కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ ఐక్యతకు ఏమి సంభవించింది?

ప్రపంచ ఐక్యతకు ఏమి సంభవించింది?

ప్రపంచ ఐక్యతకు ఏమి సంభవించింది?

“రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ సమాజం ఐక్యమైంది. . . . కాబట్టి ప్రపంచం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతనలోక విధాన వాగ్దానాన్ని చేజిక్కించుకునే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.”

ఇరవయ్యవ శతాబ్దపు చివరి దశకంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు పైవిధంగా ప్రశ్నించాడు. ఆ సమయంలో, అంతర్జాతీయ సంఘటనలు ప్రపంచ ఐక్యత సమీపంలోనే ఉందన్నట్లు సూచించాయి. సామ్రాజ్యవాద ప్రభుత్వాలు ఒకదాని తర్వాత ఒకటిగా కూలిపోయాయి. యూరపుకు కొత్త శకాన్ని సూచిస్తూ బెర్లిన్‌ గోడ పడిపోయింది. అనేక పశ్చిమ దేశాల దృష్టిలో, భూవ్యాప్త యుద్ధాలను ప్రోత్సహించే దేశంగా ఉన్న సోవియట్‌ యూనియన్‌ పతనం కావడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది, ఆయుధాల నిరాయుధీకరణ గురించేకాక అణ్వాయుధాల నిరాయుధీకరణ గురించి కూడా ఆశావాద చర్చలు ఆరంభమయ్యాయి. పర్షియా సింధుశాఖలో యుద్ధం ప్రారంభమైన మాట నిజమే అయినా, అది కొద్దికాలమే జరగడంతో, ప్రపంచంలోని అనేకుల్లో శాంతియుతమైన కొత్త శకాన్ని సాధించాలనే పట్టుదల అధికమయింది.

రాజకీయ రంగంలోనే కాక జీవితంలోని ఇతర రంగాల్లో కూడా అనుకూల సూచనలు కనిపించాయి. ప్రపంచంలోని అనేక భాగాల్లో జీవన ప్రమాణం మెరుగవుతోంది. వైద్య రంగంలో జరిగిన అభివృద్ధి, కొన్ని దశాబ్దాల క్రితం అసాధ్యం అనిపించినవి ఇప్పుడు సాధ్యమనిపించేలా చేసింది. అనేక దేశాల ఆర్థిక అభివృద్ధి భూగోళం సుభిక్షంగా ఉండడానికి దారితీస్తున్నట్లు అనిపించేంత వేగంతో ముందుకు సాగింది. అన్నీ కోరుకున్నట్లుగానే జరుగుతున్నట్లు అనిపించింది.

ఎక్కువ సంవత్సరాలు గడవక ముందే నేడు మనమిలా ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది: ‘ఏమి జరిగింది? వాగ్దానం చేయబడిన ప్రపంచ ఐక్యత ఏమయ్యింది?’ ప్రపంచం పూర్తిగా వ్యతిరేక దిశలో పయనిస్తున్నట్లుగా ఉంది. ఆత్మాహుతి దళాలు, ఉగ్రవాదుల దాడులు, సామూహిక నిర్మూలనా ఆయుధాలు విస్తరిస్తున్నాయనే నివేదిక, కలవరపరిచే ఇతర పరిణామాలు వార్తాపత్రికల్లో రోజువారీ అంశాలైపోయాయి. అలాంటి సంఘటనలు ప్రపంచాన్ని ఐక్యత నుండి అంతకంతకూ దూరం చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఒక ప్రముఖ పెట్టుబడిదారు ఇటీవల ఇలా అన్నాడు: “మనం అంతకంతకూ పెరిగిపోతున్న దౌర్జన్యపు ఊబిలో కూరుకుపోతున్నాం.”

ప్రపంచ ఐక్యతా లేక భూగోళ విభజనా?

ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు అది పేర్కొన్న సంకల్పాల్లో ఒకటి, “సమాన హక్కులు అనే సూత్రం మీదా, స్వయంపరిపాలన మీదా ఉన్న గౌరవం ఆధారంగా దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందింపజేయడం.” దాదాపు 60 సంవత్సరాలు గడిచిపోయినా ఆ ఉత్తమ సంకల్పం నెరవేరిందా? ఎంతమాత్రం నెరవేరలేదు! “స్నేహపూర్వక సంబంధాలు” అనే మాటకు బదులు “స్వయంపరిపాలన” అనే మాటల గురించే దేశాలు ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజలు, జాతులు, తెగలు తమ సొంత గుర్తింపును, ఆధిపత్యాన్ని స్థాపించుకోవడానికి కృషి చేస్తూ ప్రపంచాన్ని ముక్కలు చెక్కలుగా విడగొట్టాయి. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు, దానిలో 51 సభ్యదేశాలు ఉన్నాయి. నేడు, 191 సభ్యదేశాలున్నాయి.

మనం చూసినట్లుగా, ఇరవయ్యవ శతాబ్దాంతంలో ఐక్య ప్రపంచం అనే ఆశ సర్వత్రా వ్యాపించింది. అప్పటినుండి, ప్రపంచ సమాజం క్రమేణా ముక్కలు చెక్కలవడంతో ఆ ఆశ నిరాశగా మారింది. యుగోస్లావియా హింసలపాలై విడిపోవడం, చెచెన్యాకూ రష్యాకూ మధ్య పోరాటాలు, ఇరాక్‌లో యుద్ధం, మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న సామూహిక హత్యలు, ఇవన్నీ ఎప్పుడూ లేనంతటి అనైక్యతకు నిదర్శనాలు.

శాంతి కోసం చేయబడిన అనేక ప్రయత్నాలు నిజాయితీతో, సదుద్దేశంతో చేయబడినవే అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, ప్రపంచ ఐక్యత అసాధ్యం అనిపిస్తోంది. ‘ప్రపంచ ఐక్యత ఒక కలగానే ఎందుకు మిగిలిపోతోంది? ప్రపంచం ఎటు వెళుతోంది’ అని చాలామంది ఆలోచిస్తున్నారు.

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

AP Photo/Lionel Cironneau

ఆర్లో కె. అబ్రాహామ్‌సన్‌ /AFP/ Getty Images