కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పని ఒక వరమా లేక శాపమా?

పని ఒక వరమా లేక శాపమా?

పని ఒక వరమా లేక శాపమా?

“తన కష్టార్జితముచేత సుఖపడుటకంటె . . . నరునికి మేలుకరమైనదేదియు లేదు.”​—⁠ప్రసంగి 2:​24.

“రోజంతా పనిచేసి సాయంకాలమయ్యేసరికి పూర్తిగా అలసిపోతున్నాను.” ఇటీవల జరిగిన ఒక సర్వేలో, ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరు తాము చాలా తరచుగా అలా భావిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలు ఒత్తిడితో బాధపడుతున్న వాతావరణంలో ఇది ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించదు; వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేస్తారు పైగా పనిని ఇంటికి కూడా తీసుకువెళతారు, అంత కష్టపడినా వాళ్ళ యజమానులు వారికి ప్రశంసాత్మకంగా ఒక్క మాటైనా చెప్పరు.

అధికోత్పత్తి ఆగమనం, చాలామంది పనివారు తాము భావరహిత భారీయంత్రపు చక్రాల పల్లులా ఉన్నామని భావించేలా చేసింది. ప్రేరణ, సృజనాత్మకత అడుగంటిపోతున్నాయి. సహజంగానే ఇది పనిపట్ల ప్రజల వైఖరిమీద ప్రభావం చూపిస్తుంది. దాంతో తమ పనిమీద వ్యక్తిగత శ్రద్ధ చూపించాలనే ఉత్సాహం సులభంగా అణగారిపోతుంది. పనితనంలో ప్రావీణ్యత సాధించాలనే కోరిక సన్నగిల్లిపోతుంది. అలాంటి పర్యవసానాలు పనంటేనే అయిష్టత కలిగిస్తూ, బహుశా తమ ఉద్యోగాన్నే అసహ్యించుకునేలా చేయవచ్చు.

మన వైఖరిని పరీక్షించుకోవడం

నిజమే, మనం మన పరిస్థితులను ఎల్లప్పుడూ మార్చుకోలేము. అయితే, మనం మన వైఖరిని మార్చుకోవచ్చని మీరు అంగీకరించరా? పనిపట్ల మీ ప్రతికూల దృక్పథాలు కొంతవరకు ప్రభావం చూపిస్తున్నట్లు మీరు భావిస్తే, ఈ అంశంపై దేవుని దృక్కోణాన్ని, ఆయన సూత్రాలను పరిశీలించడం మంచిది. (ప్రసంగి 5:​18) ఈ విషయాలను పరిశీలించడం తమ పనిలో కొంత సంతోషాన్నీ, సంతృప్తినీ పొందడానికి సహాయం చేశాయని అనేకులు గ్రహించారు.

దేవుడు సర్వోత్తమ కార్యశీలి. దేవుడు పని చేస్తాడు. బహుశా మనం ఆయన గురించి ఆ విధంగా తలంచి ఉండకపోవచ్చు, కానీ బైబిల్లో ఆయన తన గురించి తాను అలాగే పరిచయం చేసుకుంటున్నాడు. యెహోవా భూమ్యాకాశాలను సృష్టించాడని చెబుతూ ఆదికాండములోని వృత్తాంతం ప్రారంభమవుతుంది. (ఆదికాండము 1:⁠1) అలా సృష్టించడం ప్రారంభించినప్పుడు ఆయన పోషించిన వివిధరకాల పాత్రల్లో కేవలం కొన్నింటిని పరిశీలించండి​—⁠రూపకర్త, వ్యవస్థాపకుడు, నిర్మాణకుడు, కళాకారుడు, పదార్థ నిపుణుడు, ప్రణాళికా నిర్మాత, రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, జంతు శాస్త్రవేత్త, కార్యక్రమ నిర్వాహకుడు, భాషాశాస్త్రవేత్త.​—⁠సామెతలు 8:​12, 22-31.

దేవుని పని నాణ్యత ఎలా ఉంది? అది ‘మంచిగా,’ ‘చాలా మంచిదిగా’ ఉన్నట్లు బైబిలు వృత్తాంతం చెబుతోంది. (ఆదికాండము 1:​4, 31) నిజానికి సృష్టి ‘దేవుని మహిమను వివరించుచున్నది,’ మనం కూడా ఆయనను స్తుతించాలి!​—⁠కీర్తన 19:1; 148:⁠1.

అయితే, దేవుని పని భౌతిక భూమ్యాకాశాలను, మొదటి మానవజంటను సృష్టించడంతో ముగిసిపోలేదు. యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు.” (యోహాను 5:​17) అవును, యెహోవా తన సృష్టిప్రాణులకు అవసరమైనవి అనుగ్రహిస్తూ, సృష్టినంతటినీ బలపరుస్తూ, నమ్మకమైన తన సేవకులను రక్షిస్తూ పని చేస్తూనే ఉన్నాడు. (నెహెమ్యా 9:6; కీర్తన 36:6; 145:​15, 16) కొన్ని పనులు చేయడానికి ఆయన కొంతమందిని తన ‘జతపనివారిగా’ కూడా ఉపయోగించుకుంటున్నాడు.​—⁠1 కొరింథీయులు 3:⁠9.

పని ఒక ఆశీర్వాదంగా ఉండగలదు. పని ఒక శాపమని బైబిలు చెప్పడం లేదా? ఆదాము హవ్వలు తిరుగుబాటు చేసినందుకు దేవుడు వారిమీద పనిని ఒక భారంగా పెట్టడం ద్వారా వారిని శిక్షించాడని ఆదికాండము 3:17-19లోని వచనాలు చెబుతున్నట్లు అనిపించవచ్చు. ఆ మొదటి మానవులను ఖండించేటప్పుడు దేవుడు ఆదాముకు ఇలా చెప్పాడు: “నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు.” అది పనిని అన్ని విధాలా ఖండించడమేనా?

కాదు. బదులుగా ఆదాము హవ్వల అవిశ్వాస్యత కారణంగా, భూమంతా ఏదెను తోటను పోలిన పరదైసులా మారడం అప్పుడిక జరగదు. నేల దేవుని శాపానికి గురయ్యింది. ఆ నేల నుండి ఆహారం సంపాదించుకోవాలంటే మనిషి చెమటోడ్చి శ్రమించాలి.​—⁠రోమీయులు 8:​20, 21.

బైబిలు పనిని ఒక శాపం అని చెప్పడం లేదు, బదులుగా అది విలువైనదిగా ఎంచవలసిన ఆశీర్వాదం అని చెబుతోంది. పైన పేర్కొన్నట్లుగా, స్వయంగా దేవుడు కూడా కష్టపడి పనిచేసే వ్యక్తి. యెహోవా మానవులను తన రూపంలో సృష్టించాడు కాబట్టి తన భూ సంబంధ సృష్టిమీద ఆధిపత్యం వహించే సామర్థ్యాన్నీ, అధికారాన్నీ వారికి అనుగ్రహించాడు. (ఆదికాండము 1:26, 28; 2:​15) దేవుడు ఆదికాండము 3:19లోని మాటలు పలుకక ముందే ఆ పనికి సంబంధించిన నియామకం ఇవ్వబడింది. ఒకవేళ పని ఒక శాపమూ అది చెడ్డదీ అయితే, పని చేయమని యెహోవా ప్రజలను ఎన్నటికీ ప్రోత్సహించి ఉండేవాడు కాదు. నోవహు, ఆయన కుటుంబం, జలప్రళయానికి ముందు, ఆ తర్వాత ఎంతో పని చేయవలసి వచ్చింది. క్రైస్తవ శకంలో, యేసు శిష్యులు కూడా పని చేయమని ప్రోత్సహించబడ్డారు.​—⁠1 థెస్సలొనీకయులు 4:​10, 11.

అయినప్పటికీ, ఈ రోజుల్లో పని ఒక భారం కాగలదని మనకందరికీ తెలుసు. ఒత్తిడి, ప్రమాదాలు, విసుగు, నిరాశ, పోటీతత్వం, మోసం, అన్యాయం వంటివి దానితో ముడిపడి ఉన్న కొన్ని ‘ముండ్లతుప్పలు, గచ్చపొదలు’ మాత్రమే. కానీ పని దానికదే ఒక శాపం కాదు. ప్రసంగి 3:⁠13లో బైబిలు, పనీ దాని ఫలితమూ దేవుడిచ్చిన బహుమానాలని చెబుతోంది.​—⁠“పనికి సంబంధించిన ఒత్తిడితో వ్యవహరించడం” అనే బాక్సు చూడండి.

మీరు మీ పని ద్వారా దేవుణ్ణి మహిమపరచవచ్చు. పని స్థలంలో నాణ్యత, శ్రేష్ఠత ఎల్లప్పుడూ ప్రశంస పొందాయి. పని గురించిన బైబిలు దృక్కోణానికి నాణ్యత ఒక ముఖ్యమైన అంశం. దేవుడు కూడా తన పనిని సర్వశ్రేష్టంగా చేస్తాడు. ఆయన మనకు నైపుణ్యతలు, సామర్థ్యాలు ఇచ్చాడు, వీటిని మనం మంచి సంకల్పం కోసమే ఉపయోగించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఉదాహరణకు, ప్రాచీన ఇశ్రాయేలులో గుడార నిర్మాణ సమయంలో బెసలేలు, అహోలీయాబు వంటి వ్యక్తులను యెహోవా జ్ఞాన విద్యా వివేకములతో నింపి, కొన్ని కళాత్మకమైన, ఉపయోగకరమైన పనులు చేయడానికి వారికి సహాయం చేశాడు. (నిర్గమకాండము 31:​1-11) అంటే దేవుడు వారి పనికి సంబంధించి వారి పనితీరు, నైపుణ్యత, రూపకల్పన, ఇతర వివరాలు వంటి వాటిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని ఇది చూపిస్తోంది.

ఇది వ్యక్తిగత సామర్థ్యాలను, పని అలవాట్లను మనమెలా దృష్టిస్తున్నామనే దానిపై ప్రగాఢమైన ప్రభావం చూపిస్తుంది. ఇది, మనం వాటిని దేవుడిచ్చిన బహుమానాలుగా దృష్టించాలని, వాటిని చులకనగా చూడకూడదని గ్రహించడానికి మనకు సహాయం చేస్తుంది. కాబట్టి తమ పనిని దేవుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా పని చేయాలని క్రైస్తవులకు ఆజ్ఞాపించబడింది: “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి.” (కొలొస్సయులు 3:​23) మనస్సాక్షిపూర్వకంగా కష్టపడి పని చేయాలని దేవుని సేవకులకు ఆజ్ఞాపించబడింది, అలా చేయడం క్రైస్తవ సందేశం తోటిపనివారికి, ఇతరులకు మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.​—⁠“పని స్థలంలో బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం” అనే బాక్సు చూడండి.

దీని దృష్ట్యా, మనం ఎంత శ్రద్ధగా, ఎంత నైపుణ్యంగా పని చేస్తున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవడం మంచిది. మనం చేసిన పని చూసి దేవుడు సంతోషిస్తాడా? మనకు ఇవ్వబడిన పనుల్ని, మనం చేసే విధానాన్నిబట్టి మనం పూర్తిగా సంతృప్తిపడుతున్నామా? లేనట్లయితే, మనం మెరుగుపరచుకోవలసిన అవసరం ఉంది.​—⁠సామెతలు 10:4; 22:​29.

పనిని ఆధ్యాత్మికతతో సమతూకపరచండి. కష్టపడి పనిచేయడం ప్రశంసనీయమైనదే అయినా, పనిలోనూ జీవితంలోనూ సంతృప్తి పొందడానికి మరో కీలకం ఉంది. అదే ఆధ్యాత్మికత. కష్టపడి పనిచేసి, జీవితం ఇవ్వగల సంపదలను, సౌకర్యాలను అన్నింటినీ అనుభవించిన సొలొమోను రాజు చివరకు ఇలా తేల్చి చెప్పాడు: “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను. మానవకోటికి ఇదియే విధి.”​—⁠ప్రసంగి 12:​13.

మనం ఏ పని చేసినా దానిలో దేవుని చిత్తాన్ని పరిగణలోకి తీసుకోవాలని స్పష్టమవుతోంది. మనం ఆయన చిత్తానికి అనుగుణంగా పనిచేస్తున్నామా లేక దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామా? మనం దేవునికి సంతోషం కలిగించడానికి కృషి చేస్తున్నామా లేక మన సంతోషం కోసం ప్రయత్నిస్తున్నామా? మనం దేవుని చిత్తం చేయకపోతే, చివరికి మనం నిరాశ, ఒంటరితనం, శూన్యభావాలు వంటి వాటివల్ల బాధ అనుభవించాల్సి వస్తుంది.

పూర్తిగా అలసిపోయిన పనివారు, ‘తాము ఇష్టపడే ఒక ఉత్తమమైన పనిని ఎంచుకుని దాన్ని తమ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటారు’ అని స్టీవెన్‌ బెర్‌గ్లాస్‌ సూచించాడు. అర్థవంతమైన పని చేయడానికి మనకు నైపుణ్యాలు, సామర్థ్యాలు ఇచ్చిన దేవుని సేవ చేయడం కంటే ఉత్తమమైన పని మరొకటేదీ లేదు. మన సృష్టికర్తకు సంతోషం కలిగించే పనిని చేయడం మనకు అసంతృప్తిని ఇవ్వదు. యెహోవా అప్పగించిన పని యేసుకు ఆహారంలా పోషణనిచ్చింది, తృప్తినిచ్చింది, బలాన్నిచ్చింది. (యోహాను 4:34; 5:​36) అంతేగాక సర్వోత్తమ కార్యశీలి అయిన దేవుడు తన ‘జతపనివారిగా’ ఉండమని మనల్ని ఆహ్వానిస్తున్నాడని గుర్తుంచుకోండి.​—⁠1 కొరింథీయులు 3:⁠9.

దేవుణ్ణి ఆరాధించడం, ఆధ్యాత్మికంగా ఎదగడం మనల్ని ప్రతిఫలదాయకమైన పని కోసం, బాధ్యత కోసం సిద్ధం చేస్తాయి. పని స్థలం ఒత్తిళ్ళతో, సంక్షోభాలతో, పని చేయమని అధికారంతో అడిగేవాటితో నిండి ఉంటుంది కాబట్టి, లోతుగా వేళ్ళూనిన మన విశ్వాసం, మన ఆధ్యాత్మికత మనం మంచి ఉద్యోగస్థులుగా, మంచి యజమానులుగా ఉండడానికి కృషి చేస్తుండగా మనకు ఎంతో అవసరమైన బలాన్నిస్తాయి. మరోవైపున, ఈ భక్తిహీన లోకంలోని జీవిత వాస్తవాలు మనం మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవలసిన రంగాల గురించి మనల్ని అప్రమత్తులను చేస్తాయి.​—⁠1 కొరింథీయులు 16:​13, 14.

పని ఒక ఆశీర్వాదంగా ఉండే సమయం

దేవుని సేవ చేయడానికి ఇప్పుడు తీవ్రంగా కృషి చేస్తున్నవారు ఆయన పరదైసును పునఃస్థాపించే సమయం కోసం, భూమి యావత్తూ ఉత్తమమైన పనితో నిండి ఉండే సమయం కోసం ఎదురు చూడవచ్చు. యెహోవా ప్రవక్త అయిన యెషయా అప్పుడుండే జీవితం గురించి ఇలా ప్రవచించాడు: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు; ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు; వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు. . . . నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.”​—⁠యెషయా 65:​21-23.

అప్పుడు పని ఎంతటి ఆశీర్వాదంగా ఉంటుందో కదా! మీ పట్ల దేవుని చిత్తమేమిటో తెలుసుకొని, దానికి అనుగుణంగా పని చేయడం ద్వారా, మీరు యెహోవా ఆశీర్వాదాన్ని పొందినవారిలో ఒకరిగా ఉండి, ఎల్లప్పుడూ ‘మీ కష్టార్జితము వలన సుఖం అనుభవించవచ్చు.’​—⁠ప్రసంగి 3:​13.

[8వ పేజీలోని బ్లర్బ్‌]

దేవుడు సర్వోత్తమ కార్యశీలి: ఆదికాండము 1:1, 4, 31; యోహాను 5:​17

[8వ పేజీలోని బ్లర్బ్‌]

పని ఒక ఆశీర్వాదంగా ఉండగలదు: ఆదికాండము 1:28; 2:15; 1 థెస్సలొనీకయులు 4:​10, 11

[8వ పేజీలోని బ్లర్బ్‌]

మీరు మీ పని ద్వారా దేవుణ్ణి మహిమపరచవచ్చు: నిర్గమకాండము 31:1-11; కొలొస్సయులు 3:​23

[8వ పేజీలోని బ్లర్బ్‌]

ఆధ్యాత్మికతో పనిని సమతూకపరచండి: ప్రసంగి 12:13; 1 కొరింథీయులు 3:⁠9

[6వ పేజీలోని బాక్సు/చిత్రం]

పనికి సంబంధించిన ఒత్తిడితో వ్యవహరించడం

వైద్య నిపుణులు ఉద్యోగ ఒత్తిడిని పనికి సంబంధించిన ప్రమాదంగా వర్గీకరించారు. అది కడుపులో పుండ్లు ఏర్పడడానికి, కృంగుదలకు కారణమవ్వడమే కాక ఆత్మహత్యకు పాల్పడేలా కూడా చేయగలదు. జపాను భాషలో దానికి ఒక పదం కూడా ఉంది, అది కరోషీ, దానికి “అధికపనివల్ల మరణం” అనే భావం ఉంది.

పనికి సంబంధించిన వివిధ అంశాలు ఒత్తిడి అధికమయ్యేలా చేయగలవు. ఉదాహరణకు, పనివేళల్లోనో పరిస్థితుల్లోనో మార్పు, పై అధికారుల మూలంగా సమస్యలు, బాధ్యతల్లో లేదా పని విధానంలో మార్పు, ఉద్యోగ విరమణ, ఉద్యోగం కోల్పోవడం ఇలాంటి విషయాలవల్ల ఒత్తిడి పెరగవచ్చు. అలాంటి ఒత్తిడికి ప్రతిస్పందనగా కొందరు ఉద్యోగాలను లేదా ఉద్యోగ వాతావరణాన్ని మార్చుకోవడం ద్వారా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కొందరు అలాంటి ఒత్తిడిని అణచుకోవాలని చూస్తారు గానీ దాని ప్రభావం జీవితంలోని ఇతర రంగాల మీద, సర్వసాధారణంగా కుటుంబం మీద పడుతుంది. కొందరు మానసిక వేదనను అనుభవిస్తూ కృంగుదలకు, నిరాశకు లోనవుతారు.

పనికి సంబంధించిన ఒత్తిడిని ఎదుర్కోవడానికి క్రైస్తవులు పూర్తిగా సన్నద్ధులై ఉన్నారు. కష్టసమయాల్లో మనల్ని బలపరచి, మన ఆధ్యాత్మిక మానసిక సంక్షేమం మీద సానుకూల ప్రభావం చూపించే అనేక ప్రాథమిక సూత్రాలను బైబిలు అందజేస్తోంది. ఉదాహరణకు యేసు ఇలా చెప్పాడు: “రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటి కీడు ఆనాటికి చాలును.” ఇక్కడ ప్రోత్సహించబడుతున్నది ఏమిటంటే, ఈ నాటి సమస్యల మీదే దృష్టి పెట్టాలి కానీ రేపటి సమస్యల మీద కాదు. ఆ విధంగా మనం మన తప్పిదాలను భూతద్దంలో నుండి చూడకుండా ఉంటాము, లేకపోతే మన ఒత్తిడి అధికమే అవుతుంది.​—⁠మత్తయి 6:​25-34.

క్రైస్తవులు తమ సొంత బలం మీద కాక దేవుడిచ్చే బలం మీదే ఆధారపడాలి. ఇక సహించే శక్తి మనలో లేదు అని మనకనిపించినప్పుడు, దేవుడు మన హృదయాల్లో సమాధానాన్ని, ఆనందాన్ని నింపి, ఎలాంటి కష్టంతోనైనా వ్యవహరించే జ్ఞానాన్ని ఇస్తాడు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “ప్రభువుయొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.”​—⁠ఎఫెసీయులు 6:10; ఫిలిప్పీయులు 4:⁠7.

ఒత్తిడితో కూడిన పరిస్థితులు సహితం సానుకూలమైన ఫలితాలను తీసుకురాగలవు. శ్రమలు మనం యెహోవాను వెదుకుతూ ఆయనపై నమ్మకముంచుతూ ఆయనవైపు తిరిగేలా చేస్తాయి. అవి మనం క్రైస్తవ వ్యక్తిత్వాన్ని, ఒత్తిడి ఉన్నప్పుడు పట్టుదలతో ముందుకుసాగే సామర్థ్యాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండేందుకు ప్రేరేపించగలవు. పౌలు మనకిలా ఆదేశిస్తున్నాడు: “శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము.”​—⁠రోమీయులు 5:⁠3, 4.

కాబట్టి ఒత్తిడి, నిరాశానిస్పృహలకు మూలమయ్యే బదులు ఆధ్యాత్మిక పెరుగుదలకు ప్రేరణ కాగలదు.

[7వ పేజీలోని బాక్సు/చిత్రం]

పని స్థలంలో బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం

ఉద్యోగ స్థలంలో ఒక క్రైస్తవుడు కనబరిచే వైఖరి, ప్రవర్తన మూలంగా బైబిలు సందేశం తోటిపనివారినీ, ఇతరులనూ ఆకర్షించగలదు. అపొస్తలుడైన పౌలు తీతుకు వ్రాసిన తన లేఖలో ఉద్యోగులవంటి స్థితిలో ఉన్నవారికి ఈ సలహా ఇచ్చాడు: “అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు, తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడియుండవలెను.”​—⁠తీతు 2:​9, 10.

ఉదాహరణకు, యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయానికి ఒక వ్యాపారవేత్త ఏమి వ్రాశాడో పరిశీలించండి: “యెహోవాసాక్షులను పనిలోకి తీసుకోవడానికి అనుమతివ్వమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాళ్ళు నిజాయితీపరులని, యథార్థవంతులని, నమ్మకస్థులని, వాళ్ళు మోసం చేయరని నాకు తెలుసు కాబట్టే వాళ్ళను పనిలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను యెహోవాసాక్షులను మాత్రమే పూర్తిగా నమ్ముతాను. దయచేసి నాకు సహాయం చేయండి.”

కైల్‌ ఒక ప్రైవేటు పాఠశాలలో రిసెప్షనిష్టుగా పనిచేస్తున్న క్రైస్తవురాలు. ఒకసారి ఒక అపార్థం కారణంగా ఆమె తోటి ఉద్యోగి ఒకరు కొందరు విద్యార్థుల ఎదురుగా ఆమెను తూలనాడింది. “యెహోవా నామంపైకి అవమానం రాకుండా నేను జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది” అని కైల్‌ గుర్తుతెచ్చుకుంటోంది. తర్వాతి ఐదురోజులపాటు, బైబిలు సూత్రాలను ఎలా అన్వయించుకోవాలా అని కైల్‌ బాగా ఆలోచించింది. రోమీయులు 12:18లో ఆమెకు, “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” అనే ఒక సూత్రం కనిపించింది. ఆమె తమ మధ్య తలెత్తిన ఉద్విగ్న పరిస్థితికి క్షమాపణలు కోరుతూ ఆ తోటి ఉద్యోగికి ఈ-మెయిల్‌ పంపించింది. పనివేళలు ముగిసిన తర్వాత పాఠశాలలోనే ఉండి, విషయాన్ని చర్చించుకుందామని కైల్‌ ఆ తోటి ఉద్యోగిని ఆహ్వానించింది. వారలా చర్చించినప్పుడు, కైల్‌ తోటి ఉద్యోగి మెత్తబడి, కైల్‌ అలా చొరవతీసుకోవడం జ్ఞానవంతమైన పని అని అంగీకరించింది. “మీరిలా చేయడానికీ, మీ మతానికీ ఏదైనా సంబంధం ఉండి ఉండవచ్చు” అని ఆమె కైల్‌తో అంటూ ఆమెను ప్రేమపూర్వకంగా హత్తుకుని వీడ్కోలు చెప్పింది. ముగింపుగా కైల్‌ ఏమి చెబుతోంది? “మనం బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంవల్ల ఎన్నటికీ తప్పుచేయము.”

[4, 5వ పేజీలోని చిత్రం]

చాలామంది పనివారు తాము భావరహిత భారీయంత్రపు పల్లులా ఉన్నామని భావిస్తున్నారు

[చిత్రసౌజన్యం]

Japan Information Center, Consulate General of Japan in NY

[8వ పేజీలోని చిత్రసౌజన్యం]

భూగోళం: NASA photo