కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మరణము మ్రింగివేయబడెను”

“మరణము మ్రింగివేయబడెను”

“మరణము మ్రింగివేయబడెను”

వార్తాపత్రికలో, ఒక చిన్నారి ఆత్మహత్య చేసుకుందనే వార్తను చదివే బదులు, పైనున్న మాటలను చదవడాన్ని ఊహించుకోండి. ఇంతవరకు ఏ వార్తాపత్రికా అలాంటి ప్రకటన చేయలేకపోయింది. కానీ పైనున్న వాక్యాలు వేలాది సంవత్సరాల పురాతన గ్రంథంలో కనిపిస్తాయి, ఆ గ్రంథమే బైబిలు.

లేఖనాల్లో మరణం స్పష్టంగా వివరించబడింది. బైబిలు మనం మరణించడానికి కారణాన్ని వెల్లడిచేయడమే కాక మరణించినవారి పరిస్థితిని కూడా వివరిస్తోంది, చనిపోయిన మన ప్రియమైనవారికి నిరీక్షణను ఇస్తోంది. చివరికది “మరణము మ్రింగివేయబడెను” అని నివేదించడానికి సాధ్యమయ్యే విశేషమైన సమయం గురించి కూడా చెబుతోంది​—⁠1 కొరింథీయులు 15:​54.

బైబిలు, మరణాన్ని అర్థం చేసుకోవడం కష్టమనిపించే మాటల్లో కాక మనకు తెలిసిన మాటల్లోనే వివరిస్తోంది. ఉదాహరణకు, అది మరణాన్ని పదేపదే ‘నిద్రతో’ పోలుస్తోంది, చనిపోయినవారిని ‘మరణంలో నిద్రిస్తున్నవారిగా’ వర్ణిస్తోంది. (కీర్తన 13:4; 1 థెస్సలొనీకయులు 4:13; యోహాను 11:​11-14) మరణం “శత్రువుగా” కూడా గుర్తించబడింది. (1 కొరింథీయులు 15:​26) అన్నింటికన్నా ప్రాముఖ్యంగా మరణం నిద్రలా ఉండడానికిగల కారణాన్ని, మరణం మానవజాతిని బాధించడానికిగల కారణాన్ని తెలపడమే కాక, ఆ శత్రువు చివరకు ఓడిపోయే విధానాన్ని అర్థం చేసుకోవడానికి కూడా బైబిలు మనకు సహాయం చేస్తుంది.

మనమెందుకు మరణిస్తున్నాం?

దేవుడు మొదటి మానవుడైన ఆదామును సృష్టించి ఆయనకు పరదైసు గృహంలో స్థిరనివాసాన్ని ఎలా ఏర్పాటు చేశాడో మొదటి బైబిలు పుస్తకం వివరిస్తోంది. (ఆదికాండము 2:​7, 15) ఆదాము సృష్టించబడిన తర్వాత ఆయనకు పని నియామకాలు ఇవ్వబడ్డాయి, దానితోపాటు ఒక ఖచ్చితమైన నిషేధం విధించబడింది. ఏదెను తోటలోని ఒక వృక్షం గురించి దేవుడు ఆయనతో ఇలా అన్నాడు: ‘నీవు దాని ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.’ * (ఆదికాండము 2:​17) కాబట్టి, మరణం అనివార్యం కాదని ఆదాము గ్రహించాడు. దేవుని నియమం ఉల్లంఘించినప్పుడే మరణం సంభవిస్తుంది.

విచారకరంగా, ఆదాము అతని భార్య హవ్వ అవిధేయులయ్యారు. వారు తమ సృష్టికర్త చిత్తాన్ని ఉపేక్షించడానికి ఇష్టపడి పర్యవసానాలను ఎదుర్కొన్నారు. దేవుడు వారికి పాపంవల్ల వచ్చే పర్యవసానాల గురించి వివరిస్తున్నప్పుడు “నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు” అని అన్నాడు. (ఆదికాండము 3:​19) దానితో వారిలో తీవ్రమైన లోపం ఏర్పడింది అంటే వారు అపరిపూర్ణులయ్యారు. వారి అపరిపూర్ణత లేక పాపము వారిని మరణానికి నడిపించింది.

ఈ లోపమైన పాపం ఆదాముహవ్వల సంతానానికి అంటే మానవజాతి అంతటికీ సంక్రమించింది. ఒక విధంగా చెప్పాలంటే అది వారసత్వంగా వచ్చే వ్యాధి లాంటిది. ఆదాము, మరణ శాపం లేని జీవితాన్ని గడిపే అవకాశాన్ని కోల్పోవడమే కాక ఆయన తన సంతానానికి అపరిపూర్ణతను కూడా సంక్రమింపజేశాడు. మానవ కుటుంబం పాపానికి బానిస అయింది. బైబిలు ఇలా చెబుతోంది: “ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.”​—⁠రోమీయులు 5:​12.

‘పాపం లోకంలో ప్రవేశించింది’

వారసత్వంగా వచ్చిన ఈ లోపాన్ని లేక పాపాన్ని సూక్ష్మదర్శినిలో చూడలేము. “పాపము” మన మొదటి తల్లిదండ్రుల నుండి సంక్రమించిన నైతిక, ఆధ్యాత్మిక లోపాన్ని సూచిస్తోంది, ఆ పాపానికి భౌతిక పర్యవసానాలు ఉన్నాయి. అయితే దేవుడు ఒక చికిత్సను సిద్ధం చేశాడని బైబిలు వెల్లడి చేస్తోంది. అపొస్తలుడైన పౌలు ఇలా వివరిస్తున్నాడు: “పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము.” (రోమీయులు 6:​23) పౌలు తాను కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలో తాను ఎంతో ప్రాముఖ్యమైనదిగా పరిగణించిన ఒక హామీని చేర్చాడు: “ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.”​—⁠1 కొరింథీయులు 15:​22.

స్పష్టంగా యేసుక్రీస్తు పాపమరణాలను తీసివేయడంలో కీలక పాత్రను పోషిస్తాడు. ఆయన “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు” భూమ్మీదకు వచ్చానని చెప్పాడు. (మత్తయి 20:​28) ఆ పరిస్థితిని, కిడ్నాప్‌ చేయబడినవారిని నిర్ణీత డబ్బు చెల్లించి విడిపించే పరిస్థితితో పోల్చవచ్చు. ఇక్కడ మనల్ని పాపమరణాల నుండి విడిపించగల విమోచన క్రయధనం, యేసు పరిపూర్ణ మానవ జీవితం. *​—⁠అపొస్తలుల కార్యములు 10:​39-43.

యేసు తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇచ్చేందుకు దేవుడు ఆయనను భూమ్మీదకు పంపించాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును . . . నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:​16) క్రీస్తు బలిగా మరణించే ముందు ‘సత్యమును గురించి సాక్ష్యమిచ్చాడు.’ (యోహాను 18:​37) ఆయన తన బహిరంగ పరిచర్యలో, కొన్ని సంఘటనలను, మరణం గురించిన సత్యం వెల్లడి చేయడానికి ఉపయోగించుకున్నాడు.

“ఈ చిన్నది నిద్రించుచున్నది”

యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఆయనకు మరణం గురించి తెలుసు. తన చుట్టూ ఉన్న వారిని కోల్పోవడంవల్ల కలిగే బాధను ఆయన కూడా అనుభవించాడు, అంతేకాక తాను అకాల మరణానికి గురవుతానని కూడా ఆయనకు బాగా తెలుసు. (మత్తయి 17:​22, 23) యేసు చంపబడడానికి కొన్ని నెలల ముందే ఆయన సన్నిహిత స్నేహితుడైన లాజరు మరణించాడు. ఆ ఘటన, మరణం విషయంలో యేసుకున్న దృక్పథం గురించి మనకు అంతర్దృష్టినిస్తోంది.

లాజరు మరణం గురించిన వార్త విన్న వెంటనే యేసు ఇలా అన్నాడు: “మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నాను.” లాజరు కేవలం నిద్రిస్తున్నట్లయితే ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని శిష్యులు భావించారు. కాబట్టి యేసు స్పష్టంగా ఇలా చెప్పాడు: “లాజరు చనిపోయెను.” (యోహాను 11:​11-14) స్పష్టంగా, మరణం నిద్రలాంటిదని యేసు గ్రహించాడు. మరణం గురించి అర్థం చేసుకోవడం మనకు కష్టమనిపించవచ్చు అయితే మనం నిద్రను అర్థం చేసుకుంటాం. మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు తాత్కాలిక అపస్మారక స్థితిలో ఉంటాం కాబట్టి సమయం ఎలా గడిచిపోతుందో, మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలియదు. బైబిలు ఖచ్చితంగా మరణించినవారి పరిస్థితి గురించి అలాగే వివరిస్తోంది. ప్రసంగి 9:⁠5 ఇలా చెబుతోంది: “చచ్చినవారు ఏమియు ఎరుగరు.”

యేసు మరణాన్ని నిద్రతో పోల్చడానికి మరో కారణం కూడా ఉంది, అదేమిటంటే చనిపోయినవారిని దేవుని శక్తితో మరణం నుండి మేల్కొల్పవచ్చు. ఒక సందర్భంలో, తమ చిన్నపాపను అప్పుడే కోల్పోయిన వ్యాకులతతో ఉన్న ఒక కుటుంబాన్ని యేసు సందర్శించాడు. “ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదు” అని యేసు చెప్పాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆమె “లేచెను.” మరో మాటలో చెప్పాలంటే ఆమె మృతులలో నుండి లేచింది.​—⁠మత్తయి 9:​24, 25.

యేసు అలాగే తన స్నేహితుడైన లాజరును మృతులలో నుండి లేపాడు. అయితే ఆయన ఆ అద్భుతం చేసే ముందు లాజరు సహోదరి మార్తతో “నీ సహోదరుడు మరల లేచును” అని చెప్పి ఆమెను ఓదార్చాడు. దానికి ఆమె నమ్మకంతో ఇలా జవాబిచ్చింది: “అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదును.” (యోహాను 11:​23, 24) భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో దేవుని సేవకులందరూ పునరుత్థానం చేయబడతారని ఆమె స్పష్టంగా నిరీక్షించింది.

పునరుత్థానం వాస్తవంగా దేనిని సూచిస్తోంది? “పునరుత్థానం” (అనాస్తాసిస్‌) అని అనువదించబడిన గ్రీకు పదానికి “లేచి నిలబడడం” అనే అక్షరార్థ భావం ఉంది. అది మృతులలో నుండి లేవడాన్ని సూచిస్తోంది. దానిని నమ్మడం కొందరికి కష్టంగావుండవచ్చు, అయితే చనిపోయినవారు తన స్వరాన్ని వింటారని చెప్పిన తర్వాత యేసు ఇలా అన్నాడు: “దీనికి ఆశ్చర్యపడకుడి.” (యోహాను 5:​28) యేసు భూమ్మీద ఉన్నప్పుడు చేసిన పునరుత్థానాలన్నీ, దేవుని జ్ఞాపకంలో ఉన్న మృతులు తమ దీర్ఘ “నిద్ర” నుండి మేల్కొంటారనే బైబిలు వాగ్దానంపట్ల నమ్మకాన్ని కలిగిస్తాయి. ప్రకటన 20:​13 ఇలా ప్రవచిస్తోంది: “సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును [మానవజాతి సామాన్య సమాధి] వాటి వశముననున్న మృతుల నప్పగించెను.”

ఈ మృతులు తిరిగి జీవానికి వచ్చిన తర్వాత లాజరులాగే వృద్ధులై మళ్ళీ చనిపోవడానికే పునరుత్థానం చేయబడతారా? దేవుని సంకల్పం అది కాదు. “మరణం ఇక ఉండని” సమయం వస్తుందని బైబిలు మనకు హామీ ఇస్తోంది కాబట్టి అప్పుడిక ఎవరూ వృద్ధులై మరణించరు.​—⁠ప్రకటన 21:⁠4.

మరణం ఒక శత్రువు. అలాగే చాలా బాధ కలిగించే అనారోగ్యం, వృద్ధాప్యం లాంటి ఇతర అనేక సామాన్య శత్రువులు మానవజాతికి ఉన్నాయి. దేవుడు వాటన్నిటినీ జయించి చివరకు మానవజాతి గొప్ప శత్రువుకు తీర్పు తీరుస్తాడు. “కడపట నశింపజేయబడు శత్రువు మరణము.”​—⁠1 కొరింథీయులు 15:​26.

ఆ వాగ్దానం నెరవేరిన తర్వాత మానవులు పాపమరణాలు లేని పరిపూర్ణ జీవితాన్ని ఆనందిస్తారు. అంతవరకు, చనిపోయిన మన ప్రియమైనవారు నిద్రిస్తున్నారని వారు దేవుని జ్ఞాపకంలో ఉంటే ఆయన నిర్ణీత సమయం వచ్చినప్పుడు వారు పునరుత్థానం చేయబడతారని తెలుసుకోవడం ద్వారా మనం ఓదార్పును పొందవచ్చు.

మరణం గురించిన అవగాహన జీవితాన్ని అర్థవంతం చేస్తుంది

మరణం గురించిన, చనిపోయినవారికి ఉన్న నిరీక్షణ గురించిన స్పష్టమైన అవగాహన జీవితంపట్ల మన దృక్పథాన్ని మార్చగలదు. ముందటి ఆర్టికల్‌లో పేర్కొనబడిన ఈయన్‌ 20లలో ఉన్నప్పుడు మరణం గురించిన బైబిలు వివరణను తెలుసుకున్నాడు. “నా తండ్రి ఎక్కడో ఉన్నాడనే కొంత నమ్మకం నాకు ఎప్పుడూ ఉండేది” అని ఆయన అంటున్నాడు. “కాబట్టి, ఆయన మరణంలో కేవలం నిద్రిస్తున్నాడని నేను తెలుసుకున్నప్పుడు మొదట్లో కృంగిపోయాను.” అయితే ఈయన్‌, మృతుల పునరుత్థానం గురించిన దేవుని వాగ్దానం గురించి చదివినప్పుడు, తాను తన తండ్రిని మళ్ళీ చూడగలనని తెలుసుకొని చాలా ఆనందించాడు. “నా జీవితంలో మొదటిసారిగా ప్రశాంతతను చవిచూశాను” అని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. మరణం గురించిన సరైన అవగాహన ఆయనకు మనశ్శాంతినిచ్చింది, అది ఆయనకు నెమ్మదినిచ్చింది.

క్లైవ్‌, బ్రెండాలు తమ 21 సంవత్సరాల కుమారుడైన స్టీవెన్‌ను ముందటి ఆర్టికల్‌లో పేర్కొనబడిన ఘోర ప్రమాదంలో కోల్పోయారు. మరణం గురించి బైబిలు ఏమి చెబుతుందో వారికి తెలిసినా వారింకా తమ కుమారుణ్ణి కోల్పోవడంవల్ల కలిగిన దుఃఖంలోనే ఉన్నారు. ఎంతైనా మరణం ఒక శత్రువు, అది చేసే గాయం బాధాకరంగా ఉంటుంది. మరణించినవారి స్థితి గురించి వారికున్న లేఖన జ్ఞానం వారి దుఃఖాన్ని క్రమంగా తగ్గించింది. బ్రెండా ఇలా అంటోంది: “మా జీవితాన్ని పునర్నిర్మించుకొని మనశ్శాంతితో మా సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించుకునేందుకు మరణం గురించిన మా అవగాహన మాకు సహాయం చేసింది. అయినా, స్టీవెన్‌ తన గాఢనిద్ర నుండి మేల్కొనే సమయం గురించి ఆలోచించకుండా మాకు ఒక్కరోజు కూడా గడవదు.”

“ఓ మరణమా, నీ ముల్లెక్కడ?”

చనిపోయినవారి పరిస్థితిని అర్థం చేసుకోవడం జీవితంపట్ల సమతుల్యమైన దృక్పథంతో ఉండేందుకు మనకు సహాయం చేయగలదనేది స్పష్టం. మరణం ఒక మర్మంగా ఉండనవసరం లేదు. ఈ శత్రువు మనలను నీడలా వెంటాడుతుందనే అనుచితమైన భయం లేకుండా మనం జీవితాన్ని ఆనందించవచ్చు. మరణం మన జీవితాలను శాశ్వతంగా సమాప్తి చేయాల్సిన అవసరం లేదు అని గుర్తించడం “జీవితం చాలా చిన్నది” అనే నమ్మకంతో సుఖం కోసం జీవించాలనే ఎలాంటి కోరికనైనా తుడిచివేస్తుంది. మరణించిన మన ప్రియమైనవారు దేవుని జ్ఞాపకంలో ఉండి, మరణంలో నిద్రిస్తూ పునరుత్థానం కోసం వేచివున్నారని తెలుసుకోవడం మనకు ఓదార్పునిచ్చి, జీవితాన్ని కొనసాగించాలనే కోరికను మనలో రగిలిస్తుంది.

అవును, జీవదాత అయిన యెహోవా దేవుడు మరణాన్ని శాశ్వతంగా పాతిపెట్టే భవిష్యత్తు కోసం మనం నమ్మకంతో ఎదురుచూడవచ్చు. “ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?” అని మనం ఖచ్చితంగా అడగగలిగినప్పుడు అది ఎంతటి ఆశీర్వాదంగా ఉంటుందో కదా!​—⁠1 కొరింథీయులు 15:​55.

[అధస్సూచీలు]

^ పేరా 6 ఇది, మరణం గురించి పేర్కొన్న మొదటి బైబిలు లేఖనం.

^ పేరా 11 ఆదాము కోల్పోయింది పరిపూర్ణ మానవజీవితమే కాబట్టి పరిపూర్ణ మానవజీవితమే విమోచన క్రయధనం. పాపం సర్వమానవాళినీ కలుషితం చేసింది కాబట్టి అపరిపూర్ణ మానవులెవ్వరూ విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి పనికిరారు. కాబట్టి దేవుడు ఆ సంకల్పం కోసమే తన కుమారుణ్ణి పరలోకం నుండి పంపించాడు. (కీర్తన 49:​7-9) ఈ అంశం మీద అదనపు సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలోని 7వ అధ్యాయాన్ని చూడండి.

[5వ పేజీలోని చిత్రం]

ఆదాముహవ్వల అవిధేయత మరణానికి దారితీసింది

[6వ పేజీలోని చిత్రం]

యేసు చనిపోయిన పాప చేయిపట్టుకోగానే ఆమె లేచింది

[7వ పేజీలోని చిత్రం]

లాజరు నిద్ర నుండి లేచినట్లు చనిపోయిన తమ ప్రియమైనవారు నిద్ర నుండి లేచే సమయం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు