కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజాయితీగల ప్రజలు యెహోవాకు స్తుతి తీసుకురావడం

నిజాయితీగల ప్రజలు యెహోవాకు స్తుతి తీసుకురావడం

రాజ్య ప్రచారకుల నివేదిక

నిజాయితీగల ప్రజలు యెహోవాకు స్తుతి తీసుకురావడం

భూవ్యాప్తంగా యెహోవాసాక్షులు వృద్ధులైనా యౌవనులైనా నిజాయితీకి పేరుగాంచారు. మూడు ఖండాల నుండి వచ్చిన ఉదాహరణలను పరిశీలించండి.

నైజీరియాలో నివసించే ఓలూసోలా అనే పదిహేడు సంవత్సరాల యౌవనస్థురాలు ఒకరోజు పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా ఆమెకు ఒక పర్సు కనిపించింది. ఆమె దాన్ని తన ప్రధానోపాధ్యాయుడి దగ్గరికి తీసుకువెళ్ళింది, ఆయన ఆ డబ్బును లెక్కపెట్టినప్పుడు అందులో 6,200 నారియాలు (దాదాపు 2,000 రూపాయలు) ఉన్నట్లు తెలిసింది. ఆ ప్రధానోపాధ్యాయుడు, ఆ పర్సును పోగొట్టుకున్న ఉపాధ్యాయుడికి దాన్ని అప్పగించాడు. ఆ ఉపాధ్యాయుడు కృతజ్ఞతగా ఓలూసోలాకు 1000 నారియాలు (దాదాపు 300 రూపాయలు) ఇచ్చి, దానితో పాఠశాల ఫీజు కట్టమని చెప్పాడు. ఆ విషయం తెలిసిన ఇతర విద్యార్థులు ఓలూసోలాను ఎగతాళి చేశారు. కొన్ని వారాల తర్వాత, ఒక విద్యార్థి తన డబ్బు పోయిందని ఫిర్యాదు చేశాడు, దాంతో విద్యార్థులందరినీ సోదా చేయమని ఉపాధ్యాయులకు చెప్పబడింది. ఒక ఉపాధ్యాయుడు ఓలూసోలాతో ఇలా అన్నాడు: “నీవు ఈ ప్రక్కనే ఉండు. ఒక యెహోవాసాక్షిగా నీవు దొంగతనం చేయవని నాకు తెలుసు.” ఆ డబ్బు అంతకుముందు ఓలూసోలాను ఎగతాళి చేసిన ఇద్దరు అబ్బాయిల దగ్గర దొరికింది, వాళ్ళు కఠినంగా శిక్షించబడ్డారు. ఓలూసోలా ఇలా వ్రాసింది: “యెహోవాకు మహిమ కలిగేవిధంగా, ఎన్నడూ దొంగతనం చేయని యెహోవాసాక్షుల్లో నేనూ ఒకరినని అందరికీ తెలిసినందుకు ఎంతో సంతోషిస్తున్నాను.”

అర్జెంటీనాకు చెందిన మార్సెలో ఇంటినుండి బయటకు వెళుతున్నప్పుడు తన ఇంటి వెనుక గుమ్మానికి కొద్ది దూరంలో ఒక బ్రీఫ్‌కేసు ఉండడం చూశాడు. దాన్ని ఇంట్లోకి తీసుకువచ్చి ఆయనా, ఆయన భార్యా దాన్ని జాగ్రత్తగా తెరిచి చూశారు. అందులో చాలా డబ్బూ, క్రెడిట్‌ కార్డులూ, సంతకాలు చేసిన కొన్ని చెక్కులూ ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాటిలో ఒకటి పది లక్షల పెసోల (దాదాపు 1,35,00,000 రూపాయల) చెక్కు. ఆ బ్రీఫ్‌కేసులో ఒక కాగితం మీద ఒక ఫోన్‌ నంబరు ఉండడం వాళ్లు చూశారు. వాళ్ళు ఆ బ్రీఫ్‌కేసు సొంతదారుడికి ఫోన్‌ చేసి బ్రీఫ్‌కేసును దానిలో ఉన్న వస్తువులతో సహా మార్సెలో ఉద్యోగం చేసే స్థలంలో అప్పగిస్తామని చెప్పారు. ఆ సొంతదారుడు వచ్చినప్పుడు చాలా కంగారు పడుతున్నట్లు కనిపించాడు. మార్సెలో ఒక యెహోవాసాక్షి కాబట్టి కంగారు పడవలసిన అవసరంలేదని మార్సెలో యజమాని ఆయనతో చెప్పాడు. ఆ బ్రీఫ్‌కేసును తిరిగి అప్పగించినందుకు ప్రతిఫలంగా ఆ సొంతదారుడు మార్సెలోకు 20 పెసోలు (దాదాపు 300 రూపాయలు) మాత్రమే ఇచ్చినందుకు మార్సెలో యజమానికి చాలా కోపం వచ్చింది, ఎందుకంటే మార్సెలో నిజాయితీకి ఆయన ఎంతో ముగ్ధుడయ్యాడు. అందువల్ల, ఒక యెహోవాసాక్షిగా తాను అన్నివేళలా నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నానని వివరించడానికి మార్సెలోకు అవకాశం లభించింది.

కిర్గిస్తాన్‌లో ఈ సంఘటన జరిగింది. రినాత్‌ అనే ఆరేళ్ళ బాలుడికి ఒక పర్సు దొరికింది, అది పొరుగునున్న ఒక స్త్రీది. ఆ పర్సులో 1,100 సొమ్‌లు (దాదాపు 1,125 రూపాయలు) ఉన్నాయి. రినాత్‌ తనకు దొరికిన పర్సును ఆ స్త్రీకి తిరిగి ఇచ్చినప్పుడు ఆమె అందులోని డబ్బు లెక్కపెట్టుకుని, 200 సొమ్‌లు (దాదాపు 225 రూపాయలు) తక్కువ ఉన్నాయని రినాత్‌ తల్లికి చెప్పింది. తాను డబ్బు తీసుకోలేదని రినాత్‌ చెప్పాడు. అందరూ ఆ డబ్బు కోసం వెతకడం మొదలుపెట్టారు, పర్సు దొరికిన స్థలంలోనే ఆ డబ్బు కనబడింది. అది చూసిన ఆ స్త్రీ ఎంతో ఆశ్చర్యపోయింది. పోయిన తన డబ్బు తిరిగి అప్పగించినందుకు రినాత్‌కూ, రినాత్‌ను అంత మంచి క్రైస్తవునిగా పెంచినందుకు అతని తల్లికీ ఆమె తన కృతజ్ఞతలు తెలియజేసింది.