కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము!”

“యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము!”

“యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము!”

వాళ్ళు మిడతల దండువలె అసంఖ్యాకంగా ఉండి, పచ్చని పొలాలను పాడుదిబ్బలుగా చేస్తున్నారు. ఇశ్రాయేలులో కొంతకాలంగా న్యాయాధిపతులు పరిపాలిస్తున్నారు, ఆ సమయంలో ఇశ్రాయేలీయులు దుర్భర స్థితిలో ఉన్నారు. ఏడు సంవత్సరాలపాటు, విత్తిన విత్తనాలు మొలకెత్తడం మొదలెట్టిన వెంటనే మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పుననుండే వాళ్ళు ఒంటెలపై గుంపులు గుంపులుగా వచ్చి దేశాన్ని దోచుకునేవారు. దాడిచేస్తున్నవారి పశువులు పచ్చిక మైదానాల్లోపడి పచ్చనిదంతా మేసేసేవి. కానీ ఇశ్రాయేలీయులకు గాడిదలు లేవు, ఎద్దులు లేవు, గొఱ్ఱెలు లేవు. మిద్యానీయుల భయం ఎంతగా ఉండేదంటే నిరుపేదలైపోయిన ఇశ్రాయేలీయులు పర్వతాలను, గుహలను, చొరబడడానికి కష్టమైన ప్రాంతాలను ఆశ్రయించేవారు.

ఎందుకంతటి దుస్థితి? మతభ్రష్ట ఇశ్రాయేలీయులు అబద్ధ దేవుళ్ళను సేవిస్తున్నారు. దానితో యెహోవా వారిని అణచివేసే వారికి వదిలేశాడు. ఇశ్రాయేలీయులు తామిక భరించలేని పరిస్థితి వచ్చినప్పుడు సహాయం కోసం యెహోవాను అర్థించేవారు. ఆయన వాళ్ళ మొర వింటాడా? ఇశ్రాయేలీయుల అనుభవం మనకు ఎలాంటి పాఠాన్ని బోధిస్తుంది?​—⁠న్యాయాధిపతులు 6:​1-6.

జాగ్రత్తగల రైతా లేక “పరాక్రమముగల బలాఢ్యుడా”?

ఇశ్రాయేలు రైతులు సాధారణంగా ఎద్దును, నూర్చెడి మ్రానును ఉపయోగించి గోధుమలు నూర్చేవారు, ఈ పని ఆరుబయట గాలి బాగా వీస్తున్న స్థలంలో చేసేవారు, అలాగైతే ధాన్యాన్ని తూర్పారబట్టినప్పుడు పొట్టు గాలికి ఎగిరిపోయి ధాన్యం మాత్రం మిగులుతుంది. కానీ అలా తూర్పారబడితే, పంటలను దోచుకుపోవాలని చూస్తున్న దోపిడిదారులకు వారి పని స్పష్టంగా తెలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మిద్యానీయులకు కనబడకుండా ఉండాలని గిద్యోను ద్రాక్షగానుగలో గోధుమలు నూర్చేవాడు, ఈ గానుగ బహుశా రాయితో తొలిచిన, పైకప్పు గల ఒక పెద్ద తొట్టి అయ్యుండవచ్చు. (న్యాయాధిపతులు 6:11) అక్కడ ధాన్యాన్ని కొద్ది పరిమాణంలో తీసుకుని ఒక కర్రతో దుళ్ళగొట్టి ఉండవచ్చు. అప్పుడున్న పరిస్థితుల్లో, గిద్యోను అందుబాటులో ఉన్నవి ఉపయోగించుకుంటున్నాడు.

యెహోవా దూత ప్రత్యక్షమై, “పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడు” అని చెప్పినప్పుడు గిద్యోనుకు ఎంత ఆశ్చర్యం కలిగివుంటుందో ఊహించండి! (న్యాయాధిపతులు 6:​12) ద్రాక్షగానుగలో రహస్యంగా ధాన్యం నూరుస్తున్న గిద్యోను తాను పరాక్రమశాలినని ఎంతమాత్రం భావించి ఉండకపోవచ్చు. అయినప్పటికీ, ఆ మాటలు గిద్యోను ఇశ్రాయేలులో పరాక్రమముగల నాయకుడు కాగలడని దేవునికున్న నమ్మకాన్ని సూచిస్తున్నాయి. అయినా కూడా ఆ విషయం గురించి ఆయనకు నమ్మకం కలగాలి.

“మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము” అని యెహోవా గిద్యోనుకు ఆజ్ఞాపించినప్పుడు, ఆయన వినయంగా ఇలా అన్నాడు: “చిత్తము నా యేలినవాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నాను.” జాగ్రత్తపరుడైన గిద్యోను, మిద్యానీయులపై దాడి చేయడంలో దేవుడు తనకు తోడై ఉంటాడని చూపించే సూచన ఇవ్వమని అడుగుతాడు, హామీ ఇవ్వమని ఆయన సహేతుకంగా అడిగినదాని ప్రకారం చేయడానికి యెహోవా సుముఖత చూపించాడు. కాబట్టి తనను చూడడానికి వచ్చిన దూతకు గిద్యోను ఆహారమును అర్పణముగా అర్పించినప్పుడు ఆ రాతిలో నుండి అగ్ని వచ్చి ఆ అర్పణను దహించివేస్తుంది. యెహోవా గిద్యోను భయాన్ని పోగొట్టిన తర్వాత, ఆ స్థలంలో గిద్యోను ఒక బలిపీఠం కడతాడు.​—⁠న్యాయాధిపతులు 6:​12-24.

“బయలు వాదించుకొననిమ్ము”

ఇశ్రాయేలీయులకున్న అతిపెద్ద సమస్య మిద్యానీయుల అణచివేత కాదుగానీ, బయలు ఆరాధనకు వారు దాసోహమవడం. యెహోవా “రోషముగల దేవుడు,” ఇతర దేవుళ్ళను ఆరాధిస్తూనే ఎవరూ ఆయనను అంగీకారమైన విధంగా సేవించలేరు. (నిర్గమకాండము 34:​14) కాబట్టి, ఆయన తండ్రి బయలు కోసం నిర్మించిన బలిపీఠాన్ని నాశనం చేసి, దేవతాస్తంభమును నరికివేయమని యెహోవా గిద్యోనుకు ఆజ్ఞాపిస్తాడు. గిద్యోను తాను ఈ పని పగటిపూట చేస్తే తన తండ్రి ప్రతిస్పందన, ఇతరుల ప్రతిస్పందన ఎలావుంటుందోనని భయపడి, పదిమంది సేవకులను తీసుకుని వెళ్ళి రాత్రివేళ ఆ పని పూర్తిచేస్తాడు.

గిద్యోను అలా జాగ్రత్త వహించడం సరైనదే, ఎందుకంటే ఆయన చేసిన “అపచారాన్ని” చూసిన స్థానిక బయలు ఆరాధకులు ఆయన ప్రాణం తీయాలని కోరారు. అయితే, గిద్యోను తండ్రి యోవాషు బలమైన తర్కంతో వారితో వాదించి, బయలు నిజంగానే దేవుడైతే ఆయన తనను తాను కాపాడుకొని ఉండేవాడని వాదిస్తాడు. అప్పుడు ఆయన తన కుమారుడికి యెరుబ్బయలు అని పేరు పెడతాడు, దానికి “బయలు వాదించుకొననిమ్ము” అని అర్థం.​—⁠న్యాయాధిపతులు 6:​25-32.

సత్యారాధన పక్షాన ధైర్యంగా నిలబడే తన సేవకులను దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. మిద్యానీయులు, వారి మిత్ర పక్షాలవారు మళ్ళీ ఇశ్రాయేలు క్షేత్రంపై దాడి చేసినప్పుడు, ‘యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశిస్తుంది.’ (న్యాయాధిపతులు 6:​34) గిద్యోను దేవుని ఆత్మ లేదా చురుకైన శక్తి ప్రభావంతో మనష్షే, ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రాల్లో నుండి సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు.​—⁠న్యాయాధిపతులు 6:​35.

చర్య తీసుకోవడానికి సిద్ధమవడం

గిద్యోను దగ్గర ఇప్పుడు 32,000 మంది సైన్యం ఉన్నా, ఆయన దేవుణ్ణి ఒక సూచన కోసం అడుగుతాడు. కళ్ళమున ఉంచబడిన గొఱ్ఱెబొచ్చు మీద మాత్రం మంచుపడి మిగతా నేలంతా పొడిగా ఉంటే, దేవుడు ఇశ్రాయేలును తన ద్వారా రక్షిస్తాడని సూచిస్తుంది. యెహోవా ఆ అద్భుతాన్ని చేస్తాడు, ఈసారి గొఱ్ఱెబొచ్చు పొడిగా ఉండి మిగతా నేలంతా మంచుతో తడిసేలా చేయడం ద్వారా మళ్ళీ ధ్రువీకరించమని గిద్యోను అడగడంతో యెహోవా అలాగే చేస్తాడు. గిద్యోను అతి జాగ్రత్త చూపిస్తున్నాడా? లేదు, ఎందుకంటే ఆయన హామీ ఇవ్వమని అడిగినప్పుడు యెహోవా ఆ హామీ ఇచ్చాడు. (న్యాయాధిపతులు 6:​36-40) నేడు మనం అలాంటి అద్భుతాలు జరగాలని ఆశించం. అయినప్పటికీ, యెహోవా వాక్యం నుండి మనం ఆయన మార్గదర్శకాన్ని, హామీని పొందవచ్చు.

దేవుడు అప్పుడు, గిద్యోను సైన్యం చాలా పెద్దగా ఉందంటాడు. అంత పెద్ద సైన్యంతో ఇశ్రాయేలీయులు తమ శత్రువులపై విజయం సాధిస్తే, వారు తమను తామే రక్షించుకున్నామని గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ రాబోయే విజయానికి యెహోవాకు ఘనత దక్కాలి. కాబట్టి పరిష్కారమేమిటి? భయపడేవాళ్ళు వెళ్ళిపోవచ్చని చెబుతూ గిద్యోను మోషే ధర్మశాస్త్రంలోని ఒక ఏర్పాటును ఉపయోగించుకుంటాడు. అప్పుడు 22,000 మంది వెళ్ళిపోయారు, దానితో కేవలం 10,000 మంది మాత్రమే మిగిలారు.​—⁠ద్వితీయోపదేశకాండము 20:8; న్యాయాధిపతులు 7:2, 3.

దేవుని దృక్కోణం నుండి చూస్తే, ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్ళను నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళమని గిద్యోనుకు చెప్పబడింది. దేవుడు గిద్యోను వారిని ఎర్రటి ఎండలో నది దగ్గరికి తీసుకువెళ్ళేలా చేశాడని యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌ చెబుతున్నాడు. ఏదేమైనప్పటికీ, వాళ్ళు నీళ్ళు ఎలా తాగుతున్నారో గిద్యోను గమనిస్తాడు. వాళ్లలో కేవలం 300 మంది మాత్రమే ఒక చేత్తో నీళ్ళు తీసుకుని త్రాగుతూ శత్రువులు దాడి చేస్తారేమోనని చుట్టూ పరికిస్తుంటారు. అలా జాగ్రత్తగా ఉన్న 300 మంది మాత్రమే గిద్యోనుతోపాటు వెళతారు. (న్యాయాధిపతులు 7:​4-8) మిమ్మల్ని మీరు వాళ్ళ స్థానంలో ఊహించుకోండి. మీ శత్రువుల సంఖ్య 1,35,000 కాబట్టి, కేవలం యెహోవా శక్తితోనే విజయం సాధ్యమవుతుంది గానీ మీ సొంతశక్తితో కాదని మీరు అంగీకరించవలసిందే.

ఒక పనివాడిని తీసుకుని వెళ్ళి మిద్యానీయుల దండును వేగుచూసి రమ్మని దేవుడు గిద్యోనుకు చెబుతాడు. అక్కడ ఉన్నప్పుడు గిద్యోను, ఒక వ్యక్తి తనకు వచ్చిన ఒక కలను తన చెలికానికి చెబుతూ దేవుడు మిద్యానును గిద్యోనుకు అప్పగించడానికి నిశ్చయించుకున్నాడనే భావం వచ్చేలా దాన్ని వివరించడాన్ని వింటాడు. సరిగ్గా అదే గిద్యోనుకు కావలసిన ప్రోత్సాహం. దానితో, తనకు, తన 300 మందికి యెహోవా మిద్యానీయుల మీద విజయం అనుగ్రహిస్తాడనే నమ్మకం గిద్యోనులో కలుగుతుంది.​—⁠న్యాయాధిపతులు 7:​9-15.

యుద్ధ తంత్రం

300 మంది ఒక్కో గుంపులో 100 మంది చొప్పున మూడు గుంపులుగా విడిపోతారు. ప్రతి ఒక్కరికీ ఒక బూర, ఒక పెద్ద వట్టికుండ ఇవ్వబడతాయి. బయటకు కనబడకుండా దివిటీ ఆ కుండ లోపల ఉంటుంది. గిద్యోను మొదట ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ‘నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి; నేను బూర ఊదునప్పుడు మీరును బూరలను ఊదుచు, యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలెను.’​—⁠న్యాయాధిపతులు 7:​16-18, 20.

300 మంది ఇశ్రాయేలు యోధులు మెల్లగా శత్రువుల దండు కొట్టకొనకు వెళతారు. అప్పుడు రాత్రి దాదాపు పది గంటలవుతోంది, సరిగ్గా అది కావలివారు మారే సమయం. ఇది దాడి చేయడానికి అనువైన సమయం, ఎందుకంటే అప్పుడే పనిలోకి వచ్చిన కావలివారి కళ్ళు చీకటికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది.

మిద్యానీయులు ఎంతగా భయకంపితులవుతారో! హఠాత్తుగా 300 కుండలను పగులగొట్టడం, 300 బూరల ధ్వని, 300 మంది కేకలు వేయడం అన్నీ కలిపి ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని పటాపంచలు చేసేస్తాయి. ముఖ్యంగా, “యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము” అనే కేకలు విని నిర్ఘాంతపోయిన మిద్యానీయులు తామూ కేకలు వేయడం మొదలుపెట్టడంతో మరింత గందరగోళం ఏర్పడుతుంది. ఆ గందరగోళంలో శత్రువెవరో మిత్రుడెవరో వాళ్లకు అర్థంకాదు. 300 మంది తమ తమ నియమిత స్థలాల్లో కదలకుండా నిలబడి ఉండగా, దేవుడు శత్రువులు ఒకరినొకరు తమ సొంత ఖడ్గాలతో చంపుకునేట్లు చేస్తాడు. దండులోని వారంతా ఇటూ అటూ పరుగులు తీస్తున్నారు, తప్పించుకోవడానికి దారిలేదు, దొరికినవారు హతమార్చబడడంతో మిద్యానీయుల ముప్పు శాశ్వతంగా తొలగిపోతుంది. సుదీర్ఘమైన, నాశనకరమైన దాడి చివరకు ముగింపుకు వచ్చింది.​—⁠న్యాయాధిపతులు 7:19-25; 8:​10-12, 28.

ఈ విజయం తర్వాత కూడా గిద్యోను వినయంగానే ఉన్నాడు. యుద్ధం చేయడానికి తమను పిలువనందుకు అవమానించబడినట్లు భావించిన ఎఫ్రాయీమీయులు గొడవపెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆయన సాత్వీకంగా ప్రతిస్పందిస్తాడు. ఆయన మృదువైన జవాబు వారి క్రోధమును చల్లార్చి వారి కోపాన్ని తగ్గిస్తుంది.​—⁠న్యాయాధిపతులు 8:1-3; సామెతలు 15:⁠1.

ఇప్పుడిక శాంతి నెలకొనడంతో, ఇశ్రాయేలీయులు గిద్యోనును రాజుగా ఉండమంటారు. ఎంతటి ఆకర్షణీయమైన శోధన! కానీ గిద్యోను నిరాకరిస్తాడు. మిద్యానీయులపై విజయం సాధించింది ఎవరనే విషయాన్ని ఆయన మరచిపోలేదు. ఆయనిలా చెబుతాడు: “నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలును.”​—⁠న్యాయాధిపతులు 8:​23.

అయితే అపరిపూర్ణుడైన గిద్యోను అన్నివేళలా మంచి అవగాహనను ప్రదర్శించలేదు. ఏదో తెలియని కారణంగా, ఆయన యుద్ధంలో లభించిన దోపుడు సొమ్ముతో ఒక ఏఫోదును చేసి నగరంలో అందరికీ కనిపించేలా పెడతాడు. ఇశ్రాయేలీయులందరూ దానిని “అనుసరించి వ్యభిచారులైరి” అని వృత్తాంతం తెలియజేస్తోంది. వారు దాన్ని ఆరాధిస్తారు, అది గిద్యోనుకు, ఆయన ఇంటివారికి కూడా ఒక ఉరిలా తయారవుతుంది. అయినప్పటికీ, ఆయన పూర్తిగా విగ్రహారాధకుడిగా మారలేదు, ఎందుకంటే లేఖనాలు ఆయనను యెహోవా మీద విశ్వాసం ఉన్న వ్యక్తిగానే పేర్కొంటున్నాయి.​—⁠న్యాయాధిపతులు 8:27; హెబ్రీయులు 11:​32-34.

మనకు పాఠాలు

గిద్యోను కథ హెచ్చరికా పాఠాన్ని, ప్రోత్సాహాన్నిచ్చే పాఠాన్ని బోధిస్తుంది. మన తప్పుడు ప్రవర్తన మూలంగా యెహోవా ఒకవేళ మననుండి తన ఆత్మను, ఆశీర్వాదాన్ని తీసేస్తే అప్పుడు మన ఆధ్యాత్మిక స్థితి మిడతలు నాశనం చేసిన దేశంలోని నిరుపేద నివాసుల స్థితిలా తయారవుతుంది. మనం అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్నామనీ, యెహోవా ఆశీర్వాదము “ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు” అనీ మనం ఎన్నడూ మరచిపోకూడదు. (సామెతలు 10:​22) మనం ‘హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవిస్తాము’ కాబట్టి మనం ఆయనిచ్చే ఆశీర్వాదాలను అనుభవిస్తాం. లేకపోతే, ఆయన మనల్ని నిరాకరిస్తాడు.​—⁠1 దినవృత్తాంతములు 28:⁠9.

గిద్యోను గురించిన వృత్తాంతం నుండి మనం ప్రోత్సాహం పొందవచ్చు, ఎందుకంటే ఎంతో బలహీనంగా లేదా నిస్సహాయంగా కనిపించేవారిని ఉపయోగించి కూడా యెహోవా తన ప్రజలను ఎలాంటి ప్రమాదం నుండైనా తప్పించగలడని అది నిరూపిస్తోంది. గిద్యోను ఆయన 300 మంది 1,35,000 మంది మిద్యానీయులను నాశనం చేయగలగడం దేవుని అనంతమైన శక్తికి నిదర్శనంగా ఉంది. మనం చాలా దుర్భరమైన స్థితిలో ఉండి, మన శత్రువులకన్నా చాలా తక్కువ సంఖ్యలో ఉండవచ్చు. అయినప్పటికీ, గిద్యోనుకు సంబంధించిన బైబిలు వృత్తాంతం యెహోవా మీద విశ్వాసం ఉంచమని మనల్ని ప్రోత్సహిస్తోంది, ఆయన తనపై విశ్వాసం ఉంచేవారందరినీ ఆశీర్వదించి, విడిపిస్తాడు.