కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ‘మీ తలవెండ్రుకలను’ లెక్కించాడు

యెహోవా ‘మీ తలవెండ్రుకలను’ లెక్కించాడు

యెహోవా ‘మీ తలవెండ్రుకలను’ లెక్కించాడు

“మీ తండ్రి సెలవులేక [పిచ్చుకల్లో] ఒకటైనను నేలనుపడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి.”​—⁠మత్తయి 10:29, 30.

“దేవా సహాయం కోసం నేను నీకు మొరపెడుతున్నాను. కానీ నీవు జవాబు ఇవ్వవు. నేను నిలబడి ప్రార్థన చేస్తాను. కానీ నీవు నాకు జవాబు ఇవ్వవు. దేవా నీవు నా ఎడల అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు. నన్ను బాధపెట్టేందుకు నీవు నీ శక్తిని ప్రయోగిస్తున్నావు.” ఈ మాటలు పలికిన వ్యక్తి తీవ్రమైన బాధలోవున్నాడు, ఆయన అలా మాట్లాడాడంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఆయన తన జీవనాధారాన్ని పోగొట్టుకున్నాడు, భీకరమైన విపత్తులో ఆయన పిల్లలు చనిపోయారు, ఇప్పుడాయనను తీవ్రంగా కృశింపజేసే జబ్బు పీడిస్తోంది. ఆయన పేరు యోబు, హృదయ విదారకమైన ఆయన వృత్తాంతం మన ప్రయోజనార్థం బైబిల్లో వ్రాయబడింది.​—⁠యోబు 30:​20, 21, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

2 యోబు పలికిన మాటలు, ఆయన దేవునికి వ్యతిరేకంగా తిరిగాడేమో అనిపించేలా చేయవచ్చు, కానీ అది నిజం కాదు. యోబు తన హృదయంలోని బాధను వెలిబుచ్చాడంతే. (యోబు 6:​2, 3) తన బాధలకు సాతాను కారణమని ఆయనకు తెలియదు, అందుకే ఆయన దేవుడు తనను విడిచిపెట్టాడని పొరపడ్డాడు. ఒక సందర్భంలో యెహోవాను ఉద్దేశించి యోబు ఇలా కూడా అన్నాడు: “నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి? నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?” *​—⁠యోబు 13:24.

3 నేడు, యెహోవా ప్రజలు చాలామంది యుద్ధాలు, రాజకీయ లేదా సామాజిక సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలు, వృద్ధాప్యం, వ్యాధులు, కడు బీదరికం, ప్రభుత్వ నిషేధాలనుబట్టి నిరంతరం కష్టాలు అనుభవిస్తున్నారు. బహుశా మీరు కూడా ఏదో ఒక విధమైన కష్టాలను ఎదుర్కొంటుండవచ్చు. యెహోవా తన ముఖం మరుగు చేసుకుంటున్నాడని మీరు కొన్నిసార్లు తలంచవచ్చు. యోహాను 3:16లోని ఈ మాటలు మీకు బాగా తెలిసే ఉంటాయి: ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారుని అనుగ్రహించెను.’ అయితే కనుచూపు మేరలో ఉపశమనమే లేకుండా కష్టాలు అనుభవిస్తున్నప్పుడు మీరిలా అనుకుంటుండవచ్చు: ‘దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా? నేను అనుభవిస్తున్న కష్టాలను ఆయన గమనిస్తున్నాడా? ఒక వ్యక్తిగా నాపట్ల ఆయనకు శ్రద్ధ ఉందా?’

4 అపొస్తలుడైన పౌలుకు ఏమి జరిగిందో పరిశీలించండి. “నాకు శరీరములో ఒక ముల్లు . . . నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను” అని అంటూనే ఇంకా ఇలా వ్రాశాడు: “అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.” యెహోవా ఆయన ప్రార్థనలు విన్నాడు. అయినప్పటికీ, తాను దానికి అద్భుతరీతిలో పరిష్కారం కల్పిస్తూ జోక్యం చేసుకోనని ఆయన పౌలుకు సూచించాడు. అయితే, పౌలు తన ‘శరీరములోని ముల్లును’ * భరించేందుకు సహాయం కోసం దేవుని శక్తిపై ఆధారపడాలి. (2 కొరింథీయులు 12:​7-9) పౌలులాగే మీరు కూడా తీరని బాధను అనుభవిస్తుండవచ్చు. మీరిలా ఆలోచిస్తుండవచ్చు, ‘నేను అనుభవిస్తున్న కష్టం విషయంలో యెహోవా ఏమీ చేయలేదన్నట్లు కనిపిస్తోంది కాబట్టి, దాని భావం ఆయనకు నా పరిస్థితి తెలియదనా లేక ఆయనకు నా పట్ల శ్రద్ధలేదనా?’ అయితే దానికి అలా కాదనేదే ఖచ్చితమైన జవాబు! యేసు తన అపొస్తలులను ఎంపిక చేసుకున్న కొద్దిసేపటికే చెప్పిన మాటలు యెహోవాకు తన నమ్మకమైన సేవకుల్లో ప్రతి ఒక్కరిపట్ల ఉన్న ప్రగాఢమైన శ్రద్ధను నొక్కి చెబుతోంది. నేడు ఆయన మాటలు మనల్ని ఎలా ప్రోత్సహించగలవో చూద్దాం.

ఎందుకు ‘భయపడకూడదు?’

5 అపొస్తలులు యేసు నుండి ‘అపవిత్రాత్మలను వెళ్లగొట్టే, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరిచే అధికారంతోపాటు’ అసాధారణ శక్తులు కూడా పొందారు. అయినప్పటికీ వారి జీవితం ఇబ్బందులు, కష్టాలు లేకుండా ఉంటుందని దాని భావం కాదు. వారికి సంభవించే కొన్నింటిని యేసు వారికి ముందే వివరించాడు. అయితే ఆయన వారికి ఇలా నొక్కి చెప్పాడు: “ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో [‘గెహెన్నాలో,’ NW] నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.”​—⁠మత్తయి 10:1, 16-22, 28.

6 తన అపొస్తలులు భయపడాల్సిన అవసరం ఎందుకు లేదో గ్రహించడానికి వారికి సహాయం చేస్తూ యేసు రెండు ఉపమానాలు చెప్పాడు. ఆయన వారితో ఇలా అన్నాడు: “రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనుపడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.” (మత్తయి 10:​29-31) కష్టాలొచ్చినప్పుడు భయపడకుండా ఉండడానికి, యెహోవా మనపట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ చూపిస్తాడనే నమ్మకంతో ఉండడానికి యేసు ముడిపెట్టడాన్ని గమనించండి. అపొస్తలుడైన పౌలుకు అలాంటి నమ్మకముందని స్పష్టమవుతోంది. ఆయన ఇలా వ్రాశాడు: “దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు? తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” (రోమీయులు 8:​31, 32) కాబట్టి మీరు కూడా, ఎలాంటి కష్టాలు ఎదురైనా, యెహోవాపట్ల యథార్థంగా ఉన్నంతకాలం ఆయన మీపట్ల శ్రద్ధ చూపిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. యేసు తన అపొస్తలులకు ఇచ్చిన హెచ్చరికను మనం మరింత జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఇది మనకు మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

పిచ్చుకకున్న విలువ

7 యేసు ఉపమానాలు, యెహోవాకు తన సేవకుల్లో ప్రతి ఒక్కరిపట్ల ఉన్న శ్రద్ధను శక్తిమంతంగా వర్ణిస్తాయి. మొదట పిచ్చుకల విషయమే పరిశీలించండి. యేసు కాలంలో పిచ్చుకలను ఆహారం కోసం ఉపయోగించేవారు, అయితే అవి పంటలకు నష్టం కలిగించేవి కాబట్టి, ఒక చీడగానే వాటిని ఎక్కువగా దృష్టించేవారు. పిచ్చుకలు విస్తారంగా ఉండి, అవి కారుచౌకగా అంటే ప్రస్తుత విలువ ప్రకారం రెండు రూపాయలకన్నా తక్కువ ధరకు రెండు పిచ్చుకలు లభించేవి. దానికి రెండింతల ధరకు నాలుగు కాదు ఐదు పిచ్చుకలు లభించేవి, అంటే అదనంగా ఇచ్చిన పిచ్చుకకు అసలు విలువే లేదన్నట్లుగా ఇవ్వబడేది!​—⁠లూకా 12:6.

8 అంతేకాక, ఈ పిచ్చుక పరిమాణం గురించి కూడా ఆలోచించండి. ఇతర పక్షులతో పోలిస్తే, బాగా ఎదిగిన పిచ్చుక కూడా చాలా చిన్నగా ఉంటుంది. అయితే మత్తయి 10:29లో “పిచ్చుకలు” అని అనువదించబడిన గ్రీకు మాట ప్రత్యేకంగా చిన్న పిచ్చుకలను సూచిస్తోంది. తన అపొస్తలులు అతి చిన్న పక్షిని ఊహించుకోవాలని యేసు కోరుకున్నాడు. “యేసు చాలా చిన్నగావుండే పక్షిని ఉదాహరణగా పేర్కొంటూ, దాన్ని వర్ణించడానికి ‘చాలాచిన్న’ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు” అని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతోంది.

9 యేసు పిచ్చుకలతో పోల్చి చెప్పడం ఒక బలమైన అంశాన్ని నొక్కిచెప్పింది, అదేమిటంటే, మానవుల దృష్టికి విలువలేనివి యెహోవా దేవునికి ప్రాముఖ్యమైనవి. యెహోవాకు తెలియకుండా ఒక చిన్న పిచ్చుక కూడా “నేలనుపడదు” అని చెప్పడం ద్వారా యేసు ఈ సత్యాన్ని మరింతగా నొక్కి చెప్పాడు. * దానిలోని పాఠం స్పష్టం. యెహోవా దేవుడు అతి చిన్నదీ, అల్పమైనదీ అయిన పక్షినే లక్ష్యపెడితే, తనను సేవించడానికి నిర్ణయించుకున్న మానవుని పరిస్థితిపట్ల ఆయన ఇంకా ఎంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడో కదా!

10 పిచ్చుకల ఉపమానంతోపాటు యేసు ఇంకా ఇలా చెప్పాడు: “మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి.” (మత్తయి 10:​30) క్లుప్తంగా ఉన్నా శక్తిమంతమైన ఈ మాటలు యేసు చెప్పిన పిచ్చుకల ఉపమానంలోని అంశాన్ని మరింత వివరిస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి: సగటు మనిషి తలమీద దాదాపు 1,00,000 వెంట్రుకలు ఉంటాయి. చాలావరకు వెంట్రుకలన్నీ ఒకేలా ఉంటాయి, విడి విడిగా ఏ ఒక్క వెంట్రుకకు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదన్నట్లుగా అవి కనిపిస్తాయి. అయినప్పటికీ, యెహోవా దేవుడు ప్రతీ వెంట్రుకను గమనించి దాన్ని లెక్కిస్తాడు. కాబట్టి యెహోవా తెలుసుకోలేని, మన జీవితంలోని వివరమేమైనా ఉందా? నిశ్చయంగా యెహోవా తన సేవకుల్లో ప్రతీ వ్యక్తికి సంబంధించిన విశిష్టమైన నిర్మాణాన్ని అర్థం చేసుకుంటాడు. అవును, ఆయన ‘హృదయాన్ని లక్ష్యపెడతాడు.’​—⁠1 సమూయేలు 16:7.

11 ఎన్నో కష్టాలనుభవించిన దావీదు యెహోవాకు తనమీద శ్రద్ధ ఉందనే నమ్మకాన్ని ప్రదర్శించాడు. “యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు” అని ఆయన వ్రాశాడు. (కీర్తన 139:​1, 2) మీరు కూడా, యెహోవాకు మీరు వ్యక్తిగతంగా తెలుసనే నమ్మకంతో ఉండవచ్చు. (యిర్మీయా 17:​10) అన్నింటినీ చూడగల యెహోవా దృష్టికి మీరు అత్యల్పులని తలస్తూ తొందరపడి ఓ నిర్ణయానికి రాకండి.

“నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి”

12 యెహోవాకు తన సేవకులు వ్యక్తిగతంగా తెలిసి ఉండడమే కాక, వారిలో ప్రతీ ఒక్కరూ అనుభవించే కష్టాలు కూడా ఆయనకు పూర్తిగా తెలుసు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు బానిసలుగా అణగద్రొక్కబడుతున్నప్పుడు, యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్ట పెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.” (నిర్గమకాండము 3:⁠7) మనం ఏదైనా కష్టం అనుభవిస్తున్నప్పుడు, జరుగుతున్నదానిని యెహోవా గమనిస్తాడని మన మొరలను ఆలకిస్తాడని గ్రహించడం ఎంత ఓదార్పుకరమో కదా! ఆయన తప్పకుండా మన బాధలను పట్టించుకుంటాడు.

13 తనతో మంచి సంబంధం ఏర్పరచుకున్న వారిపట్ల యెహోవాకున్న శ్రద్ధను ఇశ్రాయేలీయుల విషయంలో ఆయనకున్న మనోభావాల్లో చూడవచ్చు. వారికొచ్చిన కష్టాలు తరచూ వారి మూర్ఖత్వాన్నిబట్టి కలిగినవే అయినప్పటికీ, యెహోవా గురించి యెషయా ఇలా వ్రాశాడు: “వారి యావద్బాధలో ఆయన బాధనొందెను.” (యెషయా 63:⁠9) యెహోవా నమ్మకమైన సేవకులుగా మీరు బాధ అనుభవించినప్పుడు, యెహోవా కూడా బాధపడతాడని నమ్మవచ్చు. కష్టాలను నిర్భయంగా ఎదుర్కొంటూ, శాయశక్తులా ఆయన సేవలో కొనసాగడానికి ఇది మిమ్మల్ని ప్రేరేపించడం లేదా?​—⁠1 పేతురు 5:6, 7.

14 యెహోవాకు తనపట్ల శ్రద్ధ, సహానుభూతి ఉన్నాయని రాజైన దావీదుకున్న నమ్మకం 56వ కీర్తనలో స్పష్టం చేయబడింది. దావీదు ఆ కీర్తనను, తనను చంపడానికి ఉద్యుక్తుడైన సౌలు రాజు నుండి పారిపోతున్నప్పుడు కూర్చాడు. దావీదు గాతుకు పారిపోయాడు గానీ, ఫిలిష్తీయులు తనను గుర్తుపట్టినప్పుడు తాను పట్టుబడతానని భయపడ్డాడు. ఆయన ఇలా వ్రాశాడు: “అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మ్రింగవలెనని యున్నారు.” తనకు కలిగిన విపత్కర పరిస్థితినిబట్టి దావీదు యెహోవాకు ప్రార్థించాడు. “దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి” అని ఆయన అన్నాడు.​—⁠కీర్తన 56:2, 5.

15 ఆ తర్వాత కీర్తన 56:8లో వ్రాయబడినట్లుగా, దావీదు ఆసక్తికరమైన ఈ వ్యాఖ్యలు చేశాడు: “నా సంచారములను నీవు లెక్కించి యున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి, అవి నీ కవిలెలో [“పుస్తకము,” అధస్సూచి] కనబడును గదా.” యెహోవా వాత్సల్యపూరిత శ్రద్ధను ఆ మాటలు ఎంత కరుణాభరితంగా వర్ణిస్తున్నాయో కదా! మనం ఒత్తిడితో ఉన్నప్పుడు, మనం కన్నీళ్లతో యెహోవాకు మొరపెట్టవచ్చు. పరిపూర్ణుడైన యేసు కూడా అలాగే చేశాడు. (హెబ్రీయులు 5:⁠7) యెహోవాకు తనమీద శ్రద్ధ ఉందనీ, తన కన్నీళ్లను బుడ్డిలో దాచినట్లుగా లేదా పుస్తకంలో వ్రాసిపెట్టినట్లుగా తన వ్యధను గుర్తుంచుకుంటాడనీ దావీదు బలంగా నమ్మాడు. * మీ కన్నీళ్ళు ఆ బుడ్డిలో ఎక్కువ భాగాన్ని నింపేస్తాయని లేదా అలాంటి పుస్తకంలోని అనేక పుటల్లో అవే నిండిపోతాయని బహుశా మీరు భావిస్తుండవచ్చు. అదే నిజమైతే, మీరు ఓదార్పు పొందవచ్చు. ఎందుకంటే, బైబిలు మనకు ఇలా హామీ ఇస్తోంది: “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు; నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.”​—⁠కీర్తన 34:18.

దేవుని సన్నిహిత సహచరునిగా మారడం

16 యెహోవా ‘మన తలవెండ్రుకలు’ లెక్కించాడనే వాస్తవం, ఏ దేవుణ్ణి ఆరాధించే ఆధిక్యత మనకు లభించిందో ఆ దేవుడు ఎంత శ్రద్ధ, జాగ్రత్త గలవాడో మనకు తెలియజేస్తుంది. అన్ని బాధలు, కష్టాలు తొలగిపోవడానికి మనం వాగ్దత్త నూతనలోకం వచ్చేంతవరకు వేచి ఉండవలసి ఉన్నప్పటికీ, యెహోవా తన ప్రజలకోసం ఒక అద్భుతాన్ని ఇప్పుడే చేస్తున్నాడు. దావీదు ఇలా వ్రాశాడు: ‘యెహోవాకు భయపడేవారు ఆయనకు సన్నిహితమవుతారు, అంతేగాక ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడు.’​—⁠కీర్తన 25:​14, NW.

17 ‘యెహోవాకు సన్నిహితమవడం.’ ఆ తలంపే అపరిపూర్ణ మానవుల ఊహకందని విషయంగా కనిపిస్తోంది! అయితే, తనకు భయపడేవారిని యెహోవా తన గుడారములోకి అతిథులుగా ఆహ్వానిస్తున్నాడు. (కీర్తన 15:​1-5) యెహోవా తన అతిథులకు ఏమి అనుగ్రహిస్తాడు? దావీదు చెప్పినట్లుగా, ఆయన తన నిబంధనను వారికి తెలియజేస్తాడు. వారు తన సంకల్పాలేమిటో తెలుసుకొని వాటికనుగుణంగా జీవించడానికి తామేమి చేయాలో తెలుసుకోగలిగేలా, యెహోవా తాను “సంకల్పించినదానిని” ప్రవక్తలకు తెలియజేస్తూ ఆంతరంగిక విషయాలను వారికి వెల్లడిచేస్తాడు.​—⁠ఆమోసు 3:7.

18 అపరిపూర్ణ మానవులమైన మనం సర్వోన్నతుడైన యెహోవా దేవుని సన్నిహిత సహవాసులం కాగలమని తెలుసుకోవడం నిజంగా ఎంతో సంతోషించదగ్గ విషయం. వాస్తవానికి మనమలా చేయాలని ఆయన మనల్ని పురికొల్పుతున్నాడు. “దేవునికి సన్నిహితమవండి, అప్పుడాయన మీకు సన్నిహితమవుతాడు” అని బైబిలు చెబుతోంది. (యాకోబు 4:​8, NW) మనమాయనతో సన్నిహిత సంబంధం కలిగివుండాలని యెహోవా కోరుతున్నాడు. వాస్తవానికి, అలాంటి సంబంధం సాధ్యమయ్యేలా చేసేందుకు ఆయన ఇప్పటికే చర్యలు తీసుకున్నాడు. యేసు విమోచన క్రయధన బలి మనం సర్వశక్తిగల దేవునికి స్నేహితులుగా ఉండగల అవకాశాన్నిచ్చింది. బైబిలు ఇలా చెబుతోంది: “ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.”​—⁠1 యోహాను 4:19.

19 కష్ట పరిస్థితుల్లో మనం సహనంతో ఉన్నప్పుడు ఆ సన్నిహిత సంబంధం మరింత బలోపేతమవుతుంది. శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “మీరు సంపూర్ణులును, అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునైయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి.” (యాకోబు 1:⁠4) కష్టాలను సహించినప్పుడు ఏ “క్రియ” నెరవేర్చబడుతుంది? పౌలు ‘శరీరములోని ముల్లును’ జ్ఞాపకం చేసుకోండి. ఆయన విషయంలో సహనం ఏమి నెరవేర్చింది? తనకు ఎదురైన పరీక్షల గురించి పౌలు ఇలా చెప్పాడు: “క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.” (2 కొరింథీయులు 12:​9, 10) యెహోవాయే కష్టాలను భరించగలిగేలా తనకు కావలసిన శక్తిని—అవసరమైతే ‘బలాధిక్యాన్ని’ ఇస్తాడని పౌలు అనుభవపూర్వకంగా గ్రహించాడు. తిరిగి, అది ఆయనను క్రీస్తుకు, యెహోవా దేవునికి మరింత సన్నిహితుణ్ణి చేసింది.​—⁠2 కొరింథీయులు 4:7; ఫిలిప్పీయులు 4:11-13.

20 మీ కష్టాలు కొనసాగడానికి బహుశా యెహోవా అనుమతించి ఉండవచ్చు. అలాగైతే, తనకు భయపడేవారికి ఆయన ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మనస్సులో ఉంచుకోండి: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.” (హెబ్రీయులు 13:5) మీరు అలాంటి మద్దతును, ఓదార్పును అనుభవించవచ్చు. యెహోవా ‘మీ తలవెండ్రుకలను’ లెక్కించాడు. ఆయన మీ సహనాన్ని చూస్తాడు. మీ బాధ ఆయనకు తెలుసు. ఆయనకు మీ పట్ల నిజంగా శ్రద్ధ ఉంది. ఆయన ఎన్నడూ ‘మీరు చేసిన కార్యమును, తన నామమునుబట్టి చూపిన ప్రేమను మర్చిపోడు.’—హెబ్రీయులు 6:10.

[అధస్సూచీలు]

^ పేరా 4 నీతిమంతుడైన దావీదు, నమ్మకస్థులైన కోరహు కుమారులు కూడా ఆ విధమైన వ్యాఖ్యానాలే చేశారు.—కీర్తన 10:1; 44:24.

^ పేరా 6 పౌలు ‘శరీరములోని ముల్లు’ ఖచ్చితంగా ఏమిటో బైబిలు చెప్పడం లేదు. అది కంటిచూపు సన్నగిల్లడం వంటి శారీరక రుగ్మత కావచ్చు. లేదా ‘శరీరములోని ముల్లు’ అనే మాట పౌలు అపొస్తలత్వాన్ని, పరిచర్యను సవాలు చేసిన అబద్ధ అపొస్తలులను గానీ ఇతరులను గానీ సూచించవచ్చు.—2 కొరింథీయులు 11:6, 13-15; గలతీయులు 4:15; 6:11.

^ పేరా 13 పిచ్చుక నేలనుపడడమనేది, కేవలం పిచ్చుక చనిపోవడాన్ని మాత్రమే సూచించదు అని కొందరు విద్వాంసులు అంటున్నారు. ఆదిమ భాషాపదం ఆ పక్షి ఆహారం కోసం నేలకు దిగడాన్ని కూడా సూచించవచ్చని వారు చెబుతున్నారు. అదే నిజమైతే, ఆ పక్షి చనిపోయిన విషయాన్నే కాదు దాని దైనందిన పనులను కూడా దేవుడు గమనిస్తూ శ్రద్ధ తీసుకుంటాడనే భావాన్నిస్తుంది.​—⁠మత్తయి 6:26.

^ పేరా 20 ప్రాచీన కాలాల్లో, బుడ్డిని లేదా తోలు తిత్తిని పదునుపెట్టిన గొర్రెల, మేకల, పశువుల చర్మంతో తయారుచేసేవారు. అలాంటి తిత్తులను పాలు, వెన్న, జున్ను లేదా నీరు నిల్వజేయడానికి వాడేవారు. మరింత పదునుపెట్టిన తిత్తులు నూనె లేదా ద్రాక్షారసం నిల్వజేయడానికి కూడా ఉపయోగపడేవి.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

ఏ విషయాలు దేవుడు తనను విడిచిపెట్టాడని ఒక వ్యక్తి భావించేలా చేయగలవు?

పిచ్చుకల గురించి, మన తలవెంట్రుకలు లెక్కించబడడం గురించి యేసు చెప్పిన ఉపమానాల నుండి మనమే పాఠం నేర్చుకుంటాం?

ఒక వ్యక్తి కన్నీళ్లు యెహోవా “బుడ్డిలో” ఉంచబడడం లేదా “పుస్తకంలో” కనబడడం అంటే అర్థమేమిటి?

మనం ‘యెహోవాతో సాన్నిహిత్యాన్ని’ ఎలా ఆస్వాదించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) దేవుడు తనను విడిచిపెట్టినట్లు యోబు ఎందుకు భావించాడు? (బి) యోబు మాటలు ఆయన యెహోవాకు వ్యతిరేకంగా తిరిగాడనే భావాన్నిస్తున్నాయా? వివరించండి.

3. కష్టాలు వచ్చినప్పుడు మన మనస్సులోకి ఎలాంటి భావాలు రావచ్చు?

4. పౌలు ఎలాంటి అవిరామ పరిస్థితిని భరించాల్సివచ్చింది, అలాంటి పరిస్థితి ఏయే విధాలుగా మనల్ని ప్రభావితం చేయవచ్చు?

5, 6. (ఎ) భవిష్యత్తులో జరగబోయేవాటి గురించి భయపడాల్సిన అవసరం లేదని గ్రహించడానికి యేసు తన అపొస్తలులకు ఎలా సహాయం చేశాడు? (బి) యెహోవాకు తనపట్ల శ్రద్ధ ఉందనే నమ్మకాన్ని పౌలు ఎలా చూపించాడు?

7, 8. (ఎ) యేసు కాలంలో పిచ్చుకలను ఎలా దృష్టించేవారు? (బి) “పిచ్చుకలు” అనే పదానికి మత్తయి 10:⁠29 అల్పార్థసూచక గ్రీకు మాటను ఎందుకు ఉపయోగిస్తోంది?

9. పిచ్చుకల గురించిన యేసు ఉపమానం ఎలాంటి బలమైన అంశాన్ని నొక్కిచెప్పింది?

10. “మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి” అనే మాటలకున్న విశేషత ఏమిటి?

11. దావీదు తనపట్ల యెహోవాకున్న శ్రద్ధ విషయంలో తన నమ్మకాన్ని ఎలా వ్యక్తపరిచాడు?

12. తన ప్రజలు అనుభవించే కష్టాలు యెహోవాకు పూర్తిగా తెలుసని మనకు ఎలా తెలుసు?

13. యెహోవాకు తన సేవకులపట్ల నిజంగా శ్రద్ధ ఉందని ఏది చూపిస్తోంది?

14. యాభై ఆరవ కీర్తన ఎలాంటి పరిస్థితుల్లో కూర్చబడింది?

15. (ఎ) యెహోవా తన కన్నీళ్లను బుడ్డిలో ఉంచాడని లేదా పుస్తకంలో వ్రాశాడని చెప్పినప్పుడు దావీదు భావమేమిటి? (బి) విశ్వాస సంబంధ పరీక్షను మనం ఎదుర్కొంటున్నప్పుడు, ఏ విషయంలో మనం ధైర్యంగా ఉండవచ్చు?

16, 17. (ఎ) తన ప్రజలు ఎదుర్కొనే సమస్యలను యెహోవా పట్టించుకుంటాడని మనకెలా తెలుసు? (బి) ప్రజలు తనతో సాన్నిహిత్యాన్ని అనుభవించేందుకు వీలుగా యెహోవా ఏమిచేశాడు?

18. మనమాయనతో సన్నిహిత సంబంధం కలిగివుండాలని యెహోవా కోరుతున్నాడని మనకెలా తెలుసు?

19. సహనం యెహోవాతో మన సంబంధాన్ని ఎలా బలోపేతం చేయగలదు?

20. కష్టాలు ఎదురైనప్పుడు యెహోవా మనకు మద్దతును, ఓదార్పును ఇస్తాడని మనమెలా నమ్మవచ్చు?

[22వ పేజీలోని చిత్రం]

పౌలు ‘శరీరములోని ముల్లును’ యెహోవా ఎందుకు తొలగించలేదు?

[23వ పేజీలోని చిత్రం]

పిచ్చుకల గురించి యేసు చెప్పిన ఉపమానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

[చిత్రసౌజన్యం]

© J. Heidecker/VIREO

[25వ పేజీలోని చిత్రం]

బైబిలును క్రమంగా చదవడం ద్వారా, దేవునికి మనలో ప్రతి ఒక్కరిపట్ల శ్రద్ధ ఉందనే హామీని పొందవచ్చు