సత్య బోధలు మీరు వాటిని ఎక్కడ కనుగొనవచ్చు?
సత్య బోధలు మీరు వాటిని ఎక్కడ కనుగొనవచ్చు?
టిబెట్‌లో ఒక వ్యక్తి, ప్రార్థనలు చెక్కబడిన లేదా ప్రార్థనలు ఉన్న ఒక వర్తులాకార పేటికను గుండ్రంగా త్రిప్పుతాడు. ఆ పేటికను గుండ్రంగా త్రిప్పిన ప్రతీసారి తన ప్రార్థనలు పునరుక్తి అవుతాయనేది ఆయన నమ్మకం. ఇండియాలోని ఒక విశాలమైన గృహంలో పూజ చేయడానికి ఒక చిన్నగది ఉంటుంది, అక్కడ చేసే ఆరాధనలో ధూపం వేయడం, పూలు అర్పించడంతోపాటు ఇతర వస్తువులను వివిధ దేవుళ్ళ దేవతల విగ్రహాలకు అర్పించడం ఉంటుంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటలీలో వైభవంగా అలంకరించబడిన చర్చిలో ఒక స్త్రీ, యేసు తల్లియైన మరియ విగ్రహం ముందు మోకాళ్ళూని జపమాల పట్టుకొని ప్రార్థిస్తుంది.
మతం వ్యక్తుల జీవితాలపై చూపించే ప్రభావాన్ని బహుశా మీరు వ్యక్తిగతంగా చూసి ఉండవచ్చు. “మతం . . . ప్రపంచమంతటిలోని సమాజాలలో ప్రధాన పాత్ర పోషించింది, ఇప్పటికీ పోషిస్తోంది” అని ద వరల్డ్ రెలీజయన్స్—అండర్‌స్టాండింగ్ ద లివింగ్ ఫెయిత్ అనే పుస్తకం చెబుతోంది. గాడ్—ఎ బ్రీఫ్ హిస్టరీ అనే పుస్తకంలో దాని గ్రంథకర్త జాన్ బోకర్ ఇలా అభిప్రాయపడ్డాడు: “సాధారణంగా దేవుడు సృష్టికర్తగా, నియంత్రణకర్తగా ఒక పాత్ర నిర్వహించని మానవ సమాజమంటూ ఏదీ లేదు. బలమైన లౌకికవాద సమాజాల్లో కూడా ఈ విషయం వాస్తవం.”
అవును, మతం లక్షలాదిమంది జీవితాలపై ప్రభావం చూపించింది. మానవునికి ఆధ్యాత్మిక అవసరం ఉందనడానికి, ఆధ్యాత్మిక విషయాల కోసం బలమైన కోరిక ఉందనడానికి అది బలమైన రుజువు కాదా? పేరుగాంచిన మనస్తత్త్వ శాస్త్రజ్ఞుడు డాక్టర్ కార్ల్ జి. జంగ్, ది అన్‌డిస్కవర్డ్ సెల్ఫ్ అనే తన పుస్తకంలో, ఉన్నత శక్తిని ఆరాధించే అవసరం గురించి పేర్కొంటూ “ఆ అవసరం ఉన్నట్లు వెల్లడికావడాన్ని మానవ చరిత్రంతటిలో గమనించవచ్చు” అని అంటున్నాడు.
అయినా చాలామంది దేవుని మీద నమ్మకం ఉందని గానీ మతం విషయంలో ఆసక్తి ఉందని గానీ చెప్పుకోరు. తమకు పరిచయమున్న మతాలు తమ ఆధ్యాత్మిక అవసరాన్ని
తీర్చలేకపోయినందుకే దేవుని ఉనికి గురించి కొందరు అనుమానిస్తారు లేక నిరాకరిస్తారు. మతం అంటే “ఏదో ఒక సూత్రంపట్ల భక్తి, ఖచ్చితమైన విశ్వసనీయత లేక విధేయత, చిత్తశుద్ధి, భక్తిపూర్వక అనురాగం లేక ఆసక్తి అని నిర్వచించబడింది.” ఈ నిర్వచనం ప్రకారం దాదాపు ప్రతీ ఒక్కరూ తమ జీవితాల్లో ఏదో ఒక రకమైన మత సంబంధమైన భక్తిని ప్రదర్శిస్తారు. అలాంటి భక్తిని ప్రదర్శించేవారిలో నాస్తికులు కూడా ఉన్నారు.వేలాది సంవత్సరాల మానవ చరిత్రలో, మానవుడు తన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు, ఆయన అనేక ఆరాధనా విధానాలను ప్రయత్నించేలా చేసింది. దాని ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా అంతులేని వివిధ మతసంబంధ అభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు దాదాపు మతాలన్నీ ఒక ఉన్నత శక్తి ఉందనే నమ్మకాన్ని ప్రోత్సహించినా ఆ శక్తి ఎవరు లేక ఆ శక్తి ఏమిటి అనే విషయంలో వారికి వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. చాలా మత విశ్వాసాలు విముక్తి లేక విడుదలకున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి. అయితే విముక్తి అంటే ఏమిటి, దానిని ఎలా సాధించవచ్చు అనే అంశాల్లో వారి బోధలు విభేదిస్తాయి. అలాంటి అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టే సత్య బోధలను మనం ఎలా గుర్తించవచ్చు?