కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తు సైనికునిగా శ్రమలను అనుభవించడం

క్రీస్తు సైనికునిగా శ్రమలను అనుభవించడం

జీవిత కథ

క్రీస్తు సైనికునిగా శ్రమలను అనుభవించడం

యూరి కప్తోలా చెప్పినది

“మీకు నిజంగా విశ్వాసం ఉందని నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది!” ఆ మాటలు ఊహించని వ్యక్తి నుండి వచ్చాయి, సోవియట్‌ సైన్యంలో అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి ఆ మాటలు అన్నాడు, అవి నాకు ఎంతో ప్రోత్సాహం అవసరమైన సమయంలో నాకు ప్రోత్సాహాన్నిచ్చాయి. నేను అప్పటికి చాలాకాలం నుండి జైళ్ళో శిక్ష అనుభవిస్తున్నాను, యెహోవాను సహాయం కోసం తీవ్రంగా ప్రార్థిస్తున్నాను. నేను సహనం, దృఢసంకల్పం అవసరమైన సుదీర్ఘ పోరాటాన్ని ఎదుర్కొంటున్నాను.

నేను అక్టోబరు 19, 1962లో పుట్టాను, యుక్రెయిన్‌లోని పడమటి భాగంలో పెరిగాను. అదే సంవత్సరం మా నాన్న యెహోవాసాక్షులను కలిశాడు, ఆయన పేరు కూడా యూరియే. కొద్దికాలంలోనే ఆయన మా పల్లెలో మొదటి యెహోవా ఆరాధకుడు అయ్యాడు. యెహోవాసాక్షులను వ్యతిరేకించే అధికారులు ఆయన కార్యకలాపాలను గమనించకుండా పోలేదు.

అయితే మా పొరుగువారు చాలామంది, మా తల్లిదండ్రుల క్రైస్తవ లక్షణాలను చూసి, ఇతరులపట్ల వారు చూపించే శ్రద్ధను గమనించి వారిని గౌరవించేవారు. మా తల్లిదండ్రులు నాలో, నా ముగ్గురి సహోదరీల్లో బాల్యం నుండే దేవునిపట్ల ప్రేమను పెంపొందించడానికి ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, నాకు పాఠశాలలో ఎదురైన అనేక సవాళ్ళను ఎదుర్కొనేందుకు అది నాకు సహాయం చేసింది. ప్రతీ విద్యార్థి తాను లెనిన్‌కు సంబంధించిన అక్టోబరు బాలునిగా గుర్తించబడేందుకు ఒక బ్యాడ్జి ధరించాల్సి వచ్చినప్పుడు నాకు అలాంటి ఒక సవాలు ఎదురైంది. నా క్రైస్తవ తటస్థత కారణంగా నేను బ్యాడ్జిని ధరించలేదు కాబట్టి నేను ఇతరులకు భిన్నంగా ఉండేవాణ్ణి.​—⁠యోహాను 6:​15; 17:​16.

ఆ తర్వాత నేను మూడవ గ్రేడ్‌లో ఉన్నప్పుడు, విద్యార్థులందరూ యంగ్‌ పయినీర్స్‌ అని పిలువబడే ఒక కమ్యూనిస్టు యౌవనుల సంస్థలో చేరాల్సి వచ్చింది. ఆ సంస్థలో చేర్చుకొనే కార్యక్రమం కోసం ఒకరోజు మా క్లాసువారిని పాఠశాల ఆవరణకు తీసుకువెళ్ళారు. నేను ఆ కార్యక్రమంలో ఏమి జరుగుతుందోనని భయపడ్డాను, నేను హేళన చేయబడతానని, దూషించబడతానని అనుకున్నాను. నేను తప్ప ప్రతీ ఒక్కరూ తమ ఇంటి నుండి క్రొత్త ఎర్రరంగు పయినీరు రుమాలును తెచ్చుకున్నారు, విద్యార్థులందరూ వరుసగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, టీచర్లు, సీనియరు విద్యార్థుల ఎదుట నిల్చున్నారు. మా మెడ చుట్టూ ఆ రుమాలు కట్టమని సీనియర్‌ విద్యార్థులకు చెప్పినప్పుడు నేను తల వంచుకొని క్రిందికి చూస్తూ ఎవరి దృష్టి నా మీద పడకూడదని ఆశించాను.

సుదూర జైళ్ళకు తీసుకొనిపోబడ్డాను

నా 18వ ఏట, క్రైస్తవ తటస్థత చూపించిన కారణంగా నాకు మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించబడింది. (యెషయా 2:⁠4) నేను నా శిక్షలోని మొదటి సంవత్సరాన్ని యుక్రెయిన్‌లోని వినిట్‌స్కాయా జిల్లాలో ఉన్న ట్రుడోవొయి పట్టణంలో గడిపాను. నేను అక్కడ ఉన్నప్పుడు 30 మంది ఇతర యెహోవాసాక్షులను కలిశాను. మేము ఒకరినొకరు కలుసుకోకూడదని అధికారులు, ఇద్దరిద్దరి చొప్పున మమ్మల్ని వేర్వేరు విభాగాల్లో పని చేయించారు.

ఆగస్టు 1982లో నన్నూ, ఐడ్వర్ట్‌ అనే మరో సాక్షినీ రైల్లోని కారాగారపు బోగీల్లో ఇతర ఖైదీల గుంపుతో పాటు ఉత్తర యూరల్‌ పర్వతాలకు పంపించారు. మేము రైల్లో ఎనిమిది రోజులపాటు తీవ్రమైన వేడినీ, కిక్కిరిసిన జనం కారణంగా ఉక్కనూ సహించి పెర్మ్‌స్కాయా జిల్లాలోని సోలికామ్‌స్క కారాగారానికి చేరుకున్నాం. ఐడ్వర్ట్‌నూ, నన్నూ వేర్వేరు గదుల్లో ఉంచారు. రెండు వారాల తర్వాత, క్రాస్నోవిషెర్‌స్కీ ప్రాంతంలో ఉత్తరాన మరింత దూరంలో ఉన్న వ్యోల్స్‌ అనే పల్లెటూరుకు నన్ను తీసుకువెళ్ళారు.

మా వాహనం ఆ పల్లెటూరుకు చేరుకునేసరికి అర్ధరాత్రి అయింది, ఆ రాత్రి కారు చీకటిగా ఉంది. అంత చీకటి ఉన్నా, ఒక అధికారి, బోటు ద్వారా నదిని దాటమని మా గుంపును ఆదేశించాడు. మేము నదిని గానీ బోటును గానీ చూడలేకపోయాం! అయినా మేము చుట్టూ తడవులాడి యాదృచ్ఛికంగా బోటును కనుగొన్నాం, మేము భయపడినప్పటికీ కూడా నదిని దాటగలిగాం. అవతలి ఒడ్డుకు చేరుకున్న తర్వాత దగ్గర్లోని ఒక కొండ మీద కనిపిస్తున్న కాంతి దిశగా మేము బయలుదేరాం, అక్కడ మాకు కొన్ని గుడారాలు కనబడ్డాయి. అది మా క్రొత్త నివాస స్థలం కానుంది. వేరే గుడారాల కన్నా కాస్త పెద్దగా ఉన్న ఒక గుడారంలో నేను మరో 30 మంది ఖైదీలతో నివసించాను. అక్కడ మేము చలికాలంలో కొన్నిసార్లు మైనస్‌ 40 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే ఉష్ణోగ్రతలను సహించాం, ఆ గుడారం మాకు అంత ఎక్కువగా రక్షణనిచ్చేది కాదు. నా తోటి ఖైదీల ప్రాథమిక పని చెట్లు నరకడం, నేనేమో ఖైదీల కోసం గుడిసెలు కట్టేవాడిని.

దూరంగా ఉన్న మా బస్తీకి ఆధ్యాత్మిక ఆహారం చేరింది

ఆ బస్తీలో నేను ఒక్కడినే సాక్షిని, అయినా యెహోవా నన్ను విడిచిపెట్టలేదు. ఒక రోజు నాకు పడమటి యుక్రెయిన్‌లో నివసిస్తున్న మా అమ్మ నుండి ఒక పార్సెల్‌ వచ్చింది. గార్డు ఆ పార్సెల్‌ తెరిచి చూసినప్పుడు, ఆయనకు మొదట ఒక చిన్న బైబిలు కనబడింది. ఆయన దానిని తీసి పేజీలు త్రిప్పడం మొదలుపెట్టాడు. ఆ ఆధ్యాత్మిక సంపద స్వాధీనం చేసుకోబడకుండా చేసేందుకు ఏదో ఒకటి చెప్పాలని ఆలోచించడానికి ప్రయత్నించాను. గార్డు ఉన్నట్టుండి “ఇది ఏమిటి?” అని అడిగాడు. నేను జవాబు కోసం ఆలోచించేలోపే దగ్గర్లో నిలబడి ఉన్న ఒక ఇన్‌స్పెక్టర్‌, “ఓ అదా! అది ఒక డిక్షనరీ” అని జవాబిచ్చాడు. నేను ఏమి చెప్పలేదు. (ప్రసంగి 3:⁠1, 7) ఆ ఇన్‌స్పెక్టర్‌ మిగతా పార్సెల్‌ను పరీక్షించి ఆ అమూల్యమైన బైబిలుతో పాటు దాన్ని నాకు ఇచ్చాడు. నేను ఎంతగా సంతోషించానంటే నా పార్సెల్‌లో వచ్చిన కొన్ని నట్స్‌ తీసి ఆయనకిచ్చాను. నేను ఈ పార్సెల్‌ అందుకున్నప్పుడు యెహోవా నన్ను మరచిపోలేదని నేను గుర్తించాను. ఆయన నాకు ఉదారంగా సహాయం చేసి నా ఆధ్యాత్మిక అవసరాలపట్ల శ్రద్ధ చూపించాడు.​—⁠హెబ్రీయులు 13:⁠5.

నిరంతరాయంగా ప్రకటించడం

కొన్ని నెలల తర్వాత, దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక క్రైస్తవ సహోదరుని నుండి ఒక ఉత్తరం అందుకొని ఆశ్చర్యపోయాను. ఆయన అందులో ఆసక్తి చూపించిన ఒక వ్యక్తి కోసం వెదకమని, ఆ వ్యక్తి ఇప్పుడు నా క్యాంపులో ఉండవచ్చని రాశాడు. మా ఉత్తరాలు తనిఖీ చేయబడేవి కాబట్టి అలాంటి బహిరంగ ఉత్తరం వ్రాయడం అవివేకమైన పని. ఒక అధికారి నన్ను తన కార్యాలయానికి పిలిపించుకొని, ప్రకటించవద్దని గట్టిగా హెచ్చరించాడు. నేను నా నమ్మకాలను ఇతరులతో పంచుకోను అని ప్రకటించే ఒక దస్తావేజు మీద సంతకం చేయమని ఆదేశించాడు. నేను యెహోవాసాక్షిని అనే విషయం ఇప్పటికే అందరికీ తెలుసు కాబట్టి అలాంటి ప్రకటన మీద నేను ఎందుకు సంతకం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని నేను జవాబిచ్చాను. నేను ఎందుకు ఖైదు చేయబడ్డానో ఇతర ఖైదీలు తెలుసుకోవాలనుకుంటున్నారని నేను చెప్పాను. నేను వారికి ఏమి చెప్పాలి? అని అడిగాను. (అపొస్తలుల కార్యములు 4:​20) ఆ అధికారి తాను నన్ను భయపెట్టలేను అని గుర్తించాడు కాబట్టి నన్ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నేను వేరొక క్యాంపుకు పంపించబడ్డాను.

నేను 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వయా అనే పల్లెకు బదిలీ చేయబడ్డాను. అక్కడి సూపర్‌వైజర్లు నా క్రైస్తవ స్థానాన్ని గౌరవించి సైన్యానికి సంబంధంలేని పనిలో నన్ను నియమించారు, నేను మొదట వడ్రంగిగా, ఆ తర్వాత ఒక ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాను. అయితే ఆ పనుల్లో కూడా సమస్యలు ఎదురయ్యేవి. ఒక సందర్భంలో, నా పనిముట్లు తీసుకొని పల్లెటూరులో ఉన్న ఒక క్లబ్‌కు వెళ్ళమని నాకు చెప్పారు. నేను అక్కడికి వెళ్ళేసరికి, క్లబ్‌లో ఉన్న సైనికులు నన్ను చూసి సంతోషించారు. వివిధ సైనిక చిహ్నాలకు అలంకరించి ఉన్న లైట్లు సరైన విధంగా పని చేసేలా చేయడంలో వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. వారు వార్షిక రెడ్‌ ఆర్మీ డే వేడుక కోసం సిద్ధపడుతున్నారు కాబట్టి ఆ లైట్లను రిపేరు చేయడంలో నేను వారికి సహాయం చేయాలని కోరారు. నేను ఏమి చేయాలనే విషయం గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించిన తర్వాత, నేను అలాంటి పని చేయలేనని వారికి చెప్పాను. నేను నా పనిముట్లను వారికిచ్చి ఆ క్లబ్‌ దగ్గరి నుండి వచ్చేశాను. నా గురించి డిప్యూటీ డైరెక్టర్‌కు రిపోర్టు చేశారు, అయితే నాకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఆయన నా మీద ఉన్న ఫిర్యాదులను విని ఇలా జవాబిచ్చాడు: “అలా చేసినందుకు నేను ఆయనను గౌరవిస్తున్నాను. ఆయన సూత్రాలకు కట్టుబడి ఉండే వ్యక్తి.”

ఊహించని వ్యక్తి నుండి ప్రోత్సాహం

జూన్‌ 8, 1984లో, ఖచ్చితంగా మూడు సంవత్సరాల నిర్బంధం తర్వాత నేను విడుదలయ్యాను. నేను యుక్రెయిన్‌కు తిరిగివచ్చిన తర్వాత మాజీ ఖైదీగా నేను సేనలో రిజిస్టరు చేసుకోవాల్సి వచ్చింది. నేను ఆరు నెలల్లో మళ్ళీ విచారించబడతాను కాబట్టి జిల్లాను పూర్తిగా విడిచివెళ్ళడం నాకు మంచిదని అధికారులు చెప్పారు. కాబట్టి నేను యుక్రెయిన్‌ను విడిచిపెట్టి, చివరకు లాట్వియాలో పని సంపాదించుకున్నాను. కొంతకాలం వరకు నేను రాజధాని రీగాలో, దాని చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో నివసించే సాక్షుల చిన్న గుంపుతో కలిసి ప్రకటించగలిగాను, సహవసించగలిగాను. అయితే కేవలం ఒకే ఒక సంవత్సరం తర్వాత, నేను సైనిక సేవ కోసం మళ్ళీ పిలువబడ్డాను. రిజిస్టర్‌ చేసుకునే కార్యాలయంలో, నేను ఇంతకుముందే సైనిక సేవను నిరాకరించానని అధికారితో చెప్పాను. దానికి ఆయన ఇలా అరిచాడు: “నువ్వేమి చేస్తున్నావో నిజంగా నీకు తెలుసా? నీవు సైనిక అధికారితో ఏమి చెబుతావో చూద్దాం!”

ఆయన నన్ను రెండవ అంతస్థులోని ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు, అక్కడ సైనిక అధికారి పొడవైన బల్ల వెనుక కూర్చొని ఉన్నాడు. నేను నా స్థానాన్ని వివరిస్తుండగా ఆయన జాగ్రత్తగా విని, రిజిస్టరు చేసే కమిటీ ఎదుట హాజరయ్యే ముందు నా నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవడానికి నాకు ఇంకా సమయం ఉందని చెప్పాడు. నేను సైనిక అధికారి కార్యాలయం నుండి వచ్చేస్తున్నప్పుడు నన్ను అంతకుముందు తిట్టిన అధికారే ఇలా ఒప్పుకున్నాడు: “మీకు నిజంగా విశ్వాసం ఉందని నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది!” నేను సైనిక కమిటీ ఎదుట హాజరైనప్పుడు నేను నా తటస్థస్థానాన్ని గురించి మళ్ళీ వివరించాను, అప్పటికి వారు నన్ను వెళ్ళనిచ్చారు.

ఆ సమయంలో నేను ఒక హాస్టల్లో నివసించాను. ఒకరోజు సాయంత్రం, తలుపు మెల్లగా తట్టిన శబ్దం విన్నాను. నేను తలుపు తెరిచాను, బ్రీఫ్‌కేస్‌ పట్టుకొని సూట్‌లో ఉన్న ఒక వ్యక్తిని చూశాను. “నేను స్టేట్‌ సెక్యూరిటీ నుండి వచ్చాను. మీకు సమస్యలు ఎదురవుతున్నాయని, మిమ్మల్ని కోర్టులో విచారణ చేయబోతున్నారని నాకు తెలుసు” అని చెప్పి తనను తాను పరిచయం చేసుకున్నాడు. “అవును, మీరు సరిగ్గానే చెప్పారు” అని నేను జవాబిచ్చాను. ఆ వ్యక్తి ఇంకా ఇలా చెప్పాడు: “మీరు మాకు సహకరిస్తే మేము మీకు సహాయం చేయగలం.” “లేదు, అది సాధ్యం కాదు. నేను నా క్రైస్తవ నమ్మకాలకు విశ్వసనీయంగా ఉంటాను” అని నేను చెప్పాను. నాకు నచ్చజెప్పడానికి ఎక్కువగా ప్రయత్నించకుండానే ఆయన వెళ్ళిపోయాడు.

మళ్ళీ కారాగారంలోకి, తిరిగి ప్రకటనా పనిలోకి

ఆగస్టు 26, 1986లో రీగాకు చెందిన నేషనల్‌ కోర్టు నాలుగు సంవత్సరాలు లేబర్‌ క్యాంపులో పనిచేయాల్సిందిగా నాకు శిక్ష విధించింది, నన్ను రీగా సెంట్రల్‌ జైలుకు తీసుకువెళ్ళారు. నన్ను 40 మంది ఇతర ఖైదీలతో పాటు ఒక పెద్ద గదిలో పెట్టారు, ఆ గదిలో ఉన్న తోటి ఖైదీలందరికీ ప్రకటించడానికి ప్రయత్నించాను. కొందరు దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పుకొనేవారు, మరికొందరు కేవలం ఎగతాళి చేసేవారు. ఒకరోజు తోటి ఖైదీలు గుంపులుగా గుమికూడడం నేను గమనించాను, ఆ తర్వాత రెండు వారాలకు ఆ గుంపుల నాయకులు, తాము చేసిన మౌఖిక నియమాలకు నేను లోబడడం లేదు కాబట్టి నాకు ప్రకటించే అనుమతి లేదని నాకు చెప్పారు. నేను ఆ కారణంగానే ఖైదీనయ్యానని, నేను వేరే నియమాల ప్రకారం జీవిస్తున్నానని వారికి వివరించాను.

నేను ప్రకటనా పనిని జాగ్రత్తగా కొనసాగించాను, నేను ఆధ్యాత్మిక విషయాలు ఇష్టపడే కొందరిని కనుగొన్నాను, అలా ఇష్టం చూపించినవారిలో నలుగురితో నేను బైబిలు అధ్యయనం చేయగలిగాను. మా చర్చలు జరుగుతున్నప్పుడు వారు ప్రాథమిక బైబిలు బోధలను నోటు పుస్తకంలో రాసుకొనేవారు. కొన్ని నెలల తర్వాత నేను వల్మియరా పట్టణంలో పూర్తి బందోబస్తు ఉండే క్యాంపుకు పంపించబడ్డాను, అక్కడ నేను ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాను. నేను అక్కడ మరో ఎలక్ట్రీషియన్‌తో బైబిలు అధ్యయనం చేయగలిగాను, ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత యెహోవాసాక్షి అయ్యాడు.

మార్చి 24, 1988లో నేను పూర్తి బందోబస్తుతో ఉండే ఆ క్యాంపు నుండి దగ్గర్లో క్రొత్తగా ఏర్పడిన క్యాంపుకు మార్చబడ్డాను. అది ఒక నిజమైన ఆశీర్వాదం ఎందుకంటే అక్కడ నాకు ఎక్కువ స్వేచ్ఛ లభించింది. నేను వివిధ నిర్మాణ స్థలాల్లో పని చేసేందుకు నియమించబడ్డాను, నేను ఎల్లప్పుడూ ప్రకటించే అవకాశాల కోసం చూసేవాణ్ణి. నేను తరచూ క్యాంపు నుండి బయటికి వెళ్ళి చీకటిపడేంత వరకు ప్రకటించేవాడ్ని, నేను క్యాంపుకు తిరిగివచ్చిన తర్వాత నాకు ఎలాంటి సమస్యా ఎదురయ్యేది కాదు.

యెహోవా నా ప్రయత్నాలను ఆశీర్వదించాడు. క్యాంపు దగ్గర కొంతమంది సాక్షులు నివసించేవారు, అయితే పట్టణంలో విల్మా క్రూమిన్యా అనే వృద్ధ సహోదరి మాత్రమే నివసించేది. సహోదరి క్రూమిన్యా, నేను అక్కడి యౌవనులతో ఎన్నో బైబిలు అధ్యయనాలను నిర్వహించడం ప్రారంభించాం. అప్పుడప్పుడు రీగా నుండి సహోదర సహోదరీలు వచ్చి పరిచర్యలో భాగం వహించేవారు, కొంతమంది క్రమ పయినీర్లు లెనిన్‌గ్రాడ్‌ (ఇప్పుడు సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌) నుండి కూడా వచ్చేవారు. మేము యెహోవా సహాయంతో ఎన్నో బైబిలు అధ్యయనాలను ప్రారంభించాం, నేను కొంతకాలానికి పయినీరు సేవ ఆరంభించాను, ప్రకటనా పనిలో ప్రతీ నెలా 90 గంటలు వెచ్చించేవాడ్ని.

ఏప్రిల్‌ 7, 1990లో నా కేసు వల్మియరాలోని పీపుల్స్‌ కోర్టుకు పునఃసమీక్ష కోసం వచ్చింది. కోర్టులో వాదనలు వినడం ప్రారంభమైనప్పుడు నేను ప్రభుత్వ న్యాయవాదిని గుర్తుపట్టాను. ఆయన, నేను ఇంతకుముందు బైబిలు చర్చించిన యౌవనుడు! ఆయన నన్ను గుర్తుపట్టి చిరునవ్వు చిందించాడే కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి నాతో చెప్పింది ఇంకా గుర్తుంది: “యూరీ, నిన్ను ఖైదు చేయాలని నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమైనది. వాళ్ళు నిన్ను నిర్బంధించకుండా ఉండాల్సింది.” ఊహించని విధంగా నేను విడుదలయ్యాను!

క్రీస్తు సైనికుడు

జూన్‌ 1990లో, రీగాలో నివాస అనుమతి సంపాదించుకోవడానికి నేను మళ్ళీ రిజిస్టర్‌ కార్యాలయానికి వెళ్ళాల్సివచ్చింది. నేను నాలుగు సంవత్సరాల క్రితం సైన్యంలో పనిచేయనని చెప్పిన సైనిక అధికారి ఎదుటకే పొడవైన బల్ల ఉన్న అదే కార్యాలయంలోకి ప్రవేశించాను. అయితే ఈ సారి ఆయన నన్ను పలకరించడానికి నిలబడి నాకు కరచాలనం చేసిన తర్వాత ఇలా అన్నాడు: “మీరు ఇవన్నీ అనుభవించాల్సి రావడం అవమానకరం. పరిస్థితులు ఆ విధంగా మారినందుకు నేను చింతిస్తున్నాను.”

“నేను క్రీస్తు సైనికుడిని కాబట్టి నాకు ఆజ్ఞాపించబడిన దానిని నేను అనుసరించాలి. బైబిలు సహాయంతో మీరు కూడా క్రీస్తు తన అనుచరులకు వాగ్దానం చేసిన సంతోషకరమైన జీవితాన్ని, నిత్య భవిష్యత్తును అనుభవించవచ్చు” అని నేను జవాబిచ్చాను. (2 తిమోతి 2:​3, 4) దానికి ఆ అధికారి ఇలా అన్నాడు: “నేను కొద్దికాలం క్రితం ఒక బైబిలు కొన్నాను, నేనిప్పుడు దానిని చదువుతున్నాను.” నా దగ్గర మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం ఉంది. * నేను అంత్యదినాల సూచనల గురించి చర్చిస్తున్న అధ్యాయాన్ని తెరిచి బైబిలు ప్రవచనానికి మన కాలంతో ఎలాంటి సంబంధం ఉందో ఆయనకు వివరించాను. ఆ అధికారి కృతజ్ఞతతో, గౌరవంతో నాకు మళ్ళీ కరచాలనం చేసి నా పనిలో నేను విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపాడు.

ఆ సమయానికి లాట్వియాలోని క్షేత్రం పంట కోయడానికి నిజంగా సిద్ధంగా ఉంది. (యోహాను 4:​35) 1991లో నేను సంఘ పెద్దగా సేవ చేయడం ఆరంభించాను. అప్పుడు దేశమంతటిలో ఇద్దరు నియమిత పెద్దలు మాత్రమే ఉన్నారు! ఒక సంవత్సరం తర్వాత లాట్వియాలోని ఒకే ఒక సంఘం రెండు భాషా సంఘాలుగా విభజించబడింది, వాటిలో ఒకటి లాట్వియన్‌ భాషా సంఘం, మరొకటి రష్యన్‌ భాషా సంఘం. నాకు రష్యా భాషా సంఘంలో సేవ చేసే ఆధిక్యత లభించింది. అభివృద్ధి ఎంత త్వరితగతిన జరిగిందంటే, ఆ తర్వాతి సంవత్సరం మా సంఘాన్ని మూడు సంఘాలుగా విభజించాల్సి వచ్చింది! ఇప్పుడు అవన్నీ నేను సింహావలోకనం చేసుకుంటే, యెహోవాయే తన గొర్రెలను తన సంస్థవైపు నిర్దేశిస్తున్నాడని స్పష్టమవుతుంది.

1998లో రీగాకు ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెల్గవా అనే పట్టణంలో ప్రత్యేక పయినీరు సేవచేయడానికి నేను నియమించబడ్డాను. అదే సంవత్సరం, రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ పొలిమేర్లలో ఉన్న సోల్నెక్నోయెలో, రష్యా భాషలో నిర్వహించబడిన పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరవడానికి లాట్వియా నుండి ఆహ్వానించబడిన మొదటి వ్యక్తిని అయ్యాను. పరిచర్యలో విజయం సాధించడానికి ప్రజలపట్ల ప్రేమపూర్వక వైఖరి కనబరచడం ఎంత ప్రాముఖ్యమో నేను పాఠశాలలో ఉన్నప్పుడు గుర్తించాను. పాఠశాలలో బోధించబడిన వాటికన్నా నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకున్న విషయం, బెతెల్‌ కుటుంబం, పాఠశాల ఉపదేశకులు చూపించిన ప్రేమాశ్రద్ధలు.

నేను 2001లో కరీనా అనే అందమైన క్రైస్తవ స్త్రీని వివాహమాడినప్పుడు నా జీవితంలో మరో మైలురాయిని చేరుకున్నాను. కరీనా ప్రత్యేక పూర్తికాల పరిచర్యలో నాతో కలిసింది, నా భార్య క్షేత్రసేవ నుండి ఎంతో సంతోషంగా తిరిగిరావడం చూసి నేను ప్రతీరోజు ప్రోత్సాహం పొందుతాను. నిజంగా, యెహోవాను సేవించడం గొప్ప ఆనందాన్నిస్తుంది. కమ్యూనిస్టు పాలనలోని చేదు అనుభవాలు, ఆయన మీద పూర్తిగా నమ్మకముంచాలని నాకు నేర్పించాయి. యెహోవాతో ఉన్న స్నేహాన్ని కాపాడుకోవాలని, ఆయన సర్వాధిపత్యాన్ని సమర్థించాలని కోరుకొనే వ్యక్తికి ఏ త్యాగమైనా మరీ గొప్పదని అనిపించదు. యెహోవా గురించి తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేయడం నా జీవితానికి సంకల్పాన్నిచ్చింది. “క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె” యెహోవాను సేవించడం నాకు అసాధారణమైన గౌరవాన్నిచ్చింది.​—⁠2 తిమోతి 2:⁠3.

[అధస్సూచి]

^ పేరా 29 యెహోవాసాక్షులు ప్రచురించినది కానీ ఇప్పుడు ముద్రించబడడం లేదు.

[10వ పేజీలోని చిత్రం]

నాకు నాలుగు సంవత్సరాలు లేబర్‌ క్యాంపులో సేవచేయాల్సిందిగా శిక్ష విధించబడి, రీగా సెంట్రల్‌ జైలులో ఖైదు చేయబడ్డాను

[12వ పేజీలోని చిత్రం]

కరీనాతో పరిచర్యలో