కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తప్పుడు ఆలోచనా విధానాన్ని నిరోధించండి!

తప్పుడు ఆలోచనా విధానాన్ని నిరోధించండి!

తప్పుడు ఆలోచనా విధానాన్ని నిరోధించండి!

పితరుడైన యోబు కష్టాలనుభవిస్తున్నప్పుడు ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనే ఆయన స్నేహితులు ముగ్గురు ఆయనను సందర్శించారు. ఆయనపట్ల సానుభూతి కనబరచడానికి ఆయనను ఓదార్చడానికి వారు వచ్చారు. (యోబు 2:​11) వాళ్ళ ముగ్గురిలో ఎంతో పరపతిగలవాడు, పెద్దవాడు ఎలీఫజు. ఆయనే మొదట మాట్లాడాడు, ఎక్కువగా మాట్లాడాడు. ఎలీఫజు తాను మాట్లాడిన మూడుసార్లూ ఎలాంటి ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించాడు?

ఎలీఫజు తనకు ఒకసారి ఎదురైన అసాధారణమైన ఒక అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా అన్నాడు: “ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గురుతు పట్టలేక పోతిని; ఒక రూపము నా కన్నులయెదుట నుండెను, మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని.” (యోబు 4:​15, 16) ఎలీఫజు ఆలోచనా విధానాన్ని ఎలాంటి ఆత్మ ప్రభావితం చేసింది? ఆ తర్వాత మాట్లాడిన మాటల విమర్శనాత్మక ధోరణిబట్టి చూస్తే ఆ ఆత్మ నీతివంతులైన దేవదూతల నుండి వచ్చింది కాదని తెలుస్తోంది. (యోబు 4:​17, 18) అది ఒక దుష్టాత్మ. లేకపోతే, అబద్ధాలు మాట్లాడారని ఎలీఫజును, ఆయన ఇద్దరు సహచరులను యెహోవా ఎందుకు గద్దిస్తాడు? (యోబు 42:⁠7) అవును, ఎలీఫజు దయ్యాల ప్రభావానికి లోనయ్యాడు. ఆయన వ్యాఖ్యానాలు దైవభక్తిలేని ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించాయి.

ఎలీఫజు వ్యాఖ్యానాలనుబట్టి ఆయనలో ఎలాంటి తలంపులు ఉన్నాయని గ్రహించవచ్చు? మనం తప్పుడు ఆలోచనా విధానం విషయంలో అప్రమత్తంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం? దాన్ని నిరోధించడానికి మనం ఏ చర్యలు తీసుకోవచ్చు?

“ఆయన తన సేవకులను నమ్ముటలేదు”

ఎలీఫజు తాను మాట్లాడిన మూడుసార్లూ, తన సేవకులు చేసేదేదీ దేవునికి సంతోషం కలిగించదన్న తలంపునే వెలిబుచ్చాడు. ఆయన యోబుతో ఇలా అన్నాడు: “ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.” (యోబు 4:​18) ఎలీఫజు ఆ తర్వాత దేవుని గురించి ఇలా అన్నాడు: “ఆయన తన దూతలయందు నమ్మిక యుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.” (యోబు 15:​15) ఆయనిలా అడిగాడు: “నీవు నీతిమంతుడవై యుండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా?” (యోబు 22:⁠3) బిల్దదు ఈ దృక్పథంతో ఏకీభవించాడు, అందుకే ఆయనిలా అన్నాడు: “ఆయన [దేవుని] దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు.”​—⁠యోబు 25:⁠5.

మనం అలాంటి ఆలోచనా విధానంతో ప్రభావితం కాకుండా అప్రమత్తంగా ఉండాలి. అది, దేవుడు మన నుండి మరీ ఎక్కువ కోరుతున్నాడని భావించేలా చేయగలదు. అలాంటి దృక్పథం యెహోవాతో మన సంబంధాన్నే దెబ్బ తీయగలదు. అంతేగాక, మనం ఈ విధమైన తర్కానికి లొంగిపోతే, మనకు అవసరమైన క్రమశిక్షణ ఇవ్వబడినప్పుడు మనమెలా ప్రతిస్పందిస్తాం? దిద్దుబాటును వినయంగా స్వీకరించే బదులు, మన హృదయం ‘యెహోవా మీద కోపించి,’ మనం ఆయనంటే అయిష్టాన్ని పెంచుకోవచ్చు. (సామెతలు 19:⁠3) అది ఆధ్యాత్మికంగా ఎంత నాశనకరంగా ఉండగలదో కదా!

“నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా?”

దేవుడు మన నుండి మరీ ఎక్కువగా కోరతాడనే తలంపుకూ ఆయన నరులను నిష్ప్రయోజకులుగా దృష్టిస్తాడనే తలంపుకూ దగ్గరి సంబంధం ఉంది. ఎలీఫజు మూడవసారి మాట్లాడినప్పుడు ఈ ప్రశ్న వేశాడు: “నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా? కారు; బుద్ధిమంతులు తమమట్టుకు తామే ప్రయోజనకారులై యున్నారు.” (యోబు 22:⁠2) నరుడు దేవుని దృష్టిలో నిష్ప్రయోజకుడని ఎలీఫజు సూచిస్తున్నాడు. అదేవిధంగా బిల్దదు ఇలా వాదించాడు: “నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు?” (యోబు 25:⁠4) ఆ తర్కవిధానం ప్రకారం, నర మాత్రుడైన యోబు దేవుని దృష్టికి తాను నీతిమంతుడ్ని కాగలనని అనుకోవడానికి ఎలా ధైర్యం చేయగలడు?

కొంతమంది ప్రజలు నేడు తమ గురించి తాము ప్రతికూల భావాలతో సతమతమవుతుంటారు. కుటుంబ పెంపకం, జీవితపు ఒత్తిళ్ళకు గురికావడం, జాతి లేక తెగ విద్వేషానికి బలికావడం వంటివి అలాంటి భావాలకు కారణం కావచ్చు. అయితే సాతాను అతని దయ్యాలు ఒక వ్యక్తిని నలగగొట్టడంలో ఆనందాన్ని పొందుతారు. సాతాను అతని దయ్యాలు, ఒక వ్యక్తి తాను చేసేదేదీ సర్వశక్తిమంతుడైన దేవుని దృష్టిలో అంత మంచిదేమీ కాదని భావించేలా అతడిని ప్రభావితం చేయగలిగితే, ఆ వ్యక్తి చాలా త్వరగా నిరాశానిస్పృహలకు గురయ్యే అవకాశం ఉంది. కొంతకాలానికి, అలాంటి వ్యక్తి క్రమంగా దేవుణ్ణి విడిచిపెట్టి ఆయనకు దూరమైపోవచ్చు.​—⁠హెబ్రీయులు 2:1; 3:​12.

పైబడుతున్న వయస్సు, ఆరోగ్య సమస్యల కారణంగా మనకు పరిమితులు ఏర్పడవచ్చు. మనం యవ్వనంలో, ఆరోగ్యంగా బలంగా ఉన్నప్పుడు రాజ్య సేవలో చేసినదానితో పోల్చిచూసుకుంటే మనమిప్పుడు చేస్తున్నది చాలా అల్పమైనదిగా అనిపించవచ్చు. మనం చేసేదేదీ దేవుని దృష్టిలో అంత మంచిది కాదని మనం భావించాలని సాతాను, అతని దయ్యాలు కోరుకుంటున్నారని గుర్తించడం ఎంత ప్రాముఖ్యమో కదా! అలాంటి ఆలోచనా విధానాన్ని మనం నిరోధించాలి.

ప్రతికూల ఆలోచనా విధానాన్ని ఎలా నిరోధించాలి?

అపవాదియైన సాతాను తనకు ఎన్ని కష్టాలు తెచ్చినా యోబు ఇలా అన్నాడు: “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.” (యోబు 27:⁠5) యోబు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఏమి జరిగినా సరే తన యథార్థతను కాపాడుకోవడానికి నిశ్చయించుకున్నాడు, ఏదీ ఆ అనిశ్చయతను మార్చడానికి ఆయన అనుమతించలేదు. ప్రతికూల ఆలోచనా విధానాన్ని నిరోధించడానికి ఇదొక కీలకాంశం. మనం దేవుని ప్రేమ గురించి మంచి అవగాహనను ఏర్పరచుకొని, దానిపట్ల హృదయపూర్వక కృతజ్ఞతను పెంపొందించుకోవాలి. మనం ఆయనపట్ల మన ప్రేమను కూడా ప్రగాఢం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేయడం, మనం తెలుసుకున్న వాటిని ధ్యానించడం, సహాయం కోసం దేవుణ్ణి ప్రార్థించడం వంటివాటి ద్వారా దీన్ని సాధించవచ్చు.

ఉదాహరణకు, యోహాను 3:⁠16 ఇలా చెబుతోంది: ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారుని అనుగ్రహించెను.’ యెహోవాకు మానవజాతిపట్ల ప్రగాఢమైన ప్రేమ ఉంది, గడిచిన కాలంలో మానవులతో ఆయన వ్యవహరించిన విధానంలో ఆ ప్రేమ స్పష్టమవుతుంది. గతంలోని ఉదాహరణలను ధ్యానించడం యెహోవాపట్ల మన కృతజ్ఞతను అధికం చేసి ఆయనపట్ల మన ప్రేమను ప్రగాఢం చేసి, తద్వారా తప్పుడు ఆలోచనా విధానాన్ని లేక ప్రతికూల ఆలోచనా విధానాన్ని నిరోధించడానికి మనకు సహాయం చేస్తుంది.

సొదొమ, గొమొఱ్ఱాల నాశనానికి ముందు యెహోవా అబ్రాహాముతో వ్యవహరించిన విధానాన్ని పరిశీలించండి. అబ్రాహాము యెహోవా తీర్పు గురించి ఆయనను ఎనిమిదిసార్లు అడిగాడు. ఏ ఒక్కసారీ యెహోవా చికాకును, విసుగును ప్రదర్శించలేదు. బదులుగా, ఆయనిచ్చిన జవాబులు అబ్రాహాముకు ధైర్యాన్ని, ఓదార్పును ఇచ్చాయి. (ఆదికాండము 18:​22-33) దేవుడు ఆ తర్వాత లోతును ఆయన కుటుంబాన్ని సొదొమ నుండి కాపాడినప్పుడు, లోతు తాను పర్వతములకు పారిపోయే బదులు దగ్గరలో ఉన్న ఊరికి పారిపోతానని అడిగాడు. దానికి యెహోవా ఇలా సమాధానమిచ్చాడు: “ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని.” (ఆదికాండము 19:​18-22) ఈ వృత్తాంతాలు యెహోవాను నిష్కర్షగా ఉండే, నిర్దయుడైన నిరంకుశ పాలకుడిగా చూపిస్తున్నాయా? లేదు. అవి ఆయనను ప్రేమ, దయ, కనికరం, అవగాహన ఉన్న సర్వాధిపతిగా చూపిస్తున్నాయి, నిజంగా ఆయన అలాంటివాడే.

ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన అహరోను, దావీదు, మనష్షేల ఉదాహరణలు దేవుడు తప్పులు పట్టేవాడు కాదనీ, ఆయనను ఎవరూ మెప్పించలేరు అనే తలంపు తప్పనీ నిరూపిస్తున్నాయి. అహరోను మూడు గంభీరమైన తప్పులు చేశాడు. ఆయన బంగారు దూడను చేశాడు, మోషేను విమర్శించడంలో తన సహోదరి మిర్యాముతో కలిశాడు, మెరీబా వద్ద దేవుణ్ణి పరిశుద్ధపరచడంలో ఘనపరచడంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ, యెహోవా ఆయనలోవున్న మంచిని చూసి, మరణం వరకు ప్రధాన యాజకునిగా సేవ చేయడానికి అనుమతించాడు.​—⁠నిర్గమకాండము 32:3, 4; సంఖ్యాకాండము 12:1, 2; 20:​9-13.

దావీదు రాజు తన పరిపాలనలో ఘోరమైన పాపాలు చేశాడు. అందులో జారత్వం చేయడం, ఒక నిర్దోషిని చంపించడం, చట్టవిరుద్ధంగా జనాభా లెక్కలను సేకరించడం ఉన్నాయి. అయితే, యెహోవా దావీదు పశ్చాత్తాపాన్ని గమనించి, ఆయన తన మరణం వరకు రాజుగా పరిపాలించడానికి అనుమతించడం ద్వారా రాజ్య నిబంధనకు యథార్థంగా కట్టుబడి ఉన్నాడు.​—⁠2 సమూయేలు 12:9; 1 దినవృత్తాంతములు 21:​1-7.

యూదా రాజైన మనష్షే బయలుకు బలిపీఠములు కట్టి, తన కుమారులను అగ్నిలోగుండా దాటించి, అభిచార సంబంధ ఆచారాలను ప్రోత్సహించి, ఆలయ ఆవరణలోనే అబద్ధమత బలిపీఠాలను కట్టించాడు. అయితే ఆయన హృదయపూర్వక పశ్చాత్తాపం చూపించిన తర్వాత, యెహోవా ఆయనను క్షమించి చెర నుండి విడిపించి ఆయనకు రాజరికాన్ని తిరిగి అనుగ్రహించాడు. (2 దినవృత్తాంతములు 33:​1-13) ఇవి, ఎవరినీ మెచ్చుకోని దేవుని చర్యలేనా? ఎంతమాత్రం కాదు!

అబద్ధంగా నేరం మోపేవాడే దోషి

యెహోవాలో ఉన్నాయని సాతాను నింద మోపుతున్న చెడు గుణాలన్నీ నిజానికి సాతానులో ఉండడాన్నిబట్టి మనం ఆశ్చర్యపోకూడదు. సాతాను క్రూరుడు, కఠినుడు. ప్రాచీన కాలాల్లో పిల్లలను బలి ఇవ్వడమనే, అబద్ధ ఆరాధనతో సంబంధమున్న ఆచారంలో ఈ విషయాన్ని స్పష్టంగా చూడవచ్చు. మతభ్రష్ట ఇశ్రాయేలీయులు తమ కుమారులను, కుమార్తెలను అగ్నిలో కాల్చారు, అది యెహోవాకు కనీసం తోచను కూడా తోచని క్రియ.​—⁠యిర్మీయా 7:​31.

తప్పులు పట్టేది సాతానే, యెహోవా కాదు. అతడు “రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడు” అని ప్రకటన 12:⁠10 చెబుతోంది. దానికి భిన్నంగా, యెహోవా గురించి కీర్తనకర్త ఇలా పాడాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? . . . నీయొద్ద క్షమాపణ దొరుకును.”​—⁠కీర్తన 130:3, 4.

తప్పుడు ఆలోచనా విధానం ఇక ఉండని కాలం

అపవాదియైన సాతాను, అతని దయ్యాలు పరలోకం నుండి పడద్రోయబడినప్పుడు దేవదూతలుగా ఉన్న ఆత్మ ప్రాణులు ఎంతగా సంతోషించి ఉంటారో కదా! (ప్రకటన 12:​7-9) అప్పటినుండి ఇక ఈ దుష్టాత్మలు పరలోకంలో ఉన్న యెహోవా దేవదూతల కుటుంబపు చర్యలపై ఏ ప్రభావాన్నీ చూపించలేకపోయాయి.​—⁠దానియేలు 10:​13.

భూనివాసులు సమీప భవిష్యత్తులో ఎంతో సంతోషిస్తారు. త్వరలోనే, అగాధపు తాళపుచెవి, పెద్ద సంకెళ్ళు పట్టుకొని పరలోకం నుండి దిగివస్తున్న ఒక దేవదూత సాతానును, అతని దయ్యాలను నిష్క్రియా స్థితిగల అగాధములో పడద్రోస్తాడు. (ప్రకటన 20:​1-3) అది జరిగినప్పుడు మనం ఎంత ఉపశమనం పొందుతామో కదా!

ఈలోగా మనం తప్పుడు ఆలోచనా విధానం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా తప్పుడు తలంపులు లేక ప్రతికూల తలంపులు మన మనస్సులోకి వస్తున్నాయనిపిస్తే, మనం యెహోవా ప్రేమపై మన మనస్సును నిలపడం ద్వారా వాటిని నిరోధించాలి. అప్పుడు ‘సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు మన తలంపులకు కావలి ఉంటుంది.’​—⁠ఫిలిప్పీయులు 4:6, 7.

[26వ పేజీలోని చిత్రం]

యోబు ప్రతికూల అలోచనా విధానాన్ని నిరోధించాడు

[28వ పేజీలోని చిత్రం]

యెహోవా అవగాహనగల సర్వాధిపతి అని యోబు తెలుసుకున్నాడు