కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అలెగ్జాండ్రియాకు చెందిన ఫీలో లేఖనాలను, ఊహాకల్పనను జతచేయడం

అలెగ్జాండ్రియాకు చెందిన ఫీలో లేఖనాలను, ఊహాకల్పనను జతచేయడం

అలెగ్జాండ్రియాకు చెందిన ఫీలో లేఖనాలను, ఊహాకల్పనను జతచేయడం

గ్రీకు వీరుడైన అలెగ్జాండర్‌ సా.శ.పూ. 332లో ఈజిప్టులోకి ప్రవేశించాడు. ప్రపంచాన్ని జయించాలనే తన జైత్రయాత్రలో తూర్పువైపు ప్రయాణం ప్రారంభించే ముందు ఆయన ఒక నగరాన్ని స్థాపించి దానికి అలెగ్జాండ్రియా అని పేరుపెట్టాడు. అది గ్రీకు సంస్కృతికి కేంద్రంగా మారింది. అక్కడ దాదాపు సా.శ.పూ. 20లో మరో వీరుడు జన్మించాడు, అయితే ఆయన ఆయుధాలు కత్తులూ ఈటెలూ కాదు, తత్త్వశాస్త్ర తర్కాలు. ఆయనను అలెగ్జాండ్రియాకు చెందిన ఫీలో అనీ, ఆయనకున్న యూదా నేపథ్యాన్ని బట్టి ఫీలో జూడీయస్‌ అనీ పిలిచేవారు.

సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనమైన తర్వాత యూదులు పాలస్తీనా వెలుపల నివాసం ఏర్పరచుకోవడం ప్రారంభించినప్పుడు చాలామంది యూదులు ఐగుప్తులో నివసించారు. వేలాదిమంది అలెగ్జాండ్రియాలో నివసించారు. అయితే యూదులకూ, వారి పొరుగువారైన గ్రీకులకూ మధ్య సమస్యలుండేవి. యూదులు గ్రీకు దేవుళ్ళను ఆరాధించడానికి నిరాకరించేవారు, గ్రీకులు హీబ్రూ లేఖనాలను ఎగతాళి చేసేవారు. ఫీలోకు గ్రీకు విద్యా, యూదా పెంపకం ఉండడం మూలంగా ఆ వివాదం గురించి ఆయనకు బాగా తెలుసు. యూదా మతమే నిజమైన మతమని ఆయన విశ్వసించాడు. అయితే ఫీలో చాలామంది చేసినట్లు చేయకుండా, అన్యులను దేవుని దగ్గరికి నడిపించడానికి శాంతియుత మార్గాల కోసం వెదికాడు. వారు యూదామతాన్ని అంగీకరించేలా చేయాలని ఆయన కోరుకున్నాడు.

పాత వ్రాతలకు క్రొత్త అర్థాలు

అలెగ్జాండ్రియాలోని చాలామంది యూదుల్లాగే ఫీలో మాతృభాష కూడా గ్రీకు భాషే. అందుకే ఆయన తన అధ్యయనానికి హీబ్రూ లేఖనాల గ్రీకు సెప్టాజింట్‌ వర్షన్‌ను ఆధారంగా తీసుకున్నాడు. ఆయన సెప్టాజింట్‌లోని లేఖనాలు పరిశీలిస్తుండగా, అందులో తత్త్వశాస్త్ర సంబంధమైన ప్రాథమిక అంశాలున్నాయనీ, మోషే “నిపుణతగల తత్త్వవేత్త” అనీ ఆయనకు గట్టి నమ్మకం ఏర్పడింది.

శతాబ్దాల పూర్వం, గ్రీకు మేధావులు దేవీదేవతల కథలను, అంటే తమ ప్రాచీన గ్రీకు పురాణాల్లోని రాక్షసుల, భూతాల కథలను అంగీకరించడం కష్టమని భావించారు. ఆ పాత కథలను వారు క్రొత్త అర్థాలతో తిరిగి చెప్పడం ప్రారంభించారు. వారి పద్ధతి గురించి ప్రాచీన గ్రీకు పండితుడైన జేమ్స్‌ డ్రమాండ్‌ ఇలా చెప్పాడు: “తత్త్వవేత్త పురాణగాథల వెనుక దాగివున్న అర్థాలను వెతికి, అస్పష్టమైన అసంగతమైన ఆ గాథల మూలంగా రచయితలు తమ భావనాత్మక భాషలో ఏ నిగూఢమైన లేదా ఆధ్యాత్మికమైన సత్యాన్ని అందజేయడానికి ప్రయత్నించారో చూస్తాడు.” ఈ ప్రక్రియను సూచనార్థక భావ వివరణ అంటారు, లేఖనాలను వివరించడానికి ఫీలో దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నించాడు.

ఉదాహరణకు, బగ్‌స్టర్స్‌ సెప్టాజింట్‌ అనువాదంలో ఆదికాండము 3:⁠22వ వచనం ఎలా ఉందో పరిశీలించండి, అదిలా చెబుతోంది: “ప్రభువైన దేవుడు ఆదాము కోసం అతని భార్య కోసం చర్మపు చొక్కాయిలు చేసి, వారికి తొడిగించాడు.” బట్టలు తయారు చేయడం సర్వోన్నత దేవుని ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని గ్రీకులు భావించారు. కాబట్టి ఫీలో ఆ వచనంలో సూచనార్థక భావాన్ని ఇలా వివరించాడు: “చర్మపు చొక్కాయిలు అనేది సహజమైన చర్మానికి, అంటే మన దేహానికి సూచనార్థక పదం; ఎందుకంటే దేవుడు మొట్టమొదట మేథస్సును సృష్టించి దానిని, ఆదాము అని పిలిచాడు; ఆ తర్వాత ఆయన బాహ్యరూపాన్ని చేశాడు, దానిని ఆయన జీవం అని పిలిచాడు. చివరకు తప్పనిసరిగా, ఆయన ఒక శరీరాన్ని కూడా చేశాడు, దానిని సూచనార్థక భావంలో చర్మపు చొక్కాయిలు అని పిలిచాడు.” ఆ విధంగా ఫీలో, దేవుడు ఆదాము హవ్వలకు బట్టలు తయారుచేసి ఇవ్వడాన్ని ధ్యానించవలసిన తత్త్వసంబంధిత అంశంగా మార్చడానికి ప్రయత్నించాడు.

ఆదికాండము 2:10-14 వచనాలను కూడా పరిశీలించండి, అవి ఏదెనులోని తోటకు నీటి సరఫరా మూలాన్ని వర్ణిస్తూ, నాలుగు నదులు తోటలో నుండి బయటికి ప్రవహించేవని చెబుతున్నాయి. ఫీలో ఆ మాటల వెనుకున్న నిగూఢ భావాన్ని గ్రహించడానికి ప్రయత్నించాడు. నేల గురించి వ్యాఖ్యానించిన తర్వాత, ఆయనిలా చెప్పాడు: “బహుశా ఈ వాక్య భాగానికి కూడా సూచనార్థక భావం ఉండవచ్చు; ఎందుకంటే నాలుగు నదులు నాలుగు గుణాలకు సూచన.” పీషోను నది వివేకానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, గీహోను నది గంభీరతకు చిహ్నమని, హిద్దెకెలు నది ధైర్యాన్ని సూచిస్తుందని, యూఫ్రటీసు నది న్యాయానికి గుర్తని ఆయన ఊహించాడు. ఆ విధంగా భౌగోళిక వివరాల స్థానాన్ని రెండర్థాల కథలు ఆక్రమించుకున్నాయి.

సృష్టి వృత్తాంతాన్ని, కయీను హేబెలును చంపడం గురించిన వృత్తాంతాన్ని, నోవహు కాలంనాటి జలప్రళయాన్ని, బాబెలులో భాషల తారుమారును, మోషే ధర్మశాస్త్రంలోని అనేక సూత్రాలను విశ్లేషించడానికి ఫీలో సూచనార్థక భావ వివరణను ఉపయోగించాడు. ముందటి పేరాలోని ఉదాహరణ చూపిస్తున్నట్లుగా, ఆయన తరచూ ఒక బైబిలు వచనంలోని అక్షరార్థ విషయాన్ని ముందు అంగీకరించి, ఆ తర్వాత తన సూచనార్థక గ్రహింపును ఇలాంటి మాటలతో వర్ణించేవాడు: “బహుశా వీటిని సూచనార్థక భావంతో చెప్పారేమో అని మనం చూడవలసి ఉంటుంది.” ఫీలో వ్రాతల్లో, సూచనార్థక భావాలు స్పష్టంగా కనిపిస్తాయి కానీ విచారకరంగా, లేఖనాల స్పష్టమైన భావం మాత్రం మరుగునపడిపోతుంది.

దేవుడు ఎవరు?

ఫీలో దేవుని ఉనికిని ఒక శక్తిమంతమైన ఉపమానంతో రుజువుచేశాడు. నేలను, నదులను, గ్రహాలను, నక్షత్రాలను వర్ణించిన తర్వాత, ఆయనిలా ముగించాడు: “ఈ లోకం, సృష్టి అంతటిలోకి ఎంతో కళాత్మకంగా, నైపుణ్యవంతంగా రూపొందించబడింది. ఇది ఎంతో సమర్థుడు, అత్యంత పరిపూర్ణ జ్ఞానవంతుడు అయిన ఒక వ్యక్తి సృజించినట్లుగా ఉంది. దేవుని ఉనికిని గురించిన తలంపును మనం ఈ విధంగా అందుకున్నాము.” ఇది మంచి తర్కమే.​—⁠రోమీయులు 1:20.

కానీ ఫీలో సర్వశక్తిమంతుడైన దేవుని స్వభావం గురించి వర్ణించినప్పుడు సత్యం నుండి ఎంతో దూరం వెళ్ళిపోయాడు. దేవునికి “విశిష్టమైన లక్షణాలేమీ లేవు,” దేవుడు “అగోచరమైనవాడు” అని ఆయన అన్నాడు. దేవుని గురించి తెలుసుకోవడానికి చేసే కృషిని ఫీలో నిరుత్సాహపరుస్తూ, “దేవుని స్వభావం గురించి లేదా ఆయన విశిష్ట గుణాల గురించి అన్వేషించాలనే ఉద్దేశంతో ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ప్రయత్నించడం పూర్తిగా మూర్ఖత్వమే అవుతుంది” అన్నాడు. ఈ ఆలోచనా విధానం బైబిలు నుండి వచ్చింది కాదు, అన్య తత్త్వవేత్త అయిన ప్లేటో నుండి వచ్చింది.

దేవుడు ఎంత అగోచరంగా ఉన్నాడంటే ఆయనను ఒక పేరుతో పిలవడం అసాధ్యం అని ఫీలో అన్నాడు. “కాబట్టి, నిజానికి సజీవుడైన దేవునికి సరిపోయేవిధంగా సరైన పేరేదీ ఆపాదించలేకపోవడం ఎంతో సహేతుకమైనదే.” అది వాస్తవానికి ఎంత విరుద్ధమో కదా!

దేవునికి ఒక పేరు ఉందనే విషయంలో బైబిలు ఎలాంటి సందేహానికి తావివ్వడం లేదు. కీర్తన 83:⁠18 ఇలా చెబుతోంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.” దేవుడు ఇలా చెబుతున్నట్లు యెషయా 42:8 తెలియజేస్తోంది: “యెహోవాను నేనే; ఇదే నా నామము.” ఈ బైబిలు లేఖనాల గురించి తెలిసిన యూదుడైన ఫీలో దేవునికి పేరు లేదని ఎందుకు బోధించాడు? ఎందుకంటే ఆయన బైబిలులోని దేవుని గురించి వర్ణించడం లేదు. పేరులేని, చేరుకోలేని గ్రీకుతత్త్వానికి సంబంధించిన దేవుని గురించి వర్ణిస్తున్నాడు.

మృతుల పరిస్థితి ఏమిటి?

ఆత్మ లేదా గ్రీకులో సైఖే, శరీరము వేర్వేరు భాగాలని ఫీలో బోధించాడు. మానవునికి “శరీరము, సైఖే ఈ రెండూ ఉన్నాయి” అని ఆయన అన్నాడు. మరణం తర్వాత జీవిస్తూ ఉండేది ఏదైనా ఉందా? ఫీలో వివరణ గమనించండి: “మనం జీవించివున్నప్పుడు, మన సైఖే మరణించి సమాధిలో పాతిపెట్టబడినట్లు మన శరీరంలో పాతిపెట్టబడినప్పటికీ మనం సజీవంగానే ఉంటాము. కానీ అది [శరీరము] మరణిస్తే, సైఖే తాను బంధీగా ఉన్న పాపిష్ఠి మృత శరీరం నుండి వేరైపోయి దాని సహజ జీవితాన్ని అది గడుపుతుంది.” సైఖే మరణించడం సూచనార్థకమైనదని, అది నిజంగా ఎప్పుడూ మరణించదని, అది అమర్త్యమైనదని ఫీలో ఉద్దేశం.

అయితే బైబిలు ఏమి బోధిస్తోంది? ప్రసంగి 9:​5, 10 ఇలా చెబుతోంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” *

ఫీలో మరణించిన తర్వాత, యూదులు ఆయన గురించి అంతగా పట్టించుకోలేదు. అయితే క్రైస్తవ మతసామ్రాజ్యం మాత్రం ఆయన బోధలను స్వీకరించింది. ఈసూబియస్‌, ఇతర చర్చి నాయకులు ఫీలో క్రైస్తవత్వానికి మారాడని నమ్మారు. జెరోమ్‌ ఆయనను చర్చి ఫాదర్‌లలో ఒకరిగా పేర్కొన్నాడు. యూదులకన్నా మతభ్రష్ట క్రైస్తవులే ఫీలో రచనలను భద్రంగా ఉంచారు.

ఫీలో రచనలు ఒక మత ఉద్యమానికి దారితీశాయి. ఆయన ప్రభావం మూలంగా నామకార్థ క్రైస్తవులు ఆత్మ అమర్త్యమైనది అనే లేఖనాధారం లేని సిద్ధాంతాన్ని అంగీకరించారు. లోగోస్‌ (లేదా, వాక్యం) గురించి ఫీలో బోధించినది, మతభ్రష్ట క్రైస్తవత్వానికి సంబంధించిన బైబిలేతర సిద్ధాంతమైన త్రిత్వ సిద్ధాంతం అభివృద్ధి చెందడానికి కారణమైంది.

మోసపోకండి

ఫీలో హీబ్రూ లేఖనాల్లో తాను చేసిన అధ్యయనంలో, “సాధారణ భాష వెనుక దాగివుండగల సూచనార్థక భావాల్లో దేనినీ విడిచిపెట్టకుండా” శ్రద్ధ తీసుకున్నాడు. అయితే ద్వితీయోపదేశకాండము 4:2లో ఉన్నట్లుగా, దేవుని ధర్మశాస్త్రం గురించి మోషే ఇలా అన్నాడు: “మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలోనుండి దేనిని తీసివేయకూడదు.” ఆయన తన మంచి ఉద్దేశాలన్నింటితో, తన ఊహాకల్పనలతో దేవుని ప్రేరేపిత వాక్యంలో స్పష్టంగా ఉన్న ఉపదేశం మీద అస్పష్టం అనే ఒక దట్టమైన పొరను కప్పేశాడు.

“చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు” అని అపొస్తలుడైన పేతురు అన్నాడు. (2 పేతురు 1:​16) తొలి క్రైస్తవ సంఘానికి పేతురు ఇచ్చిన ఉపదేశం, ఫీలో రచనల్లా కాక వాస్తవం మీదా వారిని సత్యంలోకి నడిపించిన దేవుని ఆత్మ, అంటే “సత్యస్వరూపియైన ఆత్మ” నిర్దేశం మీదా ఆధారపడి ఉంది.​—⁠యోహాను 16:13.

మీరు బైబిలులోని దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటే, మీకు మానవ ఆలోచన మీద ఆధారపడిన ఊహాకల్పనలు కాదు, సత్యవంతమైన నడిపింపు అవసరం. యెహోవా గురించి ఆయన చిత్తం గురించి మీకు ఖచ్చితమైన జ్ఞానం అవసరం, శ్రద్ధగల విద్యార్థిగా ఉండడానికి మీకు అణకువ అవసరం. అలాంటి ఆరోగ్యదాయకమైన దృక్పథంతో మీరు బైబిలు అధ్యయనం చేస్తే, మీరు ‘క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను’ తెలుసుకోగలుగుతారు. దేవుని వాక్యం మీరు ‘సన్నద్ధులై, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు’ చేయగలదని తెలుసుకుంటారు.​—⁠2 తిమోతి 3:​14-17.

[అధస్సూచి]

^ పేరా 17 సైఖే లేక నెఫెష్‌ గురించి, 1910 నాటి ద జ్యూయిష్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా వ్యాఖ్యానిస్తోంది: “శరీరం నశించిన తర్వాత నెఫెష్‌ ఇంకా ఉనికిలోనే ఉంటుందనే నమ్మకం మొదటి నుండి ఉన్న విశ్వాసం కాదుగానీ అది తత్త్వసంబంధిత, వేదాంతసంబంధిత ఊహాకల్పన మాత్రమే, ఆ బోధన పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కడా లేదు.”

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఫీలో నివసించిన నగరం

ఫీలో ఐగుప్తులోని అలెగ్జాండ్రియాలో నివసించాడు, అక్కడే పనిచేశాడు. శతాబ్దాలపాటు ఆ నగరం పుస్తకాలకు, పండిత చర్చలకు ప్రపంచ ప్రధాన నగరంగా ఉంది.

ఆ నగరంలోని పాఠశాలల్లో బోధించే ప్రముఖ పండితుల వద్ద విద్యార్థులు నేర్చుకునేవారు. అలెగ్జాండ్రియాలోని గ్రంథాలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. గ్రంథాలయ అధికారులు ప్రతీ లిఖిత పత్రాన్ని సంపాదించడానికి ప్రయత్నించడంతో దానిలోని పుస్తకాలు వందలవేల సంఖ్యకు చేరుకున్నాయి.

ఆ తర్వాత, ప్రపంచమంతటా అలెగ్జాండ్రియాపట్ల ఉన్న ప్రశంసా, దానిలోని జ్ఞాన భాండాగారమూ క్రమేణా తగ్గిపోయాయి. రోములోని చక్రవర్తులు తమ సొంత నగరానికే ప్రాధాన్యతనిచ్చారు, సాంస్కృతిక కేంద్రం ఐరోపాకు మారింది. ఆక్రమణదారులు సా.శ. ఏడవ శతాబ్దంలో అలెగ్జాండ్రియాను జయించడంతో దాని పతనం చరమాంకానికి చేరుకుంది. పేరు పొందిన గ్రంథాలయాన్ని కోల్పోయినందుకు చరిత్రకారులు నేటికీ విలపిస్తున్నారు, నాగరికత 1,000 సంవత్సరాలు వెనుకబడి పోయిందని కొందరంటారు.

[చిత్రసౌజన్యం]

L. Chapons/Illustrirte Familien-Bibel nach der deutschen Uebersetzung Dr. Martin Luthers

[12వ పేజీలోని బాక్సు]

నేటి సూచనార్థక భావ వివరణ

సాధారణంగా, “మానవ ఉనికికి సంబంధించిన సత్యాలను లేదా సామాన్యభావాలను సూచనార్థకమైన కాల్పనిక పాత్రల ద్వారా, చర్యల ద్వారా మరొక విధంగా వర్ణించడాన్ని” రెండర్థాల కథ అంటారు. ఈ కథలు ఉన్న వృత్తాంతాల్లో, మరెంతో ప్రాముఖ్యమైన విషయాలు సూచనార్థక భావంలో నిగూఢంగా ఉంటాయని అంటారు. అలెగ్జాండ్రియాకు చెందిన ఫీలో మాదిరిగానే కొంతమంది ఆధునిక దిన మతనాయకులు, బైబిలును వివరించడానికి సూచనార్థక భావ వివరణను ఉపయోగిస్తారు.

ఆదికాండము 1-11 అధ్యాయాలను పరిశీలించండి, అందులో సృష్టినుండి బాబెలు గోపురం వద్ద ప్రజలు చెల్లాచెదరవడం వరకు ఉన్న మానవ చరిత్ర ఉంది. బైబిలులోని ఈ భాగం గురించి, క్యాథలిక్‌ అనువాదమైన ద న్యూ అమెరికన్‌ బైబిల్‌ ఇలా చెబుతోంది: “ఈ అధ్యాయాల్లోని సత్యాలను భద్రపరచవలసిన ఇశ్రాయేలు ప్రజలు, వాటిని స్పష్టంగా అర్థం చేసుకునేలా చేయాలంటే ఆ కాలంలో ఆ ప్రజలకు తెలిసిన అంశాల ద్వారానే వాటిని తెలియజేయాలి. ఈ కారణాన్ని బట్టి, సత్యాలను వాటి భాషాపరమైన వస్త్రం ముసుగు నుండి తొలగించి స్పష్టంగా వేరుచేయాలి.” ఇది, ఆదికాండము 1-11 అధ్యాయాలను అక్షరార్థంగా తీసుకోకూడదు, వస్త్రం శరీరాన్ని కప్పి ఉంచినట్లే పదాలు లోతైన భావాన్ని కప్పి ఉంచుతాయని చెప్పడమే.

అయితే, ఆదికాండములోని ఆ తొలి అధ్యాయాలు అక్షర సత్యాలని యేసు బోధించాడు. (మత్తయి 19:4-6; 24:​37-39) అపొస్తలులైన పౌలు, పేతురు కూడా అలాగే బోధించారు. (అపొస్తలుల కార్యములు 17:24-26; 2 పేతురు 2:5; 3:​6, 7) యథార్థవంతులైన బైబిలు విద్యార్థులు దేవుని వాక్యమంతటికీ అనుగుణంగాలేని వివరణలను తిరస్కరిస్తారు.

[9వ పేజీలోని చిత్రం]

అలెగ్జాండ్రియాలోని పెద్ద లైట్‌హౌస్‌

[చిత్రసౌజన్యం]

Archives Charmet/Bridgeman Art Library