“సమరం ముగిసింది”
“సమరం ముగిసింది”
యెహోవాసాక్షులు 2002వ సంవత్సరంలో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వాయవ్య ప్రాంతంలోని ఎమ్‌బండాకా నగరంలో జిల్లా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో, క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతనలోక అనువాదం లింగాలా భాషలో విడుదల చేయబడినప్పుడు, ప్రేక్షకులు ఆనందంతో ఎగిరి గంతేశారు, కొందరు ఆనందబాష్పాలు రాల్చారు. ఆ తర్వాత, ప్రజలు “బాసుకీ, బాసాంబ్వే” అని బిగ్గరగా కేకలువేస్తూ కొత్త బైబిలును దగ్గరి నుండి చూడడానికి వేదిక దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చారు, ఆ పదాలకు “సమరం ముగిసింది! వాళ్ళు ఓడిపోయారు!” అని అర్థం.
ప్రేక్షకులు అంతగా ఉత్తేజితులవడానికి కారణమేమిటి, వారు ఏ ఉద్దేశంతో ఆ మాటలు పలికారు? ఎమ్‌బండాకాలోని కొన్ని ప్రాంతాల్లో యెహోవాసాక్షులకు లింగాలాలో బైబిళ్లు పొందడం కష్టమయ్యేది. కారణం? కారణం ఏమిటంటే చర్చీలు వాటిని యెహోవాసాక్షులకు అమ్మడానికి నిరాకరించాయి. బైబిలు ప్రతులు కావాలంటే సాక్షులు మూడో వ్యక్తిద్వారా సంపాదించుకోవలసి వచ్చేది. తామిప్పుడు బైబిలు పొందకుండా ఇక చర్చీలు ఆపలేవని తెలిసికొని వారు ఎంతో ఆనందించారు.
ఈ కొత్త అనువాదం యెహోవాసాక్షులకు మాత్రమే కాక సాధారణ ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. సమావేశం జరుగుతున్న స్థలంలో బిగించిన లౌడ్‌స్పీకర్ల ద్వారా సమీపంలోనే ఉన్న ఒక ఇంట్లో నుండి ఆ కార్యక్రమాన్ని విన్న ఒక వ్యక్తి యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి ఇలా వ్రాశాడు: “ఈ బైబిలు విడుదలకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. అది మాకు అనేక విషయాల గురించి తెలియజేస్తుంది. నేను యెహోవాసాక్షిని కాదు, కానీ మీరు ఇటీవల ప్రచురించిన బైబిలును పొందడం కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నాను.”
పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదం ఇప్పుడు పూర్తి సంచిక 33 భాషల్లో అందుబాటులో ఉంది, క్రైస్తవ గ్రీకు లేఖనాలు లింగాలాతో సహా మరో 19 భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఉత్తమమైన అనువాదపు ప్రతిని ఎలా పొందాలో తెలుసుకోవడానికి మీరు యెహోవాసాక్షులను ఎందుకు అడగకూడదు?