కోపగించుకోవడం ఎప్పుడు సరైనది?
కోపగించుకోవడం ఎప్పుడు సరైనది?
ప్రసంగి 7:9 లో బైబిలు ఇలా చెబుతోంది: “బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.” మనకు కోపం పుట్టించేలా ఎవరైనా ప్రవర్తిస్తే మనం అతిగా స్పందించకూడదని ఈ వచనం చూపిస్తోంది; బదులుగా మనం క్షమించేవారిగా ఉండాలి.
అలాగని మనం ఏ విషయంలోనైనా, ఎవరి విషయంలోనైనా ఎప్పుడూ కోపం తెచ్చుకోకూడదనీ, ఇతరులు ఎంత గంభీరమైన తప్పులను చేసినా, అవి ఎంత తరచుగా చేసినా మనం క్షమిస్తూ, వాటి పరిష్కారం కోసం మనమేమీ చేయకూడదనీ ప్రసంగి 7:9 చెబుతోందా? అభ్యంతరపడిన వ్యక్తి క్షమించాలని మనకు తెలుసు కాబట్టి మాటలతో, క్రియలతో కోపం పుట్టించడాన్ని మనం తేలికగా తీసుకోవాలా? అలా ఎంతమాత్రమూ కాదు.
యెహోవా దేవుడు ప్రేమకు, కరుణకు, క్షమాపణకు, దీర్ఘశాంతానికి ప్రతిరూపంగా ఉన్నాడు. అయినప్పటికీ, ఎవరో ఒకరు ఆయనకు కోపం పుట్టించిన అనేక సందర్భాల గురించి బైబిలు చెబుతోంది. ఆయన తనకు తీవ్రంగా కోపం కలిగించిన దోషులపై చర్య తీసుకున్నాడు. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.
యెహోవాకు కోపం పుట్టించిన తప్పులు
‘ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడై, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన’ యరొబాము పాపముల గురించి 1 రాజులు 15:30వ వచనం తెలియజేస్తోంది. యూదా రాజైన ఆహాజు గురించి 2 దినవృత్తాంతములు 28:25లో బైబిలు ఇలా చెబుతోంది: “యూదా దేశములోని పట్టణములన్నిటిలోను అతడు అన్యుల దేవతలకు ధూపమువేయుటకై బలిపీఠములను కట్టించి, తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.” న్యాయాధిపతులు 2:11-14లో మరో ఉదాహరణ ఇలా ఉంది: “ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, . . . బయలు దేవతలను పూజించి . . . యెహోవాకు కోపము పుట్టించిరి. . . . కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచుకొనువారిచేతికి వారిని అప్పగించెను.”
యెహోవాకు కోపం పుట్టించిన కారణంగా ఆయన కఠిన చర్య తీసుకున్న ఇతర విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, నిర్గమకాండము 22:18-20లో మనం ఇలా చదువుతాం: “శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు. మృగసంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు.”
ప్రాచీనకాల ఇశ్రాయేలీయులు యెహోవాకు కోపం పుట్టించే గంభీరమైన తప్పులు చేస్తూ నిజమైన పశ్చాత్తాపం చూపించనప్పుడు ఆయన వారిని అలాగే క్షమిస్తూ ఉండలేదు. పశ్చాత్తాపం చూపించకపోగా, యెహోవాకు విధేయత చూపిస్తూ తాము మారుమనస్సు పొందామని సూచించే ఎలాంటి చర్యలూ తీసుకోనప్పుడు దేవుడు ఆ దోషులను చివరకు నాశనం చేశాడు. ఇలా యావత్ జనాంగం ఒకసారి సా.శ.పూ. 607లో బబులోనీయుల చేతిలో, మళ్లీ ఒకసారి సా.శ. 70లో రోమన్ల చేతిలో నాశనమైంది.
అవును, ప్రజలు మాట్లాడే మాటలు, చేసే చెడు పనులనుబట్టి యెహోవా కోపం తెచ్చుకోవడమే కాక, గంభీరమైన పాపాలు చేస్తూ, పశ్చాత్తాపపడని దోషులను ఆయన శిక్షిస్తాడు. అయితే ఇది ప్రసంగి 7:9 వర్ణిస్తున్న వారి సరసన ఆయననూ చేరుస్తుందా? ఎంతమాత్రం లేదు. గంభీరమైన పాపాల విషయంలో ఆయన కోపగించుకోవడం సమర్థనీయమైనదే, అంతేకాక ఆయన ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా న్యాయం తీరుస్తాడు. యెహోవా గురించి బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నియు న్యాయములు. ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు; ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు.”—ద్వితీయోపదేశకాండము 32:4.
ఇతరులకు వ్యతిరేకంగా చేసే గంభీరమైన తప్పులు
ప్రాచీన ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఇతరులకు వ్యతిరేకంగా చేసే గంభీరమైన తప్పులకు తీవ్రమైన పర్యవసానాలు ఉండేవి. నిర్గమకాండము 22:2.
ఉదాహరణకు, ఒక గృహస్థుడు రాత్రివేళ తన ఇంటిలో ప్రవేశించిన దొంగను చంపితే, ఆ గృహస్థునిపై రక్తాపరాధం ఉండదు. ఆయన చేసిన గంభీరమైన నేరానికి శిక్ష అనుభవించవలసినప్పటికీ, ఆయన నిరపరాధి. కాబట్టి మనమిలా చదువుతాం: “దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన [గృహస్థునికి] రక్తాపరాధముండదు.”—అత్యాచారానికి గురైన స్త్రీకి తనను బలవంతం చేసిన వ్యక్తిపై తీవ్ర అభియోగం మోపే హక్కువుంది, ఎందుకంటే అత్యాచారమనేది దేవుని దృష్టిలో గంభీరమైన నేరం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, స్త్రీని బలవంతం చేసిన వ్యక్తి “తన పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసిన” వ్యక్తిలానే మరణశిక్ష అనుభవించాలి. (ద్వితీయోపదేశకాండము 22:25, 26) మనం ఆ ధర్మశాస్త్రం క్రింద లేనప్పటికీ, అది ఘోర అపరాధమైన అత్యాచారం విషయంలో యెహోవా మనోభావమేమిటో అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.
మన కాలంలో కూడా అత్యాచారం కఠిన శిక్షార్హమైన గంభీరమైన నేరంగానే పరిగణించబడుతోంది. అత్యాచారానికి గురైన వ్యక్తికి పోలీసులకు రిపోర్టుచేసే పూర్తి హక్కుఉంది. అలా చేసినప్పుడు అధికారులు ఆ అపరాధిని శిక్షించే అవకాశముంటుంది. ఒకవేళ పిల్లలు అత్యాచారానికి గురైతే వారి తల్లిదండ్రులు చొరవ తీసుకొని పోలీసులకు రిపోర్టు చేయవచ్చు.
చిన్నచిన్న తప్పులు
అయితే కోపానికి కారణమయ్యే చిన్నచిన్న వివాదాలకు అధికారులు తీసుకోవలసిన చర్య అవసరం ఉండదు. అందువల్ల, ఇతరులు చేసే చిన్నచిన్న తప్పుల విషయంలో మత్తయి 18:21, 22.
మనం అధిక కోపం తెచ్చుకొనే బదులు వారిని క్షమించేవారిగా ఉండాలి. మనం ఎంత తరచుగా క్షమించాలి? అపొస్తలుడైన పేతురు, యేసును ఇలా అడిగాడు: “ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా?” దానికి యేసు ఇలా జవాబిచ్చాడు: “ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.”—అదేసమయంలో, ఇతరులకు కోపం పుట్టించే పనులు చేయకుండా ఉండేలా ప్రయత్నించడానికి మనం మన క్రైస్తవ వ్యక్తిత్వానికి ఎల్లప్పుడూ మెరుగులు దిద్దుకుంటూ ఉండాలి. ఉదాహరణకు, ఇతరులతో మీరు కొన్నిసార్లు కర్కషంగా, అనుచితంగా, అవమానకరంగా వ్యవహరిస్తారా? అలాంటివి ఇతరులకు కోపం పుట్టిస్తాయి. కోపగించుకున్నాడని, క్షమించడం అతని బాధ్యతేనని ఆ వ్యక్తిని నిందించే బదులు, ఆ వ్యక్తి కోపగించుకోవడానికి తానే కారణమని తప్పుచేసిన వ్యక్తి గ్రహించాలి. మొదటిగా, ఆ వ్యక్తి ఇతరులకు కోపం పుట్టించని రీతిలో తన క్రియలను, సంభాషణను అదుపుచేసుకొనేందుకు కృషిచేయాలి. ఇలా ప్రయత్నించడం ఇతరుల భావాలను గాయపరిచే సందర్భాలను గణనీయంగా తగ్గిస్తుంది. బైబిలు మనకు ఇలా గుర్తుచేస్తోంది: “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.” (సామెతలు 12:18) అనుకోకుండా మనం ఇతరులకు కోపం పుట్టించినప్పుడు, క్షమాపణ అడగడం ఆ సమస్యా పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుంది.
మనం ‘సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరించాలి’ అని దేవుని వాక్యం చెబుతోంది. (రోమీయులు 14:19) ఔచిత్యముగా, ప్రేమగా మాట్లాడే మన మాటలకు ఈ సామెత అన్వయిస్తుంది: “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.” (సామెతలు 25:11) మనస్సుపై అదెంత ఆహ్లాదకరమైన, ఆనందదాయకమైన ముద్రవేస్తుందో కదా! మృదువైన, జ్ఞానయుక్తమైన సంభాషణ ఇతరుల కఠిన వైఖరిని కూడా మార్చగలదు: “సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును.”—సామెతలు 25:15.
కాబట్టే దేవుని వాక్యము మనకిలా ఉపదేశిస్తోంది: “ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” (కొలొస్సయులు 4:6) మనం మాట్లాడే మాటలు “ఉప్పువేసినట్టు” ఉండడం అంటే అవి వినడానికి ఇతరులకు ఇంపుగా ఉండడమే కాక, వారికి కోపం పుట్టించేవిగా ఉండకూడదని కూడా అర్థం. మాటలోనూ, క్రియలోనూ క్రైస్తవులు ఈ బైబిలు హెచ్చరికను అన్వయించుకోవడానికి కృషి చేస్తారు: “సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.”—1 పేతురు 3:11.
కాబట్టి ప్రసంగి 7:9 ఇతరులు చేసే చిన్నచిన్న తప్పుల విషయంలో మనం కోపగించుకోవద్దనే భావాన్నిస్తోందని స్పష్టమవుతోంది. ఈ చిన్న తప్పులు మానవ అపరిపూర్ణతవల్ల జరిగినా లేక కావాలని చేసినవైనా అవి గంభీరమైన తప్పులు కాకపోవచ్చు. అయితే ఆ తప్పు చిన్నది కాదుగానీ, గంభీరమైన పాపమని తేలినప్పుడు దానికి గురైన వ్యక్తి కోపం తెచ్చుకొని తగిన చర్య తీసుకోవడానికి నిర్ణయించుకోవచ్చు.—మత్తయి 18:15-17.
[14వ పేజీలోని చిత్రం]
పశ్చాత్తాపం చూపించని ఇశ్రాయేలీయులను సా.శ. 70లో రోమన్లు నాశనం చేయడానికి యెహోవా అనుమతించాడు
[15వ పేజీలోని చిత్రం]
“సమయోచితముగా పలుకబడిన మాట . . . బంగారు పండ్లవంటిది”