కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిదండ్రులారా, మీ కుటుంబాన్ని సంరక్షించండి

తల్లిదండ్రులారా, మీ కుటుంబాన్ని సంరక్షించండి

తల్లిదండ్రులారా, మీ కుటుంబాన్ని సంరక్షించండి

“ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై . . . యుండును.”​—⁠1 తిమోతి 5:⁠8.

కూటానికి ముందు, క్రైస్తవ సంఘాన్ని మీరు ఒకసారి పరికించి చూస్తే, శుభ్రమైన దుస్తులు ధరించి చక్కగా తయారైన పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రక్కన కూర్చోవడం మీకు కనిపిస్తుంది. అలాంటి కుటుంబాల్లో యెహోవాపట్ల, ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపించడం చూడముచ్చటగా ఉండదా? అయితే కుటుంబ సభ్యులందరూ సరిగ్గా సమయానికి కూటాలకు రావడానికి ఎంత శ్రమపడాల్సి వచ్చిందో మనం సులభంగా మరచిపోతాం.

2 చాలామంది తల్లిదండ్రులకు రోజంతా పనిలోనే గడిచిపోతుంది, ఇక కూటాలు జరిగే రోజైతే అసలు తీరికే దొరకదు. వంట చేయడం, ఇతరత్రా పనులు, పిల్లలతో హోమ్‌వర్క్‌ చేయించడం వంటివి ఉంటాయి. అందరూ స్నానాలు చేసి, భోజనం చేసి సమయానికి సిద్ధపడేలా చూడడంలో తల్లిదండ్రులకు చెప్పలేనంత పని ఉంటుంది. ఇక పిల్లలతో అనుచితమైన సమయంలో అనుకోని సమస్య వచ్చిపడుతుంది. పెద్దోడు ఆడుకుంటూ నిక్కరు చింపుకుంటాడు. చిన్నోడు అన్నం కింద పడేసుకుంటాడు. పిల్లలు కీచులాడుకోవడం మొదలుపెడతారు. (సామెతలు 22:15) దాని ఫలితం? ఒక్కోసారి కూటానికి వెళ్లేందుకు తల్లిదండ్రులు జాగ్రత్తగా వేసిన మంచి ప్రణాళిక కూడా దెబ్బతింటుంది. అయినాసరే, కుటుంబం అన్ని సందర్భాల్లో కూటానికి ముందే రాజ్య మందిరానికి చేరుకుంటుంది. అలా పిల్లలు ఎదిగి యెహోవాను సేవించే సమయం వచ్చేవరకు వారు చాలా సంవత్సరాలు, ప్రతీవారం కూటాలకు రావడాన్ని చూడడం ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో కదా!

3 తల్లిగా లేదా తండ్రిగా మీ పని కొన్నిసార్లు కష్టంగా, చాలా అలసట కలిగించేదిగా ఉన్నప్పటికీ, మీ ప్రయత్నాలను యెహోవా ఎంతో విలువైనవిగా పరిగణిస్తాడనే నమ్మకంతో మీరు ఉండవచ్చు. కుటుంబ ఏర్పాటును యెహోవాయే ప్రారంభించాడు. అందుకే ప్రతీ కుటుంబం ‘యెహోవానుబట్టి కుటుంబమని’ పిలవబడుతూ, ఆయన మూలంగానే ఉనికిలో ఉందని ఆయన వాక్యం చెబుతోంది. (ఎఫెసీయులు 3:14, 15) కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులైన మీరు సరైనవిధంగా మీ వంతు కృషి చేయడానికి ప్రయత్నించినప్పుడు, మీరు విశ్వసర్వాధిపతిని ఘనపరచిన వారవుతారు. (1 కొరింథీయులు 10:31) అదొక గొప్ప ఆధిక్యత కాదా? కాబట్టి, తల్లిదండ్రులకు యెహోవా ఇచ్చిన నియామకాన్ని పరిశీలించడం సముచితంగా ఉంటుంది. ఈ ఆర్టికల్‌లో మనం కుటుంబాన్ని సంరక్షించడానికి సంబంధించి ఇవ్వబడిన నియామకాన్ని పరిశీలిద్దాం. తల్లిదండ్రులు తమ కుటుంబాన్ని ఏ మూడు విధాలుగా సంరక్షించాలని దేవుడు కోరుతున్నాడో మనం సమీక్షిద్దాం.

భౌతికంగా సంరక్షించడం

4 అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” (1 తిమోతి 5:8) పౌలు ఇక్కడ “ఎవడైనను” అని వ్రాసినప్పుడు, ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కుటుంబ శిరస్సు, అంటే తండ్రి గురించే. దేవుడు స్త్రీకి కూడా, తన భర్తకు సాటియైన సహకారిగా ఉండవలసిన ఒక గౌరవప్రదమైన పాత్రను ఇచ్చాడు. (ఆదికాండము 2:18) బైబిలు కాలాల్లోని స్త్రీలు కుటుంబాన్ని సంరక్షించే విషయంలో తరచూ తమ భర్తలకు చేదోడువాదోడుగా ఉన్నారు. (సామెతలు 31:13, 14, 16) నేడు, ఒంటరి తల్లి లేదా తండ్రి ఉన్న కుటుంబాలు సామాన్యమైపోయాయి. * ఒంటరిగా ఉన్న తల్లులు లేదా తండ్రులు చాలామంది ప్రశంసాత్మక రీతిలో తమ కుటుంబాలను సంరక్షించుకుంటున్నారు. అయితే, కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఉండడం, అందులో తండ్రి సారథ్యం వహించడం ఆదర్శవంతంగా ఉంటుంది.

5మొదటి తిమోతి 5:8లో పౌలు ఏ విధమైన సంరక్షణ గురించి మాట్లాడాడు? ఆయన కుటుంబ భౌతిక అవసరాల గురించి సూటిగా మాట్లాడుతున్నాడని సందర్భం సూచిస్తోంది. నేటి ప్రపంచంలో, ఆ అవసరాలు తీర్చడానికి కుటుంబ శిరస్సు అనేక అడ్డంకులను ఎదుర్కోవచ్చు. కార్మికుల తాత్కాలిక తొలగింపులు, తీవ్రమైన నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు మామూలైపోయాయి. అలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ పట్టుదలగా సంరక్షణా బాధ్యతలు నెరవేర్చడానికి వారికి ఏది సహాయం చేయగలదు?

6 సంరక్షించే వ్యక్తి తాను యెహోవా నుండి పొందిన నియామకాన్ని నెరవేరుస్తున్నట్లు గుర్తుంచుకోవడం మంచిది. ఈ ఆజ్ఞకు లోబడగలవాడైనప్పటికీ, అలా చేయడానికి నిరాకరించే వ్యక్తి “అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును” అని పౌలు ప్రేరేపిత మాటలు చూపిస్తున్నాయి. తన దేవుని ఎదుట అలాంటి వ్యక్తిలా పరిగణించబడకుండా ఉండడానికి ఒక క్రైస్తవుడు శాయశక్తులా కృషి చేస్తాడు. అయితే, నేడు ప్రపంచంలో చాలామంది “అనురాగరహితులు”గా ఉండడం శోచనీయం. (2 తిమోతి 3:1, 3) అవును, అసంఖ్యాక రీతిలో తండ్రులు తమ బాధ్యతను గాలికొదిలేసి, తమ కుటుంబాలను దిక్కులేని స్థితికి దిగజారుస్తున్నారు. అయితే క్రైస్తవ భర్తలు తమ కుటుంబాలను సంరక్షించే విషయంలో అలాంటి కఠినమైన, నిర్లక్ష్యమైన వైఖరిని అవలంబించరు. తమతోటి ఉద్యోగస్థుల్లో చాలామందికి భిన్నంగా క్రైస్తవ సంరక్షకులు తమ ప్రియమైనవారిని పోషించుకోవడానికి సహాయం చేస్తాయి కాబట్టి, అల్పస్థాయి ఉద్యోగాలు కూడా యెహోవా దేవుణ్ణి సంతోషపెట్టే మాధ్యమాలని వాటిని గౌరవనీయమైన, ప్రాముఖ్యమైన వాటిగా పరిగణిస్తారు.

7 యేసు పరిపూర్ణ మాదిరిని ధ్యానించడం కూడా కుటుంబ శిరస్సులకు సహాయం చేయవచ్చు. బైబిలు ప్రవచనార్థకంగా యేసును మన “నిత్యుడగు తండ్రి” అని సూచిస్తోందని గుర్తుంచుకోవాలి. (యెషయా 9:6, 7) “కడపటి ఆదాము”గా యేసు పరిపూర్ణ భావంలో ‘ఆదామను మొదటి మనుష్యుని’ స్థానంలో విశ్వాసులకు తండ్రి అవుతాడు. (1 కొరింథీయులు 15:45) పచ్చి స్వార్థపరునిగా మారిన ఆదాములా కాక, యేసు ఆదర్శవంతమైన తండ్రిగా ఉన్నాడు. ఆయన గురించి బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము.” (1 యోహాను 3:16) అవును, యేసు ఇతరుల కోసం ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని అర్పించాడు. అలాగే ఆయన తన దైనందిన జీవితంలో చిన్నచిన్న విషయాల్లో కూడా ఇతరుల అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. తల్లిదండ్రులైన మీరు ఆ స్వయంత్యాగ స్ఫూర్తిని అనుకరించడం మంచిది.

8 బాధ్యతారహితంగా ప్రవర్తించిన దేవుని ప్రజలతో యేసు పలికిన ఈ మాటల నుండి తల్లిదండ్రులు నిస్వార్థ ప్రేమను గురించి ఎంతో నేర్చుకోవచ్చు: “కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని.” (మత్తయి 23:37) ఇక్కడ యేసు, తల్లి కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు చేర్చుకొని కాపాడే విధానాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించాడు. అవును, తన పిల్లలను కాపాడే ప్రక్రియలో ప్రాణాలు తెగించడానికి కూడా సిద్ధపడే తల్లిపక్షి సంరక్షక సహజ జ్ఞానం నుండి తల్లిదండ్రులు ఎంతో నేర్చుకోవచ్చు. అయితే ప్రతీదినం తల్లిపక్షి చేసే ఇతర పనులు కూడా గమనించదగినవిగా ఉంటాయి. ఆహారాన్వేషణలో తల్లిపక్షి గూటికి, బయటకు చాలాసార్లు వెళ్లివస్తుంది. పూర్తిగా అలసిపోయిన స్థితిలో కూడా అది నోళ్ళు తెరిచి అరిచే పిల్లలకు ఆహారం పెడుతుంది, అవి నోట్లోపడ్డ ఆహారాన్ని మ్రింగేసి మళ్లీ అరవడం మొదలుపెడతాయి. యెహోవా సృష్టి ప్రాణుల్లో అనేకం తమ పిల్లలను సంరక్షించే విధానంలో సహజ జ్ఞానాన్ని లేదా ‘మిక్కిలి జ్ఞానాన్ని’ ప్రదర్శిస్తాయి.​—⁠సామెతలు 30:24.

9 ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ తల్లిదండ్రులు కూడా అదేవిధంగా అద్భుతరీతిలో స్వయంత్యాగ స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. మీ పిల్లలకు ఏ హానీ జరుగకుండా వారిని కాపాడడానికి, ఒకవేళ మీకే ఏదైనా హాని జరిగినా సహిస్తారు. అంతేకాదు, మీ కుటుంబ సంరక్షణ కోసం ప్రతీదినం మీరు ఇష్టపూర్వకంగా త్యాగాలు చేస్తారు. అలసట కలిగించే పనులు లేదా కష్టమైన పనులు చేసేందుకు మీలో చాలామంది ఉదయాన్నే నిద్ర లేస్తారు. కుటుంబానికి పోషకాహారం సమకూర్చడానికి మీరు కష్టపడి పనిచేస్తారు. మీ పిల్లలకు శుభ్రమైన బట్టలు, సరైన వసతి, తగిన విద్య లభించాలని మీరు ఎన్నో తంటాలు పడతారు. అలా మీరు సంవత్సరాల తరబడి రోజూ ఈ విధంగా కష్టపడతారు. అలాంటి త్యాగాలు, సహనం నిశ్చయంగా యెహోవాను సంతోషపరుస్తాయి. (హెబ్రీయులు 13:16) అయితే, మీ కుటుంబ సంరక్షణలో మరి ప్రాముఖ్యమైనవి ఉన్నాయని కూడా మీరు గుర్తుంచుకుంటారు.

ఆధ్యాత్మికంగా సంరక్షించడం

10 భౌతికంగా సంరక్షించడంకన్నా ఆధ్యాత్మికంగా సంరక్షించడం ఆవశ్యకం. యేసు ఇలా చెప్పాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” (మత్తయి 4:⁠4; 5:⁠3) పిల్లలను ఆధ్యాత్మికంగా సంరక్షించడానికి తల్లిదండ్రులుగా మీరేమి చేయవచ్చు?

11 ఈ విషయంలో ద్వితీయోపదేశకాండము 6:​5-7 ఉల్లేఖించబడినంత తరచుగా మరే లేఖనమూ ఉల్లేఖించబడలేదు. దయచేసి మీ బైబిలు తెరిచి ఆ వచనాలు చదవండి. ముందుగా తల్లిదండ్రులు యెహోవాపట్ల ప్రేమను వృద్ధిచేసుకొని ఆయన మాటలను హృదయాల్లో నింపుకోవడం ద్వారా తమ ఆధ్యాత్మికతను కాపాడుకోవాలని చెప్పడాన్ని గమనించండి. అవును, మీరు బైబిలును క్రమంగా చదవడమే కాక, యెహోవా మార్గాలు, సూత్రాలు, నియమాల విషయంలో సరైన అవగాహనను, వాటిపట్ల ప్రేమను వృద్ధి చేసుకోవడానికి చదివిన దానిని ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని నిజంగా అభ్యసించే విద్యార్థిగా కూడా ఉండాలి. ఫలితంగా ఆసక్తికరమైన బైబిలు సత్యాలతో నిండిన మీ హృదయం మీరు ఆనందంగా ఉండడానికి, యెహోవాపట్ల భక్తిపూర్వక భయంతో, ప్రేమతో ఉండడానికి మిమ్మల్ని పురికొల్పుతుంది. అలా మీ పిల్లలకు నేర్పించడానికి సద్విషయాలు మీ దగ్గర సమృద్ధిగా ఉంటాయి.​—⁠లూకా 6:45.

12 ఆధ్యాత్మికంగా బలంగా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రతి సందర్భంలోనూ యెహోవా మాటలను ‘అభ్యసింపజేయాలనే’ ద్వితీయోపదేశకాండము 6:7లోని ఉపదేశాన్ని అన్వయించుకోవడానికి ఇష్టపడతారు. ‘అభ్యసింపజేయడం’ అంటే బోధించడం, పదేపదే చెబుతూ వారి మనస్సుల మీద ముద్ర వేయడం అని అర్థం. నేర్చుకోవడానికి మనందరికీ, ప్రత్యేకంగా పిల్లలకు పునరుక్తి అవసరమని యెహోవాకు తెలుసు. కాబట్టి, యేసు తన పరిచర్యలో పునరుక్తిని ఉపయోగించాడు. ఉదాహరణకు, గర్విష్ఠులుగా, పోటీపడేవారిగా ఉండే బదులు వినయస్థులుగా ఉండాలని తన శిష్యులకు బోధించినప్పుడు, ఆయన ఒకే సూత్రాన్ని పదే పదే ఉపయోగిస్తూ పరిపరి విధాలుగా వివరించాడు. తర్కిస్తూ, ఉదాహరిస్తూ, చివరికి ప్రదర్శిస్తూ కూడా ఆయన వారికి బోధించాడు. (మత్తయి 18:​1-4; 20:25-27; యోహాను 13:12-15) అయితే గుర్తించదగిన విషయమేమిటంటే, యేసు ఎన్నడూ అసహనాన్ని ప్రదర్శించలేదు. అదేవిధంగా, తల్లిదండ్రులు తమ పిల్లలు యెహోవా సూత్రాలను గ్రహించి, వాటిని అన్వయించుకునేంత వరకు ఓపికగా పదేపదే చెబుతూ వారికి ప్రాథమిక సత్యాలు నేర్పించే మార్గాల కోసం అన్వేషించాలి.

13 అలా బోధించడానికి కుటుంబ అధ్యయన సమయాలు సరైన సందర్భాలుగా ఉంటాయి. నిజానికి, కుటుంబ ఆధ్యాత్మికతకు క్రమమైన, క్షేమాభివృద్ధికరమైన, సంతోషభరితమైన కుటుంబ అధ్యయనమే కీలకం. యెహోవా సంస్థ అందించే సాహిత్యాలను ఉపయోగిస్తూ తమ పిల్లల అవసరాలకు తగినట్లుగా అధ్యయనాన్ని మలుచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ కుటుంబాలు అలాంటి కుటుంబ అధ్యయనాలను ఆస్వాదిస్తున్నాయి. ఈ విషయంలో యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) పుస్తకంలాగే గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకం కూడా ఒక గొప్ప వరంలా ఉంది. * అయితే పిల్లలకు నేర్పించాల్సింది ఒక్క కుటుంబ అధ్యయనమప్పుడే కాదు.

14ద్వితీయోపదేశకాండము 6:7 చూపిస్తున్నట్లుగా, తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలతో ఆధ్యాత్మిక విషయాలు చర్చించే సందర్భాలు అనేకం ఉన్నాయి. కలిసి ప్రయాణిస్తున్నా, పనిచేస్తున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా మీ పిల్లల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చే అవకాశాలు మీకు లభించవచ్చు. అలాగని మీ పిల్లలకు బైబిలు సత్యాల గురించి అదే పనిగా “ఉపన్యాసం” ఇస్తున్నట్లు చెప్పకూడదు. బదులుగా, కుటుంబ సంభాషణను ప్రోత్సాహకరంగా, ఆధ్యాత్మికంగా సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, తేజరిల్లు! పత్రికలో అనేక అంశాలపై ఆర్టికల్స్‌ ఉంటాయి. అలాంటి ఆర్టికల్స్‌ యెహోవా జంతు సృష్టి గురించీ, ప్రపంచవ్యాప్త సుందర ప్రదేశాల గురించీ, మానవ సంస్కృతి, జీవన విధానాల అద్భుతమైన వైవిధ్యం గురించీ సంభాషించే అవకాశాలు ఇవ్వవచ్చు. అలాంటి సంభాషణలు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి అందించే సాహిత్యాలను ఇంకా ఎక్కువగా చదివేందుకు పిల్లలను ప్రేరేపించవచ్చు.​—⁠మత్తయి 24:45-47.

15 మీ పిల్లలతో క్షేమాభివృద్ధికరంగా సంభాషించడం మరో ఆధ్యాత్మిక అవసరతను తీర్చడానికి మీకు సహాయం చేస్తుంది. క్రైస్తవ పిల్లలు తమ విశ్వాసాన్ని ఇతరులతో సమర్థంగా పంచుకోవడాన్ని నేర్చుకోవాలి. కావలికోట లేదా తేజరిల్లు! పత్రికల్లోని ఆసక్తికరమైన ఒక అంశం గురించి మాట్లాడేటప్పుడు, ఆ విషయాన్ని పరిచర్యతో ముడిపెట్టగల అవకాశాల కోసం మీరు చూడవచ్చు. ఉదాహరణకు, మీరు ఇలా అడగవచ్చు: “యెహోవా గురించిన ఈ విషయాన్ని ఇంకా ఎక్కువమంది తెలుసుకోవడం అద్భుతంగా ఉండదా? ఈ అంశం మీద ఒక వ్యక్తికి ఆసక్తి కలిగించడానికి ఏమి చేస్తే బావుంటుంది?” అలాంటి చర్చలు పిల్లలు తాము నేర్చుకుంటున్నది ఇతరులతో పంచుకోవాలనే ఆసక్తిని వారిలో అధికం చేయడానికి సహాయం చేయవచ్చు. ఆ తర్వాత, పరిచర్యలో మీ పిల్లలు మీతో కూడా వచ్చినప్పుడు, అలాంటి చర్చలను ఆచరణలో పెట్టడాన్ని వారు కళ్లారా చూస్తారు. అలాగే వారు పరిచర్య ఎంతో సంతృప్తిని, ఆనందాన్నిచ్చేదనీ, ఆసక్తికరమైనదనీ, సంతోషకరమైనదనీ కూడా తెలుసుకుంటారు.​—⁠అపొస్తలుల కార్యములు 20:35.

16 ప్రార్థించేటప్పుడు కూడా తల్లిదండ్రులు తమ పిల్లల ఆధ్యాత్మిక అవసరతలు తీర్చవచ్చు. యేసు తన శిష్యులకు ఎలా ప్రార్థించాలో నేర్పించాడు, అనేక సందర్భాల్లో వారితో కూడా ప్రార్థించాడు. (లూకా 11:1-13) వారు స్వయంగా యెహోవా కుమారునితోనే కలిసి ప్రార్థించడం ద్వారా ఎంత బాగా నేర్చుకొని ఉంటారో ఒక్కసారి ఊహించండి! అదేవిధంగా, మీ పిల్లలు కూడా మీ ప్రార్థనల నుండి ఎంతో నేర్చుకోగలరు. ఉదాహరణకు, మన సమస్యలన్నింటినీ యెహోవాకు తెలియజేస్తూ మనం హృదయపూర్వకంగా తనతో మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడని వారు గ్రహించవచ్చు. అవును, తమ పరలోకపు తండ్రితో సంబంధం ఏర్పరచుకోవడం సాధ్యమే అనే ఆవశ్యకమైన ఆధ్యాత్మిక సత్యాన్ని మీ పిల్లలు నేర్చుకోవడానికి మీ ప్రార్థనలు సహాయం చేయగలవు.​—⁠1 పేతురు 5:7.

భావోద్రేకపరంగా సంరక్షించడం

17 నిజమే, పిల్లలకు ప్రాముఖ్యమైన భావోద్రేకపర అవసరాలు కూడా ఉంటాయి. ఆ మేరకు సంరక్షణనివ్వడం ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యం తల్లిదండ్రులకు చెబుతోంది. ఉదాహరణకు, యౌవన స్త్రీలు ‘తమ శిశువులను ప్రేమించువారిగా’ ఉండాలని ప్రోత్సహించబడుతున్నారు. అలా ప్రేమించడమనేది యౌవన తల్లులు “స్వస్థబుద్ధి” గలవారై ఉండడానికి సంబంధించినది. (తీతు 2:3-4) అవును, పిల్లలను ప్రేమించడం సహేతుకమైనది. ఇది పిల్లలకు ప్రేమించడాన్ని నేర్పించడమేకాక, నిరంతర ప్రయోజనాలను తెస్తుంది. మరోవైపున, పిల్లలను ప్రేమించకపోవడం అవివేకమే అవుతుంది. అది తీవ్రమైన బాధలకు కారణమవడమే కాక, మనం అపరిపూర్ణులమైనా మనలను అధికంగా ప్రేమించే యెహోవాను అనుకరించడం లేదని సూచిస్తుంది.​—⁠కీర్తన 103:8-14.

18 యెహోవా తన భూసంబంధ పిల్లలను ప్రేమించడంలో చొరవ తీసుకుంటున్నాడు. “ఆయనే మొదట మనలను ప్రేమించెను” అని 1 యోహాను 4:⁠19 చెబుతోంది. ప్రాముఖ్యంగా, తండ్రులైన మీరు మీ పిల్లలపట్ల ప్రేమపూర్వక బంధాన్ని నెలకొల్పడానికి చొరవ తీసుకుంటూ యెహోవా మాదిరిని అనుకరించాలి. “పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు” వారికి కోపం రప్పించకూడదని బైబిలు తండ్రులకు ఉద్బోధిస్తోంది. (కొలొస్సయులు 3:21) తల్లి లేదా తండ్రి తమను ప్రేమించడం లేదు, విలువైనవారిగా పరిగణించడం లేదు అనే భావనే అన్నిటికంటే ఎక్కువగా వారికి కోపం రప్పిస్తుంది. తమ భావోద్రేకాలను వ్యక్తం చేయని తండ్రులు యెహోవా మాదిరిని గుర్తుంచుకోవడం మంచిది. యెహోవా తన కుమారుణ్ణి ఆమోదిస్తున్నట్లు, ప్రేమిస్తున్నట్లు పరలోకం నుండి కూడా మాట్లాడాడు. (మత్తయి 3:​17; 17:5) అది యేసును ఎంతగా ప్రోత్సహించి ఉంటుందో కదా! అదేవిధంగా, తమ తల్లిదండ్రుల ఆమోదానికి, ప్రేమతో కూడిన యథార్థమైన మాటల నుండి పిల్లలు ఎంతో బలాన్ని, ధైర్యాన్ని పుంజుకుంటారు.

19 అవును, తల్లిదండ్రుల ప్రేమ కేవలం మాటలకే పరిమితం కాదు. ప్రేమ ప్రాథమికంగా క్రియల్లో వ్యక్తమవుతుంది. తల్లిదండ్రులు తాము చేసే పనులకు ప్రేమే అసలైన ప్రేరణ అనే విధంగా భౌతిక, ఆధ్యాత్మిక సంరక్షణను ఇచ్చినప్పుడు అదే తల్లిదండ్రుల ప్రేమకు ఒక గుర్తుగా ఉండగలదు. దానికితోడు, తల్లిదండ్రులు ఇచ్చే క్రమశిక్షణ వారి ప్రాణప్రదమైన ప్రేమను సూచిస్తుంది. అవును, “ప్రభువు [‘యెహోవా,’ NW] తాను ప్రేమించువానిని శిక్షిం[చును].” (హెబ్రీయులు 12:5-6) మరోవైపున, క్రమశిక్షణ ఇవ్వకపోవడం పిల్లలపట్ల తల్లిదండ్రుల ద్వేషాన్ని సూచిస్తుంది! (సామెతలు 13:24) యెహోవా ఎల్లప్పుడూ “న్యాయమునుబట్టి” అంటే సరైన మోతాదులోనే శిక్షిస్తాడు. (యిర్మీయా 46:28) అయితే అపరిపూర్ణ మానవులకు అలాంటి సమతుల్యం కాపాడుకోవడం ఎల్లప్పుడూ సులభం కాదు. అయినప్పటికీ, అలాంటి సమతుల్యం కాపాడుకోవడానికి చేసే కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్థిరమైన, ప్రేమపూర్వక క్రమశిక్షణ పిల్లవాడు సంతోషకరమైన, ఫలవంతమైన జీవితం జీవించేవానిగా తయారయ్యేందుకు సహాయం చేస్తుంది. (సామెతలు 22:6) తమ పిల్లవాని కోసం ప్రతీ క్రైస్తవ తల్లి లేదా తండ్రి కోరుకునేది అదే కాదా?

20 తల్లిదండ్రులైన మీరు యెహోవా మీకు నియమించిన పనిని అంటే మీ పిల్లల భౌతిక, ఆధ్యాత్మిక, భావోద్రేకపరమైన అవసరతలు తీర్చినప్పుడు లభించే ప్రతిఫలాలు గొప్పగా ఉంటాయి. ఆ విధంగా మీరు మీ పిల్లలకు ‘జీవాన్ని కోరుకొని,’ ఆ పిమ్మట నిత్యం ‘బ్రదుకుతూ’ ఉండే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన వారవుతారు. (ద్వితీయోపదేశకాండము 30:19-20) యెహోవాను సేవించాలని కోరుకునే పిల్లలు జీవమార్గాన్ని హత్తుకొని ఎదుగుతుండగా తమ తల్లిదండ్రులకు గొప్ప ఆనందాన్ని తీసుకొస్తారు. (కీర్తన 127:3-5) అలాంటి ఆనందం నిరంతరం నిలిచి ఉంటుంది! కానీ యౌవనులు ఇప్పుడు యెహోవాను ఎలా స్తుతించగలరు? ఈ అంశాన్ని తర్వాతి ఆర్టికల్‌ చర్చిస్తుంది.

[అధస్సూచీలు]

^ పేరా 7 ఈ చర్చలో, సాధారణంగా సంరక్షించే వ్యక్తి పురుషుడన్నట్లు పేర్కొనబడినా, ఇందులోని సూత్రాలు ప్రాథమిక సంరక్షకులుగా ఉన్న క్రైస్తవ స్త్రీలకు కూడా వర్తిస్తాయి.

^ పేరా 17 యెహోవాసాక్షులు ప్రచురించినవి.

మీరెలా జవాబిస్తారు?

తల్లిదండ్రులు తమ పిల్లలను

భౌతికంగా సంరక్షించడానికి ఏమి చేయవచ్చు?

ఆధ్యాత్మికంగా సంరక్షించడానికి ఏమి చేయవచ్చు?

భావోద్రేకపరంగా సంరక్షించడానికి ఏమి చేయవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) కుటుంబాలు క్రైస్తవ కూటాలకు కలిసి హాజరవడాన్ని చూడడం ఎందుకు ఉత్తేజకరంగా ఉంటుంది? (బి) సమయానికి కూటాలకు వచ్చే విషయంలో కుటుంబాలు ఎదుర్కొనే సవాళ్లలో కొన్ని ఏమిటి?

3. కుటుంబాలను యెహోవా అతి విలువైనవిగా పరిగణిస్తున్నాడని మనకెలా తెలుసు?

4. కుటుంబంలో పిల్లలను సంరక్షించడానికి సంబంధించి యెహోవా ఎలాంటి ఏర్పాట్లు చేశాడు?

5, 6. (ఎ) తమ కుటుంబాల భౌతిక అవసరాలు తీర్చడానికి ప్రయత్నించే కొందరు ఎదుర్కొనే సవాళ్లు కొన్ని ఏమిటి? (బి) క్రైస్తవ సంరక్షకులు పట్టుదలగా కొనసాగడానికి ఉద్యోగంపట్ల ఎలాంటి దృక్పథాన్ని కాపాడుకోవడం సహాయకరంగా ఉంటుంది?

7. తల్లిదండ్రులు యేసు ఆదర్శాన్ని ధ్యానించడం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది?

8, 9. (ఎ) తల్లిదండ్రులు పిల్లలను నిస్వార్థంగా సంరక్షించే విషయంలో పక్షులనుండి ఏమి నేర్చుకోవచ్చు? (బి) చాలామంది తల్లిదండ్రులు స్వయంత్యాగ స్ఫూర్తిని ఏ విధంగా ప్రదర్శిస్తున్నారు?

10, 11. మానవ అవసరాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటి, తమ పిల్లల ఈ అవసరతను తీర్చడానికి క్రైస్తవ తల్లిదండ్రులు మొదట ఏమి చేయాలి?

12. తల్లిదండ్రులు తమ పిల్లలకు బైబిలు సత్యాలను అభ్యసింపజేసేటప్పుడు యేసు మాదిరిని ఎలా అనుకరించవచ్చు?

13, 14. తల్లిదండ్రులు తమ పిల్లలకు బైబిలు సత్యాలు అభ్యసింపజేయగల కొన్ని సందర్భాలు ఏమిటి, ఎలాంటి ఆర్టికల్స్‌ ఉపయోగించవచ్చు?

15. క్రైస్తవ పరిచర్యను ఆసక్తికరమైనదిగా, ప్రతిఫలదాయకమైనదిగా దృష్టించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?

16. తమ తల్లిదండ్రుల ప్రార్థనలు విని పిల్లలు ఏమి నేర్చుకోవచ్చు?

17, 18. (ఎ) పిల్లలపట్ల ప్రేమ ప్రదర్శించవలసిన ప్రాముఖ్యతను బైబిలు ఎలా వెల్లడిచేస్తోంది? (బి) తమ పిల్లలపట్ల ప్రేమను వ్యక్తం చేయడంలో తండ్రులు యెహోవాను ఎలా అనుకరించాలి?

19. క్రమశిక్షణ ఎందుకు ప్రాముఖ్యం, క్రైస్తవ తల్లిదండ్రులు ఎలాంటి సమతుల్యం కోసం కృషిచేస్తారు?

20. తమ పిల్లలు ‘జీవాన్ని కోరుకొనే’ అవకాశాన్ని తల్లిదండ్రులు వారికి ఎలా ఇవ్వగలరు?

[18వ పేజీలోని చిత్రం]

తమ పిల్లలను సంరక్షించే ప్రక్రియలో చాలా పక్షులు అవిరామంగా పని చేస్తాయి

[20వ పేజీలోని చిత్రం]

తల్లిదండ్రులు మొదట తమ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలి

[20, 21వ పేజీలోని చిత్రాలు]

పిల్లలకు సృష్టికర్త గురించి బోధించే సందర్భాలు తల్లిదండ్రులకు అనేకం లభిస్తాయి

[22వ పేజీలోని చిత్రం]

తల్లిదండ్రుల ఆమోదం నుండి పిల్లలు బలాన్ని, ధైర్యాన్ని పుంజుకుంటారు