కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనశ్శాంతి కోసం అన్వేషణ

మనశ్శాంతి కోసం అన్వేషణ

మనశ్శాంతి కోసం అన్వేషణ

ఆల్బర్ట్‌ సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నాడు, ఆయనకు చూడముచ్చటగా ఉండే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ ఆయన తన జీవితంలో ఏదో లోపించినట్లు భావించేవాడు. పని వెదకడం కోసం తంటాలు పడాల్సిన సమయంలో ఆయన రాజకీయాల్లో చేరి సామ్యవాద సిద్ధాంతాన్ని స్వీకరించాడు. ఆయన స్థానిక కమ్యూనిస్టు పార్టీలో చేరి ఒక క్రియాశీల సభ్యునిగా కూడా మారాడు.

అయితే కొద్దికాలానికే ఆల్బర్ట్‌ కమ్యూనిజం విషయంలో నిరాశ చెందాడు. ఆయన రాజకీయాలతో తనకున్న సంబంధాన్ని తెగతెంపులు చేసుకొని పూర్తిగా తన కుటుంబానికే అంకితమయ్యాడు. వారు సంతోషంగా జీవించేలా చూడడమే ఆయన జీవితాశయం అయింది. అయినప్పటికీ, ఆల్బర్ట్‌ తన జీవితం ఇంకా వెలితిగానే ఉన్నట్లు భావించాడు, ఆయనకింకా నిజమైన మనశ్శాంతి కరువైనట్లుగానే అనిపించింది.

ఆల్బర్ట్‌ అనుభవం అసాధారణమైనదేమీ కాదు. జీవితంలో అర్థవంతమైన సంకల్పాన్ని కనుగొనడానికి కోట్లాదిమంది వివిధ సిద్ధాంతాలతో, తత్త్వాలతో, మతాలతో ప్రయోగాలు చేశారు. పాశ్చాత్త్య దేశాల్లో, 1960లలో ప్రబలమైన హిప్పీ ఉద్యమం, నిజానికి సాంప్రదాయ నైతిక, సామాజిక విలువలకు వ్యతిరేకంగా జరిగిన ఒక తిరుగుబాటు. ప్రత్యేకంగా యౌవనుల మనస్సుపై ప్రభావంచూపే మాదకద్రవ్యాల ద్వారా, ఉద్యమానికి సంబంధించిన నామకార్థ గురువులు, ఆధ్యాత్మిక నాయకులు బోధించిన తత్త్వాల ద్వారా సంతోషం కోసం, జీవితార్థం కోసం అన్వేషించారు. అయితే నిజమైన సంతోషాన్ని ఇవ్వడంలో హిప్పీ ఉద్యమం విఫలమయ్యింది. దానికి బదులు అది మాదకద్రవ్యాలకు బానిసలను, నైతికంగా దిగజారిన యౌవనులను తయారుచేసి, సమాజం నైతిక గందరగోళానికి గురయ్యేటట్లు సమాజాన్ని దిగజార్చింది.

ఎన్నో శతాబ్దాలపాటు చాలామంది సంపద, అధికారం, విద్య వంటి వాటిద్వారా సంతోషం అనుభవించడానికి ప్రయత్నించారు. ఈ మార్గాలు చివరకు నిరాశకే దారితీశాయి. “ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు” అని యేసు అన్నాడు. (లూకా 12:​15) అవును, సంపదల కోసం తీవ్రంగా ప్రయత్నించడం సాధారణంగా దుఃఖాన్ని కలిగిస్తుంది. బైబిలు ఇలా చెబుతోంది: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు . . . నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.”​—⁠1 తిమోతి 6:​9, 10.

అయితే ఒక వ్యక్తి మనశ్శాంతిని, జీవితానికి ఒక సంకల్పాన్ని ఎలా పొందవచ్చు? చీకటిలో కంటికి కనిపించని లక్ష్యంవైపు బాణాన్ని ఎక్కుపెట్టినట్లు అది గురిలేని ప్రయోగాల ద్వారా తెలుసుకొనే విషయమా? అది అలాంటిది కాదు. మనం తర్వాతి ఆర్టికల్‌లో చూడబోతున్నట్లుగా అతిప్రాముఖ్యమైన, మానవులకున్న ఒక ప్రత్యేకమైన అవసరాన్ని తీర్చడంలోనే పరిష్కారం ఉంది.

[3వ పేజీలోని చిత్రం]

ధనాన్ని, అధికారాన్ని లేదా విద్యను వెంబడించడం మీకు మనశ్శాంతినిస్తుందా?