కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అవివాహితులుగా ఉన్నా యెహోవా సేవలో సంతృప్తిగా ఉన్నారు

అవివాహితులుగా ఉన్నా యెహోవా సేవలో సంతృప్తిగా ఉన్నారు

“యెహోవా వలననే నాకు సహాయం కలుగును”

అవివాహితులుగా ఉన్నా యెహోవా సేవలో సంతృప్తిగా ఉన్నారు

“మేము అవివాహితులుగా ఉన్నప్పటికీ మాలో చాలామంది చాలా సంతోషంగా ఉన్నాం” అని స్పెయిన్‌కు చెందిన ఒక క్రైస్తవ స్త్రీ చెప్పింది. ఆమె సంతృప్తిగా ఉండడానికిగల కారణం ఏమిటి? “వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక చింతలు మాకు ఉండవు కాబట్టి, మేము మా దేవుడైన యెహోవాకు మరింత సంపూర్ణంగా సేవచేయగలుగుతాం.”

అలాంటి భావాలు, అవివాహితులుగా ఉండడం గురించిన దేవుని వాక్యపు దృక్పథానికి అనుగుణంగా ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు వివాహం గురించిన విషయాలు చర్చించినప్పుడు ఆయన ఈ ప్రేరేపిత అంతర్దృష్టిని ఇచ్చాడు: “నావలెనుండుట వారికి మేలని పెండ్లికానివారితోను విధవరాండ్రతోను చెప్పుచున్నాను.” పౌలు వివాహం చేసుకోలేదు. అయితే అవివాహితులుగా ఉండమని సిఫారసు చేయడానికి ఆయన ఏ కారణం ఇచ్చాడు? వివాహిత వ్యక్తి విభాగింపబడతాడు అదే అవివాహిత పురుషుడు గానీ స్త్రీ గానీ ‘ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతిస్తారు’ అని ఆయన నొక్కి చెప్పాడు. (1 కొరింథీయులు 7:​8, 32-34) ఒక అవివాహిత వ్యక్తికి సంతోషాన్నిచ్చే, సంతృప్తినిచ్చే ముఖ్యకారకం యెహోవాను సేవించడమే.

మంచి ఉద్దేశంతో అవివాహితులుగా ఉండడం

పౌలు చేసిన వ్యాఖ్యానాలు వివాహానికీ, కుటుంబాన్ని ప్రారంభించడానికీ ప్రాముఖ్యతనిచ్చే సంస్కృతుల్లో ఉన్నవారిని కలవరపెట్టవచ్చు. అయితే యేసుక్రీస్తు అవివాహితుడైనా సంతోషంగా సంతృప్తిగా ఉన్నాడు, ఆయన అవివాహితులుగా ఉన్న క్రైస్తవుల కోసం ఒక మంచి ఉద్దేశాన్ని చెప్పాడు. ఆయన ఇలా చెప్పాడు: “రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. (ఈ మాటను) అంగీకరింపగలవాడు అంగీకరించును గాక.”​—⁠మత్తయి 19:​12.

ఆ మాటలకు అనుగుణంగానే, చాలామంది వివాహిత జీవితంలో సాధారణంగా ఎదురయ్యే అవరోధాలు లేకుండా దేవుణ్ణి సేవించేందుకు అవివాహిత స్థితి తమకు వీలుకల్పిస్తోందని గ్రహించారు. (1 కొరింథీయులు 7:​35) వేలాదిమంది క్రైస్తవులు వివాహ భాగస్వామి లేకుండానే యెహోవాను సంతోషంగా ఆరాధిస్తున్నారు, ఇతరులకు చురుకుగా సహాయం చేయడంలో వారు ఆనందాన్ని పొందుతున్నారు. *

వివాహితులైనవారు సంతోషంగా, అవివాహితులందరూ దుఃఖంగా లేరని చాలామంది అవివాహిత క్రైస్తవులు గ్రహిస్తారు. రెండు వర్గాలవారిలో, కొందరు కొన్నిసార్లు సంతోషంగా ఉంటారు, అలాగే కొన్నిసార్లు దుఃఖంతో ఉంటారు. నిజానికి వివాహం ‘శరీరసంబంధమైన శ్రమలు’ కలిగిస్తోందని బైబిలు వాస్తవికంగానే వివరిస్తోంది.​—⁠1 కొరింథీయులు 7:​28.

పరిస్థితుల కారణంగా అవివాహిత స్థితి

చాలామంది పరిస్థితుల కారణంగానే అవివాహితులుగా ఉన్నారే తప్ప అలా ఉండాలని కోరుకోలేదు. వివాహ ఏర్పాట్లలో పొందగల ప్రేమ, సహచర్యం, ఆప్యాయతను వారు కోరుకోవచ్చు. కానీ కొందరు ఆర్థిక సమస్యలు లేక ఇతర సమస్యల కారణంగా వారు ప్రస్తుతానికి వివాహం గురించి ఆలోచించకపోవచ్చు. కొందరు క్రైస్తవులు, వారిలో అధికశాతం ప్రియమైన ఆధ్యాత్మిక సహోదరీలు “ప్రభువునందు మాత్రమే” వివాహం చేసుకోవాలనే బైబిలు ఆదేశానికి లోబడి ఉండాలనే దృఢనిశ్చయంతో ఉన్న కారణంగా అవివాహితులుగా ఉండిపోయారు. (1 కొరింథీయులు 7:​39) యెహోవాకు సమర్పించుకున్న, బాప్తిస్మం పొందిన ఆరాధకులలోనే వివాహ భాగస్వామిని పొందడం కోసం వారు యథార్థంగా ప్రయత్నిస్తారు.

కొన్నిసార్లు అవివాహితులైన కొందరు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఒక అవివాహిత క్రైస్తవ స్త్రీ, తాను ఒంటరిదాన్ననే భావాలు కలుగుతున్నాయని ఒప్పుకున్న తర్వాత ఇలా చెబుతోంది: “మాకు యెహోవా నియమాలు తెలుసు, ఏ విధంగా కూడా యెహోవాకు కోపం తెప్పించడం మాకు ఇష్టంలేదు. ఒక భాగస్వామి సహచర్యాన్ని మేము ఇష్టపడవచ్చు, లోకంలోని ప్రజలు ఎన్నిసార్లు ‘పెళ్ళి కుదర్చడానికి’ ప్రయత్నించినా, మేము మాత్రం అవివాహితులుగానే ఉండడానికి నిశ్చయించుకున్నాం. మేము అవిశ్వాసులైన పురుషులతో లేక స్త్రీలతో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడం.” బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకుంటున్నందుకు, తాము ఎలాంటి మానసిక క్షోభను అనుభవించాల్సి వచ్చినా యెహోవాను సంతోషపెట్టాలనే ఉద్దేశంతో ఉన్నత నైతిక ప్రమాణాలను కాపాడుకుంటున్నందుకు అలాంటి క్రైస్తవులను మెచ్చుకోవాలి.

ఉదారంగా దైవిక సహాయం

తనను సేవించనివారిని వివాహం చేసుకోవడానికి నిరాకరించడం లాంటి విషయాల్లో తనకు విశ్వసనీయతను చూపించేవారి విషయంలో యెహోవా విశ్వసనీయంగా ఉంటాడు. సొంత అనుభవం నుండి దావీదు రాజు ఇలా సాక్ష్యం చెప్పగలిగాడు: “యెహోవా నమ్మదగిన మనుష్యులకు నీవు నమ్మదగినవాడవు.” (కీర్తన 18:​25, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) తనకు నమ్మకంగా విధేయులుగా ఉండేవారికి దేవుడు ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.” మనం యెహోవాను అనుకరిస్తూ, దేవుని వాక్యానికి నమ్మకంగా హత్తుకొని ఉన్న అన్ని వయసుల అవివాహిత క్రైస్తవులను ఉదారంగా మెచ్చుకోవచ్చు. వారు తమ సవాళ్ళను ఎదుర్కోగలిగేలా యెహోవా వారికి సహాయం చేయాలని కూడా మనం ప్రార్థించవచ్చు.​—⁠న్యాయాధిపతులు 11:​30-40.

బైబిలు విద్యా పనిలో పూర్తిగా భాగం వహించడం ద్వారా తమ జీవితాలు అర్థవంతమైనవని చాలామంది అవివాహిత క్రైస్తవులు గ్రహించారు. ఉదాహరణకు, పెట్రీషియా విషయాన్నే గమనించండి, ఆమె పయినీరుగా (లేక పూర్తికాల సువార్తికురాలిగా) సేవ చేస్తున్న 30వ పడిలో ఉన్న ఒక అవివాహిత స్త్రీ. ఆమె ఇలా అంటోంది: “అవివాహితురాలిగా ఉండడంవల్ల అనేక సమస్యలు ఎదురైనా, క్రమ పయినీరు అవడానికి అది నాకు అవకాశాన్నిచ్చింది. నేను ఒక అవివాహిత వ్యక్తిని కాబట్టి నా కార్యక్రమ పట్టికను పరిస్థితికి తగ్గట్టు చాలా సులభంగా మార్చుకోవచ్చు, అలా చేయడంవల్ల అధ్యయనానికి అధిక సమయం కేటాయించడానికి వీలవుతుంది. నేను యెహోవా మీద అధికంగా ఆధారపడడాన్ని, ప్రత్యేకంగా కష్టతర సమయాల్లో ఆయన మీద అధికంగా ఆధారపడడాన్ని నేర్చుకున్నాను.”

అలాంటి అభిప్రాయాలు బైబిలు ఓదార్పుకరమైన వాగ్దానాల మీద ఆధారపడి ఉన్నాయి: “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.” (కీర్తన 37:⁠5) అవును, యెహోవా నమ్మకమైన ఆరాధకులందరూ, వివాహితులైనా లేక అవివాహితులైనా, ఈ ప్రేరేపిత మాటల నుండి ఓదార్పును, శక్తిని పొందగలరు: “యెహోవావలననే నాకు సహాయము కలుగును.”​—⁠కీర్తన 121:⁠2.

[అధస్సూచి]

^ పేరా 7 యెహోవాసాక్షుల క్యాలెండర్‌ 2005 (ఆంగ్లం)లో జూలై/ఆగస్టు చూడండి.

[9వ పేజీలోని బ్లర్బ్‌]

“పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు.”​1 కొరింథీయులు 7:32.

[8వ పేజీలోని బాక్సు]

అవివాహిత స్థితిని ప్రతిఫలదాయకంగా చేసుకోవడం

ఎన్నడూ వివాహం చేసుకోని యేసు ఇలా చెప్పాడు: నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.” యోహాను 4:​34.

ఫిలిప్పు నలుగురు కుమార్తెలు ‘ప్రవచించడంలో’ నిమగ్నమైపోయారు.​—⁠అపొస్తలుల కార్యములు 21:​8, 9.

రాజ్య సందేశాన్ని ప్రకటించే అవివాహిత క్రైస్తవ సహోదరీలు సువార్త ‘ప్రకటించు స్త్రీల గొప్ప సైన్యంలో’ భాగంగా ఉన్నారు.​—⁠కీర్తన 68:⁠11.