కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు న్యూనతా భావాలతో పోరాడుతున్నారా?

మీరు న్యూనతా భావాలతో పోరాడుతున్నారా?

మీరు న్యూనతా భావాలతో పోరాడుతున్నారా?

లీనా తన జీవితంలో చాలాకాలం న్యూనతా భావాలతో పోరాడింది. “బాల్యంలో చాలా సంవత్సరాలు నాకు ఎదురైన లైంగిక వేధింపులు నా ఆత్మగౌరవాన్ని చాలావరకు నాశనం చేశాయి. నేను పూర్తిగా నిష్ప్రయోజకురాలినని భావించాను” అని ఆమె చెప్పింది. సిమోన్‌ కూడా తన యౌవనాన్ని గుర్తుచేసుకొని ఇలా అంది, “నా హృదయాంతరాళాల్లో శూన్యత, నేను విలువ లేనిదానిననే అభిప్రాయం ఉండేది.” అలాంటి భావాలవల్ల కలిగే అధిక దుఃఖం నేడు విస్తృతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. టీనేజర్లకు ఫోన్‌ ద్వారా సలహాలిచ్చే ఒక సంస్థవారు తమకు ఫోన్‌ చేసేవారిలో దాదాపు సగం మంది “దీర్ఘకాలికంగా న్యూనతా భావాలతో సతమతమవుతున్నట్లు” వ్యక్తం చేస్తున్నారని చెబుతోంది.

కొందరు మనస్తత్వ శాస్త్రవేత్తల ప్రకారం, తాము విలువలేనివారము అనే భావనలు ఇతరులు కలిగించినప్పుడు వ్యక్తుల్లో న్యూనతా భావాలు కలుగుతాయి. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ దూషణకు, మితిమీరిన కఠినమైన విమర్శకు లేక అవమానకరమైన రీతిలో అన్యాయానికి గురైతే అలాంటి మానసికస్థితి వృద్ధి కావచ్చు. అలాంటి మానసిక స్థితికి కారణమేదైనా పర్యవసానాలు బలహీనపరిచేవిగానే కాక, వినాశకరమైనవిగా కూడా ఉండవచ్చు. న్యూనతా భావాలున్న వ్యక్తులకు సాధారణంగా తమ మీద తమకు నమ్మకం ఉండదు, ఇతరుల మీదా నమ్మకం ఉండదు, అలా వారు తమకు తెలియకుండానే సన్నిహిత సంబంధాలను, స్నేహాలను పాడుచేసుకుంటారని ఇటీవల జరిపిన ఒక వైద్య సంబంధ అధ్యయనం కనుగొంది. “ఒక విధంగా చెప్పాలంటే, వారు ఏ పరిస్థితుల గురించైతే ఎక్కువగా భయపడతారో వాటినే ‘సృష్టించుకుంటారు’” అని ఆ అధ్యయనం చెబుతోంది.

ఆ విధంగా భావించే వ్యక్తులు సాధారణంగా, వారి ‘అంతరంగ విచారములు’ అని బైబిలు పిలుస్తున్న వాటికి బాధితులు. (కీర్తన 94:​19) తాము ఎప్పుడూ ఏ పనినీ సరైన విధంగా చేయలేమని వారు భావిస్తారు. ఏదైనా తప్పు జరిగిందంటే వారు సహజంగా తమను తాము నిందించుకుంటారు. వారు సాధించిన దానినిబట్టి ఇతరులు వారిని ప్రశంసించినా వారి అంతరంగంలో తాము ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా దొరికిపోయే మోసగాళ్ళమని భావిస్తారు. తాము సంతోషించడానికి అనర్హులమని భావించి స్వనాశనానికి దారితీసే విధంగా ప్రవర్తిస్తూ, ఇక ఆ ప్రవర్తనను సరిచేసుకోవడానికి అశక్తులమని భావిస్తారు. ఇంతకుముందు పేర్కొనబడిన లీనా, న్యూనతా భావాల కారణంగా ఆహార అలవాట్లకు సంబంధించిన గంభీరమైన రుగ్మతను కొనితెచ్చుకుంది, ఆమె ఇలా ఒప్పుకుంటోంది, “నేను దేనినీ మార్చలేనని భావించాను.”

అలాంటి ‘అంతరంగ విచారములతో’ పోరాడుతున్నవారు తమ శేష జీవితమంతా ఆ విధంగా భావిస్తూ ఉండిపోవలసినదేనా? అలాంటి భావాలతో పోరాడడానికి ఏమైనా చేయవచ్చా? అలాంటి పోరాటంలో విజయం సాధించడానికి చాలామందికి సహాయం చేసిన సూత్రాలను, ఆచరణాత్మకమైన సలహాను బైబిలు అందజేస్తోంది. ఆ సూత్రాల్లో కొన్ని ఏమిటి, బాధితులు జీవితంలో ఆనందం పొందేందుకు అవి ఎలా సహాయం చేశాయి? తర్వాతి ఆర్టికల్‌ దానిని వివరిస్తుంది.