కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పని గురించిన సందిగ్ధత

పని గురించిన సందిగ్ధత

పని గురించిన సందిగ్ధత

“పని చేయడం​—⁠పని చేయడం! చేయడానికి మనకింకా ఎంతో పని ఉందని తెలుసుకోవడం చెప్పలేనంత ఆనందాన్నిస్తుంది.” ​—⁠కాథరీన్‌ మాన్స్‌ఫీల్డ్‌, రచయిత్రి (1888-1923).

పై వ్యాఖ్యానంలో పనికి సంబంధించి వ్యక్తం చేయబడిన ఆదర్శవంతమైన తలంపే మీకు కూడా ఉందా? పనిని వ్యక్తిగతంగా మీరెలా దృష్టిస్తారు? బహుశా పనిని మీరు, విశ్రాంతిగా గడిపే వారాంతాల మధ్య వచ్చే సుధీర్ఘమైన, అసంతోషకరమైన విషయమని భావిస్తారా? లేక మీ పని మీకు ఒక వ్యసనంగా మారిందా?

చాలామంది, తాము మేలుకొని ఉండే సమయంలో అధికభాగాన్ని పనికే అంకితం చేస్తారు. మనం ఎక్కడ నివసిస్తాం, ఎలాంటి జీవన విధానం గడుపుతాం అనే వాటిని పనే నిర్ణయిస్తుండవచ్చు. చాలామందికి యౌవనం నుండి ఉద్యోగ విరమణ వరకు, పనే తమ జీవితాలను నిర్దేశిస్తున్న ఏకైక ప్రవృత్తిగా ఉంటుంది. మనలో కొందరం మనం చేసే పనినిబట్టి గొప్ప సంతృప్తిని పొందుతాం. కొందరు పని విలువను పని ద్వారా వచ్చే ఆదాయాన్నిబట్టి లేదా ప్రతిష్ఠనుబట్టి లెక్కిస్తే, మరికొందరు సమయం గడవడానికి పని ఒక వ్యాపకమన్నట్లు పరిగణిస్తారు, ఇంకా కొందరైతే పని సమయాన్ని వృధా చేస్తుందని కూడా అనుకుంటారు.

బ్రతకడానికి పనిచేసేవాళ్ళూ, పనిచేయడానికే బ్రతికేవాళ్ళూ మాత్రమే గాక పని చేస్తూనో లేక పనిస్థలంలోని పరిస్థితులవల్లనో చచ్చిపోయేవాళ్ళూ ఉన్నారు. ఉదాహరణకు, “యుద్ధాలు లేదా మాదకద్రవ్యాలు మరియు మద్యం కారణంగా” కలుగుతున్న బాధకన్నా, మరణాలకన్నా పని కారణంగానే ఎక్కువ హాని జరుగుతోందని ఐక్యరాజ్య సమితి ఇటీవలి ఒక నివేదికలో తెలియజేసింది. దీనిపై వ్యాఖ్యానిస్తూ, లండన్‌కు చెందిన ద గార్డియన్‌ వార్తాపత్రిక ఇలా నివేదించింది: “ప్రతీ సంవత్సరం పని సంబంధిత ప్రమాదాల కారణంగా లేదా వ్యాధుల కారణంగా 20 లక్షలకన్నా ఎక్కువమంది మరణిస్తున్నారు . . . దుమ్ము, రసాయనాలు, శబ్దం, అణుధార్మికత తాకిడికి గురికావడం వంటివి క్యాన్సర్‌, హృద్రోగం, గుండెపోటు వంటివాటికి కారణమవుతున్నాయి.” పిల్లలచేత పని చేయించడం, బలవంతంగా పని చేయించడం ప్రస్తుత పని స్థితిగతుల మరో రెండు అవాంఛిత వాస్తవాలు మాత్రమే.

అంతేగాక, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త స్టీవెన్‌ బెర్‌గ్లాస్‌ “ప్రమాదకరమైన అలసట” అని పిలిచేది మరొకటుంది. ఆయన, తన వృత్తిలో ఉన్నతోన్నత స్థానాన్ని చేరుకొని “తాను ఒక ఉద్యోగంలో లేదా ఒక ప్రవృత్తిలో ఇరుక్కుపోయాననే చింతవల్ల దీర్ఘకాలిక భయం, బాధ, దుఃఖం, కృంగుదల” వంటివాటికి గురయ్యే ఒక శ్రద్ధగల ఉద్యోగస్థుని గురించి చెబుతున్నాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “అతడు దానినుండి తప్పించుకోనూ లేడు, మానసిక సంతృప్తిని పొందనూలేడు.”

కష్టపడి పనిచేయడం, పని వ్యసనం

చాలామంది అనేక గంటలపాటు శ్రమించే ఈ లోకంలో, ఎవరు కష్టపడి పనిచేసేవారో ఎవరు పని వ్యసనంలో చిక్కుకున్నారో గుర్తించడం అవసరం. పని వ్యసనపరులు చాలామంది ప్రమాదకరమైన, స్థిరత్వంలేని లోకంలో తమ పని స్థలాన్ని ఒక సురక్షితమైన స్థలంగా దృష్టిస్తారు; కష్టపడి పనిచేసేవారు పనిని ఆవశ్యకమైనదిగా, కొన్నిసార్లు ఎంతో సంతృప్తినిచ్చే బాధ్యతగా దృష్టిస్తారు. పని వ్యసనపరులు జీవితంలో పనికితప్ప వేరే విషయాలకు తావివ్వరు; అదే కష్టపడి పనిచేసేవారికైతే ఎప్పుడు తమ కంప్యూటర్‌ కట్టివేయాలో, తమ శ్రద్ధను ఎప్పుడు మళ్ళించుకోవాలో తెలుసు. ఉదాహరణకు, కష్టపడి పనిచేసేవారికి తమ వివాహ వార్షికదినాన్ని ఆనందంగా గడపడానికి, ఇంట్లో ఉండాలని తెలుసు. పని వ్యసనపరులు అత్యధికంగా పనిచేయడంలోనే ఒకవిధమైన తృప్తినీ, ప్రేరణనూ పొందుతారు; కష్టపడి పనిచేసేవారికి అలాంటి భావాలేవీ ఉండవు.

ఆధునిక సమాజం అత్యధికంగా పనిచేయడమే అభిలషణీయం అన్నట్లు చేస్తుండడంతో పని వ్యసనానికీ కష్టపడి పనిచేయడానికీ మధ్య తేడా అస్పష్టమైపోతోంది. మోడెమ్‌లు, సెల్‌ఫోన్లు, పేజర్లు పనిస్థలానికీ, ఇంటికీ మధ్యగల సరిహద్దును చెరిపేయవచ్చు. ఏ స్థలమైనా పని స్థలమే అయినప్పుడు, ఏ సమయమైనా పని సమయమే అయినప్పుడు, కొంతమంది తమకు తాము హాని చేసుకునేంతగా పనిచేస్తారు.

అలాంటి అవాంఛనీయమైన దృక్పథానికి కొందరు ఎలా ప్రతిస్పందిస్తారు? అధికంగా పనిచేసి అధిక ఒత్తిడికి గురైన ప్రజలు ఆధ్యాత్మికతను పనిస్థలంలోకి తీసుకువచ్చి, మతపరమైన, వృత్తిపరమైన జీవితాలకు తేడాలేకుండా చేస్తున్నట్లున్న ధోరణిని సామాజిక వేత్తలు గమనించారు. “ఆధ్యాత్మికతను పనిని మమేకం చేయడం సర్వసాధారణ విషయమైపోయింది” అని సాన్‌ ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్‌ నివేదించింది.

అమెరికాలోని హైటెక్‌ ప్రాంతమైన సిలికాన్‌ వ్యాలీ గురించి ఇటీవలి ఒక నివేదిక ఇలా పేర్కొంది: “ఉద్యోగస్థులు తక్కువవడంతో పనిస్థలంలో వాహనాలు నిలిపే స్థలాలు చాలామట్టుకు ఖాళీగా ఉంటున్నాయి, అదే సమయంలో సాయంకాల ప్రార్థనా స్థలాల్లో వాహనాలు నిలిపే స్థలాలు అంతకంతకూ కిక్కిరిసిపోతున్నాయి.” అది ఏమి సూచిస్తున్నప్పటికీ, భూవ్యాప్తంగా అనేకులు పని విషయంలో తమ దృక్పథంపై బైబిలు సానుకూల ప్రభావం చూపిస్తోందని, తద్వారా తాము ఎలా జీవించాలనే దాని గురించి మరింత సమతుల్య దృక్పథంతో ఉండడం సాధ్యమవుతోందని గ్రహించారు.

పని విషయంలో సమతుల్య దృక్పథంతో ఉండడానికి బైబిలు మనకు ఎలా సహాయం చేయగలదు? ఆధునిక పని స్థలంలోని సవాళ్ళను విజయవంతంగా ఎదుర్కోవడానికి సహాయం చేయగల లేఖనాధారిత సూత్రాలేమైనా ఉన్నాయా? తర్వాతి ఆర్టికల్‌ ఈ ప్రశ్నలను చర్చిస్తుంది.