కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు . . .

వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు . . .

వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు . . .

తెలివైన భార్యాభర్తలు ఎవరూ తమ వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలను ఇష్టపడరు, కానీ ఈ సమస్య నేడు ప్రబలంగా ఉంది. భాగస్వాముల్లో ఒకరు చెప్పింది మరొకరికి చికాకు కలిగిస్తుంది. మాటలు పెరుగుతాయి, కోపం తారాస్థాయికి చేరి, కటువైన మాటలతో ఆవేశపూరిత వాగ్వివాదం చెలరేగుతుంది. ఆ తర్వాత, భార్యాభర్తలిద్దరూ పంతంతో మాట్లాడుకోవడం మానేయడంతో వారిద్దరి మధ్య మౌనం రాజ్యమేలడం ఆరంభిస్తుంది. ఆ తర్వాత, కోపం చల్లారాక క్షమాపణల పర్వం మొదలవుతుంది. దాంతో, కనీసం మళ్లీ వివాదం పుట్టేవరకైనా, వారి మధ్య శాంతి నెలకొంటుంది.

నేటి దూరదర్శిని కార్యక్రమాల్లో విస్తారమైన హాస్యోక్తులకూ, కథలకూ వైవాహిక జీవితంలోని కీచులాటలే ఇతివృత్తంగా ఉన్నా, వాస్తవిక పరిస్థితి మాత్రం ఒక తమాషాగా లేదు. నిజానికి, ఒక బైబిలు సామెత ఇలా చెబుతోంది: “ఒక వ్యక్తి ఆలోచన లేకుండా మాట్లాడితే, అప్పుడు ఆ మాటలు ఖడ్గంలా బాధించవచ్చు.” (సామెతలు 12:​18, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అవును కఠినమైన మాటలు, వివాదం సమసిపోయిన తర్వాత కూడా చాలాకాలం వరకు మానకుండా ఉండే మానసిక గాయాలను చేస్తాయి. కొన్ని సందర్భాల్లో వాగ్వివాదాలు దౌర్జన్యానికి కూడా దారితీయవచ్చు.​—⁠నిర్గమకాండము 21:​18.

నిజమే మానవ అపరిపూర్ణత కారణంగా వైవాహిక జీవితంలో సమస్యలను కొన్నిసార్లు నివారించడం కష్టం. (ఆదికాండము 3:16; 1 కొరింథీయులు 7:28) అయితే, తరచూ తలెత్తే తీవ్రమైన వివాదాలను ఊరకనే కొట్టిపారేయడానికి వీల్లేదు. తరచూ జరిగే కీచులాటలు దంపతులు చివరకు విడిపోయే అవకాశాలను ఎక్కువ చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి మీరు మీ భాగస్వామి వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడాన్ని నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం.

పరిస్థితిని విశ్లేషించడం

మీ వివాహ జీవితం వాగ్వివాదాలతో సతమతమవుతున్నట్లయితే, మీ వివాదాలకు కారణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా ఒక విషయం మీద మీరిద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోతే ఏమి జరుగుతుంది? ఆ చర్చ వెంటనే అదుపుతప్పి అవమానాలకు, ప్రత్యారోపణలకు దిగజారుతుందా? అలాంటప్పుడు, మీరేమి చేయవచ్చు?

మొదట, ఆ సమస్యకు వ్యక్తిగతంగా మీరు ఎంతమేరకు అగ్నికి ఆజ్యం పోస్తున్నారో మిమ్మల్ని మీరు నిజాయితీగా పరీక్షించుకోండి. మీరు త్వరగా కోపగించుకుంటారా? మీరు సహజంగానే వాగ్వివాదాలకు దిగుతారా? ఈ విషయంలో మీ భాగస్వామి ఏమంటారు? ఈ చివరి ప్రశ్నను పరిశీలించడం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే దేన్ని వాగ్వివాదంగా పరిగణించవచ్చు అనే విషయంలో మీకిద్దరికీ విభిన్న దృక్కోణాలు ఉండవచ్చు.

ఉదాహరణకు, మాట్లాడే విషయంలో మీ భాగస్వామి ముభావంగా ఉండే వ్యక్తనీ, మీరేమో నిర్మొహమాటంగా, భావోద్వేగాలతో మాట్లాడే వ్యక్తనీ అనుకుందాం. “నేను పెరిగిన వాతావరణం అలాంటిది, మా కుటుంబంలో అందరూ అలాగే మాట్లాడతారు. ఇది వాదించడం కాదు” అని మీరనవచ్చు. బహుశా మీకది వాగ్వివాదం కాదన్నట్లు అనిపించవచ్చు. కానీ సూటిగా మాట్లాడుతున్నానని మీరు అనుకునే దానిని మీ భాగస్వామి గాయపరిచేదిగా, జగడమాడుతున్నట్లుగా ఉందని భావించవచ్చు. మీకు మీ భాగస్వామికి విభిన్న సంభాషణా శైలిలు ఉన్నాయని తెలుసుకోవడం అపార్థాలను నివారించడానికి సహాయం చేయగలదు.

వాదంలో ఎల్లప్పుడూ అరుచుకోవడం ఉండదని కూడా గుర్తుంచుకోండి. పౌలు క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: ‘అల్లరి, దూషణలను మీరు విసర్జించుడి.’ (ఎఫెసీయులు 4:​31) ఇది అరుస్తూ మాట్లాడడాన్నే కాక, ఆ మాటల ద్వారా మీరు అందజేసే సందేశాన్ని కూడా సూచిస్తోంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే, చికాకు పుట్టించే లేదా తూలనాడే మాటలు గుసగుసగా చెప్పినా కూడా అది వాగ్వివాదమే అవుతుంది.

పై విషయాలను మనస్సులో పెట్టుకొని మీ భాగస్వామితో మీకున్న భేదాభిప్రాయాలతో ఎలా వ్యవహరిస్తున్నారో మళ్లీ ఒకసారి ఆలోచించండి. మీరు తగవులాడే వ్యక్తా? మీరు గమనించినట్లుగా, ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి, మీ భాగస్వామి దృక్కోణాన్ని పరిగణలోకి తీసుకోవడం అత్యంత ప్రాముఖ్యం. మీ భాగస్వామి దృక్కోణాన్ని అల్పమైనదిగా భావించి కొట్టిపారేయకుండా, అతను లేక ఆమె మిమ్మల్ని చూస్తున్న దృక్కోణంలోనే మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ప్రయత్నిస్తూ అవసరమైన మార్పులు చేసుకోండి. పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.”​—⁠1 కొరింథీయులు 10:​24.

“మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడి”

భేదాభిప్రాయాలతో వ్యవహరించే మరో విధానం యేసు పలికిన ఈ మాటల్లో చూడవచ్చు: “మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడి.” (లూకా 8:18) నిజమే యేసు ఇక్కడ దంపతుల మధ్య సంభాషణ గురించి మాట్లాడడం లేదు. అయినప్పటికీ, ఆ మాటల్లోని సూత్రం అన్వయిస్తుంది. మీ భాగస్వామి మాటలను మీరెంత బాగా వింటారు? మీరసలు వింటారా? లేక మీరు సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏవో సులభమైన పరిష్కారాలు సూచిస్తూ మధ్యలోనే కలుగజేసుకుంటారా? “సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 18:13) భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు, మీరు మీ భాగస్వామి విషయాన్ని విశ్లేషిస్తూ మాట్లాడుకోవడమే కాక ఒకరు చెప్పేది మరొకరు నిజంగా వినాలి.

మీ భాగస్వామి దృక్కోణాన్ని చులకన చేసి మాట్లాడే బదులు సానుభూతి చూపించడానికి లేదా ‘ఒకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపంచుకోవడానికి’ కృషి చేయండి. (1 పేతురు 3:​8) గ్రీకు మూలపాఠంలో ఇక్కడ ఉపయోగించబడిన పదం ప్రాథమికంగా, మరో వ్యక్తితో కలిసి బాధపడడం అనే భావాన్నిస్తుంది. మీ భాగస్వామి దేని గురించైనా బాధపడుతుంటే, ఆ భావాన్ని మీరు కూడా పంచుకోవాలి. అతని లేదా ఆమె దృక్కోణం నుండి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

దైవజనుడైన ఇస్సాకు ఆ విధంగానే చేశాడు. ఆయన భార్య రిబ్కా తమ కుమారుడైన యాకోబుకు సంబంధించిన ఒక విషయంలో బాగా కలత చెందినట్లు బైబిలు మనకు చెబుతోంది. “హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనము” అని ఆమె ఇస్సాకుతో అంది.​—⁠ఆదికాండము 27:​46.

నిజమే, అధిక చింత కారణంగా రిబ్కా కాస్త అతిగానే స్పందించింది. ఆమె నిజంగానే బ్రతుకుమీద విసుగు చెందిందా? ఆమె కుమారుడు హేతు కుమార్తెను పెళ్లి చేసుకుంటే, అక్షరార్థంగానే చనిపోవాలనుకుందా? బహుశా కాదు. అయినప్పటికీ, ఇస్సాకు ఆమె భావాలను తక్కువ చేసి మాట్లాడలేదు. బదులుగా, రిబ్కా చింతకు తగిన కారణం ఉందని ఆయన గ్రహించి, ఆ ప్రకారమే చర్య తీసుకున్నాడు. (ఆదికాండము 28:1) భవిష్యత్తులో ఎప్పుడైనా మీ భాగస్వామి చింతపడినప్పుడు మీరు కూడా అలాగే చేయండి. అదేదో చిన్న విషయమని కొట్టివేయకుండా మీ భాగస్వామి చెప్పింది వినండి, ఆమె లేదా అతని దృక్కోణాన్ని గౌరవించండి, సానుభూతితో స్పందించండి.

వినడం, సుబుద్ధి చూపించడం

ఒక బైబిలు సామెత ఇలా చెబుతోంది: “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును.” (సామెతలు 19:11) భేదాభిప్రాయం తీవ్రంగా ఉన్నప్పుడు మీ భాగస్వామి నిర్దయగా మాట్లాడే ప్రతీ మాటకు అనాలోచితంగా స్పందించడం సులభమే. అయితే ఇది సాధారణంగా వాగ్వివాదాన్ని మరింత పెంచుతుంది. కాబట్టి, మీ భాగస్వామి చెప్పేది వినేటప్పుడు, కేవలం మాటలను వినకుండా, ఆ మాటల వెనకున్న భావాలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాంటి సుబుద్ధి, మీ వ్యక్తిగత చికాకును ప్రక్కనబెట్టి సమస్య మూలకారణాన్ని చూసేందుకు మీకు సహాయం చేస్తుంది.

ఉదాహరణకు, మీ భార్య మీతో “మీరు నాతో సమయమే గడపరు!” అని అన్నదనుకోండి. దానికి మీరు చికాకుపడుతూ కఠినంగా వాస్తవాలు చెప్పి ఆమె మాటలను ఖండించే అవకాశం ఉంది. దానికి మీరు “పోయిన నెల ఒక రోజంతా నీతో గడిపాను!” అని అనవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా వింటే, ఆమె ఎక్కువ గంటలు, నిమిషాల గురించి మాట్లాడడం లేదని మీరు గ్రహించగలుగుతారు. నిజానికి, ఆమె తాను నిర్లక్ష్యానికి గురవుతున్నట్లుగా, మీ ప్రేమకు దూరమవుతున్నట్లుగా భావిస్తూ మీనుండి అభయాన్ని కోరుతుండవచ్చు.

మీరొక భార్య అనీ, మీ భర్త మీరు ఇటీవలే కొన్న ఒకానొక వస్తువు విషయంలో తన చింతను వ్యక్తం చేశాడని అనుకుందాం. “అంత ఖరీదు పెట్టి నువ్వు ఎలా కొనగలిగావ్‌?” అని ఆయన ఆశ్చర్యం వెలిబుచ్చాడు. అప్పుడు మీరు కుటుంబ ఖర్చుల గురించి ఏకరువు పెడుతూ లేదా మీరు కొన్న వస్తువు ఖరీదు ఆయన ఖర్చులతో పోలిస్తే చాలా తక్కువని మాట్లాడుతూ మిమ్మల్ని మీరు సమర్థించుకోవచ్చు. అయితే మీ భర్త మీరు ఖర్చు చేసిన అణా పైసల గురించి మాట్లాడడం లేదని గ్రహించడానికి మీకు సుబుద్ధి సహాయం చేస్తుంది. ఖరీదైన పెద్ద వస్తువులు కొనేటప్పుడు తన ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన మదనపడుతుండవచ్చు.

నిజమే, ఇద్దరు కలిసి ఎంత సమయం గడుపుతున్నారు, ఏవైనా వస్తువులు కొనడానికి నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు అనేవి ఒక్కో జంట ఒక్కో విధంగా పరిష్కరించుకోవచ్చు. అయితే ఇక్కడ విషయమేమిటంటే, ఏదైనా ఒక విషయంలో ఏకాభిప్రాయం కుదరనప్పుడు, సుబుద్ధి మీ కోపాన్ని తగ్గించి అసలు సమస్యను గ్రహించేందుకు మీకు సహాయం చేస్తుంది. దూకుడుగా స్పందించడానికి బదులు బైబిలు రచయిత వ్రాసిన ఈ సలహాను అనుసరించండి: ‘వినుటకు వేగిరపడుతూ, మాటలాడుటకు నిదానిస్తూ, కోపించుటకు నిదానించు వారిగా ఉండండి.’​—⁠యాకోబు 1:​19.

మీరు మాట్లాడేటప్పుడు, మీ భాగస్వామితో ఎలా మాట్లాడతారనేది ప్రాముఖ్యమని గుర్తుపెట్టుకోండి. బైబిలు ఇలా చెబుతోంది: “జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.” (సామెతలు 12:18) మీకు మీ భాగస్వామికి మధ్య ఏదైనా భేదాభిప్రాయం తలెత్తినప్పుడు మీ మాటలు గాయపరిచేవిగా ఉంటాయా లేక ఆరోగ్యదాయకంగా ఉంటాయా? అవి మీ మధ్య అడ్డుగోడలుగా మారతాయా లేక సమాధాన మార్గాన్ని సుగమం చేస్తాయా? మనం ఇప్పటికే గమనించినట్లుగా కోపం, ఆవేశపూరిత స్పందన కలహాన్ని అధికం చేస్తుంది.​—⁠సామెతలు 29:​22.

భేదాభిప్రాయం వాగ్యుద్ధానికి దారితీస్తే, అసలు విషయంతో వ్యవహరించేందుకు ప్రయత్నించండి. వ్యక్తిమీద కాదు సమస్యమీద దృష్టి నిలపండి. ఎవరు నిర్దోషి అన్నది కాదు, ఏది సరైనది అనే దాని గురించి ఆలోచించండి. మీ మాటలు అగ్నికి ఆజ్యం పోయకుండా జాగ్రత్తపడండి. బైబిలు ఇలా చెబుతోంది: “నొప్పించు మాట కోపమును రేపును.” (సామెతలు 15:1) అవును, మీరేమి చెబుతారు, ఎలా చెబుతారు అనేవి మీరు మీ భాగస్వామి సహకారాన్ని పొందగలుగుతారా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.

గెలుపుకు కాదు, పరిష్కారానికి ప్రయత్నించండి

భేదాభిప్రాయాలతో వ్యవహరించేటప్పుడు, గెలుపు మన లక్ష్యంగా ఉండకూడదు, పరిష్కారమే మన లక్ష్యంగా ఉండాలి. మీరు ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు? ఖచ్చితమైన మార్గమేమిటంటే, బైబిలు ఉపదేశాన్ని అన్వేషించి, అన్వయించుకోవడమే. ఈ విషయంలో ప్రత్యేకంగా భర్తలు చొరవ తీసుకోవాలి. వివాదాలు లేదా సమస్యలు వచ్చినప్పుడు వెంటనే తీవ్రమైన అభిప్రాయాలను వ్యక్తపరచడానికి బదులు, వాటిని యెహోవా దృక్కోణం నుండి ఎందుకు చూడకూడదు? ఆయనకు ప్రార్థించండి, మీ హృదయాలకు, తలంపులకు కావలిగా ఉండే దేవుని సమాధానాన్ని వెదకండి. (ఎఫెసీయులు 6:18; ఫిలిప్పీయులు 4:6, 7) మీ స్వప్రయోజనమే కాక మీ భాగస్వామి ప్రయోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడానికి మనఃపూర్వక ప్రయత్నం చేయండి.​—⁠ఫిలిప్పీయులు 2:⁠4.

గాయపడిన మీ భావాలను, హద్దులేని భావోద్రేకాలను మీ తలంపులపై, క్రియలపై ప్రభావం చూపించడానికి అనుమతిస్తే తరచూ పరిస్థితి మరింత జటిలమవుతుంది. మరోవైపున, దేవుని వాక్యంలోని ఉపదేశానికి అనుగుణంగా మార్పులు చేసుకోవడానికి సుముఖత చూపడం శాంతికి, అంగీకారానికీ, యెహోవా ఆశీర్వాదానికీ నడిపిస్తుంది. (2 కొరింథీయులు 13:11) కాబట్టి, “పైనుండివచ్చు జ్ఞానము”చేత నిర్దేశించబడుతూ, దైవిక లక్షణాలను కనబరుస్తూ “సమాధానము చేయువారికి” లభించే ప్రయోజనాలను అనుభవించండి.​—⁠యాకోబు 3:​17, 18.

నిజానికి, వ్యక్తిగత అభిరుచులను త్యాగం చేయవలసి వచ్చినా, అందరూ భేదాభిప్రాయాలతో శాంతియుతంగా ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలి. (1 కొరింథీయులు 6:⁠7) అవును, ‘కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణను, మీనోట బూతులను విసర్జించి, ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ పరిత్యజించి, నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొనుడి’ అని పౌలు చెప్పిన ఉపదేశాన్ని అన్వయించుకోండి.​—⁠కొలొస్సయులు 3:​8-10.

నిజమే, కొన్నిసార్లు మీరు మాట అనేసి ఆ తర్వాత నొచ్చుకుంటారు. (యాకోబు 3:8) అలా జరిగినప్పుడు, మీ భాగస్వామికి క్షమాపణ చెప్పండి. అలా ప్రయత్నిస్తూ ఉండండి. అనతికాలంలోనే మీ భాగస్వామి మీరు భేదాభిప్రాయాలతో వ్యవహరించడంలో మంచి ప్రగతి సాధిస్తున్నట్లు చూడవచ్చు.

[22వ పేజీలోని బాక్సు/చిత్రం]

వాగ్వివాదాన్ని చల్లబరచడానికి మూడు మార్గాలు

మీ భాగస్వామి చెప్పేది వినండి.—సామెతలు 10:​19.

• అతని లేదా ఆమె దృక్కోణాన్ని గౌరవించండి.—ఫిలిప్పీయులు 2:⁠4.

• ప్రేమపూర్వంగా ప్రతిస్పందించండి.—1 కొరింథీయులు 13:​4-7.

[23వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఇప్పుడు మీరేమి చేయవచ్చు?

మీ భాగస్వామిని ఈ క్రింది ప్రశ్నలు అడిగి, మధ్యలో మాట్లాడకుండా చెబుతున్న జవాబులు వినండి. ఆ తర్వాత మీ భాగస్వామి కూడా ఇదే పద్ధతిని పాటించాలి.

• నేను వాగ్వివాదానికి దిగే వ్యక్తినా?

• నువ్వు చెబుతున్న మాటలను నేను నిజంగా వింటున్నానా లేక నువ్వు మాట్లాడడం పూర్తికాకముందే దూకుడుగా స్పందిస్తున్నానా?

• నేను పరుషంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందా లేక నా మాటలు నీకు కోపం తెప్పిస్తున్నాయా?

• ప్రత్యేకంగా ఏదైనా విషయంలో మనం ఏకాభిప్రాయానికి రానప్పుడు, మన సంభాషణా విధానాన్ని మెరుగుపరచుకోవడానికి మనిద్దరం ఏమి చేయవచ్చు?

[21వ పేజీలోని చిత్రం]

మీరు వింటారా?

[22వ పేజీలోని చిత్రం]

“నేను నిర్లక్ష్యానికి గురవుతున్నానని, ప్రేమకు దూరమవుతున్నానని అనిపిస్తోంది”

[22వ పేజీలోని చిత్రం]

“మీరు నాతో సమయమే గడపరు!”

[22వ పేజీలోని చిత్రం]

“పోయిన నెల ఒక రోజంతా నీతో గడిపాను!”