కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంక్షోభిత కాలాల్లో దేవునితో నడవండి

సంక్షోభిత కాలాల్లో దేవునితో నడవండి

సంక్షోభిత కాలాల్లో దేవునితో నడవండి

“హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.”​ఆదికాండము 5:24.

సంక్షోభిత కాలాలు! మెస్సీయ రాజ్యం 1914లో ఉద్భవించిన దగ్గర నుండి మానవాళి అనుభవిస్తున్న అశాంతి, హింసలతో నిండిన సంవత్సరాలను ఆ మాటలు సరిగ్గా వర్ణిస్తున్నాయి. ఈ కాలమంతటిలో మానవాళి అంత్యదినాల్లోనే ఉంది. కరవులు, వ్యాధులు, భూకంపాలు, యుద్ధాల్లాంటి విపత్తులు మానవులను అసాధారణ రీతిలో పట్టి పీడిస్తున్నాయి. (2 తిమోతి 3:1; ప్రకటన 6:​1-8) యెహోవాను ఆరాధించేవారికీ ఇవి తప్పలేదు. కొద్దో గొప్పో మనమందరం ఈ కాలాల కష్టాలను, అనిశ్చిత పరిస్థితిని సహించక తప్పదు. జీవితాన్ని కష్టాల్లో ముంచేసే సమస్యల్లో ఆర్థిక ఇక్కట్లు, రాజకీయ అశాంతి, నేరం, వ్యాధి వంటివి కొన్ని మాత్రమే.

2 వీటికి తోడుగా, “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారికి” వ్యతిరేకంగా సాతాను యుద్ధం చేస్తున్న కారణంగా వరుసగా వచ్చిపడిన తీవ్ర హింసలను యెహోవా సేవకులు చాలామంది సహించారు. (ప్రకటన 12:17) మనలో చాలామంది తీవ్రమైన హింసను సూటిగా అనుభవించకపోయినా, నిజ క్రైస్తవులందరూ అపవాదియైన సాతానుకు, అతడు మానవుల్లో పెంచి పోషిస్తున్న స్వభావానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే. (ఎఫెసీయులు 2:2; 6:​12) ఉద్యోగ స్థలంలో, పాఠశాలలో, స్వచ్ఛారాధనపట్ల ఆసక్తిలేని ప్రజలతో కలిసి మెలగవలసివచ్చే మరే ఇతర స్థలంలోనైనా ఈ స్వభావం ఉంటుంది కాబట్టి, దాని ప్రభావానికి లోనవకుండా ఉండడానికి మనం నిరంతరం అప్రమత్తంగా ఉండడం అవసరం.

జనాంగాలతో కాదు, దేవునితో నడవండి

3 మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కూడా అలాగే ఈ లోక స్వభావానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు, దానితో వారు క్రైస్తవ సంఘం వెలుపలివారికి చాలా భిన్నంగా నిలిచారు. ఆ తారతమ్యాన్ని వర్ణిస్తూ పౌలు ఇలా వ్రాశాడు: “కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.”​—⁠ఎఫెసీయులు 4:17-19.

4 అటు పౌలు కాలంలోనూ, ఇటు మన కాలంలోనూ ఈ లోక ఆధ్యాత్మిక, నైతిక ప్రగాఢ అంధకారాన్ని ఆ మాటలు ఎంత స్పష్టంగా వర్ణిస్తున్నాయో కదా! మొదటి శతాబ్దంలోలాగే, నేటి క్రైస్తవులు కూడా ‘అన్యజనులు నడుచుకొనునట్లు నడుచుకోరు.’ బదులుగా వారికి దేవునితో నడిచే అద్భుతమైన ఆధిక్యత ఉంది. నిజమే, అల్పుడూ అపరిపూర్ణుడూ అయిన మానవుడు యెహోవాతో నడుస్తాడని చెప్పడం తర్కబద్ధమేనా అని కొందరు ప్రశ్నించవచ్చు. అయితే, వారలా దేవునితో నడవగలరని బైబిలు చూపిస్తోంది. అంతేకాదు, వారలా తనతో నడవాలని యెహోవా అపేక్షిస్తున్నాడు. మన సామాన్య శకానికి పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో, మీకా ప్రవక్త ఈ క్రింది ప్రేరేపిత మాటలు వ్రాశాడు: “మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, [‘నీ దేవునితో నడుచుటయు,’ NW] ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.”​—⁠మీకా 6:⁠8.

దేవునితో ఎలా నడవాలి, ఎందుకు నడవాలి?

5 సర్వశక్తిగల అదృశ్య దేవునితో మనమెలా నడవగలం? తోటి మానవులతో కలిసి నడిచినట్లుగా మనం యెహోవాతో నడవలేమనేది స్పష్టం. బైబిల్లో “నడవడం” అనే మాట ‘ఒక నిర్దిష్ట కార్య విధానాన్ని అనుసరించడం’ అనే అర్థాన్నివ్వగలదు. * దీనినిబట్టి, దేవునితో నడిచే వ్యక్తి దేవుడు నిర్దేశించిన జీవన విధానాన్ని, ఆయనకు సంతోషం కలిగించే జీవన విధానాన్ని అనుసరిస్తాడని మనం అర్థం చేసుకుంటాం. అలాంటి విధానాన్ని అనుసరించడం, మన చుట్టూవున్న చాలామంది నుండి మనల్ని భిన్నమైనవారిగా చేస్తుంది. అయినప్పటికీ, క్రైస్తవునికి అదే ఏకైక ఉత్తమ విధానం. ఎందుకు? దానికి అనేక కారణాలున్నాయి.

6 మొదటిది, యెహోవా మన సృష్టికర్త, జీవదాత మాత్రమే కాక, మన జీవాన్ని పోషించడానికి అవసరమైనవన్నీ ఆయనే దయచేస్తున్నాడు. (ప్రక. 4:​10, 11) కాబట్టి, మనమెలా నడవాలో చెప్పే హక్కు ఆయనకు మాత్రమే ఉంది. అంతేకాక, దేవునితో నడవడం అత్యంత ప్రయోజనకరమైన విధానం కూడా. యెహోవా తనతో నడిచేవారి నిమిత్తం పాపాన్ని క్షమించే ఏర్పాటు చేసి, నిత్యం జీవించే నిశ్చయమైన నిరీక్షణను అందిస్తున్నాడు. మన ప్రేమగల పరలోకపు తండ్రి తనతో నడిచేవారు అపరిపూర్ణులుగా ఉన్నప్పటికీ, సాతాను అధికారం క్రిందవున్న ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ, ఇప్పుడు కూడా తమ జీవితాన్ని విజయవంతం చేసుకునేలా సహాయపడేందుకు వారికి జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని కూడా అందిస్తున్నాడు. (యోహాను 3:16; 2 తిమోతి 3:15, 16; 1 యోహాను 1:⁠8; 2:​25; 5:19) దేవునితో నడిచేందుకు మరో కారణం, మనం ఇష్టపూర్వకంగా అలా నడవడం సంఘ సమాధానానికీ, ఐక్యతకూ దోహదపడుతుంది.​—⁠కొలొస్సయులు 3:15, 16.

7 చివరిదీ, మరింత ప్రాముఖ్యమైనదీ మనం దేవునితో నడిచినప్పుడు, ఏదెను తోటలో ఉత్పన్నమైన గొప్ప వివాదాంశం, అంటే విశ్వ సర్వాధిపత్యపు వివాదాంశం విషయంలో మన స్థానమేమిటో చూపిస్తాం. (ఆదికాండము 3:​1-6) మన జీవన విధానం ద్వారా మనం సంపూర్ణంగా దేవునివైపు ఉన్నామని ప్రదర్శిస్తూ, ఆయన మాత్రమే హక్కుగల సర్వాధిపతి అని ధైర్యంగా ప్రకటిస్తాం. (కీర్తన 83:18) ఆ విధంగా మనం దేవుని నామం పరిశుద్ధపరచబడాలని, ఆయన చిత్తం నెరవేరాలని చేసే ప్రార్థనకు అనుగుణంగా ప్రవర్తించినవారిగా ఉంటాం. (మత్తయి 6:​9, 10) దేవునితో నడవాలని నిర్ణయించుకున్నవారు ఎంత జ్ఞానులో కదా! యెహోవా మాత్రమే “అద్వితీయ జ్ఞానవంతుడు” కాబట్టి, వారు తాము సరైన దిశలోనే వెళ్తున్నామనే నమ్మకంతో ఉండవచ్చు. ఆయన ఎన్నడూ పొరపాటు చేయడు.​—⁠రోమీయులు 16:​25-27.

8 అయితే, యెహోవాను సేవించడానికి అధికశాతం ప్రజలు ఇష్టపడని, ఈ సంక్షోభిత కాలాల్లో క్రైస్తవులుగా జీవించడం ఎలా సాధ్యం? అత్యంత కష్టభరిత కాలాల్లో తమ యథార్థతను కాపాడుకున్న ప్రాచీనకాల నమ్మకస్థుల జీవితాలను మనం పరిశీలిస్తే ఆ ప్రశ్నకు జవాబు లభిస్తుంది. వారిలో ఇద్దరు, హనోకు, నోవహు. వారిద్దరూ మనమిప్పుడు జీవిస్తున్నటువంటి కాలాల్లోనే జీవించారు. అప్పుడు దుష్టత్వం విస్తృతంగా ఉండేది. నోవహు కాలంలో భూమి దౌర్జన్యంతో, లైంగిక దుర్నీతితో నిండిపోయింది. అయినప్పటికీ, హనోకు, నోవహు ఆ లోకపు స్వభావాన్ని ఎదిరించి యెహోవాతో నడిచారు. వారలా ఎలా నడవగలిగారు? ఈ ప్రశ్నకు జవాబిచ్చేందుకు మనమీ ఆర్టికల్‌లో హనోకు ఉదాహరణను పరిశీలిద్దాం. తర్వాతి ఆర్టికల్‌లో నోవహును పరిశీలిద్దాం.

సంక్షోభిత కాలాల్లో హనోకు దేవునితో నడిచాడు

9 లేఖనాల్లో దేవునితో నడిచినవాడు అని వర్ణించబడిన మొదటి వ్యక్తి హనోకు. బైబిలు నివేదిక ఇలా చెబుతోంది: ‘హనోకు మెతూషెలను కనిన తరువాత దేవునితో నడుచుచు’ ఉండెను. (ఆదికాండము 5:​22) మన జీవితకాలంతో పోల్చిచూస్తే అధికమే అనిపించినా, ఆ కాలంలో తక్కువగా పరిగణించబడిన హనోకు జీవిత కాలనిడివి గురించి ప్రస్తావించిన తర్వాత ఆ నివేదిక ఇంకా ఇలా చెబుతోంది: “హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.” (ఆదికాండము 5:​22-24) వ్యతిరేకులు హనోకుకు హాని చేయకముందే యెహోవా ఆయనను సజీవుల లోకం నుండి మృతుల లోకానికి కొనిపోయాడనేది స్పష్టం. (హెబ్రీయులు 11:​5, 13) ఆ కొన్ని వచనాలు తప్ప, బైబిల్లో హనోకు గురించి చెప్పే వచనాలు ఎక్కువేమీ లేవు. అయినప్పటికీ, ఆయన గురించి మనకు తెలిసిన దానితోపాటు ఇతర వివరాలనుబట్టి హనోకు కాలం కల్లోలభరితంగా ఉండేదని మనం చెప్పవచ్చు.

10 ఉదాహరణకు, ఆదాము పాపం చేసిన తర్వాత మానవజాతిలో అవినీతి ఎంత వేగంగా విస్తరించిందో పరిశీలించండి. ఆదాము మొదటి కుమారుడైన కయీను తన తమ్ముడైన హేబెలును హత్య చేసి మొదటి మానవ హంతకుడయ్యాడు. (ఆదికాండము 4:​8-10) హేబెలు దారుణంగా మరణించిన తర్వాత, ఆదాముహవ్వలకు మరో కుమారుడు జన్మించాడు, ఆయనకు వారు షేతు అని పేరు పెట్టారు. ఆయన గురించి మనమిలా చదువుతాం: “షేతునకు కూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.” (ఆదికాండము 4:​25, 26) విచారకరంగా, మతభ్రష్టత్వంతోనే అలా “యెహోవా నామమున ప్రార్థన చేయుట” జరిగింది. * ఎనోషు పుట్టిన అనేక సంవత్సరాల తర్వాత, కయీను వంశస్థుడైన లెమెకు తన ఇద్దరు భార్యల కోసం ఒక పాటను కూర్చి, అందులో అతడు తనను గాయపరచిన ఒక పడుచువాణ్ణి చంపానని చెబుతూ, ఇంకా ఇలా హెచ్చరించాడు: “ఏడంతలు ప్రతి దండన కయీను కోసము వచ్చిన యెడల, లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చును.”​—⁠ఆదికాండము 4:10, 19, 23, 24.

11 పైన ప్రస్తావించిన అలాంటి చిన్నచిన్న వాస్తవాలు, ఏదెనులో సాతాను ప్రవేశపెట్టిన అవినీతి కారణంగా ఆదాము సంతతిలో దుష్టత్వం వేగంగా విస్తరించుకుపోయిందని సూచిస్తున్నాయి. అలాంటి లోకంలో, యెహోవా ప్రవక్తగా హనోకు పలికిన శక్తిమంతమైన ప్రేరేపిత మాటలు నేటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. హనోకు ప్రవచించిన మాటలను యూదా ఇలా నివేదిస్తున్నాడు: “ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.” (యూదా 14) ఆ మాటలు చివరకు అర్మగిద్దోనులో నెరవేరతాయి. (ప్రకటన 16:​14-16) అయినప్పటికీ, హనోకు ప్రవచనాన్ని వినడానికి విసుక్కున్న అనేకమంది “భక్తిహీనులైన పాపులు” హనోకు కాలంలో కూడా ఉన్నారని మనం బలంగా నమ్మవచ్చు. యెహోవా ఆ ప్రవక్తకు హాని జరగకుండా ఆయనను వారి మధ్యనుండి కొనిపోవడం ఎంత ప్రేమపూర్వక చర్యో కదా!

దేవునితో నడవడానికి హనోకును బలపరచిందేమిటి?

12 ఏదెను తోటలో ఆదాము, హవ్వలు సాతాను మాటలు వినగా, ఆదాము యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. (ఆదికాండము 3:1-6) వారి కుమారుడైన హేబెలు వారికి భిన్నమైన మార్గాన్ని అవలంబించడంతో యెహోవా ఆయనపై అనుగ్రహం చూపించాడు. (ఆదికాండము 4:3, 4) అయితే విచారకరంగా ఆదాము సంతతిలో అధికశాతం హేబెలులా ప్రవర్తించలేదు. కానీ అనేక వందల సంవత్సరాల తర్వాత జన్మించిన హనోకు మాత్రం హేబెలులాగే ప్రవర్తించాడు. హనోకుకు, ఆదాము సంతతిలోని అనేకులకు మధ్య భేదమేమిటి? ఆ ప్రశ్నకు జవాబిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.” (హెబ్రీయులు 11:5) విశ్వాసం విషయంలో మనకు అద్భుతమైన మాదిరిగా నిలిచిన గొప్ప ‘సాక్షి సమూహంలో’ హనోకు కూడా ఉన్నాడు. (హెబ్రీయులు 12:1) తన 300 సంవత్సరాల జీవితకాలమంతటిలో అంటే నేడు మనలో అనేకుల జీవితకాలంకంటే మూడురెట్లు ఎక్కువ కాలం సరైన ప్రవర్తనలో కొనసాగడానికి విశ్వాసమే హనోకుకు సహాయం చేసింది!

13 హనోకు విశ్వాసాన్ని, ఇతర సాక్షుల విశ్వాసాన్ని వర్ణిస్తూ పౌలు ఇలా వ్రాశాడు: “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.” (హెబ్రీయులు 11:⁠1) అవును, మనం నిరీక్షించినవి నిజమవుతాయనే హామీలపై ఆధారపడిన దృఢ నమ్మకమే విశ్వాసం. దానిలో మన జీవన దృక్కోణాన్ని బలంగా ప్రభావితం చేసే నిరీక్షణ ఇమిడివుంది. తనచుట్టూ ఉన్న లోకం దేవునితో నడవకపోయినా, తాను మాత్రం దేవునితో నడవడానికి హనోకుకు అలాంటి విశ్వాసమే సహాయం చేసింది.

14 నిజమైన విశ్వాసం ఖచ్చితమైన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. హనోకుకు ఎలాంటి జ్ఞానం ఉంది? (రోమీయులు 10:14, 17; 1 తిమోతి 2:⁠4) నిస్సందేహంగా ఆయనకు ఏదెనులో జరిగిన సంఘటనల గురించి తెలుసు. ఏదెనులోకి మానవుల ప్రవేశం నిషేధించబడినప్పటికీ బహుశా అప్పటికింకా ఉనికిలో ఉన్న ఏదెను తోటలో జీవితమెలా ఉండివుంటుందో కూడా ఆయన వినే ఉంటాడు. (ఆదికాండము 3:​23, 24) ఆదాము సంతానంతో భూమిని నింపి, ఈ గ్రహాన్నంతా తొలి పరదైసులా చేయాలనే దేవుని సంకల్పం ఆయనకు తెలుసు. (ఆదికాండము 1:28) అంతేకాక, సాతాను తలను చితకత్రొక్కి సాతాను మోసంవల్ల కలిగిన చెడు ప్రభావాలన్నింటినీ తొలగించే సంతానాన్ని కలుగజేసే యెహోవా వాగ్దానం కూడా ఆయనకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. (ఆదికాండము 3:15) అవును, యూదా పుస్తకంలో భద్రపరచబడిన హనోకు ప్రేరేపిత ప్రవచనం సాతాను సంతానపు నాశనాన్ని ముందే తెలియజేసింది. హనోకుకు విశ్వాసం ఉంది కాబట్టి, “తన్ను వెదకువారికి ఫలము దయచేయు” యెహోవాను ఆయన ఆరాధించాడని మనకు తెలుసు. (హెబ్రీయులు 11:6) కాబట్టి, హనోకుకు మనకున్నంత జ్ఞానం లేకపోయినా, దృఢమైన విశ్వాసానికి పునాదిగా ఉండడానికి సరిపడా జ్ఞానం ఉంది. అలాంటి విశ్వాసంతో ఆయన ఆ సంక్షోభిత కాలాల్లో తన యథార్థతను కాపాడుకున్నాడు.

హనోకు విశ్వాసాన్ని అనుకరించండి

15 హనోకులాగే మనం కూడా నేటి సంక్షోభిత కాలాల్లో యెహోవాను సంతోషపెట్టాలని కోరుకుంటాం కాబట్టి, మనం హనోకు ఆదర్శాన్ని అనుసరించాలి. యెహోవా గురించిన ఆయన సంకల్పం గురించిన ఖచ్చితమైన జ్ఞానము సంపాదించుకుని, దానిని కాపాడుకోవాలి. అది మాత్రమే సరిపోదు. ఆ ఖచ్చితమైన జ్ఞానం మన జీవిత విధానాన్ని నిర్దేశించడానికి మనం అనుమతించాలి. (కీర్తన 119:101; 2 పేతురు 1:​19) మన సమస్త తలంపుల్లో, క్రియల్లో దేవుణ్ణి సంతోషపెట్టడానికి కృషి చేస్తూ ఆయన ఆలోచనా విధానం ద్వారా మనం నిర్దేశించబడాలి.

16 హనోకు కాలంలో యెహోవాను ఇంకా ఎవరు సేవించారో మనకు తెలియదు, అయితే స్పష్టంగా ఆయన ఒక్కడే ఉండవచ్చు లేదా ఒక చిన్న గుంపులో భాగమై ఉండవచ్చు. మనం కూడా ఈ లోకంలో అల్పసంఖ్యలో ఉన్నాం, అయితే అది మనల్ని నిరుత్సాహపరచనవసరం లేదు. మనల్ని ఎవరు వ్యతిరేకించినా యెహోవా మాత్రం మనకు అండగా ఉంటాడు. (రోమీయులు 8:​31) జరగబోయే భక్తిహీనుల నాశనం గురించి హనోకు ధైర్యంగా హెచ్చరించాడు. మనం కూడా అపహాస్యం, వ్యతిరేకత, హింస ఉన్నప్పటికీ “ఈ రాజ్య సువార్తను” ధైర్యంగా ప్రకటిస్తున్నాం. (మత్తయి 24:​14) హనోకు తన సమకాలీనుల్లో చాలామంది బ్రతికినట్లు ఎక్కువ కాలం బ్రతకలేదు. అయినప్పటికీ, ఆయన ఆ లోకంపై తన నిరీక్షణను ఉంచలేదు. మరింత మహిమాన్వితమైన దానిమీదే ఆయన దృష్టి నిలిపాడు. (హెబ్రీయులు 11:10, 35) మనం కూడా యెహోవా సంకల్ప నెరవేర్పుమీదే మన దృష్టి నిలుపుతున్నాం. కాబట్టి, మనమీ లోకాన్ని అమితంగా అనుభవించం. (1 కొరింథీయులు 7:31) బదులుగా, మనం మన శక్తినీ, వనరుల్నీ ప్రాథమికంగా యెహోవా సేవలోనే ఉపయోగిస్తాం.

17 యెహోవా దేవుడు వాగ్దానం చేసిన సంతానం నిర్ణయకాలంలో వస్తాడని హనోకు విశ్వసించాడు. ఆ సంతానమైన యేసుక్రీస్తు వచ్చి విమోచన క్రయధనం చెల్లించి మనమూ, మనతోపాటు హనోకులాంటి ప్రాచీనకాల నమ్మకమైన సాక్షులు కూడా నిత్యజీవం పొందే మార్గాన్ని తెరిచి ఇప్పటికి దాదాపు 2,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సంతానం ఇప్పుడు దేవుని రాజ్యానికి రాజుగా సింహాసనాసీనుడై సాతానును పరలోకం నుండి ఈ భూమ్మీదికి పడద్రోశాడు, ఫలితంగా మనచుట్టూ శ్రమలు విస్తరించడాన్ని మనం చూస్తున్నాం. (ప్రకటన 12:​12) అవును, హనోకుకు అందుబాటులో ఉన్న జ్ఞానంకన్నా మరెంతో జ్ఞానం మనకు అందుబాటులో ఉంది. కాబట్టి, ఆయనలాగే మనమూ స్థిరమైన విశ్వాసంతో ఉందాం. దేవుని వాగ్దానాలపై మనకున్న నమ్మకం మన క్రియలన్నింటినీ ప్రభావితం చేయునుగాక. మనం సంక్షోభిత కాలాల్లో జీవిస్తున్నప్పటికీ, మనం కూడా హనోకులాగే దేవునితో నడుద్దాం.

[అధస్సూచీలు]

^ పేరా 9 యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 1, 220వ పేజీ, 6వ పేరా చూడండి.

^ పేరా 15 ఎనోషు కాలానికి ముందు యెహోవా ఆదాముతో మాట్లాడాడు. హేబెలు యెహోవాకు అంగీకృత అర్పణను ఇచ్చాడు. కయీను ఈర్ష్యాగ్నితో హత్య చేయకముందు దేవుడు అతనితో మాట్లాడాడు. కాబట్టి “యెహోవా నామమున ప్రార్థన చేయుట” స్వచ్ఛారాధనలో కాకుండా క్రొత్తగా భిన్నమైన రీతిలో ఆరంభమై ఉంటుంది.

మీరెలా జవాబిస్తారు?

దేవునితో నడవడం అంటే ఏమిటి?

దేవునితో నడవడమే ఎందుకు అత్యుత్తమ విధానం?

సంక్షోభిత కాలాల్లో కూడా దేవునితో నడవడానికి హనోకుకు ఏది సహాయం చేసింది?

మనం హనోకును ఎలా అనుకరించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. మన కాలాలను విపత్కరం చేస్తున్న అంశాల్లో కొన్ని ఏమిటి?

2. యెహోవా ప్రజలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు?

3, 4. క్రైస్తవులు ఏ విధంగా లోకానికి భిన్నంగా ఉన్నారు?

5. అపరిపూర్ణ మానవులు దేవునితో ఎలా నడవగలరు?

6, 7. దేవునితో నడవడం ఎందుకు అత్యుత్తమ విధానం?

8. హనోకు, నోవహు కాలాలు ఏ విధంగా మన కాలాల్లా ఉన్నాయి?

9. హనోకు గురించిన ఎలాంటి సమాచారం మనకు తెలుసు?

10, 11. (ఎ) ఆదాము, హవ్వ తిరుగుబాటు చేసిన తర్వాత అవినీతి ఎలా విస్తరించింది? (బి) హనోకు ఎలాంటి ప్రవచనార్థక సందేశాన్ని ప్రకటించాడు, ఆయనకు ఎలాంటి ఖచ్చితమైన ప్రతిస్పందన లభించింది?

12. తన సమకాలీనుల నుండి హనోకును భిన్నమైన వ్యక్తిగా నిలబెట్టిందేమిటి?

13. హనోకుకు ఎలాంటి విశ్వాసం ఉండేది?

14. ఎలాంటి ఖచ్చితమైన జ్ఞానం మీద హనోకు విశ్వాసం ఆధారపడి ఉండవచ్చు?

15, 16. మనం హనోకు ఆదర్శాన్ని ఎలా అనుసరించవచ్చు?

17. హనోకుకు లేనటువంటి ఎలాంటి జ్ఞానం మనకుంది, కాబట్టి మనమేమి చేయాలి?

[15వ పేజీలోని చిత్రం]

విశ్వాసాన్నిబట్టి ‘హనోకు సత్యదేవునితో నడిచాడు’

[17వ పేజీలోని చిత్రం]

యెహోవా వాగ్దానాలు నిజమవుతాయని మనం స్థిరంగా నమ్ముతాం

[13వ పేజీలోని చిత్రసౌజన్యం]

కుడివైపు చివరన ఉన్న స్త్రీ: FAO photo/B. Imevbore; కూలిపోతున్న భవనం: San Hong R-C Picture Company