కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నారా?

మీరు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నారా?

మీరు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నారా?

“మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును.”​—⁠లూకా 16:​10.

రోజు గడుస్తున్నకొద్దీ చెట్టు నీడ ఎలా మారుతుందో మీరెప్పుడైనా గమనించారా? ఆ నీడ పరిమాణం, దిశా మారుతూ ఉంటాయి! మానవ ప్రయత్నాలు, వాగ్దానాలు తరచూ ఆ నీడలాగే నిలకడగా ఉండవు. అయితే యెహోవా దేవుడు కాలంతోపాటు మార్పుచెందేవాడు కాదు. ఆయనను “జ్యోతిర్మయుడగు తండ్రి” అని పిలుస్తూ శిష్యుడైన యాకోబు ఇలా చెబుతున్నాడు: “ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.” (యాకోబు 1:​17) చాలా చిన్న విషయాల్లో కూడా యెహోవా స్థిరమైనవాడు, ఆధారపడదగినవాడు. ఆయన “నమ్ముకొనదగిన దేవుడు.”​—⁠ద్వితీయోపదేశకాండము 32:4.

2 యెహోవా తన ఆరాధకులు నమ్మకంగా ఉండడాన్ని ఎలా దృష్టిస్తాడు? ఆయన వారిని దావీదులాగే చూస్తాడు, దావీదు వారి గురించి ఇలా చెప్పాడు: “నాయొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్థులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోషమార్గమందు నడచువారు నాకు పరిచారకులగుదురు.” (కీర్తన 101:⁠6) అవును, యెహోవా తన సేవకులు నమ్మకంగా ఉండడాన్నిబట్టి ఆనందిస్తాడు. అపొస్తలుడైన పౌలు మంచి కారణంతోనే ఇలా వ్రాశాడు: “గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.” (1 కొరింథీయులు 4:⁠2) నమ్మకంగా ఉండడంలో ఏమి ఇమిడివుంది? జీవితపు ఏ రంగాల్లో మనం నమ్మకంగా ప్రవర్తించాలి? ‘నిర్దోషమార్గమందు నడవడంవల్ల’ ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయి?

నమ్మకంగా ఉండడమంటే ఏమిటి?

3 “మోషే పరిచారకుడైయుండి . . . నమ్మకముగా ఉండెను” అని హెబ్రీయులు 3:5 చెబుతోంది. ప్రవక్తయైన మోషేను నమ్మకస్థునిగా చేసినదేమిటి? ఆలయ గుడారాన్ని నిర్మించి, నెలకొల్పడంలో “యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, ఆలాగుననే చేసెను.” (నిర్గమకాండము 40:​16) యెహోవా ఆరాధకులుగా మనం, విధేయతతో ఆయనను సేవిస్తూ మన నమ్మకాన్ని చూపిస్తాం. దీనిలో, మనకు కఠిన పరీక్షలు లేదా తీవ్ర శోధనలు ఎదురైనప్పటికీ యెహోవాపట్ల విశ్వసనీయంగా ఉండడం ఖచ్చితంగా ఒక భాగమే. అయితే, పెద్ద పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోవడం మాత్రమే మన నమ్మకాన్ని నిరూపించే విషయం కాదు. “మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును” అని యేసు చెప్పాడు. (లూకా 16:​10) అల్ప విషయాలుగా అనిపించే వాటిలో కూడా మనం నమ్మకంగా ఉండాలి.

4 రెండు కారణాలనుబట్టి మనం ప్రతీ దినం “మిక్కిలి కొంచెములో” విధేయత చూపించడం ప్రాముఖ్యం. మొదట, అది యెహోవా సర్వాధిపత్యం విషయంలో మన భావాలేమిటో వెల్లడిచేస్తుంది. మొదటి మానవ దంపతులైన ఆదాముహవ్వల ఎదుట ఉంచబడిన విశ్వాస పరీక్ష గురించి ఆలోచించండి. అది వారికి ఎలాంటి కష్టం కలిగించని నియమం. ఏదెను తోటలో వారు అన్నిరకాల ఆహారాన్ని యథేచ్ఛగా తినవచ్చు, అయితే వారికి ఒకేఒక వృక్ష ఫలాలను అంటే “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను” మాత్రం తినకూడదనే ఆజ్ఞ ఇవ్వబడింది. (ఆదికాండము 2:​16, 17) ఆ చిన్న ఆజ్ఞకు విధేయులవడంలో వారు నమ్మకంగా ఉండడం ఆ మొదటి మానవ దంపతులు యెహోవా పరిపాలనను ఇష్టపడుతున్నారని చూపించేది. మన దైనందిన జీవితంలో యెహోవా ఆదేశాలను అనుసరించడం మనం యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తున్నామని చూపిస్తుంది.

5 రెండవది, “మిక్కిలి కొంచెములో” మన ప్రవర్తన, “ఎక్కువలోను” అంటే జీవితంలో పెద్ద సమస్యలను ఎదుర్కొన్నప్పుడు కూడా మనం స్పందించే తీరుపై ప్రభావం చూపిస్తుంది. ఈ విషయంలో దానియేలుకు, ఆయన ముగ్గురు నమ్మకస్థులైన సహవాసులకు అంటే హనన్యా, మిషాయేలు, అజర్యాలకు జరిగిన దానిని పరిశీలించండి. వారు సా.శ.పూ. 617లో బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు. ఆ నలుగురు ఇంకా యువకులుగా ఉన్నప్పుడే, వారు రాజైన నెబుకద్నెజరు రాజనగరులో ఉంచబడ్డారు. “రాజు తాను భుజించు ఆహారములో నుండియు తాను పానముచేయు ద్రాక్షారసములో నుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ” ఇవ్వబడింది.​—⁠దానియేలు 1:​3-5.

6 అయితే బబులోను రాజు ఏర్పాటు చేసిన భోజనం ఆ నలుగురు హెబ్రీ యువకులకు ఒక పరీక్షగా నిలిచింది. మోషే ధర్మశాస్త్రం నిషేధించిన ఆహార పదార్థాలు రాజు ఏర్పాటుచేసిన భోజనంలో ఉండవచ్చు. (ద్వితీయోపదేశకాండము 14:​3-20) చంపబడిన జంతువుల రక్తం సరిగా ఒలికించబడకపోయి ఉండవచ్చు, అలాంటి మాంసం తినడం దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లఘించడం అవుతుంది. (ద్వితీయోపదేశకాండము 12:​23-25) ఆ ఆహారం విగ్రహాలకు అర్పించబడి ఉండవచ్చు, ఎందుకంటే కలిసి భోజనం చేయడానికి ముందు అలా అర్పించడం బబులోను ఆరాధకుల ఆచారం.

7 బబులోను రాజగృహంలో భోజన సంబంధ నిషేధాలకు ఎక్కువ ప్రాధాన్యత లేదనడంలో సందేహం లేదు. కానీ దానియేలు ఆయన స్నేహితులు ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం నిషేధించిన ఆహారం తినడం ద్వారా తమను తాము మలినపరచుకోకూడదని వారు తమ హృదయాల్లో దృఢంగా నిర్ణయించుకున్నారు. ఇది, దేవునిపట్ల వారి విశ్వసనీయతకు, నమ్మకంగా ఉండడానికి సంబంధించిన అంశం. అందువల్ల వారు శాకధాన్యాదులను, నీళ్లను తమకు ఆహారంగా ఇవ్వమని అడగడంతో వారి విన్నపం మన్నించబడింది. (దానియేలు 1:​9-14) నేడు కొందరికి ఆ నలుగురు యువకులు చేసింది అతి చిన్న విషయంగా అనిపించవచ్చు. అయితే దేవునిపట్ల వారి విధేయత యెహోవా సర్వాధిపత్యపు వివాదాంశంలో వారి స్థానమేమిటో వెల్లడించింది.

8 దానియేలు, ఆయన ముగ్గురు స్నేహితులు, చాలా చిన్నదిగా అనిపించిన విషయంలో తాము నమ్మకస్థులమని నిరూపించుకోవడం, మరింత పెద్ద పరీక్షను తట్టుకోవడానికి వారిని సిద్ధం చేసింది. నెబుకద్నెజరు రాజు నెలకొల్పిన బంగారు ప్రతిమను ఆరాధించడానికి నిరాకరించిన కారణంగా ఆ ముగ్గురు హెబ్రీయులు మరణ శిక్షను ఎలా ఎదుర్కొన్నారో దానియేలు పుస్తకంలోని 3వ అధ్యాయానికి మీ బైబిలు తెరిచి మీరే స్వయంగా చదవండి. రాజు సమక్షానికి తీసుకురాబడినప్పుడు వారు నమ్మకంగా తమ నిర్ణయాన్ని ఇలా ప్రకటించారు: “మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.” (దానియేలు 3:​17, 18) యెహోవా వారిని రక్షించాడా? ఆ యువకులను అగ్నిలో పడవేసిన భటులు మంటలో కాలి చనిపోగా, నమ్మకస్థులైన ఆ ముగ్గురు హెబ్రీయులు కనీసం కొలిమి అగ్నికూడా వారి దేహాలకు తగలకుండా సజీవంగా బయటకు వచ్చారు! వారి స్థిరమైన విశ్వసనీయతా ప్రమాణం తీవ్రమైన పరీక్షలో నమ్మకంగా ఉండడానికి సిద్ధమయ్యేందుకు వారికి సహాయం చేసింది. ఇది చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను స్పష్టపరచడం లేదా?

“అన్యాయపు సిరి” విషయంలో నమ్మకంగా ఉండడం

9 చిన్న విషయాలుగా అనిపించే వాటిలో నమ్మకంగా ఉండేవ్యక్తి, ప్రాముఖ్యమైన విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటారనే సూత్రాన్ని చెప్పకముందు, యేసు తన శ్రోతలకు ఇలా సలహా ఇచ్చాడు: “అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురు.” ఈ మాటల తర్వాత ఆయన మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండడం గురించి చెప్పాడు. ఆ పిమ్మట యేసు ఇలా అన్నాడు: “మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? . . . ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింపలేరు.”​—⁠లూకా 16:​9-13.

10 సందర్భాన్నిబట్టి చూస్తే, లూకా 16:10లోని యేసు మాటల అసలు అన్వయింపు “అన్యాయపు సిరిని” అంటే మన వనరులను లేదా ఆస్తులను ఉపయోగించడానికి సంబంధించినది. వస్తుపరమైన సంపద, ప్రత్యేకంగా డబ్బు పాపులైన మానవుల ఆధీనంలో ఉన్నందున అది అన్యాయపు సిరి అని పిలవబడింది. అంతేకాక, ధనసంపాదనా కోరిక అన్యాయపు క్రియలకు దారితీయగలదు. మన వస్తుసంపదలను ఉపయోగించే విధానంలో జ్ఞానాన్ని ప్రదర్శించడం ద్వారా మన విశ్వసనీయతను ప్రదర్శిస్తాం. ఆ వస్తుసంపదల్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించడానికి బదులు, రాజ్య సంబంధ పనుల్ని ప్రోత్సహించడానికీ, అవసరతలో ఉన్నవారికి సహాయం చేయడానికీ ఉపయోగించాలని కోరుకుంటాం. ఈ రీతిలో నమ్మకంగా ఉండడం ద్వారా మనం “నిత్యమైన నివాసముల” యజమానులైన యెహోవా దేవునికి, యేసుక్రీస్తుకు స్నేహితులమవుతాం. వారు మనకు పరలోకంలో గానీ, పరదైసు భూమ్మీద గానీ నిత్యజీవమిస్తూ మనల్ని ఈ నివాసాల్లోకి తీసుకుంటారు.

11 ప్రజలకు మనం రాజ్య సందేశాన్ని ప్రకటిస్తున్నప్పుడు బైబిళ్లను లేదా బైబిలు ఆధారిత సాహిత్యాలను అందిస్తూ, యెహోవా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవ కోసం ఇచ్చే విరాళాలను అంగీకరిస్తామని వివరించినప్పుడు వారికి ఎలాంటి అవకాశమిస్తున్నామో కూడా ఆలోచించండి. తమ వస్తుపరమైన వనరులను జ్ఞానయుక్తంగా ఉపయోగించే అవకాశాన్ని మనం వారికివ్వడం లేదా? లూకా 16:⁠10 అసలు అన్వయింపు వస్తుపరమైన వనరులను ఉపయోగించడానికి సంబంధించినదైనా, అక్కడున్న సూత్రం జీవితపు ఇతర రంగాలకు కూడా వర్తిస్తుంది.

నిజాయితీ ప్రాముఖ్యం

12 “మేమన్ని విషయములలోను యోగ్యముగా [‘నిజాయితీగా,’ NW] ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాము” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 13:​18) ‘అన్ని విషయములు’ అనే మాటలో ఆర్థిక విషయాలతో వ్యవహరించే అన్ని అంశాలు చేరివున్నాయి. మన రుణాలను, పన్నులను సకాలంలో నిజాయితీగా చెల్లిస్తాం. ఎందుకు? ఎందుకంటే మన మనస్సాక్షినిబట్టి, ప్రాథమికంగా దేవునిపట్ల మనకున్న ప్రేమ మూలంగా, ఆయన ఆదేశాలకు లోబడాలనే ఉద్దేశంతో మనమలా చెల్లిస్తాం. (రోమీయులు 13:​5, 6) మనది కానిది ఏదైనా మనకు దొరికినప్పుడు మనమెలా స్పందిస్తాం? దానిని సరైన యజమానికి తిరిగి అప్పగించేందుకు మనం ప్రయత్నిస్తాం. ఆ వ్యక్తికి సంబంధించినది వెనక్కి తిరిగి ఇవ్వడానికి మనల్ని ప్రేరేపించినదేమిటో వివరించినప్పుడు అది ఎంత చక్కని సాక్ష్యానికి దోహదపడుతుందో కదా!

13 అన్ని విషయాల్లో నమ్మకంగా, నిజాయితీగా ఉండడమంటే మన ఉద్యోగ స్థలంలో కూడా నిజాయితీగా ఉండాలి. మన పని అలవాట్లలో నిజాయితీగా ఉండడం మనం ప్రాతినిధ్యం వహించే దేవుని వైపు అవధానం మళ్లిస్తుంది. సోమరితనంతో మనం సమయాన్ని ‘దొంగిలించం.’ బదులుగా, యెహోవా కోసం చేస్తున్నట్లుగా కష్టపడి పనిచేస్తాం. (ఎఫెసీయులు 4:​27-28; కొలొస్సయులు 3:​23) ఒక ఐరోపా దేశంలో, డాక్టరు దగ్గర అనారోగ్య సెలవు ధృవీకరణ లేఖను అడిగే ఉద్యోగుల్లో మూడింట ఒకవంతు మంది మోసం చేస్తున్నారని అంచనా వేయబడింది. దేవుని నిజ సేవకులు పని ఎగ్గొట్టడానికి సాకులు సృష్టించరు. యజమానులు యెహోవాసాక్షుల నిజాయితీని, కష్టపడి పనిచేసే విధానాన్ని గమనించి ఆయా సందర్భాల్లో వారికి పదోన్నతి కల్పించారు.​—⁠సామెతలు 10:4.

మన క్రైస్తవ పరిచర్యలో నమ్మకంగా ఉండడం

14 మనకు అప్పగించబడిన పరిచర్యలో నమ్మకంగా ఉండడాన్ని మనమెలా ప్రదర్శించవచ్చు? “మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 13:​15) క్షేత్ర పరిచర్యలో నమ్మకాన్ని ప్రదర్శించే ముఖ్య విధానం దానిలో క్రమంగా భాగం వహించడమే. కాబట్టి యెహోవా గురించీ ఆయన సంకల్పాల గురించీ సాక్ష్యమివ్వకుండా ఒక నెలంతా అలాగే గడచిపోవడానికి మనమెందుకు అనుమతించాలి? ప్రకటనా పనిలో క్రమంగా భాగం వహించడం మన నైపుణ్యాలను, సమర్థతను కూడా వృద్ధి చేసుకోవడానికి సహాయం చేస్తుంది.

15 క్షేత్ర సేవలో నమ్మకంగా ఉండడానికి మరో ఉత్తమ విధానం కావలికోటలో, మన రాజ్య పరిచర్యలో కనబడే సూచనలను అన్వయించుకోవడమే. మనం సూచించబడిన ప్రతిపాదనలను సిద్ధపడి ఉపయోగించినప్పుడు లేదా వాస్తవికమైన ఇతర ప్రతిపాదనలను ఉపయోగించినప్పుడు, మన పరిచర్య మరింత ఫలవంతంగా ఉండదా? రాజ్య సందేశంలో ఆసక్తి చూపించిన ఎవరినైనా మనం కనుగొన్నప్పుడు, మనం సకాలంలో వారి ఆసక్తిని వృద్ధి చేస్తున్నామా? ఆసక్తిగల ప్రజలతో మనం ఆరంభించే బైబిలు అధ్యయనాల విషయమేమిటి? వారిపట్ల శ్రద్ధ చూపించడంలో మనం ఆధారపడదగిన, నమ్మదగిన వారిగా ఉంటున్నామా? పరిచర్యలో మన నమ్మకత్వాన్ని నిరూపించుకోవడం మనకూ, మనం చెప్పేది వినేవారికీ జీవాన్ని తీసుకురాగలదు.​—⁠1 తిమోతి 4:15, 16.

లోకం నుండి వేరుగా ఉండడం

16 దేవునికి చేసిన ప్రార్థనలో యేసు తన శిష్యుల గురించి ఇలా అన్నాడు: “వారికి నీ వాక్యమిచ్చి యున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:​14-16) తటస్థత, మతసంబంధ సెలవులు, ఆచారాలు, లైంగిక దుర్నీతి వంటి పెద్దపెద్ద వివాదాంశాల్లో లోకంనుండి వేరుగా ఉండడానికి మనం దృఢంగా తీర్మానించుకొని ఉండవచ్చు. అయితే చిన్న విషయాల సంగతేమిటి? మనం గ్రహించకుండానే లోకసంబంధ విధానాలచేత ప్రభావితులమవుతున్నామా? ఉదాహరణకు, మనం జాగ్రత్తగా లేకపోయినట్లయితే, మన దుస్తుల తీరు ఎంత సులభంగా అమర్యాదకరంగా, అనుచితంగా తయారుకాగలదో కదా! నమ్మకంగా ఉండడంలో మన దుస్తుల విషయంలో కనబడే తీరులో ‘అణుకువ, స్వస్థబుద్ధి’ కలిగివుండడం ఇమిడివుంది. (1 తిమోతి 2:​9, 10) అవును, ‘మన పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక, దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము.’​—⁠2 కొరింథీయులు 6:3, 8.

17 యెహోవాను ఘనపరచాలనే కోరికగల మనం సంఘకూటాలకు మర్యాదకరమైన దుస్తులు ధరిస్తాం. పెద్ద సమావేశాలకు హాజరైన సందర్భాల్లో కూడా మనమిలాగే చేస్తాం. మన దుస్తులు సందర్భోచితంగా, మన్నన తీసుకొచ్చేలా ఉండాలి. ఇది మనలను గమనించేవారికి సాక్ష్యమిచ్చే అవకాశాలనిస్తుంది. దేవదూతలు పౌలు, ఆయన క్రైస్తవ సహవాసుల కార్యశీలతను గమనించినట్లే మన కార్యశీలతనూ గమనిస్తారు. (1 కొరింథీయులు 4:⁠9) నిజానికి మనం అన్ని సమయాల్లో సముచితమైన దుస్తులు ధరించాలి. దుస్తుల ఎంపిక విషయంలో నమ్మకంగా ఉండడం కొందరికి అత్యల్ప విషయంగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది చాలా ప్రాముఖ్యం.

నమ్మకంగా ఉన్నందువల్ల లభించే ఆశీర్వాదాలు

18 నిజ క్రైస్తవులు ‘దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులు’ అని పిలవబడ్డారు. కాబట్టి వారు “దేవుడు అనుగ్రహించు సామర్థ్యము” మీద ఆధారపడతారు. (1 పేతురు 4:​10, 11) అంతేకాక, గృహ నిర్వాహకులుగా మనకు, వ్యక్తిగతంగా మనకు చెందనిది అంటే పరిచర్యతోపాటు దేవుని కృపావాక్కులు అప్పగించబడ్డాయి. మనల్ని మనం గృహ నిర్వాహకులుగా నిరూపించుకోవడంలో దేవుడు అనుగ్రహించే “బలాధిక్యము” మీదే ఆధారపడతాం. (2 కొరింథీయులు 4:⁠7) భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి పరీక్షలనైనా తట్టుకొనేలా మనకు సహాయం చేసే ఈ శిక్షణ ఎంత మేలైనదో కదా!

19 కీర్తనకర్త ఇలా ఆలపించాడు: “యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును.” (కీర్తన 31:​23) యెహోవా “మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు” అని ఆయనపై పూర్తి నమ్మకంతో మనల్ని మనం నమ్మకస్థులుగా నిరూపించుకోవడానికి దృఢ సంకల్పంతో ఉందాం.​—⁠1 తిమోతి 4:10.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

మనం ‘మిక్కిలి కొంచెములో నమ్మకంగా’ ఎందుకు ఉండాలి?

మనం నమ్మకస్థులమని మన

నిజాయితీ విషయంలో

పరిచర్య విషయంలో

లోకం నుండి వేరుగా ఉండడం విషయంలో ఎలా నిరూపించుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యెహోవా నమ్మదగినవాడని చెప్పగల ఒక విషయమేమిటి?

2. (ఎ) మనం నమ్మకస్థులమో కాదో అని మనల్ని మనం ఎందుకు పరీక్షించుకోవాలి? (బి) నమ్మకానికి సంబంధించిన ఏ ప్రశ్నలను మనం పరిశీలిస్తాం?

3. మనం నమ్మకస్థులమో కాదో ఏది నిర్ణయిస్తుంది?

4, 5. “మిక్కిలి కొంచెములో” మనం నమ్మకంగా ఉండడం దేనిని వెల్లడిచేస్తుంది?

6. దానియేలుకు, ఆయన ముగ్గురు హెబ్రీ సహవాసులకు బబులోను రాజనగరిలో ఎలాంటి పరీక్ష ఎదురైంది?

7. దానియేలు, ఆయన ముగ్గురు స్నేహితుల విధేయత ఏమి చూపించింది?

8. (ఎ) ఆ ముగ్గురు హెబ్రీయులు ఎలాంటి తీవ్రమైన విశ్వసనీయతా పరీక్షను ఎదుర్కొన్నారు? (బి) ఆ పరీక్షా ఫలితమేమిటి, ఇది దేనిని ఉదాహరిస్తోంది?

9. లూకా 16:10లో వ్రాయబడిన యేసు మాటల సందర్భమేమిటి?

10. “అన్యాయపు సిరిని” ఉపయోగించడంలో విశ్వసనీయతను మనమెలా ప్రదర్శించవచ్చు?

11. ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు చేస్తున్న సేవకు ఇచ్చే విరాళాలను అంగీకరిస్తామని గృహస్థులకు మనమెందుకు వివరించకుండా ఉండకూడదు?

12, 13. మనం నిజాయితీని ఏ రంగాల్లో ప్రదర్శించవచ్చు?

14, 15. క్రైస్తవ పరిచర్యలో మనం నమ్మకంగా ఉన్నామని నిరూపించుకునే కొన్ని మార్గాలు ఏమిటి?

16, 17. మనం లోకం నుండి వేరుగా ఉన్నామని ఏయే విధాలుగా చూపించవచ్చు?

18, 19. నమ్మకంగా ఉండడంవల్ల ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?

[26వ పేజీలోని చిత్రాలు]

మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు

[29వ పేజీలోని చిత్రం]

‘అన్ని విషయాల్లో నిజాయితీగా ప్రవర్తించండి’

[29వ పేజీలోని చిత్రం]

క్షేత్ర పరిచర్యకు చక్కగా సిద్ధపడడం నమ్మకంగా ఉండడాన్ని ప్రదర్శించే ఒక ఉత్తమ విధానం

[30వ పేజీలోని చిత్రం]

దుస్తుల విషయంలో, కనబడే తీరులో అణకువగా ఉండండి

[30వ పేజీలోని చిత్రం]