కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“వాళ్ళు వెంటనే విడిచిపెట్టబడేవారే”

“వాళ్ళు వెంటనే విడిచిపెట్టబడేవారే”

“వాళ్ళు వెంటనే విడిచిపెట్టబడేవారే”

ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడైన చార్లెస్‌ డీ గౌలె అన్న కూతురైన జెనెవీవ్‌ డీ గౌలెకు, ఉత్తర జర్మనీలోని రావెన్‌బ్రూక్‌ నాజీ సామూహిక నిర్భంధ శిబిరంలోని యెహోవాసాక్షులు వ్యక్తిగతంగా తెలుసు. ఆమె 1945 ఆగస్టులో వ్రాసిన ఒక ఉత్తరంలో పై మాటలను వ్రాసింది.

పోలాండ్‌లోని ఆస్క్‌విట్జ్‌ సామూహిక నిర్బంధ శిబిరంలో ఉన్నవారు 1945, జనవరి 27న విడుదల చేయబడ్డారు. ఆ తేదీ, జర్మనీలో 1996 నుండి హిట్లర్‌ నిరంకుశ పరిపాలనా ఫలితంగా చనిపోయినవారి స్మారకదినంగా పరిగణించబడుతోంది.

బాడెన్‌ ఊట్టమ్‌బర్గ్‌ రాష్ట్ర పార్లమెంటు అధ్యక్షుడైన పీటర్‌ స్ట్రావుబ్‌ 2003, జనవరి 27న జరిగిన అధికారిక స్మారక ఉపన్యాసంలో ఈ విధంగా అన్నాడు: “తమ మత లేదా రాజకీయ నమ్మకాల కారణంగా హింసననుభవించిన వారందరూ, లొంగిపోవడంకన్నా చనిపోవడానికే సిద్ధపడినవారు, మన ప్రగాఢ గౌరవానికి అర్హులు, అలాంటి గౌరవాన్ని మాటల్లో వ్యక్తంచేయడం కష్టం. హిట్లర్‌ పరిపాలనా డిమాండ్లను అంగీకరించడానికి పూర్తిగా నిరాకరించిన ఏకైక మతప్రజలు యెహోవాసాక్షులే: వారు హిట్లర్‌కు వందన సూచనగా తమ చెయ్యి పైకెత్తలేదు. మిలటరీలో చేరడానికి, యుద్ధసామగ్రిని తయారుచేసే పనిలో భాగం వహించడానికి వారెలా తిరస్కరించారో అదేవిధంగా వారు ‘హిట్లర్‌కు, దేశానికి’ విశ్వసనీయంగా ఉంటామని ప్రమాణం చేయడానికి తిరస్కరించారు. వారి పిల్లలు హిట్లర్‌ యువజనోద్యమంలో చేరలేదు.”

యేసుక్రీస్తు తన శిష్యుల గురించి ఇలా చెప్పాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:​16) కాబట్టి, యెహోవాసాక్షులు మతపరమైన కారణాలతోనే ఆ వైఖరి ప్రదర్శించారు. స్ట్రావుబ్‌ ఇంకా ఇలా అన్నాడు: “సామూహిక నిర్బంధ శిబిరాల్లోని బంధీలుగా తమ దుస్తులపై ఊదారంగు త్రికోణాన్ని ధరించిన యెహోవాసాక్షులకు మాత్రమే మరణం తప్పించుకునే అవకాశం ఉండేది. వారు తమ మత విశ్వాసాన్ని నిరాకరిస్తున్నామనే ప్రకటనపై సంతకం పెడితే చాలు వారు మరణాన్ని తప్పించుకునేవారు.”

యెహోవాసాక్షుల్లో చాలామందికి తమ మతవిశ్వాసాన్ని నిరాకరించే ప్రస్తావనే లేదు. అందువల్ల, నాజీ పరిపాలనా కాలంలో దాదాపు 1,200 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. మనస్సాక్షినిబట్టి నిరాకరిస్తూ సైన్యంలో చేరనందుకు 270 మంది ఉరితీయబడ్డారు. “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను” అనే విషయాన్ని వారు కేవలం మాటల్లోకాదు, చేతల్లో చూపించారు.​—⁠అపొస్తలుల కార్యములు 5:29.

నార్త్‌ రైన్‌ వెస్ట్‌ఫాలియా పార్లమెంట్‌ అధ్యక్షుడైన అల్‌రిక్‌ ష్మిట్‌ పేర్కొన్నట్లుగా యెహోవాసాక్షులు అసాధారణమైన ప్రజలేమీకాదు. ఆయన ఉపన్యాసాన్ని ప్రస్తావిస్తూ లాండ్‌టాగ్‌ ఇన్‌టర్న్‌ అనే బ్రోషుర్‌, యెహోవాసాక్షులు “మనస్సాక్షిని అనుసరించి తమ మతపరమైన నమ్మకాలపట్ల స్థిరంగా ఉండి, పౌరసంబంధ స్థైర్యాన్ని ప్రదర్శిస్తూ, క్రైస్తవులుగా తమ దృఢవిశ్వాసంతో నాజీ రాజకీయ విధానాన్ని వ్యతిరేకించిన సాధారణ ప్రజలు” అని పేర్కొంది. క్లిష్ట పరిస్థితుల్లో తనను యథార్థంగా అంటిపెట్టుకొన్న వారినిబట్టి యెహోవా సంతోషిస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. సామెతలు 27:⁠11లో మనమిలా చదువుతాం: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.”

[30వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy of United States Holocaust Memorial Museum