పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
“చచ్చినదానిని మీరు తినకూడదు” అని ద్వితీయోపదేశకాండము 14:21 చెబుతోంది. “దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును” అని లేవీయకాండము 11:40 చెబుతోంది, మరి ఇవి రెండూ పరస్పరం విరుద్ధంగా లేవా?
ఈ రెండు లేఖనాలు పరస్పరం విరుద్ధంగా ఏమీ లేవు. మొదటి లేఖనం, బహుశా ఏదైనా క్రూరమృగం చంపడం మూలంగా చనిపోయిన జంతువు కళేబరాన్ని తినకూడదనే నిషేధాన్ని పునరుద్ఘాటిస్తోంది. (నిర్గమకాండము 22:31; లేవీయకాండము 22:8) బహుశా అనుకోకుండా ఆ నిషేధాన్ని ఉల్లంఘించిన ఇశ్రాయేలీయుడు ఏమి చేసి ఉండేవాడో రెండవ లేఖనం వివరిస్తోంది.
ధర్మశాస్త్రం దేన్నైనా నిషేధించింది అంటే దానర్థం ఎప్పుడూ ఎవరూ దాన్ని అలక్ష్యం చేయకుండా ఉండరని కాదు. ఉదాహరణకు, దొంగతనం, హత్య, అబద్ధసాక్ష్యం చెప్పడం వంటివి చేయకూడదని ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అదే సమయంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే చెల్లించవలసిన నష్టపరిహారాలు కూడా ఉన్నాయి. అలాంటి నష్టపరిహారాలు ధర్మశాస్త్రాన్ని అమలులో ఉంచి, అది ఎంత గంభీరమైనదో చూపించేవి.
చనిపోయిన జంతువు కళేబరాన్ని తినకూడదనే నిషేధాన్ని ఉల్లంఘించిన వ్యక్తి యెహోవా దృష్టిలో అపవిత్రుడవుతాడు, అతడు తనను తాను శుద్ధి చేసుకోవడానికి సరైన పద్ధతి అనుసరించాలి. అతడు తనను తాను సరిగా శుద్ధి చేసుకోవడంలో విఫలమైతే, తన ‘దోషశిక్షను భరించాలి.’—లేవీయకాండము 17:15, 16.