కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మేలు చేయడంలో పట్టుదలతో ఉండండి

మేలు చేయడంలో పట్టుదలతో ఉండండి

మేలు చేయడంలో పట్టుదలతో ఉండండి

‘అన్యజనుల మధ్య మంచి ప్రవర్తనగలవారిగా ఉండండి’ అని అపొస్తలుడైన పేతురు ఉద్బోధించాడు. (1 పేతురు 2:​12) “మంచి” అని అనువదించబడిన గ్రీకు పదం, “అందమైన, శ్రేష్ఠమైన, గౌరవార్హమైన, అత్యుత్తమమైన” వాటిని సూచిస్తుంది. ఈ రోజుల్లో సాధారణంగా ప్రజల నుండి శ్రేష్ఠమైన లేక గౌరవార్హమైన ప్రవర్తనను ఆశించడం పూర్తిగా అవాస్తవికంగా కనిపించవచ్చు. అయితే నేడు యెహోవా ప్రజలు మాత్రం పేతురు ఉద్బోధను అనుసరించడంలో సఫలులయ్యారు. వాస్తవానికి వారు ప్రపంచవ్యాప్తంగా తమ మంచి ప్రవర్తనకు పేరుగాంచారు.

‘ఈ అపాయకరమైన కాలాల్లో’ మనకు ఎదురయ్యే ఒత్తిళ్ళను, సమస్యలను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ విషయం ప్రత్యేకంగా గమనార్హమైనది. (2 తిమోతి 3:⁠1) మన దైనందిన జీవితంలో పరీక్షలు భాగమయ్యాయి, క్రైస్తవ జీవన విధానానికి వ్యతిరేకత సర్వసాధారణమయింది. దానికి తోడు, కొన్ని పరీక్షలు కొంతకాలమే ఉన్నా, మరికొన్ని నిర్విరామంగా ఉండడమే కాక కొన్నిసార్లు వాటి తీవ్రత కూడా పెరుగుతుంది. అయితే అపొస్తలుడైన పౌలు ఇలా హెచ్చరించాడు: “మనము మేలుచేయుట యందు విసుకక [‘పట్టుదలతో,’ NW] యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.” (గలతీయులు 6:⁠9) హృదయాన్ని కలిచివేసే పరీక్షలను, నిరంతరాయ పోరాటాలను ఎదుర్కొంటూ కూడా మేలు చేయడం అంటే మంచి చేయడం, అలా ఎల్లప్పుడూ చేస్తూ ఉండడం ఎలా సాధ్యం అవుతుంది?

మంచిని చేయడానికి సహాయపడే అంశాలు

“శ్రేష్ఠమైన, గౌరవార్హమైన, అత్యుత్తమమైన” వారిగా ఉండడంలో అంతరంగ స్వభావం అంటే హృదయ స్థితి ఇమిడివుందని స్పష్టమవుతోంది. అందుకే పరీక్షలు, కష్టాలు ఎదురైనా మంచి ప్రవర్తనను కాపాడుకోవడం అనేది క్షణికావేశంవల్ల కలిగే ప్రతిస్పందన కాదు, అది ప్రతీదినం జీవితంలోని అన్ని రంగాల్లో బైబిలు సూత్రాలను అనుసరించడంవల్ల, అభ్యసించడంవల్ల వచ్చే ఫలితం. ఈ విషయంలో సహాయం చేయగల కొన్ని అంశాలు ఏమిటి? క్రింద ఉన్న అంశాలను పరిశీలించండి.

క్రీస్తు మనోవైఖరిని వృద్ధి చేసుకోండి. అన్యాయంగా కనిపించే దానిని సహించడానికి వినయం అవసరం. తనను తాను ఉన్నతునిగా ఎంచుకొనే వ్యక్తి అన్యాయాన్ని సహించలేడు. అయితే యేసు ‘మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను.’ (ఫిలిప్పీయులు 2:​5, 8) ఆయనను అనుకరించడం ద్వారా మనం మన పవిత్ర సేవలో ‘అలసి పోకుండా లేక విసుకక ఉంటాం’. (హెబ్రీయులు 12:​2, 3) మీ స్థానిక సంఘంలో నాయకత్వం వహిస్తున్న వారికి ఇష్టపూర్వకంగా సహకరించడం ద్వారా వినయంతో కూడిన విధేయతను అభ్యసించండి. (హెబ్రీయులు 13:​17) ఇతరులను మీ కన్నా ‘యోగ్యులుగా’ దృష్టించడం నేర్చుకొని మీ సంతోషాల కన్నా వారి సంతోషాలకు ప్రాధాన్యత ఇవ్వండి.​—⁠ఫిలిప్పీయులు 2:​3, 4.

యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని గుర్తుంచుకోండి. యెహోవా ‘ఉన్నాడు, తనను వెదికేవారికి ఫలము దయచేస్తాడు’ అనే నమ్మకం మనలో కలగాలి. (హెబ్రీయులు 11:⁠6) ఆయన మనమీద నిజమైన శ్రద్ధ చూపిస్తున్నాడు, మనం నిత్యజీవం పొందాలని కోరుకుంటున్నాడు. (1 తిమోతి 2:⁠4; 1 పేతురు 5:⁠7) దేవునికి మనమీద ఉన్న ప్రేమను ఏదీ తగ్గించలేదని గుర్తుంచుకోవడం పరీక్షలు ఎదుర్కొనేటప్పుడు కూడా మంచిని చేయడానికి మనకు సహాయం చేస్తుంది.​—⁠రోమీయులు 8:​38, 39.

యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచండి. పరీక్షలు అంతం లేనివిగానో ప్రాణాపాయాన్ని కలిగించేవిగానో కనిపించినప్పుడు యెహోవా మీద నమ్మకం ఉంచడం చాలా అవసరం. యెహోవా ‘మనం సహింపగలిగినంతకంటె ఎక్కువగా’ ఏ పరీక్షను అనుమతించడనీ, ఆయన ఎప్పుడూ “తప్పించుకొను మార్గమును కలుగజేయును” అనీ మనకు పూర్తి నమ్మకం ఉండాలి. (1 కొరింథీయులు 10:​13) మన నమ్మకం యెహోవా మీద ఉంటే మనం ప్రాణాపాయ స్థితిని కూడా ధైర్యంగా ఎదుర్కోగలం.​—⁠2 కొరింథీయులు 1:​8, 9.

ప్రార్థనలో పట్టుదలగా ఉండండి. హృదయపూర్వక ప్రార్థన ఆవశ్యకం. (రోమీయులు 12:​12) మనం యెహోవాకు సన్నిహితులమయ్యే మార్గాల్లో యథార్థమైన ప్రార్థన ఒకటి. (యాకోబు 4:⁠8) ‘మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును’ అని మనం మన వ్యక్తిగత అనుభవం నుండి తెలుసుకుంటాం. (1 యోహాను 5:​14) యెహోవా మన యథార్థతను పరీక్షించేందుకు పరీక్షలు కొనసాగడానికి అనుమతిస్తే, వాటిని సహించడానికి మనం ఆయన సహాయం కోసం ప్రార్థిస్తాం. (లూకా 22:​41-43) అలా ప్రార్థించడం ద్వారా, మనం ఎన్నడూ ఒంటరివాళ్ళం కాదనీ, యెహోవా మన పక్షాన ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ విజయం సాధిస్తామనీ గ్రహిస్తాం.​—⁠రోమీయులు 8:​31, 37.

మంచి పనులు, ‘మెప్పుకు, ఘనతకు కారణం’

అప్పుడప్పుడు క్రైస్తవులందరికీ ‘నానావిధములైన శోధనలచేత దుఃఖము కలుగుతుంది.’ అయినా మనం “మేలుచేయుట యందు విసుకక [‘పట్టుదలతో,’ NW]” ఉండాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడు, మీరు నమ్మకంగా ఉండడం తుదకు “మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును” అనే విషయం తెలుసుకోవడం ద్వారా బలాన్ని పొందండి. (1 పేతురు 1:​6, 7) మీ విశ్వాసాన్ని బలపరిచేందుకు యెహోవా చేసే ఆధ్యాత్మిక ఏర్పాట్లన్నిటి నుండి పూర్తి ప్రయోజనం పొందండి. మీకు వ్యక్తిగత శ్రద్ధ అవసరమైతే క్రైస్తవ సంఘంలో కాపరులుగా, బోధకులుగా, సలహాదారులుగా సేవ చేస్తున్న వారి దగ్గరకు వెళ్ళండి. (అపొస్తలుల కార్యములు 20:​28) ‘ప్రేమచూపుటకు, సత్కార్యములు చేయుటకు పురికొల్పే’ సంఘ కూటాలన్నిటికీ క్రమంగా హాజరుకండి. (హెబ్రీయులు 10:​24) ప్రతీదినం బైబిలు పఠనం, వ్యక్తిగత అధ్యయనం చేసే కార్యక్రమం ఉంటే మీరు అప్రమత్తంగా ఉండేందుకు, ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు సహాయం లభిస్తుంది, వాటితోపాటు క్రైస్తవ పరిచర్యలో క్రమంగా భాగం వహించడం ద్వారా కూడా మీరు ఆధ్యాత్మికంగా బలం పొందుతారు.​—⁠కీర్తన 1:​1-3; మత్తయి 24:​14.

యెహోవా ప్రేమా శ్రద్ధలను మీరు ఎంత ఎక్కువగా రుచి చూస్తే “సత్‌క్రియలయందాసక్తి”తో ఉండాలనే మీ కోరిక అంత ఎక్కువవుతుంది. (తీతు 2:​14) “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును” అని గుర్తుంచుకోండి. (మత్తయి 24:13) అవును, ‘మేలుచేయుట యందు విసుకక [‘పట్టుదలతో,’ NW] ఉండాలి’ అనే దృఢనిశ్చయంతో ఉండండి.

[29వ పేజీలోని బ్లర్బ్‌]

యెహోవా ‘మనం సహింపగలిగినంతకంటె ఎక్కువగా’ ఏ పరీక్షను అనుమతించడనీ, ఆయన ఎప్పుడూ “తప్పించుకొను మార్గమును కలుగజేయును” అనీ మనకు పూర్తి నమ్మకం ఉండాలి.

[30వ పేజీలోని చిత్రాలు]

దైవపరిపాలనా కార్యకలాపాల్లో తీరిక లేకుండా ఉంటే మనం పరీక్షలను ఎదుర్కొనే విధంగా సిద్ధపడడానికి తోడ్పడగలదు