కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

జెఫన్యా 2:3లోని “ఒకవేళ” అనే మాట, దేవుని సేవకులు నిత్యజీవం పొందుతామనే నిశ్చితభావంతో ఉండలేరనే అర్థాన్నిస్తోందా?

ఆ లేఖనంలో మనమిలా చదువుతాం: “దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.” ఈ వచనం “ఒకవేళ” అని ఎందుకు చెబుతోంది?

అర్మగిద్దోనులో యెహోవా తన నమ్మకస్థులతో వ్యవహరించే విధానాన్ని అర్థం చేసుకోవడానికి, తీర్పు కాలానికి ముందు చనిపోయేవారి విషయంలో దేవుడు ఏమి చేస్తాడని బైబిలు బోధిస్తోందో గుర్తు చేసుకోవడం సహాయకరంగా ఉంటుంది. కొందరు ఆత్మ ప్రాణులుగా పరలోకానికి అమర్త్య జీవానికి పునరుత్థానం చేయబడితే, ఇతరులు పరదైసులో నిత్యం జీవించే ఉత్తరాపేక్షతో భూమ్మీదికి పునరుత్థానం చేయబడతారు. (యోహాను 5:28, 29; 1 కొరింథీయులు 15:​53, 54) అర్మగిద్దోనుకు ముందు చనిపోయే తన భక్తులను యెహోవా గుర్తుంచుకుని వారికి ప్రతిఫలమిచ్చినప్పుడు, తన ఉగ్రతాదినంలో సజీవంగా ఉండేవారితో కూడా ఆయన అలాగే వ్యవహరిస్తాడు.

అపొస్తలుడైన పేతురు వ్రాసిన ప్రేరేపిత మాటలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆయన ఇలా వ్రాశాడు: “[దేవుడు] భక్తిహీనుల సమూహముమీదికి జలప్రళయమును రప్పించినప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి . . . నీతిమంతుడగు లోతును తప్పించెను. . . . భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను . . . తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు.” (2 పేతురు 2:​5-9) గతకాలాల్లో యెహోవా దుష్టులను నాశనం చేసినప్పటికీ, ఆయన తనకు నమ్మకంగా సేవ చేసిన నోవహును, లోతును సజీవంగా కాపాడాడు. అలాగే అర్మగిద్దోనులో దుష్టులను నాశనం చేసేటప్పుడు కూడా యెహోవా దైవభక్తిగల ప్రజలను కాపాడతాడు. నీతిమంతులుగావున్న “గొప్పసమూహము” రక్షించబడుతుంది.​—⁠ప్రకటన 7:9, 14.

కాబట్టి జెఫన్యా 2:3లో ఉపయోగించబడిన “ఒకవేళ” అనే మాట దేవుని ఆమోదంగల ప్రజలను కాపాడడంలో ఆయన సామర్థ్యపు అనిశ్చయత కారణంగా వాడినట్లుగా అనిపించడం లేదు. బదులుగా, ఒక వ్యక్తి వినయంగా నీతిని అనుసరించడం ఆరంభించినప్పుడు ఆయన యెహోవా ఉగ్రత దినమున దాచబడడం అనేది కేవలం ఒక సాధ్యత మాత్రమే. అయితే ఆ వ్యక్తి వినయాన్ని, నీతిని అనుసరించడంలో కొనసాగడం మీదే అతని రక్షణ ఆధారపడి ఉంటుంది.​—⁠జెఫన్యా 2:3.

[31వ పేజీలోని చిత్రం]

‘భక్తులను శోధనలోనుండి తప్పించుటకు యెహోవా సమర్థుడు.’