కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ప్రాచీన ఇశ్రాయేలులో ఆలయ గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలోనే కాక, ఆ తర్వాత నిర్మించిన దేవాలయంలోని అతిపరిశుద్ధ స్థలంలోకూడా కనబడిన షెకినా అని కొన్నిసార్లు పిలువబడిన అద్భుతమైన వెలుగు దేనికి సూచనగా ఉండేది?

ప్రేమగల తండ్రిగా, తన ప్రజలను రక్షించిన యెహోవా, ఇశ్రాయేలులో తన ప్రత్యక్షత స్పష్టంగా కనబడేలా చేశాడు. దేదీప్యమానమైన ఒక మేఘం ద్వారా ఆయన అలా తన ప్రత్యక్షత కనబడేలా చేశాడు, ఆ మేఘానికీ ఆయన ఆరాధనా స్థలానికీ దగ్గరి సంబంధం ఉంది.

స్పష్టంగా కనిపించే ఆ వెలుగు యెహోవా అదృశ్య ప్రత్యక్షతను సూచించింది. ఇది ఆలయ గుడారంలోనూ, ఆ తర్వాత సొలొమోను కట్టించిన దేవాలయంలోని అతిపరిశుద్ధ స్థలంలోకూడా కనబడేది. ఆ అద్భుతమైన వెలుగు యెహోవా భౌతికంగా అక్కడ ఉన్నాడని సూచించలేదు. మానవులు నిర్మించిన ఏ ఆలయంలోనూ దేవుడు నివసించడు. (2 దినవృత్తాంతములు 6:18; అపొస్తలుల కార్యములు 17:​24) దేవుని పరిశుద్ధాలయంలోని సహజాతీతమైన ఆ వెలుగు, రక్షణనిచ్చే యెహోవా ప్రత్యక్షత వారిపట్ల, వారి అవసరాలపట్ల శ్రద్ధ వహిస్తుందని ప్రధాన యాజకుడికి, ఆయన ద్వారా ఇశ్రాయేలీయులందరికీ నమ్మకం కలిగించింది.

బైబిలు వ్రాయబడిన తర్వాతి కాలాల్లో వ్యవహారంలోవున్న అరామైక్‌ భాషలో, ఆ వెలుగు షెకినా అని పిలువబడింది, ఆ పదానికి “నివసించేది” లేదా “నివాసస్థలం” అనే అర్థాలున్నాయి. ఈ పదం బైబిల్లో కనిపించదు కానీ హెబ్రీ లేఖనాల అరామైక్‌ అనువాదాల్లో కనిపిస్తుంది, ఈ అనువాదాలు టార్గమ్స్‌ అని కూడా పిలువబడేవి.

ఆలయ గుడారం నిర్మించడానికి సూచనలు ఇస్తున్నప్పుడు, యెహోవా మోషేతో ఇలా అన్నాడు: ‘నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణాపీఠముమీద నుండియు, శాసనములుగల మందసము మీదనుండు రెండు కెరూబుల మధ్య నుండియు నీకు తెలియజెప్పెదను.’ (నిర్గమకాండము 25:​21, 22) ఇక్కడ పేర్కొన్న మందసము బంగారంతో కప్పబడిన ఒక పెట్టె, అది అతిపరిశుద్ధ స్థలంలో ఉండేది. ఆ మందసపు మూత లేదా కరుణాపీఠం మీద బంగారంతో చేయబడిన రెండు కెరూబులు ఉండేవి.

యెహోవా ఎక్కడనుండి మాట్లాడేవాడు? ఆయన మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రశ్నకు సమాధానమిచ్చాడు: “కరుణాపీఠముమీద మేఘములో కనబడుదును.” (లేవీయకాండము 16:⁠2) ఈ మేఘము పరిశుద్ధ మందసంపైనున్న రెండు బంగారు కెరూబుల మధ్యగా పరిభ్రమిస్తూ ఉండేది. అయితే ఈ మేఘము ఎంత ఎత్తు ఉండేది లేదా కెరూబులకు పైగా ఎంత ఎత్తున ఉండేది అనేది బైబిలు తెలియజేయడం లేదు.

ప్రకాశమానమైన ఈ మేఘము అతిపరిశుద్ధ స్థలాన్ని కాంతివంతం చేసేది. నిజానికి, అతిపరిశుద్ధ స్థలం కాంతివంతంగా ఉండడానికి ఈ మేఘమే కారణం. ప్రాయశ్చిత్థార్థ దినమున ప్రధాన యాజకుడు లోపలి భాగంలోకి ప్రవేశించినప్పుడు ఆ వెలుగు వల్లనే చూడగలిగేవాడు. ఆయన యెహోవా సముఖంలో నిలబడేవాడు.

ఈ అద్భుతమైన వెలుగు క్రైస్తవులకు ఏదైనా విశేష అర్థాన్ని కలిగివుందా? అపొస్తలుడైన యోహాను, “రాత్రిలేని” ఒక పట్టణాన్ని దర్శనంలో చూశాడు. ఆ పట్టణమే నూతన యెరూషలేము, అది యేసుతో పరిపాలించడానికి పునరుత్థానం చేయబడిన అభిషిక్త క్రైస్తవులతో రూపొందింది. ఈ సూచనార్థక పట్టణానికి వెలుగు సూర్యుని నుండి లేదా చంద్రుని నుండి రాదు. షెకినా మేఘము అతిపరిశుద్ధ స్థలాన్ని ఎలా కాంతివంతం చేసేదో అదేవిధంగా యెహోవా దేవుని మహిమ సూటిగా ఈ సంస్థను కాంతివంతం చేస్తుంది. అంతేగాక గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తు ఆ పట్టణానికి “దీపము.” ఆ “పట్టణం” అన్ని జనాంగాల నుండి విమోచించబడిన ప్రజల మార్గనిర్దేశం కోసం వారిమీద తన ఆధ్యాత్మిక వెలుగును, తన అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తుంది.​—⁠ప్రకటన 21:​22-25.

యెహోవా ఆరాధకులు దేవుని నుండి అలాంటి విస్తారమైన ఆశీర్వాదాలను పొందుతారు కాబట్టి, యెహోవా తమను రక్షించే కాపరి, ప్రేమగల తండ్రి అనే నమ్మకంతో వారు ఉండవచ్చు.