కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచం ఎటు వెళుతోంది?

ప్రపంచం ఎటు వెళుతోంది?

ప్రపంచం ఎటు వెళుతోంది?

ప్రపంచ ఐక్యత. అది ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తుంది. అందరూ అదే కావాలని కోరుకోరా? అవును, ఐక్యత గురించే అందరూ మాట్లాడుతున్నారు. ప్రపంచ నాయకుల సమావేశాలు పదే పదే ఆ విషయాన్నే ప్రముఖంగా చర్చించాయి. ప్రపంచ సహస్రాబ్ది శాంతి శిఖరాగ్ర సమావేశం కోసం 2000 ఆగస్టులో 1,000 కంటే ఎక్కువమంది మతనాయకులు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి వద్ద సమావేశమయ్యారు. వాళ్ళు ప్రపంచ పోరాటాలకు పరిష్కారాలను చర్చించారు. అయితే, ఆ సమావేశం ప్రపంచంలో చెలరేగుతున్న సంక్షోభాలకు అద్దం పట్టింది. ఆ సమావేశానికి యూదా రబ్బీ కూడా వస్తున్నాడు కాబట్టి తాను రానని యెరూషలేముకు చెందిన ఒక మఫ్టీ నిరాకరించాడు. దలైలామా చైనాను వ్యతిరేకిస్తాడేమోననే భయంతో మొదటి రెండురోజులు ఆయనను ఆహ్వానించనందుకు ఇతరులు అభ్యంతరపడ్డారు.

2003 అక్టోబరులో, థాయ్‌లాండ్‌లో జరిగిన ఏసియా-పసిఫిక్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ (ఎపిఇసి) సమావేశంలో పసిఫిక్‌ మహా సముద్ర పరీవాహక దేశాలు ప్రపంచ భద్రతా అంశాల గురించి చర్చించాయి. సమావేశానికి హాజరైన 21 దేశాలు ఉగ్రవాద గుంపులను నిర్మూలించాలని ప్రతిజ్ఞబూని, భూగోళ భద్రతను అధికం చేసే మార్గాల విషయంలో ఒక ఒప్పందానికి వచ్చాయి. అయితే, సమావేశంలో కొంతమంది ప్రతినిధులు ఒక ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు, ఆయన చేసిన వ్యాఖ్యలు యూదుల మీద ద్వేషంతో చేసిన దాడి అని వారన్నారు.

ఐక్యత లేకపోవడానికి కారణం ఏమిటి?

ప్రపంచ ఐక్యత గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నా, నిజమైన ఫలితాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అనేకులు యథార్థంగా కృషి చేస్తున్నా, 21వ శతాబ్దంలో కూడా ఐక్యత మానవజాతికి అందని ద్రాక్షే ఎందుకయ్యింది?

దానికి సమాధానం పాక్షికంగా, ఎపిఇసి సమావేశానికి హాజరైన ప్రధానమంత్రుల్లో ఒకరు చేసిన వ్యాఖ్యల్లో కనబడుతుంది. ఆయన “జాత్యహంకారం” గురించి మాట్లాడాడు. అవును, మానవ సమాజం జాతీయతాభావంలో కూరుకుపోయింది. స్వయంపరిపాలన అనేదే ప్రతి దేశాన్నీ, ప్రతి జాతినీ నడిపిస్తోంది. దేశాధిపత్యం, పోటీతత్వం, దురాశ మూడు కలిసి ప్రమాదకరమైన పరిస్థితిని నెలకొల్పాయి. అనేక సందర్భాల్లో, జాతీయ సంక్షేమానికి భూగోళ సంక్షేమానికి మధ్య పోటీ ఏర్పడినప్పుడు జాతీయ సంక్షేమానికే ప్రాధాన్యత ఇవ్వబడుతోంది.

“నాశనకరమైన తెగులు” అని కీర్తనకర్త అన్న మాటలు జాతీయతావాదాన్ని సరిగ్గా వర్ణిస్తున్నాయి. (కీర్తన 91:⁠3) అది చెప్పలేనంత వేదనకు కారణమవుతూ మానవజాతికి వచ్చిన ఒక తెగులులాగే ఉంది. జాతీయతావాదమూ తత్ఫలితంగా ఇతరులపట్ల ఏర్పడే విద్వేషమూ శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. నేడు, జాతీయతావాదం వేర్పాటు ధోరణిని అధికం చేస్తోంది, మానవ పరిపాలకులు దాన్ని ఆపలేకపోతున్నారు.

ప్రపంచ సమస్యలకు మూలకారణం జాతీయతావాదం, స్వలాభాపేక్షలే అని అనేకమంది అధికారులు గుర్తిస్తున్నారు. ఉదాహరణకు, ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రెటరీ జనరల్‌ యూ థాంట్‌ ఇలా పేర్కొన్నాడు: “నేడు మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కారణం తప్పుడు దృక్పథాలే, లేదా వాటి పర్యవసానాలే . . . వాటిలో ఒకటి సంకుచిత జాతీయతావాదం, అంటే ‘తప్పైనా ఒప్పైనా నా దేశమే గొప్ప’ అనే తలంపు.” దాంతోపాటు, నేడు దేశాలు స్వలాభాపేక్షలో మునిగిపోయి తమ సొంత ఆధిపత్యం కోసం అర్రులు చాస్తున్నాయి. స్వాధికారపు అవకాశం ఉన్నవాళ్ళు ఆ అవకాశాన్ని కొంచెంకూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఉదాహరణకు, యూరోపియన్‌ యూనియన్‌ గురించి ఇంటర్‌నేషనల్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ ఇలా వ్యాఖ్యానించింది: “యూరపు రాజకీయాల్లో పోటీతత్వం, అపనమ్మకం ప్రాథమికాంశాలుగా ఉన్నాయి. తమ తోటి దేశాల్లో ఏ ఒక్కటీ ఎక్కువ ఆధిక్యతను సంపాదించుకొని సారథ్యం వహించడం యూరోపియన్‌ యూనియన్‌లోని అనేక సభ్యదేశాలకు ఇప్పటికీ అనంగీకారంగానే ఉంది.”

దేవుని వాక్యమైన బైబిలు మానవ పరిపాలనంతటి ఫలితాన్ని సరిగ్గానే ఇలా వర్ణిస్తోంది: “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.” (ప్రసంగి 8:⁠9) కొన్ని గుంపులు, కొంతమంది వ్యక్తులు, ప్రపంచాన్ని ముక్కచెక్కలుగా తమ సొంత రాజ్యాలుగా విడగొట్టడం ద్వారా బైబిలులోని ఈ సూత్రపు నెరవేర్పును అనుభవపూర్వకంగా చూశారు: “వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.”​—⁠సామెతలు 18:⁠1.

మనకు ఏది మంచిదో తెలిసిన మన సృష్టికర్త, మానవులు తమ సొంతగా ప్రభుత్వాలను ఏర్పరచుకోవాలనీ, తమను తాము పరిపాలించుకోవాలనీ ఎన్నడూ సంకల్పించలేదు. కానీ మానవులు అలా పరిపాలించుకోవడం ద్వారా దేవుని సంకల్పాన్నీ, సమస్తం ఆయనకు చెందుతుందనే వాస్తవాన్నీ అలక్ష్యం చేశారు. కీర్తన 95:3-5 ఇలా చెబుతోంది: “యెహోవా మహా దేవుడు, దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు, భూమ్యాగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతశిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను.” తమ పరిపాలకుడుగా ఉండాలని అందరూ న్యాయంగా కోరుకోవలసిన సర్వాధిపతి దేవుడు మాత్రమే. కానీ దేశాలన్నీ తమ సొంత ఆధిపత్యం కోసమే ప్రయత్నించడం ద్వారా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి.​—⁠కీర్తన 2:⁠2.

ఏమి అవసరం?

ప్రపంచం ఐక్యమయ్యే ఏకైక మార్గం ప్రజలందరి సంక్షేమంపట్ల శ్రద్ధ చూపించే ఒకే ప్రపంచ ఆధిపత్యం. పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్న అనేకులు ఈ అవసరతను గుర్తిస్తున్నారు. అయితే, వాళ్ళు సరైన మూలం వైపుకు చూడడం లేదు. ఉదాహరణకు, మతనాయకులతో సహా ఇతర అనేకమంది వ్యాఖ్యాతలు ప్రపంచ ఐక్యత కోసం ఐక్యరాజ్య సమితిపై ఆశలు పెట్టుకోమని ప్రజలను కోరారు. అయితే, ఎంత ఉన్నతమైన సంకల్పాలు గల మానవ సంస్థలైనా, అవి మానవజాతి అంతర్జాతీయ సమస్యలను ఎన్నడూ తీర్చలేకపోయాయి. ఈ సంస్థల్లో అనేకం, వివిధ దేశాల మధ్యవున్న అనైక్యతకు అద్దం పట్టేవిగా ఉన్నాయి.

పరిష్కారం కోసం మానవ సంస్థలవైపు చూడవద్దని హెచ్చరిస్తూ బైబిలు ఇలా చెబుతోంది: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి.” (కీర్తన 146:⁠3) అంటే ప్రపంచ ఐక్యతకు మార్గమే లేదని దీని అర్థమా? ఎంతమాత్రం కాదు. మరో మార్గం ఉంది.

ప్రపంచాన్ని ఐక్యపరచగల ప్రభుత్వాన్ని దేవుడు ఇప్పటికే స్థాపించాడని చాలామందికి తెలియదు. యెహోవా దేవుని గురించి బైబిలు ఇలా చెబుతోంది: “నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.” (కీర్తన 2:​6, 8) ఈ లేఖనం, యెహోవా దేవుడు ‘తన రాజును ఆసీనునిగా చేశాడు’ అని చెప్పడాన్ని గమనించండి, ఆ రాజును దేవుడు 7వ వచనంలో “నా కుమారుడు” అని సంబోధిస్తున్నాడు. ఆయన మరెవరో కాదు, రాజ్యాలన్నిటిపైనా అధికారం ఇవ్వబడిన, దేవుని ప్రధాన ఆత్మ కుమారుడైన యేసుక్రీస్తే.

ప్రపంచ ఐక్యత ఎలా ఏర్పడుతుంది?

దేవుడు స్థాపించిన ఈ పరలోక పరిపాలనను అనేకులు గుర్తించడం లేదు. రాజ్యాలు సర్వాధిపత్య హక్కు తమకే ఉందని భావిస్తూ దాన్ని పట్టుకు పోరాడుతున్నాయి. అయితే, దేవుడు తన సర్వాధిపత్యాన్నీ, తాను స్థాపించిన ప్రభుత్వాన్నీ గుర్తించడానికి నిరాకరించే వారిని సహించడు. ఈ ఏర్పాటును అంగీకరించడానికి నిరాకరించే వారి గురించి కీర్తన 2:9 ఇలా చెబుతోంది: “ఇనుపదండముతో నీవు [కుమారుడు, యేసుక్రీస్తు] వారిని నలుగగొట్టెదవు, కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగులగొట్టెదవు.” రాజ్యాలు గ్రహించినా గ్రహించకపోయినా అవి ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా పోరాటానికి దారితీసే మార్గంలో ఉన్నాయి. బైబిలులోని చివరి పుస్తకం, ‘లోకమంతట ఉన్న రాజులు సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు పోగుచేయబడడం’ గురించి చెబుతోంది. (ప్రకటన 16:​14) రాజ్యాలు, వాటి విభజనాత్మక మార్గాలు నిర్మూలించబడతాయి. దానితో దేవుని ప్రభుత్వం నిరాటంకంగా తన పని చేసుకుపోవడానికి మార్గం సుగమం అవుతుంది.

ఐక్య ప్రపంచం కోసం అవసరమైన మార్పులు చేయడానికి విశ్వసర్వాధిపతిగా యెహోవా దేవుడు తన కుమారుని ద్వారా జ్ఞానయుక్తంగా అధికారాన్ని ఉపయోగిస్తాడు. దేవుని ప్రభుత్వం నిజమైన ఐక్యతను తీసుకువచ్చి, నీతిని ప్రేమించేవారందరినీ ఆశీర్వదిస్తుంది. మీ బైబిలులో నుండి 72వ కీర్తన చదవడానికి కొన్ని నిమిషాలు ఎందుకు వెచ్చించకూడదు? అక్కడ, దేవుని కుమారుని పరిపాలన మానవజాతి కోసం ఏమి చేస్తుందో ప్రవచనార్థక మాటల్లో చెప్పబడింది. ప్రజలు నిజమైన ప్రపంచ ఐక్యతను చవిచూస్తారు, అణచివేత, దౌర్జన్యం, పేదరికం వంటివాటితో సహా వాళ్ళ సమస్యలన్నీ నిర్మూలించబడతాయి.

నేటి విభాగిత లోకంలో, అలాంటి ఆశ వాస్తవికం కాదని చాలామంది అనుకుంటారు. కానీ అలా అనుకోవడం పొరపాటు. దేవుని వాగ్దానాలు ఎన్నడూ విఫలం కాలేదు, అవి ఎన్నడూ విఫలం కావు కూడా. (యెషయా 55:​10, 11) ఈ మార్పును మీరు ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? తప్పక చూడవచ్చు. వాస్తవానికి, ఆ సమయం కోసం సిద్ధపడుతున్న ప్రజలు ఇప్పటికే ఉన్నారు. వాళ్ళు అన్ని రాజ్యాలకూ చెందినవారు, కానీ వాళ్ళు ఒకరితో ఒకరు యుద్ధం చేయకుండా ఐక్యంగా ఉంటూ దేవుని సర్వాధిపత్యానికి లోబడుతున్నారు. (యెషయా 2:​2-4) వాళ్ళెవరు? వాళ్ళు యెహోవాసాక్షులు. కూటాలకు రమ్మని వాళ్ళిచ్చే ఆహ్వానాన్ని ఎందుకు అంగీకరించకూడదు? దేవుని సర్వాధిపత్యానికి లోబడడానికి, ఎన్నడూ అంతంకాని ఐక్యతను ఆనందించడానికి మీకు సహాయం చేసే ఆ ప్రజలతో మీరు ప్రోత్సాహకరమైన సహవాసాన్ని ఆస్వాదించవచ్చు.

[7వ పేజీలోని చిత్రాలు]

అన్ని రాజ్యాలకూ చెందిన ప్రజలు ఐక్య ప్రపంచంలోని జీవితం కోసం సిద్ధమవుతున్నారు

[4వ పేజీలోని చిత్రసౌజన్యం]

Saeed Khan/AFP/Getty Images

[5వ పేజీలోని చిత్రసౌజన్యం]

విలపిస్తున్న స్త్రీ: Igor Dutina/AFP/Getty Images; అసమ్మతి ప్రకటిస్తున్నవారు: Said Khatib/AFP/Getty Images; సాయుధ వాహనాలు: Joseph Barrak/AFP/Getty Images