కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవులు యెహోవా మహిమను ప్రతిఫలింపజేస్తారు

క్రైస్తవులు యెహోవా మహిమను ప్రతిఫలింపజేస్తారు

క్రైస్తవులు యెహోవా మహిమను ప్రతిఫలింపజేస్తారు

“మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.”​—⁠మత్తయి 13:16.

సీనాయి కొండ దగ్గర సమావేశమైన ఇశ్రాయేలీయులకు యెహోవాకు సన్నిహితులయ్యే మంచి కారణముంది. నిజానికి ఆయన తన బలమైన హస్తముతో వారిని ఐగుప్తు నుండి విడిపించాడు. అరణ్యంలో వారికి ఆహారం, నీరు అందిస్తూ ఆయన వారి అవసరాలు తీర్చాడు. ఆ తర్వాత ఆయన వారిపై దాడికి దిగిన అమాలేకీయుల దండుపై వారికి విజయం అనుగ్రహించాడు. (నిర్గమకాండము 14:26-31; 16:2-17:13) వారు అరణ్యంలో సీనాయి కొండ దగ్గర దిగినప్పుడు, అక్కడ సంభవించిన ఉరుములు, మెరుపులకు భయపడి వారెంతగానో వణికారు. ఆ తర్వాత వారు మోషే సీనాయి కొండ దిగడం, ఆయన ముఖం యెహోవా మహిమతో ప్రకాశించడం చూశారు. ఆశ్చర్యపడి యెహోవా మహిమను గుర్తించే బదులు వారు వెనుకంజ వేశారు. “వారు అతని [మోషేను] సమీపింప వెరచిరి.” (నిర్గమకాండము 19:10-19; 34:30) వారికోసం ఎన్నో చేసిన యెహోవా మహిమకు సంబంధించిన ప్రకాశాన్ని చూడడానికి వారెందుకు భయపడ్డారు?

2 ఈ సందర్భంలో ఇశ్రాయేలీయులు భయపడడానికి బహుశా అంతకుముందు జరిగిన సంఘటన కారణం కావచ్చు. బంగారు దూడను చేసుకోవడం ద్వారా వారు ఉద్దేశపూర్వకంగా యెహోవాకు అవిధేయులైనప్పుడు, ఆయన వారిని శిక్షించాడు. (నిర్గమకాండము 32:4, 35) వారు యెహోవా ఇచ్చిన క్రమశిక్షణనుండి పాఠం నేర్చుకుని దానిపట్ల కృతజ్ఞత చూపించారా? లేదు, చాలామంది అలా చేయలేదు. మోషే తన జీవిత చరమాంకంలో ఇశ్రాయేలీయులు అవిధేయత చూపించిన ఇతర సంఘటనలతోపాటు బంగారు దూడను చేసుకున్న ఆ సంఘటననూ గుర్తు చేశాడు. ఆ ప్రజలతో ఆయనిలా చెప్పాడు: “మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటిమాటకు తిరుగబడితిరి, ఆయన మాటను వినలేదు. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవామీద తిరుగుబాటు చేయుచున్నారు.”​—⁠ద్వితీయోపదేశకాండము 9:15-24.

3 ఇశ్రాయేలీయులు చూపించిన భయానికి మోషే ప్రతిస్పందించిన తీరును పరిశీలించండి. ఆ వృత్తాంతంలో మనమిలా చదువుతాం: “మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖముమీద ముసుకు వేసికొనెను. అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు [ఆలయ గుడారములో] ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చువరకు ఆ ముసుకు తీసివేసెను; అతడు వెలుపలికివచ్చి తనకు ఆజ్ఞాపింపబడినదానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి; మోషే ఆయనతో [యెహోవాతో] మాటలాడుటకు లోపలికి వెళ్లువరకు తన ముఖముమీద ముసుకు వేసికొనెను.” (నిర్గమకాండము 34:33-35) ఆయా సందర్భాల్లో మోషే ముఖముమీద ముసుకు ఎందుకు వేసుకున్నాడు? దీనినుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబులు యెహోవాతో మనకున్న సంబంధాన్ని పరిశీలించి చూసుకోవడానికి సహాయం చేయగలవు.

సద్వినియోగం చేసుకోని అవకాశాలు

4 మోషే ముఖముమీద ముసుకు వేసుకోవడానికి ఇశ్రాయేలీయుల మానసిక, హృదయ స్థితికి సంబంధముందని అపొస్తలుడైన పౌలు వివరించాడు. పౌలు ఇలా వ్రాశాడు: ‘మోషే ముఖముమీద ప్రకాశించుచుండిన ఆ మహిమను, ఇశ్రాయేలీయులు తేరిచూడలేకపోయిరి. వారి మనస్సులు కఠినములాయెను.’ (2 కొరింథీయులు 3:8, 14) ఎంతటి విచారకర పరిస్థితి! ఇశ్రాయేలీయులు యెహోవా ఎన్నుకున్న ప్రజలు, వారు తనకు సన్నిహితమవాలని ఆయన కోరుకున్నాడు. (నిర్గమకాండము 19:4-6) అయినప్పటికీ, వారు దేవుని మహిమకు సంబంధించిన ప్రకాశాన్ని తేరి చూసేందుకు బొత్తిగా ఇష్టపడలేదు. ప్రేమపూర్వక భక్తితో తమ మనస్సులను, హృదయాలను యెహోవావైపు త్రిప్పుకొనే బదులు వారు ఆయనకు దూరమైనట్లు ప్రవర్తించారు.

5 ఈ విషయానికి సంబంధించిన సాదృశ్యాన్ని మనం సా.శ. మొదటి శతాబ్దంలో చూస్తాం. పౌలు క్రైస్తవత్వానికి మారే సమయానికి, మహాగొప్ప మోషే అయిన యేసుక్రీస్తు మధ్యవర్తిత్వంలో ధర్మశాస్త్రం స్థానంలో క్రొత్త నిబంధన వచ్చింది. యేసు తన మాటలోను, క్రియలోను యెహోవా మహిమను పరిపూర్ణంగా ప్రతిఫలింపజేశాడు. పునరుత్థానం చేయబడిన యేసు గురించి పౌలు ఇలా వ్రాశాడు: “ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునై” ఉన్నాడు. (హెబ్రీయులు 1:3) యూదులకు ఎంత మహత్తరమైన అవకాశం లభించిందో కదా! స్వయంగా దేవుని కుమారుని నుండే నిత్యజీవపు మాటలు వినే అవకాశం వారికి లభించింది! విచారకరంగా, యేసు ప్రకటించినవారిలో చాలామంది ఆయన మాట వినలేదు. వారి గురించి యెషయా ద్వారా యెహోవా పలికిన ప్రవచనాన్ని ఉటంకిస్తూ యేసు ఇలా అన్నాడు: “ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు.”​—⁠మత్తయి 13:​13-15; యెషయా 6:9, 10.

6 యూదులకు, యేసు శిష్యులకు చాలా తేడావుంది, యేసు వారి గురించి ఇలా చెప్పాడు: “మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.” (మత్తయి 13:16) నిజ క్రైస్తవులు యెహోవాను తెలుసుకొని ఆయనను సేవించాలని కోరుకుంటారు. బైబిల్లో వెల్లడి చేయబడినట్లుగా వారు ఆయన చిత్తం చేయడానికి ఆనందిస్తారు. తత్ఫలితంగా అభిషిక్త క్రైస్తవులు క్రొత్త నిబంధనకు సంబంధించి తమ పరిచర్యలో యెహోవా మహిమను ప్రతిఫలింపజేస్తారు, వేరేగొర్రెలకు చెందినవారు కూడా అలాగే చేస్తారు.​—⁠2 కొరింథీయులు 3:6, 18.

సువార్త ఎందుకు మరుగు చేయబడింది?

7 మనం చూసినట్లుగా యేసు కాలంలోనూ, మోషే కాలంలోనూ చాలామంది ఇశ్రాయేలీయులు వారికివ్వబడిన సాటిలేని అవకాశాన్ని నిరాకరించారు. మన కాలంలోనూ పరిస్థితి అలాగే ఉంది. మనం ప్రకటిస్తున్న సువార్తను చాలామంది నిరాకరిస్తారు. ఇది మనకు ఆశ్చర్యం కలిగించదు. పౌలు ఇలా వ్రాశాడు: “మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయబడియున్నది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” (2 కొరింథీయులు 4:3, 4) సువార్తను మరుగుచేయాలనే సాతాను ప్రయత్నాలకు తోడుగా, చాలామంది తాము చూడకూడదనే ఉద్దేశంతో తమ ముఖాలకు తామే ముసుకు వేసుకుంటున్నారు.

8 అనేకుల సూచనార్థక నేత్రాలు అజ్ఞానంతో మూసుకుపోయాయి. జనాంగాలు “అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడిన” విషయం గురించి బైబిలు మాట్లాడుతోంది. (ఎఫెసీయులు 4:18) ధర్మశాస్త్రంలో మంచి ప్రావీణ్యంగల పౌలు తాను క్రైస్తవుడు కాకముందు అజ్ఞానముతో ఎంతగా అంధుడయ్యాడంటే, ఆయన దేవుని సంఘాన్నే హింసించాడు. (1 కొరింథీయులు 15:9) అయినప్పటికీ, యెహోవా ఆయనకు సత్యాన్ని వెల్లడిచేశాడు. పౌలు ఇలా వివరిస్తున్నాడు: “నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.” (1 తిమోతి 1:16) పౌలులాగే ఒకప్పుడు దేవుని సత్యాన్ని వ్యతిరేకించిన చాలామంది ఇప్పుడు ఆయనను సేవిస్తున్నారు. కాబట్టి మనల్ని వ్యతిరేకించే వారికి సహితం సాక్ష్యమిస్తూ ఉండడానికి ఇది మంచి కారణం. అదేసమయంలో, దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేస్తూ, దాని భావాన్ని గ్రహించడం ద్వారా యెహోవా కోపానికి గురయ్యేలా అజ్ఞానంతో ప్రవర్తించకుండా కాపాడబడతాం.

9 చాలామంది నేర్చుకోవడానికి ఇష్టపడక, వారు కఠిన దృక్కోణాలతో ఉండడం మూలంగా ఆధ్యాత్మిక విషయాలను స్పష్టంగా చూడలేకపోతున్నారు. చాలామంది యూదులు మొండిగా మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకు వ్రేలాడిన కారణంగా యేసును, ఆయన బోధలను తిరస్కరించారు. అయితే అందరూ అలా చేయలేదు. ఉదాహరణకు, యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత “యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.” (అపొస్తలుల కార్యములు 6:7) అయినప్పటికీ, అధికశాతం యూదుల గురించి పౌలు ఇలా వ్రాశాడు: “నేటివరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది.” (2 కొరింథీయులు 3:15) అంతకుముందు యేసు యూదా మతనాయకులతో, “లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి” అని పలికిన మాటలు బహుశా పౌలుకు తెలిసి ఉండవచ్చు. (యోహాను 5:​39) వారు ఎంతో జాగ్రత్తగా పరిశీలించిన లేఖనాలే, యేసే మెస్సీయ అని గ్రహించేందుకు వారికి సహాయం చేసి ఉండాల్సింది. అయితే యూదులకు తమ సొంత ఆలోచనలు ఉన్నాయి, అద్భుతాలు చేసిన దేవుని కుమారుడు కూడా వారిని మరోవిధంగా ఒప్పించలేకపోయాడు.

10 నేడు క్రైస్తవమత సామ్రాజ్యంలోని చాలామంది విషయంలోనూ అదే జరుగుతోంది. మొదటి శతాబ్దపు యూదుల్లాగే ‘వారికి దేవునియందు ఆసక్తివుంది; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.’ (రోమీయులు 10:2) కొందరు బైబిలును అధ్యయనం చేసినప్పటికీ, అది చెబుతున్నది నమ్మడం వారికిష్టం లేదు. నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగావున్న అభిషిక్త క్రైస్తవుల ద్వారా యెహోవా తన ప్రజలకు బోధిస్తున్నాడని వారు అంగీకరించరు. (మత్తయి 24:45) అయితే యెహోవాయే తన ప్రజలకు బోధిస్తున్నాడనీ, దైవిక సత్యాన్ని అర్థం చేసుకోవడం అన్ని సందర్భాల్లోనూ క్రమేణా జరిగిందనీ మనకు తెలుసు. (సామెతలు 4:18) యెహోవాచేత బోధించబడేందుకు అంగీకరించడం ద్వారా, మనమాయన చిత్తం, సంకల్పాల గురించిన జ్ఞానంతో ఆశీర్వదించబడుతున్నాం.

11 మరికొందరు తమకు తోచిందే నమ్మేందుకు ఇష్టపడడం ద్వారా అంధులుగా ఉన్నారు. కొందరు, యేసు ప్రత్యక్షత గురించి దేవుని ప్రజలు ప్రకటించే సందేశాన్ని అపహాస్యం చేస్తారని ముందే చెప్పబడింది. ఈ వాస్తవాన్ని అంటే నోవహు కాలంనాటి లోకం మీదికి దేవుడు జలప్రళయాన్ని రప్పించాడనే విషయాన్ని “వారు బుద్ధిపూర్వకముగా మరతురు” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు. (2 పేతురు 3:3-6) అదేప్రకారంగా, నామకార్థ క్రైస్తవులు చాలామంది యెహోవా కనికరము, దయ, క్షమాపణ చూపిస్తాడని నిస్సంకోచంగా అంగీకరిస్తారు; అయితే ఆయన శిక్షించక మానడనే వాస్తవాన్ని నిర్లక్ష్యం చేస్తారు లేదా తిరస్కరిస్తారు. (నిర్గమకాండము 34:6, 7) నిజ క్రైస్తవులు బైబిలు నిజంగా బోధిస్తున్న దానిని అర్థం చేసుకోవడానికి జాగ్రత్తగా ప్రయత్నిస్తారు.

12 చర్చికి వెళ్లే చాలామంది పారంపర్యాచారాలతో అంధులుగా చేయబడ్డారు. తన కాలంలోని మతనాయకులతో యేసు ఇలా అన్నాడు: “మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.” (మత్తయి 15:6) బబులోను చెరనుండి తిరిగివచ్చిన తర్వాత యూదులు ఆసక్తిగా స్వచ్ఛారాధనను పునరుద్ధరించారు, అయితే యాజకులు గర్విష్ఠులుగా, స్వనీతిపరులుగా తయారయ్యారు. మత పండుగలు దేవునిపట్ల నిజమైన భక్తిలేని లాంఛనప్రాయమైన సందర్భాలయ్యాయి. (మలాకీ 1:6-8) యేసు కాలం వచ్చేసరికి శాస్త్రులు, పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రానికి లెక్కలేనన్ని పారంపర్యాచారాలు జతచేశారు. వారు ధర్మశాస్త్రం ఆధారపడిన నీతి సూత్రాలను ఎంతమాత్రం గ్రహించని కారణంగా యేసు వారిని వేషధారులని వెల్లడిచేశాడు. (మత్తయి 23:23, 24) మానవ కల్పిత మత పారంపర్యాచారాలు తమను సత్యారాధన నుండి ప్రక్కదారి పట్టించకుండా నిజ క్రైస్తవులు జాగ్రత్తపడాలి.

‘అదృశ్యుడైనవానిని చూడడం’

13 కొండపై దేవుని మహిమను చూసేందుకు మోషే పిలవబడడమే కాదు, ఆయన యెహోవా మహిమను పాక్షికంగా చూశాడు కూడా. ఆయన ఆలయ గుడారంలోకి వెళ్లినప్పుడు ముఖముమీద ముసుకు వేసుకోలేదు. మోషే, దేవుని చిత్తం చేయాలని కోరుకున్న ప్రగాఢ విశ్వాసమున్న వ్యక్తి. దర్శనంలో యెహోవా మహిమను కొంతమేరకు చూసే అవకాశం ఆయనకు లభించినప్పటికీ, ఆయన తన విశ్వాస నేత్రాలతో దేవుణ్ణి అప్పటికే చూశాడు. మోషే “అదృశ్యుడైనవానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధిగలవాడై” ఉన్నాడని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 11:27; నిర్గమకాండము 34:5-7) కొద్దికాలం వరకు ప్రకాశించిన తన ముఖ కాంతి ద్వారా మాత్రమే కాక, యెహోవాను తెలుసుకొని ఆయనను సేవించేలా ఇశ్రాయేలీయులకు సహాయం చేయాలనే ప్రయత్నాల ద్వారా కూడా ఆయన దేవుని మహిమను ప్రతిఫలింపజేశాడు.

14 పరలోకంలో యేసు ఈ విశ్వం సృష్టించబడక ముందునుండే, అసంఖ్యాక యుగాలుగా దేవుని మహిమను నేరుగా చూశాడు. (సామెతలు 8:22, 30) ఆ కాలమంతటిలో వారిమధ్య ప్రగాఢమైన ప్రేమానురాగాల అనుబంధం వృద్ధిచెందింది. సమస్త సృష్టికి ఆదిసంభూతుడైన యేసుపట్ల యెహోవా దేవుడు అత్యంత వాత్సల్యపూరితమైన అనురాగాన్ని వ్యక్తపరిచాడు. యేసు కూడా తన జీవదాతయైన దేవునిపట్ల ప్రగాఢ ప్రేమానురాగాలను చూపించాడు. (యోహాను 14:​31; 17:24) తండ్రి, కుమారులుగా వారి మధ్యగల ప్రేమ పరిపూర్ణమైనది. మోషేలాగే యేసు కూడా తాను బోధించిన విషయాల్లో యెహోవా మహిమను ప్రతిఫలింపజేయడానికి ఆనందించాడు.

15 యేసు, మోషేల్లాగే భూమ్మీది దేవుని ప్రస్తుతదిన సాక్షులు యెహోవా మహిమను ధ్యానించే విషయంలో ఆసక్తితో ఉన్నారు. మహిమాన్విత సువార్తను వారు నిరాకరించలేదు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “వారి హృదయము [ఆయన చిత్తం చేయడానికి] ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.” (2 కొరింథీయులు 3:16) దేవుని చిత్తం చేయాలని కోరుకుంటున్నాం కాబట్టే మనం లేఖనాలను అధ్యయనం చేస్తాం. యెహోవా కుమారుడు, అభిషిక్త రాజైన యేసుక్రీస్తు ముఖంలో ప్రతిఫలించిన మహిమనుబట్టి సంతోషిస్తూ ఆయన మాదిరిని అనుకరిస్తాం. యేసు, మోషేల్లాగే మనకు కూడా పరిచర్య జరిగించే పని మరియు మనం ఆరాధిస్తున్న మహిమగల దేవుని గురించి ఇతరులకు బోధించే పని మనకు అనుగ్రహించబడింది.

16 యేసు ఇలా ప్రార్థించాడు: “తండ్రీ . . . నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.” (మత్తయి 11:25) నిజాయితీపరులకు, వినయ హృదయంగలవారికి యెహోవా తన సంకల్పాలకు, వ్యక్తిత్వానికి సంబంధించిన అవగాహనను దయచేస్తాడు. (1 కొరింథీయులు 1:26-28) మనం ఆయన సంరక్షణలోకి వచ్చాం, మనకు మేలుకలిగేలా అంటే జీవితంలో సంపూర్ణ ప్రయోజనం పొందేలా ఆయన మనకు బోధిస్తున్నాడు. యెహోవాను మరింత సన్నిహితంగా తెలుసుకొనేందుకు ఆయన చేసిన అనేక ఏర్పాట్ల విషయంలో కృతజ్ఞతతో ఉంటూ ఆయనకు సన్నిహితమయ్యేందుకు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందము గాక!

17 పౌలు అభిషిక్త క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు . . . ఆ పోలికగానే మార్చబడుచున్నాము.” (2 కొరింథీయులు 3:18) మన నిరీక్షణ పరలోక సంబంధమైనదైనా లేదా భూసంబంధమైనదైనా మనం యెహోవాను అంటే బైబిల్లో వెల్లడి చేయబడినట్లుగా ఆయన లక్షణాలను, వ్యక్తిత్వాన్ని ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా మనం ఆయనలాగే తయారవుతాం. మనం కృతజ్ఞతాపూర్వకంగా యేసుక్రీస్తు జీవితాన్ని, పరిచర్యను, బోధలను ధ్యానించినప్పుడు మనం మరింత సంపూర్ణంగా యెహోవా లక్షణాలను ప్రతిఫలింపజేస్తాం. మనమెవరి మహిమను ప్రతిఫలింపజేయాలని ప్రయత్నిస్తున్నామో ఆ దేవునికి స్తుతిని, మహిమను తీసుకొస్తామని తెలుసుకోవడం ఎంత ఆనందకరమో కదా!

మీకు జ్ఞాపకమున్నాయా?

మోషే ప్రతిఫలింపజేసిన దేవుని మహిమను చూసేందుకు ఇశ్రాయేలీయులు ఎందుకు భయపడ్డారు?

సువార్త మొదటి శతాబ్దంలో, మన కాలంలో ఏయే విధాలుగా “మరుగుచేయబడియున్నది”?

మనం దేవుని మహిమను ఎలా ప్రతిఫలింపజేస్తాం?

[అధ్యయన ప్రశ్నలు]

1. సీనాయి కొండ దగ్గర మోషే విషయంలో ఇశ్రాయేలీయుల ప్రతిస్పందనకు సంబంధించి ఏ ప్రశ్న మదిలోకి వస్తుంది?

2. మోషే ప్రతిఫలింపజేసిన దేవుని మహిమను చూసేందుకు ఇశ్రాయేలీయులు ఎందుకు భయపడి ఉండవచ్చు?

3. ముఖముమీద ముసుకు వేసుకునే విషయంలో మోషే ఏమిచేశాడు?

4. మోషే ముఖముమీద ముసుకు కప్పుకోవడానికి సంబంధించి ఏ భావాన్ని అపొస్తలుడైన పౌలు వెల్లడించాడు?

5, 6. (ఎ) మోషే కాలంనాటి ఇశ్రాయేలీయులకు మొదటి శతాబ్దంలో ఎలాంటి సాదృశ్యం ఉంది? (బి) యేసు మాటలు విన్నవారికి, విననివారికి ఎలాంటి తేడా ఉంది?

7. చాలామంది సువార్తను నిరాకరించడం ఎందుకు ఆశ్చర్యకరం కాదు?

8. చాలామంది ఏ విధంగా అజ్ఞానంచేత అంధులుగా చేయబడ్డారు, అలాంటి ప్రభావానికి మనమెలా దూరంగా ఉండవచ్చు?

9, 10. (ఎ) మొదటి శతాబ్దపు యూదులు నేర్చుకోవడానికి ఇష్టం లేనివారిగా, కఠిన దృక్కోణం గలవారిగా ఎలావున్నారు? (బి) నేడు క్రైస్తవమత సామ్రాజ్యంలో దానికి పోలిక ఉందా? వివరించండి.

11. తోచిందే నమ్మేందుకు ఇష్టపడడం సత్యాన్ని మరుగుచేయడంలో ఎలాంటి పాత్ర పోషించింది?

12. పారంపర్యాచారముచేత ప్రజలు ఎలా అంధులుగా చేయబడ్డారు?

13. ఏ రెండు విధాలుగా మోషే దేవుని మహిమను కొంతమేరకు చూశాడు?

14. యేసు దేవుని మహిమను ఎలా చూశాడు, ఆయన దేనియందు ఆనందించాడు?

15. క్రైస్తవులు ఏ విధంగా దేవుని మహిమను ధ్యానిస్తున్నారు?

16. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనమెలా ప్రయోజనం పొందుతాం?

17. యెహోవా లక్షణాలను మనం మరింత సంపూర్ణంగా ఎలా తెలుసుకుంటాం?

[19వ పేజీలోని చిత్రం]

మోషే ముఖాన్ని తేరి చూడలేకపోయారు

[21వ పేజీలోని చిత్రాలు]

పౌలులాగే, ఒకప్పుడు దేవుని సత్యాన్ని వ్యతిరేకించినవారు ఇప్పుడు ఆయనను సేవిస్తున్నారు

[23వ పేజీలోని చిత్రాలు]

దేవుని మహిమను ప్రతిఫలింపజేయడానికి యెహోవా సేవకులు ఆనందిస్తారు