కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠశాలలో యెహోవాను స్తుతించడం

పాఠశాలలో యెహోవాను స్తుతించడం

పాఠశాలలో యెహోవాను స్తుతించడం

ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల్లోని యౌవనులు తమ సంభాషణ ద్వారా, ప్రవర్తన ద్వారా పాఠశాలలో దేవుణ్ణి స్తుతించేందుకు మార్గాలను కనుగొంటున్నారు. వారి యౌవన ఉత్సాహాన్ని ఉదాహరించే కొన్ని అనుభవాలను పరిశీలించండి.

గ్రీసులో ఒక యౌవనసాక్షికి, వాతావరణ కాలుష్యం అనే అంశం మీద వ్యాసం వ్రాయాలనే నియామకం లభించింది. ఆమె వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌లో చూసిన తర్వాత తేజరిల్లు! పత్రికలో ఉపయోగకరమైన సమాచారం కనుగొంది, వ్యాసం ముగింపులో తన వ్యాసానికి మూలం తేజరిల్లు! పత్రిక అని ఆమె పేర్కొంది. అప్పటివరకు తాను చదివిన వ్యాసాల్లో ఇది ఒక అత్యుత్తమమైన వ్యాసమని ఆమె టీచరు ఆమెతో అంది. ఆమె టీచరు ఆ తర్వాత ఒక సెమినార్‌లో ఆ సమాచారాన్ని ఉపయోగించి మంచి ఫలితాలు సాధించింది. ఆ కారణంగా ఆ యౌవన సహోదరి టీచర్‌కు మరిన్ని తేజరిల్లు! సంచికలను ఇవ్వాలని నిర్ణయించుకుంది, వాటిలో “ఉపాధ్యాయులు​—⁠వాళ్ళు లేకుండా మనం ఏమి చేయగలం?” అనే అంశాన్ని చర్చించే పత్రిక కూడా ఉంది. ఆ తర్వాత టీచరు తేజరిల్లు! పత్రికను తరగతిలో ప్రశంసించింది, కొందరు విద్యార్థులు పత్రికల కోసం అడిగారు. వారు ఇతర సంచికలను చదవడానికి వీలుగా సహోదరి ఆ సంచికల కాపీలను పాఠశాలకు తీసుకువెళ్ళేది.

ఆఫ్రికాలోని బెనిన్‌లో ఒక క్రైస్తవ యౌవనస్థురాలు భిన్నమైన ఒత్తిడిని ఎదుర్కొంది. అలవాటు ప్రకారంగా ఆమె పాఠశాలలోని చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు, తమ పిల్లలు పరీక్షలకు సిద్ధపడడానికి సహాయంగా వారికి కష్టమైన సబ్జెక్ట్‌లకు ట్యూషన్స్‌ చెప్పించేందుకు టీచర్లతో మాట్లాడడానికి సమావేశమయ్యారు. ట్యూషన్స్‌ చెప్పే టీచర్లు తరగతులను శనివారం ఉదయం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ యౌవనసాక్షి అందుకు అభ్యంతరం చెప్పింది: “శనివారం ఉదయం సంఘమంతా కలిసి ప్రకటిస్తుంది. అది వారంలో నాకు చాలా సంతోషకరమైన సమయం, ఆ సమయంలో నేను వేరే ఏదీ చేయను!” ఒంటరి తండ్రీ, సాక్షీ అయిన ఆమె తండ్రి దానికి అంగీకరించి సమయం మార్పించేందుకు కొందరు తల్లిదండ్రులనూ, ట్యూషన్స్‌ చెప్పే టీచర్లనూ అడిగిచూశాడు. అయితే దానికి వారెవ్వరూ ఒప్పుకోలేదు. దాంతో ఆ యౌవనస్థురాలు ట్యూషన్లకు వెళ్ళకూడదని నిర్ణయించుకుంది. ట్యూషన్లు జరిగే సమయంలో ఆమె తన సంఘంతో కలిసి ప్రకటనా పనిలో భాగం వహించింది. ఆమె తోటి విద్యార్థులు ఆమెను హేళన చేశారు, తన సాక్ష్యపు పనిని, తన దేవుణ్ణి కూడా విడిచిపెట్టమని వారు తొందరపెట్టారు. ఆమె పరీక్షల్లో తప్పిపోతుందని వారు దృఢంగా నమ్మారు. అయితే దానికి భిన్నంగా ట్యూషన్‌కు వెళ్ళిన విద్యార్థులు పరీక్షల్లో తప్పారు, మన యౌవన సహోదరి మాత్రం ఉత్తీర్ణురాలైంది. ఎగతాళి ఆ తర్వాత ఆగిపోయింది అని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ విద్యార్థులు “మీ దేవుణ్ణి నీవు ఎల్లప్పుడూ సేవిస్తూ ఉండాలి” అని ఆమెకు చెబుతున్నారు.

ఛెక్‌ రిపబ్లిక్‌లో ఒక పన్నెండేళ్ళ అమ్మాయి ఒక పుస్తకం మీద నివేదిక తయారు చేయాల్సి వచ్చింది. ఆమె తల్లి జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని ఉపయోగించమని ఆమెను ప్రోత్సహించింది. “మీరు ఏమని భావిస్తున్నారు? జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి ఎవరు కావచ్చు?” అనే ప్రశ్నలతో ఆమె తన నివేదికను ప్రారంభించింది. ఆమె యేసు గురించి, ఆయన భూమ్మీది జీవితం గురించి, ఆయన బోధల గురించి వివరించింది. ఆ తర్వాత ఆమె “క్షమించుటను గూర్చి ఒక పాఠము” అనే అధ్యాయాన్ని చర్చించింది. ఆమె టీచరు సంతోషం పట్టలేక, “నీవు ఇచ్చిన నివేదికల్లో ఇది అత్యుత్తమమైన నివేదిక” అని చెప్పి ఆ పుస్తకాన్ని కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించింది. కొంతమంది తోటి విద్యార్థులు కూడా ఆ పుస్తకం కోసం అడిగారు. ఆ మరుసటి రోజు ఆ అమ్మాయి 18 కాపీలను ఇవ్వడంలో పులకరించిపోయింది.

అలాంటి యౌవనులు పాఠశాలలో యెహోవాను స్తుతించడంలో గొప్ప ఆనందాన్ని పొందుతున్నారు. మనమందరం వారి యౌవన ఉత్సాహాన్ని అనుకరించాలి.