కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“తన విశ్వాసం కారణంగా ఆయన హింసించబడ్డాడు”

“తన విశ్వాసం కారణంగా ఆయన హింసించబడ్డాడు”

“తన విశ్వాసం కారణంగా ఆయన హింసించబడ్డాడు”

ఉత్తర ఇటలీలోని చెర్నోబ్యో పట్టణం, మానవ హక్కుల ఉల్లంఘనకు గురైన బాధితుల జ్ఞాపకార్థంగా స్థానిక పార్క్‌లో ఒక స్మారకస్థలాన్ని స్థాపించింది. వారి జ్ఞాపకార్థం ఆవిష్కరించబడిన శిలాఫలకాల్లో ఒకటి నార్సీసో రీట్‌కు అంకితం చేయబడింది. రీట్‌ జర్మనీలో జన్మించాడు, ఆయన తల్లిదండ్రులు ఇటలీకి చెందినవారు, 1930లలో ఆయన ఒక యెహోవాసాక్షి అయ్యాడు. యెహోవాసాక్షులు సత్య దేవుడైన యెహోవా కన్నా హిట్లర్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి నిరాకరించారు కాబట్టి వారు హిట్లర్‌ పాలనలో హింసించబడ్డారు.

నిర్బంధ శిబిరాల్లోకి కావలికోట పత్రికలను చేరవేయడంలో రీట్‌ పాత్ర ఉందని గెస్టపో కనుగొన్నప్పుడు ఆయన చెర్నోబ్యో పట్టణానికి పారిపోయాడు. కావలికోట పత్రికను ఇటాలియన్‌ భాషలోకి అనుదించి వాటిని దగ్గర్లో ఉన్న తన తోటి విశ్వాసులకు పంచిపెట్టమని అక్కడ ఆయనను కోరారు. అయితే ఆయన చురుకైన కార్యకలాపాలు గమనించబడకుండా పోలేదు. ఒక SS అధికారి, అతని మనుష్యులు రీట్‌ ఇంట్లోకి జొరబడి, ఆయనను అరెస్టు చేసి, “నేరానికి” సాక్ష్యంగా రెండు బైబిళ్లను, కొన్ని ఉత్తరాలను స్వాధీనం చేసుకున్నారు! రీట్‌ను దేశంనుండి బహిష్కరించి జర్మనీకి పంపించి, డకావు నిర్బంధ శిబిరంలో ఉంచారు, రెండవ ప్రపంచ యుద్ధం ముగియడానికి కొంతకాలం ముందు ఆయనను చంపేశారు. “ఆయన తన విశ్వాసం కారణంగా హింసించబడ్డాడు” అని చెర్నోబ్యో శిలా ఫలకం మీద ఉంది.

నాజీ హింసకు గురైన నార్సీసో రీట్‌ విశ్వాసం, ఇతర వందలాది సాక్షుల విశ్వాసం, యెహోవాకు నమ్మకంగా ఉండాలని నేటి క్రైస్తవులను ప్రోత్సహిస్తోంది. విశ్వమంతటిలో ఆయన మాత్రమే మన ఆరాధనను పొందడానికి అర్హుడు. (ప్రకటన 4:​10) యేసు ఇలా చెప్పాడు: “నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు.” దేవుడు వారి క్రియలను గుర్తుంచుకొని ధైర్యం ప్రదర్శించినందుకు వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు.​—⁠మత్తయి 5:10; హెబ్రీయులు 6:​10.