కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు దేవుని మహిమను ప్రతిఫలింపజేస్తారా?

మీరు దేవుని మహిమను ప్రతిఫలింపజేస్తారా?

మీరు దేవుని మహిమను ప్రతిఫలింపజేస్తారా?

‘మనము యెహోవా మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేస్తున్నాము.’​—⁠2 కొరింథీయులు 3:18.

అది ఇంతవరకూ ఏ మానవునికీ లభించని అపూర్వమైన, భక్తిపూర్వక భయం కలిగించే దర్శనాల్లో ఒకటి. సీనాయి కొండమీద ఒంటరిగా ఉన్న మోషే చేసిన అసాధారణ విన్నపం మన్నించబడింది. ఏ మానవుడూ ఎన్నడూ చూడని యెహోవా మహిమను చూసేలా ఆయన అనుమతించబడ్డాడు. అయితే, మోషే యెహోవాను సూటిగా చూడలేదు. నిజానికి, దేవుని రూపం ఎంత దేదీప్యమానంగా ఉంటుందంటే, ఆయనను చూసిన తర్వాత ఏ మానవుడూ బ్రతకలేడు. అందుకే యెహోవా ఒక దేవదూతను తన ప్రతినిధిగా ఉపయోగిస్తూ తాను మోషేను దాటి వెళ్లేంతవరకు సురక్షితంగా తన “చేతితో” ఆయనను కప్పాడు. ఆ తర్వాత, యెహోవా ఈ దివ్య మహిమను మోషే పాక్షికంగా చూసేందుకు అనుమతించాడు. అలాగే దేవదూత ద్వారా కూడా యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆ తర్వాత జరిగిన దానిని బైబిలు ఇలా వర్ణిస్తోంది: “మోషే సీనాయికొండ దిగుచుండగా . . . ఆయన [యెహోవా] అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించెను.”​—⁠నిర్గమకాండము 33:18-34:​7, 29.

2 మోషేతోపాటు మీరు కూడా ఆ కొండమీద ఉన్నట్లు ఊహించుకోండి. మిరుమిట్లు గొలిపే సర్వశక్తుని మహిమను చూడడం, ఆయన మాటలు వినడం ఎంత పులకరింపజేసేదిగా ఉంటుంది! ధర్మశాస్త్ర నిబంధనకు మధ్యవర్తిగా ఉన్న మోషేతోపాటు సీనాయి కొండ దిగడం ఎంతటి ఆధిక్యత! అయితే నిజ క్రైస్తవులు కొంతమేరకు, మోషే ప్రతిఫలింపజేసిన విధానానికి మించిన రీతిలో దేవుని మహిమను ప్రతిఫలింపజేస్తారని మీకు తెలుసా? ఆ ప్రాముఖ్యమైన వాస్తవం అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఒక పత్రికలో మనకు కనబడుతుంది. అభిషిక్త క్రైస్తవులు “[యెహోవా] ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేస్తారు” అని ఆయన వ్రాశాడు. (2 కొరింథీయులు 3:7, 8, 18) ఒకరకంగా, భూ నిరీక్షణగల క్రైస్తవులు కూడా దేవుని మహిమను ప్రతిఫలింపజేస్తారు.

క్రైస్తవులు దేవుని మహిమను ప్రతిఫలింపజేసే విధానం

3 మనం దేవుని మహిమను ఏ విధంగా ప్రతిఫలింపజేయవచ్చు? మోషేలా మనం యెహోవాను చూడలేదు లేదా ఆయన స్వరం వినలేదు. అయితే మోషేకు తెలియని విధాల్లో మనం యెహోవా గురించి తెలుసుకున్నాం. మోషే చనిపోయిన తర్వాత దాదాపు 1,500 సంవత్సరాల వరకు యేసు మెస్సీయగా ప్రత్యక్షం కాలేదు. కాబట్టి, భయంకరమైన పాపమరణాల అణచివేత నుండి మానవులను విమోచించేందుకు మరణించిన యేసులో ధర్మశాస్త్రం ఎలా నెరవేరుతుందో మోషేకు తెలిసుండకపోవచ్చు. (రోమీయులు 5:20, 21; గలతీయులు 3:19) అంతేకాకుండా, మెస్సీయ రాజ్యానికి, అది తీసుకువచ్చే భూపరదైసుకు దగ్గరి సంబంధమున్న యెహోవా సంకల్పానికి సంబంధించిన మహిమను మోషే పరిమితమైన విధంగానే గ్రహించగలిగాడు. కానీ మనం మన సహజ నేత్రాలతో కాదుగానీ బైబిలు బోధలపై ఆధారపడిన విశ్వాస నేత్రాలతోనే యెహోవా మహిమను చూస్తున్నాం. అంతేకాక, మనం యెహోవా స్వరాన్ని ఒక దేవదూత ద్వారా కాదుగానీ, బైబిలు ద్వారా, ప్రత్యేకంగా యేసు బోధలను, పరిచర్యను అద్భుతరీతిలో వర్ణించే సువార్తల ద్వారా విన్నాం.

4 క్రైస్తవులు తమ ముఖాలనుండి వెలువడే కాంతి కిరణాల ద్వారా దేవుని మహిమను ప్రతిఫలింపజేయలేకపోయినా, వారు యెహోవా మహిమాన్విత వ్యక్తిత్వం గురించి, సంకల్పాల గురించి ఇతరులకు చెబుతున్నప్పుడు వారి ముఖాలు కొంతమేరకు వెలుగును ప్రసరింపజేస్తాయి. మన కాలం గురించి మాట్లాడుతూ, దేవుని ప్రజలు ‘జనములలో యెహోవా మహిమను ప్రకటిస్తారు’ అని యెషయా ప్రవక్త ముందే చెప్పాడు. (యెషయా 66:​19) అంతేకాక, 2 కొరింథీయులు 4:1, 2లో మనమిలా చదువుతాం: “ఈ పరిచర్య పొందినందున . . . కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము.” పౌలు ప్రత్యేకముగా ‘క్రొత్త నిబంధనకు పరిచారకులుగా’ ఉన్న అభిషిక్త క్రైస్తవులను ఉద్దేశించి చెప్తున్నాడు. (2 కొరింథీయులు 3:⁠6) అయితే వారి పరిచర్య భూమ్మీద నిత్యజీవపు నిరీక్షణ పొందిన అసంఖ్యాకులను ప్రభావితం చేసింది. ఈ రెండు గుంపులకు చెందినవారి పరిచర్యలో వారు బోధించే విషయంలోనే కాదు, వారి జీవన విధానంలోనూ యెహోవా మహిమను ప్రతిఫలింపజేయడం ఇమిడివుంది. సర్వోన్నతుడైన దేవుని మహిమను ప్రతిఫలింపజేయడం మన బాధ్యత మరియు మనకు లభించిన ఆధిక్యత.

5 నేడు దేవుని రాజ్య మహిమాన్విత సువార్త యేసు ముందే చెప్పినట్లుగా భూవ్యాప్తంగా ప్రకటించబడుతోంది. (మత్తయి 24:​14) ప్రతీ జనములో నుండి, ప్రతీ వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆ యా భాషలు మాట్లాడువారిలో నుండి ఆయావ్యక్తులు సువార్తకు స్పందించి దేవుని చిత్తం చేసేలా తమ జీవితాలు మార్చుకున్నారు. (రోమీయులు 12:2; ప్రకటన 7:⁠9) తొలి క్రైస్తవుల్లాగే వారు కూడా తాము కన్నవాటిని, విన్నవాటిని చెప్పకుండా ఉండలేరు. (అపొస్తలుల కార్యములు 4:​20) మానవ చరిత్రలో ఎన్నడూ లేనంతగా నేడు, 60 లక్షలకు పైగావున్న ఆ ప్రజలు దేవుని మహిమను ప్రతిఫలింపజేస్తున్నారు. మీరూ వారిలో ఒకరిగా ఉన్నారా? దేవుని ప్రజల ఆధ్యాత్మిక సుభిక్షం యెహోవా ఆశీర్వాదం, రక్షణ మనకున్నాయనే నమ్మకమైన రుజువునిస్తోంది. శక్తిమంతమైన బలగాలు మనల్ని వ్యతిరేకించడం, యెహోవా ఆత్మ మనపై ఉందనే విషయాన్ని మరింత స్పష్టం చేస్తోంది. అలా ఎందుకో మనమిప్పుడు పరిశీలిద్దాం.

దేవుని ప్రజల్ని ప్రకటించకుండా చేయలేరు

6 ఒక క్రూర నేరస్థునికి విరుద్ధంగా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి మిమ్మల్ని పిలిచారనుకోండి. ఆ నేరస్థునికి ఒక శక్తిమంతమైన సంస్థ ఉందనీ, మీరు తన గుట్టు బయటపెట్టకుండా మిమ్మల్ని అడ్డగించేందుకు అతను అన్ని విధాలా ప్రయత్నిస్తాడనీ మీకు తెలుసు. అలాంటి నేరస్థునికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి మీకు ధైర్యంతోపాటు, అధికారులు మిమ్మల్ని అతణ్ణుంచి కాపాడతారనే నమ్మకమూ ఉండాలి. మనం అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. యెహోవాకు, ఆయన సంకల్పాలకు సాక్ష్యమిచ్చే పనిలో మనం అపవాదియైన సాతానుకు విరుద్ధంగా సాక్ష్యం చెబుతూ నరహంతకునిగా, సర్వలోకాన్ని మోసగిస్తున్న అబద్ధికునిగా అతని నిజ స్వరూపాన్ని బయటపెడతాం. (యోహాను 8:44; ప్రకటన 12:⁠9) యెహోవా పక్షాన నిలబడి అపవాదిని ఎదిరించడానికి మీకు విశ్వాసంతోపాటు ధైర్యమూ అవసరం.

7 యెహోవా సర్వోన్నతుడు. ఆయన అపారమైన శక్తి ముందు సాతాను బలం ఎందుకూ పనికిరాదు. మనం యథార్థంగా యెహోవాను సేవిస్తున్నప్పుడు ఆయనకు మనల్ని రక్షించే సామర్థ్యమే కాదు, మనల్ని రక్షించాలనే కోరిక కూడా ఉందని మనం నమ్మకంతో ఉండవచ్చు. (2 దినవృత్తాంతములు 16:⁠9) అయితే సాతాను దయ్యాల మీదే కాక, దేవుని నుండి దూరమైన మానవాళిపై కూడా అధిపతిగా ఉన్నాడు. (మత్తయి 12:24, 26; యోహాను 14:​30) భూపరిధికే పరిమితం చేయబడి “బహు క్రోధముగలవాడై” ఉన్న సాతాను యెహోవా సేవకులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సువార్త ప్రకటించే వారందరిని ప్రకటించకుండా చేయాలని ప్రయత్నించడానికి తన ఆధీనంలోవున్న లోకాన్ని ఉపయోగిస్తున్నాడు. (ప్రకటన 12:​7-9, 12, 17) అతడు దీనిని ఎలా చేస్తున్నాడు? కనీసం మూడు మార్గాల్లో.

8 మన దృష్టి మళ్లించడానికి సాతాను ప్రయత్నించే ఒక మార్గం జీవిత చింతలు. ఈ అంత్యదినాల్లోని ప్రజలు ధనాపేక్షులుగా, స్వార్థప్రియులుగా, సుఖానుభవమును ప్రేమించేవారిగా ఉన్నారు. వారు దేవుణ్ణి ప్రేమించేవారిగా లేరు. (2 తిమోతి 3:1-4) ప్రతిదిన జీవన వ్యవహారాల్లో మునిగిపోయి చాలామంది వారికి ప్రకటించబడుతున్న సువార్తను ‘ఎరుగక’ ఉన్నారు. బైబిలు సత్యం నేర్చుకోవడంలో వారికి ఏ మాత్రం ఆసక్తిలేదు. (మత్తయి 24:37-39) అలాంటి దృక్పథం అంటువ్యాధిలా వ్యాపించి మనల్ని ఆధ్యాత్మిక నిద్రావస్థలోకి జార్చివేయగలదు. భౌతిక వస్తువులపట్ల, జీవిత సుఖాలపట్ల మనం ప్రేమను పెంచుకోవడం ఆరంభిస్తే, దేవునిపట్ల మన ప్రేమ చల్లారిపోతుంది.​—⁠మత్తయి 24:12.

9 అందుకే క్రైస్తవులు తమ సహవాసులను జాగ్రత్తగా ఎంచుకుంటారు. “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును” అని రాజైన సొలొమోను వ్రాశాడు. (సామెతలు 13:20) దేవుని ప్రేమను ప్రతిఫలింపజేస్తున్న వారితోనే మనం ‘సహవాసం’ చేయుదము గాక! అలా చేయడం ఎంత ఆహ్లాదకరమో కదా! మన కూటాల్లోనూ ఇతర సమయాల్లోనూ మన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలతో సహవసిస్తుండగా, వారి ప్రేమ, వారి విశ్వాసం, వారి ఆనందం, వారి జ్ఞానంవల్ల మనం ప్రోత్సహించబడతాం. అలాంటి మంచి సహవాసం మన పరిచర్యలో పట్టుదలగా కొనసాగాలనే మన నిర్ణయాన్ని బలపరుస్తుంది.

10 దేవుని మహిమను ప్రతిఫలింపజేయకుండా క్రైస్తవులందరినీ ఆపుజేసేందుకు సాతాను ప్రయత్నించే రెండవ మార్గం అపహాస్యం. ఈ కుయుక్తి మనకు ఆశ్చర్యం కలిగించకూడదు. ఈ భూమ్మీద పరిచర్య చేసిన కాలంలో యేసుక్రీస్తు అపహాస్యానికి గురయ్యాడు అంటే ఆయనను చూసి ప్రజలు నవ్వారు, వేళాకోళం చేశారు, అపహసించారు, అవమానించారు, చివరకు ఆయన ముఖం మీద ఉమ్మివేశారు. (మార్కు 5:40; లూకా 16:​14; 18:32) తొలి క్రైస్తవులు కూడా ఎగతాళికి గురయ్యారు. (అపొస్తలుల కార్యములు 2:​13; 17:32) యెహోవా ప్రస్తుతదిన సేవకులు కూడా అలాంటి అవమానాలనే ఎదుర్కొంటున్నారు. అపొస్తలుడైన పేతురు చెప్పినట్లుగా, వారు అబద్ధ ప్రవక్తలని నిందించబడతారు. “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు,​—⁠ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? . . . సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురని” పేతురు ముందే చెప్పాడు. (2 పేతురు 3:3, 4) దేవుని ప్రజలకు వాస్తవిక దృక్పథం లేదని వారు ఎగతాళి చేయబడుతున్నారు. బైబిలులోవున్న నైతిక ప్రమాణాలు పాతబడిపోయినట్లు దృష్టించబడుతున్నాయి. చాలామందికి మనం ప్రకటించే సందేశం వెర్రితనంగా ఉంది. (1 కొరింథీయులు 1:18, 19) క్రైస్తవులుగా మనం పాఠశాలలో, ఉద్యోగ స్థలంలో, చివరకు కుటుంబంలో కూడా కొన్నిసార్లు అపహాస్యాన్ని ఎదుర్కొనవచ్చు. అయినప్పటికీ నిరుత్సాహపడక, యేసులాగే దేవుని వాక్యం సత్యమని ఎరిగిన మనం మన ప్రకటన ద్వారా దేవుని మహిమను ప్రతిఫలింపజేయడంలో కొనసాగుతాం.​—⁠యోహాను 17:17.

11 మనల్ని ప్రకటించకుండా చేయడానికి అపవాది ప్రయత్నించే మూడవ కుయుక్తి వ్యతిరేకత లేదా హింస. యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: “జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.” (మత్తయి 24:9) అవును యెహోవాసాక్షులుగా మనం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తీవ్ర హింసను ఎదుర్కొన్నాం. యెహోవా చాలాకాలం ముందే చెప్పినట్లుగా, దేవుని సేవకులకు అపవాదియైన సాతాను సేవకులకు మధ్య ద్వేషం లేదా వైరం ఉంటుందని మనకు తెలుసు. (ఆదికాండము 3:15) అలాగే పరీక్షా సమయాల్లో యథార్థతను కాపాడుకోవడం మూలంగా యెహోవా విశ్వసర్వాధిపత్యపు హక్కు గురించి సాక్ష్యమిస్తున్నామని కూడా మనకు తెలుసు. దీనిని తెలుసుకొని ఉండడం అత్యంత కఠిన పరిస్థితుల్లో సహితం బలంగా ఉండేందుకు మనకు దోహదపడగలదు. దేవుని మహిమను ప్రతిఫలింపజేయాలనే దృఢసంకల్పంతో మనం నిలబడినప్పుడు ఏ హింసా మనల్ని శాశ్వతంగా ప్రకటించకుండా చేయలేదు.

12 లోక ఆకర్షణలను ప్రతిఘటిస్తూ, అపహాస్యం, హింస ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు నమ్మకస్థులని నిరూపించుకుంటారా? అలాగైతే మీరు ఆనందించే కారణముంది. యేసు తనను అనుసరించేవారికి ఇలా అభయమిచ్చాడు: “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.” (మత్తయి 5:11, 12) మీ సహనం యెహోవా మహిమను ప్రతిఫలింపజేసేందుకు మిమ్మల్ని బలపరిచే శక్తిమంతమైన పరిశుద్ధాత్మ మీ మీద ఉందనే రుజువునిస్తుంది.​—⁠2 కొరింథీయులు 12:9.

సహించేందుకు యెహోవా సహాయం చేస్తాడు

13 పరిచర్యలో సహించడానికి ముఖ్య కారణం మనం యెహోవాను ప్రేమిస్తున్నాం, ఆయన మహిమను ప్రతిఫలింపజేయడానికి ఆనందిస్తాం. మానవులు తాము ప్రేమించేవారిని, గౌరవించేవారిని అనుకరించడం సహజం, అనుకరించేందుకు యెహోవా దేవునికంటే అర్హుడైన వ్యక్తి ఇంకెవ్వరూ లేరు. ఆయనకున్న మహా ప్రేమనుబట్టి సత్యానికి సాక్ష్యమిచ్చేందుకు, విధేయులైన మానవాళిని విమోచించేందుకు ఆయన తన కుమారుణ్ణి భూమ్మీదికి పంపించాడు. (యోహాను 3:​16; 18:37) దేవునిలాగే మనం కూడా ప్రజలందరూ మారుమనస్సు పొంది రక్షించబడాలని కోరుకుంటాం; అందుకే మనం వారికి ప్రకటిస్తాం. (2 పేతురు 3:9) ఈ కోరికతోపాటు దేవుణ్ణి అనుకరించాలనే మన దృఢసంకల్పం మన పరిచర్య ద్వారా ఆయన మహిమను ప్రతిఫలింపజేయడంలో పట్టుదలగా ముందుకు సాగడానికి మనల్ని పురికొల్పుతుంది.

14 అయితే క్రైస్తవ పరిచర్యను సహనంతో చేసేందుకు మనకు అవసరమైన బలం ప్రాథమికంగా యెహోవా నుండే వస్తుంది. ఆయన తన పరిశుద్ధాత్మ, సంస్థ, తన వాక్యమైన బైబిలు ద్వారా మనల్ని బలపరచి ఆదుకుంటాడు. తన మహిమను ప్రతిఫలింపజేయడానికి ఇష్టపడేవారికి యెహోవా ‘ఓర్పును అనుగ్రహిస్తాడు.’ ఆయన మన ప్రార్థనలు ఆలకించి పరీక్షలతో వ్యవహరించే జ్ఞానాన్ని మనకు దయచేస్తాడు. (రోమీయులు 15:5; యాకోబు 1:5) అంతేకాక, మనం భరించలేనంతగా పరీక్షించబడేలా యెహోవా మనల్ని అనుమతించడు. మనం యెహోవాపై ఆధారపడినప్పుడు, మనమాయన మహిమను ప్రతిఫలింపజేస్తూ ఉండేలా తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తాడు.​—⁠1 కొరింథీయులు 10:13.

15 మన పరిచర్యను సహనంతో కొనసాగించడం దేవుని ఆత్మ మనమీద ఉందనే రుజువునిస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా మిమ్మల్ని డబ్బులేమీ తీసుకోకుండా ఆహారాన్ని ఇంటింటా పంచిపెట్టమని అడిగారనుకోండి. మీ సొంత ఖర్చులతో మీ సొంత సమయంలో దీనిని చేయాలని మీరు ఆదేశించబడ్డారు. పైగా ఆ ఆహారాన్ని నిజానికి కొద్దిమందే కావాలని కోరుకుంటున్నారని మీకు త్వరలోనే తెలుస్తుంది; చివరకు, కొందరు ఆహారం పంచిపెట్టే మీ ప్రయత్నాలను వ్యతిరేకిస్తారు కూడా. మీరిక నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆ పనిలోనే కొనసాగుతారని మీరనుకుంటున్నారా? మీరలా అనుకోకపోవచ్చు. అయినప్పటికీ మీ సొంత ఖర్చులతో, మీ సొంత సమయాన్ని వెచ్చిస్తూ మీరు అనేక సంవత్సరాలుగా బహుశా దశాబ్దాలుగా సువార్తను ప్రకటిస్తుండవచ్చు. ఎందుకు? దానికి కారణం, యెహోవాపట్ల మీకున్న ప్రేమ, మీరు సహించేందుకు సహాయం చేస్తూ తన ఆత్మ ద్వారా మీ ప్రయత్నాలను ఆయన ఆశీర్వదించడం కాదా? నిశ్చయంగా కారణమదే!

నిత్యం గుర్తుంచుకునే సేవ

16 క్రొత్త నిబంధనా పరిచర్య ఒక సాటిలేని బహుమానం. (2 కొరింథీయులు 4:7) అదేవిధంగా, ప్రపంచవ్యాప్తంగా వేరేగొర్రెలు చేస్తున్న క్రైస్తవ పరిచర్య కూడా ఒక ఐశ్వర్యమే. మీరు మీ పరిచర్యను సహనంతో కొనసాగించినప్పుడు, పౌలు తిమోతికి వ్రాసినట్లే ‘మిమ్మల్ని, మీ బోధ వినేవారిని రక్షించుకుంటారు.’ (1 తిమోతి 4:16) దాని భావమేమిటో ఒక్కసారి ఆలోచించండి. మనం ఇతరులకు ప్రకటించే సువార్త నిత్యం జీవించే అవకాశాన్ని వారికిస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా సహాయం చేస్తున్నవారితో బలమైన ఆధ్యాత్మిక సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. దేవుని గురించి నేర్చుకోవడానికి మీరు సహాయం చేసినవారితోపాటు పరదైసులో నిత్యం జీవించే ఆనందం గురించి ఒక్కసారి ఊహించుకోండి! వారికి సహాయం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలను నిశ్చయంగా వారెన్నటికీ మర్చిపోరు. అది నిజంగా ఎంత సంతృప్తినిస్తుందో కదా!

17 మానవ చరిత్రలోనే ఒక అసాధారణ కాలంలో మీరు జీవిస్తున్నారు. దేవుని నుండి దూరమైపోయిన ప్రపంచంలో సువార్త మళ్లీ ఇంకెన్నడూ ప్రకటించబడదు. నోవహు అలాంటి లోకంలోనే జీవించి అది గతించిపోవడం చూశాడు. తనను, తన కుటుంబాన్ని రక్షించడానికి దోహదపడిన ఓడను నిర్మించడంలో దేవుని చిత్తాన్ని నమ్మకంగా నెరవేర్చానని తెలుసుకొని ఆయన ఎంతగా ఆనందించి ఉంటాడో! (హెబ్రీయులు 11:7) మీరు కూడా అలాంటి ఆనందాన్ని పొందవచ్చు. రాజ్య సంబంధ విషయాలకు తోడ్పడేలా ఈ అంత్యదినాల్లో మీరు చేయగలిగినదంతా చేశారని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ నూతనలోకంలో మీ భావాలెలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి.

18 కాబట్టి మనం దేవుని మహిమను ప్రతిఫలింపజేయడంలో కొనసాగుదాం. అలా చేయడం మనం నిత్యం గుర్తుంచుకునేదిగా ఉంటుంది. యెహోవా కూడా మన కార్యాలను గుర్తుంచుకుంటాడు. బైబిలు మనకు ఈ ప్రోత్సాహాన్నిస్తోంది: “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు. మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.”​—⁠హెబ్రీయులు 6:10-12.

మీరు వివరించగలరా?

క్రైస్తవులు దేవుని మహిమను ఎలా ప్రతిఫలింపజేస్తారు?

దేవుని ప్రజలను ప్రకటించకుండా చేసే తన ప్రయత్నాల్లో సాతాను ఉపయోగించే కొన్ని కుయుక్తులు ఏమిటి?

మనమీద దేవుని ఆత్మ ఉందని చెప్పడానికి ఎలాంటి రుజువుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. మోషే ఏమి చూశాడు, ఆ తర్వాత ఏమి జరిగింది?

2. క్రైస్తవులు ప్రతిఫలింపజేసే మహిమ గురించి అపొస్తలుడైన పౌలు ఏమి వ్రాశాడు?

3. మోషేకు అవకాశం లేని ఏ విధాల్లో మనం యెహోవాను తెలుసుకున్నాం?

4. (ఎ) అభిషిక్త క్రైస్తవులు దేవుని మహిమను ఎలా ప్రతిఫలింపజేస్తారు? (బి) భూ నిరీక్షణగల వారు ఏయే విధాలుగా దేవుని మహిమను ప్రతిఫలింపజేయవచ్చు?

5. మన ఆధ్యాత్మిక సుభిక్షం దేనిని రుజువు చేస్తోంది?

6. యెహోవా పక్షాన నిలబడడానికి విశ్వాసం, ధైర్యం ఎందుకు అవసరం?

7. సాతానుకు ఎంత ప్రాబల్యం ఉంది, అతడు ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు?

8, 9. దారి మళ్లిన ప్రేమను సాతాను ఎలా ఉపయోగిస్తాడు, మన సహవాసులను మనమెందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలి?

10. దేవుని మహిమను ప్రతిఫలింపజేసేవారికి వ్యతిరేకంగా సాతాను ఏయే విధాలుగా అపహాస్యాన్ని ఉపయోగించాడు?

11. క్రైస్తవులను ప్రకటించకుండా చేసేందుకు ప్రయత్నిస్తూ సాతాను హింసను ఎలా ఉపయోగించాడు?

12. సాతాను వ్యతిరేకత ఉన్నప్పటికీ నమ్మకస్థులమని నిరూపించుకుంటున్నందుకు మనమెందుకు ఆనందించాలి?

13. మన క్రైస్తవ పరిచర్యలో మనం సహనంతో ఉండడానికి ముఖ్య కారణమేమిటి?

14. మన పరిచర్యను సహనంతో చేసేందుకు యెహోవా మనల్ని ఎలా బలపరుస్తాడు?

15. సహించడానికి మనకేది సహాయం చేస్తుంది?

16. పరిచర్యను సహనంతో కొనసాగించడం మనకూ, మన బోధ వినేవారికీ ఎలాంటి భావాన్నిస్తుంది?

17. మన కాలం మానవ చరిత్రలోనే ఎందుకు ఒక అసాధారణ కాలం?

18. యెహోవా తన సేవకులకు ఎలాంటి హామీని, ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు?

[15వ పేజీలోని చిత్రం]

మోషే ముఖం మహిమను ప్రతిఫలింపజేసింది

[16, 17వ పేజీలోని చిత్రాలు]

మన పరిచర్యలో మనం దేవుని మహిమను ప్రతిఫలింపజేస్తాం