రష్యాలోని పురాతన గ్రంథాలయం నుండి బైబిలు మీద ప్రసరించబడిన “స్పష్టమైన వెలుగు”
రష్యాలోని పురాతన గ్రంథాలయం నుండి బైబిలు మీద ప్రసరించబడిన “స్పష్టమైన వెలుగు”
ఇద్దరు విద్వాంసులు ప్రాచీన చేతివ్రాత ప్రతుల అన్వేషణలో ఉన్నారు. వారు విడివిడిగా ఎడారులు, సన్యాసుల మఠాలు, కొండల్లోని ప్రాచీన నివాసస్థలాల గుండా ప్రయాణించారు. కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోని విధంగా వారు రష్యాలోని అత్యంత పురాతన సార్వజనిక గ్రంథాలయంలో కలుసుకున్నారు, అంతవరకు ప్రపంచానికి తెలియని ఉత్తేజకరమైన బైబిలు చేతివ్రాత ప్రతులు అక్కడ చేర్చబడ్డాయి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు కనుగొన్న ఆ చేతివ్రాత ప్రతుల సంపత్తి రష్యాకు ఎలా చేరుకుంది?
ప్రాచీన చేతివ్రాత ప్రతులు —దేవుని వాక్యాన్ని సమర్థిస్తున్నాయి
ఆ ఇద్దరు విద్వాంసులలో ఒకరిని కలుసుకోవాలంటే భావ విప్లవం యూరప్‌లో పెనుగాలిలా వీచిన 19వ శతాబ్ద ప్రారంభానికి మనం వెళ్ళాలి. సాంప్రదాయ నమ్మకాల విషయంలో సంశయాత్మక దృక్కోణాన్ని ప్రోత్సహించిన విజ్ఞానశాస్త్రపరమైన అభివృద్ధి, సాంస్కృతిక విజయాల ఆ శకాన్ని గుర్తించడానికి “జ్ఞానోదయం” అనే పదం ఉపయోగించబడింది. ఉచ్ఛతర విమర్శకులు బైబిలుకున్న అధికారమూలాల్ని సవాలు చేసేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి విద్వాంసులు బైబిలు మూలపాఠానికి సంబంధించిన ప్రామాణికత్వం మీదే అనుమానాలు వ్యక్తం చేశారు.
బైబిలుకు అనుకూలంగా వాదించే యథార్థపరులు కొందరు, బైబిలుకు మద్దతిచ్చేవి అంటే అప్పటికింకా కనుగొనని ప్రాచీన చేతివ్రాత ప్రతులు దేవుని వాక్యపు విశ్వసనీయతను తప్పక సమర్థిస్తాయని గుర్తించారు. బైబిలు మూలపాఠాన్ని నాశనం చేయడానికి లేక దాని సందేశాన్ని వక్రీకరించడానికి ఎంతోకాలంగా పదేపదే ప్రయత్నాలు జరుగుతున్నా, అప్పటికి ఉనికిలో ఉన్న వ్రాతప్రతుల కన్నా పురాతనమైనవి లభిస్తే అవి బైబిలు మూలపాఠానికి సంబంధించిన స్వచ్ఛతకు మౌన సాక్షులుగా పనిచేస్తాయి. అలాంటి చేతివ్రాత ప్రతులు, మూలపాఠంలో తప్పుడు అనువాదాలు చొప్పించబడ్డ కొన్ని భాగాలను కూడా బహిర్గతం చేయగలవు.
బైబిలు ప్రామాణికత్వానికి సంబంధించిన తీవ్రమైన వాదోపవాదాలు కొన్ని జర్మనీలో చెలరేగాయి. అక్కడ ఒక యువ ప్రొఫెసర్ అన్ని కాలాల్లోకెల్లా అది పెద్ద బైబిలు అన్వేషణలకు తనను నడిపించే ప్రయాణం ప్రారంభించడానికి సౌకర్యవంతమైన తన విద్యా సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టాడు. ఆయన పేరు కాన్‌స్టాంటిన్ వాన్ టిషెండార్ఫ్, ఆయన ఒక బైబిలు విద్వాంసుడు, ఆయన ఉచ్ఛతర విమర్శలను తిరస్కరించడం బైబిలు మూలపాఠపు ప్రామాణికత్వాన్ని సమర్థించడంలో గమనార్హమైన విజయం సాధించడానికి దారితీసింది. 1844లో సీనాయి ఎడారికి ఆయన చేసిన మొదటి ప్రయాణం ఎంతో విజయవంతమైంది. ఒక మఠంలోని చెత్తబుట్టను ఆయన మామూలుగా చూసినప్పుడు అందులో సెప్టాజింట్ లేక హెబ్రీ లేఖనాల గ్రీకు అనువాదానికి చెందిన
ప్రాచీన ప్రతి ఆయనకు కనిపించింది, అది అప్పటివరకు కనుగొన్న ప్రతులలో అతి పురాతనమైనది!ఆనందభరితుడైన టిషెండార్ఫ్ 43 చర్మపు వ్రాతప్రతులను తీసుకువెళ్ళగలిగాడు. ఇంకా చాలా వ్రాతప్రతులు ఉన్నాయనే నమ్మకం ఆయనకు కలిగినా 1853లో ఆయన అక్కడికి తిరిగి వెళ్ళినప్పుడు కేవలం ఒక చర్మపు వ్రాతప్రతి అవశేషాన్నే కనుగొన్నాడు. మిగతావి ఏమయ్యాయి? చేతివ్రాత ప్రతులను అన్వేషించడానికి తన దగ్గర డబ్బులేని కారణంగా టిషెండార్ఫ్ ఆర్థిక మద్దతు కోసం ఐశ్వర్యవంతుడైన ఒక వ్యక్తిని ఆశ్రయించాడు, ప్రాచీన చేతివ్రాత ప్రతులను అన్వేషించడానికి మళ్ళీ తన స్వదేశాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ యాత్ర ప్రారంభించే ముందు ఆయన రష్యాకు చెందిన జార్‌ను అభ్యర్థించాడు.
జార్ ఆసక్తి చూపించడం
రష్యన్ ఆర్థడాక్స్ మతాన్ని స్వీకరించిన సువిశాల దేశమైన రష్యాలో ఒక ప్రొటస్టెంటు విద్వాంసుడైన తనకు ఎలాంటి ఆహ్వానం లభిస్తుందో అని టిషెండార్ఫ్ ఎన్నోసార్లు అనుకొని ఉండవచ్చు. సంతోషకరమైన విషయమేమిటంటే, రష్యా మార్పులకు, సంస్కరణలకు అనుకూలమైన శకంలోకి ప్రవేశించింది. ఆ దేశంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మహారాణి క్యాథరిన్-2 (ఆమెకు క్యాథరిన్ ద గ్రేట్ అని కూడా పేరుంది) సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన ఇంపీరియల్ లైబ్రరీని 1795లో స్థాపించడానికి దారితీసింది. రష్యాకు చెందిన మొదటి సార్వజనిక గ్రంథాలయంగా అది అధిక పరిమాణంలో ముద్రిత సమాచారాన్ని కోట్లాదిమందికి అందుబాటులో ఉండేలా చేసింది.
అయితే, యూరప్‌లో ఉన్న మంచి గ్రంథాలయాల్లో ఒకటిగా కొనియాడబడిన ఆ ఇంపీరియల్ లైబ్రరీకి ఒక లోపం ఉంది. దానిని స్థాపించి యాభై సంవత్సరాలైనా ఆ గ్రంథాలయంలో ఆరు హెబ్రీ చేతివ్రాత ప్రతులే ఉన్నాయి. బైబిలు భాషలు, అనువాదాల అధ్యయనాల విషయంలో పెరుగుతున్న ఆసక్తికి తగ్గట్టుగా అది చేతివ్రాత ప్రతులను సమకూర్చలేకపోయింది. క్యాథరిన్-2 విద్వాంసులను, యూరప్‌కు చెందిన విశ్వవిద్యాలయాలకు హెబ్రీ అధ్యయనం చేయడానికి పంపించింది. విద్వాంసులు తిరిగివచ్చిన తర్వాత రష్యాకు చెందిన ప్రధాన ఆర్థడాక్స్ సెమినరీలలో హెబ్రీ భాషా తరగతులు ఏర్పడ్డాయి, మొట్టమొదటిసారిగా రష్యాకు చెందిన విద్వాంసులు బైబిలును, ప్రాచీన హెబ్రీ నుండి రష్యన్‌లోకి ఖచ్చితంగా అనువదించే పనిని ప్రారంభించారు. అయితే నిధులలేమి, సాంప్రదాయక చర్చి నాయకుల నుండి వ్యతిరేకత కూడా వారికి ఎదురైంది. బైబిలు జ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నవారికి నిజమైన జ్ఞానోదయం కలగడం ఆరంభం కాలేదు.
జార్ అయిన అలెగ్జాండర్-2, టిషెండార్ఫ్ లక్ష్యానికి ఉన్న ప్రాముఖ్యతను గ్రహించి ఆ లక్ష్యసాధనకు ఆర్థిక మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. కొందరు “అసూయతో, ఉన్మాదంతో కూడిన వ్యతిరేకత” ప్రదర్శించినప్పటికీ, టిషెండార్ఫ్ సెప్టాజింట్‌కు * చెందిన మిగతా ప్రతులతో సీనాయి నుండి తిరిగి వచ్చాడు. కొంతకాలం తర్వాత ఆ ప్రతులకు కోడెక్స్ సైనాయ్‌టికస్ అని పేరు పెట్టబడింది, ఇప్పటికీ అది ఉనికిలో ఉన్న అతి పురాతన బైబిలు చేతివ్రాత ప్రతులలో ఒకటి. టిషెండార్ఫ్, సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు తిరిగివచ్చిన తర్వాత జార్ నివాసమైన ఇంపీరియల్ వింటర్ ప్యాలెస్‌కు హుటాహుటిన వెళ్ళాడు. “విశ్లేషాత్మకమైన, బైబిలు సంబంధమైన అతి గొప్ప ప్రణాళికల్లో ఒకటిగా” పేరుగాంచగల ప్రతిని అంటే క్రొత్తగా కనుగొన్న చేతివ్రాత ప్రతికి సంబంధించిన ప్రచురిత కాపీని తయారుచేసే ప్రణాళికకు మద్దతు ఇవ్వమని ఆయన జార్‌కు ప్రతిపాదించాడు, ఆ చేతివ్రాత ప్రతి కొంతకాలం తర్వాత ఇంపీరియల్ గ్రంథాలయంలో ఉంచబడింది. జార్ ఆ ప్రతిపాదనకు అంగీకరించాడు, ఉత్తేజితుడైన టిషెండార్ఫ్ ఆ తర్వాత ఇలా వ్రాశాడు: “మన తరానికి దైవిక నిర్దేశం ఇవ్వబడింది . . . మనం దేవుని వాక్యపు వాస్తవ మూలపాఠంలో ఏమి వ్రాయబడింది అనే విషయం గురించి మన మీద స్పష్టమైన వెలుగు ప్రసరించడానికీ, బైబిలు ప్రామాణికతను రుజువు చేయడం ద్వారా బైబిలుకు సంబంధించిన సత్యాన్ని సమర్థించడానికీ, మనకు సైనాటిక్ బైబిల్ సహాయం చేస్తుంది.”
క్రిమియా నుండి అమూల్యమైన బైబిలు చేతివ్రాత ప్రతులు
ఈ శీర్షిక ప్రారంభంలో అమూల్యమైన బైబిలు చేతివ్రాత ప్రతుల కోసం అన్వేషిస్తున్న మరో విద్వాంసుడి గురించి పేర్కొనబడింది. ఆయన ఎవరు? టిషెండార్ఫ్ రష్యాకు తిరిగి రావడానికి కొన్ని సంవత్సరాల ముందు ఇంపీరియల్ లైబ్రరీకి ఒక ప్రతిపాదన లభించింది, ఆ ప్రతిపాదన ఎంత ఆశ్చర్యకరమైనదంటే అది జార్ దృష్టిని ఆకర్షించింది, యూరప్ అంతటి నుండి రష్యాకు విద్వాంసులను రప్పించింది. వారు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. వారి ముందు వ్రాతప్రతుల, ఇతరవస్తువుల అపరిమితమైన సంగ్రహం ఉంది, అది యూరప్‌లోని గ్రంథాలయాలన్నిటిలో ఉన్న ప్రాచీన చేతివ్రాత ప్రతుల సంచయాల మొత్తానికన్నా తొమ్మిది రెట్లు పెద్దది. ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ఆ గ్రంథసంచయంలో 2,412 ఐటెమ్స్ ఉన్నాయి, ఆ ఐటెమ్స్‌లో 975 వ్రాతప్రతులు, గ్రంథపు చుట్టలు ఉన్నాయి. వాటిలో 45 బైబిలు చేతివ్రాత ప్రతులు పదవ శతాబ్దానికన్నా ముందటి కాలానివి. అది నమ్మశక్యంకానిదిగా అనిపించినా ఆ చేతివ్రాత ప్రతులన్నిటినీ అబ్రహామ్ ఫిర్కోవిచ్ అనే వ్యక్తి దాదాపు ఒంటరిగా సేకరించాడు, ఆయన కరేయ తెగకు చెందిన విద్వాంసుడు, అప్పుడు ఆయన 70వ పడిలో ఉన్నాడు! అయితే కరేయ తెగవారు ఎవరు? *
ఆ ప్రశ్న జార్ దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. రష్యా ఇంతకుముందు ఇతర దేశాల ఆధీనంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోవడం ద్వారా తన సరిహద్దులను విస్తరించుకుంది. అది క్రొత్త జాతుల గుంపులను రాజ్యంలోకి తీసుకువచ్చింది. నల్ల సముద్ర తీరంలో ఉన్న ఆకర్షణీయమైన క్రిమియా ప్రాంతంలో, యూదుల్లా కనిపించినా టర్కీ దేశానికి సంబంధించిన ఆచారాలు పాటిస్తూ టటర్ భాషకు సంబంధించిన భాషను మాట్లాడే ప్రజలు నివసించేవారు. సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనమైన తర్వాత బబులోనుకు చెరగా తీసుకొనిపోబడిన యూదుల నుండి తాము వచ్చామని ఆ కరేయులు నమ్మారు. యూదుల్లోని రబ్బీల్లా కాక వారు టాల్ముడ్‌ను తిరస్కరించి, లేఖనాల అధ్యయనాన్ని నొక్కిచెప్పారు. క్రిమియన్ ప్రాంతపు కరేయులు తమకూ యూదుల్లోని రబ్బీలకూ ఉన్న వ్యత్యాసాన్ని జార్‌కు స్పష్టం చేయడంలో ఆసక్తి కనబరిచి, తద్వారా వారు తమకు ప్రత్యేక హోదా పొందాలనుకున్నారు. కరేయుల సంపత్తిగావున్న ప్రాచీన చేతివ్రాత ప్రతులను చూపించడం ద్వారా, బబులోనుకు చెరగా తీసుకొనిపోబడిన తర్వాత క్రిమియాకు వలస వచ్చిన యూదుల నుండి తాము వచ్చామని నిరూపించాలని వారు ఆశించారు.
ఫిర్కోవిచ్ ప్రాచీన గ్రంథాల కోసం, చేతివ్రాత ప్రతుల కోసం అన్వేషించడం ప్రారంభించాడు, ఆయన తన అన్వేషణను క్రిమియాకు చెందిన చూఫుట్‌కాలేలో ఉన్న కొండల్లోని చిన్నచిన్న ఇళ్ల నుండి ప్రారంభించాడు. కొండల్లో నుండి తొలిచిన రాళ్ళతో కట్టిన ఆ చిన్న ఇళ్ళల్లో కరేయులు ఎన్నో తరాలు జీవించారు, ఆరాధించారు. కరేయులు దైవ నామమైన యెహోవా అనే పేరు కనిపించే చిరిగిపోయిన లేఖనాల ప్రతులను ఎప్పుడూ నాశనం చేసేవారుకాదు, ఎందుకంటే వారు అలాంటి చర్యను దైవద్రోహంగా భావించేవారు. ఆ చేతివ్రాత ప్రతులను జాగ్రత్తగా గెనీజా అని పిలిచే చిన్న కొట్టులో పెట్టేవారు, హెబ్రీలో దానికి “మరుగైన చోటు” అని అర్థం. కరేయులకు దైవిక నామంపట్ల ఎంతో గౌరవం ఉంది కాబట్టి వారు అలాంటి చర్మపు కాగితాలను అరుదుగా ముట్టుకొనేవారు.
వందలాది సంవత్సరాలుగా దుమ్ము పేరుకొని పోయినప్పటికీ, ఆ గెనీజా స్థలాలను ఫిర్కోవిచ్ జాగ్రత్తగా పరిశోధించాడు. ఒక స్థలంలో ఆయన సా.శ. 916కు చెందిన పేరుగాంచిన చేతివ్రాత ప్రతిని కనుగొన్నాడు. తర్వాతి ప్రవక్తలకు చెందిన పీటర్స్‌బర్గ్ కోడెక్స్‌గా పిలువబడే ఆ చేతివ్రాత ప్రతి, ఉనికిలో ఉన్న హెబ్రీ లేఖనాల పురాతన ప్రతుల్లో ఒకటి.
ఫిర్కోవిచ్ చాలా చేతివ్రాత ప్రతులను పోగు చేయగలిగాడు, తాను పోగుచేసిన విస్తారమైన ఆ చేతివ్రాత ప్రతుల్ని ఇంపీరియల్ గ్రంథాలయానికి ఇవ్వాలని 1859లో
నిర్ణయించుకున్నాడు. 1862లో గ్రంథసంచయాన్ని ఆ కాలానికి పెద్ద మొత్తంగా పరిగణించబడే 1,25,000 రూబుల్స్‌కు గ్రంథాలయం కోసం కొనడానికి అలెగ్జాండర్-2 సహాయం చేశాడు. ఆ కాలంలో ప్రతీ సంవత్సరం గ్రంథాలయం కోసం వెచ్చించబడే పూర్తి బడ్జెట్ 10,000 రూబుల్స్ మించేది కాదు! పోగుచేసిన వాటినుండి సంపాదించిన వాటిలో పేరుగాంచిన లెనిన్‌గ్రాడ్ కోడెక్స్ (B 19A) కూడా ఉంది. అది 1008కి చెందినది, అది పూర్తి హెబ్రీ లేఖనాల ప్రతుల్లో ప్రపంచంలో అతి పురాతనమైనది. అది “బహుశా బైబిలు చేతివ్రాత ప్రతుల్లో ఏకైక అత్యంత ప్రాముఖ్యమైన చేతివ్రాత ప్రతి, ఎందుకంటే ఆధునిక ప్రచురణలో సవరణలు చేసి మూలపాఠాన్ని స్థిరపరచడానికి అది సహాయం చేసింది.” (ఈ ఆర్టికల్‌తోపాటు ఇవ్వబడిన బాక్సును చూడండి) అదే సంవత్సరంలో అంటే 1862లోనే ప్రపంచమంతా అభినందించే విధంగా టిషెండార్ఫ్ తయారుచేసిన కోడెక్స్ సైనాయ్‌టికస్ ప్రచురించబడింది.ఆధునిక కాలాల్లో ఆధ్యాత్మిక జ్ఞానోదయం
ద నేషనల్ లైబ్రరీ ఆఫ్ రష్యాగా ఇప్పుడు పిలువబడుతున్న ఆ గ్రంథాలయం ప్రాచీన చేతివ్రాత ప్రతులకు సంబంధించిన గ్రంథసంచయాలలో ప్రపంచంలోనే అతి పెద్దది. * రష్యా చరిత్రను ప్రతిబింబిస్తూ ఆ గ్రంథాలయం పేరు రెండు శతాబ్దాల కాలంలో ఏడుసార్లు మార్చబడింది. వాటిలో పేరుగాంచిన ఒక పేరు ద స్టేట్ సాల్టికోఫ్-స్కిడ్రిన్ పబ్లిక్ లైబ్రరీ. 20వ శతాబ్దపు సంక్షోభం గ్రంథాలయాన్ని పాడు చేయకుండాపోలేదు, అయితే దానిలోని చేతివ్రాత ప్రతులు మాత్రం రెండు ప్రపంచ యుద్ధాల కాలంలోను, లైనిన్‌గ్రాడ్ ముట్టడి కాలంలోను నాశనం కాలేదు. మనం ఆ చేతివ్రాత ప్రతుల నుండి ఎలా ప్రయోజనం పొందుతాం?
చాలా ఆధునిక బైబిలు అనువాదాలకు ప్రాచీన చేతివ్రాత ప్రతులు నమ్మదగిన ఆధారం. అవి యథార్థ సత్యాన్వేషకులు, పరిశుద్ధ లేఖనాల ఎంతో ఖచ్చితమైన అనువాదాన్ని చదివేందుకు వీలు కల్పించాయి. యెహోవాసాక్షులు ప్రచురించి 1961లో పూర్తి బైబిలుగా విడుదల చేసిన పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము (ఆంగ్లం)నకు సైనాయ్‌టికస్, లెనిన్‌గ్రాడ్ కోడెక్స్‌లు విలువైన సహాయం అందజేశాయి. ఉదాహరణకు, న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ కమిటీ ఉపయోగించిన బిబ్లియా హెబ్రెయికా స్టూట్‌గార్టెన్స్‌యా, కిటెల్స్ బిబ్లియా హెబ్రెయికా గ్రంథాలు లెనిన్‌గ్రాడ్ కోడెక్స్ మీద ఆధారపడినవి, ఆ గ్రంథాలు టెట్రాగ్రమాటన్ లేక దైవిక నామాన్ని మూలపాఠంలో 6,828 సార్లు ఉపయోగించాయి.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ప్రశాంత గ్రంథాలయానికి, దానిలోని చేతివ్రాత ప్రతులకు తామెంత ఋణపడివున్నామో చాలా కొద్దిమంది బైబిలు పాఠకులకే తెలుసు, ఆ చేతివ్రాత ప్రతులలో కొన్నింటికీ నగరపు పాత పేరైన లెనిన్‌గ్రాడ్ ఉంది. అయినా, మనం ఆధ్యాత్మిక వెలుగునిచ్చే బైబిలు గ్రంథకర్తయైన యెహోవాకు ఎంతో ఋణపడివున్నాం. అందుకే కీర్తనకర్త ఆయనకు ఇలా విన్నవించుకున్నాడు: “నీ వెలుగును నీ సత్యమును బయలు దేరజేయుము; అవి నాకు త్రోవచూపును.”—కీర్తన 43:3.
[అధస్సూచీలు]
^ పేరా 11 ఆయన సా.శ. నాల్గవ శతాబ్దానికి చెందిన క్రైస్తవ గ్రీకు లేఖనాల పూర్తి ప్రతిని కూడా తీసుకువచ్చాడు.
^ పేరా 13 కరేయుల గురించిన అధిక సమాచారం కోసం కావలికోట జూలై 15, 1995 సంచికలోని “కరేయులు వారి సత్యాన్వేషణ” అనే శీర్షిక చూడండి.
^ పేరా 19 కోడెక్స్ సైనాయ్‌టికస్‌లోని చాలా భాగాలు బ్రిటీష్ పురావస్తు ప్రదర్శనశాలకు అమ్మబడ్డాయి. ద నేషనల్ లైబ్రరీ ఆఫ్ రష్యాలో అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
[13వ పేజీలోని బాక్సు]
వారికి దేవుని నామం తెలుసు, దానిని ఉపయోగించారు
యెహోవా తన జ్ఞానాన్ని ఉపయోగించి తన వాక్యమైన బైబిలు ఆధునిక కాలాలవరకు భద్రపరచబడేలా చూశాడు. దానిని భద్రపరచడంలో చరిత్రంతటిలో కష్టించి పనిచేసిన లేఖికుల పాత్ర కూడా ఉంది. ఆ లేఖికులలో సా.శ. ఆరవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం వరకు అతి జాగురూకతతో పనిచేసిన నైపుణ్యవంతులైన హెబ్రీ లేఖికులైన మాసొరెట్‌లు ఉన్నారు. ప్రాచీన హెబ్రీ అచ్చులు లేకుండా వ్రాయబడింది. కొంతకాలం గడిచిన తర్వాత, హెబ్రీ స్థానంలో అరమిక్ వచ్చింది కాబట్టి అలా అచ్చులు లేకుండా వ్రాయబడడం సరైన ఉచ్ఛారణ కోల్పోయే ప్రమాదాన్ని పెంచింది. మాసొరెట్‌లు హెబ్రీ పదాల సరైన ఉచ్ఛారణను సూచించేందుకు బైబిలు మూలపాఠానికి అచ్చుల గుర్తులను చేర్చే పద్ధతిని అభివృద్ధి చేశారు.
గమనార్హంగా లెనిన్‌గ్రాడ్ కోడెక్స్‌లోని మాసొరెటిక్ అచ్చుల గుర్తులు, దైవిక నామంలోని నాలుగు హెబ్రీ హల్లుల ఉచ్ఛారణను అంటే టెట్రాగ్రమాటన్ ఉచ్ఛారణను యెవాహ్, యెవిహ్, యెహోవా అని ఉచ్ఛరించడానికి వీలు కల్పిస్తున్నాయి. నేడు “యెహోవా” అనే ఉచ్ఛారణ చాలా ప్రసిద్ధి చెందినది. బైబిలు రచయితలకు, ప్రాచీన కాలానికి చెందిన ఇతరులకు దైవిక నామం సజీవమైన, పరిచయమున్న పేరు. నేడు, ‘యెహోవాయే సర్వలోకంలో మహోన్నతుడని’ గుర్తించే లక్షలాదిమందికి దేవుని నామం తెలుసు, వారు దానిని ఉపయోగిస్తున్నారు.—కీర్తన 83:18.
[10వ పేజీలోని చిత్రం]
ద నేషనల్ లైబ్రరీకి చెందిన చేతివ్రాత ప్రతుల గది
[11వ పేజీలోని చిత్రం]
మహారాణి క్యాథరిన్-2
[11వ పేజీలోని చిత్రాలు]
కాన్‌స్టాంటిన్ వాన్ టిషెండార్ఫ్ (మధ్యలో), రష్యా జార్ అయిన అలెగ్జాండర్-2
[12వ పేజీలోని చిత్రం]
అబ్రహామ్ ఫిర్కోవిచ్
[10వ పేజీలోని చిత్రసౌజన్యం]
రెండు చిత్రాలు: National Library of Russia, St. Petersburg
[11వ పేజీలోని చిత్రసౌజన్యం]
క్యాథరిన్-2: National Library of Russia, St. Petersburg; అలెగ్జాండర్-2: Spamers Illustrierte Weltgeschichte, Leipzig, 1898 అనే పుస్తకం నుండి