కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదటి రాజుల గ్రంథములోని ముఖ్యాంశాలు

మొదటి రాజుల గ్రంథములోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

మొదటి రాజుల గ్రంథములోని ముఖ్యాంశాలు

“నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు; దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.” (సామెతలు 29:⁠2) బైబిలులోని మొదటి రాజుల గ్రంథము ఈ సామెత సత్యత్వాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అది సొలొమోను జీవిత చరిత్రను తెలియజేస్తోంది, ఆయన పరిపాలనలో ప్రాచీన ఇశ్రాయేలు సుభిక్షమైన, సురక్షితమైన కాలాన్ని ఆస్వాదించింది. మొదటి రాజుల గ్రంథంలో, సొలొమోను మరణం తర్వాత రాజ్యం రెండు భాగాలుగా చీలిపోవడాన్ని గురించిన వృత్తాంతం, ఆ తర్వాత వచ్చిన 14 మంది రాజులు కొందరు ఇశ్రాయేలులో, కొందరు యూదాలో పరిపాలించడం గురించిన వృత్తాంతాలు కూడా ఉన్నాయి. ఈ రాజుల్లో ఇద్దరు మాత్రమే తమ జీవితమంతటిలో యెహోవా పట్ల నమ్మకంగా ఉన్నారు. అంతేగాక, ఏలీయాతో సహా ఆరుగురు ప్రవక్తల కార్యకలాపాల గురించి కూడా ఈ గ్రంథం తెలియజేస్తుంది.

యిర్మీయా ప్రవక్త ఈ పుస్తకాన్ని యెరూషలేము, యూదాల్లో వ్రాశాడు, ఇది సా.శ.పూ. 1040 నుండి సా.శ.పూ. 911 వరకు దాదాపు 129 సంవత్సరాల కాలంలో జరిగిన విషయాల గురించి తెలియజేస్తుంది. యిర్మీయా ఈ గ్రంథాన్ని సంపుటీకరించేటప్పుడు “సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథము” వంటి ప్రాచీన గ్రంథాలను సంప్రదించాడని తెలుస్తోంది. ఆ ప్రత్యేక గ్రంథాలు ఇప్పుడు ఉనికిలో లేవు.​—⁠1 రాజులు 11:41; 14:19; 15:⁠7.

జ్ఞానవంతుడైన రాజు శాంతి సమృద్ధులను వృద్ధి చేయడం

(1 రాజులు 1:1-11:43)

మొదటి రాజుల గ్రంథం, దావీదు రాజు కుమారుడైన అదోనీయా తన తండ్రి రాజరికాన్ని చేజిక్కించుకోవడానికి చేసిన ప్రయత్నం గురించిన ఆసక్తికరమైన వృత్తాంతంతో ప్రారంభమవుతుంది. నాతాను ప్రవక్త సత్వరమే తీసుకున్న చర్యతో ఆ ప్రయత్నం విఫలమై, దావీదు కుమారుడైన సొలొమోను రాజవుతాడు. కొత్తగా సింహాసనాసీనుడైన రాజు కోరికకు సంతోషించిన యెహోవా ఆయనకు “బుద్ధి వివేకములు గల హృదయము”తోపాటు “ఐశ్వర్యమును ఘనతను” కూడా ఇస్తాడు. (1 రాజులు 3:​12, 13) రాజు జ్ఞానం అసమానమైనది, ఆయన సంపద సాటిలేనిది. కొంతకాలంపాటు ఇశ్రాయేలు శాంతి సమృద్ధులతో వర్ధిల్లుతుంది.

సొలొమోను ముగించిన నిర్మాణ కార్యకలాపాల్లో యెహోవా ఆలయం, వివిధ ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. యెహోవా సొలొమోనుకు ఇలా హామీ ఇచ్చాడు: “ఇశ్రాయేలీయులమీద నీ సింహాసనమును చిరకాలమువరకు స్థిరపరచుదును.” కానీ, రాజు విధేయత చూపిస్తేనే అది జరుగుతుంది. (1 రాజులు 9:​4, 5) అవిధేయతవల్ల వచ్చే పర్యవసానాల గురించి కూడా సత్యదేవుడు ఆయనను హెచ్చరిస్తాడు. అయితే సొలొమోను చాలామంది అన్యస్త్రీలను పెళ్ళి చేసుకుంటాడు. వాళ్ళ ప్రభావం మూలంగా ఆయన వృద్ధాప్యంలో అబద్ధ ఆరాధనవైపు తిరుగుతాడు. ఆయన రాజ్యం విడిపోతుందని యెహోవా ముందుగానే చెప్పాడు. సా.శ.పూ. 997లో సొలొమోను మరణించడంతో, ఆయన 40 ఏళ్ళ పరిపాలన సమాప్తమవుతుంది. ఆయన తర్వాత ఆయన కుమారుడైన రెహబాము సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:5​—⁠దావీదు బ్రతికి ఉండగానే అదోనీయా సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి ఎందుకు ప్రయత్నించాడు? దానికి బైబిలు సమాధానం చెప్పడం లేదు. అదోనీయా అన్నలు అమ్మోను, అబ్షాలోము అప్పటికే మరణించారు, అంతేగాక దావీదు మరో కుమారుడు కిల్యాబు కూడా మరణించాడు, ఇక మిగిలిన దావీదు కుమారుల్లో అదోనీయాయే పెద్దవాడు కాబట్టి బహుశా అతడు తనకే సింహాసనం అధిష్టించే హక్కు ఉందని భావించి ఉండవచ్చు. (2 సమూయేలు 3:2-4; 13:28, 29; 18:​14-17) అదోనీయా శక్తిమంతమైన సైన్యాధికారి అయిన యోవాబు మద్దతును, పలుకుబడిగల ప్రధాన యాజకుడైన అబ్యాతారు మద్దతును సమకూర్చుకొని, తన ప్రయత్నం సఫలమవుతుందన్న దృఢ నమ్మకంతో ఉండి ఉండవచ్చు. సింహాసనాన్ని సొలొమోను అధిష్ఠించాలన్న దావీదు ఆలోచన గురించి ఆయనకు తెలుసో తెలియదో బైబిలు చెప్పడం లేదు. అయితే, అదోనీయా సొలొమోనును, దావీదుపట్ల నమ్మకంగా ఉన్న ఇతరులను “బలి” అర్పణకు ఆహ్వానించలేదు. (1 రాజులు 1:​9, 10) ఇది, ఆయన సొలొమోనును తన ప్రత్యర్థిగా దృష్టించాడని సూచిస్తోంది.

1:​49-53; 2:​13-25​—⁠సొలొమోను అదోనీయాకు క్షమాభిక్ష పెట్టిన తర్వాత మళ్ళీ అతడిని ఎందుకు చంపించాడు? అబీషగును తనకు భార్యగా ఇమ్మని రాజుకు విన్నవించడానికి అదోనీయా బత్షెబతో చేసిన విజ్ఞప్తి వెనకున్న అసలు ఉద్దేశాన్ని ఆమె గుర్తించలేకపోయినా సొలొమోను గ్రహించాడు. దావీదు అందమైన అబీషగుతో సంబంధం పెట్టుకోకపోయినా ఆమె దావీదు ఉపపత్నిగానే పరిగణించబడింది. ఆ కాలంలోని వాడుక ప్రకారం, ఆమె కేవలం దావీదు వారసుని సంపద క్రిందికే వస్తుంది. అబీషగును భార్యగా స్వీకరించడం ద్వారా, తాను మళ్ళీ సింహాసనం కోసం ప్రయత్నించవచ్చని అదోనీయా అనుకుని ఉండవచ్చు. అదోనీయా విజ్ఞప్తిని రాజ్యాధికారం కోసం అతనిలో ఉన్న దాహంగా పరిగణించిన సొలొమోను క్షమాభిక్షను రద్దుచేశాడు.

6:​37–8:2​—⁠ఆలయ ప్రారంభోత్సవం ఎప్పుడు జరిగింది? ఆలయం సా.శ.పూ. 1027లో ఎనిమిదవ నెలలో సొలొమోను పరిపాలనలోని 11వ సంవత్సరంలో పూర్తయ్యింది. సామాగ్రి అంతా తెచ్చిపెట్టడానికి, ఇతర సిద్ధపాట్లకు బహుశా 11 నెలలు పట్టి ఉండవచ్చు. సా.శ.పూ. 1026వ సంవత్సరం ఏడవ నెలలో ప్రారంభోత్సవం జరిగి ఉండవచ్చు. ఆ వృత్తాంతం, ఆలయం పూర్తైన తర్వాత, దాని ప్రారంభోత్సవం గురించి ప్రస్తావించే ముందు ఇతర నిర్మాణ ప్రణాళికల గురించి తెలియజేస్తోంది, బహుశా నిర్మాణ కార్యక్రమాలను గురించిన వివరాలను పూర్తి చేయడానికి అలా చెప్పి ఉండవచ్చు అనిపిస్తోంది.​—⁠2 దినవృత్తాంతములు 5:​1-3.

9:​10-13​—⁠సొలొమోను గలిలయ దేశంలోని 20 పట్టణాలను తూరు రాజైన హీరాముకు ఇవ్వడం మోషే ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉందా?​—లేవీయకాండము 25:23, 24లోని నియమం ఇశ్రాయేలీయులు ఆక్రమించిన ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుందని పరిగణించబడి ఉండవచ్చు. సొలొమోను హీరాముకు ఇచ్చిన పట్టణాలు వాగ్దాన దేశ సరిహద్దు లోపలే ఉన్నా వాటిలో ఇశ్రాయేలీయులు కానివారు నివసిస్తుండి ఉండవచ్చు. (నిర్గమకాండము 23:​31) సొలొమోను చర్య ఆయన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అనుసరించడంలో విఫలమయ్యాడని కూడా సూచిస్తుండవచ్చు, ఆయన ‘గుఱ్ఱములను విస్తారముగా సంపాదించుకున్నప్పుడు,’ చాలామందిని పెళ్ళి చేసుకున్నప్పుడు అలాగే చేశాడు. (ద్వితీయోపదేశకాండము 17:​16, 17) విషయం ఏదైనప్పటికీ, సొలొమోను ఇచ్చిన బహుమానం హీరాముకు సంతోషం కలిగించలేదు. బహుశా ఆ పట్టణాల్లో నివసించిన అన్యులు వాటిని మంచి స్థితిలో ఉంచలేదేమో, లేక అవి అనుకూలమైన ప్రాంతంలో లేవేమో.

11:4​—⁠వార్ధక్యంలో కలిగే బలహీనత కారణంగానే సొలొమోను తన వృద్ధాప్యంలో అవిశ్వసనీయునిగా మారాడా? కారణం అది కాదనిపిస్తోంది. సొలొమోను పరిపాలన ప్రారంభించినప్పుడు మంచి యౌవనంలోనే ఉన్నాడు, ఆయన 40 సంవత్సరాలపాటు పరిపాలించినప్పటికీ ఆయన మరీ అంత వృద్ధుడు కాలేదు. అంతేగాక, ఆయన యెహోవాను అనుసరించడం పూర్తిగా మానుకోలేదు. ఆయన అటు సత్యారాధన ఇటు అన్యదేవతల ఆరాధన రెండూ కొనసాగించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

మనకు పాఠాలు:

2:​26, 27, 35. యెహోవా ప్రవచించినది ఎప్పుడూ నిజమవుతుంది. ఏలీ వంశీకుడైన అబ్యాతారును తొలగించడం, “యెహోవా ఏలీ కుటుంబికులను గూర్చి . . . ప్రమాణముచేసిన మాట” నెరవేరేలా చేసింది. అబ్యాతారు స్థానంలో ఫీనెహాసు వంశీకుడైన సాదోకును నియమించడం, సంఖ్యాకాండము 25:10-13కు నెరవేర్పుగా జరిగింది.​—⁠నిర్గమకాండము 6:25; 1 సమూయేలు 2:31; 3:12; 1 దినవృత్తాంతములు 24:⁠3.

2:​37, 41-46. హద్దులు మీరి కూడా శిక్ష తప్పించుకోవచ్చనుకోవడం ఎంత ప్రమాదకరమో కదా! ‘జీవమునకు పోవు ఇరుకు దారిలో’ వెళ్ళకుండా దాని నుండి ఉద్దేశపూర్వకంగా ప్రక్కకు మళ్ళేవారు ఆ అవివేకయుక్తమైన నిర్ణయంవల్ల వచ్చే పర్యవసానాలను అనుభవిస్తారు.​—⁠మత్తయి 7:​13-14.

3:​9, 12-14. యెహోవా తన సేవలో కొనసాగడానికి కావలసిన జ్ఞానము, అవగాహన, నడిపింపు ఇవ్వమని తన సేవకులు యథార్థంగా చేసే ప్రార్థనలకు జవాబిస్తాడు.​—⁠యాకోబు 1:⁠5.

8:​22-53. కృపగల దేవుడు, వాగ్దానాలు నెరవేర్చేవాడు, ప్రార్థన ఆలకించేవాడు అయిన యెహోవాపట్ల సొలొమోను ఎంత హృదయపూర్వక కృతజ్ఞతను వ్యక్తం చేశాడో కదా! ప్రారంభోత్సవ ప్రార్థనలో సొలొమోను ఉపయోగించిన పదాలను ధ్యానించడం, దేవుని వ్యక్తిత్వంలోని ఈ అంశాలపట్ల ఇతర అంశాలపట్ల మన కృతజ్ఞతను అధికం చేస్తుంది.

11:​9-14, 23, 26. సొలొమోను తన తర్వాతి సంవత్సరాల్లో అవిధేయుడైనప్పుడు యెహోవా విరోధులను రేపాడు. “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును” అని అపొస్తలుడైన పేతురు చెబుతున్నాడు.​—⁠1 పేతురు 5:⁠5.

11:​30-40. యరొబాము గురించి అహీయా ప్రవచించినదాని కారణంగా సొలొమోను రాజు యరొబామును చంపడానికి ప్రయత్నించాడు. దాదాపు 40 సంవత్సరాల క్రితం, అంటే అదోనీయాపై ఇతర రాజద్రోహులపై ప్రతీకారం తీర్చుకోవడానికి నిరాకరించినప్పుడు, ఆయన ప్రతిస్పందన ఎంత భిన్నంగా ఉందో కదా! (1 రాజులు 1:​50-53) ఆయన యెహోవాకు దూరమైనందుకే ఆయన దృక్పథంలో ఈ మార్పు వచ్చింది.

ఐక్య రాజ్యం రెండు భాగాలుగా చీలిపోయింది

(1 రాజులు 12:1-22:53)

యరొబాము, ప్రజలు రాజైన రెహబాము వద్దకు వచ్చి అతని తండ్రియైన సొలొమోను పెట్టిన భారాన్ని తగ్గించమని అడుగుతారు. వారు కోరినట్టుగా చేసే బదులు రెహబాము వారిమీద మరింత భారాన్ని పెడతానని బెదిరిస్తాడు. పది గోత్రాలు తిరుగుబాటు చేసి యరొబామును తమ రాజుగా చేసుకుంటాయి. రాజ్యం రెండు భాగాలుగా చీలిపోతుంది. యూదా, బెన్యామీను గోత్రాలతో కూడిన దక్షిణ రాజ్యాన్ని రెహబాము, ఇశ్రాయేలు పది గోత్రాల ఉత్తర రాజ్యాన్ని యరొబాము పరిపాలిస్తారు.

ఆరాధన కోసం ప్రజలు యెరూషలేముకు వెళ్ళకుండా వారిని ఆపడానికి యరొబాము రెండు బంగారు దూడలను చేయించి, ఒకటి దానులో, వేరొకటి బేతేలులో స్థాపిస్తాడు. ఇశ్రాయేలులో యరొబాము తర్వాత నాదాబు, బయెషా, ఏలా, జిమ్రీ, తిబ్నీ, ఒమ్రీ, అహాబు, అహజ్యా పరిపాలన చేస్తారు. యూదాలో రెహబాము తర్వాత అబీయాము, యెహోషాపాతు, యెహోరాము పరిపాలిస్తారు. ఈ రాజుల కాలంలో అహీయా, షెమయా, అనామక దైవజనుడు, యెహూ, ఏలీయా, మీకాయా ప్రవక్తలుగా ఉంటారు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

18:21​—⁠యెహోవాను గానీ బయలును గానీ అనుసరించమని ఏలీయా ప్రజలకు చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? యెహోవా కోరుతున్న అనితర భక్తిని ఆయనకు చెల్లించలేకపోతున్నామని గుర్తించి వారిలో అపరాధ భావాలు కలిగివుండవచ్చు. లేదా బహుశా యెహోవా ఆరాధకులమని చెప్పుకుంటూ బయలును ఆరాధించడంలో తప్పేమీ లేదని భావించేంతగా వారి మనస్సాక్షి కఠినమై ఉండవచ్చు. యెహోవా తన శక్తిని ప్రదర్శించిన తర్వాతనే వారు “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అన్నారు.​—⁠1 రాజులు 18:​39.

20:⁠34​—⁠యెహోవా అహాబుకు సిరియనులపై విజయం అనుగ్రహించిన తర్వాత, అహాబు వారి రాజైన బెన్హదదును ఎందుకు విడిచిపెట్టాడు? అహాబు బెన్హదదును చంపకుండా ఆయనతో ఒక నిబంధన చేశాడు, దాని ప్రకారం సిరియా రాజధానియైన దమస్కులోని వీధులు అహాబుకు చెందుతాయి, ఆ వీధులు బహుశా బజార్లకోసం లేదా దుకాణాల కోసం అయ్యుండవచ్చు. గతంలో, బెన్హదదు తండ్రి షోమ్రోనులోని వీధులను వాణిజ్య ప్రయోజనాల కోసం తనకు కేటాయించుకున్నాడు. కాబట్టి, అహాబు దమస్కులో వాణిజ్య కేంద్రాలను స్థాపించుకునేలా బెన్హదదు విడుదల చేయబడ్డాడు.

మనకు పాఠాలు:

12:​13, 14. జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం, లేఖన జ్ఞానంగల, దైవిక సూత్రాలపట్ల ఎంతో గౌరవం ఉన్న జ్ఞానవంతులైన, పరిణతి చెందిన వ్యక్తుల నుండి సలహా తీసుకోవాలి.

13:​11-24. అనుమానాస్పదంగా అనిపించే సలహా లేక సూచన మంచి ఉద్దేశంగల తోటి విశ్వాసి ఇచ్చినా, దేవుని వాక్యంలోని చక్కని నడిపింపు వెలుగులో దాన్ని పరిశీలించాలి.​—⁠1 యోహాను 4:⁠1.

14:​13. యెహోవా మనలోవున్న మంచిని చూడడానికి మనల్ని పరిశోధిస్తాడు. ఆ మంచి ఎంత అల్పమైనదైనా, ఆయన సేవ చేయడానికి మనం చేయగలిగినది చేస్తున్నప్పుడు, ఆయన దాన్ని అధికం చేయగలడు.

15:​10-13. మనం మతభ్రష్టత్వాన్ని ధైర్యంగా నిరాకరించి, సత్యారాధనకు మద్దతు ఇవ్వాలి.

17:​10-16. సారెపతులోని విధవరాలు ఏలీయా ఒక ప్రవక్త అని గుర్తించి ప్రవక్తకు ఇవ్వవలసిన ఆతిథ్యం ఆయనకు ఇచ్చింది, ఆమె విశ్వాస క్రియలను యెహోవా ఆశీర్వదించాడు. నేడు, యెహోవా మన విశ్వాస క్రియలను కూడా గుర్తించి, రాజ్య పనికి వివిధ రకాలుగా మద్దతు ఇచ్చేవారికి ప్రతిఫలం ఇస్తాడు.​—⁠మత్తయి 6:33; 10:41, 42; హెబ్రీయులు 6:​10.

19:​1-8. తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పుడు, మనం యెహోవా మద్దతు లభిస్తుందని నమ్మకంతో ఉండవచ్చు.​—⁠2 కొరింథీయులు 4:​7-9.

19:​10, 14, 18. సత్యారాధకులు ఎన్నడూ ఒంటరివారు కాదు. వారికి తోడుగా యెహోవా ఉన్నాడు, ప్రపంచవ్యాప్త సహోదరత్వం ఉంది.

19:​11-13. యెహోవా ప్రకృతి దేవుడు కాదు, లేక సహజ శక్తుల ప్రతిరూపము కాదు.

20:​11. బెన్హదదు షోమ్రోనును నాశనం చేయడం గురించి ప్రగల్భాలు పలికినప్పుడు, ఇశ్రాయేలు రాజు ఇలా జవాబిచ్చాడు: “[యుద్ధానికి సిద్ధపాటుగా] తన ఆయుధమును నడుమున బిగించుకొనువాడు,” యుద్ధంలో విజయం సాధించి తిరిగి వచ్చిన తర్వాత “దానివిప్పి తీసి వేసినవానివలె అతిశయపడకూడదు.” ఏదైనా క్రొత్త పని దొరికినప్పుడు, మనం ప్రగల్భాలు పలికే వ్యక్తిలో ఉండేలాంటి అతినమ్మకానికి దూరంగా ఉండాలి.​—⁠సామెతలు 27:1; యాకోబు 4:​13-16.

మనకు నిజమైన భావం

మోషే సీనాయి పర్వతం వద్ద ధర్మశాస్త్రం ఇవ్వబడడాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “చూడుడి; నేడు నేను మీ యెదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకాజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినినయెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకాజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని యితర దేవతలను అనుసరించిన యెడల శాపమును మీకు కలుగును.”​—⁠ద్వితీయోపదేశకాండము 11:​26-28.

మొదటి రాజుల గ్రంథంలో ఈ ఆవశ్యకమైన సత్యం ఎంత స్పష్టంగా మన దృష్టికి తీసుకురాబడిందో కదా! మనం చూసినట్లుగా, ఈ పుస్తకం ఇతర విలువైన పాఠాలను కూడా బోధిస్తోంది. దానిలోని సందేశం నిజంగా సజీవమైనది, బలము గలది.​—⁠హెబ్రీయులు 4:​12.

[29వ పేజీలోని చిత్రం]

సొలొమోను నిర్మించిన ఆలయం, ఇతర భవనాలు

[30, 31వ పేజీలోని చిత్రం]

యెహోవా తన శక్తిని ప్రదర్శించిన తర్వాత ప్రజలు, “యెహోవాయే దేవుడు!” అని కేకలువేశారు