కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం మన దేవుడైన యెహోవా నామమును స్మరిస్తూ నడుచుకుందాం

మనం మన దేవుడైన యెహోవా నామమును స్మరిస్తూ నడుచుకుందాం

మనం మన దేవుడైన యెహోవా నామమును స్మరిస్తూ నడుచుకుందాం

“మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.”​—⁠మీకా 4:⁠5.

దేవునితో నడిచిన మొదటి వ్యక్తిగా బైబిల్లో పేర్కొనబడిన వ్యక్తి హనోకు. రెండవ వ్యక్తి నోవహు. ఆ నివేదిక మనకిలా చెబుతోంది: “నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు.” (ఆదికాండము 6:⁠9) నోవహు కాలానికల్లా, సాధారణ ప్రజానీకం స్వచ్ఛారాధన నుండి వైదొలగిపోయింది. నమ్మకద్రోహులైన దేవదూతలు మానవ స్త్రీలతో అసహజమైన సంబంధాలు ఏర్పరచుకొని, ఆ కాలంలో “బలశాలురు” లేదా “శూరులు” అని పిలువబడిన నెఫీలులను కనడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. కాబట్టి భూమి దౌర్జన్యంతో నిండిపోయిందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. (ఆదికాండము 6:​2, 4, 11) అయినప్పటికీ, నోవహు నిందారహితునిగా, “నీతిని ప్రకటించిన” వ్యక్తిగా నిరూపించుకున్నాడు. (2 పేతురు 2:⁠5) ప్రాణ రక్షణ కోసం ఓడను నిర్మించమని దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినప్పుడు, ఆయన విధేయతతో ‘దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు.’ (ఆదికాండము 6:​22) అవును, నోవహు దేవునితో నడిచాడు.

2 నమ్మకమైన సాక్షుల్లో నోవహును కూడా పేర్కొంటూ పౌలు ఇలా వ్రాశాడు: “విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపన చేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.” (హెబ్రీయులు 11:7) ఎంత అద్భుతమైన ఆదర్శమో కదా! యెహోవా మాటలు నిజమవుతాయనే నమ్మకంతో నోవహు దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి తన సమయాన్ని, శక్తిని, వనరులను వెచ్చించాడు. అదే ప్రకారంగా నేడు చాలామంది లోకసంబంధ అవకాశాలను నిరాకరిస్తూ, దేవుని ఆజ్ఞలకు విధేయులవుతూ తమ సమయాన్ని, శక్తిని, వనరులను వెచ్చిస్తున్నారు. వారి విశ్వాసం గమనార్హమైనదే కాక వారికీ, ఇతరులకూ రక్షణను తీసుకొస్తుంది.​—⁠లూకా 16:9; 1 తిమోతి 4:⁠16.

3 ముందరి ఆర్టికల్‌లో చర్చించిన నోవహు ముత్తాత అయిన హనోకుకు విశ్వాసంతో ఉండడం ఎంత కష్టమైందో, నోవహుకు ఆయన కుటుంబానికీ అంతే కష్టమై ఉండవచ్చు. హనోకు కాలంలోలాగే నోవహు కాలంలో కూడా సత్యారాధకులు కొద్దిమందే అంటే ఎనిమిది మంది మాత్రమే తాము నమ్మకస్థులమని నిరూపించుకొని జలప్రళయం నుండి తప్పించుకున్నారు. నోవహు దౌర్జన్యపూరితమైన, అనైతిక ప్రపంచంలో నీతిని ప్రకటించాడు. అంతేకాక, ఆయనా ఆయన కుటుంబమూ అంతకుముందెప్పుడూ ఎవరూ అలాంటి జలప్రళయం చూడకపోయినా, ప్రపంచవ్యాప్త జలప్రళయానికి సిద్ధపడుతూ చెక్కలతో పెద్ద ఓడను నిర్మించారు. అది చూపరులకు వింతగా అనిపించి ఉండవచ్చు.

4 ఆసక్తికరమైన విషయమేమిటంటే, దౌర్జన్యం, అబద్ధమతం లేదా అనైతికత చాలా గంభీరమైనవే అయినప్పటికీ, యేసు నోవహు కాలం గురించి మాట్లాడినప్పుడు వాటి గురించి మాట్లాడలేదు. ప్రజలకు ఇవ్వబడిన హెచ్చరికను వారు నిర్లక్ష్యం చేశారనే తప్పునే యేసు నొక్కిచెప్పాడు. “వారు తినుచు త్రాగుచు, పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి” అని ఆయన అన్నాడు. తినడం, త్రాగడం, వివాహం చేసుకోవడం, వంటివాటిలో తప్పేమిటి? వారు కేవలం “సాధారణ” జీవితమే జీవిస్తున్నారు! కానీ జలప్రళయం రాబోతోంది, నోవహు నీతిని ప్రకటిస్తున్నాడు. ఆయన మాటలు, ప్రవర్తన వారికొక హెచ్చరికగా ఉండాల్సింది. అయినప్పటికీ, వారు “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి.”​—⁠మత్తయి 24:38, 39.

5 వెనక్కి తిరిగి ఆ కాలాల గురించి ఒకసారి ఆలోచిస్తే, నోవహు అవలంబించిన విధానంలోని విజ్ఞతను మనం చూస్తాం. అయితే, జలప్రళయానికి ముందరి దినాల్లో, ప్రతీవారికి భిన్నంగా ఉండేందుకు ధైర్యం అవసరమైంది. పెద్ద ఓడను నిర్మించి దానిలో వివిధ జంతుజాలాలను నింపడానికి నోవహుకు ఆయన కుటుంబానికి దృఢనమ్మకం అవసరమైంది. ఆ నమ్మకస్థుల్లో కొందరు విభిన్నంగా ఉండకుండా “సాధారణ” జీవితం జీవించాలని కోరుకుని ఉండే అవకాశం ఉందా? ఒకవేళ వారికి అలాంటి ఆలోచనలు వచ్చినప్పటికీ, వారు తమ యథార్థతలో బలహీనులు కాలేదు. ఈ విధానంలో మనలో ఎవరమైనా సహించవలసిన కాలంకన్నా మరెంతో ఎక్కువ కాలం సహించిన తర్వాతే, నోవహు చూపించిన విశ్వాసం ఆయన జలప్రళయం నుండి రక్షించబడేందుకు దారితీసింది. అయితే “సాధారణ” జీవితం గడుపుతూ, తాము జీవిస్తున్న కాలాల విశేషతను ఎరగని వారందరికీ యెహోవా తీర్పు తీర్చాడు.

మానవాళిని మళ్ళీ పట్టిపీడిస్తున్న దౌర్జన్యం

6 జలప్రళయపు నీళ్లు ఇంకిపోయిన తర్వాత, మానవాళికి ఒక కొత్త ఆరంభం లభించింది. కానీ మానవులు ఇంకా అపరిపూర్ణులుగానే ఉన్నారు, వారి హృదయాలోచన “వారి బాల్యమునుండి చెడ్డది[గానే]” ఉంటూ వచ్చింది. (ఆదికాండము 8:21) అంతేకాక, దయ్యాలకు మానవ శరీరాలు ధరించడానికి ఏ మాత్రం అవకాశంలేకపోయినా అవి చురుగ్గా పనిచేస్తూ వచ్చాయి. అనతికాలంలోనే భక్తిహీనుల మానవ ప్రపంచం తాను ‘దుష్టునియందున్నట్లుగా’ చూపించడంతో, నేటిలాగే సత్యారాధకులు “అపవాది తంత్రములను” ఎదిరించవలసిన పరిస్థితి ఏర్పడింది.​—⁠1 యోహాను 5:19; ఎఫెసీయులు 6:11, 12.

7 జలప్రళయం తర్వాత, దాదాపు నిమ్రోదు కాలం మొదలుకొని భూమి మళ్లీ మానవుల దౌర్జన్యంతో నిండిపోయింది. కాలం గడిచేకొద్దీ, జనాభాతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో, ఆ దౌర్జన్యం మరీ పెచ్చరిల్లింది. పూర్వం ఖడ్గాలు, ఈటెలు, విల్లులు, బాణములు, రథాలు ఉండేవి. ఇటీవలి కాలాల్లో, చేతి తుపాకులు, ఫిరంగులు, మరతుపాకులు, 20వ శతాబ్దపు ఆధునిక శతఘ్నులు వాడుకలోకి వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్ధం విమానాలు, ట్యాంకులు, జలాంతర్గాములు వంటి భయంకరమైన కొత్త ఆయుధాలతోపాటు ప్రాణాంతకమైన విషవాయువులను పరిచయం చేసింది. ఆ యుద్ధంలో ఈ ఆయుధాలు కోట్లాదిమంది ప్రాణాల్ని బలిగొన్నాయి. అదంతా కాకతాళీయంగా జరిగిందా? లేదు.

8 యేసు 1914వ సంవత్సరంలో దేవుని పరలోక రాజ్యానికి రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించడంతో ‘ప్రభువు దినం’ ఆరంభమైంది. (ప్రకటన 1:​10) ప్రకటన గ్రంథంలో నమోదు చేయబడిన ఒక దర్శనంలో, రాజుగా యేసు జయిస్తూ తెల్లని గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కనబడింది. ఆయనను అనుసరిస్తున్న ఇతర గుర్రపు రౌతులు మానవాళిని పట్టిపీడిస్తున్న వివిధ తెగుళ్లకు ప్రతీకగా ఉన్నారు. వారిలో ఒక రౌతు ఎర్రని గుఱ్ఱంపై స్వారీ చేస్తున్నాడు, ఆ రౌతుకు ‘మనుష్యులు ఒకనినొకడు చంపుకొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు అధికార మియ్యబడెను; మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గమియ్యబడెను.’ (ప్రకటన 6:1-4) ఆ గుఱ్ఱము దాని రౌతు యుద్ధాన్ని సూచిస్తున్నాయి, ఆ పెద్ద ఖడ్గము శక్తిమంతమైన ఆయుధాలతో ఆధునిక యుద్ధాలు తెచ్చే వినాశనపు విస్తృత పరిధిని సూచిస్తోంది. అలాంటి ఆయుధాల్లో లక్షలాదిమంది ప్రాణాల్ని హరించగల అణుబాంబులు, ఆ బాంబులను వేలాది కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల రాకెట్లతోపాటు, విస్తారమైన రీతిలో జననష్టం కలిగించగల అత్యాధునిక జీవరసాయన ఆయుధాలూ ఉన్నాయి.

మనం యెహోవా హెచ్చరికలను గమనిస్తాం

9 నోవహు కాలంలో దుష్ట మానవులు, నెఫీలులతో కలిసి చేస్తున్న తీవ్ర దౌర్జన్యం కారణంగా, యెహోవా ఆ మానవజాతిని నాశనం చేశాడు. మరి నేటి విషయమేమిటి? అప్పటికంటే ఇప్పుడు దౌర్జన్యమేమైనా తక్కువగా ఉందా? ఎంతమాత్రం తక్కువ లేదు! అంతేకాక, నోవహు కాలంలోలాగే నేడు ప్రజలు తమ దైనందిన వ్యవహారాల్లో మునిగి “సాధారణ” జీవితం జీవించడానికే ప్రయత్నిస్తూ, వారికివ్వబడుతున్న హెచ్చరికలను లక్ష్యపెట్టడం లేదు. (లూకా 17:​26, 27) యెహోవా మళ్ళీ మానవాళిని నాశనం చేస్తాడనే విషయాన్ని సందేహించడానికి కారణమేమైనా ఉందా? లేదు.

10 జలప్రళయానికి వందల సంవత్సరాల ముందే హనోకు, మన కాలంలో రానున్న నాశనం గురించి ప్రవచించాడు. (యూదా 14, 15) యేసుకూడా రానున్న ‘మహాశ్రమ’ గురించి మాట్లాడాడు. (మత్తయి 24:21) ఇతర ప్రవక్తలూ ఆ సమయం గురించి హెచ్చరించారు. (యెహెజ్కేలు 38:18-23; దానియేలు 12:1; యోవేలు 2:31, 32) ప్రకటన గ్రంథంలో ఆ చివరి నాశనం గురించిన స్పష్టమైన వర్ణనను మనం చదువుతాం. (ప్రకటన 19:11-21) ఆయా వ్యక్తులుగా మనం నోవహును అనుకరిస్తూ, చురుకుగా నీతిని ప్రకటించేవారిగా ఉన్నాం. యెహోవా హెచ్చరికలను ఎరిగినవారిగా ఉంటూ, మన పొరుగువారు కూడా అలా ఎరిగి ఉండాలని వారికి ప్రేమపూర్వకంగా సహాయం చేస్తాం. కాబట్టి నోవహులాగే మనం కూడా దేవునితో నడుస్తాం. నిజానికి, జీవాన్ని కోరుకునే ప్రతీవ్యక్తీ దేవునితో నడవడం ఆవశ్యకం. అయితే మనం ప్రతీరోజు ఎదుర్కొనే ఒత్తిళ్ల మధ్య కూడా ఆయనతో ఎలా నడవవచ్చు? అందుకు మనం దేవుని సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడం అవసరం.​—⁠హెబ్రీయులు 11:⁠6.

కష్టభరిత కాలాల్లో దేవునితో నడుస్తూనే ఉండండి

11 మొదటి శతాబ్దంలో, అభిషిక్త క్రైస్తవులు ‘మార్గానికి’ చెందినవారు అని పిలవబడ్డారు. (అపొస్తలుల కార్యములు 9:2) వారి యావత్‌ జీవితం యెహోవా, యేసుక్రీస్తుల మీదున్న విశ్వాసం చుట్టే అల్లుకుంది. తమ యజమాని నడిచిన మార్గంలోనే వారు నడిచారు. నేడు, నమ్మకస్థులైన క్రైస్తవులు కూడా అలాగే నడుస్తారు.

12 యేసు పరిచర్య కాలంలో జరిగిన ఒక సంఘటనలో విశ్వాసపు ప్రాముఖ్యత వెల్లడయ్యింది. యేసు ఒక సందర్భంలో దాదాపు 5,000 మందికి అద్భుతరీతిలో ఆహారం పెట్టాడు. ప్రజలు ఆశ్చర్యపడి, ఆనందించారు. అయితే ఆ తర్వాత ఏమి జరిగిందో గమనించండి. మనమిలా చదువుతాం: “ఆ మనుష్యులు యేసు చేసిన సూచకక్రియను చూచి​—⁠నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.” (యోహాను 6:​10-15) ఆ రాత్రే ఆయన మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు. రాజుగా చేయడాన్ని యేసు తిరస్కరించడం చాలామందిని నిరుత్సాహపరచి ఉండవచ్చు. ఎందుకంటే, రాజుగా ఉండడానికి కావలసిన జ్ఞానము, ప్రజల భౌతికావసరాలను తీర్చగలిగే శక్తి తనకున్నాయని ఆయన నిరూపించుకున్నాడు. అయితే ఆయన రాజుగా పరిపాలించేందుకు యెహోవా నిర్ణయించిన సమయమింకా రాలేదు. అంతేకాక, యేసు రాజ్యం భూసంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనదిగా ఉంటుంది.

13 అయినప్పటికీ, ఆ గుంపు పట్టువిడువక యేసును అనుసరించి, యోహాను చెబుతున్నట్లుగా వారయనను “సముద్రపుటద్దరిన” కనుగొన్నారు. తనను రాజుగా చేయడానికి వారు చేసిన ప్రయత్నాలను ఆయన నిరాకరించినప్పటికీ, వారాయనను ఎందుకు అనుసరించారు? వారిలో చాలామంది, మోషే కాలంలో యెహోవా అరణ్యంలో చేసిన భౌతిక ఏర్పాట్ల గురించి నొక్కి చెబుతూ తమ శారీరక దృక్పథాన్ని కనబరిచారు. అంటే యేసు తమకు ఎల్లప్పుడూ ఆహారం అందిస్తూనే ఉండాలని వారు సూచించారు. వారి తప్పుడు ఉద్దేశాలను గ్రహించిన యేసు, వారు తమ ఆలోచనను సరిచేసుకోవడానికి సహాయం చేయగల ఆధ్యాత్మిక సత్యాలను వారికి బోధించడం ప్రారంభించాడు. (యోహాను 6:17, 24, 25, 30, 31, 35-40) దానికి ప్రతిస్పందనగా, వారిలో కొందరు ఆయనకు వ్యతిరేకంగా సణిగారు, ప్రత్యేకంగా ఆయన “మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును” అనే ఉపమానం చెప్పినప్పుడు వారు సణిగారు.​—⁠యోహాను 6:53, 54.

14 యేసు ఉపమానాలు తరచూ, తమకు దేవునితో నిజంగా నడవాలనే కోరిక ఉందో లేదో చూపించడానికి ప్రజలను ప్రేరేపించాయి. ఈ ఉపమానం కూడా అలాంటిదే. అది వారిలో బలమైన స్పందనలు రేకెత్తించింది. మనమిలా చదువుతాం: “ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి.” వారు తన మాటల ఆధ్యాత్మిక భావాన్ని గ్రహించాలని యేసు వివరించాడు. ఆయనిలా అన్నాడు: “ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి.” అయినప్పటికీ, చాలామంది వినలేదు, ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.”​—⁠యోహాను 6:60, 63, 66.

15 అయితే, యేసు శిష్యులందరూ ఆ విధంగా స్పందించలేదు. నిజమే, ఆయన యథార్థ శిష్యులకు యేసు చెప్పిన విషయాలు పూర్తిగా అర్థంకాలేదు. అయినప్పటికీ, ఆయనపై వారికున్న నమ్మకం ఏ మాత్రం సడలిపోలేదు. ఆ యథార్థ శిష్యుల్లో ఒకడైన పేతురు, అలా స్థిరంగా నిలబడిన వారి భావాలను వ్యక్తం చేస్తూ ఇలా అన్నాడు: “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.” (యోహాను 6:​68) ఎంత చక్కని దృక్పథం, ఎంత విశిష్టమైన మాదిరో కదా!

16 నేడు మనం కూడా, యేసు తొలి శిష్యులు పరీక్షించబడిన విధంగానే పరీక్షించబడవచ్చు. మన విషయంలో, మనం వ్యక్తిగతంగా కోరుకున్నంత త్వరగా యెహోవా వాగ్దానాలు నెరవేరడం లేదని నిరుత్సాహపడవచ్చు. మన బైబిలు ఆధారిత ప్రచురణల్లో ఇవ్వబడే లేఖనాల వివరణలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని మనం భావించవచ్చు. తోటి క్రైస్తవుని ప్రవర్తన మనల్ని నిరుత్సాహపరచవచ్చు. ఈ కారణాలనుబట్టి లేదా ఇలాంటి ఇతర కారణాలనుబట్టి దేవునితో నడవడాన్ని మానేయడం సరైనదిగా ఉంటుందా? ఎంతమాత్రం సరైనదిగా ఉండదు! యేసును వెంబడించడం మానేసిన శిష్యులు శారీరక ఆలోచనా విధానాన్ని కనబరిచారు. మనం వారిలా ఉండకూడదు.

‘మనము వెనుకతీయువారము కాము’

17 అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: ‘ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగింది.’ (2 తిమోతి 3:16) బైబిలు పుటల ద్వారా యెహోవా మనకిలా స్పష్టంగా చెబుతున్నాడు: “ఇదే త్రోవ, దీనిలో నడువుడి.” (యెషయా 30:21) దేవుని వాక్యానికి విధేయులవడం మనం ‘ఎలా నడుచుకోవాలో జాగ్రత్తగా చూసుకొనేందుకు’ మనకు సహాయం చేస్తుంది. (ఎఫెసీయులు 5:15) బైబిలును అధ్యయనం చేయడం, మనం తెలుసుకున్నదానిని ధ్యానించడం “సత్యమును అనుసరించి నడుచుకొ[నేందుకు]” మనకు దోహదపడతాయి. (3 యోహాను 3) అవును, యేసు చెప్పినట్లుగా “ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము.” మన అడుగులను నిర్దేశించే ఏకైక నమ్మదగిన మార్గదర్శకం ఆధ్యాత్మిక మార్గదర్శకమే, అది యెహోవా వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన సంస్థ ద్వారా వస్తుంది.

18 నేడు తమ శారీరక ఆలోచనవల్ల లేదా అనుకున్నవి జరగనందువల్ల అసంతృప్తి చెందినవారు తరచూ ఈ లోకం అందించేవాటివైపే తిరుగుతారు. తమ అత్యవసర భావాన్ని కోల్పోయి, తాము ‘మెలకువగా ఉండవలసిన’ అవసరాన్ని గ్రహించక, రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానమిచ్చే బదులు స్వార్థపూరిత లక్ష్యాలనే అనుసరిస్తారు. (మత్తయి 24:​42) అలాంటి మార్గంలో నడవడం ఎంతమాత్రం జ్ఞానయుక్తం కాదు. అపొస్తలుడైన పౌలు వ్రాసిన మాటలు గమనించండి: “మనము నశించుటకు వెనుకతీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమైయున్నాము.” (హెబ్రీయులు 10:​39) హనోకు, నోవహు జీవించినట్లే మనమూ సంక్షోభిత కాలాల్లో జీవిస్తున్నప్పటికీ, వారిలాగే మనకూ దేవునితో నడిచే ఆధిక్యత ఉంది. అలా నడిచినప్పుడు, యెహోవా వాగ్దానాల నెరవేర్పును, దుష్టత్వపు నాశనాన్ని, నీతియుక్త లోకం రావడాన్ని చూస్తామనే ఖచ్చితమైన నిరీక్షణ మనకుంటుంది. ఎంత అద్భుతమైన ఉత్తరాపేక్షో కదా!

19 ప్రపంచ జనాంగాలు “తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు” అని ప్రేరేపిత ప్రవక్తయైన మీకా చెప్పాడు. ఆ తర్వాత ఆయన తన గురించీ, నమ్మకస్థులైన ఇతర ఆరాధకుల గురించీ మాట్లాడి ఇలా అన్నాడు: “మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.” (మీకా 4:⁠5) ఒకవేళ మీ నిర్ణయం కూడా మీకా నిర్ణయం వంటిదైతే, కాలాలు ఎంత సంక్షోభితంగా మారినా యెహోవాకు సన్నిహితంగా ఉండండి. (యాకోబు 4:⁠8) ఇప్పుడూ, యుగయుగాలూ మన దేవుడైన యెహోవాతో నిరంతరం నడవాలన్నదే మనలో ప్రతీ ఒక్కరి హృదయపూర్వక కోరికగా ఉండును గాక!

మీరెలా జవాబిస్తారు?

నోవహు కాలానికీ, మన కాలానికీ ఎలాంటి పోలికలు ఉన్నాయి?

నోవహు, ఆయన కుటుంబం ఏ విధానాన్ని అనుసరించారు, వారి విశ్వాసాన్ని మనమెలా అనుకరించవచ్చు?

యేసు అనుచరుల్లో కొందరు ఎలాంటి తప్పుడు దృక్పథాన్ని కనబరిచారు?

నిజ క్రైస్తవులు ఏమి చేయాలని నిర్ణయించుకున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

1. నైతిక విషయానికొస్తే, నోవహు కాలంలో పరిస్థితి ఎలావుంది, నోవహు ఎలా భిన్నమైన వ్యక్తిగా ఉన్నాడు?

2, 3. నేడు మన కోసం నోవహు ఎలాంటి చక్కని ఆదర్శాన్ని ఉంచాడు?

4. నోవహు సమకాలీనులు చేసిన ఏ తప్పును యేసు నొక్కిచెప్పాడు?

5. నోవహుకు, ఆయన కుటుంబానికీ ఎలాంటి లక్షణాలు అవసరమయ్యాయి?

6. జలప్రళయం తర్వాత ఎలాంటి పరిస్థితి నెలకొంది?

7. జలప్రళయం తర్వాత దౌర్జన్యం ఎలా పెరిగిపోయింది?

8. ప్రకటన 6:1-4 ఎలా నెరవేరుతోంది?

9. జలప్రళయానికి ముందున్న లోకానికీ, నేటి లోకానికీ ఎలాంటి పోలిక ఉంది?

10. (ఎ) బైబిలు ప్రవచనాల్లో పదేపదే ఏ హెచ్చరిక ఇవ్వబడింది? (బి) నేడు అనుసరించవలసిన ఏకైక జ్ఞానయుక్త విధానమేమిటి?

11. మనమే విధంగా మొదటి శతాబ్దపు క్రైస్తవులను అనుకరిస్తాం?

12. యేసు అద్భుతరీతిలో జనసమూహానికి ఆహారం పెట్టిన తర్వాత ఏమి జరిగింది?

13, 14. చాలామంది ఎలాంటి దృక్పథాన్ని కనబరిచారు, వారి విశ్వాసం ఎలా పరీక్షించబడింది?

15. యేసు అనుచరుల్లోని కొందరికి ఎలాంటి సరైన దృక్పథం ఉంది?

16. మనమెలా పరీక్షించబడవచ్చు, మనమెలాంటి సరైన దృక్పథాన్ని పెంపొందించుకోవాలి?

17. ఎల్లప్పుడూ దేవునితో నడిచేందుకు మనమెలా సహాయాన్ని పొందవచ్చు?

18. (ఎ) కొందరు అజ్ఞానంతో ఏమి చేస్తారు? (బి) మనమెలాంటి విశ్వాసాన్ని పెంపొందించుకుంటాం?

19. సత్యారాధకుల వైఖరిని మీకా ఎలా వర్ణిస్తున్నాడు?

[20వ పేజీలోని చిత్రాలు]

నోవహు కాలంలోలాగే, నేడు కూడా ప్రజలు తమ దైనందిన వ్యవహారాల్లో మునిగిపోయారు

[21వ పేజీలోని చిత్రం]

రాజ్య ప్రచారకులముగా “మనం వెనుకతీయువారము కాము”