కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాయల్‌ బైబిల్‌ జ్ఞానార్జనలో ఒక మైలురాయి

రాయల్‌ బైబిల్‌ జ్ఞానార్జనలో ఒక మైలురాయి

రాయల్‌ బైబిల్‌ జ్ఞానార్జనలో ఒక మైలురాయి

పదహారవ శతాబ్దపు తొలిభాగంలో ఒక ఓడ స్పెయిన్‌ నుండి ఇటాలియన్‌ ద్వీపకల్పానికి బయలుదేరింది. ఓడలోని సామానువేసే గదిలో ఎంతో విలువైన సరుకు ఉంది, ఆ సరుకు 1514 నుండి 1517 మధ్యకాలంలో ముద్రించబడిన కాంప్లుటెన్సియన్‌ బహుభాషా బైబిలుకు సంబంధించిన అనేక ముద్రిత ప్రతులు. సముద్రంలో అకస్మాత్తుగా ఒక పెను తుఫాను చెలరేగింది. ఓడలో పనిచేసేవారు ఓడను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు, అయితే వారి ప్రయత్నాలు నిష్ప్రయోజనమయ్యాయి. ఆ ఓడ దానిలోని అమూల్యమైన సరుకుతో మునిగిపోయింది.

ఆ విపత్తు, బహుభాషా బైబిలు క్రొత్త ఎడిషన్‌ అవసరతను అధికం చేసింది. చివరకు, ముద్రణా నిపుణుడు క్రిస్టప్‌ ప్లాన్‌టిన్‌ క్రొత్త ఎడిషన్‌ను ముద్రించే కష్టమైన పనిని చేపట్టాడు. ఆయనకు ఆ బృహత్కార్యానికి అవసరమైన ఆర్థిక సహాయం కోసం ఒక ధనికుడైన దాత కావాల్సి వచ్చింది, అందుకు ఆయన స్పెయిన్‌ రాజు ఫిలిప్‌ 2ను ఆర్థిక సహాయం కోసం అడిగాడు. ఆ రాజు ఆర్థిక సహాయం చేయడం గురించి నిర్ణయం తీసుకొనే ముందు స్పెయిన్‌కు చెందిన వివిధ విద్వాంసులను సంప్రదించాడు, అలా సంప్రదించినవారిలో ప్రఖ్యాత బైబిలు విద్వాంసుడు బెనిటో ఆర్యాస్‌ మొన్టానో కూడా ఉన్నాడు. ఆయన ఫిలిప్‌ రాజుతో ఇలా అన్నాడు: “ఆ బృహత్కార్యం ద్వారా దేవునికి సేవ చేయడమే కాక విశ్వ చర్చికి ప్రయోజనం కూడా చేకూరుతుంది, గౌరవనీయమైన మీ రాజరికపు పేరుకు గొప్ప కీర్తి కూడా కలుగుతుంది, మీ పేరు ప్రతిష్ఠలను పెంచుతుంది.”

కాంప్లుటెన్సియన్‌ బహుభాషా బైబిలు సవరించబడిన ఎడిషన్‌ ముద్రించగలిగితే అది ఒక ప్రాముఖ్యమైన సాంస్కృతిక విజయమే అవుతుంది, కాబట్టి ప్లాన్‌టిన్‌ ప్రణాళికకు హృదయపూర్వకంగా మద్దతు ఇవ్వాలని ఫిలిప్‌ నిర్ణయించుకున్నాడు. కొంతకాలం తర్వాత రాయల్‌ బైబిల్‌గా లేక ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలుగా పిలువబడిన బైబిలును సవరించే బృహత్కార్యాన్ని ఆయన ఆర్యాస్‌ మొన్టానోకు అప్పగించాడు. *

ఫిలిప్‌, ఈ బహుభాషా బైబిలు ముద్రణా పనిపై ఎంతగా ఆసక్తి చూపించాడంటే ఆయన అచ్చు నకలు కాగితాలన్నిటినీ తనకు పంపించాల్సిందిగా కోరాడు. ప్రతీ కాగితం ఆన్ట్వర్ప్‌ నుండి స్పెయిన్‌కు వెళ్ళి అక్కడ రాజు దానిని చదివి, సరిచేసి తిరిగి పంపించేంతవరకు వేచి ఉండడానికి ప్లాన్‌టిన్‌ సహజంగానే ఇష్టపడలేదు. తత్ఫలితంగా ఫిలిప్‌కు మొదటి ముద్రిత కాగితం మాత్రమే అందింది, దాంతోపాటు ఆయనకు బహుశా కొన్ని మొదటి పేజీలు కూడా అంది ఉండవచ్చు. అదే సమయంలో లొవెయిన్‌కు చెందిన ముగ్గురు ప్రొఫెసర్ల సహకారంతో, ప్లాన్‌టిన్‌ కౌమారప్రాయంలోవున్న కూతురు ఇచ్చిన అమూల్యమైన సహకారంతో మొన్టానో అసలైన అచ్చుదిద్దే పనిలో ముందుకు సాగాడు.

దేవుని వాక్యాన్ని ప్రేమించాడు

ఆర్యాస్‌ మొన్టానో ఆన్ట్వర్ప్‌కు చెందిన విద్వాంసులతో చక్కగా కలిసిపోయాడు. విశాల హృదయంతో ఆయన పనిచేసే తీరు ఆయనను ప్లాన్‌టిన్‌కు ప్రియమైన వ్యక్తిని చేసింది, వారి మధ్య ఉన్న స్నేహ సహకారాలు వారి శేష జీవితమంతా నిలిచాయి. మొన్టానో, జ్ఞానార్జనలోనే కాక దేవుని వాక్యంపట్ల తనకున్న గొప్ప ప్రేమ విషయంలో కూడా అసాధారణమైన వ్యక్తిగా నిలిచాడు. * ఆయన యౌవనంలో ఉన్నప్పుడు, లేఖనాల అధ్యయనానికి పూర్తిగా తనను తాను అంకితం చేసుకొనేందుకు తన చదువులను పూర్తి చేయడానికి ఆతురత చూపించాడు.

బైబిలు అనువాదం సాధ్యమైనంతవరకు ఉన్నదున్నట్లుగా ఉండాలని ఆర్యాస్‌ మొన్టానో నమ్మాడు. ఆయన మూలపాఠంలో వ్రాయబడినవి ఖచ్చితంగా అనువదించడానికి ప్రయత్నించాడు, అలాచేస్తే పాఠకునికి దేవుని సత్యవాక్యాన్ని చదివే అవకాశం లభిస్తుంది. “మూలపాఠంలో నుండి క్రీస్తు గురించి ప్రకటించమని” విద్వాంసులను ప్రోత్సహించిన ఎరాస్మస్‌ నినాదాన్ని మొన్టానో అనుసరించాడు. లాటిన్‌ అనువాదాలను అర్థం చేసుకోవడంలోవున్న సంక్లిష్టత కారణంగా లేఖనాల మూల భాషల్లో ఉన్న భావం ప్రజలకు తెలియకుండా మరుగు చేయబడింది.

ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలు కూర్పు

కాంప్లుటెన్సియన్‌ బహుభాషా బైబిలును ముద్రించడంలో భాగంగా ఆల్ఫొన్సొ డి జమొరా తయారుచేసి, సవరించిన వ్రాతప్రతులన్నీ ఆర్యాస్‌ మొన్టానో సంపాదించి వాటిని రాయల్‌ బైబిలు కోసం ఉపయోగించాడు. *

రాయల్‌ బైబిలును సిద్ధం చేస్తున్నప్పుడు కాంప్లుటెన్సియన్‌ బహుభాషా బైబిలు రెండవ ఎడిషన్‌ని తయారుచేయాలని మొదట్లో ఉద్దేశించబడింది, అయితే ఆ బైబిల్లో కొన్ని సవరింపులకంటే ఎక్కువే జరిగాయి. సెప్టాజింట్‌కు సంబంధించిన హీబ్రూ, గ్రీకు మూలపాఠాలు కాంప్లుటెన్సియన్‌ బైబిలు నుండి తీసుకోబడ్డాయి, ఆ తర్వాత విస్తృతమైన అనుబంధంతో పాటు కొత్త మూలపాఠాలు కూడా చేర్చబడ్డాయి. చివరకు, క్రొత్త బహుభాషా బైబిలు ఎనిమిది సంపుటాలుగా విడుదలయింది. వాటిని ముద్రించడానికి ఐదు సంవత్సరాలు పట్టింది, అంటే 1568లో మొదలై 1572లో ముగిసింది, సంక్లిష్టమైన ఈ పనినిబట్టి చూస్తే దాన్ని ముద్రించడానికి చాలా తక్కువ సమయమే పట్టిందని చెప్పవచ్చు. చివరకు, 1,213 కాపీలు ముద్రించబడ్డాయి.

1517వ సంవత్సరానికి చెందిన కాంప్లుటెన్సియన్‌ బహుభాషా బైబిలు విషయంలోనైతే అది “ముద్రణా కళకు సంబంధించిన జ్ఞాపకచిహ్నం” అని రుజువైంది, క్రొత్త ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలు సాంకేతిక విలువలో, పరిమాణంలో దాని ముందు వచ్చిన బైబిలును మించిపోయింది. అది ముద్రణా చరిత్రలోనే కాక అతి ప్రాముఖ్యంగా, ఇతర అనువాదాలు చేసేందుకు వీలుగా సవరించబడిన ప్రతిని సిద్ధం చేయడంలో కూడా మరో మైలురాయి అయింది.

దేవుని వాక్య శత్రువుల నుండి దాడులు

మూలపాఠానికి యథార్థంగా ఉన్న బైబిలు అనువాదానికి కొద్ది కాలంలోనే శత్రువులు తెరపైకి రావడంలో ఆశ్చర్యమేమీలేదు. ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలుకు పోప్‌ ఆమోదం ఉన్నా, ఆర్యాస్‌ మొన్టానోకు ఒక గౌరవనీయుడైన విద్వాంసునిగా తగిన కీర్తి ప్రతిష్ఠలు ఉన్నా, వ్యతిరేకులు ఆయనను అప్పటి ఇన్‌క్విసిషన్‌ (క్యాథలిక్‌ విచారణా సభ) ముందు నిలబెట్టారు. రాయల్‌ బైబిలుకు సంబంధించి మొన్టానో చేసిన పని, శతాబ్దాల క్రితం అనువదించబడిన వల్గేట్‌ మూలపాఠం కన్నా సాన్టాస్‌ పన్యినో క్రొత్తగా సవరించిన లాటిన్‌ మూలపాఠమే, హీబ్రూ, గ్రీకు మౌలిక భాషలలో నుండి చాలా ఖచ్చితంగా అనువదించబడిందనే భావాన్ని కలిగిస్తోందని వ్యతిరేకులు నిందమోపారు. బైబిలు ఖచ్చితమైన అనువాదాన్ని తయారుచేయాలనే తన కోరికను తీర్చుకోవడానికి మౌలిక భాషలను పరిశీలించాడని మొన్టానో మీద నింద మోపారు, ఎందుకంటే అప్పట్లో అలా మౌలిక భాషలను పరిశీలించడం చర్చికి విరుద్ధమైనదిగా దృష్టించేవారు.

“ఆ పనికి తన ఆర్థిక మద్దతు ఇవ్వడం ద్వారా రాజు అధిక గౌరవాన్ని సంపాదించుకోలేదని” కూడా ఆ ఇన్‌క్విసిషన్‌ నొక్కిచెప్పింది. మొన్టానో అధికారిక వల్గేట్‌ను తగిన విధంగా అధికార మూలంగా తీసుకోలేదని వారు విచారాన్ని వ్యక్తం చేశారు. వారు ఈ నిందలు మోపినా మొన్టానోను గానీ ఆయన బహుభాషా బైబిలును గానీ ఖండించేందుకు వారు సరిపోయేంత రుజువును కనుగొనలేకపోయారు. చివరకు, రాయల్‌ బైబిలు ప్రఖ్యాతి గాంచింది, దానిని వివిధ విశ్వవిద్యాలయాలు ప్రామాణిక పుస్తకంగా ఆమోదించాయి.

బైబిలు అనువాదానికి ఒక ఉపయోగకరమైన సాధనం

ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలు సామాన్య ప్రజానీకం కోసం ఉద్దేశించినది కాకపోయినా, కొంతకాలానికే అది బైబిలు అనువాదకులకు ఉపయోగకరమైన సాధనంగా మారింది. అది దాని ముందు వచ్చిన కాంప్లుటెన్సియన్‌ బహుభాషా బైబిలులాగే అందుబాటులో ఉన్న లేఖనాల మూలపాఠాలను లోపరహితంగా చేయడానికి తోడ్పడింది. అనువాదకులు మౌలిక భాషల గురించిన తమ అవగాహనను పెంచుకోవడానికి కూడా సహాయం చేసింది. ప్రధానమైన అనేక యూరోపియన్‌ భాషా బైబిలు అనువాదాలు ఆ బైబిలు నుండి ప్రయోజనం పొందాయి. ఉదాహరణకు, 1611కు చెందిన ప్రఖ్యాతి గాంచిన కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ లేక ఆథరైజ్డ్‌ వర్షన్‌ అనువాదకులు ప్రాచీన భాషలను అనువదించడానికి ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలును అమూల్యమైన సహాయకంగా ఉపయోగించారని ద కేంబ్రిడ్జ్‌ హిస్టరీ ఆఫ్‌ ద బైబిల్‌ అనే పుస్తకం నివేదిస్తోంది. ద రాయల్‌ బైబిల్‌, 17వ శతాబ్దంలో ముద్రించబడిన రెండు ప్రాముఖ్యమైన బహుభాషా బైబిళ్ళ మీద కూడా చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపించింది.​—⁠“బహుభాషా బైబిళ్ళు” అనే బాక్సు చూడండి.

అది యూరప్‌కు చెందిన విద్వాంసులకు మొదటిసారిగా గ్రీకు లేఖనాల సిరియక్‌ అనువాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందనే వాస్తవం ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలుకు సంబంధించిన అనేక మంచి విషయాల్లో ఒకటి. ఆ సిరియా మూలపాఠం, అక్షరార్థ లాటిన్‌ అనువాదం ప్రక్కన చేర్చబడింది. అలా చేర్చడం ప్రయోజనకరం అయింది, ఎందుకంటే క్రైస్తవ గ్రీకు లేఖనాల పురాతన అనువాదాలలో సిరియక్‌ అనువాదం ఒకటి. సా.శ. ఐదవ శతాబ్దం తర్వాత అనువదించబడిన సిరియక్‌ అనువాదం, సా.శ రెండవ శతాబ్దానికి చెందిన చేతివ్రాతప్రతుల మీద ఆధారితమైనది. ది ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం “మూలపాఠాన్ని విశ్లేషించే విషయంలో [సిరియక్‌] పెషిట్టాకు ఉన్న విలువ సాధారణంగా గుర్తించబడుతోంది. అది ప్రాచీన సంప్రదాయాల గురించిన అతి పురాతన, అతి ప్రాముఖ్య సమాచార మూలాలలో ఒకటి.”

పెను తుఫాను గానీ స్పానిష్‌ ఇన్‌క్విసిషన్‌ దాడులు గానీ, కాంప్లుటెన్సియన్‌ బహుభాషా బైబిలుకు సంబంధించిన అభివృద్ధి చెందిన, పెద్దదైన బైబిలు అనువాదమైన రాయల్‌ బైబిలు రూపంలో 1572లో తిరిగి ముద్రించబడడాన్ని ఆపలేకపోయాయి. దేవుని వాక్యాన్ని సమర్థించడానికి యథార్థ హృదయులు చేసిన ప్రయత్నాలకు ఆన్ట్వర్ప్‌కు చెందిన బహుభాషా బైబిలు చరిత్ర మరో ఉదాహరణ.

ఆ యథార్థహృదయులకు ఈ విషయం తెలుసో తెలియదో తెలియదు కానీ, ఆ అంకిత భావంగల పురుషుల నిస్వార్థ కృషి, యెషయా ప్రవచనాత్మక వాక్యాలకున్న సత్యాన్ని ప్రతిబింబిస్తోంది. దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం ఆయనిలా వ్రాశాడు: “గడ్డి యెండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.”​—⁠యెషయా 40:⁠8.

[అధస్సూచీలు]

^ పేరా 4 ఫిలిప్‌ రాజు దానికి ఆర్థిక సహాయం చేశాడు కాబట్టి అది రాయల్‌ బైబిల్‌ అని పిలువబడింది, ఆ కాలంలో స్పెయిన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న ఆన్ట్వర్ప్‌ నగరంలో ఆ బైబిలు ముద్రించబడింది కాబట్టి అది ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలు అని పిలువబడింది.

^ పేరా 7 బహుభాషా బైబిల్లో ఉపయోగించిన ఐదు ప్రధాన భాషలైన అరబిక్‌, గ్రీక్‌, హీబ్రూ, లాటిన్‌, సిరియన్‌ భాషలలో ఆయన ప్రావీణ్యుడు. ఆయన పురావస్తుశాస్త్రం, వైద్యశాస్త్రం, భౌతికశాస్త్రం, వేదాంతశాస్త్రం వంటి అధ్యయనాలలో కూడా ప్రావీణ్యుడు, ఆయన ఆ అధ్యయనాలను అనుబంధాన్ని సిద్ధం చేయడానికి చక్కగా ఉపయోగించాడు.

^ పేరా 10 కాంప్లుటెన్సియన్‌ బహుభాషా బైబిలుకున్న ప్రాముఖ్యత గురించిన వివరణ కోసం కావలికోట, ఏప్రిల్‌ 15, 2004 చూడండి.

[13వ పేజీలోని బ్లర్బ్‌]

“మన దేవుని వాక్యము నిత్యము నిలుచును”

[12వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

బహుభాషా బైబిళ్ళు

“మూలపాఠం వివిధ భాషల్లో ఉండే బైబిళ్ళను బహుభాషా బైబిళ్ళు అని అంటారు” అని స్పానిష్‌ విద్వాంసుడు ఫెడిరికో పెరెజ్‌ క్యాస్ట్రో వివరిస్తున్నాడు. “సాంప్రదాయంగా ఆ పదం మౌలిక భాషలో లేఖన మూలపాఠం ఉన్న బైబిళ్ళకు వర్తిస్తుంది. ఆ పదం అలాంటి బైబిళ్ళకే వర్తిస్తే, బహుభాషా బైబిళ్ళు చాలా తక్కువ ఉన్నాయని చెప్పవచ్చు.”

1. కాంప్లుటెన్సియన్‌ బహుభాషా బైబిలు (1514-17), దీనికి కార్డినల్‌ సిస్నరోస్‌ ఆర్థిక సహాయం చేశాడు, స్పెయిన్‌లోని థా ఆనరాస్‌లో ముద్రించబడింది. దాని ఆరు సంపుటాల్లో బైబిలు మూలపాఠం నాలుగు భాషల్లో ఉంది, ఆ భాషలు హీబ్రూ, గ్రీకు, అరామైక్‌, లాటిన్‌. అది ఇతర అనువాదాలు చేసేందుకు ఆధారంగా చేసుకొనగల హీబ్రూ-అరామైక్‌ లేఖనాల మూలపాఠాన్ని 16వ శతాబ్దపు అనువాదకులకు ఇచ్చింది.

2. ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలు (1568-72) దీనిని ఆర్యాస్‌ మొన్టానో సంకలనం చేశాడు, అది కాంప్లుటెన్సియన్‌ మూలపాఠానికి క్రైస్తవ గ్రీకు లేఖనాలకు సంబంధించిన సిరియక్‌ పెషిట్టా అనువాదాన్ని, జొనాతాన్‌కు చెందిన అరామైక్‌ టార్గమ్‌ను చేర్చింది. అచ్చు చిహ్నాలు, ఉచ్చారణా సంబంధిత గుర్తులు ఉన్న హీబ్రూ మూలపాఠం, జేకబ్‌ బెన్‌ హాయీమ్‌కు చెందిన హీబ్రూ మూలపాఠం నుండి లభించిన అచ్చు చిహ్నాలు, ఉచ్చారణా సంబంధిత గుర్తులకు అనుగుణంగా సవరించబడింది. అలా అది బైబిలు అనువాదకులకు హీబ్రూ లేఖనాల ప్రామాణిక మూలపాఠం అయింది.

3. ద పారిస్‌ బహుభాషా బైబిలు (1629-45) దీనికి ఫ్రెంచ్‌ న్యాయవాది గీ మీషెల్‌ లెజె ఆర్థిక సహాయం చేశాడు. దానిలో కొన్ని సమారిటన్‌, అరబిక్‌ మూలపాఠాలు ఉన్నా అది ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలు నుండి ప్రేరణ పొందింది.

4. లండన్‌ బహుభాషా బైబిలు (1655-57) దీనిని బ్రయాన్‌ వార్టన్‌ సంకలనం చేశాడు, ఇది కూడా ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలు మీద ఆధారితమైనదే. ఈ బహుభాషా బైబిల్లో ప్రాచీన ఇథియోపియన్‌, పర్షియన్‌ బైబిలు అనువాదాలు కూడా ఉన్నాయి, ఈ అనువాదాలు బైబిలు మూలపాఠానికి చెప్పుకోదగ్గ స్పష్టతనేమీ పెంచలేదు.

[చిత్రసౌజన్యం]

బ్రయాన్‌, ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిళ్లు (క్రిందవున్న రెండు): Biblioteca Histórica. Universidad Complutense de Madrid; ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలు (పైన): By courtesy of Museum Plantin-Moretus/Stedelijk Prentenkabinet Antwerpen; లండన్‌ బహుభాషా బైబిలు: From the book The Walton Polyglot Bible, Vol. III, 1655-​1657

[9వ పేజీలోని చిత్రం]

స్పెయిన్‌ రాజైన ఫిలిప్‌ 2

[చిత్రసౌజన్యం]

ఫిలిప్‌ 2: Biblioteca Nacional, Madrid

[10వ పేజీలోని చిత్రం]

ఆర్యాస్‌ మొన్టానో

[చిత్రసౌజన్యం]

మొన్టానో: Biblioteca Histórica. Universidad Complutense de Madrid

[10వ పేజీలోని చిత్రం]

బెల్జియంలోని ఆన్ట్వర్ప్‌లో ఉన్న ప్రాచీన ముద్రణా యంత్రాలు

[చిత్రసౌజన్యం]

ముద్రణా యంత్రం: By courtesy of Museum Plantin-Moretus/Stedelijk Prentenkabinet Antwerpen

[11వ పేజీలోని చిత్రాలు]

ఎడమవైపు: క్రిస్టప్‌ ప్లాన్‌టిన్‌, ఆన్ట్వర్ప్‌ బహుభాషా బైబిలు ముఖపత్రం

[చిత్రసౌజన్యం]

ముఖపత్రం, ప్లాన్‌టిన్‌: By courtesy of Museum Plantin-Moretus/Stedelijk Prentenkabinet Antwerpen

[11వ పేజీలోని చిత్రం]

పైన: నిర్గమకాండము 15వ అధ్యాయపు మూలపాఠం నాలుగు కాలమ్స్‌లో

[9వ పేజీలోని చిత్రసౌజన్యం]

ముఖపత్రం, ప్లాన్‌టిన్‌: By courtesy of Museum Plantin-Moretus/Stedelijk Prentenkabinet Antwerpen

[13వ పేజీలోని చిత్రసౌజన్యం]

Biblioteca Histórica. Universidad Complutense de Madrid