కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని నామమును ఉపయోగించిన మొదటి జర్మన్‌ బైబిలు

దేవుని నామమును ఉపయోగించిన మొదటి జర్మన్‌ బైబిలు

దేవుని నామమును ఉపయోగించిన మొదటి జర్మన్‌ బైబిలు

యెహోవా అనే దేవుని వ్యక్తిగత నామం, జర్మన్‌ భాషలో 1971లో ప్రచురించబడిన రిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదములో వేలసార్లు కనిపిస్తుంది. * అయితే, ఇది దేవుని నామమును ఉపయోగించిన మొదటి జర్మన్‌ బైబిలేమీ కాదు. యెహోవా నామము కనిపించిన తొలి జర్మన్‌ బైబిలు, దాదాపు 500 సంవత్సరాల క్రితం, రోమన్‌ క్యాథలిక్‌ మత వేదాంతియైన యోహాన్‌ ఎక్‌ ప్రచురించినది కావచ్చు.

యోహాన్‌ ఎక్‌ 1486లో దక్షిణ జర్మనీలో జన్మించాడు. 24 ఏళ్ల వయస్సుకే ఆయన ఇంగోల్‌స్టాట్‌ విశ్వవిద్యాలయంలో మత అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు, 1543లో చనిపోయేంతవరకూ ఆయన ఆ వృత్తిలోనే కొనసాగాడు. ఎక్‌, మార్టిన్‌ లూథర్‌కు సమకాలీనుడు, ఈ ఇద్దరూ కొంతకాలం స్నేహితులుగా ఉన్నారు. అయితే, లూథర్‌ మతసంస్కరణోద్యమానికి నాయకత్వం వహిస్తే, ఎక్‌ క్యాథలిక్‌ చర్చిని సమర్థించాడు.

బావరియా సంస్థానాధిపతి బైబిలును జర్మన్‌ భాషలోకి అనువదించమని ఎక్‌ను ఆదేశించాడు, 1537లో ఆ అనువాదం ప్రచురించబడింది. కిర్చ్‌లీచెస్‌ హాండ్‌లెక్సికన్‌ చెబుతున్నదాని ప్రకారం, ఆయన చేసిన అనువాదం మూలపాఠానికి కట్టుబడి ఉంది, అది “ఇదివరకటికంటే ఎక్కువ గుర్తింపును పొందడానికి అర్హమైనది.” ఎక్‌ అనువాదం ప్రకారం నిర్గమకాండము 6:3 ఇలా ఉంది: “నేను సర్వశక్తిగల దేవునిగా అబ్రాహాము/ఇస్సాకు/యాకోబులకు కనబడిన ప్రభువును: అదొనాయ్‌ అనే నా నామమును/నేను వారికి తెలియజేయలేదు.” ఎక్‌ ఆ వచనానికి ఒక మార్జినల్‌ వ్యాఖ్యానాన్ని జతపర్చాడు, అదిలా ఉంది: “అదొనాయ్‌ నామము యెహోవా.” జర్మన్‌ బైబిల్లో దేవుని వ్యక్తిగత నామము ఉపయోగించబడడం ఇదే మొదటిసారి అని చాలామంది బైబిలు విద్వాంసులు నమ్ముతున్నారు.

ఏదేమైనప్పటికీ, వేలాది సంవత్సరాలుగా దేవుని వ్యక్తిగత నామము అందరికీ తెలుసు, వారు దానిని ఉపయోగిస్తున్నారు. అది వ్రాతపూర్వకంగా మొట్టమొదట హెబ్రీ భాషలో ఉపయోగించబడింది, అందులో అద్వితీయ సత్యదేవుణ్ణి గుర్తించడానికి “యెహోవా” అనే నామము ఉపయోగించబడింది. (ద్వితీయోపదేశకాండము 6:4) దాదాపు 2,000 సంవత్సరాల పూర్వం, దేవుని నామమును ప్రత్యక్షపరచితిని అని యేసు చెప్పిన విషయం గ్రీకు భాషలో వ్రాయబడింది. (యోహాను 17:6) అప్పటినుండి, దేవుని నామము అసంఖ్యాకమైన భాషల్లో ప్రచురించబడింది, త్వరలోనే కీర్తన 83:​18 నెరవేర్పుగా, యెహోవా అను నామము ధరించిన ఆయనే సర్వలోకములో మహోన్నతుడని అందరూ తెలుసుకుంటారు.

[అధస్సూచి]

^ పేరా 2 యెహోవాసాక్షులు దీన్ని మొదటిసారిగా ఆంగ్లంలో 1961లో ప్రచురించారు. ఇప్పుడు పూర్తి బైబిలు లేదా దానిలో కొంతభాగం 50 కంటే ఎక్కువ భాషల్లో లభ్యమవుతోంది.

[32వ పేజీలోని చిత్రం]

ఎక్‌ అనువదించిన బైబిలు యొక్క 1558 సంచిక, నిర్గమకాండము 6:3 యొక్క మార్జినల్‌ రిఫరెన్సులో యెహోవా పేరు చూపించబడింది