కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుణ్ణి సంతోషపెట్టే సత్య బోధలు

దేవుణ్ణి సంతోషపెట్టే సత్య బోధలు

దేవుణ్ణి సంతోషపెట్టే సత్య బోధలు

భూమ్మీద నివసించేవారు ఏ బోధలు సత్యమైనవో, ఏ బోధలు దేవుణ్ణి సంతోషపెట్టేవో తెలుసుకోవాలంటే, దేవుడే తన ఆలోచనలను మానవులకు వెల్లడి చేయాలి. అలా వెల్లడి చేసిన ఆలోచనలు అందరికీ అందుబాటులో ఉండేలా కూడా చూడాలి. అలా చేయకపోతే దేవుడు ఎలాంటి సిద్ధాంతాలను, ఆరాధనను, ప్రవర్తనను ఆమోదిస్తాడనేది మానవజాతి ఎలా తెలుసుకోగలదు? మరి అలాంటి సమాచారాన్ని దేవుడు ఇచ్చాడా? ఇచ్చినట్లయితే ఏ రూపంలో ఇచ్చాడు?

కొన్ని దశాబ్దాలు మాత్రమే జీవించగలిగే ఏ మానవుడైనా స్వయంగా మానవులందరినీ కలుసుకొని దేవుడు ఇచ్చే సమాచారాన్ని వారందరికీ తెలియజేసే మాధ్యమంగా పనిచేయగలడా? చేయలేడు. అయితే శాశ్వతమైన ఒక లిఖిత వృత్తాంతం అలా మాధ్యమంగా పనిచేయగలదు. కాబట్టి దేవుడు వెల్లడి చేసిన విషయాలు ఒక పుస్తక రూపంలో అందుబాటులో ఉండడం సమంజసంగా ఉండదా? దేవుని ప్రేరేపణతో వ్రాయబడినట్లు ఒక ప్రాచీన పుస్తకం చెప్పుకుంటోంది, ఆ పుస్తకమే బైబిలు. “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది” అని దాని రచయితల్లో ఒకరు అన్నారు. (2 తిమోతి 3:​16) మనం బైబిలును జాగ్రత్తగా పరిశీలించి అది సత్య బోధలకు మూలమో కాదో చూద్దాం.

బైబిలు ఎంత పురాతనమైనది?

మతానికి సంబంధించిన అతి పురాతనమైన ముఖ్యపుస్తకాలలో బైబిలు ఒకటి. దాని మొదటి భాగాలు దాదాపు 3,500 సంవత్సరాల ముందు వ్రాయబడ్డాయి. ఆ పుస్తకం సా.శ. 98లో పూర్తి చేయబడింది. * బైబిలును 1,600 సంవత్సరాల కాలవ్యవధిలో దాదాపు 40 మంది వ్యక్తులు వ్రాసినా దానిలోని రచనలు ఒకదానితో మరొకటి పొందికగా ఉన్నాయి. దాని నిజమైన గ్రంథకర్త దేవుడే కాబట్టి దానిలో అలాంటి పొందిక ఉంది.

బైబిలు, చరిత్రంతటిలో అతి విస్తృతంగా పంచిపెట్టబడుతున్న, అనువదించబడుతున్న పుస్తకం. ప్రతీ సంవత్సరం పూర్తి బైబిలు గానీ దానిలో కొన్ని భాగాలు గానీ దాదాపు ఆరు కోట్ల కాపీలు పంచిపెట్టబడుతున్నాయి. పూర్తి బైబిలు లేదా దానిలో కొంతభాగం 2,300 కన్నా ఎక్కువ భాషల్లోకి, మాండలికాల్లోకి అనువదించబడింది. మానవజాతిలోని 90 శాతం కన్నా ఎక్కువమందికి పూర్తి బైబిలు లేక కనీసం దానిలో కొంతభాగం తమ స్థానిక భాషలో అందుబాటులో ఉంది. ఈ పుస్తకం దేశ సరిహద్దులను, జాతి వైషమ్యాలను, జాతి విభేదాలను అధిగమించింది.

బైబిలు ఎలా వ్యవస్థీకరించబడింది?

మీ దగ్గర ఒక బైబిలు ఉన్నట్లయితే దానిని తెరచి అదెలా వ్యవస్థీకరించబడిందో దయచేసి చూడండి. * మొదటిగా విషయసూచికను చూడండి. చాలా బైబిళ్ళలో ప్రారంభంలో విషయసూచిక ఉంటుంది, దాంట్లో ప్రతీ బైబిలు పుస్తకం పేరు అది ఉండే పేజీ నంబరు చూడవచ్చు. నిజానికి బైబిలు వివిధ పుస్తకాల సంచయమని, ప్రతీ పుస్తకానికి ఒక ప్రత్యేక పేరుందని మీరు గమనిస్తారు. మొట్టమొదటి పుస్తకం పేరు ఆదికాండము, చివరి పుస్తకం పేరు ప్రకటన లేక అపోకలిప్స్‌. బైబిల్లోని పుస్తకాలు రెండు భాగాలుగా వర్గీకరించబడ్డాయి. మొదటి 39 పుస్తకాలు చాలావరకు హెబ్రీ భాషలో వ్రాయబడ్డాయి కాబట్టి వాటిని హెబ్రీ లేఖనాలు అని పిలుస్తారు. చివరి 27 పుస్తకాలు గ్రీకు భాషలో వ్రాయబడ్డాయి కాబట్టి వాటిని గ్రీకు లేఖనాలు అని పిలుస్తారు. కొందరు ఈ రెండు భాగాలను పాత నిబంధన, క్రొత్త నిబంధన అని పిలుస్తారు.

విషయాలను సులభంగా కనుగొనడానికి బైబిలు పుస్తకాలకు అధ్యాయాలు, వచనాలు ఉన్నాయి. ఈ పత్రికలో లేఖనాలు ఉదాహరించబడినప్పుడు, బైబిలు పుస్తకం పేరు తర్వాత వచ్చే సంఖ్య ఆ పుస్తకపు అధ్యాయాన్ని సూచిస్తోంది, తర్వాతి సంఖ్య వచనాన్ని సూచిస్తోంది. ఉదాహరణకు, “2 తిమోతి 3:​16” అని ఉదాహరించబడితే అది రెండవ తిమోతి పుస్తకంలోని 3వ అధ్యాయం, 16వ వచనమని అర్థం. మీరు ఆ వచనాన్ని బైబిల్లో కనుగొనగలరేమో చూడండి.

బైబిలుతో సుపరిచితులమయ్యే మంచి పద్ధతి మనం దానిని క్రమంగా చదవడమేనని మీరు భావించడం లేదా? మత్తయి పుస్తకంతో ప్రారంభమయ్యే గ్రీకు లేఖనాలను మొదటగా చదవడం సహాయకరమని కొందరు గ్రహించారు. ప్రతీరోజు మూడు నుండి ఐదు అధ్యాయాలు చదవడం ద్వారా మీరు పూర్తి బైబిలును ఒక సంవత్సరంలోనే చదవవచ్చు. అయితే బైబిల్లో మీరు చదువుతున్నది వాస్తవంగా దైవ ప్రేరేపితమని మీరెలా నమ్మవచ్చు?

మీరు బైబిలును నమ్మవచ్చా?

మానవాళి కోసం దైవప్రేరేపితమైన పుస్తకంలో, ఎలా జీవించాలి అనే విషయం గురించి అన్ని కాలాలకూ ఉపయోగపడే సలహా ఉండాలి కదా? బైబిల్లో, మానవజాతికి చెందిన తరాలన్నిటికీ వర్తించే మానవ ప్రవృత్తి గురించిన అవగాహన వ్యక్తమవుతుంది, దాని సూత్రాలు మొదట చెప్పబడినప్పుడు ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయో నేడు కూడా అంతే ప్రయోజనకరంగా ఉన్నాయి. ఆ విషయాన్ని క్రైస్తవత్వాన్ని స్థాపించిన యేసుక్రీస్తు ఇచ్చిన ప్రఖ్యాతిగాంచిన ప్రసంగంలో సులభంగా గ్రహించవచ్చు. ఆ ప్రసంగం మత్తయి 5 నుండి 7 అధ్యాయాల్లో నమోదు చేయబడింది. కొండమీది ప్రసంగంగా ప్రఖ్యాతిగాంచిన ఆ ప్రసంగం, నిజమైన సంతోషాన్ని పొందే విధానాన్ని వివరించడమే కాక వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ప్రార్థించాలి, భౌతిక అవసరాలను ఎలా దృష్టించాలి వంటి అనేక విషయాలను కూడా వివరిస్తోంది. ఆ ప్రసంగంలో, బైబిల్లోని మిగతా పేజీల్లో, దేవుణ్ణి సంతోషపెట్టడానికి, జీవితంలో మన పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలను అది స్పష్టంగా వివరిస్తోంది.

మీరు బైబిలుపై నమ్మకముంచడానికిగల మరో కారణం ఏమిటంటే, ఈ ప్రాచీన పుస్తకం విజ్ఞానశాస్త్ర సంబంధమైన విషయాల గురించి పేర్కొంటున్న అంశాలు ఖచ్చితమైనవి. ఉదాహరణకు భూమి బల్లపరుపుగా ఉందని చాలామంది నమ్మిన కాలంలో, బైబిలు దానిని “భూమండలము” [లేక భూగోళం] అని పేర్కొంది. * (యెషయా 40:​22) ప్రఖ్యాతిగాంచిన శాస్త్రజ్ఞుడు సర్‌ ఐసక్‌ న్యూటన్‌, అంతరిక్ష గ్రహాలు గురుత్వాకర్షణ కారణంగా శూన్యంలో వేలాడుతున్నాయని వివరించిన దాదాపు 3,000 సంవత్సరాలకు ముందే ‘భూమి శూన్యముపై వ్రేలాడుతుందని’ బైబిలు కావ్యరూపంలో వర్ణించింది. (యోబు 26:⁠7) దాదాపు 3,000 సంవత్సరాల ముందు భూమికి సంబంధించిన నీటిచక్రం గురించి కావ్యభాషలో నమోదు చేయబడిన ఈ వర్ణనను కూడా గమనించండి: “నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును.” (ప్రసంగి 1:⁠7) అవును, విశ్వ సృష్టికర్తే బైబిలు గ్రంథకర్త కూడా.

బైబిలు సంబంధమైన చారిత్రాత్మక ప్రామాణికత అది దేవుడు ప్రేరేపించినదనే వాస్తవంతో ఏకీభవిస్తోంది. బైబిల్లోని విషయాలు పుక్కిటి పురాణాలు కావు. వాటికి నిర్దిష్టమైన తేదీలతో, ప్రజలతో, స్థలాలతో సంబంధం ఉన్నాయి. ఉదాహరణకు, లూకా 3:⁠1 “తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను” ఉన్న కాలం గురించి వాస్తవికంగా పేర్కొంటుంది.

ప్రాచీన చరిత్రకారులు దాదాపు అన్ని సందర్భాల్లోనూ పరిపాలకుల విజయాలను, మంచి గుణాలను మాత్రమే నివేదించినా బైబిలు రచయితలు మాత్రం నిజాయితీపరులే కాక, తమ సొంత తప్పిదాలను కూడా బాహాటంగా ఒప్పుకున్నారు. ఉదాహరణకు ఇశ్రాయేలు రాజైన దావీదు ఇలా ఒప్పుకున్నాడు: “నేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని.” ఆ వాక్యం బైబిల్లో నిష్పక్షపాతంగా నమోదు చేయబడింది. (2 సమూయేలు 24:​10) బైబిలు రచయితయైన మోషే తాను సత్య దేవుని మీద నమ్మకం చూపించని ఒక సందర్భాన్ని స్వయంగా నమోదు చేశాడు.​—⁠సంఖ్యాకాండము 20:​12.

బైబిలు దైవ ప్రేరేపితమని నిరూపించే మరో రుజువు ఉంది. ఆ రుజువు, దానిలోని నెరవేరిన ప్రవచనాలు, అంటే చరిత్ర ముందుగానే వ్రాయబడి ఉండడం. ఆ ప్రవచనాల్లో కొన్ని యేసుక్రీస్తు గురించిన ప్రవచనాలు. ఉదాహరణకు, యేసు పుట్టుకకు దాదాపు 700 సంవత్సరాల ముందు, వాగ్దానం చేయబడిన ఈ వ్యక్తి “యూదయదేశపు బేత్లెహేములో” జన్మిస్తాడని హెబ్రీ లేఖనాలు ముందుగానే ఖచ్చితంగా చెప్పాయి.​—⁠మత్తయి 2:1-6; మీకా 5:⁠2.

మరో ఉదాహరణను పరిశీలించండి. 2 తిమోతి 3:​1-5లో బైబిలు ఇలా చెబుతోంది: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.” ఆ మాటలు, నేటి ప్రజల సాధారణ వైఖరిని వివరించడం లేదా? ఆ మాటలు సా.శ. 65వ సంవత్సరంలో అంటే దాదాపు 1,900 సంవత్సరాల క్రితం వ్రాయబడ్డాయి!

బైబిలు మనకు ఏమి బోధిస్తోంది?

మీరు బైబిలు చదువుతున్నప్పుడు అది ఉన్నత జ్ఞానానికి మూలమని మీరు గ్రహించగలుగుతారు. దేవుడు ఎవరు? సాతాను నిజంగా ఒక వ్యక్తా? యేసుక్రీస్తు ఎవరు? బాధలు ఎందుకు ఉన్నాయి? మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? వంటి ప్రశ్నలకు అది సంతృప్తికరమైన జవాబులు ఇస్తోంది. ఆ ప్రశ్నలకు మీరు ఇతరుల నుండి వినే జవాబులు, ఆ జవాబులు ఇస్తున్న వ్యక్తుల నమ్మకాలు, ఆచారాలు ఉన్నంత విభిన్నంగా ఉంటాయి. అయితే ఆ ప్రశ్నల గురించి, మరితర అనేక అంశాల గురించిన సత్యాలను బైబిలు వెల్లడి చేస్తోంది. అంతేకాక ఇతరులపట్ల, ఉన్నత అధికారులపట్ల కనబరచాల్సిన ప్రవర్తన, వైఖరి గురించి బైబిలులో ఉన్న నిర్దేశం అతి శ్రేష్టమైనది. *

భూమి, మానవజాతి విషయంలో దేవుని సంకల్పం గురించి బైబిలు ఏమి వెల్లడి చేస్తోంది? “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు” అని అది వాగ్దానం చేస్తోంది. (కీర్తన 37:​10, 11) “దేవుడు . . . వారికి [మానవజాతికి] తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” (ప్రకటన 21:​3, 4) “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”​—⁠కీర్తన 37:​29.

యుద్ధం, నేరం, హింస, దుష్టత్వం త్వరలో అంతమవుతాయని కూడా బైబిలు ముందుగానే చెప్పింది. అనారోగ్యం, వృద్ధాప్యం, మరణం ఇక ఉండవు. భూపరదైసులో నిత్యజీవం ఒక వాస్తవమవుతుంది. ఎంతటి ఆహ్లాదకరమైన భావి నిరీక్షణలో కదా! అయితే అవన్నీ మానవజాతిపట్ల దేవుని ప్రేమను ఎంతగా నిరూపిస్తున్నాయో కదా!

మీరు ఏమి చేస్తారు?

బైబిలు సృష్టికర్త నుండి వచ్చిన ఒక అద్భుతమైన కానుక. ఆ పుస్తకానికి మీరెలా ప్రతిస్పందించాలి? దేవుడు వెల్లడి చేసిన అంశాలు మానవజాతి అంతటికీ ప్రయోజనం చేకూర్చాలంటే అది నాగరికత ప్రారంభమైన కాలానికి చెంది ఉండాలని హిందూ నేపథ్యానికి చెందిన ఒక వ్యక్తి నమ్మాడు. బైబిలులోని కొన్ని భాగాలు హిందూ మత గ్రంథాలైన వేదాలకన్నా అతి ప్రాచీనమైనవని ఆయన గుర్తించినప్పుడు, బైబిలు చదివి దానిలోని అంశాలను పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. * ప్రపంచంలో అతి విస్తృతంగా పంచిపెట్టబడుతున్న ఈ పుస్తకం గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకొనే ముందు దానిని చదవాల్సిన అవసరం ఉందని అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ కూడా గ్రహించాడు.

బైబిలు చదివి అది బోధిస్తున్నవాటిని అన్వయించుకోవడంవల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బైబిలు ఇలా చెబుతోంది: “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.” * (కీర్తన 1:​1-3) బైబిలు అధ్యయనం చేస్తూ అది చెబుతున్నవాటిని ధ్యానిస్తే మీ ఆధ్యాత్మిక అవసరం తీరుతుంది కాబట్టి మీకు సంతోషం కలుగుతుంది. (మత్తయి 5:⁠3) ఫలవంతమైన జీవితాన్ని ఎలా గడపాలి, సమస్యలను విజయవంతంగా ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల గురించి బైబిలు మీకు వివరిస్తుంది. అవును “[బైబిల్లో దేవుడు ఇచ్చిన నియమాలను] గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.” (కీర్తన 19:​11) అంతేకాక దేవుని వాగ్దానాలపట్ల నమ్మకముంచడంవల్ల మీకు ఇప్పుడు ఆశీర్వాదాలు కలుగుతాయి, భవిష్యత్తు గురించిన స్పష్టమైన నిరీక్షణ కూడా మీకు ఉంటుంది.

బైబిలు మనల్ని ఇలా ప్రోత్సహిస్తోంది: “కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను . . . పాలను అపేక్షించుడి.” (1 పేతురు 2:⁠1) ఒక శిశువు పోషకాహారం మీద ఆధారపడుతుంది, ఆకలి తీరేవరకు పట్టుబడుతుంది. అలాగే మనం వాస్తవంగా దేవుని నుండి వచ్చే జ్ఞానం మీద ఆధారపడివున్నాం. కాబట్టి మనం ఆయన వాక్యం కోసం “అపేక్షించాలి” లేక బలమైన కోరికను పెంచుకోవాలి. బైబిలు దేవుని నుండి వచ్చిన సత్య బోధల పుస్తకం. దానిని క్రమంగా చదివే లక్ష్యాన్ని పెట్టుకోండి. మీ అధ్యయనం నుండి పూర్తి ప్రయోజనం పొందేలా మీకు సహాయం చేయడానికి మీ సమాజంలో ఉన్న యెహోవాసాక్షులు ఇష్టపడతారు. వారిని సంప్రదించమని మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. లేక మీరు ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాయవచ్చు.

[అధస్సూచీలు]

^ పేరా 5 సా.శ. “సామాన్య శకాన్ని” సూచిస్తోంది, దానిని సాధారణంగా ఎ.డి., అంటే అన్నో డోమిని అని పిలుస్తారు, దానికి “ప్రభువు సంవత్సరంలో” అని అర్థం. సా.శ.పూ. అంటే “సామాన్య శక పూర్వం.”

^ పేరా 8 మీ దగ్గర బైబిలు లేకపోతే మీకు ఒక కాపీ ఇవ్వడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.

^ పేరా 13 యెషయా 40:​22లో మండలము లేదా “వృత్తము” అని అనువదించబడిన మూలభాషా పదాన్ని “గోళము” అని కూడా అనువదించవచ్చు. కొన్ని బైబిలు అనువాదాల్లో “భూ గోళము,” (డుయే వర్షన్‌) “భూ వర్తులము” అని ఉన్నాయి.​—⁠మొఫత్‌.

^ పేరా 19 ఈ అంశాలు యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలో చర్చించబడ్డాయి.

^ పేరా 23 వేదాలలోని ప్రాచీన శ్లోకాలు దాదాపు 3,000 సంవత్సరాల క్రితం కూర్చబడి, మౌఖికంగానే వ్యాప్తి చెందాయని నమ్మబడుతోంది. “సా.శ. పధ్నాల్గవ శతాబ్దంలోనే వేదాలు గ్రంథస్థం చేయబడ్డాయి” అని ఎ హిస్టరీ ఆఫ్‌ ఇండియా అనే తన పుస్తకంలో పి. కె. శరత్‌కుమార్‌ అన్నాడు.

^ పేరా 24 బైబిలు ప్రకారం దేవుని పేరు యెహోవా. చాలా బైబిలు అనువాదాల్లో దానిని కీర్తన 83:​18లో చూడవచ్చు.

[7వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యాన్ని “అపేక్షించండి.” బైబిలును క్రమంగా అధ్యయనం చేయండి

[5వ పేజీలోని చిత్రసౌజన్యం]

NASA photo