కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తన మార్గమును అనుసరించేవారిని మెండుగా ఆశీర్వదిస్తాడు

యెహోవా తన మార్గమును అనుసరించేవారిని మెండుగా ఆశీర్వదిస్తాడు

జీవిత కథ

యెహోవా తన మార్గమును అనుసరించేవారిని మెండుగా ఆశీర్వదిస్తాడు

రొమాల్డ్‌ స్టాఫ్‌స్కీ చెప్పినది

1939 సెప్టెంబరులో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, ఉత్తర పోలాండ్‌లో పోరు ముమ్మరంగా సాగుతోంది. తొమ్మిదేళ్ల బాలునిగా ఉన్న నేను ఏమి జరుగుతుందో చూద్దామనే ఉత్సుకతతో దగ్గర్లో యుద్ధం జరుగుతున్న స్థలానికి వెళ్ళాను. అక్కడ నేను చూసిన దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి, ఎక్కడచూసినా శవాలే, ఊపిరి సలపని విధంగా పొగ కమ్ముకుని ఉంది. అప్పుడు నేను ఇంటికి సురక్షితంగా ఎలా చేరుకోవాలా అని ఆలోచిస్తున్నా, నాలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి, అవేమిటంటే: “అంత భయంకరమైన సంఘటనలు జరగడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? ఆయన ఏ పక్షం వారికి మద్దతు ఇస్తున్నాడు?”

యుద్ధం ముగింపుకు వస్తున్న సమయంలో, జర్మన్‌ సైన్యం తరఫున పనిచేయమని యౌవనస్థులు బలవంతం చేయబడేవారు. ఎవరైనా నిరాకరించడానికి తెగిస్తే, “విద్రోహి” లేదా “నమ్మకద్రోహి” అని వ్రాసివున్న బోర్డు మెడకు తగిలించి వారిని ఒక చెట్టుకో, వంతెనకో వ్రేలాడదీసేవారు. గడినీయ అనే మా పట్టణం రెండు శత్రు పక్షాలకు మధ్యన ఉండేది. మేము నీళ్ళు తెచ్చుకోవడానికి పట్టణం వెలుపలికి వెళ్ళినప్పుడు తుపాకీ గుళ్ళు, బాంబులు మా తలల మీదుగా దూసుకువెళ్ళేవి, మా తమ్ముడు హెన్రిక్‌ అలాగే తీవ్రంగా గాయపడి మరణించాడు. అప్పుడున్న ఘోరమైన పరిస్థితుల కారణంగా మా అమ్మ భద్రత కోసం పిల్లలమైన మా నలుగురి నివాసాన్ని బేస్‌మెంట్‌కు మార్చింది. అక్కడే, రెండు సంవత్సరాలున్న మా తమ్ముడు యూగాన్‌యూష్‌కు కంఠవాతము (డిఫ్తీరియా) సోకడంతో మరణించాడు.

అప్పుడు మళ్ళీ నన్ను నేనిలా ప్రశ్నించుకున్నాను: “దేవుడు ఎక్కడున్నాడు? ఈ బాధనంతటినీ ఆయన ఎందుకు అనుమతిస్తున్నాడు?” నేను ఆసక్తిగల క్యాథలిక్‌గా క్రమంగా చర్చికి వెళ్తున్నా, ఈ ప్రశ్నలకు నాకు సమాధానం లభించలేదు.

నేను సత్యాన్ని అంగీకరించడం

నా ప్రశ్నలకు సమాధానాలు, అనుకోని మూలం నుండి లభించాయి. 1945లో యుద్ధం ముగిసింది, 1947 ఆరంభంలో, ఒక యెహోవాసాక్షి గడినీయలోని మా ఇంటికి వచ్చింది. మా అమ్మ ఆ సాక్షితో మాట్లాడింది, ఆమె చెబుతున్నదానిలో కొంత నేను విన్నాను. అది సరైనదిగా అనిపించడంతో, క్రైస్తవ కూటానికి రమ్మని ఆమె ఇచ్చిన ఆహ్వానానికి మేము అంగీకరించాం. కేవలం ఒక నెల తర్వాత, అప్పటికి నాకు బైబిలు సత్యం అంత బాగా తెలియకపోయినా, నేను స్థానిక సాక్షులతో కలిసి, యుద్ధాలు దారుణకృత్యాలు ఉండని శ్రేష్ఠమైన లోకం గురించి ఇతరులకు ప్రకటించడం ఆరంభించాను. అది నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.

నేను 1947 సెప్టెంబరులో, సొపొట్‌లో జరిగిన ప్రాంతీయ సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాను. ఆ తర్వాతి మే నెలలో క్రమ పయినీరు సేవ ప్రారంభించి, బైబిలు సందేశాన్ని ఇతరులకు ప్రకటించడంలోనే నా సమయాన్ని ఎక్కువగా గడిపేవాడిని. స్థానిక మతనాయకులు మా పనిని తీవ్రంగా వ్యతిరేకించి, మా మీద దౌర్జన్యాన్ని పురికొల్పారు. ఒకసారి, ఆగ్రహించిన ఒక అల్లరిమూక మాపై దాడి చేసి, మా మీద రాళ్ళు రువ్వి, మమ్మల్ని బాగా కొట్టారు. మరో సందర్భంలో, స్థానిక నన్‌లు, మతనాయకులు మా మీద దాడి చేయమని ఒక గుంపు ప్రజలను ఉసిగొలిపారు. మేము పోలీస్‌ స్టేషన్‌లో తలదాచుకున్నాము, కానీ ఆ మూక ఆ భవనాన్ని చుట్టుముట్టి మమ్మల్ని కొడతామని బెదిరించారు. చివరకు అదనపు పోలీసు బలగాలు వచ్చి, పూర్తి భద్రతతో మమ్మల్ని అక్కడినుండి తీసుకెళ్ళాయి.

ఆ సమయంలో, మా ప్రాంతంలో సంఘం లేదు. కొన్నిసార్లు మేము రాత్రిళ్ళు అడవిలో ఆరుబయటే ఉండిపోయేవాళ్ళం. పరిస్థితులు అలా ఉన్నా ప్రకటనా పనిని కొనసాగించగలుగుతున్నందుకు మేము సంతోషించేవాళ్ళం. నేడు ఆ ప్రాంతంలో స్థిరమైన సంఘాలున్నాయి.

బెతెల్‌ సేవ, నిర్బంధం

నాకు 1949లో లూజ్‌లోని బెతెల్‌ గృహానికి రమ్మని ఆహ్వానం అందింది. అలాంటి స్థలంలో సేవ చేయడం ఎంతటి ఆధిక్యతో కదా! అయితే విచారకరంగా, నేను అక్కడ ఎంతోకాలం ఉండడానికి వీలవలేదు. 1950 జూన్‌లో అంటే మన పని అధికారికంగా నిషేధించబడడానికి ఒక నెల ముందు, బెతెల్‌లోని ఇతర సహోదరులతోపాటు నన్ను కూడా నిర్బంధించారు. నన్ను జైలుకు తీసుకువెళ్ళారు, అక్కడ నేను క్రూరమైన విచారణను ఎదుర్కోవలసి వచ్చింది.

మా నాన్నగారు క్రమంగా న్యూయార్క్‌కు వెళ్తుండే ఓడలో పనిచేసేవారు కాబట్టి నన్ను విచారణ చేస్తున్న అధికారులు, మా నాన్నగారు అమెరికాకు గూఢచారిగా పనిచేస్తున్నాడని నాతో బలవంతంగా చెప్పించడానికి ప్రయత్నించారు. నన్ను అమానుషంగా విచారణ చేశారు. అంతేగాక, అప్పుడు పోలాండ్‌లో మన కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న సహోదరుడు విల్‌హెల్మ్‌ షైడర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేలా నన్ను ఒప్పించాలని ఒకేసారి నలుగురు అధికారులు ప్రయత్నించారు. గట్టి కఱ్ఱలు తీసుకుని నా మడిమలమీద కొట్టారు. రక్తం కారుతుంటే నేను నేలమీద పడివున్నప్పుడు, ఇక ఓర్చుకోవడం నా వల్ల కాదని భావించి, “యెహోవా, నాకు సహాయం చెయ్యి!” అని గట్టిగా కేకలు వేశాను. నన్ను హింసిస్తున్నవారు ఆశ్చర్యపోయి, కొట్టడం ఆపేశారు. కొద్ది నిమిషాల్లోనే వాళ్ళు గాఢ నిద్రలోకి జారిపోయారు. నాకు ఉపశమనం లభించి నేను తిరిగి బలం పుంజుకున్నాను. ఇది, యెహోవా సమర్పిత సేవకులు ప్రార్థించినప్పుడు ఆయన ప్రేమపూర్వకంగా ప్రతిస్పందిస్తాడనే నమ్మకం నాలో కలిగించింది. అది నా విశ్వాసాన్ని బలపరిచి, దేవునిపై పూర్తి నమ్మకం ఉంచడాన్ని నాకు నేర్పించింది.

విచారణ చివరి రిపోర్టులో నేను విల్‌హెల్మ్‌ షైడర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చానని తప్పుడు సాక్ష్యం వ్రాశారు. అది సరికాదని నేను వ్యతిరేకించినప్పుడు, ఒక అధికారి “అది కోర్టులో వివరిద్దువులే” అన్నాడు. నాతోపాటు జైలు గదిలో ఉంటున్న స్నేహశీలుడైన ఒక వ్యక్తి, ఆ విషయం గురించి విచారించవద్దనీ, చివరి రిపోర్టును ఒక సైనిక న్యాయవాది పరిశీలిస్తాడనీ, అప్పుడు ఆ తప్పుడు సాక్షాన్ని నిరాకరించే అవకాశం నాకు ఇస్తారనీ చెప్పాడు. సరిగ్గా అలాగే జరిగింది.

సర్క్యూట్‌ పని, మరోసారి జైలుకు

నేను 1951 జనవరిలో విడుదలయ్యాను. ఒక నెల తర్వాత నేను ప్రయాణ పైవిచారణకర్తగా సేవ చేయడం ప్రారంభించాను. నిర్బంధం ఉన్నా, సంఘాలను బలపరచడానికి, భద్రతాదళాల కార్యకలాపాలవల్ల చెదరిపోయిన తోటి సాక్షులకు సహాయం చేయడానికి నేను ఇతర సహోదరులతో కలిసి పనిచేశాను. పరిచర్యలో కొనసాగమని మేము సహోదరులను ప్రోత్సహించాము. తర్వాతి సంవత్సరాల్లో, ఈ సహోదరులు ప్రయాణ పైవిచారణకర్తలకు ధైర్యంగా మద్దతిచ్చి, బైబిలు సాహిత్యాలను రహస్యంగా ముద్రించి పంచిపెట్టే పనిని చేశారు.

1951 ఏప్రిల్‌లో ఒకరోజు, నన్ను జాగ్రత్తగా గమనిస్తున్న భద్రతాధికారులు, ఒక క్రైస్తవ కూటానికి హాజరైన తర్వాత వీధిలో నన్ను అరెస్టు చేశారు. నేను వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నిరాకరించడంతో, వారు నన్ను బిడ్‌గోష్‌లోని జైలుకు తీసుకువెళ్ళి ఆ రాత్రే విచారణ చేయడం ప్రారంభించారు. ఆరు పగళ్ళు ఆరు రాత్రులు తిండీ నీళ్ళూ లేకుండా ఒక గోడకు ఆనుకొని నిలబడమని నన్ను ఆజ్ఞాపించారు, దానికి తోడు అధికారుల సిగరెట్ల పొగ దట్టంగా అలుముకుని ఉంది. వాళ్లు నన్ను దుడ్డుకర్రతో కొట్టి, సిగరెట్లతో కాల్చారు. నాకు స్పృహ తప్పినప్పుడు నీళ్ళు జల్లి, విచారణ కొనసాగించారు. సహించడానికి శక్తినివ్వమని యెహోవాను వేడుకున్నాను, ఆయన నన్ను బలపరిచాడు.

బిడ్‌గోష్‌ చెరసాలలో ఉండడంవల్ల కొన్ని ప్రయోజనాలు కూడా చేకూరాయి. మరో విధంగా చేరుకోలేని వారితో నేను బైబిలు సత్యం పంచుకోగలిగాను. నిజానికి సాక్ష్యమివ్వడానికి నాకు అక్కడ అనేక అవకాశాలు లభించాయి. ఖైదీలు తమ దుఃఖకరమైన, నిరాశాపూరితమైన పరిస్థితి కారణంగా సువార్తను శ్రద్ధగా వినేవారు.

రెండు ప్రాముఖ్యమైన మార్పులు

నేను 1952లో విడుదలైన వెంటనే, నేను నెలా అనే ఒక ఆసక్తిగల పయినీరు సహోదరిని కలిశాను. ఆమె దక్షిణ పోలాండ్‌లో పయినీరు సేవ చేస్తోంది. ఆ తర్వాత ఆమె ఒక “బేకరీ”లో అంటే, మన సాహిత్యం ముద్రించబడే రహస్య స్థలంలో పనిచేసింది. అది ఎంతో అప్రమత్తత, స్వయంత్యాగం అవసరమైన, అలసటతో కూడిన పని. మేము 1954లో వివాహం చేసుకున్నాం, మా అమ్మాయి లిడియా పుట్టేవరకు మేము పూర్తికాల సేవలో కొనసాగాము. నేను ప్రయాణ సేవలో కొనసాగేందుకు, నెలా తన పూర్తికాల సేవను మానేసి ఇంట్లోనే ఉండి మా అమ్మాయి ఆలనాపాలనా చూసుకోవాలని నిర్ణయించుకున్నాం.

అదే సంవత్సరం మేము మరో ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. పోలాండ్‌లో మూడవవంతు ఉన్న ప్రాంతంలో నన్ను జిల్లా పైవిచారణకర్తగా సేవచేయమని కోరారు. మేము విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా పరిశీలించాము. నిషేధం క్రింద ఉన్న సహోదరులను బలపరచడం ఎంత ప్రాముఖ్యమో నాకు తెలుసు. చాలామంది అరెస్టయ్యేవారు, కాబట్టి ఆధ్యాత్మిక ప్రోత్సాహం అవసరత ఎక్కువగా ఉండేది. నెలా మద్దతుతో నేను ఆ నియామకాన్ని స్వీకరించాను. నేను 38 సంవత్సరాలపాటు జిల్లా పైవిచారణకర్తగా సేవ చేసేందుకు యెహోవా నాకు సహాయం చేశాడు.

“బేకరీల” పర్యవేక్షణ

ఆ రోజుల్లో, జిల్లా పైవిచారణకర్తకు రహస్య స్థలాల్లో ఉన్న “బేకరీలను” చూసుకునే బాధ్యత ఉండేది. మన ముద్రణ కార్యకలాపాలను కనుగొని వాటిని మూయించడానికి ప్రయత్నిస్తూ పోలీసులు ఎప్పుడూ మమ్మల్ని అనుసరిస్తుండేవారు. కొన్నిసార్లు వాళ్లు సఫలులయ్యేవారు, అయితే మాకు అవసరమైన ఆధ్యాత్మిక ఆహారం ఎప్పుడూ తక్కువ కాలేదు. దాంతో యెహోవా మా గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడని స్పష్టమయ్యేది.

యథార్థత, అప్రమత్తత, స్వయంత్యాగ స్ఫూర్తి, విధేయత ఉన్న వ్యక్తినే కష్టభరితమైన, ప్రమాదకరమైన ముద్రణా పనిని చూసుకోవడానికి ఆహ్వానిస్తారు. “బేకరీ” పని సురక్షితంగా కొనసాగాలంటే అలాంటి లక్షణాలు చాలా అవసరం. రహస్య ముద్రణ కోసం ఒక మంచి స్థలాన్ని కనుగొనడం కూడా కష్టమైనదే. కొన్ని స్థలాలు అనువైనవిగా అనిపించేవి, కానీ అక్కడున్న సహోదరులు అంత విచక్షణతో ఉండేవారు కాదు. ఇతర స్థలాల్లో, సహోదరులు విచక్షణగలవారైనా అనువైన స్థలాలు దొరికేవి కావు. సహోదరులు ఎంతటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు. నాకు ఎవరెవరితో కలిసి పని చేసే అవకాశం లభించిందో ఆ సహోదర సహోదరీలందరినీ నేను ఎంతో విలువైనవారిగా పరిగణిస్తున్నాను.

సువార్తకు మద్దతివ్వడం

ఆ కష్టభరితమైన సంవత్సరాల్లో, మేము ఎప్పుడూ చట్టవిరుద్ధమైన, తిరుగుబాటు కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నామని నిందిస్తూ మమ్మల్ని కోర్టుకు తీసుకువెళ్ళేవారు. ఇదొక సమస్యగా ఉండేది, ఎందుకంటే మా తరఫున మాట్లాడే న్యాయవాదులు మాకు లేరు. కొంతమంది సానుభూతి చూపించేవారు కానీ చాలామంది బహిరంగంగా తెలిసిపోతుందని భయపడేవారు, అధికారులకు కోపం తెప్పించడానికి ఇష్టపడేవారు కాదు. అయితే, యెహోవాకు మా అవసరాల గురించి తెలుసు, తగిన సమయంలో పరిస్థితులను ఆయన తగినవిధంగా మలిచేవాడు.

క్రకావ్‌కు చెందిన అలోజి ప్రొస్టాక్‌ అనే ప్రయాణ పైవిచారణకర్తను విచారణ సమయంలో ఎంతగా కొట్టారంటే ఆయనను చెరసాల ఆసుపత్రికి తీసుకువెళ్ళాల్సి వచ్చింది. ఆయన మానసిక, శారీరక చిత్రవధ అనుభవిస్తున్నప్పటికీ ఆయన చూపించిన దృఢ నిశ్చయత మూలంగా ఆసుపత్రిలోని ఇతర ఖైదీలు ఆయనపట్ల గౌరవాభిమానాలను చూపించారు. వారిలో వీటొల్డ్‌ లీస్‌-ఓల్షెవ్‌స్కీ అనే న్యాయవాది, సహోదరుడు ప్రొస్టాక్‌ చూపించిన ధైర్యానికి ఎంతో ముగ్ధుడయ్యాడు. ఆ న్యాయవాది ఈ సహోదరునితో అనేకసార్లు మాట్లాడి, “నేను విడుదలై నా న్యాయవాద వృత్తిని మళ్ళీ చేపట్టడానికి అనుమతి పొందిన వెంటనే, నేను యెహోవాసాక్షుల పక్షాన వాదిస్తాను” అని వాగ్దానం చేశాడు. ఆయన చెప్పినట్లే చేశాడు.

ఓల్షెవ్‌స్కీగారికి తన సొంత న్యాయవాదుల జట్టు ఉండేది, వాళ్ళు తాము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో నిజంగా ప్రశంసనీయంగా పనిచేశారు. వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉన్న సమయంలో, వాళ్ళు నెలకు 30 మంది సహోదరుల పక్షాన వాదించారు, అంటే రోజుకు ఒక కేసు చొప్పున వాదించారు! ఓల్షెవ్‌స్కీగారికి అన్ని కేసుల గురించి పూర్తి వివరాలు అందజేయాల్సి ఉంటుంది కాబట్టి, ఆయనకు అందుబాటులో ఉండే బాధ్యత నాకు అప్పగించబడింది. నేను 1960లలో, 1970లలో ఏడు సంవత్సరాలపాటు ఆయనతో కలిసి పనిచేశాను.

ఆ రోజుల్లో నేను న్యాయ సంబంధ పని గురించి ఎంతో తెలుసుకున్నాను. నేను తరచూ విచారణ జరిపించడాన్ని, న్యాయవాదుల ప్రతికూల అనుకూల వ్యాఖ్యానాలను, చట్టబద్దమైన వాదనా పద్ధతులను, నిందింపబడిన తోటి విశ్వాసుల సాక్ష్యాన్ని గమనించేవాడిని. అదంతా, కోర్టులో ఏమి చెప్పాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది తెలుసుకునేందుకు మన సహోదరులకు, ముఖ్యంగా సాక్షులుగా పిలువబడిన వారికి సహాయం చేయడంలో ఎంతో ఉపయోగపడింది.

విచారణ జరుగుతున్నప్పుడు, ఓల్షెవ్‌స్కీగారు తరచూ యెహోవాసాక్షుల ఇండ్లలో ఉండిపోయేవారు. ఆయన హోటళ్ళలో ఉండేందుకు తగిన స్థోమత లేక కాదు గానీ ఆయన ఒకసారి ఇలా అన్నారు: “విచారణకు ముందు, మీ స్ఫూర్తిని కొంత సంపాదించుకోవడానికే నేను మీతో ఉంటున్నాను.” ఆయన సహాయం మూలంగా చాలా కేసులు మనకు అనుకూలంగా ముగిసాయి. ఆయన నా పక్షాన అనేకసార్లు వాదించారు గానీ నా దగ్గర ఎప్పుడూ డబ్బు తీసుకోలేదు. మరో సందర్భంలో, ఆయన 30 కేసులకు డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు. ఎందుకు? ఆయనిలా అన్నారు: “మీ పనికి కాస్తయినా దోహదపడాలని నేను ఆశిస్తున్నాను.” ఆ కేసుల కోసం ఆయన నిరాకరించిన డబ్బు తక్కువ మొత్తమేమీ కాదు. ఓల్షెవ్‌స్కీగారి జట్టు కార్యకలాపాలు అధికారుల దృష్టికి రాకుండా పోలేదు, అయినా ఆయన మాకు సహాయం చేయడాన్ని అది ఆపలేకపోయింది.

ఆ కేసుల సమయంలో మన సహోదరులు ఇచ్చిన చక్కని సాక్ష్యాన్ని వర్ణించడం కష్టం. విచారణ జరిగేటప్పుడు గమనించడానికి, అభియోగం మోపబడిన సహోదరులను బలపరచడానికి చాలామంది కోర్టులకు వచ్చేవారు. చాలా ఎక్కువ సంఖ్యలో విచారణలు జరిగిన కాలంలో, ఒక సంవత్సరంలో దాదాపు 30,000 మంది సహోదరులు మద్దతు ఇవ్వడానికి వచ్చినట్లు నేను లెక్కబెట్టాను. అది నిజంగా సాక్షుల గొప్ప సమూహం!

ఒక క్రొత్త నియామకం

మన పనిమీద 1989కల్లా నిషేధం ఎత్తివేయబడింది. మూడు సంవత్సరాల తర్వాత క్రొత్త బ్రాంచి కార్యాలయం నిర్మించబడి, ప్రతిష్ఠించబడింది. ఆసుపత్రి సమాచార సేవల విభాగంలో పని చేయడానికి రమ్మని ఆహ్వానించబడడంతో, నేను ఆ నియామకాన్ని సంతోషంగా స్వీకరించాను. ముగ్గురు వ్యక్తుల జట్టుగా పనిచేస్తూ రక్తానికి సంబంధించిన వివాదాలను ఎదుర్కొంటున్న సహోదరులకు మద్దతిస్తూ, తమ క్రైస్తవ మనస్సాక్షి ఆధారంగా తమ స్థానాన్ని సమర్థించుకోవడానికి వారికి సహాయం చేశాము.​—⁠అపొస్తలుల కార్యములు 15:​28-29.

బహిరంగ పరిచర్యలో యెహోవా సేవచేసే అధిక్యత ఇవ్వబడినందుకు నా భార్య నేను ఎంతో కృతజ్ఞతతో ఉన్నాము. నెలా ఎప్పుడూ నాకు మద్దతిస్తూ నన్ను ప్రోత్సహించింది. నేను దైవపరిపాలనా నియామకాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు లేక చెరసాలలో ఉన్నప్పుడు, ఆమె నేను లేకపోవడం గురించి ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు, ఆ విషయంలో నేను ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. కష్ట సమయాల్లో, ఆమె కృంగిపోయే బదులు ఇతరులను ఓదార్చింది.

ఉదాహరణకు, 1974లో ఇతర ప్రయాణ పైవిచారణకర్తలతోపాటు నేను కూడా అరెస్టు చేయబడ్డాను. ఆ విషయం తెలిసిన కొంతమంది సహోదరులు నా భార్యకు ఆ విషయాన్ని తెలియజేయాలనుకున్నారు. వాళ్ళు ఆమెను, “సహోదరి నెలా, మీరు ఎలాంటి వార్త విన్నా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?” అని అడిగారు. నేను చనిపోయాననుకుని మొదట ఆమె భయంతో బిగుసుకుపోయింది. జరిగిందేమిటో తెలుసుకుని ఆమె ఎంతో ఉపశమనంతో ఇలా అంది: “ఆయన సజీవంగానే ఉన్నారు! ఆయన చెరసాలకు వెళ్ళడం ఇది మొదటిసారేమీ కాదు.” ఆమె ఆశాభావ దృక్పథానికి తాము ఎంతో ముగ్ధులమయ్యామని సహోదరులు నాకు ఆ తర్వాత చెప్పారు.

గతంలో మాకు కొన్ని బాధాకరమైన అనుభవాలు ఎదురైనా, యెహోవా మార్గాన్ని అనుసరించినందుకు ఆయన మాకు ఎల్లప్పుడూ గొప్పగా ప్రతిఫలమిచ్చాడు. మా కుమార్తె లిడియా ఆమె భర్త ఆల్‌ఫ్రెడ్‌ డిరూష ఆదర్శప్రాయమైన క్రైస్తవ దంపతులుగా ఉన్నందుకు మేమెంతగానో ఆనందిస్తున్నాం. వాళ్ళు తమ కుమారులు క్రిస్టఫర్‌, జోనాతాన్‌లను దేవుని సమర్పిత సేవకులుగా తయారయ్యేలా పెంచారు, ఇది కూడా మాకెంతో సంతోషాన్నిస్తుంది. నా తమ్ముడు రిస్జార్డ్‌, నా చెల్లెలు ఉర్సులా అనేక సంవత్సరాలుగా నమ్మకమైన క్రైస్తవులుగా ఉన్నారు.

యెహోవా మమ్మల్ని ఎన్నడూ విడనాడలేదు, హృదయపూర్వకంగా ఆయన సేవ చేయడంలో కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. మేము, కీర్తన 37:34లోని ఈ మాటల సత్యాన్ని వ్యక్తిగతంగా అనుభవించాము: “యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గము ననుసరించుము, భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును.” ఆ సమయం కోసం మేము మనస్ఫూర్తిగా ఎదురుచూస్తున్నాం.

[17వ పేజీలోని చిత్రం]

క్రాకోవ్‌లోని ఒక సహోదరుని తోటలో జరిగిన సమావేశంలో, 1964

[18వ పేజీలోని చిత్రం]

1968లో నా భార్య నెలా, మా అమ్మాయి లిడియాతో

[20వ పేజీలోని చిత్రం]

సాక్షి అయిన ఒక అబ్బాయితో, ఆ అబ్బాయికి రక్తరహిత గుండె శస్త్రచికిత్స జరగడానికి ముందు

[20వ పేజీలోని చిత్రం]

పిల్లలకు రక్తరహిత గుండె శస్త్రచికిత్స చేసే ఛీఫ్‌ సర్జన్‌ డా. వైట్స్‌తో, ఒక కటోవైస్‌ హాస్పిటల్‌ వద్ద

[20వ పేజీలోని చిత్రం]

2002లో నెలాతో