కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

హింసాత్మక కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడడం, ఒక వ్యక్తికి యెహోవాతో ఉన్న సంబంధాన్ని ప్రభావితం చేయగలదా?

“యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు” అని ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు వ్రాశాడు. (కీర్తన 11:⁠5) ‘అసహ్యుడు’ అని అనువదించబడిన మూల భాషా పదానికి “శత్రువైన వ్యక్తి” అనే అర్థం కూడా ఉంది. కాబట్టి, ఎవరైనా బలాత్కారాన్ని లేదా హింసను ప్రేమిస్తున్నట్లయితే ఆ వ్యక్తి తనను తాను దేవునికి శత్రువుగా చేసుకుంటున్నట్లే. కాబట్టి మనం పరిశీలించాల్సిన ప్రశ్నేమిటంటే, కొన్ని రకాల కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడడం మనం హింసను ఎక్కువగా ఇష్టపడేలా చేయగలదా?

హింసాత్మక కంప్యూటర్‌ గేమ్స్‌ ఆయుధాల ఉపయోగాన్ని గొప్పగా చూపిస్తాయి. తరచూ అవి ఆ గేమ్స్‌ ఆడే వ్యక్తికి యుద్ధకళను నేర్పుతాయి. ది ఎకానమిస్ట్‌ అనే పత్రిక ఇలా పేర్కొన్నది: “అమెరికా సైన్యం కంప్యూటర్‌ గేమ్స్‌ను శిక్షణా పరికరాలుగా ఉపయోగించుకోవడం మీద ఎక్కువగా ఆధారపడుతోంది. సైన్యం ఉపయోగిస్తున్న కొన్ని గేమ్స్‌ నేడు సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉన్నాయి.”

నిజమే, హింసాత్మక కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడేవారు నిజమైన వ్యక్తులకు హాని చేయరు. కానీ వారి ఈ వినోదపు ఎంపిక, వారి హృదయాలకు ఏమవుతోందనే దాని గురించి ఏమి సూచిస్తోంది? (మత్తయి 5:21, 22; లూకా 6:​45) ఊహాజనిత ప్రజలను కత్తితో పొడవడం, వారిపై కాల్పులు జరపడం, నరికివేయడం, చంపడం వంటివి చేస్తూ ఆనందించే ఒక వ్యక్తిని మీరు ఎలా దృష్టిస్తారు? ఆ వ్యక్తి అలాంటి హింసాత్మక ఊహల్లోనే ప్రతీ వారం గంటల తరబడి మునిగిపోయి అలాంటి గేమ్స్‌కే దాదాపు బానిసైపోతే అప్పుడెలా? అలాంటి వ్యక్తి గురించి మరీ చెడ్డగా అనుకోకపోయినా, అశ్లీల చిత్రాలను చూసే వ్యక్తి అనైతిక కోరికలను పెంచుకున్నట్లే అతడు హింసపట్ల ఇష్టాన్ని పెంచుకుంటున్నాడని అనుకుంటాం.​—⁠మత్తయి 5:​27-29.

హింసను ఇష్టపడే వ్యక్తిని యెహోవా ఎంత తీవ్రంగా అసహ్యించుకుంటాడు? అలాంటి వ్యక్తులు యెహోవాకు “అసహ్యులు” అని దావీదు చెప్పాడు. నోవహు కాలంలో, బలాత్కారాన్ని లేదా హింసను ఇష్టపడేవారిపట్ల యెహోవా తన అసహ్యపు తీవ్రతను ప్రదర్శించాడు. యెహోవా నోవహుకు ఇలా చెప్పాడు: “సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును.” (ఆదికాండము 6:​13) వారి బలాత్కారపు లేదా హింసాత్మక మార్గాల కారణంగా సత్య దేవుడు మొత్తం మానవజాతినే నాశనం చేశాడు. ఆయన నోవహును ఆయన కుటుంబాన్ని అంటే బలాత్కారాన్ని లేదా హింసను ప్రేమించని ఎనిమిదిమందిని మాత్రమే కాపాడాడు.​—⁠2 పేతురు 2:⁠5.

యెహోవా స్నేహితులుగా ఉండాలని కోరుకునే ప్రజలు “తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు.” హింసపట్ల ఇష్టాన్ని పెంచుకోవడానికి బదులు వారు ‘యుద్ధం చేయడం నేర్చుకోవడాన్ని ఇక మానివేస్తారు.’ (యెషయా 2:⁠4) దేవుని శత్రువులుగా మారే బదులు దేవుని స్నేహితులుగా ఉండడానికి, మనం “కీడునుండి తొలగి మేలుచేయవలెను.” మనం “సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.”​—⁠1 పేతురు 3:​11.

మనం ఇప్పటికే హింసాత్మక వీడియో గేమ్స్‌ ఆడడంలో మునిగిపోయి ఉంటే, అప్పుడెలా? అలాగైతే మనం ఆయన ద్వేషించేదాన్ని చేయకుండా ఉండడం ద్వారా యెహోవాకు సంతోషం కలిగించాలని దృఢంగా నిశ్చయించుకోవాలి. ఆధ్యాత్మికంగా హాని కలిగించే ఈ అలవాటును మానుకోవడానికి మనం దేవుని పరిశుద్ధాత్మ సహాయం కోసం తప్పక ప్రార్థించాలి. సమాధానం, మంచితనం, ఆశానిగ్రహం వంటి లక్షణాలు మన జీవితాల్లో దైవిక ప్రభావాన్ని చూపించడానికి మనం అనుమతిస్తే, ఆ అలవాటును మనం మానుకోవచ్చు.​—⁠లూకా 11:13; గలతీయులు 5:​22, 23.