కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అన్ని దేశాల ప్రజలకు సువార్త

అన్ని దేశాల ప్రజలకు సువార్త

అన్ని దేశాల ప్రజలకు సువార్త

“భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.”​—⁠అపొస్తలుల కార్యములు 1:⁠8.

సమర్థులైన బోధకులు, తమ విద్యార్థులకు తాము బోధించే విషయం మీదేకాక, దానిని ఎలా బోధిస్తున్నామనే విషయంలో కూడా శ్రద్ధవహిస్తారు. బైబిలు సత్య బోధకులుగా, మనం కూడా అలాగే శ్రద్ధవహిస్తాం. మనం ప్రకటించే సందేశానికి, మనం ఉపయోగించే పద్ధతులకు శ్రద్ధనిస్తాం. మన సందేశం, అంటే మనం ప్రకటించే దేవుని రాజ్యసువార్తలో మార్పు ఉండదు, అయితే మన పద్ధతులను మాత్రం పరిస్థితులకు తగినవిధంగా మార్చుకుంటాం. ఎందుకు? సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజలకు ప్రకటించడానికే.

2 మన ప్రకటనా పద్ధతులను పరిస్థితులకు తగినవిధంగా మార్చుకోవడం ద్వారా మనం దేవుని ప్రాచీనకాల సేవకులను అనుకరిస్తాం. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు విషయమే పరిశీలించండి. ఆయనిలా చెప్పాడు: “యూదులను సంపాదించికొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించికొనుటకు . . . ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని. . . . బలహీనులను సంపాదించికొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.” (1 కొరింథీయులు 9:​19-23) పరిస్థితులకు తగినవిధంగా మార్చుకునే పౌలు పద్ధతికి మంచి ఫలితాలు వచ్చాయి. మనం మాట్లాడే వ్యక్తికి తగ్గట్టు మన అందింపును సవరించుకున్నప్పుడు మనం కూడా మంచి ఫలితాలను సాధించవచ్చు.

“భూదిగంతముల” వరకు

3 సువార్త ప్రకటించే వారికి ఎదురయ్యే ఒక పెద్ద సవాలు, వారి సేవా క్షేత్రపు పరిమాణం, అంటే ‘లోకమంతా’ ప్రకటించడం. (మత్తయి 24:​14) గత శతాబ్దంలో, యెహోవా సేవకులు చాలామంది, సువార్త ప్రకటించడానికి క్రొత్త ప్రాంతాలకు చేరుకునేందుకు చాలా కష్టపడ్డారు. ఫలితమేమిటి? అద్భుతరీతిలో ప్రపంచవ్యాప్తంగా విస్తరణ జరిగింది. 20వ శతాబ్దారంభంలో కేవలం కొన్ని దేశాల్లోనే ప్రకటనా పని నివేదించబడింది, కానీ నేడు యెహోవాసాక్షులు 235 దేశాల్లో చురుకుగా పనిచేస్తున్నారు. అవును, రాజ్యసువార్త ‘భూదిగంతముల’ వరకు ప్రకటించబడుతోంది.​—⁠యెషయా 45:22.

4 అలాంటి అభివృద్ధికి తోడ్పడుతున్నదేమిటి? చాలా విషయాలున్నాయి. వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌లో శిక్షణ పొందిన మిషనరీలు, ఇటీవలి సంవత్సరాల్లో మినిస్టీరియల్‌ ట్రైనింగ్‌ స్కూల్‌ నుండి పట్టభద్రులైన 20,000 కంటే ఎక్కువమంది ఎంతో తోడ్పడ్డారు. అలాగే చాలామంది సాక్షులు సొంత ఖర్చులతో రాజ్య ప్రచారకులు ఎక్కువగా అవసరమున్న ప్రాంతాలకు వెళ్లారు. అలాంటి స్వయంత్యాగ స్ఫూర్తిగల క్రైస్తవులైన స్త్రీపురుషులు, యౌవనులు, వృద్ధులు, వివాహితులు, అవివాహితులు భూవ్యాప్తంగా రాజ్య సందేశాన్ని ప్రకటించడంలో విశేషమైన పాత్ర పోషిస్తున్నారు. (కీర్తన 110:3; రోమీయులు 10:​18) వారెంతో విలువైనవారిగా పరిగణించబడుతున్నారు. బ్రాంచి క్షేత్రంలో అవసరం ఎక్కువగావున్న ప్రాంతాల్లో సేవ చేయడానికి వేరే దేశాలనుండి వచ్చినవారి గురించి కొన్ని బ్రాంచి కార్యాలయాలు ఏమి వ్రాస్తున్నాయో గమనించండి.

5 “ఐసొలేటెడ్‌ ప్రాంతాల్లో ప్రకటించడంలో, క్రొత్త సంఘాలు రూపొందేలా సహాయం చేయడంలో, స్థానిక సహోదరసహోదరీల ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడడంలో ప్రియమైన ఈ సాక్షులు సారథ్యం వహిస్తున్నారు.” (ఈక్వెడార్‌) “ఇక్కడ సేవచేస్తున్న వందలాదిమంది విదేశీయులు వెళ్లిపోవలసివస్తే, సంఘాల స్థిరత్వం దెబ్బతింటుంది. వారు మాతో ఉండడం ఆశీర్వాదకరం.” (డొమినికన్‌ రిపబ్లిక్‌) “మా ప్రాంతంలో ఉన్న అనేక సంఘాల్లో, ఎక్కువశాతం సహోదరీలే ఉన్నారు, కొన్నిచోట్లయితే 70 శాతంకంటే ఎక్కువ సహోదరీలే ఉన్నారు. (కీర్తన 68:​11) వారిలో చాలామంది కొత్తగా సత్యం తెలుసుకున్నవారు, అయితే వేరే దేశాలనుండి వచ్చిన అవివాహిత పయినీరు సహోదరీలు అలాంటి క్రొత్తవారికి శిక్షణ ఇస్తూ అమూల్యమైన సహాయం అందిస్తున్నారు. విదేశాలనుండి వచ్చిన ఈ సహోదరీలు నిజంగా మాకొక వరంగా ఉన్నారు.” (ఒక తూర్పు ఐరోపా దేశం) వేరే దేశంలో సేవ చేయడం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? *​—⁠అపొస్తలుల కార్యములు 16:9, 10.

‘ఆయా భాషలు మాటలాడు వారిలో పదేసిమంది’

6 మరో పెద్ద సవాలేమిటంటే, భూమ్మీద ఉపయోగించబడుతున్న భాషల వైవిధ్యత. దేవుని వాక్యం ముందుగానే ఇలా చెప్పింది: “ఆ దినములలో ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని​—⁠దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.” (జెకర్యా 8:​23) ఈ ప్రవచన ఆధునికదిన నెరవేర్పులో, ఆ పదిమంది ప్రకటన 7:9లో ప్రవచించబడిన గొప్పసమూహానికి ప్రతీకగా ఉన్నారు. అయితే జెకర్యా ప్రవచనం ప్రకారం ఆ “పదిమంది” అన్ని జనాంగముల నుండే కాక “ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో” నుండి కూడా వస్తారని గమనించండి. ప్రవచనంలోని ఈ ముఖ్య వివరణ నెరవేర్పును మనం చూశామా? అవును చూశాం.

7 కొన్ని గణాంకాలు పరిశీలించండి. 50 సంవత్సరాల క్రితం మన సాహిత్యాలు 90 భాషల్లో ప్రచురించబడేవి. నేడు ఆ సంఖ్య 400లకు చేరుకుంది. కేవలం కొద్దిమంది మాత్రమే ఉపయోగించే భాషలో కూడా సాహిత్యాలు అందించడానికి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” చేయని ప్రయత్నం లేదు. (మత్తయి 24:​45) ఉదాహరణకు, బైబిలు సాహిత్యాలు ఇప్పుడు గ్రీన్‌లాండిక్‌ (ఈ భాష మాట్లాడేవారు 47,000 మంది ఉన్నారు), పలావన్‌ (ఈ భాష మాట్లాడేవారు 15,000 మంది ఉన్నారు), యాపీస్‌ (ఈ భాష మాట్లాడేవారు 7,000లకన్నా తక్కువగా ఉన్నారు) భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

క్రొత్త అవకాశాలకు నడిపించే “గొప్ప ద్వారము”

8 అయితే ఈ రోజుల్లో, ఆయా భాషలు మాట్లాడే ప్రజలతో సువార్తను ప్రకటించడానికి మనం వేరే దేశాలకు వెళ్లవలసిన అవసరం రాకపోవచ్చు. ఇటీవలి సంవత్సరాల్లో, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలకు వలసదారులు, శరణార్థులు లక్షల సంఖ్యలో చేరుకోవడంతో అనేక భాషలు మాట్లాడే వలస సమాజాలు ఏర్పడ్డాయి. ఉదాహరణకు, ఫ్రాన్స్‌లోని పారిస్‌లో దాదాపు 100 భాషలు మాట్లాడే ప్రజలున్నారు. కెనడాలోని టొరాంటోలో ఆ సంఖ్య 125; ఇంగ్లాండ్‌లోని లండన్‌లో 300 కంటే ఎక్కువ విదేశీ భాషల ప్రజలున్నారు! అనేక సంఘాల సేవా క్షేత్రాల్లో ఈ వేరే దేశపు ప్రజలు ఉండడం, అన్ని జనాంగాల ప్రజలతో సువార్త పంచుకునే క్రొత్త అవకాశాలకు నడిపించే “గొప్ప ద్వారము” తెరిచింది.​—⁠1 కొరింథీయులు 16:⁠9, అధస్సూచి.

9 వేలాదిమంది సాక్షులు వేరే భాష నేర్చుకోవడం ద్వారా ఆ సవాలును ఎదుర్కొంటున్నారు. చాలామందికి అది కష్టం; అయినప్పటికీ, దేవుని వాక్యంలోని సత్యాన్ని తెలుసుకోవడానికి వలసదారులకు, శరణార్థులకు సహాయం చేయడం ద్వారా కలుగుతున్న ఆనందం, కృషికి తగిన ఫలితంకంటే ఎక్కువగానే ఉంది. ఇటీవల ఒక సంవత్సరంలో, పశ్చిమ ఐరోపాలోని ఒక దేశంలో జరిగిన జిల్లా సమావేశాల్లో బాప్తిస్మం తీసుకున్న వారిలో దాదాపు 40 శాతం మంది వేరే దేశాల నుండి వచ్చినవారే.

10 నిజమే, మనలో చాలామందిమి వేరే భాష నేర్చుకునే స్థితిలో లేము. అయినప్పటికీ, క్రొత్తగా విడుదల చేయబడిన అన్ని దేశాల ప్రజలకు సువార్త * అనే చిన్నపుస్తకాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా వలసదారులకు మనం సహాయం చేయవచ్చు. ఆ పుస్తకంలో ఆకర్షణీయమైన బైబిలు సందేశం అనేక భాషల్లో ఉంది. (యోహాను 4:​37) పరిచర్యలో మీరు ఆ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారా?

ప్రజలు స్పందించనప్పుడు

11 భూమ్మీద సాతాను ప్రభావం పెరుగుతున్నకొద్దీ తరచూ ఎదురయ్యే మరో సవాలు, కొన్ని క్షేత్రాల్లో స్పందనలేకపోవడం. అయితే, ఈ పరిస్థితి మనల్ని ఆశ్చర్యపరచదు, ఎందుకంటే అలాంటి పరిస్థితి ఉంటుందని యేసు ముందేచెప్పాడు. మన కాలం గురించి చెబుతూ ఆయన ఇలా అన్నాడు: “అనేకుల ప్రేమ చల్లారును.” (మత్తయి 24:​12) అవును, దేవునిపై నమ్మకం, బైబిలు మీద గౌరవం చాలామందిలో సన్నగిల్లింది. (2 పేతురు 3:​3, 4) ఫలితంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో, కేవలం కొద్దిమందే క్రీస్తు శిష్యులవుతున్నారు. అంతమాత్రాన, స్పందనలేని అలాంటి ప్రాంతాల్లో నమ్మకంగా ప్రకటిస్తున్న మన ప్రియ క్రైస్తవ సహోదరసహోదరీల శ్రమ వ్యర్థమైందని దానర్థం కాదు. (హెబ్రీయులు 6:​10) ఎందుకు కాదు? ఈ క్రింది విషయాన్ని పరిశీలించండి.

12 మత్తయి సువార్త మన ప్రకటనా కార్యకలాపాలకున్న రెండు ముఖ్య ఉద్దేశాలను నొక్కిచెబుతోంది. మొదటిది మనం “సమస్త జనులను శిష్యులనుగా” చేయడం. (మత్తయి 28:​19) రెండవది, రాజ్య సందేశమే ‘సాక్ష్యార్థంగా’ పనిచేస్తుంది. (మత్తయి 24:​14) ఈ రెండు ఉద్దేశాలు ప్రాముఖ్యమే, అయితే రెండవది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు?

13 అపొస్తలులు యేసును ఇలా అడిగారని బైబిలు రచయిత మత్తయి వ్రాశాడు: “నీ రాకడకును [‘ప్రత్యక్షతకు,’ NW] ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” (మత్తయి 24:⁠3) యేసు దానికి జవాబిస్తూ భూవ్యాప్తంగా జరిగే ప్రకటనాపని ఆ సూచనల్లో ఒక అసాధారణ అంశంగా ఉంటుందని చెప్పాడు. ఆయన శిష్యులను చేసే పని గురించి మాట్లాడాడా? లేదు. ఆయనిలా చెప్పాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును.” (మత్తయి 24:​14) ఆ విధంగా, రాజ్య ప్రకటనాపనే ఆ సూచనలో ఒక ప్రాముఖ్యమైన అంశంగా ఉంటుందని యేసు వివరించాడు.

14 కాబట్టి మనం రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు, శిష్యులను చేసే పనిలో మనమన్ని సమయాల్లో విజయవంతం కాలేకపోయినా, ‘సాక్ష్యం’ ఇవ్వడంలో విజయవంతమవుతామని గుర్తుంచుకుంటాం. ప్రజల స్పందన ఎలా ఉన్నప్పటికీ, మనమేమి చేస్తున్నామో వారికి తెలుసు, ఆ విధంగా మనం యేసు చెప్పిన ప్రవచన నెరవేర్పులో భాగం వహిస్తాం. (యెషయా 52:7; ప్రకటన 14:​6, 7) పశ్చిమ ఐరోపాలో నివసిస్తున్న యౌవన సాక్షి జోర్డీ ఇలా వ్రాస్తున్నాడు: “మత్తయి 24:14ను నెరవేర్చడంలో భాగం వహించడానికి యెహోవా నన్ను ఉపయోగించుకుంటున్నాడని తెలుసుకోవడం నాకెంతో సంతోషం కలిగిస్తుంది.” (2 కొరింథీయులు 2:​15-17) నిస్సందేహంగా మీరు కూడా అలాగే భావిస్తుంటారు.

మన సందేశం వ్యతిరేకించబడినప్పుడు

15 రాజ్య సువార్త ప్రకటనా పనికి ప్రతికూల పరిస్థితులు మరో సవాలుగా నిలుస్తాయి. యేసు తన అనుచరులను ముందే ఇలా హెచ్చరించాడు: “మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.” (మత్తయి 24:⁠9) తొలి క్రైస్తవుల్లాగే నేటి యేసు అనుచరులు కూడా ద్వేషించబడుతున్నారు, వ్యతిరేకించబడుతున్నారు, హింసించబడుతున్నారు. (అపొస్తలుల కార్యములు 5:17, 18, 40; 2 తిమోతి 3:12; ప్రకటన 12:​12, 17) కొన్ని దేశాల్లో వారిప్పుడు ప్రభుత్వ నిషేధాలకు గురిగా ఉన్నారు. అయినప్పటికీ, అలాంటి దేశాల్లోని నిజ క్రైస్తవులు దేవునికి లోబడుతూ రాజ్య సువార్త ప్రకటించడంలో కొనసాగుతున్నారు. (ఆమోసు 3:8; అపొస్తలుల కార్యములు 5:29; 1 పేతురు 2:​21) అలా కొనసాగడానికి వారిని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సాక్షులను ఏది బలపరుస్తోంది? యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా వారిని శక్తిమంతులను చేస్తున్నాడు.​—⁠జెకర్యా 4:6; ఎఫెసీయులు 3:16; 2 తిమోతి 4:⁠17.

16 దేవుని పరిశుద్ధాత్మకు, ప్రకటనాపనికి ఉన్న సన్నిహిత సంబంధాన్ని నొక్కిచెబుతూ యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: ‘పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక భూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురు.’ (అపొస్తలుల కార్యములు 1:8; ప్రకటన 22:​17) ఈ లేఖనంలోని సంఘటనల వరుస క్రమం గమనార్హమైనది. మొదట, శిష్యులు పరిశుద్ధాత్మను పొంది, ఆ తర్వాత భూవ్యాప్త సాక్ష్యపు పనిని చేపట్టారు. కేవలం దేవుని పరిశుద్ధాత్మ మద్దతువల్లనే వారు “సకల జనములకు సాక్ష్య[మిచ్చే]” పనిలో కొనసాగడానికి శక్తి పొందుతారు. (మత్తయి 24:13, 14; యెషయా 61:​1, 2) కాబట్టి, సముచితంగానే యేసు పరిశుద్ధాత్మను “ఆదరణకర్త” అని సూచించాడు. (యోహాను 15:​26) దేవుని ఆత్మ శిష్యులకు బోధించి, వారిని నడిపిస్తుందని ఆయన చెప్పాడు.​—⁠యోహాను 14:16, 26; 16:⁠13.

17 మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటే, దేవుని పరిశుద్ధాత్మ నేడు మనకు ఏయే విధాలుగా సహాయం చేస్తుంది? దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తూ, మనల్ని హింసించే వారిని వ్యతిరేకిస్తుంది. దీనిని ఉదాహరించడానికి, రాజైన సౌలు జీవితంలో జరిగిన ఒక సంఘటనను పరిశీలించండి.

దేవుని ఆత్మచేత వ్యతిరేకించబడడం

18 ఇశ్రాయేలు మొదటి రాజుగా సౌలు ప్రారంభంలో బాగానే ఉన్నాడు, కానీ ఆ తర్వాత అతను యెహోవాకు అవిధేయుడయ్యాడు. (1 సమూయేలు 10:​1, 24; 11:14, 15; 15:​17-23) దాని ఫలితంగా దేవుని పరిశుద్ధాత్మ ఆ రాజుకు ఏ మాత్రం మద్దతు ఇవ్వలేదు. తర్వాతి రాజుగా అభిషేకించబడి, దేవుని ఆత్మ మద్దతును ఆస్వాదిస్తున్న దావీదుపట్ల, సౌలు హింసాత్మక కోపాన్ని వృద్ధిచేసుకున్నాడు. (1 సమూయేలు 16:​1, 13, 14) దావీదు సులభంగా దొరికేలా కనిపించాడు. ఎందుకంటే, ఆయన దగ్గర కేవలం వీణ మాత్రమే ఉంది, కానీ సౌలు దగ్గర ఈటె ఉంది. కాబట్టి ఒకరోజు దావీదు వీణ వాయిస్తుండగా “దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించుకొనెను.” (1 సమూయేలు 18:​10, 11) ఆ తర్వాత సౌలు తన కుమారుడును, దావీదు స్నేహితుడునైన యోనాతాను మాటవిని ఇలా ప్రమాణం చేశాడు: “యెహోవా జీవముతోడు అతనికి [దావీదుకు] మరణశిక్ష విధింపను.” కానీ ఆ తర్వాత సౌలు మళ్లీ “ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము గలిగి యీటె విసిరెను.” అయితే దావీదు “అతని యెదుటనుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నా[టుకొనెను].” దావీదు పారిపోయాడు, కానీ సౌలు ఆయనను తరిమాడు. ఆ కీలక సమయంలో, దేవుని ఆత్మ సౌలును వ్యతిరేకించడం ఆరంభించింది. ఏ విధంగా?​—⁠1 సమూయేలు 19:6, 10.

19 దావీదు సమూయేలు ప్రవక్త దగ్గరకు పారిపోయాడు, కానీ సౌలు ఆయనను బంధించడానికి తన మనుష్యులను పంపాడు. అయితే వారు దావీదు దాక్కొన్న స్థలానికి వచ్చినప్పుడు “దేవుని ఆత్మ సౌలు పంపిన దూతలమీదికి వచ్చెను గనుక వారును ప్రకటింపనారంభించిరి.” దేవుని ఆత్మ వారిని ఎంతగా ప్రభావితం చేసిందంటే, వారు తామొచ్చిన పనిని పూర్తిగా మరచిపోయారు. దావీదును తీసుకురావడానికి సౌలు మరి రెండుసార్లు తన మనుష్యులను పంపించాడు, ప్రతీసారి మొదట జరిగినట్లే జరిగింది. చివరకు, సౌలు రాజే స్వయంగా దావీదును పట్టుకోవడానికి వెళ్లాడు, అయితే సౌలు కూడా దేవుని ఆత్మ ప్రభావాన్ని నిరోధించలేకపోయాడు. నిజానికి, దావీదుకు పారిపోవడానికి తగినంత సమయం లభించేలా పరిశుద్ధాత్మ సౌలును “ఆ నాటి రాత్రింబగళ్లు” కదలకుండా చేసింది.​—⁠1 సమూయేలు 19:​20-24.

20 సౌలు, దావీదులకు సంబంధించిన ఈ వృత్తాంతంలో బలపరిచే పాఠం ఉంది. అదేమిటంటే, దేవుని ఆత్మ వ్యతిరేకిస్తే దేవుని సేవకులను హింసించేవారు విజయం సాధించలేరు. (కీర్తన 46:​11; 125:⁠2) ఇశ్రాయేలుపై దావీదు రాజు కావాలని యెహోవా సంకల్పించాడు. ఎవరూ దానిని మార్చలేరు. మన కాలంలో, ‘రాజ్యసువార్త ప్రకటించబడుతుంది’ అని యెహోవా నిర్ణయించాడు. అది నెరవేరకుండా ఎవరూ ఆపుజేయలేరు.​—⁠అపొస్తలుల కార్యములు 5:40, 42.

21 మనలను అడ్డుకొనేందుకు కొందరు మతనాయకులు, రాజకీయ నాయకులు అబద్ధాలు చెబుతూ, హింసను కూడా ఉపయోగిస్తారు. అయితే యెహోవా దావీదును ఆధ్యాత్మికంగా రక్షించినట్లే, ఆయన నేడు తన ప్రజలను రక్షిస్తాడు. (మలాకీ 3:⁠6) కాబట్టి దావీదులాగే మనమూ నమ్మకంతో ఇలా చెబుతాం: “నేను దేవునియందు నమ్మికయుంచి యున్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు?” (కీర్తన 56:​11; 121:1-8; రోమీయులు 8:​31) అవును, సకల జనములకు రాజ్య సువార్త ప్రకటించమని యెహోవా దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడంలో ఎదురయ్యే సవాళ్లన్నింటిని ఆయన సహాయంతోనే అధిగమించుదుము గాక.

[అధస్సూచీలు]

^ పేరా 8 22వపేజీలో ఉన్న “అధిక సంతృప్తి” అనే బాక్సు చూడండి.

^ పేరా 15 యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

మన ప్రకటనా పద్ధతులను తగినవిధంగా ఎందుకు మార్చుకుంటాం?

ఎలాంటి క్రొత్త అవకాశాలకు నడిపించే “గొప్ప ద్వారము” తెరవబడింది?

మన ప్రకటనా పని ద్వారా, స్పందన తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఏమి నెరవేర్చబడుతోంది?

రాజ్యసువార్త ప్రకటనను ఏ వ్యతిరేకీ ఎందుకు ఆపలేడు?

[అధ్యయన ప్రశ్నలు]

1. బైబిలు బోధకులుగా మనం దేనికి శ్రద్ధనిస్తాం, ఎందుకిస్తాం?

2. మన ప్రకటనా పద్ధతులను పరిస్థితులకు తగినవిధంగా మార్చుకున్నప్పుడు, మనం ఎవరిని అనుకరిస్తాం?

3. (ఎ) మన ప్రకటనాపనిలో మనమెలాంటి సవాలును ఎదుర్కొంటున్నాం? (బి) యెషయా 45:22లోని మాటలు నేడు ఎలా నెరవేరుతున్నాయి?

4, 5. (ఎ) సువార్తను వ్యాపింపజేయడంలో ఎవరు విశేషమైన పాత్ర పోషిస్తున్నారు? (బి) విదేశాలనుండి వచ్చి తమ బ్రాంచి క్షేత్రంలో సేవ చేస్తున్న వారి గురించి కొన్ని బ్రాంచిలు ఏమని చెప్పాయి?

6. మన ప్రకటనా పనిలోని భాషాపరమైన సవాలును జెకర్యా 8:⁠23 ఎలా సూచిస్తోంది?

7. “ఆయా భాషలు మాటలాడు” ప్రజలకు సువార్త ప్రకటించబడుతోందని ఏ గణాంకాలు చూపిస్తున్నాయి?

8, 9. ఎలాంటి పరిణామం మనకు “గొప్ప ద్వారము” తెరిచింది, వేలాదిమంది సాక్షులు ఎలా స్పందించారు?

10. అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్నపుస్తకాన్ని మీరు ఎలా ఉపయోగించారు? (26వ పేజీలో ఉన్న “అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్నపుస్తకంలోని అంశాలు” అనే బాక్సు చూడండి.)

11. కొన్ని క్షేత్రాల్లో ఏ అదనపు సవాలు ఎదురవుతుంది?

12. మన ప్రకటనా పని రెండు ఉద్దేశాలు ఏమిటి?

13, 14. (ఎ) క్రీస్తు ప్రత్యక్షతకు సంబంధించిన సూచనలో ఒక అసాధారణ అంశమేమిటి? (బి) స్పందన తక్కువగా ఉన్న క్షేత్రాల్లో ప్రకటించేటప్పుడు ప్రత్యేకంగా మనమేమి గుర్తుంచుకోవాలి?

15. (ఎ) ఏ విషయం గురించి యేసు తన అనుచరులను ముందే హెచ్చరించాడు? (బి) వ్యతిరేకత ఉన్నా ప్రకటించేలా మనల్ని ఏది బలపరుస్తుంది?

16. ప్రకటనాపనికి, దేవుని ఆత్మకుగల సంబంధాన్ని యేసు ఎలా వివరించాడు?

17. మనకు తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పుడు, పరిశుద్ధాత్మ మనకెలా సహాయం చేస్తుంది?

18. (ఎ) సౌలులో ఎలాంటి చెడ్డ మార్పు వచ్చింది? (బి) దావీదును హింసించడానికి సౌలు ఎలాంటి పద్ధతులు ఉపయోగించాడు?

19. దేవుని ఆత్మ దావీదును ఎలా కాపాడింది?

20. సౌలు దావీదును హింసించిన వృత్తాంతం నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు?

21. (ఎ) నేడు కొందరు వ్యతిరేకులు ఎలా ప్రవర్తిస్తారు? (బి) ఏ విషయంలో మనకు నమ్మకముంది?

[22వ పేజీలోని బాక్సు]

అధిక సంతృప్తి

“వారు సంతోషంగా యెహోవాను ఐక్యంగా సేవించడంలో ఆనందిస్తున్నారు.” స్పెయిన్‌ నుండి బొలీవియాకు తరలివెళ్లిన ఒక కుటుంబాన్ని ఆ మాటలు వర్ణిస్తున్నాయి. ఆ కుటుంబంలోని ఒక కుమారుడు, ఒక ఐసొలేటెడ్‌ గుంపుకు సహాయం చేయడానికి అక్కడికి వెళ్లాడు. ఆయనలో కనిపించిన ఆనందం ఆయన తల్లిదండ్రులను ఎంతగా ముగ్ధుల్ని చేసిందంటే, 14-25 సంవత్సరాల మధ్య వయస్సుగల నలుగురు కుమారులతోపాటు మొత్తం కుటుంబం త్వరలోనే అక్కడ సేవ చేయడం ఆరంభించింది. వారిలో ముగ్గురు పిల్లలు ఇప్పుడు పయినీరు సేవ చేస్తున్నారు. అక్కడికి ముందుగా వెళ్లిన కుమారుడు ఇటీవలే పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరయ్యాడు.

తూర్పు ఐరోపాలో సేవ చేస్తున్న కెనడాకు చెందిన 30 ఏళ్ల ఆంజిలికా ఇలా చెబుతోంది: “అనేక సవాళ్లు ఉంటాయి. అయితే పరిచర్యలో ప్రజలకు సహాయం చేయడంలో నేను సంతృప్తి చెందాను. సహాయం చేయడానికి వచ్చినందుకు తరచూ నాకు ధన్యవాదాలు చెబుతూ స్థానిక సాక్షులు పలికే కృతజ్ఞతా పలుకులకు కూడా నేనెంతో చలించిపోతాను.”

డొమెనికన్‌ రిపబ్లిక్‌లో సేవ చేస్తున్న, అమెరికాకు చెందిన ఆన, లారా అనే 20 ఏళ్ళు పైబడిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇలా వివరిస్తున్నారు: “అలవాటు చేసుకోవలసిన వాడుకలు ఎన్నో ఉన్నాయి. అయితే, మేము పట్టుదలగా మా నియామకంలో కొనసాగాం, ఇప్పుడు ఏడుగురు బైబిలు విద్యార్థులు కూటాలకు హాజరవుతున్నారు.” ఈ ఇద్దరు సహోదరీలు అసలు సంఘమే లేని పట్టణంలో రాజ్య ప్రచారకుల గుంపును వ్యవస్థీకరించడంలో కీలకపాత్ర వహించారు.

20 ఏళ్లు పైబడిన లారా అనే సహోదరి నాలుగు సంవత్సరాలకు పైగా వేరే దేశంలో సేవ చేస్తోంది. ఆమె ఇలా చెబుతోంది: “నేను కావాలనే నా జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకుంటున్నాను. నిరాడంబర జీవన విధానం, బీదరికం కారణంగా కాదుగానీ, స్వస్థబుద్ధితో కావాలని ఎంచుకున్న జీవన విధానమని చూసేందుకు ప్రచారకులకు సహాయం చేస్తుంది. ఇతరులకు ప్రత్యేకంగా యౌవనులకు సహాయం చేయగలగడం, విదేశీ క్షేత్రంలో సేవ చేయడం వల్ల కలిగే నిజమైన కష్టాలను అధిగమించేందుకు దోహదపడే ఆనందానికి మూలంగా ఉంది. ఇక్కడి సేవకు బదులు నాకు జీవితంలో మరింకేదీ అవసరం లేదు, యెహోవా అనుమతించినంత కాలం నేనిక్కడే ఉంటాను.”

[26వ పేజీలోని బాక్సు/చిత్రం]

అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్న పుస్తకంలోని అంశాలు

అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్న పుస్తకంలో ఒక పేజీ సందేశం ఉంది. కొన్ని దేశాల ప్రతుల్లో ఆ సందేశం 92 భాషల్లో ఉంది. ఆ సందేశం ఉత్తమ పురుషములో వ్రాయబడింది. కాబట్టి ఆ సందేశాన్ని గృహస్థుడు చదువుతున్నప్పుడు, అది మీరు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నట్లే ఉంటుంది. ఆ పుస్తకంలో ఉపయోగకరమైన ఇతర అంశాలూ ఉన్నాయి:

మనకు అర్థం కాని భాష మాట్లాడేవారికి సమర్థవంతంగా సహాయం చేయడానికి, మనం తీసుకోవలసిన మూడు ప్రధాన చర్యలను ఈ పుస్తకంలోని ముందుమాట పేర్కొంటుంది. దయచేసి ఈ మూడు చర్యలను జాగ్రత్తగా చదివి, వాటిని జాగ్రత్తగా అనుసరించండి ఎందుకంటే, వాటిమీద జీవితాలు ఆధారపడివున్నాయి.

విషయసూచికలో భాషలు మాత్రమే కాక, ఆ భాషా సంబంధిత చిహ్నాలు కూడా ఉన్నాయి. ఈ అంశం మన కరపత్రాల మీద, వివిధ భాషల్లోని ఇతర సాహిత్యాల మీద ముద్రించబడివున్న భాషా చిహ్నాలను గుర్తించడానికి మీకు సహాయం చేస్తుంది.

[చిత్రం]

మీరు ఈ చిన్న పుస్తకాన్ని పరిచర్యలో ఉపయోగిస్తున్నారా?

[23వ పేజీలోని చిత్రాలు]

మన బైబిలు సాహిత్యాలు ఇప్పుడు 400లకు పైగా భాషల్లో లభ్యమవుతున్నాయి

ఘానా

ల్యాప్‌ల్యాండ్‌ (స్వీడెన్‌)

ఫిలిప్పీన్స్‌

[24, 25వ పేజీలోని చిత్రాలు]

రాజ్య ప్రచారకులు ఎక్కువగా అవసరమున్న ప్రాంతంలో మీరు సేవ చేయగలరా?

ఈక్వెడార్‌

డొమినికన్‌ రిపబ్లిక్‌