కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడు”

యెహోవా “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడు”

యెహోవా “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడు”

“దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను.”​—⁠హెబ్రీయులు 11:⁠6.

“నేను దాదాపు 30 సంవత్సరాలుగా యెహోవాసాక్షిగా ఉన్నాను, అయినా అలా చెప్పుకునే అర్హత ఉన్నట్లు నాకెప్పుడూ అనిపించలేదు. నేను పయినీరు సేవ చేశాను, ఇంకా అనేక ఇతర ఆధిక్యతలు నాకు లభించాయి, అయినా అవేవీ సాక్షిగా పిలవబడే యోగ్యత నాకుందని నేను మనస్ఫూర్తిగా నమ్మేలా చేయలేకపోయాయి” అని బార్బరా ఒప్పుకుంటోంది. * కీత్‌ కూడా అలాంటి భావాలనే వ్యక్తం చేస్తూ ఇలా అంటున్నాడు: “యెహోవా సేవకులు సంతోషంగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ, నేను సంతోషంగా ఉండలేకపోతున్నందుకు నేను అనర్హుడననే భావాలు నాలో కొన్నిసార్లు కలిగాయి. దానితో నాలో అపరాధ భావాలేర్పడ్డాయి, ఇది పరిస్థితిని మరింత దిగజార్చింది.”

2 గతకాలంలోనే కాక ప్రస్తుతకాలంలో కూడా యెహోవా సేవకులు చాలామంది అలాంటి భావాలతో పోరాడారు. కొన్నిసార్లు మీరూ అలాగే భావించారా? మీ తోటి విశ్వాసులు చీకూచింతాలేని జీవితాన్ని అనుభవిస్తూ సంతోషంగా ఉంటే, మీరేమో ఒకదాని తర్వాత మరొకటిగా సమస్యలతో సతమతమవుతూ ఉండవచ్చు. ఫలితంగా, మీరు యెహోవా అనుగ్రహానికీ, ఆయన శ్రద్ధకు అర్హులు కాదని భావించవచ్చు. తొందరపడి, అది నిజమేననే ముగింపుకు రాకండి. బైబిలు ఇలా హామీ ఇస్తోంది: “[యెహోవా] బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించెను.” (కీర్తన 22:​24) మెస్సీయ గురించిన ఆ ప్రవచనార్థక మాటలు యెహోవా తన నమ్మకస్థుల మొరను ఆలకించడమే కాక, వారికి ప్రతిఫలం కూడా ఇస్తాడని చూపిస్తున్నాయి.

3 ఈ విధానపు ఒత్తిళ్లకు ఎవ్వరూ అతీతులు కారు, చివరికి యెహోవా ప్రజలు కూడా. యెహోవా ముఖ్య విరోధియైన అపవాదియగు సాతాను పరిపాలిస్తున్న లోకంలో మనం జీవిస్తున్నాం. (2 కొరింథీయులు 4:4; 1 యోహాను 5:​19) యెహోవా సేవకులు అద్భుతరీతిలో రక్షించబడే బదులు సాతానుకు ప్రధాన గురిగా ఉన్నారు. (యోబు 1:7-12; ప్రకటన 2:​10) కాబట్టి యెహోవా దేవుని నియమితకాలం వరకు ఆయన మనపట్ల శ్రద్ధ చూపిస్తాడనే నమ్మకంతో “శ్రమయందు ఓర్పు” చూపించాలి, “ప్రార్థనయందు పట్టుదల” కలిగివుండాలి. (రోమీయులు 12:​12) మన దేవుడైన యెహోవా మనల్ని ప్రేమించడం లేదనే తలంపుకు మనం తావివ్వకూడదు!

సహనం చూపించిన ప్రాచీనకాల ఆదర్శవంతులు

4 ప్రాచీనకాల యెహోవా సేవకులు చాలామంది కృంగదీసే పరిస్థితులను సహించాల్సి వచ్చింది. ఉదాహరణకు, హన్నా దేవుడు తనను మరచిపోయాడన్నట్లు తాను భావించిన పరిస్థితినిబట్టి అంటే గొడ్రాలుగా ఉన్న కారణంగా ‘బహు దుఃఖాక్రాంతురాలయ్యింది.’ (1 సమూయేలు 1:​9-11) నరహంతకురాలైన యెజెబెలు రాణి, ఏలీయాను వేటాడినప్పుడు ఆయన భయపడి యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను; ఇంతమట్టుకు చాలును, నా ప్రాణము తీసికొనుము.” (1 రాజులు 19:⁠4) అపొస్తలుడైన పౌలు, “మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది” అని ఒప్పుకున్నప్పుడు, ఆయన తన అపరిపూర్ణతనుబట్టి ఎంతో బాధపడివుంటాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: ‘అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను!’​—⁠రోమీయులు 7:21-24.

5 హన్నా, ఏలీయా, పౌలు యెహోవా సేవలో సహనం ప్రదర్శించారని, ఆయన వారికి సమృద్ధిగా ప్రతిఫలమిచ్చాడని మనకు తెలుసు. (1 సమూయేలు 1:​20; 2:21; 1 రాజులు 19:5-18; 2 తిమోతి 4:⁠8) అయినప్పటికీ, వారు దుఃఖం, నిరాశ, భయంతోపాటు మానవ భావావేశాలకు సంబంధించిన అన్నిరకాల పరిస్థితులతో పోరాడారు. కాబట్టి కొన్నిసార్లు మనకూ ప్రతికూల భావాలు కలగడం మనల్ని ఆశ్చర్యపరచకూడదు. అయినప్పటికీ, జీవితంలోని కొన్ని చింతలు యెహోవా నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా అని భావించేలా చేస్తే మీరేమి చేయవచ్చు? మీరు దేవుని వాక్యం నుండి ఓదార్పు పొందవచ్చు. ఉదాహరణకు, దీని ముందరి ఆర్టికల్‌లో మనం, యెహోవా ‘మీ తలవెండ్రుకలు’ లెక్కించాడని చెప్పిన యేసు మాటలను పరిశీలించాం. (మత్తయి 10:​30) ఆ ప్రోత్సాహకరమైన మాటలు యెహోవాకు తన సేవకుల్లో ప్రతీ ఒక్కరిపై ప్రగాఢ శ్రద్ధ ఉందని సూచించాయి. యేసు చెప్పిన పిచ్చుకల ఉపమానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యెహోవాకు తెలియకుండా వాటిలో ఒక్కటి కూడా నేలనపడే ప్రసక్తి లేనప్పుడు, మీ విషయంలో ఆయన శ్రద్ధ లేకుండా ఉంటాడా?

6 అపరిపూర్ణ మానవులమైన మనం సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని దృష్టిలో విలువైన వారిగా ఉండడం నిజంగా సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది! వాస్తవానికి, ఈ విషయంలో మనకు హామీ ఇచ్చే బైబిలు భాగాలు చాలావున్నాయి. ఈ లేఖన భాగాలను మననం చేసుకోవడం ద్వారా, మనం కూడా కీర్తనకర్త పలికిన మాటలను ప్రతిధ్వనించవచ్చు. ఆయన ఇలా అన్నాడు: “నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.” (కీర్తన 94:​19) దేవుడు మనల్ని విలువైనవారిగా పరిగణిస్తున్నాడని, ఆయన చిత్తం చేయడంలో కొనసాగితే మనకు ప్రతిఫలమిస్తాడని మరింత ఎక్కువగా అర్థం చేసుకోవడానికి సహాయం చేసే ఈ ఓదార్పుకరమైన వాక్యాల్లోని కొన్నింటిని మనం దేవుని వాక్యం నుండి పరిశీలిద్దాం.

యెహోవా ‘స్వకీయసంపాద్యం’

7 సా.శ.పూ. ఐదవ శతాబ్దంలో యూదుల మధ్య ఘోరమైన పరిస్థితి నెలకొంది. యాజకులు పనికిరాని జంతువులను అంగీకరిస్తూ, వాటిని యెహోవా బలిపీఠం మీద బలులుగా అర్పిస్తున్నారు. న్యాయాధిపతులు పక్షపాతం చూపిస్తున్నారు. చిల్లంగితనం, అబద్ధం, మోసం, వ్యభిచారం విశృంఖలముగా కొనసాగుతున్నాయి. (మలాకీ 1:8; 2:⁠9; 3:⁠5) శృతి మించిన ఆ భ్రష్ట జనాంగాన్ని ఉద్దేశించి మలాకీ ఆశ్చర్యకరమైన ప్రవచనం పలికాడు. అయితే తగిన కాలంలో యెహోవా తన ప్రజలను తిరిగి అంగీకృత స్థితిలోకి తీసుకొస్తాడు. మనమిలా చదువుతాం: “నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయసంపాద్యమై యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.”​—⁠మలాకీ 3:17.

8 ఆధ్యాత్మిక జనాంగంగా తయారయ్యే 1,44,000 ఆత్మాభిషిక్త క్రైస్తవులకు సంబంధించి మలాకీ ప్రవచనానికి ఆధునిక దిన నెరవేర్పు ఉంది. ఆ జనాంగం నిజంగా యెహోవా దేవుని ‘స్వకీయసంపాద్యముగా’ లేదా ఆయన ‘సొత్తయిన ప్రజలుగా ఉన్నారు.’ (1 పేతురు 2:⁠9) ‘తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, సింహాసము ఎదుటను, గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడిన’ ‘గొప్పసమూహానికి’ కూడా మలాకీ ప్రవచనం ప్రోత్సాహకరంగా ఉండగలదు. (ప్రకటన 7:​4, 9) వీరు అభిషిక్తులతో కలిసి ఒకే కాపరి క్రింద ఒకే మందగా ఉంటారు, ఆ కాపరే యేసుక్రీస్తు.​—⁠యోహాను 10:16.

9 తనను సేవించడానికి నిర్ణయించుకున్న వారిని యెహోవా ఎలా దృష్టిస్తాడు? మలాకీ 3:17లో పేర్కొనబడినట్లుగా, ఒక ప్రేమగల తండ్రి తన కుమారుణ్ణి దృష్టించినట్లే దృష్టిస్తాడు. ఆయన తన ప్రజలను శ్లాఘనీయంగా “స్వకీయసంపాద్యము” అని వర్ణించడాన్ని గమనించండి. ఇతర అనువాదాలు ఆ పదబంధాన్ని “నా సొత్తు,” “నా అత్యుత్తమ ఆస్తి,” “నా మణిరత్నాలు” అని అనువదిస్తున్నాయి. తనను సేవిస్తున్న వారిని యెహోవా ఎందుకు అంత ప్రత్యేకమైన వారిగా దృష్టిస్తున్నాడు? ఒక కారణమేమిటంటే, ఆయన కృతజ్ఞతా భావంగల దేవుడు. (హెబ్రీయులు 6:​10) హృదయపూర్వకంగా తనను సేవించేవారికి ఆయన సన్నిహితమవుతూ వారిని ప్రత్యేకమైనవారిగా దృష్టిస్తాడు.

10 మీరు స్వకీయసంపాద్యముగా దృష్టించే ఏదైనా విలువైన వ్యక్తిగత ఆస్తి గురించి మీరు ఆలోచించగలరా? దానిని సంరక్షించేందుకు మీరు చర్యలు తీసుకోరా? యెహోవా తన “స్వకీయసంపాద్యము” విషయంలో అలాగే చేస్తాడు. నిజమే, జీవితపు పరీక్షలు, విషాదాలన్నింటి నుండి ఆయన తన ప్రజలను తప్పించడు. (ప్రసంగి 9:​11) అయితే యెహోవా తన నమ్మకమైన సేవకులను ఆధ్యాత్మికంగా కాపాడగలడు, కాపాడతాడు. ఎలాంటి పరీక్షనైనా భరించే బలాన్ని ఆయన వారికిస్తాడు. (1 కొరింథీయులు 10:​13) కాబట్టే, దేవుని ప్రాచీనకాల ప్రజలైన ఇశ్రాయేలీయులతో మోషే ఇలా అన్నాడు: “భయపడకుడి, . . . నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు.” (ద్వితీయోపదేశకాండము 31:⁠6) యెహోవా తన ప్రజలతో ప్రతిఫలదాయకంగా వ్యవహరిస్తాడు. ఆయనకు వారు “స్వకీయసంపాద్యముగా” ఉన్నారు.

యెహోవా “ఫలము దయచేయువాడు”

11 యెహోవా తన ప్రజలను విలువైనవారిగా పరిగణిస్తాడనడానికి మరో రుజువు ఆయన వారికి ప్రతిఫలమిస్తాడు. ఆయన ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను.” (మలాకీ 3:​10) చివరకు యెహోవా తన సేవకులకు నిత్యజీవాన్ని ప్రతిఫలంగా ఇస్తాడు. (యోహాను 5:24; ప్రకటన 21:⁠4) ఈ అమూల్య ప్రతిఫలం యెహోవా ప్రేమా ఔదార్యాల విస్తారతను వెల్లడిచేస్తుంది. అది తనను సేవించడానికి నిర్ణయించుకున్నవారిని ఆయన నిజంగా విలువైనవారిగా ఎంచుతాడని కూడా చూపిస్తుంది. ఔదార్యముతో ఫలము దయచేయువానిగా యెహోవాను దృష్టించడాన్ని నేర్చుకోవడం దేవునితో మనకున్న స్థానానికి సంబంధించిన ఎలాంటి సందేహాలతోనైనా పోరాడేందుకు మనకు సహాయం చేయగలదు. నిజానికి, తనను ఫలము దయచేయువానిగా దృష్టించమని యెహోవా మనల్ని కోరుతున్నాడు! పౌలు ఇలా వ్రాశాడు: “దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను.”​—⁠హెబ్రీయులు 11:⁠6.

12 అవును, యెహోవా మనకు ప్రతిఫలమిస్తానని వాగ్దానం చేస్తున్నాడని కాదుగానీ, ఆయనను ప్రేమిస్తున్నందుకే మనమాయనను సేవిస్తున్నాం. అయినప్పటికీ, ప్రతిఫలాన్ని మనస్సులో ఉంచుకోవడం అనుచితమో స్వార్థపూరితమో కాదు. (కొలొస్సయులు 3:​23, 24) తనను వెదకేవారిని ఆయన ప్రేమిస్తున్నాడు, తాను వారిని అత్యంత విలువైనవారిగా పరిగణిస్తున్నాడు కాబట్టి యెహోవా చొరవ తీసుకొని వారికి ప్రతిఫలమిస్తాడు.

13 యెహోవా దృష్టిలో మానవులకు విలువ ఉందనేందుకు విమోచన క్రయధన ఏర్పాటు అతిగొప్ప సూచనగా ఉంది. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:​16) యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి ఏర్పాటు యెహోవా దృష్టిలో మనకు విలువలేదనే ఆలోచనను లేదా మనం ఆయన ప్రేమకు అనర్హులమనే ఆలోచనను కొట్టిపారేస్తుంది. అవును, యెహోవా మనకోసం అంత మూల్యం అంటే తన అద్వితీయ కుమారుణ్ణే అనుగ్రహించాడంటే, ఆయన తప్పకుండా మనల్ని ప్రగాఢంగా ప్రేమిస్తూ ఉండాలి.

14 కాబట్టి, మీలో ఒకవేళ ప్రతికూల భావాలు కలిగితే, విమోచన క్రయధనం గురించి ధ్యానించండి. అవును, ఈ బహుమానాన్ని యెహోవా వ్యక్తిగత ఏర్పాటుగా దృష్టించండి. అపొస్తలుడైన పౌలు అలాగే చేశాడు. “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను!” అని ఆయన చెప్పినట్లు గుర్తుచేసుకోండి. అయితే పౌలు ఇంకా ఇలా అన్నాడు: “నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన,” “మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (గలతీయులు 2:20; రోమీయులు 7:​24, 25) ఇలా చెప్పడంలో పౌలు తనకు తాను అధిక ప్రాముఖ్యతనిచ్చుకోవడం లేదు. బదులుగా, ఆయన యెహోవా తననొక వ్యక్తిగా విలువైనవాడిగా పరిగణిస్తున్నాడనే నమ్మకాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నాడు. పౌలులాగే, మీరు కూడా విమోచన క్రయధనాన్ని దేవుడు అనుగ్రహించిన బహుమానంగా దృష్టించడం నేర్చుకోవాలి. యెహోవా శక్తిమంతమైన రక్షకుడు మాత్రమే కాదు, ప్రేమతో ప్రతిఫలమిచ్చే దాత కూడా.

సాతాను ‘తంత్రముల’ విషయంలో జాగ్రత్తగా ఉండండి

15 అయితే, దేవుని వాక్యంలోవున్న ఓదార్పుకరమైన ప్రేరేపిత వాక్కులు నిజంగా మీకు వర్తిస్తాయని నమ్మడం కష్టంగా ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. దేవుని నూతనలోకంలో నిత్యం జీవించే ప్రతిఫలాన్ని ఇతరులు పొందుతారేమో గానీ, నాకు మాత్రం ఆ అర్హత లేదన్నట్లు మీరు భావించవచ్చు. ఒకవేళ మీరలా భావిస్తుంటే, మీరేమి చేయవచ్చు?

16 ఎఫెసీయులకు పౌలు ఇచ్చిన ఈ హెచ్చరిక మీకు నిస్సందేహంగా తెలిసేవుంటుంది: “మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి.” (ఎఫెసీయులు 6:​11) మనం సాతాను పన్నాగాల గురించి ఆలోచించినప్పుడు, ఐశ్వర్యాసక్తి, లైంగిక దుర్నీతివంటి విషయాలు వెంటనే మనస్సులోకి రావచ్చు, అది సమంజసమే. ఈ శోధనలు ప్రాచీనకాలాల్లోనూ, మనకాలంలోనూ దేవుని ప్రజలను చాలామందిని ప్రమాదంలో పడేశాయి. అయితే సాతాను ప్రయోగించే మరో తంత్రాన్ని, అంటే యెహోవా దేవుడు తమను ప్రేమించడం లేదని ప్రజలను ఒప్పించే అతని ప్రయత్నాన్ని, మనం నిర్లక్ష్యం చేయకూడదు.

17 ప్రజలను దేవుణ్ణుంచి దూరం చేయాలనే తన ప్రయత్నాల్లో, అలాంటి భావాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో అపవాది దిట్ట. యోబుతో బిల్దదు పలికిన ఈ మాటలు గుర్తు చేసుకోండి: “నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా.” (యోబు 25:4-6; యోహాను 8:​44) ఆ మాటలు ఎంత నిరుత్సాహం కలిగించి ఉంటాయో మీరు ఊహించగలరా? కాబట్టి సాతాను మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వకండి. బదులుగా, సరైనది చేయడానికి శాయశక్తులా పోరాడేందుకు కావలసిన ధైర్యం, శక్తి మీకుండేలా సాతాను కుయుక్తులను తెలుసుకొని ఉండండి. (2 కొరింథీయులు 2:​11) యోబు విషయానికొస్తే, ఆయన సరిదిద్దబడవలసి వచ్చినప్పటికీ, ఆయన పోగొట్టుకున్న వాటికి రెండింతలు అధికంగా దయచేస్తూ యెహోవా ఆయన సహనానికి ప్రతిఫలమిచ్చాడు.​—⁠యోబు 42:10.

యెహోవా “మన హృదయముకంటె అధికుడు”

18 నిరుత్సాహ భావాలు లోతుగా పాతుకుపోయివుంటే, వాటిని జయించడం అంత సులభం కాదని అంగీకరించవలసిందే. అయితే, ‘దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు దుర్గములను’ క్రమేణా పడద్రోయడానికి యెహోవా ఆత్మ మీకు సహాయం చేయగలదు. (2 కొరింథీయులు 10:​4, 5) ప్రతికూల భావాలు మిమ్మల్ని ముంచెత్తినప్పుడు, అపొస్తలుడైన యోహాను వ్రాసిన ఈ మాటలను మననం చేసుకోండి: “ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.”​—⁠1 యోహాను 3:​19-20.

19 “దేవుడు మన హృదయముకంటె అధికుడు” అనే మాటల భావమేమిటి? ప్రత్యేకంగా, మన అపరిపూర్ణతలు, బలహీనతలనుబట్టి మనం ఆవేదనతో ఉన్నప్పుడు, కొన్నిసార్లు మన హృదయం మనల్ని ఖండించవచ్చు. లేదా యెహోవాకు అంగీకారమైనదేదీ చేయలేమన్నట్లు, మన నేపథ్యాన్నిబట్టి మనగురించి మనమే ప్రతికూలంగా తలంచే మితిమీరిన స్వభావం మనకు ఉండవచ్చు. యెహోవా అలాంటి స్వభావాలకంటే అధికుడని అపొస్తలుడైన యోహాను మాటలు మనకు హామీ ఇస్తున్నాయి! ఆయన మన దోషాలను కాదుగానీ, మనలోని అంతర్నిహిత శక్తినే చూస్తాడు. మన కోరికలు, ఉద్దేశాలు కూడా ఆయనకు తెలుసు. దావీదు ఇలా వ్రాశాడు: “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.” (కీర్తన 103:​14) అవును, మన గురించి మనకంటే యెహోవాకే ఎక్కువ తెలుసు!

“భూషణకిరీటము,” ‘రాజమకుటము’

20 యెహోవా తన ప్రాచీనకాల ప్రజలకు యెషయా ప్రవక్త ద్వారా పునరుద్ధరణ నిరీక్షణనిచ్చాడు. వారు బబులోను పరవాసంలో ఉన్నప్పుడు, వారికి ఖచ్చితంగా అవసరమయ్యేది ఈ ఓదార్పు, అభయమే. వారు తమ స్వదేశానికి తిరిగివచ్చే భావికాలాన్ని ముందుగానే చూస్తూ యెహోవా ఇలా సెలవిచ్చాడు: ‘నీవు యెహోవాచేతిలో భూషణకిరీటముగాను నీ దేవునిచేతిలో రాజ మకుటముగాను ఉందువు.’ (యెషయా 62:⁠3) ఈ మాటలతో యెహోవా తన ప్రజలను గౌరవముతోను, వైభవముతోను అలంకరించాడు. తన ఆధ్యాత్మిక ఇశ్రాయేలు విషయంలోనూ నేడు ఆయన అలాగే చేశాడు. ఇది అందరూ మెచ్చుకునేలా ఆయన వారిని సమున్నత స్థానంలో ఉంచినట్లుగా ఉంది.

21 ప్రాథమికంగా ఈ ప్రవచనం అభిషిక్తుల విషయంలో నెరవేరినప్పటికీ, అది యెహోవా తన సేవకులందరికీ అనుగ్రహించే గౌరవాన్ని ఉదాహరిస్తోంది. కాబట్టి, సందేహాత్మక భావాలు చుట్టిముట్టినప్పుడు, అపరిపూర్ణులుగా ఉన్నా యెహోవాకు మీరు ‘భూషణకిరీటమంత, రాజమకుటమంత’ విలువైనవారిగా ఉండగలరని గుర్తుంచుకోండి. అందువల్ల ఆయన చిత్తం చేయడానికి మనఃపూర్వకంగా ప్రయత్నిస్తూ ఎల్లప్పుడూ ఆయన హృదయాన్ని సంతోషపరచండి. (సామెతలు 27:​11) అలా చేసినప్పుడు, మీరు నమ్మకంగా సహించినందుకు యెహోవా మీకు ప్రతిఫలమిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.

[అధస్సూచి]

^ పేరా 3 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

యెహోవాకు మనం ఎలా ‘స్వకీయసంపాద్యముగా’ ఉన్నాం?

యెహోవా ప్రతిఫలమిచ్చేవాడని దృష్టించడం ఎందుకు ప్రాముఖ్యం?

మనం సాతాను ఉపయోగించే ఏ ‘తంత్రముల’ విషయంలో జాగ్రత్తగా ఉండాలి?

ఏ విధముగా ‘దేవుడు మన హృదయముకంటే అధికుడు’?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. యెహోవా సేవకులు కొందరు ప్రతికూల భావాలతో ఎందుకు పోరాడవచ్చు?

3. ఈ విధానపు ఒత్తిళ్లకు మనమెందుకు అతీతులం కాదు?

4. కృంగదీసే పరిస్థితులను సహించిన, యెహోవా నమ్మకమైన సేవకుల ఉదాహరణలు కొన్ని చెప్పండి.

5. (ఎ) హన్నా, ఏలీయా, పౌలు ఎలాంటి ప్రతిఫలం పొందారు? (బి) ఒకవేళ మనం ప్రతికూల భావాలతో పోరాడుతుంటే దేవుని వాక్యం నుండి మనమెలాంటి ఓదార్పును పొందవచ్చు?

6. ప్రతికూల భావాలతో పోరాడే వారికి బైబిలు ఓదార్పుకు మూలాధారంగా ఎలా ఉండగలదు?

7. మలాకీ ద్వారా భ్రష్ట జనాంగానికి యెహోవా ఎలాంటి ప్రోత్సాహకరమైన ప్రవచనం ఇచ్చాడు?

8. సూత్రప్రాయంగా మలాకీ 3:17ను గొప్పసమూహానికి కూడా ఎందుకు అన్వయించవచ్చు?

9. యెహోవా ప్రజలు ఆయనకెందుకు ‘స్వకీయసంపాద్యముగా’ ఉన్నారు?

10. యెహోవా తన ప్రజలను ఎలా కాపాడతాడు?

11, 12. మనకు ప్రతిఫలం అనుగ్రహించే వ్యక్తిగా యెహోవా పాత్ర గురించి తెలుసుకోవడం సందేహాత్మక భావాలతో పోరాడేందుకు మనకు ఎలా సహాయం చేయగలదు?

13. విమోచన క్రయధన ఏర్పాటు మనపట్ల యెహోవాకుగల ప్రేమకు ఎందుకు ఒక గొప్ప రుజువుగా ఉంది?

14. విమోచన క్రయధనాన్ని పౌలు దృష్టించిన విధానాన్ని ఏది చూపిస్తోంది?

15-17. (ఎ) ప్రతికూల భావాలను సాతాను ఎలా తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటాడు? (బి) యోబు అనుభవం నుండి మనమెలాంటి ప్రోత్సాహం పొందవచ్చు?

18, 19. ఏ విధముగా “దేవుడు మన హృదయముకంటె అధికుడు,” ఆయన ఏ విధముగా ‘సమస్తమును ఎరిగినవాడు’?

20. యెహోవా తన సేవకులను దృష్టించే విషయం గురించి యెషయా పునరుద్ధరణా ప్రవచనం ఏమి వెల్లడిచేస్తోంది?

21. మీరు నమ్మకంగా సహించినప్పుడు యెహోవా మీకు ప్రతిఫలమిస్తాడనే నమ్మకాన్ని మీరెలా పొందగలరు?

[26వ పేజీలోని చిత్రం]

పౌలు

[26వ పేజీలోని చిత్రం]

ఏలీయా

[26వ పేజీలోని చిత్రం]

హన్నా

[28వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యంలో ఓదార్పుకరమైన తలంపులు సమృద్ధిగా ఉన్నాయి