కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హృదయంలో ప్రేమకు సంబంధించిన ధర్మవిధి

హృదయంలో ప్రేమకు సంబంధించిన ధర్మవిధి

హృదయంలో ప్రేమకు సంబంధించిన ధర్మవిధి

“వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను.”​—⁠యిర్మీయా 31:33.

ముందరి రెండు ఆర్టికల్స్‌లో మోషే సీనాయి కొండ దిగినప్పుడు, యెహోవా మహిమను ప్రతిఫలింపజేసే కాంతి కిరణాలు ఆయన ముఖం నుండి వెలువడ్డాయని మనం తెలుసుకున్నాం. మోషే ముఖముమీద కప్పుకున్న ముసుకు గురించి కూడా మనం చర్చించాం. తత్సంబంధిత విషయాన్ని, నేటి క్రైస్తవులకు ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనమిప్పుడు పరిశీలిద్దాం.

2 మోషే కొండ మీద ఉన్నప్పుడు, యెహోవా ఆయనకు ఉపదేశాలిచ్చాడు. సీనాయి కొండకు ఎదురుగా సమావేశమైన ఇశ్రాయేలీయులు దేవుని అద్భుతమైన ప్రత్యక్షతను కళ్లారా చూశారు. “ఆ పర్వతముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూరయొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి. . . . యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.”​—⁠నిర్గమకాండము 19:16-18.

3 యెహోవా ఒక దేవదూత ద్వారా ప్రజలతో మాట్లాడి పది ఆజ్ఞలు అని అందరికీ తెలిసిన ధర్మవిధులు ఇచ్చాడు. (నిర్గమకాండము 20:1-17) కాబట్టి ఈ ఆజ్ఞలను సర్వశక్తుడే స్వయంగా ఇచ్చాడనడంలో సందేహం లేదు. యెహోవా ఆ ఆజ్ఞలను రాతిపలకలపై వ్రాశాడు. ఇశ్రాయేలీయులు బంగారు దూడను ఆరాధించడం చూసినప్పుడు మోషే ఆ పలకలను పగలగొట్టాడు. యెహోవా మళ్లీ ఆ ఆజ్ఞలను రాతిపలకలపై వ్రాశాడు. ఈసారి, మోషే ఆ పలకలు తీసుకొని కొండ దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖం ప్రకాశించింది. అప్పటికే ఆ ఆజ్ఞలు అత్యంత ప్రాముఖ్యమైనవనే విషయం అందరికీ అర్థమై ఉంటుంది.​—⁠నిర్గమకాండము 32:​15-19; 34:1, 4, 29, 30.

4 పది ఆజ్ఞలు వ్రాయబడిన ఆ రెండు పలకలు ఆలయ గుడారంలో, ఆ తర్వాత నిర్మించిన దేవాలయంలోని అతిపరిశుద్ధ స్థలంలోని మందసపు పెట్టెలో ఉంచబడ్డాయి. ఆ పలకల మీద వ్రాయబడిన ఆజ్ఞలు మోషే ధర్మశాస్త్రంలోని ముఖ్య సూత్రాలను వివరించి, దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించడానికి ఆధారాన్నిచ్చాయి. యెహోవా ఒక ప్రత్యేక ప్రజతో, తాను ఎన్నుకున్న ప్రజలతో వ్యవహరిస్తున్నాడనే రుజువునిచ్చాయి.

5 ఆ ధర్మవిధులు యెహోవా గురించి ప్రత్యేకంగా తన ప్రజలపట్ల ఆయనకున్న ప్రేమ గురించి ఎన్నో విషయాలు వెల్లడిచేశాయి. వాటికి లోబడినవారికి అవెంతో ప్రశస్తమైన బహుమానంగా నిరూపించబడ్డాయి. మానవులు రూపొందించిన ఏ నైతిక నియమావళికన్నా ఆ పది ఆజ్ఞలు మరెంతో సమున్నతమైనవని ఒక విద్వాంసుడు వ్రాశాడు. మొత్తం మోషే ధర్మశాస్త్రం గురించి యెహోవా ఇలా చెప్పాడు: “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు.”​—⁠నిర్గమకాండము 19:5, 6.

హృదయంలో వ్రాయబడిన ధర్మవిధి

6 అవును, ఆ దైవిక ధర్మవిధులకు గొప్ప విలువుంది. అయితే అభిషిక్త క్రైస్తవుల దగ్గర రాతిపలకలపై వ్రాయబడిన ఆజ్ఞలకంటే మరింత విలువైనది ఉందని మీకు తెలుసా? ఇశ్రాయేలు జనాంగంతో చేసిన ధర్మశాస్త్ర నిబంధనకు వేరుగావుండే ఒక క్రొత్త నిబంధన చేస్తానని యెహోవా ముందే చెప్పాడు. “వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను.” (యిర్మీయా 31:31-34) క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు వ్యక్తిగతంగా తన అనుచరులకు లిఖిత ధర్మవిధి ఇవ్వలేదు. తాను చెప్పిన విషయాల ద్వారా, చేసిన క్రియల ద్వారా ఆయన యెహోవా ధర్మవిధిని వారి మనస్సుల్లో, హృదయాల్లో నాటాడు.

7 ఈ ధర్మవిధి “క్రీస్తు నియమము” అని పిలవబడింది. అది మొదట యాకోబు వంశస్థులైన సహజ ఇశ్రాయేలు జనాంగానికి కాదుగానీ, ఆధ్యాత్మిక జనాంగమైన “దేవుని ఇశ్రాయేలునకు” ఇవ్వబడింది. (గలతీయులు 6:2, 16; రోమీయులు 2:​28, 29) ఈ దేవుని ఇశ్రాయేలు ఆత్మాభిషిక్త క్రైస్తవులతో రూపొందింది. ఆ తర్వాత, యెహోవా ఆరాధనను అన్వేషిస్తూ అన్ని జనాంగాల నుండి వచ్చిన ‘ఒక గొప్పసమూహము’ కూడా వీరితో కలిశారు. (ప్రకటన 7:9, 10; జెకర్యా 8:23) ‘ఒకే గొర్రెల కాపరి’ ఆధ్వర్యంలో ‘ఒకే మందగా’ ఈ రెండు గుంపులు తమ క్రియలన్నిటిని నిర్దేశించేందుకు అనుమతిస్తూ ‘క్రీస్తు నియమాన్ని’ హత్తుకున్నాయి.​—⁠యోహాను 10:16.

8 జన్మతః మోషే ధర్మశాస్త్రానికి కట్టుబడిన సహజ ఇశ్రాయేలీయుల్లా కాక, క్రైస్తవులు జాతి, జన్మస్థలం వంటి విషయాల ప్రమేయం లేకుండా ఇష్టపూర్వకంగా ఈ నియమానికి లోబడతారు. వారు యెహోవా గురించి ఆయన మార్గాల గురించి తెలుసుకొని ఆయన చిత్తం చేయాలని కోరుకుంటారు. “హృదయముమీద” వ్రాయబడినట్లుగా వారి “మనస్సులలో” దేవుని ధర్మవిధి కలిగివున్న అభిషిక్త క్రైస్తవులు దేవుడు అవిధేయులను శిక్షిస్తాడనే కారణాన్నిబట్టి మాత్రమే లోబడరు; లేదా అది కేవలం తమ విధ్యుక్త ధర్మమనే ఉద్దేశంతో మాత్రమే ఆయనకు విధేయత చూపించరు. వారి విధేయత మరింత ప్రాథమికమైన, మరెంతో శక్తిమంతమైన దానిపై ఆధారపడివుంది, వేరేగొర్రెలు కూడా ఆ ప్రకారమే దేవుని ధర్మవిధి తమ హృదయాలపై వ్రాయబడిన కారణంగా విధేయత చూపిస్తారు.

ప్రేమపై ఆధారపడిన నియమాలు

9 యెహోవా నియమాలు, ప్రమాణాలన్నింటి సారం ఒక్క మాటలో ప్రేమ అని చెప్పవచ్చు. స్వచ్ఛారాధనలో అది ఎల్లప్పుడూ ఒక ఆవశ్యక భాగంగా ఉంది, ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది కూడా. ధర్మశాస్త్రంలో అన్నింటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు యేసు ఇలా చెప్పాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.” రెండవది: “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.” ఆ వెంటనే ఆయనిలా అన్నాడు: “ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవి.” (మత్తయి 22:35-40) పది ఆజ్ఞలతో కూడిన ఒక్క ధర్మశాస్త్రమే కాక, హీబ్రూ లేఖనాలన్నీ ప్రేమ మీదే ఆధారపడివున్నాయని యేసు సూచించాడు.

10 క్రైస్తవుల హృదయాల్లోని ధర్మవిధికి కూడా దేవునిపట్ల, పొరుగువారిపట్ల ప్రేమే ఆధారమా? ఖచ్చితంగా! క్రీస్తు నియమములో దేవునిపట్ల హృదయపూర్వక ప్రేమతోపాటు క్రొత్త ఆజ్ఞ, అంటే క్రైస్తవులు పరస్పరం స్వయంత్యాగ ప్రేమ కలిగివుండాలనే ఆజ్ఞ కూడా ఇమిడివుంది. యేసు ప్రేమించినట్లే వారు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఆయన తన స్నేహితుల కోసం ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని అర్పించాడు. తన శిష్యులు దేవుణ్ణి ప్రేమించాలనీ, వారిని తనెలా ప్రేమించాడో అలాగే వారు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలనీ యేసు వారికి బోధించాడు. నిజ క్రైస్తవులను సూచించే ముఖ్య లక్షణమైన అసాధారణ ప్రేమను పరస్పరం చూపించుకోవడం ద్వారానే వారు గుర్తించబడగలరు. (యోహాను 13:34, 35; 15:12, 13) తమ శత్రువులను ప్రేమించాలని కూడా యేసు వారికి ఉపదేశించాడు.​—⁠మత్తయి 5:44.

11 ప్రేమను చూపించడంలో యేసు పరిపూర్ణ మాదిరి ఉంచాడు. పరలోకంలో బలమైన ఆత్మ ప్రాణిగా ఆయన భూమ్మీద తన తండ్రికి ఇష్టమైన పనులను అభివృద్ధిపరిచే అవకాశాన్ని సంతోషంగా అంగీకరించాడు. ఇతరులు నిత్యజీవం పొందేలా తన మానవ ప్రాణాన్ని ధారపోయడమే కాక, వారెలా జీవించాలో కూడా ఆయన ప్రజలకు చూపించాడు. ఆయన వినయం, దయ, ఇతరులపట్ల శ్రద్ధ చూపిస్తూ, ఇబ్బందుల్లో ఉన్నవారికి, అణచివేయబడిన ప్రజలకు సహాయం చేశాడు. యెహోవాను తెలుసుకునేలా ఇతరులకు అవిశ్రాంతంగా సహాయం చేస్తూ “నిత్యజీవపు మాటలు” కూడా ఆయన వారికి బోధించాడు.​—⁠యోహాను 6:68.

12 నిజానికి దేవునిపట్ల ప్రేమకు, పొరుగువారిపట్ల ప్రేమకు విడదీయరాని సంబంధముంది. అపొస్తలుడైన యోహాను ఇలా అన్నాడు: “ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది. . . . ఎవడైనను​—⁠నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.” (1 యోహాను 4:7, 20) యెహోవాయే ప్రేమకు మూలమును దాని మూర్తిమంతమునై ఉన్నాడు. ఆయన చేసే ప్రతీ పని ప్రేమచే పురికొల్పబడినదే. ఆయన స్వరూపంలో చేయబడ్డాం కాబట్టి మనం కూడా ప్రేమిస్తాం. (ఆదికాండము 1:27) పొరుగువారిపట్ల ప్రేమ చూపించడం ద్వారా మనం దేవునిపట్ల ప్రేమను ప్రదర్శిస్తాం.

ప్రేమించడమంటే లోబడడమని అర్థం

13 మనం చూడలేని దేవుణ్ణి మనమెలా ప్రేమించగలం? దానికి కీలకమైన మొదటి చర్య ఏమిటంటే ఆయనను తెలుసుకోవడమే. మనమొక క్రొత్త వ్యక్తిని ప్రేమించలేం లేదా నమ్మలేం. కాబట్టి, బైబిలు చదవడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, దేవుణ్ణి అప్పటికే తెలుసుకొని ఆయనను ప్రేమిస్తున్నవారితో సహవసించడం ద్వారా ఆయనను తెలుసుకొమ్మని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తోంది. (కీర్తన 1:1, 2; ఫిలిప్పీయులు 4:6; హెబ్రీయులు 10:25) నాలుగు సువార్తలు ప్రత్యేకంగా సహాయకరంగా ఉంటాయి, ఎందుకంటే అవి యేసుక్రీస్తు జీవితంలో, పరిచర్యలో ప్రతిఫలించిన యెహోవా వ్యక్తిత్వాన్ని వెల్లడిచేస్తాయి. మనం దేవుణ్ణి తెలుసుకుని, మనపట్ల ఆయన చూపించిన ప్రేమనుబట్టి కృతజ్ఞత పెంచుకునేకొద్దీ ఆయనకు లోబడుతూ ఆయన వ్యక్తిత్వాన్ని అనుకరించాలనే మన కోరిక మరింత బలపడుతుంది. అవును, దేవునిపట్ల ప్రేమలో విధేయత ఇమిడివుంది.

14 మనం వ్యక్తుల్ని ప్రేమించినప్పుడు మనం వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవడమే కాక, వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తాం. మనం ప్రేమించేవారిని నొప్పించాలని కోరుకోము. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (1 యోహాను 5:3) అవి భారమైనవికావు లేదా అవి అసంఖ్యాకంగా లేవు. ప్రేమే మన మార్గాన్ని నిర్దేశిస్తుంది. మన ప్రతిచర్యను నిర్దేశించేందుకు ఓ పెద్ద నియమావళి పట్టికను గుర్తుపెట్టుకోనవసరం లేదు; దేవునిపట్ల మనకున్న ప్రేమే మనల్ని నడిపిస్తుంది. మనం దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన చిత్తం చేయడం మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ విధంగా మనం దేవుని ఆమోదం పొందడమే కాక, మనం స్వయంగా ప్రయోజనం పొందుతాం, ఆయన నిర్దేశం మనకు ఎల్లప్పుడూ మేలు చేస్తుంది.​—⁠యెషయా 48:17.

15 దేవునిపట్ల ప్రేమ ఆయన లక్షణాలను అనుకరించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మనమొక వ్యక్తిని ప్రేమించినప్పుడు, ఆయన లక్షణాలను ప్రశంసిస్తూ ఆయనలా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. యెహోవాకు యేసుకు మధ్యగల సంబంధాన్ని పరిశీలించండి. వారు పరలోకంలో బహుశా వందల కోట్ల సంవత్సరాలు కలిసి ఉన్నారు. వారి మధ్య ప్రగాఢమైన, స్వచ్ఛమైన ప్రేమ ఉంది. యేసు ఎంత పరిపూర్ణంగా తన పరలోకపు తండ్రిలా ఉన్నాడంటే, ఆయన తన శిష్యులకు ఇలా చెప్పగలిగాడు: “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు.” (యోహాను 14:9) యెహోవా గురించిన, ఆయన కుమారుని గురించిన జ్ఞానాన్ని, కృతజ్ఞతాభావాన్ని మనం వృద్ధిచేసుకునేకొద్దీ, మనం వారిలాగే ఉండేందుకు పురికొల్పబడతాం. యెహోవా పరిశుద్ధాత్మ సహాయంతోపాటు ఆయనపట్ల మనకున్న ప్రేమ, ‘ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ పరిత్యజించి, నవీనస్వభావమును ధరించుకోవడానికి’ మనకు సహాయం చేస్తుంది.​—⁠కొలొస్సయులు 3:9, 10; గలతీయులు 5:22, 23.

క్రియల్లో చూపించే ప్రేమ

16 క్రైస్తవులముగా మనం, దేవునిపట్ల, పొరుగువారిపట్ల మనకున్న ప్రేమ రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో భాగం వహించడానికి మనల్ని ప్రేరేపించేందుకు అనుమతిస్తాం. మనమలా చేసినప్పుడు, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు” యెహోవా దేవునికి సంతోషం కలిగిస్తాం. (1 తిమోతి 2:3, 4) ఆ విధంగా క్రీస్తు నియమం ఇతరుల హృదయాల్లో వ్రాయబడేలా వారికి సహాయం చేయడంలో మనం ఆనందిస్తాం. వారి వ్యక్తిత్వం మారి వారు యెహోవా దైవిక లక్షణాలను ప్రతిఫలింపజేయడాన్ని గమనించినప్పుడు కూడా మనం ఆనందిస్తాం. (2 కొరింథీయులు 3:18) దేవుని గురించి తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేయడం నిజంగా మనం వారికివ్వగల అత్యంత విలువైన బహుమానం. యెహోవా స్నేహాన్ని అంగీకరించేవారు యుగయుగాలు దానిని ఆస్వాదించవచ్చు.

17 భౌతిక వస్తువులు అత్యంత విలువైనవిగా పరిగణించబడే లోకంలో మనం జీవిస్తున్నాం. అయితే, భౌతిక వస్తువులు నిత్యం నిలబడవు. అవి దొంగిలించబడవచ్చు లేదా పాడైపోవచ్చు. (మత్తయి 6:19) బైబిలు మనల్నిలా హెచ్చరిస్తోంది: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:16, 17) అవును, యెహోవా నిరంతరం ఉంటాడు, ఆయనను ప్రేమిస్తూ, ఆయనను సేవించేవారు కూడా నిత్యమూ నిలుస్తారు. కాబట్టి, కేవలం కొద్దికాలం నిలిచే లోకసంబంధ విషయాలను వెంబడించే బదులు దేవునిపట్ల, ప్రజలపట్ల ప్రేమను వృద్ధి చేసుకోవడం మరింత జ్ఞానయుక్తం కాదా?

18 ప్రేమను అభ్యసించేవారు యెహోవాకు స్తుతి తీసుకొస్తారు. సెనెగల్‌లో మిషనరీగా ఉన్న సోనియా విషయమే తీసుకోండి. అవిశ్వాస భర్త మూలంగా హెచ్‌ఐవి సోకిన హైడి అనే స్త్రీతో ఆమె బైబిలు అధ్యయనం చేసింది. హైడి తన భర్త చనిపోయిన తర్వాత బాప్తిస్మం తీసుకొంది, అయితే కొద్దికాలానికే ఆమె ఆరోగ్యం క్షీణించి ఎయిడ్స్‌తో ఆసుపత్రిలో చేరింది. సోనియా ఇలా వివరిస్తోంది: “ఆసుపత్రి సిబ్బంది తాము చేయగలిగినదంతా చేసేవారు, అయితే వారు కొద్దిమందే ఉన్నారు. దానితో ఆసుపత్రిలో ఆమెపట్ల శ్రద్ధ చూపించడానికి సంఘం నుండి స్వచ్ఛంద సేవకులు పిలవబడ్డారు. రెండవరోజు రాత్రి నేను ఆమె పడక ప్రక్కనే చాప వేసుకొని కూర్చొని, ఆమె చనిపోయేంత వరకు ఆమెకు సహాయం చేస్తూ ఉన్నాను. ఇన్‌చార్జిగా ఉన్న డాక్టరు ఇలా అన్నాడు: ‘ఒక వ్యక్తికి ఎయిడ్స్‌ ఉందని తెలిసినప్పుడు సొంత బంధువులే పట్టించుకోకపోవడం మాకున్న అతి పెద్ద సమస్య. మీరు ఆమెకు బంధువుకాదు, పరాయి దేశంనుండి వచ్చారు, శరీరఛాయ కూడా వేరుగా ఉన్న మీరు అపాయాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు?’ మా ఇద్దరి తల్లిదండ్రులు ఒకరే అన్నంతగా హైడి నా నిజమైన సహోదరిగా ఉందనీ, ఈ క్రొత్త సహోదరి నాకు లభించింది కాబట్టి, ఆమెపట్ల శ్రద్ధ చూపించడంలో నాకు ఆనందముందనీ వివరించాను.” హైడిపట్ల శ్రద్ధ వహించడానికి సోనియా చేసిన ప్రయత్నాల కారణంగా ఆమె ఎలాంటి వ్యాధి లక్షణాలతో బాధపడలేదు.

19 యెహోవా సేవకుల్లో స్వయంత్యాగ స్ఫూర్తికి సంబంధించిన ఉదాహరణలు చాలా కనుగొనవచ్చు. నేడు ఏ లిఖిత ధర్మవిధీ దేవుని ప్రజలకు గుర్తింపు చిహ్నంగా లేదు. బదులుగా మనం హెబ్రీయులు 8:10లో వ్రాయబడిన మాటల నెరవేర్పును చూస్తాము: “ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు.” యెహోవా మన హృదయాల్లో వ్రాసిన ప్రేమకు సంబంధించిన ధర్మవిధిని విలువైనదిగా ఎంచుతూ, ప్రేమను ప్రదర్శించేందుకు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందుము గాక!

20 అలాంటి ప్రేమను ప్రదర్శించే ప్రపంచవ్యాప్త సహోదరులతో కలిసి దేవుణ్ణి సేవించడం ఎంత ఆనందకరమో కదా! తమ హృదయంలో క్రీస్తు నియమం కలిగివున్నవారు ప్రేమలేని ఈ లోకంలో అమూల్యమైన సంపదను అనుభవిస్తారు. వారు యెహోవా ప్రేమను ఆస్వాదించడమే కాక, సహోదరత్వపు బలమైన ప్రేమానుబంధాన్నిబట్టి కూడా ఆనందిస్తారు. “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు!” యెహోవాసాక్షులు అనేక దేశాల్లో నివసిస్తూ, అనేక భాషలు మాట్లాడుతూ, అనేక సంస్కృతుల వారైనప్పటికీ వారు సాటిలేని మత సామరస్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ ఐకమత్యం యెహోవా అనుగ్రహాన్ని తీసుకొస్తుంది. కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట [ప్రేమలో ఐక్యమైన ప్రజలమధ్య] నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు.”​—⁠కీర్తన 133:1-3.

మీరు జవాబివ్వగలరా?

పది ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమైనవి?

హృదయాల్లో వ్రాయబడిన ధర్మవిధి ఏమిటి?

“క్రీస్తు నియమములో” ప్రేమ ఎలాంటి పాత్ర పోషిస్తుంది?

మనం ఏయే విధాలుగా దేవునిపట్ల, పొరుగువారిపట్ల ప్రేమను ప్రదర్శించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) మనమిప్పుడు ఏమి పరిశీలిస్తాం? (బి) సీనాయి కొండ దగ్గర యెహోవా తననుతాను ఎలా ప్రత్యక్షపరచుకున్నాడు?

3. యెహోవా ఇశ్రాయేలీయులకు పది ఆజ్ఞలను ఏ విధంగా ఇచ్చాడు, ఆ జనాంగం ఏ విషయాన్ని అర్థం చేసుకుంది?

4. పది ఆజ్ఞలు ఎందుకు అతి ప్రాముఖ్యమైనవి?

5. ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ధర్మవిధులు ఏ విధంగా ఆయన ప్రేమను ప్రతిఫలింపజేస్తున్నాయి?

6. రాతిపలకలపై వ్రాయబడిన ఆజ్ఞలకంటే ఏ ధర్మవిధి మరింత విలువైనదిగా నిరూపించబడింది?

7. “క్రీస్తు నియమము” మొదట ఎవరికి ఇవ్వబడింది, ఆ తర్వాత ఎవరు దానిని హత్తుకున్నారు?

8. మోషే ధర్మశాస్త్రానికీ, క్రీస్తు నియమానికీ ఉన్న భేదమేమిటి?

9. యెహోవా నియమాల సారం ప్రేమ అని యేసు ఎలా సూచించాడు?

10. క్రీస్తు నియమానికి ప్రేమే కేంద్ర బిందువని మనకెలా తెలుసు?

11. దేవునిపట్ల, మానవాళిపట్ల ప్రేమను యేసు ఎలా ప్రదర్శించాడు?

12. దేవునిపట్ల ప్రేమకు, పొరుగువారిపట్ల ప్రేమకు విడదీయలేని సంబంధముందని ఎందుకు చెప్పవచ్చు?

13. మనం దేవుణ్ణి ప్రేమించాలంటే, మొదట ఏమిచేయాలి?

14. దేవుని నియమాలు భారమైనవి కావని ఎందుకు చెప్పవచ్చు?

15. యెహోవాను అనుకరించడానికి మనకేది సహాయం చేస్తుంది? వివరించండి.

16. మన ప్రకటనా, బోధనా పని ద్వారా దేవునిపట్ల, పొరుగువారిపట్ల మన ప్రేమ ఎలా ప్రదర్శించబడుతుంది?

17. వస్తుపరమైన వాటికి బదులు దేవునిపట్ల, పొరుగువారిపట్ల ప్రేమను వృద్ధి చేసుకోవడం ఎందుకు జ్ఞానయుక్తం?

18. ఒక మిషనరీ స్వయంత్యాగ ప్రేమను ఎలా ప్రదర్శించింది?

19. దేవుని ధర్మవిధిని హృదయాల్లో కలిగివున్న మనం దేనిని సద్వినియోగం చేసుకోవాలి?

20. క్రీస్తు నియమము ఎందుకు ఒక అమూల్యమైన సంపదగా ఉన్నది?

[25వ పేజీలోని చిత్రం]

ఇశ్రాయేలీయులకు రాతిపలకలపై వ్రాసిన నియమాలు ఉన్నాయి

[26వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవులకు తమ హృదయాలపై వ్రాసిన ధర్మవిధి ఉంది

[28వ పేజీలోని చిత్రం]

2004 జిల్లా సమావేశంలో సెనెగల్‌ దేశ బాలికతో సోనియా