కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూవ్యాప్త బైబిలు విద్యాపనిలో నా వంతు నేను చేయగలిగినందుకు సంతోషిస్తున్నాను

భూవ్యాప్త బైబిలు విద్యాపనిలో నా వంతు నేను చేయగలిగినందుకు సంతోషిస్తున్నాను

జీవిత కథ

భూవ్యాప్త బైబిలు విద్యాపనిలో నా వంతు నేను చేయగలిగినందుకు సంతోషిస్తున్నాను

ఆనా మత్తెయాకీస్‌ చెప్పినది

ఓడకు నిప్పంటుకుంది. 171 మీటర్ల పొడవున్న ఆ ఓడ మునిగిపోయిందంటే నేను జలసమాధి అయిపోతాను. నేను బలమైన అలలతో పోరాడుతూ వెర్రిదానిలా సురక్షిత ప్రాంతానికి ఈదుకుంటూ వెళ్తున్నాను. నేను మునిగిపోకుండా ఉండాలంటే మరో స్త్రీ ధరించివున్న లైఫ్‌ జాకెట్‌ను గట్టిగా పట్టుకోవడం కన్నా నాకు మరో మార్గం లేదు. నేను బలం కోసం, ధైర్యం కోసం దేవునికి ప్రార్థించాను. నేను చేయగలిగిందల్లా అదొక్కటే.

నేను నా మూడవ మిషనరీ నియామకమైన ఇటలీ నుండి తిరిగి వస్తున్నాను, అది 1971వ సంవత్సరం. ఆ ఓడ ప్రమాదంలో దాదాపు నాకున్నదంతా పోగొట్టుకున్నాను. అయితే నాకు ఎంతో ముఖ్యమైన నా జీవాన్ని, ప్రేమగల క్రైస్తవ సహోదరత్వాన్ని, యెహోవా సేవచేసే ఆధిక్యతను మాత్రం నేను పోగొట్టుకోలేదు. ఆ సేవ అప్పటికే నన్ను మూడు ఖండాలకు తీసుకువెళ్ళింది, ఎన్నో ఉత్తేజకరమైన విషయాలతో నిండివున్న నా జీవితంలో ఓడ ప్రమాదం కేవలం ఒక దుర్ఘటన మాత్రమే.

నేను 1922లో జన్మించాను. మా కుటుంబం ఉత్తర జెరూసలేమ్‌కు దాదాపు 16 కిలోమీటర్ల దూరంలోవున్న రామల్లాహ్‌లో నివసించేది. నా తల్లిదండ్రులిద్దరూ క్రేతు ద్వీపానికి చెందినవారు, కానీ మా నాన్నగారు నజరేత్‌లో పెరిగారు. ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిల్లో నేను అందరికన్నా చిన్నదాన్ని. మా రెండవ అన్నయ్య స్కూలు తరఫున విహారయాత్రకు వెళ్ళినప్పుడు యోర్దాను నదిలో మునిగి మరణించడంతో మా కుటుంబం బాగా కృంగిపోయింది. ఆ దుర్ఘటన తర్వాత మా అమ్మ రామల్లాహ్‌లో ఉండడానికి నిరాకరించడంతో మేము గ్రీసులోని ఏథెన్స్‌కు వెళ్ళాము, అప్పుడు నాకు మూడేండ్లు.

మా కుటుంబం బైబిలు సత్యం తెలుసుకోవడం

మేము గ్రీసుకు వచ్చిన కొంతకాలానికి, అప్పుడు 22 ఏళ్ళున్న మా అన్నయ్య నీకొస్‌ బైబిలు విద్యార్థులను కలిశాడు, యెహోవాసాక్షులు అప్పట్లో అలా పిలువబడేవారు. బైబిలు జ్ఞానం సంపాదించుకోవడం ఆయనకు ఎంతో ఆనందాన్నివ్వడమే గాక క్రైస్తవ పరిచర్యపట్ల ఆరని ఆసక్తిని రగిల్చింది. దానితో మా నాన్నగారు ఆగ్రహించి, నీకొస్‌ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. అయితే, మా నాన్నగారు పాలస్తీనాకు వెళ్ళినప్పుడు మా అమ్మ, అక్క, నేను నీకొస్‌తోపాటు క్రైస్తవ కూటాలకు వెళ్ళేవాళ్ళం. ఆ కూటాల్లో విన్నవాటి గురించి మా అమ్మ ఉత్సాహంగా మాట్లాడడం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. కానీ కొంతకాలానికి, ఆమె కాన్సర్‌ కారణంగా 42 ఏళ్ళ వయస్సులోనే మరణించింది. ఆ కష్టసమయంలో, మా అక్క ఆరెయిడ్న్‌ ప్రేమపూర్వకంగా మా కుటుంబ బాధ్యత చేపట్టింది. ఆమెది కూడా చిన్న వయసే అయినా నన్ను తల్లిలా పెంచింది.

మా నాన్నగారు ఏథెన్స్‌లో ఉన్నప్పుడు నన్ను ఎప్పుడూ ఆర్థడాక్స్‌ చర్చికి తీసుకువెళ్ళేవారు, ఆయన మరణించిన తర్వాత కూడా నేను చర్చికి వెళ్తుండేదాన్ని గానీ అంత ఎక్కువగా వెళ్ళేదాన్ని కాదు. చర్చిలో దైవభక్తికి సంబంధించిన రుజువులేవీ నాకు కనిపించకపోవడంతో చివరికి నేను చర్చికి వెళ్ళడం మానేశాను.

మా నాన్నగారు మరణించిన తర్వాత, నాకు ఆర్థిక శాఖలో మంచి ఉద్యోగం దొరికింది. అయితే, మా అన్నయ్య రాజ్యప్రకటనా పనికి తన జీవితాన్ని అంకితం చేసుకుని ఎన్నో సంవత్సరాలుగా గ్రీసులో సేవచేస్తున్నాడు. 1934లో ఆయన సైప్రస్‌కు వెళ్ళాడు. ఆ సమయంలో, ఆ ద్వీపంలో బాప్తిస్మం తీసుకున్న యెహోవాసాక్షులెవరూ లేరు, కాబట్టి అక్కడ ప్రకటనా పనిని ముందుకు తీసుకువెళ్ళే ఆధిక్యత ఆయనకు లభించింది. ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఆయన భార్య గలటీయ కూడా పూర్తికాల పరిచర్య ప్రారంభించి ఎన్నో సంవత్సరాలపాటు సేవ చేసింది. * నీకొస్‌ తరచూ మాకు బైబిలు ఆధారిత పుస్తకాలు, పత్రికలు పంపుతుండేవాడు, కానీ మేము వాటిని ఎన్నడూ తెరిచిచూడలేదు. ఆయన చనిపోయేంతవరకు సైప్రస్‌లోనే ఉన్నాడు.

నేను బైబిలు సత్యాన్ని తెలుసుకోవడం

1940లో నీకొస్‌ స్నేహితుడు, ఏథెన్సు నుండి వచ్చిన ఆసక్తిగల సాక్షి అయిన జార్జ్‌ డూరాస్‌ మమ్మల్ని సందర్శించి, తన ఇంట్లో ఒక చిన్నగుంపుతో జరుగుతున్న బైబిలు అధ్యయనానికి హాజరవమని మమ్మల్ని ఆహ్వానించాడు. మేము సంతోషంగా ఆ ఆహ్వానాన్ని స్వీకరించాం. కొంతకాలానికే మేము నేర్చుకుంటున్నవాటిని ఇతరులతో పంచుకోవడం మొదలుపెట్టాం. బైబిలు జ్ఞానాన్ని సంపాదించుకోవడం నేనూ మా అక్కా మా జీవితాలను యెహోవాకు సమర్పించుకునేలా చేసింది. ఆరెయిడ్న్‌ 1942లో, నేను 1943లో బాప్తిస్మం తీసుకున్నాం.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు, నీకొస్‌ మమ్మల్ని సైప్రస్‌కు రమ్మని పిలిచాడు, దానితో మేము 1945లో నికోషియాకు వెళ్ళాం. గ్రీసులో ఉన్నట్లు సైప్రస్‌లో ప్రకటనాపనికి ఆటంకమేమీ లేదు. మేము ఇంటింటి పరిచర్యలోనే కాదు వీధి సాక్ష్యం ఇవ్వడంలో కూడా పాల్గొన్నాం.

రెండు సంవత్సరాల తర్వాత, ఆరెయిడ్న్‌ గ్రీసుకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అక్కడామె తనకు భర్త కాబోయే వ్యక్తిని కలిసింది, ఆయన కూడా యెహోవా ఆరాధకుడే, దానితో ఆమె ఏథెన్సులోనే ఉండిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి మా అక్కా బావా గ్రీసుకు తిరిగివచ్చి రాజధానిలో పూర్తికాల సేవ ప్రారంభించమని నన్ను ప్రోత్సహించారు. పయినీరు సేవ ఎప్పుడూ నా లక్ష్యంగా ఉంది కాబట్టి, ఏథెన్సులో అవసరం ఎక్కువగా ఉండడంతో నేను అక్కడికి తిరిగివచ్చాను.

కార్యానుకూలమైన మంచి సమయం లభించడం

నేను 1947, నవంబరు 1న పయినీరు సేవ ప్రారంభించి, ప్రతీనెల ప్రకటనాపనిలో 150 గంటలు గడిపేదాన్ని. మా సంఘక్షేత్రం చాలా విశాలంగా ఉండేది, నేను ఎక్కువ నడవవలసి వచ్చేది. అయినా నేను ఎన్నో ఆశీర్వాదాలు పొందాను. పోలీసులు తరచుగా ప్రకటనాపని చేసే, క్రైస్తవ కూటాలకు హాజరయ్యే సాక్షులనెవరినైనా అరెస్టు చేసేవారు, కాబట్టి ఎంతోకాలం గడవకుండానే నేనూ అరెస్టయ్యాను.

నాపై మతమార్పిడి చేస్తున్నాననే నిందవేశారు, అప్పట్లో అది పెద్ద నేరంగా పరిగణించబడేది. ఏథెన్సులోని అవెరోఫ్‌ స్త్రీల చెరసాలలో నాకు రెండు నెలల శిక్ష విధించబడింది. అక్కడ అప్పటికే మరో యెహోవాసాక్షి ఉంది, మేమిద్దరం చెరసాలలో ఉన్నా ఆహ్లాదకరమైన, ప్రోత్సాహకరమైన క్రైస్తవ సహవాసాన్ని ఆనందించేవాళ్ళం. నేను నా శిక్షాకాలం ముగించుకుని మళ్ళీ సంతోషంగా పయినీరుసేవ కొనసాగించాను. అప్పట్లో నేను బైబిలు అధ్యయనం చేసినవారిలో అనేకులు ఇప్పటికీ నమ్మకంగా యెహోవా సేవచేస్తున్నారు, అది నాకెంతో ఆనందాన్నిస్తుంది.

1949లో, అమెరికాలోవున్న వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 16వ తరగతికి హాజరవమని నాకు ఆహ్వానం అందింది, అందులో పూర్తికాల సేవకులకు మిషనరీ సేవలో శిక్షణ ఇవ్వబడుతుంది. నేను, నా బంధువులు చాలా సంతోషించాం. నేను 1950 వేసవికాలంలో న్యూయార్క్‌ నగరంలో ఒక అంతర్జాతీయ సమావేశానికి హాజరై, ఆ తర్వాత గిలియడ్‌కు వెళ్ళడానికి ప్రణాళిక వేసుకున్నాను.

అమెరికాకు చేరుకున్న తర్వాత, న్యూయార్క్‌ నగరంలోవున్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో కొన్నినెలలు హౌస్‌కీపర్‌గా సేవచేసే ఆధిక్యత నాకు లభించింది. అక్కడ పరిసరాలు ఎంతో శుభ్రంగా, ప్రశాంతంగా, ప్రోత్సాహకరంగా ఉన్నాయి, అక్కడున్న సహోదర సహోదరీలు ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. అక్కడ నేను గడిపిన ఆరునెలలను నేను ఎప్పుడూ ఎంతో ఇష్టంగా గుర్తుచేసుకుంటుంటాను. ఆ తర్వాత గిలియడ్‌ పాఠశాలకు హాజరయ్యే సమయం వచ్చింది, అక్కడ గడిపిన ఐదునెలలు తీవ్రమైన అధ్యయనంతో, బోధలతో ఇట్టే గడిచిపోయాయి. లేఖనజ్ఞానం ఎంత సుసంపన్నమైనదో, సుందరమైనదో విద్యార్థులమైన మేము గ్రహించాం, అది మా ఆనందాన్నీ, జీవాన్నిచ్చే సత్యజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలనే మా కోరికనూ అధికంచేసింది.

నా మొదటి మిషనరీ నియామకం

గిలియడ్‌ పాఠశాలలో, మాకు మిషనరీ నియామకం ఇవ్వబడక ముందు మేము భవిష్యత్తులో ఎవరితోకలిసి సేవచేయాలనేది ఎంపిక చేసుకునే అవకాశం మాకు ఇవ్వబడుతుంది. రూత్‌ హెమిగ్‌ (ఇప్పుడు బాస్‌హార్డ్‌) అనే చక్కని సహోదరి నా భాగస్వామి. రూత్‌కు, నాకు, ఆసియాకూ ఐరోపాకూ మధ్యనున్న టర్కీలోని ఇస్తాన్‌బుల్‌లో నియామకం లభించడంతో మేము ఎంతో ఆనందించాం. ఆ దేశంలో ప్రకటనాపనికి చట్టపరమైన గుర్తింపు ఇంకా లభించలేదని మాకు తెలుసు, అయినా యెహోవా మాకు సహాయం చేస్తాడన్న నమ్మకం మాకుంది.

ఇస్తాన్‌బుల్‌ అందమైన కాస్మోపాలిటన్‌ నగరం. అక్కడ మేము రద్దీగావుండే బజార్లు, ప్రపంచంలోని అన్నిప్రాంతాలకు సంబంధించిన శ్రేష్ఠమైన వివిధరకాల వంటకాలు, ఆసక్తికరమైన వస్తుప్రదర్శన శాలలు, ఆకర్షణీయమైన ఇరుగుపొరుగు, ఆసక్తికరమైన నీటి అంచునవున్న భవనాలు చూశాం. అంతకంటే ముఖ్యంగా, దేవుని గురించి తెలుసుకోవాలని కోరుకునే యథార్థవంతులైన ప్రజలను కనుగొన్నాం. ఇస్తాన్‌బుల్‌లోవున్న సాక్షుల చిన్నగుంపులో అర్మేనియన్లు, గ్రేకులు, యూదులు ఉన్నారు. ఇంకా అనేక ఇతర దేశస్థులు కూడా ఉండేవారు, టర్కిష్‌తో సహా అనేక ఇతర భాషలు కాస్తయినా తెలిసివుండడం అక్కడ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సత్యం కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్న వివిధ దేశస్థులను కలిసి మేము ఎంతో ఆనందించాం. వీరిలో అనేకులు ఇప్పటికీ నమ్మకంగా యెహోవా సేవ చేస్తున్నారు.

విచారకరంగా, రూత్‌ ఆ దేశంలో ఇంకా ఎక్కువకాలం కొనసాగడానికి ఆమెకు అనుమతి లభించకపోవడంతో ఆమె దేశాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఆమె స్విట్జర్లాండ్‌లో పూర్తికాల సేవ కొనసాగిస్తోంది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా నేను ఇప్పటికీ ఆమె ఆహ్లాదకరమైన, ప్రోత్సాహకరమైన సహవాసాన్ని ఇష్టంగా గుర్తుతెచ్చుకుంటాను.

మరో ప్రాంతానికి తరలి వెళ్ళడం

1963లో టర్కీలో కొనసాగడానికి నాకు అనుమతి లభించలేదు. ఎన్నో కష్టాలను అధిగమిస్తూ ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించడానికి తీవ్రంగా కృషిచేస్తున్న తోటి క్రైస్తవులను వదిలివెళ్ళడం చాలా కష్టమైంది. మా బంధువులు ఎంతో ప్రేమతో, నన్ను ప్రోత్సహించడానికి, నేను సమావేశానికి హాజరవగలిగేలా న్యూయార్క్‌కు వెళ్ళిరావడానికి చార్జీలు ఇచ్చారు. అప్పటికి నేనింకా నా తర్వాతి నియామకాన్ని అందుకోలేదు.

సమావేశం తర్వాత, నాకు పెరూలోని లిమా నగరానికి నియామకం లభించింది. నా భాగస్వామిగా ఉండబోయే ఒక యువ సహోదరితోపాటు నేను న్యూయార్క్‌ నుండి నేరుగా నా క్రొత్త నియామకానికి చేరుకున్నాను. నేను స్పానిష్‌ నేర్చుకుని, యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం పై అంతస్తులోవున్న మిషనరీ హోమ్‌లో నివసించాను. అక్కడ ప్రకటించడం, స్థానిక సహోదర సహోదరీలను తెలుసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది.

మరో నియామకం, మరో భాష

కొంతకాలానికి గ్రీసులోవున్న మా బంధువులు వార్ధక్యం కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. వాళ్ళకు సహాయం చేయడానికి పూర్తికాల సేవను మానుకుని వచ్చి మామూలు జీవితం గడపమని వాళ్ళు నన్ను ఎన్నడూ కోరలేదు. అయితే, నేను బాగా ఆలోచించి ప్రార్థన చేసుకున్న తర్వాత, నా కుటుంబానికి దగ్గర్లోవుండి సేవచేయడం మంచిదని నేను గ్రహించాను. బాధ్యతగల సహోదరులు నా కోరికను ప్రేమపూర్వకంగా అంగీకరించి నాకు ఇటలీకి నియామకం ఇచ్చారు, అక్కడికి నేను చేరుకోవడానికయ్యే ఖర్చులను నా బంధువులు భరించారు. నిజానికి, ఇటలీలో సువార్తికుల అవసరం చాలా ఎక్కువగావుంది.

మరోసారి, నేను కొత్త భాష, ఇటలీ భాష నేర్చుకోవలసి వచ్చింది. నా మొదటి నియామకం ఫోగ్గ్య నగరం. ఆ తర్వాత, అవసరం ఎక్కువగావున్న నేపిల్స్‌కు నాకు బదిలీ అయ్యింది. నా క్షేత్రం పోజీలీపో, అది నేపిల్స్‌లోని అందమైన స్థలాల్లో ఒకటి. అది చాలా పెద్ద ప్రాంతం, అక్కడ రాజ్యాన్ని ప్రకటిస్తున్న వ్యక్తి ఒక్కరే ఉన్నారు. నేను అక్కడ పనిచేయడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది, అనేక బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి యెహోవా నాకు సహాయం చేశాడు. కొంతకాలానికి, ఆ ప్రాంతంలో ఒక పెద్ద సంఘం ఏర్పడింది.

నేను ప్రారంభంలో బైబిలు అధ్యయనం చేసిన స్థానికప్రజల్లో ఒక తల్లి, ఆమె నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆమె, ఆమె ఇద్దరు కుమార్తెలు ఇప్పటికీ యెహోవాసాక్షులుగా ఉన్నారు. ఒక చిన్నపాప ఉన్న దంపతులతో కూడా నేను అధ్యయనం చేశాను. ఆ కుటుంబమంతా సత్యంలో పురోభివృద్ధి సాధించి, నీటి బాప్తిస్మం ద్వారా తమ సమర్పణను సూచించారు. ఇప్పుడు ఆ అమ్మాయికి నమ్మకస్థుడైన ఒక యెహోవా సేవకునితో పెళ్ళయ్యింది, వాళ్ళిద్దరూ ఆసక్తితో దేవునిసేవ చేస్తున్నారు. ఒక పెద్ద కుటుంబంతో బైబిలు అధ్యయనం చేసేటప్పుడు, దేవుని వాక్య శక్తి నన్నెంతో ముగ్ధురాలిని చేసింది. విగ్రహాల ద్వారా చేసే ఆరాధనను దేవుడు ఆమోదించడని చూపించే వివిధ లేఖనాలను మేము చదివినప్పుడు, తల్లి అధ్యయనం ముగిసే వరకు కూడా ఆగలేదు. అప్పటికప్పుడు ఆమె లేచివెళ్ళి తన ఇంట్లోవున్న విగ్రహాలన్నీ తీసేసింది.

సముద్రంలో ఆపదలలో

నేను తరచూ ఇటలీ నుండి గ్రీసుకు ఓడలోనే ప్రయాణించేదాన్ని. ప్రయాణం సాధారణంగా చాలా ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఒకసారి, 1971 వేసవిలో, అలా లేదు. నేను ఎలియానా అనే ఓడలో ఇటలీకి తిరిగి వస్తున్నాను. ఆగస్టు 28, ఉదయాన్నే ఓడలోని వంటగదికి నిప్పంటుకుంది. మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయపడిపోయారు. స్త్రీలు స్పృహతప్పి పడిపోతున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, పురుషులు అసమ్మతి తెలియజేస్తూ గట్టిగా అరుస్తున్నారు. ప్రజలు ఓడకు ఇరువైపులవున్న లైఫ్‌బోట్ల కోసం ఇటూ అటూ పరుగులు తీస్తున్నారు. కానీ లైఫ్‌ జాకెట్స్‌ చాలా తక్కువగావున్నాయి, లైఫ్‌బోట్లను క్రిందికి దించే పరికరం సరిగా పనిచేయడం లేదు. నాకు లైఫ్‌ జాకెట్‌ లేదు, మంటలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి, ఇక చేయగలిగిందల్లా సముద్రంలోకి దూకేయడమే.

నేను నీళ్ళలోకి దూకగానే నాకు దగ్గరలో ఒక స్త్రీ లైఫ్‌ జాకెట్‌ వేసుకుని నీళ్ళమీద తేలుతుండడం నాకు కనిపించింది. ఆమెకు ఈత రానట్టుంది, దానితో నేను ఆమె చెయ్యి పట్టుకుని లాగి, మునిగిపోతున్న ఓడకు దూరంగా ఆమెను లాక్కువెళ్లాను. సముద్రం అల్లకల్లోలంగా తయారవుతోంది, మునిగిపోకుండా ఉండడానికి పోరాడుతూ నేను బాగా అలసిపోయాను. ఇక ఆశ వదులుకునే పరిస్థితి ఏర్పడింది, కానీ నేను ధైర్యం కోసం, బలం కోసం యెహోవాను వేడుకుంటూ ఉన్నాను. ఆ సమయంలో అపొస్తలుడైన పౌలున్న ఓడ బ్రద్ధలై పోవడాన్ని గుర్తుతెచ్చుకోకుండా ఉండలేకపోయాను.​—⁠అపొస్తలుల కార్యములు 27.

నా ప్రక్కనున్న ఆ స్త్రీని అలాగే పట్టుకుని, బలం ఉన్నప్పుడు ఈదుతూ, సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తూ నేను నాలుగు గంటలపాటు పోరాడాను. చివరికి నాకు ఒక చిన్న పడవ కనిపించింది. వాళ్ళు వచ్చి నన్ను రక్షించారు గానీ ఆ స్త్రీ అప్పటికే మరణించింది. మేము ఇటలీలోని బరి పట్టణాన్ని చేరుకున్నప్పుడు, నన్ను ఆసుపత్రిలో చేర్చడంతో నాకు అక్కడ ప్రథమచికిత్స చేశారు. నేను కొద్దిరోజులు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది, చాలామంది సాక్షులు వచ్చి నన్ను చూశారు, నాకు కావలసినవన్నీ ఎంతో ప్రేమగా సమకూర్చారు. వాళ్ళు చూపించిన క్రైస్తవ ప్రేమ ఆ వార్డులోని ఇతరులను చాలా ప్రభావితం చేసింది. *

నేను పూర్తిగా కోలుకున్న తర్వాత, నాకు రోమ్‌కు నియామకం లభించింది. నగర నడిబొడ్డునున్న వ్యాపారక్షేత్రంలో నన్ను సేవ చేయమన్నారు, యెహోవా సహాయంతో నేను ఐదు సంవత్సరాలపాటు అలా చేశాను. మొత్తం 20 సంవత్సరాలు నేను ఇటలీలో పరిచర్య చేశాను, ఇటలీ ప్రజలను నేను ఎంతో ప్రేమించడం ప్రారంభించాను.

నేను ప్రారంభించిన చోటుకే తిరిగి చేరుకోవడం

కొంతకాలానికి, ఆరెయిడ్న్‌ ఆరోగ్యం ఆమె భర్త ఆరోగ్యం మరింత క్షీణించింది. నేను వాళ్ళకు దగ్గరలో నివసిస్తే, వాళ్ళు ప్రేమతో నాకోసం చేసినదానంతటికీ కొంతైనా తిరిగి చెల్లించగలుగుతానని నేను భావించాను. నిజం చెప్పాలంటే, ఇటలీ వదిలివెళ్ళడం చాలా బాధగానే అనిపించింది. అయితే, బాధ్యతగల సహోదరులు అనుమతించడంతో 1985 వేసవి నుండి నేను ఏథెన్సులో పయినీరు సేవ చేశాను, 1947లో నేను అక్కడే పూర్తికాల సేవ ప్రారంభించాను.

నా సొంత సంఘానికి కేటాయించబడిన క్షేత్రంలో నేను ప్రకటించేదాన్ని, నగరం మధ్యలోవున్న వ్యాపారక్షేత్రంలో కూడా ప్రకటించడానికి బ్రాంచి కార్యాలయంలోని సహోదరులను అనుమతి కోరాను. ఒక పయినీరు భాగస్వామితో కలిసి నేను మూడు సంవత్సరాలపాటు అలా సేవచేశాను. మేము ఇళ్ళ దగ్గర అరుదుగా కనిపించే ప్రజలకు సంపూర్ణంగా సాక్ష్యమివ్వగలిగాం.

అయితే, సమయం గడుస్తుండగా, సేవ చేయాలన్న నా కోరిక అంతకంతకూ అధికమవుతుండగా, నా శారీరక బలం అంతకంతకూ క్షీణించింది. మా బావగారు మరణించారు. నాకు తల్లిలా ఉన్న ఆరెయిడ్న్‌ చూపు కోల్పోయింది. నేను పూర్తికాల సేవలో గడిపిన సంవత్సరాల్లో నా ఆరోగ్యం బాగానే ఉండేది. కానీ ఈ మధ్య నేను చలువరాతి మెట్ల మీది నుండి పడిపోవడంతో నా కుడి చెయ్యి విరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పడిపోవడంతో నాకు నడుము విరిగింది. నేను శస్త్రచికిత్స చేయించుకుని చాలాకాలంపాటు మంచంలోనే ఉండిపోయాను. ఇప్పుడిక నేను నా సొంతగా తిరగలేను. చేతికర్ర సాయంతో నడుస్తాను, ఎవరైనా తోడుంటేనే బయటకు వెళ్ళగలను. అయినా, నా శారీరకస్థితి మెరుగవుతుందనే ఆశతో నేను చేయగలిగినదంతా చేస్తున్నాను. పరిమితమైన విధంగానే అయినా బైబిలు విద్యాపనిలో భాగం వహించడం నా సంతోషానికి, సంతృప్తికి మూలాధారంగా ఉంది.

నేను పూర్తికాల పరిచర్యలో గడిపిన సంతోషకరమైన సంవత్సరాలను గుర్తుతెచ్చుకుంటే, నా హృదయం యెహోవాపట్ల కృతజ్ఞతతో నిండిపోతుంది. ఆయన, తానూ తన సంస్థలోని భూసంబంధ భాగమూ, ఎల్లప్పుడూ మంచి నిర్దేశాన్ని, అమూల్యమైన సహాయాన్ని అందజేసి, నా జీవితాన్ని ఆయన సేవలో గడపడంలో నా సామర్థ్యాలను వీలైనంతగా ఉపయోగించడానికి తోడ్పడ్డాడు. ఆయన సేవలో కొనసాగడానికి ఆయన నన్ను బలపరచాలన్నది నా హృదయపూర్వక కోరిక. ఆయన నిర్దేశిస్తున్న భూవ్యాప్త బైబిలు విద్యాపనిలో నేను వహించగలిగిన అల్పమైన పాత్రకు నేను సంతోషిస్తున్నాను.​—⁠మలాకీ 3:​10.

[అధస్సూచీలు]

^ పేరా 10 యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవాసాక్షుల వార్షికపుస్తకము 1995 (ఆంగ్లం)లోని 73-89 పేజీలు చూడండి.

^ పేరా 34 మరిన్ని వివరాల కోసం తేజరిల్లు! (ఆంగ్లం) ఫిబ్రవరి 8, 1972, 12-16 పేజీలు చూడండి.

[9వ పేజీలోని చిత్రం]

మా అక్క ఆరెయిడ్న్‌, ఆమె భర్త మికాలిస్‌, నేను గిలియడ్‌కు వెళ్తున్నప్పుడు

[10వ పేజీలోని చిత్రం]

రూత్‌ హెమిగ్‌కు, నాకు టర్కీలోని ఇస్తాన్‌బుల్‌లో నియామకం లభించింది

[11వ పేజీలోని చిత్రం]

ఇటలీలో, 1970ల తొలిభాగంలో

[12వ పేజీలోని చిత్రం]

మా అక్క ఆరెయిడ్న్‌తో నేడు