కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనులారా, యెహోవాను స్తుతించండి!

యౌవనులారా, యెహోవాను స్తుతించండి!

యౌవనులారా, యెహోవాను స్తుతించండి!

‘భూమిమీదనున్న యౌవనులారా, కన్యలారా యెహోవాను స్తుతించండి.’​—⁠కీర్తన 148:​7, 12-13.

పిల్లలకు తాము చేయడానికి అనుమతిలేని పనులేమిటో వారికి బాగా తెలుసు. ఒంటరిగా రోడ్డు దాటడానికి కానీ రాత్రి ఎన్ని గంటల వరకు మెలకువగా ఉండాలనే విషయంలో కానీ కారు నడపడానికి కానీ తమకెంత వయసు ఉండాలో చాలామంది వెంటనే చెప్పగలుగుతారు. ఒక పిల్లవాడు తాను ఎంతో ఆశతో ఎన్నిసార్లు అడిగినా “నువ్వు పెద్దవాడివి అయ్యేవరకు ఆగు” అనే సమాధానమే వస్తుందని అప్పుడప్పుడు భావించవచ్చు.

2 మీరు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే మీ తల్లిదండ్రులు అలాంటి హద్దులు పెడుతున్నారని యౌవనులైన మీకు తెలుసు. మీరు మీ తల్లిదండ్రుల మాట వింటే యెహోవా సంతోషిస్తాడనే సంగతి కూడా మీకు తెలుసు. (కొలొస్సయులు 3:20) అయితే మీరు అసలైన జీవితాన్ని ఇంకా అనుభవించడం ప్రారంభించనే లేదని అనుకుంటున్నారా? మీరు పెద్దవారయ్యే వరకు ముఖ్యమైన పనులన్నిటికీ దూరంగా ఉండవలసిందేనా? అది ఏమాత్రం నిజం కాదు. పని చేయడానికి మీకు లభించే ఎలాంటి అవకాశంకన్నా మరెంతో ప్రాముఖ్యమైన పని నేడు నెరవేరుతోంది. ఆ పనిలో భాగం వహించేందుకు యౌవనులైన మీకు అనుమతి ఉందా? ఉంది. నిజానికి, సర్వోన్నతుడైన దేవుడే మిమ్మల్ని ఆ పనికి ఆహ్వానిస్తున్నాడు.

3 మనం ఏ పని గురించి మాట్లాడుతున్నాం? మన ఈ ఆర్టికల్‌ మూలవచనంలోని మాటలను ఒకసారి చూడండి: ‘భూమిమీదనున్న యౌవనులారా కన్యలారా యెహోవాను స్తుతించండి.’ (కీర్తన 148:​7, 12-13) ఈ వచనంలో మీకున్న ఒక గొప్ప ఆధిక్యత కనబడుతుంది, అదేమిటంటే మీరు యెహోవాను స్తుతించవచ్చు. ఒక యౌవనునిగా, ఆ పనిలో భాగం వహించాలని మీరు ఉవ్విళ్లూరుతున్నారా? అలా చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. అలా భావించడం ఎందుకు సరైనదో తెలుసుకోవడానికి, మనం మూడు ప్రశ్నలను పరిశీలిద్దాం. మొదటిది, మీరు యెహోవాను ఎందుకు స్తుతించాలి? రెండవది, ఆయనను మీరు సమర్థవంతంగా ఎలా స్తుతించవచ్చు? మూడవది, యెహోవాను స్తుతించడాన్ని ఎప్పుడు ఆరంభించాలి?

యెహోవాను ఎందుకు స్తుతించాలి?

4 యెహోవాను స్తుతించడానికిగల ప్రధాన కారణం ఆయన మన సృష్టికర్త. ఈ సత్యం మీద దృష్టి సారించడానికి 148వ కీర్తన మనకు సహాయం చేస్తుంది. మీరు ఒక్కసారి ఇలా ఊహించుకోండి: ముక్తకంఠంతో శ్రావ్యంగా, ఉత్తేజం కలిగించే పాట ఆలపిస్తున్న ఒక పెద్దగుంపు దగ్గరకు మీరు వెళ్లారనుకోండి, అప్పుడు మీ భావాలు ఎలా ఉంటాయి? ఆ పాటలోని పదాలు సత్యాలనీ, ప్రాముఖ్యమైనవనీ, ఆనందకరమైనవనీ, క్షేమాభివృద్ధికరమైనవనీ మీకు తెలిసిన తలంపులనే వ్యక్తం చేస్తుంటే మీకెలా అనిపిస్తుంది? ఆ పాటలోని పదాలను తెలుసుకొని, వారితో గళం కలపాలని మీకు అనిపించదా? మనలో చాలామందికి అలాగే అనిపిస్తుంది. మీరు అంతకన్నా మరెంతో అద్భుతమైన పరిస్థితిలో ఉన్నారని 148వ కీర్తన చూపిస్తోంది. ఆ కీర్తన ముక్తకంఠంతో యెహోవాను స్తుతిస్తున్న పెద్ద సమూహాన్ని వర్ణిస్తోంది. ఆ కీర్తనను మీరు చదువుతున్నప్పుడు, అసాధారణమైన ఒక సంగతిని మీరు గమనిస్తారు. అదేమిటి?

5 ఆ 148వ కీర్తనలో వర్ణించబడిన స్తుతికర్తలు చాలావరకు మాట్లాడలేరు లేదా తర్కించలేరు. ఉదాహరణకు, మనం అక్కడ సూర్యచంద్ర నక్షత్రాలు, మంచు, గాలి, పర్వతాలు గుట్టలు యెహోవాను స్తుతిస్తున్నట్లు చదువుతాం. ఈ నిర్జీవ సృష్టి యెహోవాను ఎలా స్తుతించగలుగుతోంది? (3, 8, 9 వచనాలు) వృక్షాలు, సముద్ర ప్రాణులు, జంతువులు ఆయనను స్తుతిస్తున్న రీతిలోనే అది కూడా స్తుతిస్తోంది. (7, 9, 10 వచనాలు) మీరెప్పుడైనా అద్భుతమైన సూర్యాస్తమయాన్ని, నక్షత్ర సాగరంలో పయనించే చంద్రుణ్ణి చూశారా, జంతువుల ఆటలు చూసి ఆనందించారా, ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించారా? అలాగైతే, మీరు ఆ సృష్టి ఆలపిస్తున్న స్తుతి గీతాన్ని “విన్నారు.” యెహోవా చేసిన సృష్టంతా ఆయన సర్వశక్తిగల సృష్టికర్త అనీ, విశ్వమంతటిలో ఆయనంతటి శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, ప్రేమామయుడు మరొకరు లేరనీ మనకు గుర్తుచేస్తుంది.​—⁠రోమీయులు 1:​20; ప్రకటన 4:​10, 11.

6 బుద్ధిసూక్ష్మతగల సృష్టి ప్రాణులు కూడా యెహోవాను స్తుతిస్తున్నట్లు కీర్తన 148 వర్ణిస్తోంది. యెహోవా పరలోక “సైన్యము” అంటే దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లు మనం 2వ వచనంలో చూస్తాం. రాజులు, న్యాయాధిపతుల్లాంటి అధికారులు, ప్రాబల్యంగల మానవులు ఆ స్తుతిలో భాగం వహించాలని 11వ వచనంలో వారికి ఆహ్వానం ఇవ్వబడుతోంది. బలమైన దేవదూతలే యెహోవాను స్తుతించడంలో ఆనందిస్తుంటే, ఆయనను స్తుతించవలసిన అవసరం తనకు లేదని అల్పుడైన ఏ మనిషైనా చెప్పగలడా? ఆ పిమ్మట 12వ వచనంలో యౌవనులైన మీరు కూడా భాగం వహిస్తూ, యెహోవాను స్తుతించాలని ఆహ్వానించబడుతున్నారు. అలా స్తుతించాలనే ప్రేరణ మీకు కలుగుతోందా?

7 ఈ దృష్టాంతాన్ని పరిశీలించండి. బహుశా క్రీడల్లో కానీ, ఏదైనా కళలో లేదా సంగీతంలో కానీ అసాధారణ ప్రజ్ఞగల సన్నిహిత స్నేహితుడే మీకుంటే, మీరు ఆయన గురించి మీ కుటుంబ సభ్యులతో ఇతర స్నేహితులతో మాట్లాడరా? తప్పకుండా మాట్లాడతారు. యెహోవా చేసిన యావత్తు గురించి తెలుసుకోవడం మనమీద కూడా అలాంటి ప్రభావమే చూపగలదు. ఉదాహరణకు, నక్షత్రాలతో నిండిన ఆకాశం “బోధచేయుచున్నది” అని కీర్తన 19:1, 2 చెబుతోంది. మన విషయానికొస్తే, యెహోవా చేసిన ఆశ్చర్యకార్యాల గురించి ఆలోచించినప్పుడు, మనం మన దేవుని గురించి ఇతరులతో మాట్లాడకుండా ఉండలేం.

8 యెహోవాను స్తుతించడానికి మరో బలమైన కారణం, మనం స్తుతించాలని ఆయన కోరుతున్నాడు. ఎందుకు కోరుతున్నాడు? మానవుల నుండి స్తుతులు అందుకోవాలనే ఉద్దేశంతోనా? కాదు. మానవులమైన మనకు పొగడ్తలూ, ప్రశంసలూ కొన్నిసార్లు అవసరం కావచ్చు, కానీ యెహోవా దేవుడు మనకన్నా ఎంతో ఉన్నతుడు. (యెషయా 55:8) ఆయనకు తన గురించి కానీ తన లక్షణాల గురించి కానీ ఎలాంటి సందేహాలు లేవు. (యెషయా 45:5) అయినప్పటికీ, ఆయన తనను స్తుతించాలని కోరడమే కాక, మనం స్తుతించినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఎందుకు? రెండు కారణాలు పరిశీలించండి. మొదటిది, ఆయనను స్తుతించవలసిన అవసరం మనకుందని ఆయనకు తెలుసు. ఆయన మనలను ఒక ఆధ్యాత్మిక అవసరతతో, ఆరాధించాలనే అవసరతతో రూపొందించాడు. (మత్తయి 5:3) మీ తల్లిదండ్రులు మీకు ప్రాముఖ్యమని తెలిసిన ఆహారాన్ని మీరు తినడం చూసినప్పుడు ఎలా సంతోషిస్తారో, అలాగే మనం మనలోని ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోవడం యెహోవాను సంతోషపెడుతుంది.​—⁠యోహాను 4:​34.

9 రెండవది, మనం ఆయనను స్తుతించడాన్ని ఇతరులు వినాల్సిన అవసరం ఉందని యెహోవాకు తెలుసు. యౌవనుడైన తిమోతికి అపొస్తలుడైన పౌలు ఈ మాటలు వ్రాశాడు: “నిన్నుగూర్చియు నీ బోధనుగూర్చియు జాగ్రత్త కలిగియుండుము, వీటిలో నిలుకడగా ఉండుము; నీవీలాగుచేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు.” (1 తిమోతి 4:16) అవును, యెహోవా దేవుని గురించి ఇతరులకు చెబుతూ, ఆయనను స్తుతించినప్పుడు వారుకూడా యెహోవాను తెలుసుకోవచ్చు. అలాంటి పరిజ్ఞానం వారి నిత్య రక్షణకు దారితీయగలదు.​—⁠యోహాను 17:3.

10 యెహోవాను స్తుతించడానికి మరో కారణం కూడా ఉంది. ప్రజ్ఞగల మీ స్నేహితుని గురించిన దృష్టాంతాన్ని గుర్తు చేసుకోండి. ఆయన గురించి ఇతరులు అబద్ధాలు చెబుతూ, ఆయనపై నిందలు వేయడం మీరు విన్నప్పుడు, మీరు ఆయనను స్తుతించాలనీ శ్లాఘించాలనీ మరింత దృఢంగా నిర్ణయించుకోరా? అవును, ఈ లోకంలో యెహోవా ఎంతగానో నిందించబడుతున్నాడు. (యోహాను 8:44; ప్రకటన 12:9) కాబట్టి ఆయనను ప్రేమించేవారు ఆయన గురించిన సత్యాన్ని ప్రకటించి, ఆ తప్పుడు సమాచారాన్ని సరిదిద్దే బాధ్యత తమకుందని భావిస్తారు. యెహోవాపట్ల మీ ప్రేమను, కృతజ్ఞతా భావాన్ని వ్యక్తంచేస్తూ, ఆయన ముఖ్య శత్రువైన సాతాను కాదు యెహోవాయే మీ పరిపాలకునిగా ఉండాలని ఇష్టపడుతున్నట్లు కూడా చూపించాలనుకుంటున్నారా? మీరు యెహోవాను స్తుతించడం ద్వారా అదంతా చేయవచ్చు. కాబట్టి ఆయనను ఎలా స్తుతించవచ్చు అనేదే తర్వాతి ప్రశ్న.

కొందరు పిల్లలు యెహోవాను ఎలా స్తుతించారు?

11 యెహోవాను స్తుతించడంలో పిల్లలు తరచూ సమర్థవంతంగా ఉండగలరని బైబిలు చూపిస్తోంది. ఉదాహరణకు, సిరియన్లు చెరగా తీసుకుపోయిన ఇశ్రాయేలీయురాలైన బాలిక విషయమే తీసుకోండి. ఆమె యెహోవా ప్రవక్త అయిన ఎలీషా గురించి తన యజమానురాలికి ధైర్యంగా చెప్పింది. ఆమె పలికిన మాటలు ఒక అద్భుతం జరగడానికి దారితీయడంతో, బలమైన సాక్ష్యం ఇవ్వబడింది. (2 రాజులు 5:​1-17) యేసు కూడా బాలునిగా ఉన్నప్పుడు ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు. ఆయన చిన్నప్పుడు చేసిన పనులన్నింటిలో ఆయనకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయంలో మత బోధకులు ఆయన ప్రజ్ఞకు విస్మయమొందేలా వారిని ధైర్యంగా ప్రశ్నలు అడిగిన సందర్భాన్నే లేఖనాల్లో నమోదు చేయడానికి యెహోవా ఎంచుకున్నాడు.​—⁠లూకా 2:46-49.

12 యేసు పెద్దవాడైన తర్వాత కూడా పిల్లలు యెహోవాను స్తుతించే విధంగా వారిని ప్రేరేపించాడు. ఉదాహరణకు, యేసు తన మరణానికి కొద్దిరోజులు ముందు యెరూషలేము దేవాలయంలో కొంత సమయం గడిపాడు. అక్కడ ఆయన “వింతలు” చేశాడని బైబిలు చెబుతోంది. ఆ స్థలాన్ని దొంగల గుహగా చేస్తున్న వారిని ఆయన తరిమికొట్టాడు. ఆయన గుడ్డివారిని, కుంటివారిని కూడా బాగుచేశాడు. మతనాయకులతో సహా అక్కడున్న ప్రతీ ఒక్కరూ యెహోవానూ ఆయన కుమారుడైన మెస్సీయనూ స్తుతించడానికి ప్రేరణ పొందాల్సింది. కానీ విచారకరంగా, ఆ కాలంనాటి చాలామంది అలాంటి స్తుతి పలుకులేవీ పలకలేదు. యేసును దేవుడే పంపాడని వారికి తెలుసు, అయితే వారు మతనాయకులకు భయపడ్డారు. కానీ ఒక గుంపు మాత్రం నిర్భయంగా కేకలు వేసింది. వాళ్లెవరో మీకు తెలుసా? బైబిలు ఇలా చెబుతోంది: “ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన [యేసు] చేసిన వింతలను,​—⁠దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి​—⁠వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను [యేసును] అడిగిరి.”​—⁠మత్తయి 21:15, 16; యోహాను 12:⁠42.

13 యేసు తనను స్తుతిస్తున్న పిల్లలను నిశ్శబ్దంగా ఉండమని చెబుతాడని ఆ యాజకులు ఆశించారు. మరి ఆయన అలా చెప్పాడా? లేదు. ఆ యాజకులతో యేసు ఇలా అన్నాడు: “బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా?” అవును ఆ పిల్లల స్తుతిని బట్టి యేసూ, ఆయన తండ్రీ సంతోషించారని స్పష్టమవుతోంది. అక్కడున్న పెద్దలందరూ చేయవలసిన పనిని ఆ పిల్లలు చేశారు. వారి పసిహృదయాల్లో అక్కడ జరిగినదంతా తేటగా ఉంది. ఆయన అద్భుతాలు చేయడాన్ని, ధైర్యంగా విశ్వాసంతో మాట్లాడడాన్ని, దేవునిపట్ల, ఆయన ప్రజలపట్ల ప్రగాఢమైన ప్రేమ చూపించడాన్ని వారు గమనించారు. ఆయన తాను ఎవరినని చెప్పుకున్నాడో ఆ వాగ్దానం చేయబడిన “దావీదు కుమారుడు” మెస్సీయ. తమ విశ్వాసాన్నిబట్టి ఆశీర్వాదం పొందిన ఆ పిల్లలకు ప్రవచనాన్ని నెరవేర్చే ఆధిక్యత కూడా లభించింది.​—⁠కీర్తన 8:2.

14 అలాంటి ఉదాహరణల నుండి మనమేమి తెలుసుకోవచ్చు? పిల్లలు యెహోవాకు అత్యంత సమర్థమైన స్తుతికర్తలుగా ఉండగలరని తెలుసుకోవచ్చు. సత్యాన్ని స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకొనే వరం మాత్రమే కాక, తమ విశ్వాసాన్ని నిజాయితీగా, ఆసక్తితో వ్యక్తపరచగల సామర్థ్యం కూడా సాధారణంగా వారికి ఉంటుంది. వారికి సామెతలు 20:29లో ప్రస్తావించబడిన ఈ వరం కూడా ఉంటుంది: “యౌవనస్థుల బలము వారికి అలంకారము.” అవును, యౌవనులైన మీకు శక్తిసామర్థ్యాలున్నాయి, అవి యెహోవాను స్తుతించడంలో నిజమైన సంపదతో సమానం. ఆ వరాలను మీరు ప్రత్యేకంగా ఎలా ఉపయోగించవచ్చు?

యెహోవాను మీరు ఎలా స్తుతించవచ్చు?

15 సమర్థవంతంగా ఉండడమనేది మొదట హృదయంలో పుడుతుంది. ఇతరులు కోరుతున్నందుకే మీరు స్తుతిస్తున్నట్లయితే, మీరు యెహోవాను సమర్థవంతంగా స్తుతించలేరు. “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [“యెహోవాను” NW] ప్రేమింపవలెననునదియే” ప్రధానమైన ఆజ్ఞ అని గుర్తుంచుకోండి. (మత్తయి 22:37) మీరు యెహోవా వాక్యాన్ని స్వయంగా అధ్యయనం చేయడం ద్వారానే ఆయన గురించి తెలుసుకున్నారా? అలాంటి జ్ఞానార్జన ద్వారానే యెహోవాపట్ల ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి సహజమైన మార్గం ఆయనను స్తుతించడం. మీ ఉద్దేశం స్పష్టంగా, బలంగా ఉన్నప్పుడు, మీరు ఉత్సాహంగా యెహోవాను స్తుతించడానికి సిద్ధంగా ఉంటారు.

16 మీరు ఏమి చెప్పాలి అనేదాన్ని పరిశీలించే ముందు మీరు ఎలా ప్రవర్తించాలి అనేదాన్ని పరిశీలించండి. ఒకవేళ ఎలీషా కాలంలోని ఇశ్రాయేలీయురాలైన ఆ బాలిక దురుసుగా, అమర్యాదకరంగా, నిజాయితీ లేకుండా ప్రవర్తించి ఉంటే, ఆమెను చెర పట్టుకుపోయిన సిరియన్లు యెహోవా ప్రవక్త గురించి ఆమె చెప్పిన మాటలు వినేవారని మీకు అనిపిస్తుందా? బహుశా వారు వినేవారే కాదు. అదేవిధంగా, మీరు మర్యాదస్థులనీ, నిజాయితీపరులనీ, చక్కని ప్రవర్తనగలవారనీ ప్రజలు చూసినప్పుడు మీరు చెప్పేది వారు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. (రోమీయులు 2:21) ఈ ఉదాహరణను పరిశీలించండి.

17 పోర్చుగల్‌లో, 11 సంవత్సరాల బాలికకు పాఠశాలలో, తన బైబిలు శిక్షిత మనస్సాక్షికి అంగీకారం కాని సెలవుదినాలను ఆచరించే ఒత్తిడి ఎదురైంది. ఆమె వాటిలో పాల్గొనడానికి ఎందుకు నిరాకరిస్తుందో తన టీచరుకు గౌరవపూర్వకంగా వివరించింది, కానీ ఆ టీచరు ఆమెను హేళన చేసింది. రోజులు గడిచినకొద్దీ ఆ టీచరు ఆమె మతాన్ని గేలీచేస్తూ పదేపదే ఆమెను అవమానపరిచేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ, ఆ బాలిక గౌరవపూర్వకంగానే మెలిగింది. చాలా సంవత్సరాల తర్వాత, ఈ యౌవన సహోదరి క్రమ పయినీరుగా, పూర్తికాల సువార్తికురాలిగా సేవచేస్తోంది. ఒక సమావేశంలో ఆమె బాప్తిస్మం తీసుకుంటున్న వారిని గమనిస్తూ వారిలో ఒకరిని గుర్తుపట్టింది. ఆమె ఎవరోకాదు, ఒకప్పటి తన టీచరే! ఆనంద బాష్పాలతో ఆమెను కౌగలించుకున్న తర్వాత, ఆ వృద్ధ స్త్రీ ఆ యౌవన సహోదరితో తన విద్యార్థిని గౌరవపూర్వక ప్రవర్తనను తానెన్నటికీ మరచిపోలేదని చెప్పింది. ఒక సాక్షి ఆమెను సందర్శించినప్పుడు, ఆ టీచరు తన పూర్వ విద్యార్థిని ప్రవర్తన గురించి మాట్లాడింది. ఫలితంగా, బైబిలు అధ్యయనం ఆరంభమై, ఇప్పుడు ఆ స్త్రీ బైబిలు సత్యాన్ని హత్తుకుంది. అవును, మీ ప్రవర్తన యెహోవాను స్తుతించడానికి చాలా శక్తిమంతమైన విధానంగా ఉండగలదు.

18 పాఠశాలలో మీ విశ్వాసం గురించి సంభాషణ ఆరంభించడానికి కొన్నిసార్లు మీకు కష్టంగా ఉంటోందా? ఆ విధంగా భావిస్తున్నది మీరొక్కరే కాదు. అయితే మీ విశ్వాసం గురించి ఇతరులు మిమ్మల్ని అడిగేలా మీరే పరిస్థితి కల్పించవచ్చు. ఉదాహరణకు, బైబిలు ఆధారిత పుస్తకాలు మీతోపాటు తీసుకెళ్ళడం చట్టబద్ధమే అయితే, అనుమతించదగినవే అయితే మీరు వాటిని తీసుకువెళ్ళి భోజన విరామ సమయంలో కానీ వేరే పుస్తకాలను చదివేందుకు అనుమతించే ఇతర పీరియడ్‌లలో కానీ ఎందుకు చదవకూడదు? మీరు చదువుతున్నది ఏమిటి అని మీ తోటి విద్యార్థులు మిమ్మల్ని అడగవచ్చు. అప్పుడు మీరు చదువుతున్న ఆర్టికల్‌లో లేదా పుస్తకంలో మీకు ఆసక్తి కలిగించిన విషయాలను వారికి చెప్పడం ద్వారా మీరు మీకు తెలియకుండానే చక్కని సంభాషణ ఆరంభమైనట్లు గ్రహిస్తారు. మీ తోటి విద్యార్థుల నమ్మకాలను తెలుసుకునేందుకు ప్రశ్నలు అడగడం మరచిపోకండి. గౌరవంతో విని, మీరు బైబిలు నుండి నేర్చుకున్నవి వారితో పంచుకోండి. 29వ పేజీలోని అనుభవాలు చూపిస్తున్నట్లుగా, చాలామంది యౌవనులు పాఠశాలలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇది వారికి ఆనందాన్ని తీసుకురావడమే కాక, అనేకులు యెహోవాను తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది.

19 యెహోవాను స్తుతించడానికి ఇంటింటి పరిచర్య అత్యంత ఫలదాయకమైన విధానం. మీరు ఇప్పటివరకు అందులో భాగం వహించనట్లయితే, దానినే ఒక లక్ష్యంగా ఎందుకు చేసుకోకూడదు? మీరు ఒకవేళ భాగం వహిస్తుంటే, మీరు లక్ష్యంగా ఉంచుకోగల ఇతర విషయాలేవైనా ఉన్నాయా? ఉదాహరణకు, ప్రతీ ఇంటి దగ్గర మీరు ఒకే విధమైన మాటలు చెప్పే బదులు మీ మాటల విధానాన్ని మెరుగుపరచుకొనేందుకు మార్గాల కోసం చూడండి, ప్రయోజనకరమైన సలహాల కోసం మీ తల్లిదండ్రులను, ఇతర అనుభవజ్ఞులను అడగండి. బైబిలును మరింత ఎక్కువగా ఎలా ఉపయోగించాలో, ఫలదాయకమైన పునర్దర్శనాలు ఎలా చేయాలో, బైబిలు అధ్యయనం ఎలా ఆరంభించాలో నేర్చుకోండి. (1 తిమోతి 4:15) ఇలాంటి మార్గాల్లో మీరు యెహోవాను ఎంత ఎక్కువగా స్తుతిస్తే, అంత ప్రతిభావంతులవుతారు మీ పరిచర్యలో మీరు మరింత ఎక్కువగా ఆనందిస్తారు.

యెహోవాను స్తుతించడాన్ని మీరు ఎప్పుడు ఆరంభించాలి?

20 ఈ చర్చలోని మూడు ప్రశ్నల్లో చివరి ప్రశ్నకు జవాబు చాలా సరళం. బైబిలు సూటిగా ఇస్తున్న ఈ జవాబును గమనించండి: “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.” (ప్రసంగి 12:2) అవును, యెహోవాను స్తుతించడాన్ని ఆరంభించే సమయం ఇదే. “యెహోవాను స్తుతించడానికి నేనింకా చిన్న పిల్లవాణ్ణే. నాకు అనుభవం లేదు. నేను పెద్దవాడినయ్యే వరకు వేచి ఉండాలి” అని చెప్పడం చాలా సులభం. అలా భావించే వారిలో మీరే మొదటివారు కాదు. ఉదాహరణకు, బాలుడైన యిర్మీయా యెహోవాతో “అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదు” అన్నాడు. దానికి యెహోవా భయపడవలసిన అవసరమే లేదని ఆయనకు అభయమిచ్చాడు. (యిర్మీయా 1:6, 7) అదేవిధంగా, యెహోవాను స్తుతించేటప్పుడు మనం దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా పూర్తిగా తొలగించలేని ఏ హానీ మనకు కలగదు.​—⁠కీర్తన 118:6.

21 కాబట్టి, యెహోవాను స్తుతించడానికి వెనుదీయకండి అని మేము యౌవనులైన మిమ్మల్ని కోరుతున్నాం. నేడు భూమ్మీద జరుగుతున్న ప్రాముఖ్యమైన పనిలో భాగం వహించడానికి, ఈ యౌవన సమయమే అతి శ్రేష్ఠమైన సమయం. అలా భాగం వహించినప్పుడు మీరు యెహోవాను స్తుతిస్తున్న అద్భుతమైన విశ్వవ్యాప్త కుటుంబంలో భాగమవుతారు. ఆ కుటుంబంలో మీరు కూడా ఉన్నందుకు యెహోవా సంతోషిస్తాడు. యెహోవాను సంబోధించి కీర్తనకర్త పలికిన ఈ ప్రేరేపిత మాటలను గమనించండి: “యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యౌవనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు.”​—⁠కీర్తన 110:⁠3.

22 ఉదయకాలపు సూర్యకాంతిలో మిలమిలా మెరిసే మంచు బిందువులు చూడముచ్చటగా ఉండవా? ఉత్తేజాన్నిస్తూ, మెరుస్తూ ఉండే ఆ మంచు బిందువులు లెక్కకు మించినవిగా ఉంటాయి. ఈ అపాయకరమైన కాలాల్లో తనను నమ్మకంగా స్తుతిస్తున్న యౌవనులైన మిమ్మల్ని యెహోవా ఆ ప్రకారంగా దృష్టిస్తాడు. అవును, యెహోవాను స్తుతించాలనే మీ నిర్ణయం ఆయన హృదయాన్ని సంతోషపరుస్తుంది. (సామెతలు 27:11) కాబట్టి, యౌవనులారా యెహోవాను ఇష్టపూర్వకంగా స్తుతించండి.

మీరెలా జవాబిస్తారు?

యెహోవాను స్తుతించేందుకు కొన్ని ప్రాముఖ్యమైన కారణాలు ఏమిటి?

యౌవనులు యెహోవాను సమర్థవంతంగా స్తుతించగలరని ఏ బైబిలు ఉదాహరణలు చూపిస్తున్నాయి?

యౌవనులు నేడు యెహోవాను ఎలా స్తుతించవచ్చు?

యౌవనులు యెహోవాను స్తుతించడం ఎప్పుడు ఆరంభించాలి, ఎందుకు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) చాలామంది యౌవనులకు తమకు ఎలాంటి పరిమితులు ఉన్నాయని తెలుసు? (బి) తల్లిదండ్రులు విధించే పరిమితుల విషయంలో యౌవనులు ఎందుకు అయిష్టంతో ఉండనవసరం లేదు?

3. యెహోవా యౌవనులను ఎలాంటి ఆధిక్యత కలిగి ఉండమని ఆహ్వానిస్తున్నాడు, మనమిప్పుడు ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

4, 5. (ఎ) కీర్తన 148 ప్రకారం మనమెలాంటి అద్భుతమైన పరిస్థితిలో ఉన్నాం? (బి) మాట్లాడలేని, తర్కించలేని సృష్టి యెహోవాను ఎలా స్తుతిస్తున్నాయి?

6, 7. (ఎ) బుద్ధిసూక్ష్మతగల ఏ సృష్టి ప్రాణులు యెహోవాను స్తుతిస్తున్నారని 148వ కీర్తన వర్ణిస్తోంది? (బి) యెహోవాను స్తుతించడానికి మనమెందుకు ప్రేరణ పొందాలి? ఉదాహరించండి.

8, 9. మనం యెహోవాను స్తుతించాలని ఆయన ఏ కారణాలనుబట్టి కోరుతున్నాడు?

10. మన దేవుణ్ణి స్తుతించే బాధ్యత మనకు ఉందని మనమెందుకు భావిస్తాం?

11. యెహోవాను స్తుతించడంలో యౌవనులు చాలా ఫలవంతంగా ఉండగలరని ఏ బైబిలు ఉదాహరణలు చూపిస్తున్నాయి?

12, 13. (ఎ) యేసు తన మరణానికి కొద్దిరోజుల ముందు దేవాలయంలో ఏమి చేశాడు, ప్రజల మీద అది ఎలాంటి ప్రభావం చూపింది? (బి) పిల్లలు స్తుతించడం విషయంలో యేసు ఎలా భావించాడు?

14. యౌవనులకు ఉన్న వరాలు దేవుణ్ణి స్తుతించేందుకు వారిని ఎలా సంసిద్ధం చేస్తాయి?

15. యెహోవాను సమర్థవంతంగా స్తుతించాలంటే, ఎలాంటి ఉద్దేశం అవసరం?

16, 17. యెహోవాను స్తుతించడంలో ప్రవర్తన ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఉదాహరించండి.

18. బైబిలు గురించీ, యెహోవా దేవుని గురించీ సంభాషణ ఆరంభించడానికి సంకోచించే యువకులు ఏమి చేయవచ్చు?

19. ఇంటింటి పరిచర్యలో యౌవనస్థులు మరింత సమర్థవంతంగా ఎలా తయారుకాగలరు?

20. యౌవనులు యెహోవాను స్తుతించడానికి తామింకా చిన్న పిల్లలమేనని ఎందుకు భావించకూడదు?

21, 22. యెహోవాను స్తుతించే యౌవనులు మంచు బిందువులతో ఎందుకు పోల్చబడ్డారు, ఆ పోలిక ఎందుకు ప్రోత్సాహకరమైనది?

[25వ పేజీలోని చిత్రాలు]

మీ స్నేహితునికి ఒక అసాధారణ ప్రజ్ఞ ఉంటే, దాని గురించి మీరు ఇతరులతో చెప్పరా?

[27వ పేజీలోని చిత్రం]

మీ తోటి విద్యార్థులకు మీ నమ్మకాలపట్ల ఆసక్తి ఉండవచ్చు

[28వ పేజీలోని చిత్రం]

మీ పరిచర్యలో మీరు అభివృద్ధి సాధించాలంటే, ప్రయోజనకరమైన సలహాల కోసం మరింత అనుభవంగల సాక్షిని అడగండి