నడూ మరచిపోకూడదు.

6:​1-7. దావీదు ఉద్దేశాలు మంచివే అయినా, నిబంధనా మందసాన్ని బండిపై పెట్టి తీసుకువెళ్ళడం యెహోవా ఆజ్ఞకు విరుద్ధమైనది, కాబట్టి అది సఫలం కాలేదు. (నిర్గమకాండము 25:13, 14; సంఖ్యాకాండము 4:15, 19; 7:7-9) ఉజ్జా మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం కూడా మంచి ఉద్దేశాలు ఉన్నంత మాత్రాన అవి దేవుని ఆజ్ఞలను మార్చవని చూపిస్తోంది.

6:​8, 9. పరీక్షాపూర్వక పరిస్థితి ఎదురైనప్పుడు దావీదు మొదట వ్యాకులపడ్డాడు, ఆ తర్వాత భయపడ్డాడు, జరిగినదానికి యెహోవాయే బాధ్యుడు అని అనుకొని ఉంటాడు. మనం యెహోవా ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయడంవల్ల ఎదురైన సమస్యలకు ఆయనపై నింద వేయకుండా జాగ్రత్తపడాలి.

7:​18, 22, 23, 26. దావీదు వినయం, యెహోవాపట్ల ఆయనకున్న అవిభాగిత భక్తి, దేవుని నామాన్ని ఘనపర్చడంలో ఆయన చూపించిన ఆసక్తి మనం అనుకరించవలసిన లక్షణాలు.

8:⁠2. దాదాపు 400 సంవత్సరాల క్రితం ఇవ్వబడిన ప్రవచనం నెరవేరింది. (సంఖ్యాకాండము 24:17) యెహోవా వాక్కు ఎల్లప్పుడూ నిజమవుతుంది.

9:​1, 6, 7. దావీదు తన మాట నిలబెట్టుకున్నాడు. మనం కూడా మన మాట నిలబెట్టుకోవడానికి కృషి చేయాలి.

యెహోవా తాను అభిషేకించిన వ్యక్తికి అపాయము పుట్టించాడు

(2 సమూయేలు 11:1-20:26)

యెహోవా దావీదుతో ఇలా అన్నాడు: “నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును.” (2 సమూయేలు 12:11, 12) యెహోవా అలా చెప్పడానికిగల కారణమేమిటి? దావీదు బత్షెబతో చేసిన పాపమే. పశ్చాత్తాపం చూపించిన దావీదు క్షమించబడినా, ఆయన చేసిన పాపపు పరిణామాలను మాత్రం తప్పించుకోలేకపోయాడు.

మొదట బత్షెబకు పుట్టిన బిడ్డ మరణించింది. ఆ తర్వాత దావీదు కుమార్తె తామారును ఆమె సహోదరుడు అమ్నోను బలాత్కారం చేశాడు. ఆమె తోబుట్టువైన అబ్షాలోము కోపంతో అమ్నోనును హత్య చేశాడు. అబ్షాలోము తన స్వంత తండ్రికి ద్రోహం తలపెట్టి హెబ్రోనులో తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. దావీదు యెరూషలేమును వదిలి పారిపోవలసి వచ్చింది. ఇంటిని చూసుకోవడానికి దావీదు వదిలి వెళ్ళిన పదిమంది ఉపపత్నులతో అబ్షాలోము లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. అబ్షాలోము చంపబడిన తర్వాతే దావీదుకు తిరిగి రాజ్యాధికారం లభించింది. బెన్యామీనీయుడైన షెబ చేసిన తిరుగుబాటు చివరకు అతని మరణంతో ముగిసింది.

ఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

14:​7​—⁠“నిప్పురవ్వ” దేనిని సూచిస్తుంది? మండుతూ ఉండే నిప్పురవ్వ బ్రతికివున్న కుమారులను సూచించడానికి ఉపయోగించబడుతుంది.

19:​29​—⁠మెఫీబోషెతు ఇచ్చిన వివరణకు దావీదు ఎందుకలా స్పందించాడు? మెఫీబోషెతు చెప్పినది విన్న తర్వాత, జీబా చెప్పిన మాటలు నిజమో కాదో తేల్చుకోకుండానే నమ్మి తాను తప్పు చేశానని దావీదు గ్రహించి ఉంటాడు. (2 సమూయేలు 16:1-4; 19:24-28) అది ఆయనకు కోపం తెప్పించి ఉంటుంది, కాబట్టి ఆ విషయంలో ఆయన ఇంకేమీ వినదల్చుకోలేదు.

మనకు పాఠాలు:

11:​2-15. దావీదు తప్పులను తెలియజేసే నిష్పాక్షికమైన ఈ వృత్తాంతం, బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమనే సత్యానికి రుజువుగా ఉంది.

11:​16-27. మనం ఏదైనా గంభీరమైన పాపం చేసినప్పుడు, దావీదు చేసినట్లు దానిని కప్పి ఉంచడానికి ప్రయత్నించకూడదు. మనం మన పాపాన్ని యెహోవా ఎదుట ఒప్పుకొని, సంఘ పెద్దల సహాయం తీసుకోవాలి.​—⁠సామెతలు 28:13; యాకోబు 5:13-16.

12:​1-14. నాతాను సంఘ పెద్దలకు ఒక మంచి మాదిరి ఉంచాడు. పాపం చేసినవారు తమ తప్పును సరిదిద్దుకోవడానికి వారు సహాయం చేయాలి. పెద్దలు తమకు అప్పగించబడిన ఆ బాధ్యతను నైపుణ్యవంతంగా నిర్వహించాలి.

12:​15-23. తనకు జరిగినదాన్ని సరైన దృక్కోణంలో చూడడం ద్వారా దావీదు తనకెదురైన కష్టాలకు సరైన విధంగా స్పందించగలిగిగాడు.

15:​12; 16:​15, 21, 23. అబ్షాలోము సింహాసనాన్ని అధిరోహిస్తాడు అని స్పష్టమైనప్పుడు, ప్రజ్ఞగల మంత్రియైన అహీతోపెలు గర్వం, పదవీ వ్యామోహం కారణంగా నమ్మకద్రోహిగా మారాడు. వినయం, విశ్వాసం లేని ప్రజ్ఞ ఉరిగా మారగలదు.

19:​24, 30. దావీదు చూపించిన ప్రేమపూర్వకమైన దయపట్ల మెఫీబోషెతు నిజమైన కృతజ్ఞతను చూపించాడు. ఆయన జీబా విషయంలో రాజు తీసుకున్న నిర్ణయానికి ఇష్టపూర్వకంగా లోబడ్డాడు. యెహోవాపట్ల, ఆయన సంస్థపట్ల మనకున్న కృతజ్ఞత మనం విధేయత చూపించడానికి మనల్ని ప్రేరేపించాలి.

20:​21, 22. ఒక వ్యక్తి చూపించే వివేచన ఎంతోమందిని ప్రమాదంనుండి కాపాడగలదు.​—⁠ప్రసంగి 9:14, 15.

“యెహోవా చేతిలోనే పడుదుము గాక”

(2 సమూయేలు 21:1-24:25)

గిబియోనీయులను చంపడం ద్వారా సౌలు మూటగట్టుకున్న రక్తాపరాధం కారణంగా మూడు సంవత్సరాలపాటు ఆహార కొరత ఏర్పడింది. (యెహోషువ 9:15) ఆ రక్తాపరాధానికి ప్రతిగా గిబియోనీయులు తాము హతమార్చడానికి సౌలు ఏడుగురు కుమారులను అప్పగించమని అడిగారు. దావీదు వారిని గిబియోనీయుల చేతికి అప్పగించాడు, అప్పుడు వర్షం కురవడంతో అనావృష్టి ఆగిపోయింది. నలుగురు ఫిలిష్తీయులు “దావీదువలనను అతని సేవకులవలనను హతులైరి.”​—⁠2 సమూయేలు 21:22.

దావీదు చట్టవిరుద్ధంగా ప్రజా సంఖ్యను లెక్కించమని ఆజ్ఞాపించడం ద్వారా గంభీరమైన పాపం చేశాడు. ఆయన ఆ తర్వాత పశ్చాత్తాపపడి ‘యెహోవా చేతిలోనే పడడానికి’ ఎంపిక చేసుకున్నాడు. (2 సమూయేలు 24:14) తత్ఫలితంగా 70,000 మంది తెగులుతో మరణించారు. దావీదు యెహోవా ఆజ్ఞను అనుసరించినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

21:​8​—⁠సౌలు కుమార్తెయైన మీకాలు కుమారులు పుట్టకుండానే చనిపోయిందని 2 సమూయేలు 6:⁠23 చెబుతుండగా, ఈ వచనం అధస్సూచి ప్రకారం మీకాలుకు ఐదుగురు కుమారులు ఉన్నట్లు ఎలా చెప్పవచ్చు? చాలామంది అంగీకరించే వివరణ ప్రకారం, వాళ్ళు అద్రీయేలును పెళ్ళి చేసుకున్న మీకాలు సహోదరి మెరాబు కుమారులే, అందుకే వచనంలో మీకాలు అని కాకుండా మెరాబు అని ఇవ్వబడింది. బహుశా మెరాబు మీకాలుకంటే ముందే చనిపోయినందువల్ల మీకాలు ఆ పిల్లలను పెంచి ఉండవచ్చు.

21:​9, 10​—⁠గిబియోనీయులు హతమార్చిన తన ఇద్దరు కుమారుల కళేబరాలను, సౌలు ఐదుగురు మనవళ్ళ కళేబరాలను రిస్పా ఎంతకాలం వరకూ కనిపెట్టుకొని కూర్చుంది? ఆ ఏడుగురు వ్యక్తులు “కోతకాలమున” అంటే మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో ఉరి తీయబడ్డారు. వాళ్ళ శవాలు కొండపై వదిలివేయబడ్డాయి. యెహోవా అనావృష్టిని అంతం చేసి తన కోపం చల్లారిందని చూపించే వరకూ రిస్పా ఆ ఏడుగురి శవాలకు రాత్రింబగళ్ళు కాపలా కాసింది. అక్టోబరు నెలలో కోతకాలం ముగిసేవరకూ పెద్దగా వర్షాలు పడవు. కాబట్టి రిస్పా ఐదారు నెలల వరకూ ఆ శవాలను కనిపెట్టుకొని ఉండవచ్చు. ఆ తర్వాత దావీదు ఆ వ్యక్తుల ఎముకలను పాతిపెట్టించాడు.

24:​1​—⁠ప్రజా సంఖ్యను లెక్కించడం గంభీరమైన పాపంగా ఎందుకు పరిగణించబడింది? ప్రజా సంఖ్యను లెక్కించడం ధర్మశాస్త్రం ప్రకారం నిషేధించబడలేదు. (సంఖ్యాకాండము 1:1-3; 26:1-4) దావీదు ఏ ఉద్దేశంతో జనుల సంఖ్యను లెక్కించాడో కూడా బైబిలు చెప్పడం లేదు. అయితే ఆయన సాతాను ప్రేరణ ద్వారా అలా చేశాడని 1 దినవృత్తాంతములు 21:1 చెబుతోంది. ఏదేమైనా, ప్రజా సంఖ్యను లెక్కించాలని దావీదు తీసుకున్న నిర్ణయం తప్పని ఆయన సైన్యాధిపతియైన యోవాబుకు తెలుసు, అందుకే యోవాబు ఆ పని చేయకుండా దావీదును నివారించడానికి ప్రయత్నించాడు.

మనకు పాఠాలు:

22:​2-51. యెహోవాయే సత్య దేవుడని, ఆయన మన పరిపూర్ణ విశ్వాసానికి అర్హుడని దావీదు పాట ఎంత అద్భుతంగా వర్ణిస్తుందో కదా!

23:​15-17. జీవానికి, రక్తానికి సంబంధించి దేవుడిచ్చిన ఆజ్ఞపట్ల దావీదుకు ఎంత ప్రగాఢమైన గౌరవం ఉండేదంటే, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినట్లు అవుతుంది అనిపించే పనిని కూడా చేయకుండా ఉండిపోయాడు. మనం దేవుని ఆజ్ఞలన్నింటి విషయంలో అదే మనోవైఖరిని పెంపొందించుకోవాలి.

24:​10. దావీదు మనస్సాక్షి ఆయన పశ్చాత్తాపపడేలా చేసింది. మన మనస్సాక్షి ఆ విధంగా స్పందించగలిగేంత సున్నితంగా ఉందా?

24:​14. యెహోవా మానవులకంటే ఎక్కువ దయగలవాడని దావీదుకు తెలుసు. మనకు అలాంటి దృఢనమ్మకం ఉందా?

24:​17. తన పాపం మొత్తం జనాంగానికి బాధలు తెచ్చిందని దావీదు ఎంతో బాధపడ్డాడు. తన తప్పిదం విషయంలో పశ్చాత్తాపపడుతున్న వ్యక్తి తాను చేసిన పనివల్ల సంఘానికి వచ్చిన నింద విషయంలో అలాగే భావించాలి.

దేవుని ‘చిత్తానుసారమైన మనస్సుగలవారిగా’ ఉండడం మనకు సాధ్యమే

ఇశ్రాయేలు రెండవ రాజు దేవుని ‘చిత్తానుసారమైన మనస్సుగల’ వ్యక్తిగా ప్రవర్తించాడు. (1 సమూయేలు 13:14) దావీదు ఎన్నడూ యెహోవా నీతియుక్త ప్రమాణాలను ప్రశ్నించలేదు, దేవుని నుండి వేరై స్వతంత్రంగా ప్రవర్తించాలని కూడా ప్రయత్నించలేదు. దావీదు తప్పు చేసిన ప్రతీసారి, తన తప్పును ఒప్పుకొని, క్రమశిక్షణను అంగీకరించి, తన ప్రవర్తనను సరిదిద్దుకున్నాడు. దావీదు యథార్థతగల వ్యక్తి. మనం తప్పు చేసినప్పుడు ఆయనలాగే ఉండవద్దా?

యెహోవా సర్వాధిపత్యాన్ని గుర్తించడమంటే మంచి చెడ్డల విషయంలో ఆయన ఉంచిన ప్రమాణాలను స్వీకరించి, యథార్థతగలవారిగా వాటికి కట్టుబడి ఉండడానికి కృషి చేయడమేనని దావీదు జీవిత కథ స్పష్టంగా చూపిస్తోంది. అలా చేయడం మనకు సాధ్యమే. రెండవ సమూయేలు పుస్తకం నుండి మనం నేర్చుకున్న పాఠాలకు మనం ఎంత కృతజ్ఞులుగా ఉండాలో కదా! ఈ పుస్తకంలోని ప్రేరేపిత సందేశం నిజంగానే సజీవమైనది, బలముగలది.​—⁠హెబ్రీయులు 4:12.

[అధస్సూచి]

^ పేరా 4 ఈ పుస్తకాన్ని వ్రాయడంలో సమూయేలుకు ఎటువంటి భాగం లేకపోయినా, దానికి ఆయన పేరు పెట్టబడింది, ఎందుకంటే సమూయేలు పుస్తకాలు రెండూ మొదట్లో హీబ్రూ ప్రామాణిక పుస్తక సంచయంలో ఒకే పుస్తకంగా ఉండేవి. మొదటి సమూయేలు పుస్తకంలోని అధిక భాగాన్ని సమూయేలు వ్రాశాడు.

[16వ పేజీలోని చిత్రం]

తనను రాజుగా స్థాపించినది ఎవరో గుర్తుంచుకోవడం ద్వారా దావీదు వినయంగా ఉండగలిగాడు

[18వ పేజీలోని చిత్రాలు]

“నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును”

బత్షెబ

తామారు

అమ్నోను