కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

‘ఆయన మాత్రమే అమరత్వముగలవాడైయున్నాడు,’ “మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు” అనే వాక్యభాగాలు యెహోవా దేవుణ్ణి కాదు, యేసును ఉద్దేశించి చెప్పబడినవే అనడానికి ఎలాంటి ఆధారముంది?

అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు.”​—⁠1 తిమోతి 6:15, 16.

బైబిలు వ్యాఖ్యాతలు సాధారణంగా ఇలా తర్కిస్తారు: “‘ఆయన మాత్రమే అమరత్వముగలవాడు,’ ‘అద్వితీయుడగు సర్వాధిపతి,’ ‘మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు’ వంటి పదబంధాలు సర్వశక్తిగల దేవుణ్ణి తప్ప మరెవరినో ఎలా సూచించగలవు?” నిజమే అలాంటి పదాలను యెహోవాను వర్ణించడానికి ఉపయోగించవచ్చు. అయితే, 1 తిమోతి 6:15, 16లోని సందర్భం పౌలు ప్రత్యేకంగా యేసును ఉద్దేశించి మాట్లాడుతున్నాడనే సూచిస్తున్నాయి.

పౌలు 14వ వచనం చివర్లో ‘మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత’ గురించి ప్రస్తావిస్తున్నాడు. (1 తిమోతి 6:14) కాబట్టి, 15వ వచనంలో పౌలు “శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు  ప్రత్యక్షతను కనుపరచును” అని వ్రాసినప్పుడు, ఆయన యెహోవా దేవుని ప్రత్యక్షతను కాదుగానీ యేసు ప్రత్యక్షతనే సూచిస్తున్నాడు. మరైతే ‘అద్వితీయుడగు సర్వాధిపతి’ ఎవరు? పౌలు సూచించిన ఆ సర్వాధిపతి యేసు అని తేల్చిచెప్పడమే న్యాయమనిపిస్తోంది. ఎందుకు? ఎందుకంటే, పౌలు యేసును మానవ పరిపాలకులతో పోలుస్తున్నట్లుగా ఆ సందర్భం స్పష్టం చేస్తోంది. పౌలు వ్రాసినట్లుగా, యేసు నిజంగానే “[మానవ] రాజులకు రాజును [మానవ] ప్రభువులకు ప్రభువునై యున్నాడు.” * అవును, వారితో పోల్చినప్పుడు యేసు “అద్వితీయుడగు సర్వాధిపతి.” యేసుకు ‘సకల జనులును రాష్ట్రములును ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఇవ్వబడింది.’ (దానియేలు 7:​14) ఏ మానవ సర్వాధిపతీ అలాంటి అధికారం తనకుందని చెప్పుకోలేడు!

మరి ‘ఆయన మాత్రమే అమరత్వముగలవాడైయున్నాడు’ అనే పదబంధం విషయమేమిటి? ఇక్కడ మళ్లీ మానవ రాజులకు, యేసుకు మధ్యగల పోలిక చెప్పబడింది. యేసు తప్ప, ఏ మానవ పరిపాలకుడూ తనకు అమరత్వముకలదని చెప్పుకోలేడు. పౌలు ఇలా వ్రాశాడు: ‘మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరుగుదుము.’ (రోమీయులు 6:​8-9) ఆ విధంగా, అమరత్వపు బహుమానం పొందాడని బైబిలు వర్ణిస్తున్న వారిలో యేసే ప్రథముడు. అవును, పౌలు వ్రాసే సమయానికి యేసు మాత్రమే నాశనంకాని జీవాన్ని పొందాడు.

పౌలు ఆ మాటలు వ్రాసేటప్పటికి యేసుకూడా అమరత్వం పొందాడు కాబట్టి యెహోవా దేవుడు మాత్రమే అమరత్వముగలవాడని పౌలు చెప్పడం తప్పు అవుతుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే మానవ పరిపాలకులతో పోలుస్తూ యేసు మాత్రమే అమరత్వముగలవాడని పౌలు చెప్పగలడు.

అంతేకాక, యేసు పునరుత్థానం చేయబడి పరలోకానికి ఆరోహణమైన తర్వాత, “మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు” అని ఆయన గురించి వర్ణించవచ్చనేది ఖచ్చితమైన సత్యం. నిజమే, ఆయన అభిషిక్త క్రైస్తవులు తాము మరణించి, ఆత్మ ప్రాణులుగా పరలోకానికి పునరుత్థానం చేయబడినప్పుడు యేసును చూస్తారు. (యోహాను 17:24) అయితే భూమ్మీది ఏ మానవుడు మహిమాన్విత యేసును చూడలేరు. కాబట్టి, యేసు పునరుత్థానం చేయబడి, ఆరోహణమైనప్పటి నుండి “మనుష్యులలో ఎవడును” యేసును కళ్లారా చూడలేదని సత్యప్రమాణంగా చెప్పవచ్చు.

అవును, పైకి 1 తిమోతి 6:15, 16లోని వర్ణనలు దేవునికి అన్వయిస్తున్నట్లే అనిపించవచ్చు. అయితే పౌలు మాటల సందర్భమేకాక, ఇతర లేఖనాలు కూడా పౌలు యేసును ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు రూఢిగా చూపిస్తున్నాయి.

[అధస్సూచి]

^ పేరా 5 అలాంటి పదాలే 1 కొరింథీయులు 8:5, 6; ప్రకటన 17:​12, 14; 19:16లో యేసుకు అన్వయించబడ్డాయి.