కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రెండవ రాజుల గ్రంథములోని ముఖ్యాంశాలు

రెండవ రాజుల గ్రంథములోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

రెండవ రాజుల గ్రంథములోని ముఖ్యాంశాలు

మొదటి రాజుల పుస్తకం ముగిసిన చోట నుండి రెండవ రాజుల పుస్తకం ప్రారంభమవుతుంది. ఆ పుస్తకంలో 29మంది రాజుల వృత్తాంతాలు ఉన్నాయి, ఆ రాజుల్లో 12 మంది ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకు చెందినవారు, 17 మంది దక్షిణ రాజ్యమైన యూదాకు చెందినవారు ఉన్నారు. రెండవ రాజుల గ్రంథము ఏలీయా, ఎలీషా, యెషయా ప్రవక్తల కార్యకలాపాల గురించి కూడా చెబుతోంది. అది ఖచ్చితంగా కాలక్రమానుసారంగా లేకపోయినా, ఆ గ్రంథములో షోమ్రోను, యెరూషలేము నాశనమైనప్పుడు సంభవించిన ఘటనల గురించిన వృత్తాంతాలు కూడా ఉన్నాయి. మొత్తం కలిపి, రెండవ రాజుల గ్రంథములో 340 సంవత్సరాల్లో జరిగిన ఘటనల గురించి అంటే సా.శ.పూ. 920 మొదలుకొని సా.శ.పూ. 580లో యిర్మీయా ప్రవక్త ఈ పుస్తకాన్ని వ్రాయడం ముగించేంతవరకు జరిగిన ఘటనల వివరాలు ఉన్నాయి.

రెండవ రాజుల గ్రంథము ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? అది యెహోవా గురించీ, ఆయన కార్యకలాపాల గురించీ మనకు ఏమి బోధిస్తోంది? ఈ పుస్తకంలో పేర్కొనబడిన రాజులు, ప్రవక్తలు, తదితరుల చర్యల నుండి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు? మనం రెండవ రాజుల గ్రంథము నుండి ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం.

ఏలీయా స్థానంలో ఎలీషా వస్తాడు

(2 రాజులు 1:1-8:29)

ఇశ్రాయేలు రాజైన అహజ్యా తన ఇంట్లో పడిపోవడంతో రోగి అవుతాడు. తనకు మరణం తప్పదని ఆయన ఏలీయా ప్రవక్త ద్వారా తెలుసుకుంటాడు. ఆ ప్రకారమే అహజ్యా మరణిస్తాడు, ఆ తర్వాత ఆయన సహోదరుడైన యెహోరాము సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఆ సమయంలో యెహోషాపాతు యూదాకు రాజుగా ఉన్నాడు. ఏలీయా సుడిగాలిచేత ఆకాశానికి ఆరోహణమై వెళ్తాడు, ఆయన స్థానంలో ఆయన సహాయకుడైన ఎలీషా ప్రవక్త అవుతాడు. ఆ తర్వాత ఏలీషా దాదాపు 60 సంవత్సరాల తన పరిచర్యలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు.​—⁠“ఎలీషా చేసిన అద్భుతాలు” అనే బాక్సును చూడండి.

ఒక మోయాబు రాజు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేసినప్పుడు యెహోరాము, యెహోషాపాతు, ఎదోము రాజు అతనితో యుద్ధం చేయడానికి వెళ్తారు. యెహోషాపాతు విశ్వాసం కారణంగా వారు విజయం పొందుతారు. ఆ తర్వాత, సిరియా రాజు ఇశ్రాయేలు మీద ఆకస్మికంగా దాడి చేయాలని పథకం వేస్తాడు. అయితే, ఎలీషా ఆ పథకాన్ని విఫలం చేస్తాడు. సిరియా రాజు కోపోద్రేకుడై ఎలీషాను పట్టుకోవడానికి “గుఱ్ఱములను రథములను గొప్ప సైన్యమును” పంపిస్తాడు. (2 రాజులు 6:​14) ఎలీషా రెండు అద్భుతాలు చేసి సిరియన్లను సమాధానంతో పంపిస్తాడు. కొంతకాలం గడిచిన తర్వాత సిరియా రాజైన బెన్హదదు షోమ్రోనును ముట్టడిస్తాడు. అది తీవ్ర క్షామానికి దారి తీస్తుంది, అయితే ఆ క్షామం తొలగిపోతుందని ఎలీషా ముందుగానే చెబుతాడు.

కొంతకాలం తర్వాత ఎలీషా దమస్కుకు వెళ్తాడు. అప్పుడు అనారోగ్యంతో ఉన్న బెన్హదదు రాజు తాను అనారోగ్యం నుండి కోలుకుంటానో లేదో విచారించడానికి హజాయేలును పంపిస్తాడు. రాజు చనిపోతాడని అతని స్థానంలో హజాయేలు పరిపాలిస్తాడని ఎలీషా చెబుతాడు. ఆ మరుసటి రోజే హజాయేలు “ముదుగు బట్ట” తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖము మీద కప్పి అతనికి ఉపిరాడకుండా చేసి చంపి తాను రాజవుతాడు. (2 రాజులు 8:​15) యూదాలో, యెహోషాపాతు కుమారుడైన యెహోరాము రాజవుతాడు, ఆయన తర్వాత ఆయన కుమారుడైన అహజ్యా రాజవుతాడు.​—⁠“యూదా, ఇశ్రాయేలు రాజులు” అనే బాక్సును చూడండి.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:9​—⁠ఎలీషా ‘ఏలీయా ఆత్మలో రెండుపాళ్ళను’ ఎందుకు అడుగుతాడు? ఎలీషా ఇశ్రాయేలు ప్రవక్తగా తన బాధ్యతను నిర్వర్తించడానికి ఏలీయా చూపించినలాంటి ధైర్యం, నిబ్బరం ఆయనకు అవసరం. ఎలీషా దానిని గుర్తించి ఏలీయా ఆత్మలో రెండు పాళ్ళను అడిగాడు. ఎలీషాను ఏలీయా తన వారసునిగా నియమించాడు, ఎలీషా ఆరు సంవత్సరాలు ఆయన సేవకునిగా ఉన్నాడు కాబట్టి ఎలీషా, ఏలీయాను తన ఆధ్యాత్మిక తండ్రిగా దృష్టించాడు. ఎలీషా, ఏలీయాకు ఆధ్యాత్మిక జ్యేష్ఠ కుమారుని లాంటివాడు. (1 రాజులు 19:19-21; 2 రాజులు 2:​12) అందుకే సాధారణంగా జ్యేష్ఠపుత్రుడు తన తండ్రి స్వాస్థ్యంలో నుండి రెండు పాళ్ళు పొందినట్లే, ఏలీయా నుండి ఎలీషా రెండు పాళ్ళ ఆధ్యాత్మిక స్వాస్థ్యాన్ని కోరి, దాన్ని పొందాడు.

2:11​—⁠‘ఏలీయా సుడిగాలిచేత ఆరోహణమై’ వెళ్లిన ‘ఆకాశం’ ఏది? అది భౌతిక విశ్వంలోని సుదూర ప్రాంతమూ కాదు లేక దేవుడు, ఆయన కుమారులైన దేవదూతలు నివసించే పరలోకమూ కాదు. (ద్వితీయోపదేశకాండము 4:19; కీర్తన 11:4; మత్తయి 6:9; 18:​10) ఏలీయా ఆరోహణమైన ‘ఆకాశము’ భూవాతావరణానికి సంబంధించిన ఆకాశమే. (కీర్తన 78:26; మత్తయి 6:​26) ఆ అగ్ని రథం భూవాతావరణం గుండా వేగంగా ప్రయాణించి ఏలీయాను భూమ్మీద మరో భాగానికి తీసుకువెళ్ళిందని తెలుస్తోంది, ఆయన కొంతకాలం అక్కడ నివసించాడు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల తర్వాత ఏలీయా యూదా రాజైన యెహోరాముకు ఒక పత్రిక వ్రాశాడు.​—⁠2 దినవృత్తాంతములు 21:​1, 12-15.

5:​15, 16​—⁠ఎలీషా నయమాను ఇచ్చే బహుమానాన్ని ఎందుకు అంగీకరించలేదు? నయమాను స్వస్థతకు సంబంధించిన అద్భుతం యెహోవా శక్తి ద్వారానే జరిగింది కానీ తన స్వశక్తి ద్వారా కాదని ఎలీషా గుర్తించాడు కాబట్టి, ఆయన ఆ బహుమానాన్ని నిరాకరించాడు. దేవుడు ఇచ్చిన అధికారం నుండి లాభం పొందాలని ఆయన ఎప్పుడూ అనుకుని ఉండకపోవచ్చు. నేడు సత్యారాధకులు కూడా యెహోవా సేవ నుండి స్వలాభం పొందడానికి ప్రయత్నించరు. వారు, “ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి” అని యేసు చెప్పిన మాటలను మనస్సులో ఉంచుకుంటారు.​—⁠మత్తయి 10:⁠8.

5:⁠18, 19​—⁠నయమాను మతసంబంధమైన క్రియలో భాగం వహించాల్సి వస్తున్నందుకు క్షమాపణ అడిగాడా? సిరియా రాజు వృద్ధుడే కాక బలహీనంగా కూడా ఉన్నాడు కాబట్టి, ఆయన ఆసరా కోసం నయమాను మీద ఆనుకోవాల్సి వచ్చేదని తెలుస్తోంది. రాజు రిమ్మోనును ఆరాధించడంలో భాగంగా మోకరిల్లినప్పుడు, నయమాను కూడా మోకరిల్లుతాడు. నయమాను విషయంలోనైతే అది పూర్తిగా యాంత్రికమైన క్రియ, ఆయన కేవలం రాజు శరీరానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతోనే మోకరిల్లుతున్నాడే తప్ప ఆరాధించాలని కాదు. నయమాను ఈ పౌరసంబంధ బాధ్యతను నిర్వహిస్తున్నందుకు తనను క్షమించమని యెహోవాను అడిగాడు. ఎలీషా నయమానును నమ్మి ఆయనతో ఇలా అన్నాడు: “నెమ్మదిగలిగి పొమ్ము.”

మనకు పాఠాలు:

1:⁠13, 14. గమనించడం ద్వారా నేర్చుకోవడం, వినయంతో ప్రవర్తించడం జీవితాలను రక్షించగలదు.

2:​2, 4, 6. ఎలీషా బహుశా ఆరు సంవత్సరాలుగా ఏలీయా సేవకునిగా ఉన్నప్పటికీ ఆయనను విడిచిపోడానికి ఇష్టపడలేదు. విశ్వసనీయత, స్నేహం విషయంలో ఎంత మంచి మాదిరో కదా!​—⁠సామెతలు 18:​24.

2:⁠23, 24. ఎలీషాను అలా ఎగతాళి చేయడానికి ముఖ్య కారణం, బట్టతలగల వ్యక్తి ఏలీయా అధికార వస్త్రాన్ని ధరించడమే అనిపిస్తోంది. ఎలీషా యెహోవా ప్రతినిధి అని పిల్లలు గుర్తించారు, కాబట్టి ఆయన వారి పరిసరాల్లో ఉండడం వారికి అసలు ఇష్టంలేదు. వారు ఆయనను “ఎక్కిపొమ్మని” చెప్పారు, దానర్థం వారు ఆయనను బేతేలు వరకు ఎక్కి వెళ్ళమన్నారు లేదా ఏలీయా ఆరోహణమైనట్లు ఆయనను కూడా ఆరోహణమవ్వమని అన్నారు. ఆ పిల్లలు తమ తల్లిదండ్రుల వైరి భావాన్నే ప్రతిబింబించారని స్పష్టమవుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని ప్రతినిధులను గౌరవించడాన్ని నేర్పించడం ఎంత ప్రాముఖ్యమో కదా!

3:⁠14, 18, 24. యెహోవా వాక్యం ఎల్లప్పుడూ నిజమవుతుంది.

3:⁠22. బహుశా అంతకుముందే త్రవ్వబడిన గోతుల్లోని ఎర్రమట్టి కారణంగా ఉదయకాలపు వెలుగులో ఆ గోతుల్లోని నీరు రక్తంలా కనిపించి ఉండవచ్చు. యెహోవా తన సంకల్పాలను నెరవేర్చడానికి సహజ ప్రక్రియలను ఉపయోగించడానికి ఇష్టపడవచ్చు.

4:​8-11. షూనేముకు చెందిన ఒక స్త్రీ ఎలీషా “దైవజనుడని” గుర్తించి ఆయనకు ఆతిథ్యాన్నిచ్చింది. మనం కూడా యెహోవా నమ్మకమైన ఆరాధకులకు అలాగే చేయవద్దా?

5:⁠3. ఇశ్రాయేలుకు చెందిన చిన్న బాలిక అద్భుతాలు చేయడానికి దేవునికి ఉన్న సామర్థ్యం మీద విశ్వాసముంచింది. ఆమెకు తన విశ్వాసం గురించి మాట్లాడడానికి ధైర్యం కూడా ఉంది. చిన్నపిల్లలారా, మీరు దేవుని వాగ్దానాలపట్ల మీ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి కృషి చేస్తూ, సత్యాన్ని మీ ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు చెప్పేందుకు ధైర్యం కూడగట్టుకుంటున్నారా?

5:​9-19. ఒక గర్విష్ఠి వినయాన్ని నేర్చుకోగలడని నయమాను ఉదాహరణ రుజువు చేయడం లేదా?​—⁠1 పేతురు 5:⁠5.

5:​20-27. గేహజీ మోసపూరితమైన రీతిలో ప్రవర్తించిన కారణంగా ఘోరమైన పర్యవసానాలను ఎదుర్కొన్నాడు. ద్వంద్వ జీవితాన్ని గడపడం ద్వారా రాగల వ్యక్తిగత క్షోభను, విషాదాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచించడం మనం అలాంటి మార్గాన్ని అనుసరించకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది.

ఇశ్రాయేలు, యూదా చెరగా కొనిపోబడడం

(2 రాజులు 9:1-25:30)

యెహూ ఇశ్రాయేలు రాజుగా అభిషేకించబడ్డాడు. ఆయన వెంటనే ఆహాబు కుటుంబీకులనందరినీ చంపేసే కార్యక్రమం మొదలుపెడతాడు. యెహూ నైపుణ్యంగా ‘బయలు ఆరాధన ఇశ్రాయేలువారిమధ్య ఉండకుండ నాశనము చేస్తాడు.’ (2 రాజులు 10:​28) యెహూ తన కుమారుణ్ణి చంపాడని అహజ్యా తల్లి అతల్యా తెలుసుకున్న తర్వాత ఆమె యూదా “రాజకుమారులనందరిని నాశనము చేసి” సింహాసనాన్ని చేజిక్కించుకుంటుంది. (2 రాజులు 11:⁠1) శిశువుగా ఉన్న, అహజ్యా కుమారుడైన యోవాషు మాత్రం కాపాడబడి, ఆరు సంవత్సరాలు దాచబడివున్న తర్వాత యూదా రాజుగా అభిషేకించబడతాడు. యోవాషు, యాజకుడైన యెహోయాదా నుండి ఉపదేశం పొంది యెహోవా దృష్టిలో సరైనవి చేయడంలో కొనసాగుతాడు.

యెహూ తర్వాత ఇశ్రాయేలును పరిపాలించిన రాజులందరూ యెహోవా దృష్టిలో చెడు చేస్తారు. ఎలీషా యెహూ మనవడి కాలంలో సహజ మరణాన్ని పొందాడు. యోవాషు తర్వాత ఆహాజు యూదాకు నాల్గవ రాజవుతాడు, ఆయన ‘యెహోవా దృష్టిలో నీతిగా ప్రవర్తించలేదు.’ (2 రాజులు 16:​1, 2) అయితే ఆయన కుమారుడైన హిజ్కియా మాత్రం తాను ‘యెహోవాను హత్తుకొని ఉన్న’ రాజునని నిరూపించుకుంటాడు. (2 రాజులు 17:20; 18:⁠6) సా.శ.పూ. 740లో హిజ్కియా యూదా రాజుగా, హోషేయ ఇశ్రాయేలు రాజుగా పరిపాలిస్తున్నప్పుడు అష్షూరురాజైన షల్మనేసెరు ‘షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెరగొనిపోతాడు.’ (2 రాజులు 17:⁠6) ఆ తర్వాత విదేశీయులు ఇశ్రాయేలు ప్రాంతంలోకి తీసుకురాబడతారు, సమరయ మతం ఉనికిలోకి వస్తుంది.

యూదాలో హిజ్కియా తర్వాత వచ్చిన ఏడుగురు రాజుల్లో యోషీయా మాత్రమే దేశం నుండి అబద్ధ ఆరాధన తొలగించడానికి చర్యలు తీసుకున్నాడు. చివరగా, సా.శ.పూ. 607లో బబులోనీయులు యోరూషలేమును స్వాధీనం చేసుకొన్నప్పుడు, ‘యూదా వారు తమ దేశములోనుండి ఎత్తికొని పోబడతారు.’​—⁠2 రాజులు 25:​21.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

13:​20, 21​—⁠ఈ అద్భుతం, మతసంబంధమైన అస్థికలను పూజించడాన్ని సమర్థిస్తోందా? లేదు, అది అలా సమర్థించడం లేదు. ఎలీషా ఎముకలు ఎప్పుడైనా పూజించబడినట్లు బైబిలు చెప్పడం లేదు. ఎలీషా జీవించి ఉన్నప్పుడు చేసిన అద్భుతాలు దేవుని శక్తివల్ల సాధ్యమైనట్లే ఈ అద్భుతం కూడా ఆ శక్తివల్లే సాధ్యమయింది.

15:​1-6​—⁠యెహోవా అజర్యాను (ఉజ్జియాను, 2 దిన. 26:⁠1) కుష్ఠరోగముతో ఎందుకు మొత్తాడు? “అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహము చే[సెను].” యాజకులు “రాజైన ఉజ్జియాను ఎదిరించి . . . పరిశుద్ధస్థలములో నుండి బయటికి పొమ్ము” అని ఆయనకు చెప్పినప్పుడు, ఆయన యాజకులమీద కోపగించుకున్నాడు, ఆ తర్వాత ఆయన కుష్ఠురోగంతో మొత్తబడ్డాడు.​—⁠2 దినవృత్తాంతములు 26:​16-20.

18:​19-21, 25​—⁠హిజ్కియా ఐగుప్తుతో పొత్తు కుదుర్చుకున్నాడా? లేదు. రబ్షాకే “యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను” అని అబద్ధం చెప్పినట్లే ఆయన చేసిన ఆరోపణలు కూడా అబద్ధమే. నమ్మకస్థుడైన హిజ్కియా రాజు యెహోవా మీదే ఆధారపడ్డాడు.

మనకు పాఠాలు:

9:​7, 26. ఆహాబు కుటుంబం మీదకు వచ్చిన తీవ్రమైన తీర్పు, అబద్ధ ఆరాధనా, నిరపరాధుల రక్తాన్ని చిందించడం యెహోవాకు అసహ్యకరమైనవని రుజువు చేస్తోంది.

9:⁠20. యెహూకు, వేగంగా రథాన్ని నడిపించేవానిగా ఉన్న పేరు తనకు ఇవ్వబడిన ఆజ్ఞను నిర్వర్తించడంలో ఆయనకున్న ఉత్సాహాన్ని రుజువు చేస్తుంది. ఒక ఉత్సాహవంతమైన రాజ్య ప్రచారకుడు లేక ప్రచారకురాలు అనే పేరు మీకుందా?​—⁠2 తిమోతి 4:⁠2.

9:​36,37; 10:​17; 13:​18, 19, 25; 14:​25; 19:​20, 32-36; 20:​16, 17; 24:​13. ‘యెహోవా నోటనుండి వచ్చు వచనము సఫలమవుతుంది’ అని మనం నమ్మకం కలిగివుండవచ్చు.​—⁠యెషయా 55:​10, 11.

10:​15. యెహోనాదాబు, తనతో రావడానికి రథాన్ని ఎక్కమనే యెహూ ఆహ్వానాన్ని హృదయపూర్వకంగా అంగీకరించినట్లే, “గొప్పసమూహము” ఆధునిక దిన యెహూ అయిన యేసుక్రీస్తుకూ, ఆయన అభిషిక్త అనుచరులకూ ఇష్టపూర్వకంగా మద్దతునిస్తోంది.​—⁠ప్రకటన 7:⁠9.

10:​30, 31. యెహూ చరిత్ర నిష్కళంకమేమీ కాకపోయినా, యెహోవా ఆయన చేసినవాటినన్నిటినీ విలువైనవిగా ఎంచాడు. అవును, ‘మనం చేసిన కార్యాలను మరచిపోవడానికి దేవుడు అన్యాయస్థుడు కాడు.’​—⁠హెబ్రీయులు 6:​10.

13:​14-19. యెహూ మనవడైన యెహోయాషు ఎక్కువగా ప్రయత్నించలేదు కానీ బాణంతో మూడుసార్లు మాత్రమే నేలను కొట్టాడు, కాబట్టి సిరియన్లను ఓడించడంలో ఆయన కొంతవరకే విజయం సాధించాడు. యెహోవా తాను నియమించిన పనిని మనం హృదయపూర్వకంగా, ఉత్సాహంతో చేయాలని ఆశిస్తున్నాడు.

20:​2-6. యెహోవా “ప్రార్థన ఆలకించువాడు.”​—⁠కీర్తన 65:⁠2.

24:​3, 4. మనష్షే రక్తాపరాధాన్నిబట్టి యూదాను “క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను.” దేవుడు నిరపరాధుల రక్తాన్ని గౌరవిస్తాడు. యెహోవా నిరపరాధుల రక్తాన్ని చిందించడానికి బాధ్యులైనవారిని నాశనం చేయడం ద్వారా నిరపరాధుల తరపున పగతీర్చుకుంటాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు.​—⁠కీర్తన 37:​9-11; 145:​20.

మనకు అమూల్యమైనది

రెండవ రాజుల గ్రంథము యెహోవా దేవుణ్ణి వాగ్దానాలను నెరవేర్చేవాడిగా చూపిస్తోంది. రెండు రాజ్యాల నివాసులు, మొదట ఇశ్రాయేలు రాజ్య నివాసులు తర్వాత యూదా రాజ్య నివాసులు చెరగా కొనిపోబడడం, ద్వితీయోపదేశకాండము 28:15-29:⁠28లో నమోదు చేయబడిన ప్రవచనాత్మక తీర్పు నెరవేరిన విధానాన్ని మనకు బలంగా నొక్కి చెబుతోంది. రెండవ రాజుల గ్రంథము ఎలీషాను యెహోవా నామంపట్ల, సత్యారాధనపట్ల ఎంతో ఆసక్తి ఉన్న ప్రవక్తగా వర్ణిస్తోంది. హిజ్కియా, యోషీయాలు దేవుని ధర్మశాస్త్రాన్ని గౌరవించిన వినయంగల రాజులుగా వర్ణించబడ్డారు.

రెండవ రాజుల గ్రంథములో పేర్కొనబడిన రాజులు, ప్రవక్తలు, తదితరుల వైఖరుల గురించి, క్రియల గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, మనం దేనికోసం ప్రయత్నించాలి, దేనికోసం ప్రయత్నించకూడదు అనే విషయంలో విలువైన పాఠాలు నేర్చుకోమా? (రోమీయులు 15:4; 1 కొరింథీయులు 10:​11) అవును, “దేవుని వాక్యము సజీవమై బలముగలదై” ఉన్నది.​—⁠హెబ్రీయులు 4:​12.

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఎలీషా చేసిన అద్భుతాలు

1. యోర్దాను నీరు రెండు పాయలుగా వేరు చేయబడింది.​—⁠2 రాజులు 2:​14

2. యెరికో పట్టణపు చెడ్డ నీరు మంచిగా చేయబడింది.​—⁠2 రాజులు 2:​19-22

3. అపరాధులైన పిల్లలపై ఎలుగుబంట్లు దాడి చేశాయి.​—⁠2 రాజులు 2:​23, 24

4. సైన్యానికి నీరు సరఫరా చేయబడింది.​—⁠2 రాజులు 3:​16-26

5. ఒక విధవరాలికి మంచినూనె లభించింది.​—⁠2 రాజులు 4:​1-7

6. గొడ్రాలిగా ఉన్న షూనేము స్త్రీ కుమారుణ్ణి కన్నది.​—⁠2 రాజులు 4:​8-17

7. ఒక పిల్లవాడు పునరుత్థానం చేయబడ్డాడు.​—⁠2 రాజులు 4:​18-37

8. విషపూరితమైన కూర తినదగినదిగా మారింది.​—⁠2 రాజులు 4:38-41

9. వందమందికి 20 రొట్టెలతో భోజనం ఏర్పాటు చేయబడింది.​—⁠2 రాజులు 4:​42-44

10. నయమాను తన కుష్ఠరోగం నుండి స్వస్థత పొందాడు.​—⁠2 రాజులు 5:​1-14

11. గేహజీకి నయమాను కుష్ఠరోగం వచ్చింది.​—⁠2 రాజులు 5:​24-27

12. గొడ్డలి తేలేలా చేయబడింది.​—⁠2 రాజులు 6:​5-7

13. ఒక సేవకుడు దేవదూతలతో కూడిన రథాలు చూశాడు.​—⁠2 రాజులు 6:​15-17

14. సిరియా సైన్యం అంధత్వంతో మొత్తబడింది.​—⁠2 రాజులు 6:​18

15. సిరియా సైనికుల చూపు పునరుద్ధరించబడింది.​—⁠​—⁠2 రాజులు 6:​19-23

16. చనిపోయిన ఒక వ్యక్తి సజీవుడయ్యాడు.​—⁠2 రాజులు 13:​20, 21

[12వ పేజీలోని చార్టు/చిత్రాలు]

యూదా, ఇశ్రాయేలు రాజులు

సౌలు/దావీదు/సొలొమోను: సా.శ.పూ. 1117/1077/1037 *

యూదా రాజ్యం తేదీ (సా.శ.పూ.) ఇశ్రాయేలు రాజ్యం

రెహబాము .....․997․..... యరొబాము

అబీయా/ఆసా .....․980/978․.....

.....․976/975/952․..... నాదాబు/బయెషా/ఏలా

.....․951/951/951․..... జిమ్రీ/ఒమ్రీ/తిబ్నీ

.....․940․.....․ ఆహాబు

యెహోషాపాతు .....․937․.....

.....․920/917․..... అహజ్యా/యెహోరాము

యెహోరాము .....․913․.....

అహజ్యా .....․906․.....

(అతల్యా) .....․905․..... యెహూ

యోవాషు .....․898․.....

.....․876/859․..... యెహోయాహాజు/యోవాషు

అమజ్యా .....․858․.....

.....․844․..... యరొబాము II

అజర్యా (ఉజ్జియా) .....․829․.....

.....․803/791/791․..... జెకర్యా/షల్లూము/మెనహేము

.....․780/778․..... పెకహ్యా/పెకహు

యోతాము/ఆహాజు .....․777/762․.....

.....․758․..... హోషేయ

హిజ్కియా .....․746․.....

.....․740․..... షోమ్రోను స్వాధీనం చేసుకోబడింది

మనష్షే/ఆమోను/యోషీయా .....․716/661/659․.....

యెహోయాహాజు/యెహోయాకీము .....․628/628․.....

యెహోయాకీను/సిద్కియా .....․618/617․.....

యెరూషలేము నాశనం చేయబడింది .....․607․.....

[అధస్సూచి]

^ పేరా 66 కొన్ని తేదీలు ఇంచుమించుగా పరిపాలనను ఆరంభించిన సంవత్సరాన్ని సూచిస్తున్నాయి.

[8, 9వ పేజీలోని చిత్రం]

నయమాను తనను తాను తగ్గించుకున్న తర్వాత యెహోవా శక్తి ద్వారా స్వస్థత పొందాడు

[8, 9వ పేజీలోని చిత్రం]

ఏలీయా ‘సుడిగాలిచేత ఆరోహణమై వెళ్ళినప్పుడు’ ఆయనకు ఏమైంది?