“వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును”
“వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును”
వివేకంగల వ్యక్తికి సమస్యలను పరిష్కరించడంలో చాతుర్యం, ప్రజ్ఞ, సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, సునిశితమైన గ్రహింపు, విచక్షణా జ్ఞానం, యుక్తాయుక్త పరిజ్ఞానం, వివేచన, జ్ఞానం ఉంటాయి. ఆయన మోసగాడిగా, కుట్రపన్నేవాడిగా ఉండడు. “వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు” అని సామెతలు 13:16 చెబుతోంది. అవును వివేకం లేక యుక్తాయుక్త పరిజ్ఞానం కోరదగిన లక్షణం.
మన అనుదిన జీవితంలో మనం వివేకాన్ని ఎలా ప్రదర్శించవచ్చు? మనం చేసుకునే ఎంపికలు, మనం ఇతరులతో వ్యవహరించే విధానం, వివిధ పరిస్థితులకు మనం ప్రతిస్పందించే తీరు వంటివాటిలో ఈ లక్షణం ఎలా కనిపిస్తుంది? వివేకంగల వ్యక్తికి లభించే ప్రతిఫలాలేమిటి? వారు ఎలాంటి విపత్తులను తప్పించుకుంటారు? మనం సామెతలు 14:12-25లో చదువునట్లుగా, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను ఈ ప్రశ్నలకు ఆచరణాత్మక సమాధానాలు ఇస్తున్నాడు. *
మీ మార్గాన్ని జ్ఞానయుక్తంగా ఎంచుకోండి
జ్ఞానయుక్తమైన ఎంపికలు చేసుకోవడానికి, జీవితంలో విజయం సాధించడానికి, తప్పొప్పులను తెలుసుకోగల సామర్థ్యం తప్పక అవసరం. అయితే, బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును.” (సామెతలు 14:12) కాబట్టి మనం నిజంగా సరైనదేదో, సరైనదానిలా కనిపించేదేదో గ్రహించడం నేర్చుకోవాలి. “మరణమునకు త్రోవతీయును” అనే పదబంధం మూలభాషలో “మరణమునకు త్రోవతీయు మార్గములు” అని ఉంది, కాబట్టి అలాంటి మోసకరమైన మార్గాలు అనేకం ఉన్నాయని అది సూచిస్తోంది. మనం తెలుసుకోవలసిన, నివారించవలసిన కొన్ని అంశాలను పరిశీలించండి.
ఈ లోకంలోని ధనవంతులు, పేరుప్రఖ్యాతులు గలవారు సాధారణంగా అభినందించవలసిన గౌరవనీయులుగా దృష్టించబడతారు. వారి సామాజిక, ఆర్థిక విజయాలు వారు పనిచేసేతీరు సరైనదన్నట్లు కనిపించేలా చేయవచ్చు. అలాంటి వ్యక్తులు చాలామంది డబ్బు లేదా పేరు సంపాదించుకోవడానికి అనుసరించే విధానాలేమిటి? వారు అనుసరించే విధానాలు ఎప్పుడూ సరైనవిగా, నీతిగలవిగా ఉంటాయా? ఇకపోతే, తమ మత నమ్మకాలపట్ల ప్రశంసనీయమైన ఆసక్తి కనబరిచే వ్యక్తులు మరి కొందరున్నారు. కానీ వారి నిజాయితీ వారి నమ్మకాలు సరైనవని నిజంగా నిరూపిస్తుందా?—రోమీయులు 10:2, 3.
స్వీయమోసం మూలంగా కూడా ఒక మార్గం ఆ వ్యక్తికి సరైనదిగా కనిపించవచ్చు. మనం వ్యక్తిగతంగా సరైనది అని భావించే దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే, మోసకరమైన మార్గనిర్దేశిని అయిన హృదయంపై ఆధారపడినట్లే అవుతుంది. (యిర్మీయా 17:9) బోధించబడని, శిక్షణ ఇవ్వబడని మనస్సాక్షి మనం తప్పుడు మార్గాన్ని సరైన మార్గం అనుకునేలా చేయగలదు. మరి సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి మనకు ఏది సహాయం చేయగలదు?
మనం “మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు” సంపాదించుకోవాలంటే, దేవుని వాక్యంలోని లోతైన సత్యాలను దీక్షతో వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం ఆవశ్యకం. అంతేగాక బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంలో “అభ్యాసము” ద్వారా మనం ఈ జ్ఞానేంద్రియాలకు శిక్షణ ఇచ్చుకోవాలి. (హెబ్రీయులు 5:14) కేవలం సరైనదిగా కనిపించే మార్గం, ‘జీవమునకు పోవు ఇరుకు ద్వారము’ నుండి మనం ప్రక్కకు తొలగిపోయేలా చేయడానికి అనుమతించకుండా జాగ్రత్త వహించాలి.—మత్తయి 7:13, 14.
“హృదయమున దుఃఖము” ఉన్నప్పుడు
మనకు మనశ్శాంతి లేనప్పుడు మనం సంతోషంగా ఉండగలమా? నవ్వు, ఉల్లాసం లోతుగా పాతుకుపోయిన బాధను తగ్గించగలవా? కృంగుదల భావాలను అధిగమించడానికి మద్యం, మత్తుపదార్థాలు ఉపయోగించడం లేదా విచ్చలవిడి జీవితం గడపడం ద్వారా అలాంటి భావాలను పోగొట్టుకోవాలని చూడడం వివేకవంతమైనదా? కానే కాదు. “ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును” అని జ్ఞానవంతుడైన రాజు చెబుతున్నాడు.—సామెతలు 14:13ఎ.
నవ్వు బాధ కనిపించకుండా కప్పేయవచ్చు గానీ అది బాధను తొలగించలేదు. “ప్రతిదానికి సమయము కలదు” అని బైబిలు చెబుతోంది. నిజానికి, “ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు” ప్రతిదానికి సమయం ఉంది. (ప్రసంగి 3:1, 4) కృంగుదల తొలగిపోనప్పుడు, అవసరమైతే “వివేకముగల” నడిపింపు తీసుకోవడం ద్వారా మనం దాన్ని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి. (సామెతలు 24:6) * నవ్వు, ఉల్లాసాలకు కొంత విలువుంది కానీ వాటి విలువ పరిమితం. అనుచితమైన ఉల్లాసం, మితిమీరిన వినోదం గురించి హెచ్చరిస్తూ సొలొమోను ఇలా చెబుతున్నాడు: “సంతోషము తుదకు వ్యసనమగును.”—సామెతలు 14:13బి.
భక్తి విడిచిన వ్యక్తి, మంచి వ్యక్తి —ఎలా తృప్తిపొందుతారు?
ఇశ్రాయేలు రాజు ఇంకా ఇలా చెబుతున్నాడు: “భక్తి విడిచినవాని మార్గములు వానికే వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును.” (సామెతలు 14:14) భక్తి విడిచిన వ్యక్తి, మంచి వ్యక్తి తమ వ్యవహారాల ఫలితాలనుబట్టి ఎలా తృప్తిపొందుతారు?
భక్తి విడిచిన వ్యక్తి దేవునికి లెక్క అప్పగించాలనే విషయాన్ని పట్టించుకోడు. కాబట్టి, యెహోవా దృష్టికి సరైనది చేయడం భక్తి విడిచిన వ్యక్తికి ప్రాముఖ్యమైనది కాదు. (1 పేతురు 4:3-5) అలాంటి వ్యక్తి వస్తుపరమైన జీవనవిధానంవల్ల కలిగే ప్రతిఫలాలనుబట్టి తృప్తిపడతాడు. (కీర్తన 144:11-15ఎ) అయితే మంచి వ్యక్తి దేవుని దృష్టికి సరైనది చేయడంలో ఆసక్తి కలిగివుంటాడు. ఆయన తన వ్యవహారాలన్నిటిలోనూ దేవుని నీతి యుక్తమైన ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉంటాడు. అలాంటి వ్యక్తి వచ్చిన ఫలితాలనుబట్టి తృప్తిపడతాడు ఎందుకంటే యెహోవా ఆయనకు దేవుడు, సర్వోన్నతుని సేవ చేయడం ద్వారా ఆయన అనుపమానమైన ఆనందాన్ని పొందుతాడు.—కీర్తన 144:15బి.
‘ప్రతి మాట నమ్మకండి’
జ్ఞానములేని వ్యక్తి విధానాలకు, వివేకియైన వ్యక్తి విధానాలకు ఉన్న తేడాను చూపిస్తూ సొలొమోను ఇలా చెబుతున్నాడు: “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.” (సామెతలు 14:15) వివేకముగల వ్యక్తి ఊరకనే మోసపోడు. ఆయన తాను వినేదంతా నమ్మే బదులు లేక ఇతరుల అభిప్రాయాలను ఊరికే అంగీకరించే బదులు తన అడుగులను జాగ్రత్తగా పరిశీలించుకుంటాడు. అందుబాటులో ఉన్న వాస్తవాలన్నీ సమకూర్చుకుని ఆయన జ్ఞానంతో వ్యవహరిస్తాడు.
ఉదాహరణకు, “దేవుడు ఉన్నాడా?” అనే ప్రశ్నే తీసుకోండి. జ్ఞానములేని వ్యక్తి అందరూ నమ్మేదే నమ్ముతాడు లేదా ప్రముఖులు విశ్వసించేదే విశ్వసిస్తాడు. అయితే వివేకంగల వ్యక్తి వాస్తవాలను పరిశీలించడానికి సమయం వెచ్చిస్తాడు. ఆయన రోమీయులు 1:20; హెబ్రీయులు 3:3 వంటి లేఖనాల గురించి ఆలోచిస్తాడు. వివేకంగల వ్యక్తి ఆధ్యాత్మిక విషయాల్లో ఊరికే మతనాయకులు చెప్పే విషయాలను అంగీకరించడు. ప్రేరేపిత లేఖనాలు ‘దేవుని సంబంధమైనవో కావో పరీక్షిస్తాడు.’—1 యోహాను 4:1.
‘ప్రతి మాట నమ్మవద్దు’ అని ఇవ్వబడిన ఉపదేశాన్ని లక్ష్యపెట్టడం ఎంత జ్ఞానవంతమైనదో కదా! క్రైస్తవ సంఘంలో ఇతరులకు ఉపదేశించే బాధ్యత అప్పగించబడినవారు ముఖ్యంగా దీన్ని గంభీరంగా తీసుకోవాలి. ఉపదేశం ఇచ్చే వ్యక్తికి జరిగిన విషయం అంతా తెలిసి ఉండాలి. ఆయన తానిచ్చే ఉపదేశం అసమంజసమైనదిగా, ఏకపక్షంగా ఉండకూడదంటే జాగ్రత్తగా విని అన్ని వైపుల నుండి వాస్తవాలను సేకరించుకోవాలి.—సామెతలు 18:13; 29:20.
“దుర్యోచనలుగలవాడు ద్వేషింపబడును”
జ్ఞానముగల వ్యక్తికి, జ్ఞానములేని వ్యక్తికి మధ్యనున్న మరో తేడాను చూపిస్తూ ఇశ్రాయేలు రాజు ఇలా చెబుతున్నాడు: “జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును, బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలుగలవాడు ద్వేషింపబడును.”—సామెతలు 14:16, 17.
జ్ఞానముగల వ్యక్తి తప్పు మార్గాన్ని అనుసరించడంవల్ల కలిగే పర్యవసానాలకు భయపడతాడు. కాబట్టి, ఆయన జాగ్రత్తగా ఉంటూ చెడును నివారించడానికి తనకు సహాయం చేసే ఎలాంటి ఉపదేశాన్నైనా విలువైనదిగా ఎంచుతాడు. మూర్ఖుడికి అలాంటి భయం ఉండదు. అతడు స్వీయ నమ్మకంతో ఇతరుల ఉపదేశాన్ని అహంకారంగా నిర్లక్ష్యం చేస్తాడు. త్వరగా కోపం తెచ్చుకునే అలాంటి వ్యక్తి మూర్ఖంగా ప్రవర్తిస్తాడు.
“దుర్యోచనలుగలవాడు” అని అనువదించబడిన ఆదిమ భాషా పదానికి రెండు భావాలున్నాయి. అనుకూలభావంలో చూస్తే అది వివేచనను లేక కుశలతను సూచించవచ్చు. (సామెతలు 1:4; 2:11; 3:21) ప్రతికూల భావంలో చూస్తే, ఆ పదబంధం దుష్ట తలంపులను లేక దురాలోచనలను సూచించవచ్చు.—కీర్తన 37:7; 12:2; సామెతలు 24:8.
ఆ ఆదిమ భాషా పదం “దుర్యోచనలుగల” వ్యక్తిని సూచిస్తే, అలాంటి వ్యక్తి ఎందుకు ద్వేషించబడతాడనేది అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. కానీ అది అనుకూల భావాన్ని సూచిస్తే, ఆలోచనా సామర్థ్యంగల వ్యక్తి ఎందుకు ద్వేషించబడతాడు? అయితే వివేచనగల వ్యక్తి వివేచనలేని వ్యక్తులచే ద్వేషించబడడం కూడా నిజం కాదా? ఉదాహరణకు, తమ మానసిక సామర్థ్యాలను ఉపయోగించుకుని “లోకసంబంధులు” కాకుండా ఉండాలని కోరుకునేవారిని లోకం ద్వేషిస్తుంది. (యోహాను 15:19) తమ ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించి, అనుచితమైన ప్రవర్తనకు దూరంగా ఉండేందుకు తోటివారి హానికరమైన ఒత్తిడిని ఎదిరించే క్రైస్తవ యౌవనస్థులు అపహసించబడతారు. వాస్తవమేమిటంటే సత్యారాధకులు అపవాదియైన సాతాను ఆధీనంలోవున్న లోకంచే ద్వేషించబడుతున్నారు.—1 యోహాను 5:19.
‘చెడ్డవారు మంచివారి యెదుట వంగుదురు’
వివేకంగల వ్యక్తికి, జ్ఞానములేని వ్యక్తికి మరో విషయంలో కూడా తేడా ఉంది. “జ్ఞానము లేనివారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు.” (సామెతలు 14:18) జ్ఞానములేని వ్యక్తులు, వివేచనలేక మూర్ఖమైన దానిని ఎంచుకుంటారు. జీవితంలో అదే వారి పరిస్థితి అవుతుంది. మరోవైపు, రాజుకు కిరీటం ఘనత తెచ్చినట్లుగా, వివేకంగల వ్యక్తికి జ్ఞానం ఘనతనిస్తుంది.
“చెడ్డవారు మంచివారి యెదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు.” (సామెతలు 14:19) వేరే మాటల్లో చెప్పాలంటే, చివరకు మంచి చెడుపై తప్పక విజయం సాధిస్తుంది. దేవుని ప్రజలు నేడు అనుభవిస్తున్న సంఖ్యాపరమైన అభివృద్ధిని, ఉన్నత జీవిత విధానాన్ని పరిశీలించండి. యెహోవా సేవకులపై కుమ్మరించబడిన ఈ ఆశీర్వాదాలను చూడడం, కొంతమంది వ్యతిరేకులు యెహోవా సూచనార్థక పరలోక స్త్రీకి ప్రాతినిధ్యం వహిస్తూ భూమిపైనున్న ఆత్మాభిషిక్త శేషము ఎదుట ‘వంగేలా’ చేస్తుంది. దేవుని సంస్థ యొక్క భూసంబంధ భాగం పరలోక భాగానికి నిజంగా ప్రాతినిధ్యం వహిస్తుందని వ్యతిరేకులు కనీసం అర్మగిద్దోను సమయంలోనైనా అంగీకరించక తప్పదు.—యెషయా 60:1, 14; గలతీయులు 6:16; ప్రకటన 16:14, 16.
‘బీదలను కటాక్షించడం’
మానవనైజం గురించి పేర్కొంటూ సొలొమోను ఇలా చెబుతున్నాడు: “దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు.” (సామెతలు 14:20) అపరిపూర్ణ మానవుల విషయంలో ఇదెంత నిజమో కదా! స్వార్థపూరిత దృక్పథంతో వారు బీదవారికంటే గొప్పవారికి ఎక్కువ అభిమానం చూపిస్తారు. ధనవంతునికి చాలామంది స్నేహితులు ఉంటారు, అయితే వారు అతని ధనమంత తాత్కాలికమైనవారే. కాబట్టి మనం ధనంతో లేదా పొగడ్తలతో స్నేహితులను సంపాదించుకోవడాన్ని నివారించవద్దా?
యథార్థంగా మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, మనం ధనవంతులపై అభిమానం చూపిస్తూ బీదలను చిన్నచూపు చూస్తున్నామని తేలిందనుకోండి, అప్పుడేమిటి? అలా అభిమానం చూపించడం బైబిలులో ఖండించబడిందని మనం గ్రహించాలి. అదిలా చెబుతోంది: “తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు.”—సామెతలు 14:21.
కష్టపరిస్థితుల్లో ఉన్నవారిపట్ల మనం కనికరం చూపించాలి. (యాకోబు 1:27) ఇది మనమెలా చేయవచ్చు? డబ్బు, ఆహారం, ఆశ్రయం, వస్త్రాలు, వ్యక్తిగత శ్రద్ధ వంటి “ఈ లోకపు జీవనోపాధి” కల్పించడం ద్వారా అలా చేయవచ్చు. (1 యోహాను 3:17) అలాంటివారిపట్ల అభిమానం చూపించేవారు ధన్యులు, ఎందుకంటే “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35.
వారి పరిస్థితులెలా ఉంటాయి?
“మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అనే సూత్రం వివేకంగల వ్యక్తికీ, మూర్ఖుడికీ వర్తిస్తుంది. (గలతీయులు 6:7) వివేకంగల వ్యక్తి మంచి చేస్తాడు, మూర్ఖుడు కీడు చేస్తాడు. “కీడు కల్పించువారు తప్పిపోవుదురు” అని జ్ఞానియైన రాజు చెబుతున్నాడు. అవును, వారు “తప్పిపోతారు,” అది నిజం. కానీ “మేలు కల్పించువారు కృపాసత్యముల నొందుదురు.” (సామెతలు 14:22) మేలు చేసేవారు ఇతరుల మంచిని, దేవుని ప్రేమపూర్వక దయను పొందుతారు.
కష్టించి పనిచేయడాన్ని విజయంతో ముడిపెడుతూ, మాటలెక్కువ, పని తక్కువను వైఫల్యంతో ముడిపెడుతూ, సొలొమోను ఇలా చెబుతున్నాడు: “ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు.” (సామెతలు 14:23) ఈ సూత్రం మన ఆధ్యాత్మిక ప్రయత్నాలకు తప్పకుండా వర్తిస్తుంది. క్రైస్తవ పరిచర్యలో మనం కష్టించి పనిచేసినప్పుడు, దేవుని వాక్యంలోని జీవదాయక సత్యాన్ని అనేకులకు పరిచయం చేయడమనే ప్రతిఫలాన్ని పొందుతాం. మనకు లభించే ఏ ఆధ్యాత్మిక నియామకాన్నైనా నమ్మకంగా నెరవేర్చడం సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది.
“జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే” అని సామెతలు 14:24 చెబుతోంది. జ్ఞానులు సంపాదించుకోవడానికి కృషి చేసే జ్ఞానమే వారి సంపద, అది వారికి ఘనతను తెస్తుందనే భావాన్ని ఇది ఇవ్వగలదు. మరోవైపున, బుద్ధిహీనుడు మరింత మూఢత్వాన్ని సంపాదించుకుంటాడు. ఒక గ్రంథం ప్రకారం, ఈ సామెత, “ధనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకునేవారికి ఒక ఆభరణం, [అయితే] మూర్ఖులకు చివరకు వారి బుద్ధిహీనతే మిగులుతుంది” అనే భావాన్ని కూడా సూచిస్తుంది. విషయం ఏదైనా, మూర్ఖులకన్నా జ్ఞానవంతులకు ఎక్కువ మేలు జరుగుతుంది.
“నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు” అని ఇశ్రాయేలు రాజు చెబుతున్నాడు. (సామెతలు 14:25) న్యాయసంబంధ విషయాల్లో ఇది ఖచ్చితంగా నిజమే అయినా, మన పరిచర్య విషయంలో దాని అన్వయింపును కూడా పరిశీలించండి. మన రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో దేవుని వాక్య సత్యానికి సాక్ష్యం ఇవ్వడం ఇమిడి ఉంది. ఆ సాక్ష్యం సరైన మనోవైఖరిగల ప్రజలను అబద్ధమతం నుండి విడుదల చేసి, వారి ప్రాణాలను కాపాడుతుంది. మనకు, మన బోధకు విడువక శ్రద్ధనివ్వడం ద్వారా, మనల్ని మనమూ, మనం చెప్పేది వినేవారినీ రక్షించుకుంటాము. (1 తిమోతి 4:16) మనమిది చేయడంలో కొనసాగుతుండగా, జీవితంలోని అన్ని అంశాల్లో మనం వివేకాన్ని ప్రదర్శించేందుకు అప్రమత్తంగా ఉందాము.
[అధస్సూచీలు]
^ పేరా 3 సామెతలు 14:1-11 వచనాల చర్చ కోసం కావలికోట నవంబరు 15, 2004, 26-30 పేజీలు చూడండి.
^ పేరా 11 తేజరిల్లు! (ఆంగ్లం) అక్టోబరు 22, 1987, 11-16 పేజీలు చూడండి.
[18వ పేజీలోని చిత్రం]
మనం ‘మేలు కీడులను వివేచించాలంటే’ లోతైన సత్యాలను దీక్షతో అధ్యయనం చేయడం ఆవశ్యకం
[18వ పేజీలోని చిత్రం]
వస్తుదాయక జీవన విధానం నిజంగా సంతృప్తికరమైనదా?