కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు’

‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు’

‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు’

పక్షులు ఉదయం నిద్రలేచినప్పుడు సాధారణంగా కొంతసేపు కిచకిచలాడి ఆ తర్వాత ఆహార అన్వేషణకు వెళ్తాయి. సాయంకాలం అవి తమ గూళ్ళకు తిరిగి చేరి మరికాస్సేపు కిచకిచలాడి, నిద్రకు ఉపక్రమిస్తాయి. కొన్ని ఋతువుల్లో అవి జతకడతాయి, గుడ్లు పెడతాయి, తమ పిల్లలను పెంచుతాయి. ఇతర జంతువులు కూడా దాదాపు అలాగే ప్రవర్తిస్తాయి.

కానీ మానవులమైన మనం వేరు. నిజమే, మనం కూడా భోజనం చేస్తాం, నిద్రిస్తాం, సంతానోత్పత్తి చేస్తాం, అయితే మనలో చాలామందిమి కేవలం వీటితో సంతృప్తి చెందం. మనం ఇక్కడ ఉనికిలో ఎందుకున్నామో తెలుసుకోవాలనుకుంటాం. మన జీవిత సంకల్పమేమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం. మనం భవిష్యత్తుకు ఒక నిరీక్షణ ఉండాలని కూడా కోరుకుంటాం. ఇలాంటి లోతైన అవసరాలు, మానవజాతికిగల ప్రత్యేకమైన ఒక లక్షణాన్ని సూచిస్తున్నాయి, అదే ఆధ్యాత్మికత లేదా ఆధ్యాత్మిక విషయాల అవసరం, ఆధ్యాత్మిక విషయాలను గ్రహించగలిగే మన సామర్థ్యం.

దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం

మానవునిలో ఆధ్యాత్మికత కోసం సహజ అవసరం ఉండడానికిగల కారణాన్ని బైబిలు వివరిస్తోంది, అదిలా చెబుతోంది: “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.” (ఆదికాండము 1:​27) మనం ‘దేవుని స్వరూపంలో’ సృష్టించబడ్డాం అంటే దానర్థం మనం పాపం, అపరిపూర్ణత ద్వారా కళంకులమైనా కూడా దేవుని లక్షణాలు కొన్నింటిని ప్రతిబింబించే సామర్థ్యం మనలో ఉంది. (రోమీయులు 5:​12) ఉదాహరణకు మనం సృజనాత్మకంగా ఉండవచ్చు. జ్ఞానం, న్యాయ భావం, ఒకరిపట్ల మరొకరు స్వయంత్యాగపూరితమైన ప్రేమ చూపించే సామర్థ్యం వంటివి కూడా మనలో అధిక పరిమాణంలో ఉన్నాయి. అంతేకాక, మనం గతాన్ని పరిశీలించి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోగలం.​—⁠సామెతలు 4:⁠7; ప్రసంగి 3:​1, 11; మీకా 6:⁠8; యోహాను 13:​34; 1 యోహాను 4:⁠8.

దేవుణ్ణి ఆరాధించాలనే మన సహజ కోరికలో మన ఆధ్యాత్మిక సామర్థ్యం అతి స్పష్టంగా కనబడుతోంది. మన సృష్టికర్తతో మన సంబంధాన్ని మెరుగుపరచుకోవాలనే మన అవసరాన్ని సరైన విధంగా తీర్చుకోకుంటే తప్ప మనం నిజమైన, శాశ్వత సంతోషాన్ని పొందలేం. ‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు’ అని యేసు చెప్పాడు. (మత్తయి 5:⁠3, NW) అయితే ఆ అవసరాన్ని ఆధ్యాత్మిక సత్యంతోనే తీర్చుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి, ఆ ఆధ్యాత్మిక సత్యంలో దేవుని గురించిన వాస్తవాలు, ఆయన ప్రమాణాలు, మానవజాతి విషయంలో ఆయన సంకల్పం ఉన్నాయి. మనం ఆధ్యాత్మిక సత్యాన్ని ఎక్కడ కనుగొనగలం? బైబిల్లోనే.

“నీ వాక్యమే సత్యము”

అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును . . . ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:​16) పౌలు చెప్పిన ఈ మాటలు అంతకుముందు యేసు దేవునికి చేసిన ప్రార్థనలో అన్న మాటలతో ఏకీభవిస్తున్నాయి, ఆయన ఇలా అన్నాడు: “నీ వాక్యమే సత్యము.” ఆ వాక్యం పరిశుద్ధ బైబిలు అని నేడు మనకు తెలుసు, మన నమ్మకాలు, ప్రమాణాలు బైబిలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో మనం పరిశీలించుకోవడం జ్ఞానయుక్తం.​—⁠యోహాను 17:​17.

మన నమ్మకాలను దేవుని వాక్యంతో పోల్చడం ద్వారా మనం పౌలు బోధలు లేఖనాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో అని పరిశీలించిన ప్రాచీన బెరయ వాసులను అనుకరిస్తాం. లూకా బెరయ వాసులను విమర్శించే బదులు వారు కనబరచిన వైఖరిని బట్టి వారిని మెచ్చుకున్నాడు. వారు ‘ఆసక్తితో వాక్యమును అంగీకరించి ప్రతిదినమును లేఖనములు జాగ్రత్తగా పరిశోధించుచు వచ్చిరి’ అని ఆయన వ్రాశాడు. (అపొస్తలుల కార్యములు 17:​11) నేడు విస్తారంగా ఉన్న పరస్పర విరుద్ధమైన మతపరమైన, నైతికపరమైన బోధల దృష్ట్యా, మనం మంచి వైఖరిగలవారైన బెరయ వాసుల మాదిరిని అనుకరించడం ప్రాముఖ్యం.

ఆధ్యాత్మిక సత్యాన్ని గుర్తించే మరో మార్గం, అది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విధానాన్ని గమనించడం. (మత్తయి 7:​17) ఉదాహరణకు ఒక వ్యక్తి బైబిలు సత్యానికి అనుగుణంగా జీవిస్తే మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి భార్యగా, మంచి తల్లిగా తయారవుతారు, తద్వారా కుటుంబ సంతోషం, సంతృప్తి పెరుగుతుంది. “దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని” యేసు చెప్పాడు.​—⁠లూకా 11:​28.

యేసు మాటలు, ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఆయన పరలోక తండ్రి ఇచ్చిన నిర్దేశాన్ని మనకు గుర్తు చేస్తాయి: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.” (యెషయా 48:​17, 18) మంచితనాన్ని, నీతిని ప్రేమించేవారందరూ ఖచ్చితంగా అలాంటి ప్రేమపూర్వకమైన అభ్యర్థన నుండి ప్రేరణ పొందుతారు!

కొందరు ఎవరేమి చెప్పినా వినడానికి ఆసక్తి చూపే ‘దురద చెవులతో’ ఉంటారు

ఇశ్రాయేలీయులు మతపరమైన అబద్ధాలచేత మోసగించబడుతున్నారు కాబట్టి, దేవుడు వారికి ఆ హృదయపూర్వక అభ్యర్థన చేశాడు. (కీర్తన 106:​35-40) మనం కూడా అబద్ధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నామకార్థ క్రైస్తవుల గురించి పౌలు ఇలా వ్రాశాడు: “జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.”​—⁠2 తిమోతి 4:3, 4.

వివాహేతర లైంగిక సంబంధాలు, సలింగ సంయోగం, త్రాగుబోతుతనం వంటి తప్పుడు కోరికలను తీర్చే అభ్యాసాలను మన్నించడం ద్వారా ప్రజల దురద చెవులకు అనుకూలమైనవి మతనాయకులు చెబుతున్నారు. అలాంటి విషయాలను ఆమోదించేవారు, అలాంటి వాటిని అభ్యసించేవారు “దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు” అని బైబిలు స్పష్టంగా చెబుతోంది.​—⁠1 కొరింథీయులు 6:​9, 10; రోమీయులు 1:​24-32.

బైబిలు ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి ఖచ్చితంగా ధైర్యం అవసరం, ప్రత్యేకంగా ఎగతాళికి గురైనప్పుడు ధైర్యం అవసరం, అయినా మనం బైబిలు ప్రమాణాలకు అనుగుణంగా జీవించగలం. ఒకప్పుడు మాదకద్రవ్యాలకు బానిసలైనవారు, త్రాగుబోతులు, జారులు, హంతకులు, అబద్ధాలు చెప్పినవారు యెహోవాసాక్షుల్లో చాలామంది ఉన్నారు. అయినా వారు దేవుని వాక్యం ద్వారా ప్రభావితులై ‘యెహోవాకు తగినట్టుగా నడుచుకొనేందుకు’ పరిశుద్ధాత్మ సహాయంతో తమ జీవితాల్లో మార్పులు చేసుకున్నారు. (కొలొస్సయులు 1:​9, 10; 1 కొరింథీయులు 6:​11) వారు దేవునితో సమాధానపడడం ద్వారా మనశ్శాంతిని సంపాదించుకోవడమే కాక, మనం గమనించబోతున్నట్లుగా భవిష్యత్తు గురించి నిజమైన నిరీక్షణను కూడా సంపాదించుకున్నారు.

రాజ్య నిరీక్షణ

విధేయులైన మానవులకు శాశ్వత సమాధానం అనే బైబిలు నిరీక్షణ దేవుని రాజ్యం ద్వారా నెరవేరుతుంది. “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని యేసు తన మాదిరి ప్రార్థనలో చెప్పాడు. (మత్తయి 6:⁠9) అవును, దేవుని రాజ్యమే భూమ్మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చగలదు. దేవుని రాజ్యమే ఎందుకు? ఎందుకంటే యేసుక్రీస్తు అధికారంలో ఉన్న ప్రభుత్వమైన ఆ పరలోక రాజ్యం ద్వారానే దేవుడు భూమ్మీద తన సర్వాధిపత్యపు హక్కును వెల్లడి చేస్తాడు.​—⁠కీర్తన 2:​7-12; దానియేలు 7:​13, 14.

యేసుక్రీస్తు ఆ పరలోక రాజ్యానికి రాజుగా విధేయులైన మానవులను అన్ని విధాలైన దాసత్వం నుండే కాక ఆదాము పాపం కారణంగా ఏర్పడిన పాపబంధనం నుండి, దానివల్ల వారసత్వంగా వచ్చిన అనారోగ్యం, మరణం నుండి కూడా విముక్తి చేస్తాడు. ప్రకటన 21:3, 4 ఇలా చెబుతోంది: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది . . . ఆయన [యెహోవా] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”

భూవ్యాప్తంగా శాశ్వత సమాధానం నెలకొంటుంది. మనం అలాంటి నమ్మకంతో ఎందుకు ఉండవచ్చు? దానికిగల కారణం యెషయా 11:9 (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌)లో వెల్లడి చేయబడింది, అదిలా చెబుతోంది: “నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం చేయాలని ఆశించరు. ఎందుకంటే ప్రజలు వాస్తవంగా యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రం నీళ్లతో నిండిపోయినట్టు వారు దైవజ్ఞానంతో నిండిపోయి ఉంటారు.” అవును, భూమ్మీద ఉండే మానవులందరికీ దేవుని ఖచ్చితమైన జ్ఞానం ఉంటుంది, వారు ఆయనకు లోబడి ఉంటారు. అలాంటి భావి నిరీక్షణ మీ హృదయాన్ని ఉత్తేజపరచడం లేదా? ఒకవేళ ఉత్తేజపరుస్తుంటే నేడే మీరు అమూల్యమైన ‘యెహోవాను గురించిన జ్ఞానమును’ సంపాదించుకోవడం ప్రారంభించాలి.

రాజ్య సందేశాన్ని మీరు వింటారా?

దేవుడు తన రాజ్యం ద్వారా సాతాను కృత్యాలన్నిటినీ తొలగించి ప్రజలకు నీతియుక్త మార్గాలను బోధిస్తాడు. కాబట్టి యేసు బోధించిన దాంట్లో అతి ప్రాముఖ్యమైన అంశం రాజ్యం అంటే దానిలో ఆశ్చర్యం లేదు. “[నేను] రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని” అని ఆయన చెప్పాడు. (లూకా 4:​43) ఆ సందేశాన్నే ఇతరులతో పంచుకోమని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 28:​19, 20) “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని ఆయన ముందుగానే చెప్పాడు. (మత్తయి 24:​14) ఆ అంతం వేగంగా సమీపిస్తోంది. అందుకే యథార్థహృదయులు ప్రాణాలను రక్షించే సువార్తను వినడం ఎంత ప్రాముఖ్యమో కదా!

ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన ఆల్బర్ట్‌ తన భార్య, కుమారుడు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం ప్రారంభించినప్పుడు రాజ్య సందేశాన్ని విన్నాడు. ప్రారంభంలో ఆల్బర్ట్‌ సంశయించాడు. ఆయన సాక్షుల తప్పులను వెల్లడిచేసేందుకు తన భార్యను, కుమారుణ్ణి సందర్శించమని స్థానిక మతనాయకుణ్ణి కూడా అడిగాడు. అయితే ఆ మతనాయకుడు అలా రావడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆల్బర్ట్‌ సాక్షుల బోధల్లో తప్పులు పట్టేందుకు బైబిలు చర్చలు జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండి చర్చలను వినాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఒకే ఒక్క అధ్యయనం తర్వాత ఆయనలో ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగి అధ్యయనానికి వచ్చి కూర్చున్నాడు. ఆయన ఆ తర్వాత తన వైఖరిని మార్చుకోవడానికిగల కారణాన్ని వివరించాడు. “దీని కోసమే నేను ఇన్నాళ్ళు వేచి ఉన్నాను” అని అన్నాడు.

చివరకు, ఆల్బర్ట్‌ తన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోవడం ప్రారంభించాడు, ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. సమాజంలో విస్తృతంగా ఉన్న అన్యాయం, అవినీతికి పరిష్కారం కోసం, భవిష్యత్తు గురించిన భావి నిరీక్షణ కోసం తన జీవితమంతా ప్రయత్నించాడు, వాటికి బైబిలు సత్యం ఆయనకు పరిష్కారం చూపింది. బైబిలు సత్యం ఆయనకు మనశ్శాంతిని ఇచ్చింది. మీ ఆధ్యాత్మిక అవసరం తీర్చబడుతోందా? 6వ పేజీ పేజీలోని బాక్సులో ఉన్న ప్రశ్నలను చదవడానికి దయచేసి కొంత సమయం తీసుకోండి. మీకు అదనపు సమాచారం కావాలనుకుంటే, యెహోవాసాక్షులు మీకు సహాయం చేయడానికి సంతోషిస్తారు.

[6వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

మీ ఆధ్యాత్మిక అవసరం తీరుతోందా?

మీకు లభిస్తున్న ఆధ్యాత్మిక ఆహారంతో మీరు తృప్తిపడుతున్నారా? క్రింది ప్రశ్నలను చదివి మీరు సరిగ్గా జవాబివ్వగల ప్రశ్నలకు టిక్కు పెట్టమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

□ దేవుడంటే ఎవరు, ఆయన పేరు ఏమిటి?

□ యేసుక్రీస్తు ఎవరు? ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఆయన మరణం మీకు ఎలా ప్రయోజనం చేకూర్చగలదు?

□ అపవాది ఉన్నాడా? ఉంటే, అతడు ఎక్కడ నుండి వచ్చాడు?

□ మనం చనిపోయినప్పుడు మనకు ఏమి సంభవిస్తుంది?

□ భూమి, మానవజాతి విషయంలో దేవుని సంకల్పం ఏమిటి?

□ దేవుని రాజ్యం అంటే ఏమిటి?

□ నైతికత విషయంలో దేవుని ప్రమాణాలు ఏమిటి?

□ ఒక కుటుంబంలో భార్యాభర్తలకు దేవుడు నియమించిన పాత్రలు ఏమిటి? కుటుంబ సంతోషానికి దోహదపడే కొన్ని బైబిలు సూత్రాలు ఏమిటి?

ఈ ప్రశ్నల్లో దేనికైనా మీకు సరిగ్గా జవాబు తెలియకపోతే, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషుర్‌ను మీరు కోరవచ్చు. ఆ బ్రోషుర్‌ను యెహోవాసాక్షులు దాదాపు 300 భాషల్లో ప్రచురిస్తున్నారు, అది 16 ప్రాథమిక బైబిలు అంశాలను చర్చిస్తోంది, అది పైన ఇవ్వబడిన ప్రశ్నలన్నిటికీ లేఖనాధారిత సమాధానాలను ఇస్తుంది.

[4వ పేజీలోని చిత్రాలు]

జంతువుల్లా కాక మానవులకు ఆధ్యాత్మిక అవసరం ఉంది

[5వ పేజీలోని చిత్రం]

‘వారు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసుకుంటారు.’​—⁠2 తిమోతి 4:⁠3

[7వ పేజీలోని చిత్రం]

దేవుని మెస్సీయ రాజ్యం ద్వారానే శాశ్వత సమాధానం వస్తుంది